‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-2 – మేరె దిల్ మే ఆజ్ క్యా హై

0
2

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఎ[/dropcap]న్నో ప్రేమ గీతాలను మనం సినిమాలలో వింటూ వింటాం. ‘దాగ్’ సినిమా కోసం సాహిర్ ఓ ప్రేమ గీతం రాసారు. ఒకసారి వివాహం అయిన జంట కొన్ని కారణాల వలన విడిపోయి మళ్ళీ కొన్నాళ్లకు కలిసారు. అలాంటి సందర్భంలో ఒకరి పట్ల మరొకరికి మనసు అడుగుల్లో అణగి  ఉన్న ప్రేమ ఉబికి వచ్చినప్పుడు  వారిలో కలిగే భావోద్వేగాలను పాటగా వినాలనుకుంటే అది ఈ పాటే అవుతుంది. ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ చాలా ఆదునాతన సరళిలో చెప్పుకుంటున్నారు కాని సాహిర్ రాసిన ఈ గీతం 1973 లోనే ఈ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ప్రేమికులలో కలిగే భావాలను సున్నితంగా ప్రస్తావనకు తెస్తుంది. జీవితంలో కొంత కాలం కలిసి ప్రయాణించిన తరువాత  ప్రేమ తీవ్రత తగ్గడం సహజం. జీవన ప్రయాణంలో ఎన్నో ఇతర విషయాలు మనల్ని ఆక్రమించుకుంటాయి. ప్రేమను ఆత్మీయతను ఆస్వాదించే సమయం చాలాసార్లు వేగవంతమైన జీవితంలో ఉండదు. చాలా విషయాలు అందిన తరువాత పలుచన అయిపోతాయి. ప్రేమ కూడా అలాంటిదే. కాని అంతరాంతరాలలో ఈ భావం జీవించే ఉంటుంది. జీవితం నుండి కాస్త వెసులుబాటు దొరికిన తరువాత తమ మధ్య పెరిగిన దూరం తలచుకుని ఆ జంట తాము కోల్పోయిన దగ్గరితనాన్ని గుర్తు చేసుకుంటారు. అలాంటి సందర్భంలో అతికినట్లు సరిపోయే చక్కని గీతం ఇది.

సాహిర్ గీతాలను చర్చించుకుంటూ ఆ సినిమా కథను చెప్పుకోవడం అనవసరం. సాహిర్ గీతాల ఆధారంగా చాలా సన్నివేశాలను రచయితలు మలచుకున్నారు కాని ఆయన సన్నివేశాలకు అనుగుణంగా రాసిన పాటలు తక్కువే. కేవలం ఒక సన్నివేశం కోసం మాత్రమే రాసిన గీతం కాలం గడుస్తున్న కొద్దీ, దాని ప్రభావాన్ని కోల్పోతుంది. అందులో అన్ని కాలాలకు సంబంధించిన అంశం లేకపోతే అది ఆ ఒక్క సినిమాకే పరిమితం అవుతుంది. ఎక్కువ మందికి చేరదు. సాహిర్ ప్రేమ గీతాలు అలా ఉండవు. ప్రేమ లేత వయసులోనే కలుగుతుందని అనుకుని, పరిపక్వత లేని వయసులో మెదిలే ఆకర్షణలను దాటని ప్రేమ గీతాల మధ్య ఓ అందమైన పరిమళం ఈ గీతం.

మేరె దిల్ మే ఆజ్ క్యాహై, తూ కహే తో మై బతా దూ

తేరె జుల్ప్ ఫిర్ సవారూ, తేరీ మాంగ్ ఫిర్ సజా దూ..

(నా మనసులో ఏం ఉందో నువ్వు అనుమతిస్తే చెప్పాలని ఉంది. నీ కురులను మరోసారి సవరించాలని, నీ పాపిటను మరోసారి అలంకరించాలని ఉంది.)

