[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘పాత పరిచయాన్ని వీడొద్దు..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన
అవాంతరాలను అధిగమించుకుంటూ
రాలిపడిన పూలను పట్టించుకోకుండా
పూల చెట్టుకున్న మొగ్గలనే చూసినట్లుగా
దారిలో పాత పరిచయస్థులే కావచ్చు
సరికొత్త ముఖాలతో దర్శనమిస్తుంటారు..!
గాఢాంధకారంలో మెరిసే తారకలు
పొద్దెక్కుతుంటే పలకరించే సూర్య కిరణాలు
పున్నమినాటి చంద్రుని అందమైన కాంతిరేఖలు
చల్లని స్పర్శతో ప్రవహించే నదులు
గాలిని వ్యాపింపజేసే పచ్చని ఆకులు
ఎంతగా బాధపడినా తేజోమయాన్ని వీడవు..!
పుస్తకం పాతదైన కొత్త పాఠాల్ని బోధిస్తుంది
పాత వాక్యమే కొత్త అర్థాన్ని స్పురింపజేస్తుంది
పాత స్నేహమే కావచ్చు విడదీయని అనురాగమది
పాత కలమే కావచ్చు కవిత్వాక్షరానికి మూలమది
గడిచిన కాలమే కావచ్చు జీవనకాంక్షలకు రూపమది
పాతను కాదనుకుంటే గమనమే భారమవుతుంది..!