అన్నమ్మ

0
3

[శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘అన్నమ్మ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“మా అమ్మ, నన్ను బొడ్డు కోసి చేటలో పెట్టలేదే.. వంటగదిలో పెట్టింది. తెలుసా? నాకు తెలీని వంట ఉందిటే?” అన్నమ్మ తరచూ అనే మాట ఆ‌ ఉమ్మడి కుటుంబంలో వినని వాళ్ళు లేరు.

నిజానికి ఆవిడ అసలు పేరేమిటో ఆవిడే మర్చిపోయింది. చిన్నతనానే భర్తని కోల్పోయి, పుట్టింట్లో సకల చాకిరీలు చేస్తూ పిల్లలందరికీ అన్నాలు వడ్డించడం, తినిపించే వాళ్ళకి తినిపించడం చేస్తూ ఉండేసరికి, ఆమె ఆఖరు తమ్ముడు నోరు తిరగక ‘అన్నమ్మక్కా’ అని పిలిచేవాడు. ఆ పేరే సార్థకం అయింది. ‘అన్నమ్మొదినా, అన్నమ్మక్కా’ పిలిచి పెద్దవాళ్ళు కూడా ఇది ‘లోక అన్నమ్మే’ అనేసారు.

వంటలు చేస్తూ, ఆవిడ చెప్పే కబుర్లు కొన్ని తరలా జీవితాలు. ఆమె జీవితం ఏం కావాలని భయపడ్డ అన్నలు అత్తారిచ్చిన భరణంతో ఆవిడకో ఇల్లు కొనిపెట్టేరు. తట్టా, బుట్టా గిన్నె ముంతా, ఏర్పాటు చేసేరు. తన మరిది కొడుకుని నామకహా దత్తత తీసుకుంది.

తోటికోడలి సూచన మీద తన తమ్ముడు కూతురు భూలక్ష్మిని తన పెంపుడు కొడుకు శేషగిరికి ఇచ్చి పెళ్ళి చేసింది. నామకహా పెంపకమే కాబట్టి పెళ్ళికి ఇటూ అటూ సకల వంటలూ సకల చాకిరీలు చేసింది.

భూలక్ష్మి కాపరానికి వచ్చింది. మూడు మూర్తులా మేనత్త పోలికే. అన్నమ్మ నుదుట ఇంత కుంకుమ దిద్దితే భూలక్ష్మే అనుకుంటారందరూ.‌ భూలక్ష్మి గరిట పట్టుకుంటే అచ్చు అన్నమ్మే..

“అత్తా చేసినంత కాలం చేసేవు. నాకు నేర్పించవూ.. నీ పేరు చెప్పుకొని నేనూ వంటలు బాగా చేస్తానని పేరు తెచ్చుకుంటాను. అలా పక్కన కూచొని కబుర్లు చెప్పు, చాలు” అత్తని మాటలతో బుట్టలో పడేసింది భూలక్ష్మి.

చేగోడీల పిండి కలిపితే ఇద్దరూ కలిపి నలుపుతారు. అన్నమ్మ కబుర్లు ఆగవు.

“మాది అసలు ఉమ్మడి కుటుంబం. మా తాతలందరూ కలిసి ఉండేవారు. ఏడాదికి సరిపడా చింతపండు కొనేవారు. పక్కనే ఉన్న పల్లెటూర్లనించీ కొందరు వచ్చి చింతపండు ఎండలో పెట్టి పిక్కతీసి, పెద్ద పెద్ద ఉండలు కట్టి జాడీల్లో పెట్టి అటక మీద ఉంచేవారు. చింతపండు పిక్క తీస్తే కత్తులు మొద్దుగా అయిపోతాయి. అందుకని మా నాన్నమ్మ వాళ్ళకి కత్తిపీట ఇచ్చేది కాదు. నాకు జాలి. మా మామ్మ చూడకుండా వాళ్ళకి కత్తిపీటలు ఇచ్చేసాను.”

“మీ నాన్నమ్మ నిన్మేం అనలేదూ?” చిలిపిగా అంది భూలక్ష్మి.