సాహిర్ గీతాలలో పురుషుడు తన ప్రేమను ప్రస్తావించినా, ఓ స్త్రీ దగ్గర చొరవ తీసుకుని ముందడుగు వేసినా దానికి ఆమె అనుమతి తప్పకుండా తీసుకుంటాడు. ఆమె అనుమతిస్తేనే ఆమెతో కలిసి ప్రయాణించాలనుకుంటాడు. ఆమె కోరిక తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితిలో తన ఇష్టాన్ని ఆమె పై రుద్దడు. ఇది సాహిర్ ప్రతి పురుషునిలో కోరుకున్న లక్షణమేమో. ఎందుకంటే ఇదే సంస్కారం, అతను రాసిన ప్రతి ప్రేమ గీతంలో కనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలలో చిత్రించే హీరో పాత్రలను ఒక్కసారి గమనించండి. నిలువెత్తు అహంకారానికి అవి ప్రతీకలు. అదే హీరోయిజం అనుకునే అమ్మాయిలు తమను వస్తువుగా చూసి తమ ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వని అహంకారపూరిత లక్షణాలని గొప్ప ధీరోత్తమ గుణాలుగా పరిగణిస్తూ ఉన్నారు. వారికి ఇలాంటి సంస్కారంలోని రుచీ, వాసన తెలియదు. నువ్వు అనుమతిస్తే నా మనసులో ఏం ఉందో నీతో చెప్పాలని ఉంది అంటున్న ప్రేమికుడు ఇచ్చే గౌరవంలో తన వ్యక్తిత్వం ఎంత కాంతిమంతం అవుతుందో అర్థం చేసుకునే స్థాయి ఉన్న అమ్మాయిలు కూడా ఇప్పుడు తక్కువే. వారి మెదళ్లను పితృస్వామ్య సమజం ఓ మూసలో పోసి ఎదగనివ్వదు.

ఈ ప్రేమికుల జంట మధ్య దూరం పెరిగింది. దానికి అతను కూడా కారణం అని అతనికి తెలుసు. ఆమెను ఇప్పుడు ఆమెను చూస్తున్నప్పుడు ఎన్నో భావాలు అతనిలో కలగలిసి అలజడి చేస్తున్నాయి. తాను కోల్పోయిన దగ్గరితనం గుర్తుకు వచ్చి అతన్ని ఇబ్బంది పెడుతుంది. ఆమెతో ఎన్నో చెప్పుకోవాలని ఉంది. కాని తమ మధ్య ఏర్పడ్డ దూరం ఆమెను ఎంతగా గాయపరిచిందో, ఆమెతో మనసు విప్పి తాను మాట్లాడాలనుకున్నా ఆమెకు ఆ కోరిక ఉందో లేదో, ఒకవేళ ఆమెలో ఆ కోరిక లేకపోతే తనను మరోసారి ఇబ్బంది పెట్టినవాడవుతాడు. అది మరో తప్పు. అందుకే సున్నితంగా ఆమె అనుమతి కోరుతున్నాడు. ఎంత లోతు ఉంది ఆ అనుమతి కోరడంలో. అతనిలో ఆమెను ఇక నొప్పించకూడదనే బలమయిన నిశ్చయం కూడా ఉంది. ఇది ఆమైపై అతనికున్న ప్రేమను చెప్పకనే చెబుతున్నది.

“నీ కురులను మరో సారి నిమరాలని ఉంది” అంటూ ఒకప్పటి తమ సాన్నిహిత్యాన్ని, దగ్గరితనాన్ని మరోసారి ఆస్వాదించాలనే తన కోరికను బయట పెట్టుకుంటున్నాడు ప్రేమికుడు. ప్రేమకు మజిలి వివాహం అన్నది అతని నమ్మకం. అందుకే అంతటితో ఆగకుండా “మరో సారి నీ పాపిటను అలంకరించాలని ఉంది” అంటున్నాడు.

