ఎంత చేరువో అంత దూరము-16

9
3

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మాలతి హైదరాబాద్ వస్తోందన్న సంగతి తాతగారు జాహ్నవికి చెప్పలేదు. ఆనంద్‍కి తెలిస్తే, జానూకి తెలుస్తుందని అనుకున్నారు. కాలింగ్ బెల్ చప్పుడికి తలుపు తీసిన జానూ ఎదురుగా తల్లిని చూసి ఆశ్చర్యపోతుంది. సంతోషం కలుగుతుంది, మళ్ళీ అంతలోనే భయం వేస్తుంది – నాన్న వస్తే ఏం గొడవలవుతాయోనని. జాహ్నవికి మొదటిసారి తన మీద తనకు జాలి కలుగుతుంది. నాన్న లాప్‍టాప్ తీసి, ఫ్లయిట్ టికెట్స్ బుకింగ్ చూస్తూ, మూడు గంటల్లో ఫ్లయిట్ ఉంది, వెళ్ళిపోదామా అంటే, తనకి అలసటగా ఉంది ఇప్పుడు కాదంటుంది మాలతి. ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి, కారణం అడిగితే, జానూ చెప్తుంది. స్నానం చేసొచ్చి, వంట వండి పిల్లలకి పెడుతుంది. మాలతి రాక వల్ల ఆనంద్ హాస్పిటల్‍లోనే ఉండిపోతాడు. రెండు రోజులు చూసినా జానూ నుంచి ఫోన్ రాకపోతే, ఇద్దరూ వెళ్ళిపోయి ఉంటారని అనుకుని, అన్నమ్మకి పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. లోపలకి చూస్తే మాలతి ఫోటోలు, ఆమె కర్టెన్లపై అల్లిన అల్లికలు కనబడతాయి. ఆమె వెళ్ళలేదని అర్థమవుతుంది. పిలుస్తాడామెను. వచ్చి మంచినీళ్ళు ఇస్తుంది. తీసుకోడు. బాగా అలసటగా ఉండడంతో సోఫాలో వాలతాడు. కొన్ని క్షణాలపాటు నిద్ర తూగిన, తన సమీపంలో రోదిస్తున్న శబ్దం అయితే లేచి చూస్తాడు. సోపా పక్కన మాలతి నేలపై కూర్చుని ఏడుస్తూంటుంది. జానూని ఆనంద్ నుంచి దూరం చేయటం తప్పేనని అంటుంది. కాలం తిరిగిరాదంటాడు ఆనంద్. మాలతి బలవంతం మీద భోంచేస్తాడు. తిని చెయ్యి కడుక్కున్నాకా, మాలతి టవల్ అందిస్తుండగా పై గది నుంచి జానూ కిందకి వచ్చి తన కంట పడిన దృశ్యానికి స్తంభించిపోతుంది. సంతోషంతో మాట పెగలదు. కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకుని పైకి వెళ్ళిపోతుంది. ఆనంద్ హాస్పిటల్‍కి వెళ్ళిపోతాడు. మాలతి వచ్చిన సంగతి ఊర్మిళకి ఎలా చెప్పాలా అని తటపటాయిస్తాడు. ఎట్టకేలకు ధైర్యం చేసి చెప్పేస్తాడు. ఊర్మిల విస్తుపోతుంది. జాహ్నవిని తీసుకెళ్ళడానికి వచ్చిందని చెప్తే, జానూ వచ్ఛేటప్పుడు ఒక్కతే వచ్చింది కదా అనుకుంటుంది ఊర్మిల అయోమయంగా. – ఇక చదవండి.]

అధ్యాయం 16

[dropcap]జీ[/dropcap]వితంలో కొన్ని రాకపోకలకు ఓ ప్రత్యేక స్థితి ఉంటుంది.

సాగనంపిన ఆడపిల్ల పుట్టింటికి తిరిగి వచ్చినా, వెళ్ళిపోయిన భార్య మగనింటికి తిరిగి వచ్చినా.. అదో విశేషమే!

“జాహ్నవిని పంపడం ఆలస్యం అయినందుకు” అన్నాడు, ఆనంద్.

