[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
~
అపోలో అధినేత డా. ప్రతాప్. సి. రెడ్డి (1933 ఫిబ్రవరి 5):
[dropcap]హృ[/dropcap]ద్రోగ నిపుణులు, ఆపోలో ఆసుపత్రుల అధినేత అయిన ప్రతాప్ చంద్రరెడ్డి చిత్తూరు జిల్లా అరగొండలో 1933లో జన్మించారు. కార్పొరేట్ రంగంలో ఆసుపత్రి స్థాపించాలనే తొలి ఆలోచన ఆయనకు వచ్చింది. మదరాసులోని క్రిస్టియన్ కళాశాల, స్టాన్లీ మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. వీరికి 1991లో పద్మ భూషణ్, 2010లో పద్మ విభూషణ్ పురస్కారాలు లభించడం విశేషం.
అమెరికాలోని Massachusetts General Hospital లోను, బోస్టన్ మిస్సోరి స్టేట్ చెస్ట్ హాస్పటల్ లోను పనిచేశారు. పేద దేశమైన భారతదేశంలో ఉన్నత ప్రమాణాలు గల వైద్యం అందించాలనే సత్సంకల్పంతో మాతృదేశానికి తిరిగివచ్చి అపోలో ఆసుపత్రిని 1983లో ప్రారంభించారు. ఆ సంస్థలు గత నాలుగు దశాబ్దాలలో దినదినాభివృద్ధి చెంది అంతర్జాతీయ ఖ్యాతిని గడించి వివిధ రాష్ట్రాలలో పని చేస్తున్నాయి. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో స్థాపించిన తొలి సంస్థ, పాశ్చాత్య దేశాల ఖర్చులలో పోలిస్తే పదిరెట్లు తక్కువగా ఏర్పాటైంది.
ఏటా ఆరోగ్య పరీక్షలనే సంకల్పంతో వ్యాధినిరోధక ప్రణాళికలు సిద్ధం చేశారు. తాను హృద్రోగ నిపుణులు. అందుకే Billion Hearts Beating Campaign ప్రారంభించి భారతీయులు హృదయ సంబంధంగా ఆరోగ్యంగా వుండే నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టారు. Healthcare Federation of India – NAT HEALTH సంస్థ ఆవిర్భావానికి ఆయన మూలకారకులు. CII వారి జాతీయ ఆరోగ్య సంస్థ అధ్యక్షులుగా ప్రతాప్ రెడ్డి – ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య బీమా, ప్రజారోగ్యం, ఫార్మా రంగాలకు చెందిన కమిటీలకు సలహాదారుగా వ్యవహరించారు.
వదాన్యులు:
ప్రతాప్ రెడ్డి వదాన్యతలో సామాజిక కార్యకలాపాలలో భాగంగా – Save A Child’s Heart Initiative ప్రారంభమైంది. చిన్న పిల్లలతో గుండె జబ్బుల గూర్చి వీరు పరిశోధనలు, పరిష్కరణలు చేశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు – ప్రీతా రెడ్డి, సంగీతా రెడ్డి, సునీతా రెడ్డి, శోభనా కామినేని. వీరు ఆయా ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. నలుగురూ అపోలో హాస్పిటల్స్ డైరక్టర్లు.
ప్రతాప్ రెడ్డి పొందిన పురస్కారాలు:
వైద్యరంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా అనేకానేక గౌరవాలు ప్రతిష్ఠాత్మకమైనవి లభించాయి.
- Asian Business Leaders Life Time Achievement Award – 2013
- CNBC Lifetime Achievement Award- 2013
- NDTV Indian Lifetime Achievement Award-2013
- FICCI Award – 2011
- AIMA Award – 2011
- Alexandria Frost Award – 2010
- Rotary International Award – 2010
- Mother Teresa Citizen Award – 1993
ఇలా మరెన్నో.
ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశంలోని 100 మంది సంపన్నుల జాబితాలో 86వ స్థానం. శక్తిమంతులైన 50 మంది వ్యక్తుల్లో (ఇండియా టుడే) 48వ స్థానం ప్రతాప్ రెడ్డిదే.