“అనడమా.. విసనకర్రతో బాదింది” అన్నమ్మ కూడా నవ్వింది.

కోడలు పులిహార కలుపుతూ ఉంటే, “ఒసే పులుసు బాగా ఉడకాలే.. లేకపోతే పులిహార మర్నాటికి పాడయిపోతుంది. ఒకసారి ఏమయిందనుకున్నావ్.. మా తాతగారూ అతని చిన్నాన్న కొడుకూ కలిసి వాళ్ళమ్మ నగలు తూకం వేసి పంచుకున్నారట. పల్లెటూరు కదా.. ఎవరి చెడు కళ్ళు పడకూడదని రాత్రి లాంతర వెలుగులో పంచుకుంటూ, పున్నమి కదా అని పెరటి తలుపు ఓరగా తీసేరుట. అంతే ఒక నక్క లోపలకి వచ్చి ఊళ మొదలెట్టిందిట.

మా తాతగారి తమ్ముడు భయపడి పరిగెత్తి లోపలకి వెళిపోయేరు. మాతాతగారు మాత్రం ధైర్యంగా ఓ కర్ర తీసుకొని దాన్ని తరిమి మళ్ళా తమ్ముడిని పిలిచేరుట” అన్నమ్మ ఆపేసరికి కోడలు పులిహార మొత్తం కలిపి పెద్దగిన్నెలో సద్దేసింది.

“అత్తా ఇవాళ కాసిని చక్రాలు, అరిసెలు కూడా చేయాలి. నీ కొడుకు ఆఫీస్‌లో ఎవరికో ఇవ్వాలిట” భూలక్ష్మి గరిటెలు మూకుళ్ళు అన్నీ తోమి తుడిచి ఎండలో పెడుతూ అంది.

అన్నమ్మ అరిసెల పాకం పడుతూ కోడలితో అన్నాది. “ఒసే ఈ అరిసెల మీద ఎన్ని జోకులు ఉన్నాయో, ‘అరిసె ఆరునెలల రోగాలని రప్పిస్తుంది’ అంటారు అంది. “అంతేనా, అత్తా మా అమ్మమ్మ ‘అరిసెలు తిన్నవా బాపనాడా.. అంటే ఆరు దొన్నెలు తాగేను అన్నాడట’ అని నవ్వేది” అంది.

చక్రాలు వేపుతూ అన్నమ్మ చెప్పింది. “ఒసే.. ఈ కాలం మీకు మొగుడు దగ్గర మహా చనువులు ఎక్కువ. మా తాతలనాడు ఆడవాళ్ళు మొగుడంటే చాలా భయంగా ఉండేవారు. ఓసారి ఏమయిందో తెలుసా, ఒక పెద్దావిడ కాసిన్ని గారెలు, బూరెలు తినేసిందిట. సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి ఆవిడకి కడుపులో కలకలమని పెరట్లోకి వెళ్ళాలని, తప్పనిసరయి భర్తని‌ లేపిందిట. ఆయన అసలే ముక్కోపి. కోపంగా ‘విసవిసా’ పెరటి తలుపు తీసేడు. ఈవిడ దూరంగా ఉన్న పాయిఖానాలోకి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళి తలుపు గడియవేసి మేడ మీదకి వెళ్ళి పడుకున్నాడుట”

“అయ్యో .. అదేం పనత్తా?” అంది భూలక్ష్మి.

“విను మరీ, ఆ ఇల్లాలు పాపం బయటకి వచ్చి నూతి దగ్గర నాలుగు బకెట్లు తోడుకొని స్నానం చేసి చూసేసరికి తలుపులు వేసున్నాయి. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎప్పుడూ ముఫై నలభై తులాల బంగారంతో ఉండేవారు. ఈవిడ మెళ్ళో కాసులపేరు, నెక్లేస్, నల్లపూసలూ, నానుతాడు, కాళ్ళకి కడియాలు, చేతులనిండా గాజులతో ఓ గట్టుమీద కూలబడింది. కోడి కూసేవేళ పాలేరు వీరయ్య తలుపు తీసి, చీకట్లో ఒంటినిండా నగలతో, తడి బట్టలతో ఈవిడని చూసి “అమ్మో.. అమ్మవారు తల్లి మనింటికి వచ్చేసింది. నూతిగట్టు కాడ కూకుంది” అని పెద్ద పెద్ద కేకలు వేసేడుట. తరవాత ఈ విషయం తెలిసీ అందరూ నవ్వుకున్నారుట” ముగించింది అన్నమ్మ.