పాపిటను అలంకరించడం అంటే ఉత్తర భారతంలో ఓ స్త్రీని పురుషుడు భార్యగా స్వీకరించడం. స్త్రీ పాపిటను కుంకుమతో అలంకరించి ఆమెను తన పత్నిగా స్వీకరిస్తాడు పురుషుడు. ఈ జంటకు ఓ సారి వివాహం జరిగింది. కాని ఆ వివాహంలో కొన్ని కారణాల వలన దూరం పెరిగింది. ఇప్పుడు ఆమెను మరోసారి తన భార్యగా స్వీకరించాలనుకుంటున్నాడు. ఒకసారి భార్యగా మారిన ఆమె తరువాత తనకు దూరమయ్యాక ఆ వివాహానికి అర్థం లేకుండా పోయింది. ఆమెను పొందిన కొత్తలో ఆమెతో అనుభవించిన ఆ దగ్గరితనం ఇప్పుడు వారి మధ్య లేదు. ఆ వివాహ బంధాన్ని దాటి వారి జీవితాలు భిన్న దృవాలుగా మారాయి. కాని మళ్ళి ఆమెతో ఒకటవ్వాలని ఉంది అతనికి. అందుకే ఆమెను మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అతను. ఇది వివాహ బంధానికి అతను ఇచ్చే గౌరవం.

ముఝే దేవతా బనాకర్ తెరీ చాహతో నే పూజా

మేరా ప్యార్ కహ్ రహా హై మై తుఝే ఖుదా బనాదూ

తేరీ జుల్ప్ ఫిర్ సవారూ తేరీ మాంగ్ ఫిర్ సజాదూ (మేరె దిల్)

(నన్ను నీ ప్రేమ, దేవతను చేసి పూజించింది. నీ పై నాకున్న ప్రేమ నిన్ను దైవంగా మార్చుకొమ్మంటుంది.)

ప్రేమ మనిషితో ఎన్నో పనులు చేయిస్తుంది. ప్రేమలో పడ్డవారికి తమ ప్రేమికులు ఈ ప్రపంచంలోనే అతిరథులనే భావన కలుగుతుంది. కాని అది నిజం కాదు. ప్రతి మనిషిలోనూ బలహీనతలుంటాయి. ఈ ప్రేమికుడూ బలహీనుడే. కాని అతన్ని దేవతను చేసి పూజించింది ఆమె. ఇది ఆమె చేసిన పని కాదు. ఆమెలో నిండిన ఆ ప్రేమ అతన్ని పూజించేంతగా ఆమెను ఉసిగొల్పింది. సాహిర్ కలం ప్రేమ లోతుల్ని స్పృశిస్తూ కూడా తర్కానికి దూరం కాదు. ఆమె ప్రేమలోతుల్లో మునిగి ఉన్న ప్రేమికుడు కూడా తనని దేవతగా ఆమె పూజించడానికి కారణం అమె కాదు, ఆమెలో తనపై నిండి ఉన్న ప్రేమ అని చెప్పడం చూస్తే ఈ పాటలోని భావం అసహజం అని అనగలమా? ప్రేమ గీతాలు వాస్తవానికి దూరం అని చెప్పేవారికి ఈ పాట వినిపించాలి.

ఆ మాట అన్న తరువాత అంతే ధీటుగా నా “ప్రేమ నిన్ను ఖుదా (దైవం) గా మార్చుకొమ్మంటుంది” అంటాడు ప్రేమికుడు. ఈ రెండు వాక్యాలలో చాహత్, ప్యార్ అంటూ రెండు పదాలను ప్రేమకు పర్యాయాలుగా ప్రయోగిస్తాడు సాహిర్. చాహత్ అంటే కోరిక. ఆమె ప్రేమలో ఎంతో కోరిక ఉంది. ఆ కోరికల నడుమ ప్రేమికుడిని దేవతగా పూజించింది. అతనిది ప్యార్ రెండిటి అర్థం ఒకటే అయినా చాహత్ లోని తీవ్రత ప్యార్‌లో లేదు. అమెకు తన పట్ల ఉన్న ప్రేమలో గాఢత ఎక్కువ అని మొదటి వాక్యంలో అర్థం వచ్చేలా చెబుతూ, తనలోని ప్రేమ కూడా ప్రియురాలిని ఖుదా (దైవం)లా మార్చుకొమ్మని ప్రేరేపిస్తుంది అంటాడు సాహిర్.