అపోలో ఆసుపత్రుల విస్తరణ:
అత్యుత్తమ ప్రమాణాలు గల అపోలో ఆసుపత్రులు భారతదేశంలో 48 ప్రదేశాలలో పని చేస్తున్నాయి. ప్రధాన నగరాలైన చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు, కలకత్తా, అహమ్మదాబాదు, నవీ ముంబై, ఢిల్లీలలో ఆసుపత్రులు గణనీయమైన ఖ్యాతి గడించాయి. 73 ఆసుపత్రులలో పదివేలకు మించిన పడకలు అందుబాటులో ఉన్నాయి. అంతేగాక 5 వేలకు పైగా పార్మసీలు, 300 క్లినిక్‍లు, 1100 డయాగ్నిస్టిక్ సెంటర్లు నడుపుతున్నారు.
వైద్యరంగానికి సంబంధించిన వివిధ విభాగాలు ఈ ఆసుపత్రులలో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. స్వగ్రామమైన అరగొండ ప్రజల ఋణం తీర్చుకోవాలని రెడ్డిగారు చిత్తూరు సమీపంలోని అరగొండలో 50 పడకల ఆనుపత్రి నెలకొల్పారు. కేవలం లాభాపేక్షతో గాక వైద్యరంగం ద్వారా సేవలు చేయాలనే ఉద్దేశంలో ఈ సంస్థలు నడుపుతున్నారు. 90 ఏళ్ళు నిండినా ఆయనలో సేవాతృష్ణ తగ్గలేదు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే నానుడికి ఆయన నిదర్శనం. అపోలో ఆసుపత్రుల ఒరవడిలో ఆ తర్వాత ప్రముఖ నగరాలలో వైద్యసంస్థలు నెలకొల్పబడ్డాయి. ప్రైవేటు రంగంలో వైద్యం ఒక లాభార్జనగా మారింది. మధ్యతరగతి వారు ఈ కార్బొరేట్ సంస్థలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులకు అపోలో వరప్రసాదిని.
RBI గవర్నరు డా. వై. వేణుగోపాలరెడ్డి (17 ఆగస్టు 1941):
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం రిజర్వ్ బ్యాంకు. దీని గవర్నర్లుగా తెలుగువారు ముగ్గురు పని చేయడం గర్వకారణం, వై.వి.రెడ్డిగా ప్రసిద్ధులైన యాగా వేణుగోపాలరెడ్డి రిజర్వ్ బ్యాంకు 21వ గవర్నరుగా పనిచేసి 2008 ఆగస్టులో రిటైరయ్యారు. ఆయన 1964 బ్యాచ్ ఆంధ్రా కేడర్ ఐ.ఎ.ఎస్ ఆఫీసరు. ఉద్యోగ జీవితంలో అధిక శాతం ఆర్థిక, ప్రణాళికా రంగాలలో పనిచేసి మొప్పు పొందారు. రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా 2010లో పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. అదే సంవత్సరం అపోలో అధినేత ప్రతాప్ సి. రెడ్డి కూడా అందుకోవడం విశేషం.
వేణుగోపాలరెడ్డి 1941లో ప్రస్తుత వై.యస్.ఆర్. కడప జిల్లా కొమ్మనవారి పల్లెలో జన్మించారు. వీరి తండ్రి పిచ్చిరెడ్డి ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల నధిష్ఠించారు. నంద్యాలకు కలెక్టరుగా పనిచేశారు. వృత్తిరీత్యా అధిక భాగం ఆయన మదరాసులో పనిచేయడం వల్ల కుమారుడైన వేణుగోపాలరెడ్డి విద్యాభ్యాసం మదరాసులో కొనసాగింది. ఆపైన హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో PhD చేశారు. పిచ్చిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్యక్షులుగా పని చేశారు.