‘హౌ, డేర్!’ అనుకుంది ఊర్మిళ.

“పిల్లలకు నీవు వచ్చేదాకా జాహ్నవి ఉంటే బాగుంటుంది, కదా!” అన్నాడు.

నెల్లాళ్ళ క్రితం ఈ జాహ్నవి ఎవరు? అని అడగలేదు ఊర్మిళ.

ఆనంద్ మెల్లిగా చెప్పాడు. ఆ రోజు షాపింగ్ మాల్ దగ్గర భద్రం గారు శ్రీనివాస్‌చే ఫోన్ చేయించడం గురించి చెప్పాడు. ఏవో కారణాలతో జాహ్నవిని వెంటనే పంపించాలని చెప్పించడం తనకు ఆగ్రహం తెప్పించినా, ఆయన వయసుకు గౌరవం ఇచ్చి జానూకు టికెట్స్ కూడా బుక్ అయ్యాయని సౌమ్యం గానే సమాధానం చెప్పానని చెప్పాడు. ఆ మరుసటి రోజు గడవగానే మాలతి బయల్దేరిందని, చాలా స్ట్రెస్‌లో ఉందని, జాగ్రత్త వహించాలని శ్రీనివాస్‌తో చెప్పించారని చెప్పాడు. ఊర్మిళ అంతా మౌనంగా విన్నది. కర్ణుడి చావుకు కారణాల్లా, ఎలా వస్తేనేమి ఆమె వచ్చింది. ఎప్పుడు వెళుతుంది అన్న దానికి సమాధానం ఎక్కడ? అనుకుని నిట్టూర్చింది. తరతరాల స్త్రీమూర్తుల సహనాన్ని ప్రతిఫలిస్తూన్న ఊర్మిళ..

ఎత్తుగా పెట్టి ఉన్న తలగడల పై వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.

జీవితం అస్థిరత్వంతో డోలలూగుతున్నట్టుగా ఉంది..

చదువు నేర్పిన సంస్కారం

జీవితం నేర్పిన సహనం

సహజ సిద్ధ స్వభావంలో ఉన్న సౌజన్యం..

అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉన్నట్టు, నిదానమే ప్రధానంలా ఆ పరిస్థితులకు తల వంచింది ఊర్మిళ.

***

వేణు ఫోన్..

మెదక్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు కలవాలంటున్నారని..

ఆనంద్ చేతి గడియారం వంక చూసుకున్నాడు.

ఒక నిముషం ఆలోచన సాగింది..

ఆఫ్టర్ 2 P.M. ఓ.కే. చేయమని చెప్పాడు, వేణుతో!

అతను అలా చెప్పడంలో ఓ కారణం ఉంది. ఇంటికి వెళ్ళడంలో తొందరకు అర్థం ఉంది.

తన కోసం వెయిట్ చేస్తూ మాలతికి అన్నం తినడం ఆలస్యం అవుతుందేమో! ఆరోగ్యం సరిగా లేనప్పుడు టైమ్‌కు తిని మందులు వేసుకోవాలి కదా! మతి లేని మనుషులతో ఇదే బాధ!

ఊర్మిళను డ్యూటీ డాక్టర్ వచ్చి, చూసి వెళ్ళాడు. మరి కాసేపటికి ఆమెకు లంచ్ వచ్చింది.

ఆమె తినడం అయ్యాక, ఇంటికి వచ్చాడు.

డైనింగ్ టేబుల్ పై అన్నీ సర్ది ఉన్నాయి. కంచాలు, గ్లాస్‌లో నీళ్ళు.. పొందికగా అమర్చిన డిషెస్..

మాలతి డైనింగ్ టేబుల్ మీదకు ఓ చేయి సాచి, ఆ చేయి మీద తల పెట్టుకొని పడుకుని ఉంది.

ఆమెను పిలవలేదు. కుర్చీ లాక్కొని కూర్చున్నాడు.

శబ్దానికి మాలతి లేచింది.

ఆమె పెదవుల పై అలవోక దరహాసం..

తనకు తెలుసు, ఆయన తన కోసం వస్తారని!

ఆమె వడ్డిస్తూంది.

