శ్రీవర తృతీయ రాజతరంగిణి-7

2
3

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

శ్రీజైనోల్లాభదీనః స హత్వా శత్రూన్ దిగన్తరే।
ఆగత్య పైతృకే దేశే రాజ్యమ్ రామ ఇవాసదత్॥
(శ్రీవర రాజతరంగిణి, 19)

ఎలాగయితే శ్రీరామచంద్రుడు రాక్షసులను సంహరించి వంశపారంపర్యంగా తనది అయ్యే రాజ్యాన్ని సాధించాడో, అలాగే జైనుల్లాభదీన్ కూడా శత్రువులను సంహరించి పైతృకంగా అందే రాజ్యాన్ని సాధించాడు.

మధ్య యుగంలో భారతదేశ సాహిత్యాన్ని గమనిస్తే స్పష్టంగా కనిపిస్తుందీ విషయం. భారతీయ సాహితీవేత్తలు తమ రచనల్లో సుల్తానులకు ఏదో ఓ రకంగా భారతీయ పురాణ పురుషులతో పోలిక తెచ్చి వారి పాలనకు, సుల్తానుల ఆధిక్యాన్ని అమోదించటానికి ఒక కారణం కల్పించే ప్రయత్నాలు చేశారు. జోనరాజయినా, శ్రీవరుడైనా జైనులాబిదీన్‍ను‌ శివుడితో, విష్ణువుతో, రాముడితో పోల్చి ప్రామాణికతను ఆపాదించాలని ప్రయత్నించటం కనిపిస్తుంది.

నిజానికి జైనులాబిదీన్‍ను రాముడితో పోల్చడం కుదరదు. రాముడు రాక్షసులను సంహరించింది రాజ్యం కోసం కాదు. భరతుడు రాముడు వనవాసం పూర్తి చేసి వచ్చి వరకూ, అన్నగారి పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యం చేశాడు. అన్న తిరిగి రాగానే రాజ్యం అప్పగించాడు. అందుకు భిన్నంగా జైనులాబిదీన్ రాజ్యం కోసం సోదరుడితోనే యుద్ధం చేశాడు. రాజ్యం సాధించాడు. కాబట్టి పోలిక కుదరదు. అయినా సరే, రాముడితో పోల్చి జైనులాబిదీన్ స్థాయిని పెంచి, ఆయనను అందరికీ ఆమోదయోగ్యుడిని చేయాలని శ్రీవరుడు ప్రయత్నించాడు. శ్రీవరుడే కాదు, సుల్తానుల ఆస్థానంలో ఉంటూ వారిని గురించి రచనలు చేసిన ప్రతి భారతీయ సాహిత్యవేత్త ఇలాంటి ప్రయత్నాలు చేశారు.

ఇందుకు భిన్నంగా ఇస్లామీ రచయితలు ప్రవర్తించారు. వారు తమ సుల్తానుల ఔన్నత్యాన్ని తమదైన పంథాలో వర్ణించారు. సుల్తానులు ఎంత గొప్పవారయినా వారు దైవానికి గులాములే  తప్ప ‘దైవం’ కాదు. అయితే, సామాన్య భారతీయులను ఆకర్షించేందుకు, భారతీయ ధర్మం వదిలి ఇస్లాంను స్వీకరించే వారికి ఇస్లాం  మరింత ఆకర్షణీయం చేసేందుకు ఇస్లామీయులు, ముఖ్యంగా ‘సూఫీ’లు భారతీయ పద్ధతులను, పూజా విధానాలను తమ మతంలో చేర్చారు. ఆ రకంగా సూఫీ ఇస్లాం మరింత ఆకర్షణీయం అయింది. మతం మారిన భారతీయులు సైతం సంతోషంగా ఇస్లాంలో ఉండగలిగారు. ఇంకా మతం మారని వారికి ఇస్లాం కొత్త, విభిన్నమైన మతంలా కాక, కొద్ది తేడాలతో తమ ధర్మం లానే ఉందనిపించింది.

‘సూఫీ’లు అవలంచించిన ఈ పద్ధతి వల్ల కశ్మీరులో 17వ శతాబ్దం వరకూ ‘సూఫీ’లదే ఆధిక్యం.  అయితే 18-19వ శతాబ్దంలో సూఫీలు ఇస్లామీయులు కారని, ఇస్లాం వ్యతిరేకులని   జరిగిన ఉద్యమాల వల్ల కశ్మీరులో ‘సూఫీ’ల ఆధిక్యం తగ్గింది. అంతవరకూ ‘సూఫీ’ల ఆధిక్యం కొనసాగింది. అందుకే దేశంలోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా కశ్మీరు సామాజిక వాతావరణం ఎదిగింది. ఇస్లాంలో ఋషి పద్ధతి కశ్మీరుకు ప్రత్యేకం.