వేణుగోపాలరెడ్డి మదరాసు విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో ఎం.ఎ. చదివి ఆ తర్వాత హైదరాబాదులో PhD చేశారు. 1961లో 20 ఏట కళాశాల లెక్చరర్ అయ్యారు. నెదర్లాండ్స్ లోని Institute of Social Studies లో Economic Planning మీద డిప్లొమా సంపాదించారు. వివిధ హోదాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోను, కేంద్రంలోను పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గాను, కేంద్రంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో బ్యాంకింగ్ విభాగ కార్యదర్శిగా ఉన్నారు. అంతకు ముందు వాణిజ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా అనుభవం గడించారు. 1996 నుంచి ఏడేళ్లు రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరు. అంతకుముందు ప్రపంచ బ్యాంకు సలహాదారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF లో భారతదేశ పక్షాన ద్రవ్యవ్యవహార సలహాదారు. అక్కడే ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అయ్యారు. ఆర్థికాభివృద్ధి విషయంలో వీరి సలహాలను చైనా, బహ్రెయిన్, ఇథియోపియా, టాంజానియా దేశాలు పాటించాయి.
ఆర్థిక సంస్కరణల సారథి:
వై. వి. రెడ్డి రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా బ్యాంకు వ్యవహారాలలో పారదర్శకతను తెచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం వృద్ధి రేటు నుండి 8 శాతం వృద్ధి రేటును నమోదు చేసే స్థాయికి ఎదిగిన సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆ ఒత్తిళ్లను తట్టుకొని ఆర్థిక వ్యవస్థ దారి తప్పకుండా జాగ్రత్త వహించడంలో రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో రెడ్డికి గట్టి పట్టు వుంది. అంతర్జాతీయంగా రూపాయి మారకం రేటు పెరిగేలా చేయడంలో కృతకృత్యుడయ్యారు.
2008లో రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా రిటైరయ్యారు. అప్పట్లో ఆర్థిక మాంద్యం నుండి బయటపడటానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు – ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆర్థిక, బ్యాంకింగ్ రంగ నిపుణులతో అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో సభ్యుడిగా రెడ్డి ఎంపికయ్యారు.
ఆర్థిక రంగ సంక్షోభంపై వై.వి. రెడ్డి రచించిన గ్రంధం – ‘India and the Global Financial crisis – ఎన్నో అంశాలకు సరియైన సమాధానాన్ని వివరించింది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశ పరిస్థితి మెరుగ్గా వుండటానికి గల కారణాలు, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు ఆ గ్రంథంలో వివరంగా చర్చించారు. సంక్షోభాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం పరిశోధకులకు ఉపకరించింది.
వై.వి.రెడ్డిని భారత ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులుగా నియమించింది. ఆ కమిటీ సిఫార్సులు ప్రభుత్వం అమలు పరిచింది. రెడ్డి ఘనతను గుర్తించి విజిటింగ్ ఫ్యాకల్టీగా పలు సంస్థలు ఆహ్వానించాయి. ఉస్మానియా యూనివర్శిటీ బిజినెస్ డిపార్ట్‌మెంటు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలు వీరి అనుభవాన్ని పంచుకొన్నాయి. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకానామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) సంస్థలో ఆయన గౌరవ ఫెలో. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆదే రీతిలో మారిషస్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సివిల్ లా ప్రధానం విశిష్టం.
రెడ్డి తర్వాత మరో తెలుగువాడైన దువ్వూరు సుబ్బారావు రిజర్వ్ బ్యాంకు గవర్నరు కావడం విశేషం. అధికారులుగా ఇద్దరూ లబ్ధప్రతిష్ఠులు.
వై.వి.రెడ్డి రచించిన – Advice and Dissent: My Life in Public Service – జూన్ 2017లో ప్రచురితమైంది. ఆర్థిక మంత్రి పి.చిదంబరం గ్రంథ రచయితను బహుధా ప్రశంసించారు. అంతటి ప్రతిభాశాలి వై.వి.రెడ్డి.
Images source: Internet
(మళ్ళీ కలుద్దాం)