చాలు, వద్దు, కొంచెంగా పెట్టు.. మినహా మాటలేమి లేవు.

మౌనం కూడా ప్రేమ సందేశాన్ని ఇస్తుంది. ప్రేమకు పెద్ద పెద్ద మాటలే అవసరం లేదు.

అతను రావడమే ప్రేమ ప్రతీక..

ఆనంద్ తిని వెళ్ళాడు.

అతనితో కలిసి తిన్నందుకు కడుపే కాదు, మనసు కూడా నిండినట్టు ఉంది మాలతికి.

మనుషులు దూరం అయ్యారు – కానీ ప్రేమలు దూరం కాలేదు.

***

“మామ్, ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేస్తాను. మనం రెండు గంటల్లో అలసట లేకుండా వెళ్ళిపోవచ్చు,” అంది జాహ్నవి.

“ఆలోచిద్దాంలే, జానూ! నాకిప్పుడు అంత ఓపిక లేదు. ముందు వంట చేయాలి. నాన్న భోజనానికి వస్తారేమో!” అంటూన్న తల్లి వంక నిస్సహాయంగా చూసింది.

మాలతి స్నానం చేసి, చాలా మాములుగా వంటయింట్లోకి వెళ్ళింది. కమ్మగా వండి చిన్న పిల్లలకు పెట్టింది. తరువాత జాహ్నవికి పెట్టింది.

ఆ తర్వాత లంచ్ టైమ్ దాటి పోయిన చాలా సేపటి వరకు చూసి, తాను తిన్నది.

ముందు నుంచి కూడా మాలతి ఆనంద్ కంటే ముందు ఎప్పుడూ భోం చేసేది కాదు. పతి భక్తి.

జాహ్నవికి తల్లి రావడం, తమ్ముళ్ళకు, తనకు వండి పెట్టడం హ్యాపీగా ఉంది.

“ఈ పరిస్థితుల్లో వెళితే బాగుంటుందంటావా! పనివాళ్ళపై పిల్లలని వదిలేసి” అన్న అమ్మ మాటలు జాహ్నవికి నిజమే అనిపించింది. కానీ అదే సమయంలో ఏ మూలో అపరాధ భావం.

దిస్ ఈజ్ నాట్ ఫెయిర్, అంటూంది మనసు. అయితేనేం వెళ్ళి పోతాం కదా, పర్లేదు, అనుకుంది.

అమ్మ సంతోషంగా ఉంది. తాను ఆశించినట్టుగా! అయినా డిసైడ్ చేయవలసింది నాన్న కదా! ఎప్పుడు వెళదాం అంటూ తానెందుకు అమ్మను మూడ్ ఆఫ్ చేయాలి.

రోజులెంత బాగున్నాయి.

తమ్ముళ్ళతో ఆటలు..

అమ్మ యమ్మీగా వంట చేస్తుంది.

మధ్యాహ్నం నాన్న భోజనానికి వస్తారు.

వాళ్ళ మధ్య తాను చిన్న జాహ్నవి అయిపోతుంది.

ప్రపంచం అంతా తన దగ్గరే ఉన్నట్టు ఉంది, అమ్మా నాన్నలతో ఉండడం కన్నా కావలసింది ఏముంది?

జీవితంలో ఊహ గానే మిగిలి పోతాయనుకున్న రోజులు.. జీవం నింపుకొని నర్తిస్తున్నాయి జాహ్నవికి.

***

అనూప్ పుట్టినరోజు.

వాడికి పాయసం చేసింది మాలతి.

“బాగుంది, పెద్దమ్మా!” అని వాడంటే, ఆప్యాయంగా వాడి చెంపలు పుణికింది.

ఆనంద్, జాహ్నవి పిల్లలతో బర్త్ డే కేక్ తీసుకొని హాస్పిటల్‌కే వెళ్ళారు.

అనూప్ కేక్ కటింగ్ అయ్యాక, హాస్పిటల్‌లో ఆ ఫ్లోర్లో స్టాఫ్‌కు కూడా స్వీట్స్, కారా పంచారు.