హృతావశిష్ఠాం కోశేభ్యః స్వపబంధోపయోగినీమ్।
నానా పదార్థ సామాగ్రీం రాజా కవిరివాచినోత్॥
(శ్రీవర రాజతరంగిణి, 20)

ఎలాగయితే ఒక కవి ఒక కావ్యం రచించేందుకు అర్థవంతమైన పదాలను, తాననుకున్న భావాలను వ్యక్తపరిచే పదాలను ఎంచుకుంటాడో , అలాగ, ఖజానా ఖాళీ అయినా సరే, తాననుకున్న పనులు సాధించేందుకు జైనులాబిదీన్, అందుబాటులో ఉన్న వనరులన్నీ సమీకరించాడు, అనుకున్నది సాధించాడు.

తద్రాజ్య మాలిషాహస్య రాజ్య కాలాదనంతరం।
ఆజ్ఞాయి కైర్న గ్రీష్మాన్తే మరౌ శ్రీఖండలేపనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 21)

సుల్తాన్ ‘ఆలీషాహ’ రాజ్యపాలన ఎండాకాలం వంటింది. ఆయన తరువాత రాజ్యాన్ని స్వీకరించిన జైనులాబిదీన్ పాలన, ఎడారి నుండి ఎండాకాలం వెళ్ళిపోయిన తరువాత చల్లని శ్రీ గంధ లేపనం లాంటిది. ‘అల్లీషాహ’కు రాజ్యపాలన రాదు. దాంతో రాజ్యం అల్లకల్లోలం అయింది. సర్వత్ర అరాచకం నెలకొంది. అతని తరువాత రాజ్యభారం చేపట్టిన జైనులాబిదీన్ చల్లటి గంధ లేపనంలా ప్రజలకు వేడిమి నుంచి ఉపశమనాన్నిచ్చాడు.

ధర్మరాజోపమాత్ తస్మాత్ తాస్తా నరకయాతనాః।
అపరాధానుసారేణ పాపాః కేచిద్ ద్విపోభజన్॥
(శ్రీవర రాజతరంగిణి, 22)

ఎవరెవరి పాపాలను అనుసరించి, నేరాలను అనుసరించి వారికి శిక్షలను విధించాడు జైనులాబిదీన్. ఎలాగయితే నరకంలో పాపాత్ములకు వారి పాపాలను అనుసరించి శిక్షలు లభిస్తాయో, అలాగ జైనులాబిదీన్ సైతం నేరం ప్రకారం శిక్షను విధించాడు. ఇక్కడ జైనులాబిదీన్‍ను ధర్మరాజు (యముడు)తో పోలుస్తున్నాడు శ్రీవరుడు.

యో ద్రవ్యగుణసత్కర్మసమవాయ విశేష భృత్।
అసామాన్యోప్పాధాచ్ఛిత్రం నానార్థ పరిపూర్ణతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, 23)

ఇది చాలా లోతైన అర్థం కల శ్లోకం.

ద్రవ్యం, గుణం, సత్కర్మ, సామాన్య, విశేష, సమావాయ వంటి గుణాలలో అసామాన్యుడు రాజు అయినా ఆశ్చర్యం ఏమిటంటే, ఇంకా అనేక రకాల ఐశ్వర్యాలతో పరిపూర్ణుడు రాజు.

