[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
రాజనీతి విషయాలు మాట్లాడిన నారద మహర్షి:
గొప్ప తేజస్సుతో సూర్యుడే భూమి మీదకి దిగి వస్తున్నాడేమో అన్నట్లు నారదుడు ఆకాశం నుంచి ధర్మరాజు ఇంటికి వస్తుంటే ప్రజలందరు ఆశ్చర్యంగా చూశారు. బ్రహ్మకుమారుడు నారదుడు చేసే ధర్మ బోధలు వినాలని దేవతలు, ఆకాశసంచారులు, గొప్ప మహర్షులు ఆయన వెంట బయలుదేరారు.
అలా వస్తున్న వాళ్లని నారదుడు ఆకాశమార్గంలోనే తిప్పి పంపించేశాడు. పర్వత, పారిజాత, రైవత, సుముఖులు అనే నలుగురు మహామునులతో కలిసి ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చాడు.
ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి నారద మహర్షికి ఎదురుగా వెళ్లి నమస్కరించి తనతో తీసుకుని వచ్చి తగిన ఆసనం మీద కూర్చోబెట్టి పూజించాడు. నారద మహర్షి పాండవుల్ని క్షేమసమాచారాలు అడిగాడు. ప్రత్యేకంగా ధర్మరాజుతో రాజనీతి విషయాల గురించి మాట్లాడాడు.
“ధర్మరాజా! మీ వంశంలో గొప్ప గొప్ప రాజశ్రేష్ఠులు జన్మించి అనేక ధర్మపద్ధతులు ప్రవేశపెట్టారు. నువ్వు వాటిని చక్కగా ఆచరించు. ధర్మం గురించి పూర్తిగా తెలుసుకుని ధర్మము, అర్థము, కామము దేని వల్లా కూడా బాధ కలగకుండా సమయాన్ని బట్టి వాటిని విడదీసుకుని అనుసరించు. మనస్సులో ధర్మాన్ని నిలుపుకుని చెయ్యవలసిన పనుల గురించి అర్ధరాత్రి దాటిన తరువాత నీకు నువ్వే ఆలోచించుకో.
మధ్యలో వెళ్లిపోకుండా ఉండేవాళ్లని, శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్లని, గౌరవంగాను స్థిరంగాను ఉండేవాళ్లని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించు. పుణ్యాత్ములు, శాస్త్రనియమాలు బాగా తెలిసినవాళ్లు, నీ మీద ప్రేమ చూపించేవాళ్లు, తాతతండ్రుల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న బ్రాహ్మణోత్తముల్ని రాజ్యకార్యాలు నిర్వహించడానికి మంత్రులుగా ఏర్పరుచుకో. ఇవన్నీ నువ్వు సక్రమంగా చేస్తున్నావు కదా!
ధర్మరాజా! ఇంకా కొన్ని విషయాలు చెప్తాను విను. రాజు విజయానికి కారణం రహస్యంగా ఆలోచనలు చెయ్యడం. నీ రహస్యాలు ప్రజలకి తెలియకుండా ఉండేలా చూసుకోవాలి.
గొప్ప పండితుడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు, వేదశాస్త్రాలన్నీ బాగా చదివినవాడు, రాగద్వేషాలకి అతీతంగా అన్నింటినీ సమభావంతో చూడగలిగిన మంచి బ్రాహ్మణుణ్ని పురోహితుడుగా నియమించుకోవాలి. అతడి ముఖంలో జ్ఞానం వల్ల కలిగిన తేజస్సు ప్రకాశించాలి.
యజ్ఞాలు చేయించడంలో నేర్పు కలవాడు, తన కర్తవ్యాన్ని మర్చిపోనివాడు, యజ్ఞాలు చెయ్యడానికి ఇష్టం కలిగినవాడు యాజ్ఞికుడుగా ఉండాలి. యుద్ధాలన్నింటిలో విజయం సాధించగలిగేందుకు తగినంత నైపుణ్యము, ఇతరులతో యుద్ధం చేసినప్పుడు ఓడిపోకుండా ఉండేంత పరాక్రమము, గౌరవించడానికి తగిన అర్హత కలిగినవాళ్లు, నీ మంచిని కోరేవాళ్లు సైన్యాధ్యక్షులుగా చేసుకోవాలి.
ఎందుకంటే, సైన్యాధ్యక్ష పదవి చాలా ముఖ్యమైంది, అతడే ప్రధానమైన దేశరక్షకుడు, ప్రభువు మేలు కోరేవాడు. నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఇంకోటి కూడా ఉంది. ఎక్కువ పలుకుబడి, పనితనము, సమర్థత కలిగిన మంత్రి తన పరిథిలో ఉండకుండా ఇతర రాజపుత్రులతో చెయ్యి కలిపి వాళ్లని ధనవంతులుగా చేసి నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేలా చెయ్యకుండా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకుంటున్నావా? ధనం ఎటువంటి వాళ్లనైనా మార్చేస్తుంది.