రూమ్ క్లిన్ చేసే ఆమె, వాష్ రూమ్ కడిగే అతను ఆ టైంకు వెళ్ళి పోయారని వాళ్ళకు రేపు ఇవ్వొచ్చు అని ఏకంగా స్వీట్ బాక్స్‌లే ప్రక్కన పెట్టింది ఊర్మిళ.

ఆనంద్ అక్కడ ఉండగానే ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్రెండ్ కమ్ ఇక్కడి బిజినెస్‌లో పార్ట్‌నర్ నుండి ఫోన్. తాను కొత్తగా ఏజన్సీ తీసుకున్న మెడిసిన్ గురించి కాన్ఫరెన్స్ ఉందని, డిస్ట్రిబ్యూషన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నామని.

తన స్వంత బిజినెస్ పని పై ఢిల్లీ వెళ్ళేది కూడా ఉంది.

ఊర్మిళ డిస్చార్జ్ విషయం డాక్టర్స్‌తో మాట్లాడాలి అనుకున్నాడు.

***

ఆ రోజు అన్నమ్మ ఊర్మిళను చూసేందుకు వచ్చింది.

రామాయణంలో మంథరలా..

ఊర్మిళను చూస్తూనే.. కంట తడి పెట్టుకొని, “నీ కర్మ గిట్ల కాలె” అంది.

పడినందుకు అంటుందేమో అనుకున్న ఊర్మిళ “ఏమి కాదు లేవే తగ్గి పోతుంది” అన్నది.

“ఇలా హాస్పిటల్‌కు చూడడానికి వచ్చి ఏడిచావంటే, బాగున్నవాళ్ళు కూడా ఎలా ఉన్నామో అనుకుని గుండె ఆగి చస్తారు” అంది.

అయినా అన్నపూర్ణమ్మ ఏడుపు ఆపలేదు. చీర చెరుగు మూతికి అడ్డం పెట్టుకొని ఏడుస్తూనే ఉంది.

దాని జుట్టు పెరుగు బుడ్డిలా ఉంటుంది. జుట్టు ముడి ఎప్పుడూ ఊడి పోతుంటుంది. నడుము మొత్తం వంగి, అలాగే నడుస్తూంటుంది. ముఖకవళికలు బాగానే ఉన్నా, దాని గెటప్ అలా, మంథరను తలపించేలా ఉంటుంది.

ఊర్మిళ దానికి చేసిన సహాయాలతో, ఊర్మిళకు పూర్తి స్థాయి వీరాభిమాని అయ్యింది.

ఊర్మిళ దాన్ని ఏడవకే అనడం ఆపేసాక కానీ అది ఏడవడం ఆపలేదు.

“నీ సవితి సూడు గెట్ల సేస్తున్నదో!” అన్నది.

అది అన్న మాట ఏమిటో అర్థం కాలేదు ఊర్మిళకు.

“అప్పట్నుండి ఆ ఏడుపే, ఆపవే అంటే వినవు” తమ మధ్య ఉన్న చనువుతో విసుక్కుంది ఊర్మిళ.

“కొంపలు మునిగి పోతున్నట్టు ఎందుకా ఏడుపు”

“నీ సవితి ఒచ్చింది తెలుసు కదా!”

“ఆ! అన్నీ తెలుసు.”

అది మళ్ళీ ఏడవబోయి ఊర్మిళను దయ తలచి ఆగింది.

“పాపం, పాపం అంటూ ఇంత దనుక తెచ్చుకున్నవు”

ఊర్మిళ ఏమిటి నీ గోల అన్నట్టు చూసింది.

“ఇంట్ల ఏమి జరుగుతున్నయ్యో నీకు ఏమన్న తెల్సా. సవితి బిడ్డను నెత్తికెక్కించుకుంటివి. గా పొల్ల నువ్వు ఆస్పత్రిల ఉన్నది సూసి తల్లిని పిలుచుకునే! ఇల్లంత ఆళ్ళే ఏలుతున్నరు” అంటూ ఊర్మిళ ముఖం లోకి చూసింది. ఊర్మిళ మౌనం చూసి, మళ్ళీ అందుకుంది.