‘దేవతా’ అన్న పదం కన్నా కాని ‘ఖుదా’ లో ఓ బలం ఉంది.. ఆమె తనను దేవతను చేసి పూజించింది. తాను ఆమెనే దైవంగా కొలవాలనుకుంటున్నాడు అంటున్నాడు ప్రియుడు. ఖుదా ఉర్ధూ భాషలోని పదం. ముస్లిం మతస్థులు ఉపయోగించే పదం. హిందూ మతంలో ఎందరో దేవుళ్ళు. కాని ముస్లింలకు ఖుదా ఒక్కడే. ప్రేమ అన్ని మతాలకు అతీతమైనది. అందుకే అన్ని మతాలకు సంబంధించిన పదాలను వాడతాడు కవి. ఆమెకు అతను దేవత అయితే అతనికి ఆమె ఖుదా. దేవతా అనే పదం కన్నా గంభీరమైన పదం అది. ఎంత గొప్పగా తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఈ ప్రేమికుడు. ఆమె విలువ తగ్గించడు, తన ప్రేమ లోని గాఢతకు లోటు రానివ్వడు. సాహిర్ లోని సామ్యవాదం ఈ సందర్భంలో కూడా రెండు విభిన్న మతాలను కలిపి ఈ జంట ప్రదర్శించే ప్రేమలోని గాఢతను పెంచుతోంది.

కోయి డూండ్నె భీ ఆయె తో హమె న డూండ్ పాయె

తూ ముఝె కహీ ఛుపా దె, మై తుఝే కహీ ఛుపా దూ

(మనల్ని వెతకడానికి ఎవరన్నా వచ్చినా వెతకలేరు. నువ్వు నన్ను ఎక్కడన్నా దాచేయి. నేను నిన్ను దాచేస్తాను)

ప్రేమికుల మధ్య దూరం పేరిగేది ప్రపంచం వారి మధ్యలోకి వచ్చినప్పుడు. వాళ్ళిద్దరే కలిపి గడిపే సమయం క్రమంగా తగ్గిపోతూ ఉంటే జీవితంలో నిస్సారత అవహిస్తుంది. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా కలిసి గడిపే సమయం లేనప్పుడు కొన్నిసార్లు అందరికీ దూరంగా వాళ్లే ఏకాంతాన్ని సృష్టించుకోవలసి వస్తుంది. ఒకరితో మరొకరు సమయం గడపడానికి ప్రపంచాన్ని మరచి ఒకరి సాంగత్యంలో మరొకరు సాంత్వన పోందవలసిన సమయం ఇది. అందుకే మనం ఎవరికీ దొరకవద్దు. ఒకరినొకరం దాచి పెట్టుకుందాం అంటాడు కవి. ప్రపంచం కంట పడని ఏకాంత ఘడియలను ఆస్వాదించడం ప్రేమికులకు అవసరం. అంతటి ఏకాంతాన్ని కోరుతున్నాడు ఇక్కడ ప్రేమికుడు.

“మేరె బాజువొ మే ఆకర్, తెరా దర్ద్ చైన్ పాయె

తేరె గేసువో మే చుప్కర్ మై జహాన్  కె గమ్ భులా దూ”

(నా బాహువులలో చేరి నీ వేదనకు ఉపశాంతి దొరకగలిగితే, నీ తల వెంట్రుకలలో దాక్కుని నేను ప్రపంచ బాధలను మర్చిపోగలను)