“అబ్బా, అత్తా ఆరోజుల్లో మరీ కఠినం కదూ..” భయంగా అంది భూలక్ష్మి.

“నీకు నిజంగా జరిగిన విషయం చెప్తాను విను. నాలాటి వితంతువులు ఇంటింటా ఉండేవారు. ఈ కోపిష్టి ఆయన అని చెప్పేనే ఆయన తమ్ముడు కూతురు కూడా ఇలాగే బాల వితంతువు‌. ఏమయిందో గానీ ఆ అమ్మాయికి నాలుగోనెల అని తెలిసింది.”

భూలక్ష్మి ఉలిక్కిపడింది.

“తండ్రి పలుపుతాడుతో కూతుర్ని బాదేస్తుంటే, ఈ కోపిష్టి ఆయనకి తెలిసి తమ్ముడింటికి వెళ్ళి చేతిలో తాడు లాక్కున్నాడు. ‘వెధవా.. ఏడుగురిని కన్నావు. నీ పెళ్ళానికి ఇప్పుడు మూడో నెల. దీన్ని అనడానికి నీకేం హక్కుందిరా..’ అని అరిచేడు. ‘ఏం చేయమంటావన్నయ్యా’ దీనంగా ఏడిచేడు తమ్ముడు. ఇంత కోపిష్టి ఆయనా, తమ్ముడినీ మరదలినీ, కూతురునీ ఒక ఏడాది పాటు ఏదో ఊళ్ళో దాచేరు. అక్కడే తల్లీ, కూతురు కూడా కొడుకులని కన్నారు. తరవాత తన తమ్ముడికి కవలపిల్లలని చెప్పి ఇంటికి తెచ్చేరు. చెవులు కొరుక్కున్న వాళ్ళు ఉండేవారట. అయితేనేం ఆ పిల్లాడు చాలా బాగా పెరిగేడుట.”

ముక్కు మీద వేలేసుకొని ఉండిపోయింది భూలక్ష్మి.

“ఒసే ఇలాటివి చెప్తూ ఉంటే ఊరుతూ ఉంటాయి. వంటపొయ్యికీ ఆడదాని నోటికీ ఏదో బంధం ఉందే.. భూమ్మీద ఉన్న విడ్డూరాలన్నీ అప్పుడే ఆడాళ్ళు కబుర్లాడుకుంటూ చెప్పుకుంటారు” నవ్వుతూ ముగించింది అన్నమ్మ.

***

గోడమీద ఫొటోలో నవ్వుతోంది అన్నమ్మ. భూలక్ష్మి అన్నమ్మ సంవత్సరీకాలకి లడ్డూలు చేసిందికి చట్రాలు తీస్తూ కళ్ళు తుడుచుకుంది.

“రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మా వాళ్ళొకళ్ళింట్లో పెళ్ళి జరుగుతున్నాది. జపాన్ వాళ్ళు బాంబులు వేస్తారని ఊరంతా పొక్కిపోయింది. ఈ పెళ్ళివారు లడ్డూలు, అరిసెలు మూటలు కట్టుకొని దగ్గరగా ఉన్న అడవిలోకి పారిపోయేరు. రెండు రోజులు ఆ లడ్డూలు, అరిసెలు తిని భయం తగ్గిన తరవాత ఊరికి వచ్చేరు” లడ్డూ పాకం తీస్తూ అన్నమ్మ చెప్పిన కబుర్లు చెవిలో రింగు రింగుమంటూ వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here