ట్రైన్‌ల పడుకునెందుకు తెచ్చుకున్నదంట, గప్పటి కరిటెనులు ఇంటి నిండా కట్టింది. సీను బాబుని పిల్సి, బిడ్డ ఫోన్ కెల్లి తీయించిందంట. ఇంటి నిండ ఆమెయి, ఆమె బిడ్డయి పుటువాలు పెట్టింది. ఏడ నీ జాడ, అయిపు లేకుండా ఇల్లంత తనదే అన్నట్టు జేస్తన్నది.”

ఊర్మిళ తల వెనక్కి వాల్చి, కళ్ళు మూసుకొని విన్నది.

‘అవన్నీ నీకవసరమా!’ అని అడగ వచ్చు. కానీ, ఆమె పెద్దతనానికి విలువ ఇచ్చి ఊరుకుంది.

మరి కాస్సేపు ఉండి, అన్నమ్మ వెళ్ళి పోయింది.

వెళ్తూ, వెళ్తూ, “ఆనంద్ బాబు సరింగా ఉంటే గివ్వన్నీ గిట్లయ్యేవి కావు” అంది.

ఆ మాటలకు ఊర్మిళ నీరసంగా నవ్వింది.

‘ఆనంద్ గారు సరిగానే ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఆయన లాగే ఉన్నారు.’ అనుకుంది.

ఎత్తుగా పెట్టి ఉన్న తలగడలను ఆనుకుని భారంగా కనురెప్పలు మూసుకుంది

నీ గూడు చెదిరింది

నీ గుండె పగిలింది

నిన్నెవరు కొట్టారు

చిట్టి పావురమా!

కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి ఊర్మిళకు.

కోల్పోయిన ఏడుగురు కుటుంబ సభ్యులు –

వరదల్లో ఆనవాలు తుడుచుకుని పోయిన తమ చిన్న పొదరిల్లు..

నర్స్ ట్రైనింగ్ కోసం ఉన్న నెలవు వదిలినందు వల్ల తన ప్రాణం నిలిచి పోయింది.

ఎవరి కోసం ఈ ప్రాణం అన్న ప్రశ్న అహర్నిశలు వేధించేది.

ఆ వరదలేవో తానక్కడి నుండి రాగానే ఎందుకు రావాలి.

అప్పుడే వస్తే ఓనమ్‌కు వెళ్ళిన తాను కూడా తన వారితో వెళ్ళి పోయేది కదా!

అలా ఈ ప్రపంచంలో గూడు చెదిరి, రెక్కలు తెగిన పక్షిలా మనుగడకై అల్లాడుతూ అడుగు పెట్టింది.

అక్కడి నుండి తన కథ ఎన్నో మలుపులు – మజిలీలు..

దుఃఖపు తడి ఆరకనే

తాను డ్యూటీ చేస్తున్న రోజుల్లో –

ఆనంద్ గారు డబుల్ టైఫాయిడ్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు.

మాలతి గారు దగ్గరే ఉండి ఆయనను చూసుకునే వారు.

వాళ్ళ చిన్న పాప చెబ్బిగా ముద్దొచ్చేది. పిల్లలని అమితంగా ఇష్టపడే తనకు పాపను ముద్దు చేయాలన్న కోరిక బాగా ఉండేది.

మాలతి గారు నఖశిఖ పర్యంతం తనని గమనించే వారు. ఆ చూపుల్లో భావం తన కర్థమయ్యేది కాదు.

తన చొరవ మాలతి గారికి నచ్చదని తెలిసి, మిన్నకుండి పోయింది. పాపను ముద్దు చేసే ఉద్దేశ్యం మానుకుంది.

“అందమైన సిస్టర్స్‌ను చూసాను కానీ, మరీ ఇంత అందమైన వాళ్ళను చూడలేదు”, అన్నారు ఒక రోజు.

“పెళ్ళి చేసుకోకుండా ఇంత అందంగా ఉంటే ప్రమాదం. వెంటనే పెళ్ళి చేసుకో!” అని కూడా చెప్పారు.

అప్పుడు తనకు కాస్త అర్థం అయ్యింది, ఆవిడ ఏమిటో!