స్త్రీ పురుషుల కలయిక శరీర వాంచ తీర్చుకోవడానికే అయితే అది ప్రేమ కాదు. ఇక్కడ కవి ప్రేమికుని మనసులోని ప్రేమను ప్రస్తావిస్తున్నాడు. వారి కలయిక శరీరాల కోరిక తీర్చుకోవడానికో తమ అహాన్ని సంతృప్తి పరుచుకోవడం కాదు. ఇద్దరికీ ఓ గతం ఉంది. జీవితం ఇద్దరినీ నలిపేసింది. ఇద్దరూ ఆ కష్టాలను విడి విడిగా అనుభవించారు. ఇప్పుడు ఒకరి సాంగత్యంలో మరొకరు ఆ కష్టాలను మర్చిపోవాలని కోరుకుంటున్నారు. ఇద్దరు కలిసి గడిపే ఆ సమయం వారికి జీవితాన్ని ఎదుర్కునే బలాన్ని ఇవ్వాలి. దానికి ఆమె వేదన అతని సాంగత్యంలో తగ్గాలి, అతను తన ప్రపంచ బాధలను ఆమె నీడలో మర్చిపోవాలి. ఇక్కడ ప్రేమికుడు తమ సాంగత్యం కష్టాలని ఎదుర్కోగలిగే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు.

జీవితంలో దుఃఖం తప్పనిసరి. ప్రతి ఒక్కరికి స్వీయ దుఃఖం ఉంటుంది. అది ఎవరూ పంచుకోలేరు. ఎవరి భారాన్ని వారే మోయాలి. ఇది సత్యం. కాని మనల్ని ప్రేమించేవారు ఉంటే వారి సాంగత్యంలో ఆ భారం కష్టం అనిపించదు. ఏదైనా సరే భరించగలం అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నది, నీ బాధలను నేను తీసేస్తా, నీలో సంతోషాన్ని నింపేస్తా అంటూ ప్రేమ బాసలు చేసుకునే టీనేజ్ జంట కాదు. జీవితంలో ఎన్నో చూసి పరిపక్వతతో మెసిలే స్త్రీ పురుషులు వాళ్లు. అందుకే మన కలయికలో మన బాధలు, కష్టాలు మాయమవుతాయ్ అనట్లేదు. కేవలం కొంత సాంత్వన కొంత మరుపు కోరుతున్నారు వాళ్లు. ప్రేమ మనకివ్వగలిగే శక్తి అదే. సాహిర్ ఈ గీతంలో ఎక్కడా అబద్ధాలు, అసత్యాలు జోడించడు. అయినా ఇదో అపురూపమైన ప్రేమ గీతమే.

ఈ పాటకు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూరిస్తే కిషోర్ కుమార్ గానం చేసారు. సాహిర్ గీతాల్లో ఓ పదును ఉంటుంది. అలాగే అదే స్థాయిలో సున్నితత్వమూ ఉంటుంది. ఆయన భాషను వాడే పద్దతి ఎలా ఉంటుందంటే ఆ పాత్రల మనసులోని భావాలకు ఓ ఉదాత్తత చేకూరుస్తారు. ఆయన రాసిన ప్రేమ గీతాలలో ప్రేమకు ఎంత ఉన్నతమైన స్థానానిస్తారంటే, జీవితంలో అన్ని గందరగోళాల నడుమ అదే శాశ్వతం అనిపిస్తుంది. పెదవి దాటి బైటికి రాలేని భావాలకు కోరికలకు సాహిర్ గీతాలు అపురూపమైన స్వేచ్ఛనిస్తాయి. పెళ్లి తరువాత ప్రేమ కబుర్లేంటీ అని కొట్టిపడేసే మన సంస్కృతి నడుమ ఈ గీతం మల్లెపూవుల పరిమళాన్ని మోసుకొస్తుంది. ప్రేమలోని గాఢత తగ్గి, జీవితం అర్థరహితంగా మారినప్పుడు మళ్ళీ ప్రేమలో పడండని, కలిసి సమయం గడపండి, ఒకరి నుండి మరొకరు శక్తిని సమకూర్చుకోండి అని, అదే ప్రేమకు అర్థం అని చాటుతాడు సాహిర్ ఈ గీతంతో. సంవత్సరాలుగా ఈ గీతంతో పరిచయం ఉన్నవారికి వయసు పేరిగే కొద్దీ ఈ పాట ఇంకా ఇంకా నచ్చుతుంది. అది సాహిర్ మాయాజాలం.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here