నీ ఆస్థానంలో ఉండే జోతిష్కులు తమకున్న ప్రతిభవల్ల, శాస్త్రంలో తమకున్న పాండిత్యంతో దేవతలవల్ల, అంతరిక్షం వల్ల, భూమి మీద కలగబోయే ప్రమాదాల్నిముందుగానే తెలుసుకుని అవి జరగకుండా ఉండడానికి తగిన శాంతి కార్యక్రమాలు నీ చేత జరిపించి సన్మానాలు పొందుతున్నారా?
ఎనిమిది శాఖలుగా వ్యాపించిన ఆయుర్వేదంలో సమర్థత కలిగిన వైద్యులు ప్రజలకి ప్రేమతో వైద్యాన్ని అందిస్తున్నారుకదా! పెద్దలతో కలిసి ఆలోచనలు చేస్తూ, వాళ్లని సేవించి మనోవ్యాధులు లేకుండాను, ఔషధం సేవించి శారీరకబాధలు లేకుండాను జాగ్రత్తలు తీసుకో.
మహాపురుషుడా! ధర్మప్రవర్తన, పాపపు ఆలోచనలేని వాళ్లని, నీతిమార్గంలో నడిచేవాళ్లని, రాగద్వేషాలు లేకుండా సమ బుద్ధితో వ్యవహరించేవాళ్లని, నేర్పరితనం కలిగినవాళ్లని బాగా పరీక్షించి పన్నులు వసూలు చెయ్యడం వంటి ధనాన్ని ఆర్జించే రాజ్యకార్యాల్లో నియమించుకో.
వ్యక్తుల యోగ్యతలని బట్టి ఉద్యోగాల్లో నియమించుకుని సకాలంలో తగినవిధంగా జీతాలు ఇస్తున్నావా? అందవలసిన సమయంలో జీతాలు అందకపోవడం వల్ల దరిద్రంతో బాధపడుతూ ప్రజలు దుఃఖిస్తే దేవేంద్రుడు కూడా బాధపడతాడు.
పుణ్యాత్ముడవైన ధర్మరాజా! వంశపారంపర్యంగా వస్తూ పనిచేసే మంచి సేవకులని ప్రేమతో ఆదరించు. వాళ్లు మనస్ఫూర్తిగా నువ్వు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకుని యుద్ధభూమిలో నీ కోసం ప్రాణాలర్పిస్తారు. యుద్ధభూమిలో నీ కోసం ప్రాణాలర్పించిన వీరసైనికుల కుటుంబాలకి తిండికి, బట్టకి లోటు లేకుండా సంతోషంగా జీవించేలా చూస్తున్నావా?
ధనం మీద ఆశ ఉన్నవాళ్లకీ, దొంగలకీ, స్నేహం చెయ్యడానికి యోగ్యత లేనివాళ్లకీ, శత్రువుల మీద పక్షపాతం చూపించేవాళ్లకీ, దుర్మార్గులకీ రాజ్యానికి సంబంధించిన పనులు అప్పగించవద్దు. నీ రాజ్యంలో దొంగల భయం లేకుండా ఏలుకో. నీ ప్రభుత్వంలో పనిచేస్తున్నవాళ్లు ధనానికి ఆశపడి దొంగల దగ్గర ధనం తీసుకుని వాళ్లకి శిక్ష పడకుండా రక్షిస్తున్నారేమో చూసుకో.
భుజబలంతో పరిపాలిస్తున్న ఈ భూమిలో అనావృష్టి లేకుండా ఎల్లప్పుడూ చెరువులు నిండుగా ఉండేలా చూసుకో. మంచి మనస్సుతో పేద రైతులకి ధాన్యపు విత్తనాలు, వర్తకులకి నూటికి ఒక రూపాయి వడ్డీ వంతున అప్పులు ఇయ్యి. కుంటివాళ్లనీ, గుడ్డివాళ్లనీ, మూగవాళ్లనీ, వికలాంగుల్నీ, బంధువులు లేనివాళ్లనీ దయతో పోషించు.
యుద్ధభూమిలో పెద్దశత్రువైనా సరే భయంతో ఏడుస్తూ శరణు వేడితే వాళ్లని కాపాడు. మేలు చేసిన వ్యక్తిని, అతడు చేసిన మేలుని గుర్తించి పెద్దలు ఎక్కువగా ఉన్న సభలో తగినట్లుగా సత్కరించు. చేసిన మేలుని గుర్తించగలిగిన రాజే ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ చక్కగా పాలించగలడు.
మంచి చేసినవాళ్లని పదిమంది ముందు ప్రశంసిస్తే మంచిని ఇంకా పెంచడానికి మార్గం ఏర్పడుతుంది. కృతజ్ఞత అనేది మానవతా లక్షణం.
ధర్మరాజా! ఆదాయంలో నాల్గవభాగంగానీ, మూడవభాగంగానీ, సగభాగంగానీ ఖర్చుచెయ్యాలి. నమ్మదగిన, నీపట్ల భక్తి కలిగిన, సమర్థులైనవాళ్లని ఆయుధశాలలు, ధనాగారాలు, అశ్వశాలలు, గజశాలలు, కోశాగారాలు రక్షించ వలసిన చోట నియమించాలి.