ప్రమాదం తనకా, తన వల్ల ఆవిడ లాంటి గృహిణులకా! ఆమె ఏ భావంతో చెప్పినా, ఆ మాటల్లో ఎంత సత్యం ఉందో జీవితం తెలిపింది.

అప్పుడప్పుడే సిస్టర్‌గా వృత్తిధర్మం నిర్వహిస్తూన్న తను, అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుండగానే ఓ సీనియర్ డాక్టర్ దృష్టిలో పడింది. భయంతో జాబ్ వదిలి, అక్కడి నుండి పరుగు.

మరో హాస్పిటల్‌లో ట్రై చేస్తే నో వేకెన్సీ అన్నారు.

ఆర్థిక స్థిరత్వం లేదు. ఆత్మీయ బంధాలను వరద మింగేసింది.

ఓ ఒంటరి ఆడపిల్ల జీవిత ప్రస్థానం ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని సుడిగుండాల్లో చిక్కుకుంటుందో.. బహుశా మాలతి గారి లాంటి సురక్షిత, సుభద్రత కలిగిన గృహిణులకు ఊహామాత్రంగా నైనా తెలియవు. తెలిసే అవకాశం లేదు.

ఆ పరుగులో ఓ మజిలీ, సూపర్ మార్కెట్‌లో చేరడం.

రూమ్ అద్దె చెల్లించాలి. అప్పటికీ రూమ్ అద్దె కిచ్చిన భార్యాభర్తలు మంచివాళ్ళే!

ఉద్యోగం వెతుక్కుంటున్నాని, రాగానే అద్దె చెల్లిస్తానంటే సానుభూతితో సరే నన్నారు.

కానీ వాళ్ళకు అద్దెలపై ఆధారం ఎక్కువ. తను అద్దె ఆపితే వాళ్ళకూ ఇబ్బందే.

వెకెన్సీల నోటిఫికేషన్స్ చూడడానికి పేపర్ తెచ్చుకునేది.

తను అద్దెకున్న ఇంటి కాంపౌండ్‌లో పేపర్ వేయించుకోవడం కంటే, ఆ డబ్బులు దేనికైనా వస్తాయి కదా, అనుకునే వారే ఎక్కువ.

అలా పేపర్ కొని తెచ్చుకుని ఓ షాపింగ్ మాల్‌లో సేల్స్ సెక్షన్ లో జాయిన్ అయ్యింది.

“ఇలాంటివి చిన్న సైజ్ స్వెటర్లు ఉన్నాయా!” అంటూన్న అతన్ని, అటు తిరిగి క్లోత్స్ షెల్ఫ్‌లో సర్దుతూన్న తను వెను తిరిగి చూసింది.

“మీరూ.. సిస్టర్ ఊర్మిళ కదూ!” అంటూ ఆగాడు.

ఆశ్చర్య పోవడం తన వంతయ్యింది.

ఎందుకంటే తనను తన పేరుతో గుర్తుంచుకున్నందుకు. ఆ మాటే అంటే,

“భలే వాళ్ళు. మీరేమైనా మాములు సిస్టర్‌నా! ఓ మదర్ థెరిసా, ఓ నివేదిత ఇంకా ఎవరో.. ఉండే ఉంటారు. వాళ్ళతో పోల్చదగిన వారు.”

తాను ఆపుకోలేక, ఉన్నది డ్యూటీలో అని మరిచి పెద్దగా నవ్వింది.

“అయినా మీకు ఊర్మిళ పేరు కాదు. నమ్రత అని పెడితే బాగుండేదనుకున్నాను. ఆ సహనం, ఆ ఓర్పు..”

“నమ్రత.. ఓ..” అంది. ఈ విషయం అప్పుడే చెప్పలేదు. అవును, ఆమె ప్రక్కన ఉన్నారు కదా, అని నవ్వుకుంది.

“చిన్న పాప బాగుందా?” అంది తాను.

“చాలా బాగుంది” అన్నాడు. ఇంక అతను సంభాషణ పొడిగించలేదు కానీ, మాట్లాడిన రెండు మాటల్లో మనసుకెంతో ఆహ్లాదం పంచాడు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు కానీ, మాటలో కూడా అంత మహత్యం ఉంటుంది అనిపించింది ఊర్మిళకు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here