అలనాటి అపురూపాలు – 220

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

స్వరకర్త సలీల్ చౌదరి, ఆయన కుటుంబం:

ప్రముఖ స్వరకర్త సలీల్ చౌదరి గురించి, ఆయన భార్య జ్యోతి చౌదరి గురించి వారి మనవరాలు ఔరినా ఛటర్జీ, ఒక వెబ్‍సైట్‍లో చక్కని వ్యాసం రాశారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే చదువుదాం.

~

నాకు పన్నెండేళ్ళ వయసులో మా తాతయ్య సలీల్ చౌదరి చనిపోయారు. అప్పటికి ఆయన గురించి నాకేం పెద్దగా తెలియదు.

మేము ఆయన్ని ‘బాపి దాదూ’ అని పిలిచేవాళ్ళం. బొంబాయి లోని బాంద్రాలో 16 హిల్‍క్రెస్ట్, పెర్రీ క్రాస్ రోడ్‍లో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి అంటే ఆయన భార్య ఇంటికి ఎప్పుడో గాని వచ్చేవారు కాదు. ఆ ఇల్లెప్పుడూ కుటుంబంలోని ఇతర సభ్యుల రాకపోకలతో సందడిగా ఉండేది. తాతయ్య ఆ ఇంట్లో ఎందుకు ఉండడం లేదో నాకర్థం కాలేదు. భౌతికంగా లేకపోయినా, గోడకి వేలాడదీసిన ఫోటోలు, అతికించిన పోస్టర్లు, గూళ్ళలోని అవార్డుల రూపంలో తాతయ్య ఇంట్లో ఉన్నటే ఉండేది. మా అమ్మమ్మకి నేస్తం లాంటి రేడియో ట్రాన్సిస్టర్‍లో ఆయన పాటలు వినబడుతూనే ఉండేవి.

తాతయ్య దూర్‍దర్శన్‍లో – బెంగాలీ యాస కలిగిన హిందీలో కిషోర్ కుమార్ గారి గురించి ఆశాభోస్లే గారితో మాట్లాడడం నాకు గుర్తుంది. ఆయన గాయకబృందాన్ని నిర్వహించే వీడియోలను చూశాను. ఆయన కళ్ళల్లో ఓ మెరుపు ఉండేది. ఆయనది బట్టతలే అయినా, జుట్టు మెడ వెనుక బాగంలో రింగులు తిరిగేంతలా పెరిగి, ‘హెయిర్ కటింగ్’ చేయించుకుంటే బాగుండుననిపించేలా ఉండేవారు.

ఓ రోజు నేను తాతయ్య ఫోటోలతో అలకరించబడి ఉన్న హాల్లో కూర్చుని ఉండగా, నాకన్నా వయసులో పెద్దదైన ఓ కజిన్, కుట్రపూరిత స్వరంలో, ఏదో రహస్యం చెబుతున్నట్టుగా – చెప్పింది, తాతయ్యకి ఇంకో భార్య ఉందని, ఆమెకి పిల్లలున్నారనీ, అందుకే తాతయ్య కలకత్తాలో ఉంటారనీ, మాకు ఎప్పుడో గాని కనబడరని! ఈ మాటలు నాపై పెద్దగా ప్రభావం చూపలేదు. జిగ్‍సా పజిల్‍లోని పీస్‍లు ఒక్కోటి వాటి స్థానంలోకి వస్తున్నాయి. అయితే చిత్రం పూర్తయ్యేది మాత్రం, నా ఉద్దేశంలో, ఈ పుకారులోని వ్యక్తితోనే. చిన్నప్పటి సంతోషాల వల్లో, తెలియనితనం వల్లో – అమ్మా పెద్దమ్మల బాధ గురించి; 1960లలోనే అమ్మమ్మ ఒంటరి తల్లిగా ఉండాల్సి రావడం గురించి నాకు పెద్దగా తెలియలేదు. నన్ను ఎవరైనా ఎవరికైనా సలీల్ చౌదరి మనవరాలు అని పరిచయం చేస్తే నాకు ఏదోలా ఉండేది, కపట గర్వం ప్రదర్శించేదాన్ని. అరుదుగా వచ్చినా, వచ్చినప్పుడు సంతోషాలను మోసుకొచ్చే తాతయ్య రాక కోసం ఎదురు చూసేదానిని.

