[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
~
మధ్యాక్కర
తన అనుష్ఠానమై మురియు దశరథ రాముని జూచి
ఇనుడుదయించె తూరుపు మహీయమై, కౌసల్య బిడ్డ!
కనులను తెరువుము ఒక యుగమ్మేదొ వచ్చుచునుండె
తృణముతో బ్రహ్మము దాక దివ్యజీవనసుసమృద్ధి. (51)
మధ్యాక్కర
ఈవెట్లు సూర్యమండలము ఋతమూర్తి దిగివచ్చినావొ?
ఆ విధి సావిత్రి మంత్రమై హృదయమున వెల్గినది
సేవానుభావము ఆది శేషుడై సౌమిత్రి వచ్చె
పావనమయ్యె ఈ ధరణి భవ్యత నీ రాక వలన. (52)
మ.
జీవుడు శుద్ధచేతనము చెందిన తత్త్వము దాని లోపలన్
దైవము సూక్ష్మమై ఒదుగు తాననభిజ్ఞత నిత్యభావనా
స్థావృతి నేను నేననెడు సంగతి సాగును నిత్యవేదనల్
ప్రోవులుగట్టి దుఃఖములు పొందును చీకటిలోన ద్రిమ్మరున్. (53)
తే.గీ.
నేను నేననియెడు భావనియతి వలన
ఈశ్వరుని తోడి బంధము నెరుగరాదు
హృదయమున ప్రవేశించిన నెదిగి నీవు
చిత్తమున భగవంతుని చేర్పగలవు. (54)
మధ్యాక్కర
జగతిని దుఃఖము కలదు జరయును రుజయును గలవు
జగతిని కామలోభములు సాగిన ప్రతికృతుల్ గలవు
జగతిని మృత్యువు కలదు జగతిని మోహము గలదు
జగ మజగము నైన వెంట సర్వము బ్రహ్మ తత్త్వమ్మె. (55)
మధాక్కర
ఈ సృష్టి కొనసాగు నిట్లె దీనిని పరమేశు ముఖము
భాసితముగ జేయ పృథ్వి పరిణామ వృద్ధికి సిద్ధ
మై సమష్ట్యాకాంక్ష చెలగ అనుభవమునకు సిద్ధముగ
ధీసంధితో నభీప్స నిల తెరువును కల్గించవలయు. (56)
మధ్యాక్కర
అవనియు పురుటికి వచ్చె అంబుజాతాప్తుని ఇంట
సవన మీరీతి సాగినది జ్ఞానతేజమ్ము మేల్కొల్ప
బవరమునకు సావిత్రి సిద్ధపడినది మృత్యువుతోడ
ఎవరిదో గెలుపు గుర్తింప నెప్పుడు తెలియదు మనకు. (57)
మధ్యాక్కర
అని భవిష్యమును దర్శనము నందిన బ్రహ్మమౌనికిని
వినతులై రామలక్ష్మణులు విశ్వము నందు ఈ వెతలు
చెనకుచునుండ ఈ శిథిల చిత్తమ్ములెట్టుల నొదుగు
మనికి యిదెట్లుమారును విమానిత లోకము నందు. (58)
తే.గీ.
అనుచు నడుచుచు నుండంగ అనుకొనక హ
ఠాత్తుగా ఒక్క రక్కసి టక్కులాడి
వారి మ్రింగుట కొరకయి వచ్చినంత
రవికులుని దాని వధియింప రాజితాత్ము
డైన ముని ఆజ్ఞనిచ్చెను ఆనతి గొని
క్షణము లో దాని వధియించె క్షాత్రవరుడు. (59)
మధ్యాక్కర
మౌని భృశాశ్వవిద్యలను మన్నించి శిష్యుల కొసగె
వాని గ్రహించిన సూర్యవంశ్యులుద్ధతులంతనైరి
జ్ఞానవిస్తారుడౌ గాధిజన్ముని యజ్ఞమ్ము సాగ
దానిని భంగము సేయ తరలి రా తాటకేయులును. (60)
(సశేషం)