వైశేషిక సిద్ధాంత ప్రతిపాదనల ఆధారంగా శ్రీవరుడు ఒక్కో  పదాన్ని అత్యంత లోతైన అర్థంలో వాడేడు. ‘ద్రవ్యవిశేష ప్రసూతాద్ ద్రవ్య-గుణ-కర్మ-సామాన్య-విశేషసమవాయానామ్ పదార్థనా సవిర్మ్య-వైధర్మ్యరార్శ్యభ్యా తత్వజ్ఞానాన్నిశ్రేయసమ్’ అంటుంది వైశేషికం. ద్రవ్యాలు ధర్మవిశేషణాలతో ఉత్పన్నమవుతాయి. అందుకే దానం పుచ్చుకోవటం అంటే ఆ దానం చేసిన  వాడి పాపకర్మలను స్వీకరించటం అన్న వ్యాఖ్య ఉంది. ‘దానం చేయటం పుణ్యం’ అంటారు. ఎందుకు పుణ్యం అంటే, దానం చేయటం వల్ల వ్యక్తికి అంటుకుని ఉన్న పాపకర్మలు, ఆ దానం ద్వారా దూరమవుతాయి కాబట్టి. కాబట్టి దానం స్వీకరించే ముందు ఆ దానం చేసే  వాడి అర్హతను పరిశీలించాలంటారు. ఇలా ధర్మం వల్ల ఉత్పన్నమయిన పదార్థాల ద్వారా తత్త్వజ్ఞానం జనిస్తుంది. అది మోక్షదాయకం అవుతుంది అంటారు. అయితే, ఈ పద్ధతిని వివరించటం ప్రస్తుత సందర్భానికి మించినది. కాబట్టి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జైనులాబిదీన్ గుణ విశేషణాలు తెలిపేందుకు శ్రీవరుడు లోతైన భారతీయ తత్వ చింతన ప్రతిపాదనలను  ఉపయోగించాడన్నది.

పదార్ధాలను వైశేషికులు రెండు రకాలుగా వర్గీకరించారు, భావం, అభావం అని. భావ పదార్థాలు మళ్లీ రెండు రకాలు, సత్తా సమవాయి, స్యాత్మసత్ అని. ఇలా ఈ శ్లోకంలో శ్రీవరుడు వాడిన ద్రవ్యం, గుణం, సత్కర్మ, సామాన్య, విశేష  సమావాయ వంటి ప్రతి పదానికి ఎంతో లోతైన అర్థం ఉంది. వాటిని వైశేషిక సిద్ధాంతాలతోనూ, భారతీయ తత్వ చింతనలోని పలు అంశాల ఆధారంగా విశ్లేషించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

నేత్రోజ్జ్వలే లసద్ధర్మ్య శబ్దాఢ్యే కమలార్చితే।
యస్య శ్రీవరసన్నిత్యం వదనే సదనేపి చ॥
(శ్రీవర రాజతరంగిణి, 24)

సుందర నేత్రాలు, అందమైన శబ్దాలు, కమలం వంటి శరీరంతో, మెరిసే దుస్తులతో సంపన్న లక్ష్మి ఆయన సదనంలో నిత్యం నివాసం ఉంటుంది.

వంగలమాలవాభీరగౌడకర్నాటదేశగా।
యత్కీర్తీం రాగమాలేవ వభూవామృతవర్షిణీ॥
(శ్రీవర రాజతరంగిణి, 25)

ఆయన కీర్తి సంగీతంలా – బంగాల్, మాల్యా, ఆభీర్, గౌడ, కర్ణాట దేశాలలో వ్యాపించింది.

శ్రీవరుడి ప్రద ప్రయోగం చమత్కార భరితం, అర్థవంతం. ఈ శ్లోకంలో శ్రీవరుడు వాడిన దేశాల పేర్లన్నీ రాగాలతో సంబంధం ఉన్నవే. రాగాలతో సంబంధం ఉన్న రాజ్యాల పేర్లు ప్రస్తావిస్తూ రాగమాలికలా అతని ఖ్యాతి వ్యాపించిందనటం అద్భుతం!

వంగల అంటే ఇప్పటి బెంగాల్. ఒకప్పుడు ‘వంగల’ రాగం అని ఉండేది. అక్బర్ ఆస్థానంలో పుండరీక విఠల్ ఈ రాగాన్ని ఆలపించాడు.  ఇప్పుడీ రాగం కాలగర్భంలో కలసిపోయింది. ఇక ‘మాళవ గౌడ’ అంటే ఇప్పటి ‘భైరవి’ రాగానికి దగ్గర పోలిక ఉండే రాగం.  మాళవ రాగం, అభీర్ రాగం, గౌడ రాగం, కర్నాటక సంగీతం అందరికీ పరిచయమే. ఎలాగయితే భారతీయ సంగీతం దశదిశలా వ్యాపించిందో, విభిన్న రాగమాలికలతో పలు రూపాలు ధరించి అలరిస్తోందో, అలా పలు విభిన్నమైన అంశాల ద్వారా జైనులాబిదీన్ ఖ్యాతి దేశమంతా వ్యాపించిందన్న మాట. అద్భుతమైన రచనా సంవిధానం ఇది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here