పెద్దవుతున్న కొద్దీ తాతయ్య జ్ఞాపకాలు మరింత మసకబారాయి. ఆయన్ని ఎంత తక్కువగా గుర్తు చేసుకుంటున్నా, ఆయన పట్ల ఆసక్తి మరింత పెరుగుతోంది. ఆయన గురించి నాకు తెలిసిన వివరాలు: ఆయన కరడు కట్టిన కమ్యూనిస్టు, సోవియట్ రష్యాకి వీరాభిమాని. ఓసారి చార్లీ చాప్లిన్‍తో కలిసి పియానో వాయించారట. ‘బీటిల్స్’ పై తాతయ్యకి సదభిప్రాయం ఉండేదట. స్వాతంత్రం రాకముందరి సినిమాలకు, తన తొలి రోజుల్లో – వలసవాదానికి, జమీందారీ వ్యవస్థకీ, యుద్ధాలకి వ్యతిరేకంగా తాతయ్య కూర్చిన అపక్వమైన, ఉద్రేకంతో కూడిన రాజకీయ పాటలను ఇప్పుడు వింటుంటే, ఏదోలా ఉంటుంది. ఓ టీనేజర్‍గా అస్పష్ట రాజకీయ భావాలు నన్ను వామపక్ష భావాల వైపు లాగినప్పుడు ఈ పాటలు నా కళ్ళు తెరిపించాయి. చాలా పాటలలో నాకు సాహిత్యం పెద్దగా అర్థం కాలేదు, ఎందుకంటే తాతయ్య మాట్లాడే బెంగాలీ యాస కలిసిన హిందీ ఎలా ఉంటుందో, నా బెంగాలీ అలా ఉంటుంది. కానీ నాకు అర్థమైనంత మేరకు, అవి నా అంతరంగాన్ని తాకాయి.

కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశం ఎలా ఉండాలనే తన ఆదర్శాలను – జటిలమైన, మెలికలు తిరిగే ప్రవాహం లాంటి బాణీలతో – కవితాత్మకంగా వ్యక్తం చేశారు. వాటికి సొంపైన హార్మొనీలు జతకలిసేవి. నాకు తాతయ్య సంగీతమంటే ఇష్టం ఉండేది, కానీ అది బంధుప్రీతి ప్రభావమా అనే సందేహమూ వెంటాడుతుంది.

ఆయనకి ముందరి, తరువాతి – ఎందరో ప్రముఖుల వలె – బాహ్య ప్రపంచానికి ఆయన గొప్పవారు కావచ్చు. కానీ వ్యక్తిగత జీవితంలో ఆదర్శవాది కాదనే భావిస్తాను. ఒకప్పుడు ఫిలాసఫీ పాఠాలు చెప్పి, ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భార్యని – తాను రహస్యంగా, ఆమె తండ్రిని మనస్తాపానికి గురిచేసి రెండో పెళ్ళి చేసుకున్న భార్య కోసం – వదిలేశారు. మా అమ్మమ్మ – తాతయ్య అడుగుజాడలలో సినీరంగంలో ప్రవేశించాలని బెంగాల్ లోని చిన్న ఊరి నుంచి వచ్చే ఎందరికో నిస్వార్థంగా నీడనిచ్చింది, కడుపు నింపింది. భార్యనీ, ముగ్గురు చిన్నారి కూతుళ్ళనీ వదిలేశారాయన. సంగీతాన్ని సూచించేలా వాళ్ళకి అలోక, తులిక, లిపిక అని పేర్లు పెట్టుకున్నారాయన. నాకు విస్తుగొలిపే అంశమేంటంటే – వాళ్ళ నాన్న వాళ్ళని విడిచిపెట్టినా, మా అమ్మకీ, పెద్దమ్మలకీ నాన్న మీద అభిమానమే తప్ప కోపం లేకపోవడం! బహుశా ఆయనకి ఇవన్నీ తెలిసే ఉంటాయి. అయితే తెలియకుండానే తానూ తన మనవళ్ళని కూడా వదిలేశానని ఆయన గ్రహించి ఉండరు. కాని వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఆదరంగా చూశారు, దెయ్యాల కథలు చెప్పేవారు, మాయమైపోయేవారు. ఆయన సిగార్ పైప్ లోని పొగాకు వాసన మాత్రం మిగిలేది.