గురువుల్ని, వృద్ధ శిల్పుల్ని, గొప్ప వ్యాపారుల్ని, బంధువుల్ని, ఆశ్రితుల్ని, సజ్జనుల్ని పేదరికం లేకుండ పోషిస్తూ ప్రజల మన్ననల్ని పొందు. ఇష్టమైన మంత్రులు, బంధువులు, సైన్యాధిపతులు, రాజకుమారులు, పండితులతో నువ్వు ప్రతిరోజూ సభని ఏర్పాటుచెయ్యి. రాజ్యం లోపల, బయట ఉండే శత్రువుల నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. శత్రురాజుల ప్రవర్తన గూఢచారుల ద్వారా తెలుసుకో.
గొప్ప పండితులతో కలిసి మాట్లాడి అన్ని ధర్మాలు తెలుసుకుని నేర్పుతో రాగద్వేషాలు లేకుండా శ్రద్ధతోను, దయతోను, సమబుద్ధికలిగి లోకవ్యవహారాలు నడిపించు. వార్తే ప్రపంచాన్ని నడిపిస్తోంది. అది లేకపోతే ప్రజలందరు అజ్ఞానం అనే చీకట్లోనే ఉండిపోతారు.
జరుగుతున్న విషయాలు, ప్రజల అభిప్రాయాలు, ఉన్న సమస్యలు, వాటికి పరిష్కారాలు తెలియని స్థితిలో ప్రజలు ఉంటారు. ప్రభుత్వానికి ప్రజలకి కళ్లు, చెవులు వార్తాపత్రికలే. మామూలు కళ్లకి కనిపించని దృశ్యాలు, మామూలు చెవులకి వినిపించని విషయాలు వార్తలే అందిస్తాయి. కనుక, రాజు వార్తని బాగా నడపాలి.
ధర్మరాజా! భార్యని పొందడం వల్ల వచ్చే ఫలితం సంభోగసుఖము, సంతానం కలగడము; ధర్మాలు వినడం వల్ల కలిగే ఫలితం గొప్ప శీలము, మంచి ప్రవర్తన కలిగి ఉండడము; సంపాదించిన ధనానికి కలిగే ఫలితం దానం చెయ్యడము, అనుభవించడము; వేదాలకు ఫలితము అగ్నిహోత్రాలు; అగ్నిహోత్రంలో వేల్చిన హవిస్సులు దేవతలకి అందించి ఆ దేవతల వల్ల లోకానికి ఫలితాన్ని అందించేవాడు అగ్నిహోత్రుడు అనే విషయం తెలుసుకో.
నువ్వు రక్షిస్తున్న కోటలన్నీ అనేకమైన ధనధాన్యాలతోను, ధనుర్బాణాలతోను, యుద్ధవీరులతోను నిండి ఉండాలి. ఎప్పుడూ ప్రవహించే నీళ్లు, పశువులకి గడ్డి, ఉప్పు, పులుపు, కారం వంటి ఆహార పదార్థాలు; వివిధ పానీయాలు; వంటకి ఉపయోగపడే కట్టెలు; సమృద్ధిగా ఉండి శత్రువుల బారిన పడకుండా చూసుకోవాలి.
శత్రురాజుల మీద దండెత్తడానికి ముందే సామం, దానం మొదలైన నాలుగు ఉపాయాలు వరుసగా ఉపయోగిస్తున్నావా? నాస్తికత; అసత్యం మాట్లాడడం; ఏమరుపాటు; సోమరితనం; తెలివితక్కువవాళ్లతో పనుల గురించి చర్చించడం; అతి కోపం; ఎక్కువకాలం దుఃఖించడం; చెయ్యవలసిన పనుల గురించి ఎక్కువ కాలం ఆలోచించడం; పనులు ఆలస్యంగా చెయ్యడం; జ్ఞానవంతుల్ని గుర్తించలేకపోవడం;
ప్రయోజనకరమైన విషయాల్లో వాటికి భగం కలిగించే ఆలోచనలు చెయ్యడం; ముందే నిర్ణయించి ఉంచుకున్న పనులు పూర్తి చెయ్యకపోవడం; రహస్యంగా ఉంచవలసిన విషయాల్ని బయటకి తెలియకుండా కాపాడలేకపోవడం; శుభకార్యలు చెయ్యకుండా ఇంద్రియ సుఖాలకి లొంగిపోవడం; అనే ఈ పధ్నాలుగు దోషాలు విడిచిపెట్టు” అని చెప్పాడు నారద మహర్షి.
ఆయన చెప్పిన మంచి విషయాలు విని ధర్మరాజు “నారద మహర్షీ! వీలైనంతవరకు అన్యాయ మార్గాన్ని విడిచిపెట్టి మహాత్ముల చరిత్రల్ని ఆదర్శంగా తీసుకుని, మంచిని కలిగించే మీధర్మ బోధని హృదయ పూర్వకంగా ఆచరిస్తాను” అన్నాడు వినయంగా.