నాకు ఆయన కేవలం తాతయ్య మాత్రమే. అయితే మా ఇంటికి పూలు తెచ్చే బంగ్లాదేశీ పూలవ్యాపారులు డబ్బులు తీసుకోకపోవడానికి కానీ, అపరిచితులు ఇంటికొచ్చి అమ్మమ్మని చూసిపోవడానికి కానీ, మా టీచర్లు కొద్దిగా నా పట్ల పక్షపాతం చూపించడానికి గానీ కారణం తాతయ్యే. ఆయన చనిపోయిన తర్వాత ఇన్నేళ్ళకి, నేను నాకు పెద్దగా తెలియని తాతయ్యతో ఓ అసాధారణ బంధంలో ఉన్నట్టు గ్రహించాను. నాకు వలసవాద చరిత్రపై ఆసక్తి పెరిగింది, రష్యా గురించి ఎక్కువగా చదువుతున్నాను. సంగీత బృందాలలో పాడుతున్నాను.

తాతయ్యను తలచుకున్నప్పుడల్లా నా మదిలో మెదిలో కొన్ని ప్రశ్నలను ఆయనను అడగాలనుకుంటాను:  బ్రిటీషు వారి నుంచి తప్పించుకోడానికి టాయ్‍లెట్ హోల్స్‌లో ఎలా దాక్కున్నారు? స్టాలిన్ మంచివాడని మీరు నిజంగా నమ్మారా? మరి బ్రెజ్నేవ్ సంగతేంటి? హార్మోనీస్ ఎలా సృజించాలో నాకు నేర్పుతారా? పుతిన్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సిపిఐ (ఎం) పార్టీని చూస్తే మీకేమనిపిస్తుంది? స్వతంత్ర భారతావనిని మీరు ఇలాగే ఊహించుకున్నారా?

మా మధ్య ఉన్న సారూప్యతలను నేను వివరించగలను, కానీ అవి అద్భుతాలని నేను నమ్ముతాను.

తాతయ్య ఇప్పుడు లేనప్పటికీ, ఆయన లోని సున్నితత్వాన్ని నేను అనుభూతి చెందేలా విశ్వం రూపొందించబడిందని నేను భావిస్తున్నాను. ఈ ఫోటొని చూసినప్పుడల్లా యవ్వనంలో ఉన్న మా అమ్మమ్మ తాతయ్యలు, వాళ్ళు ముగ్గురు అందమైన కూతుళ్ళను చూసినప్పుడు నాలో ఏదో బలీయమైన, భరించలేని ప్రేమ భావన కలుగుతుంది.

[పై ఫోటోలో – ఎడమ నుంచి కుడికి – తాతయ్య సలీల్ చౌదరి ఒడిలో మా చిన్న పెద్దమ్మ తులిక, తాతయ్య చెల్లెలు లిల్లీతో మా పెద్ద పెద్దమ్మ అలోక, అమ్మమ్మ జ్యోతి చౌదరి ఒడిలో మా అమ్మ లిపిక – 1959 నాటి ఫోటో.]

ఇప్పటికీ ఒక్కోసారి నేను కళ్ళు మూసుకుంటే, తాతయ్య పెదవుల మీద తారాడే పొగాకు వాసన నాకు సోకుతుంది

***

వేదన, ప్రేమ కలగల్సిన అనుభూతులను అందించారు ఔరినా ఛటర్జీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here