[శ్రీమతి నండూరి సుందరీ నాగమణి రచించిన ‘కవితా విలాపం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]న[/dropcap]న్నెందుకు విడిచావని ప్రశ్నిస్తోంది
ఒకప్పటి నా ప్రియసఖి!
తడబడింది నా మనసు తత్తరపాటున..
“అబ్బే, వదిలింది లేదే!” అన్నాను ఎలాగో..
“లేదులే, వదిలేసావు నన్ను మరచిపోయావు
కొత్త స్నేహాలు మరిగి, నన్ను విస్మరించావు”
నిష్ఠూరోక్తులు..
ఆమె మాటలు నా అంతరంగాన్ని లోతుగా
కోస్తుంటే, ఆ నిజానికి తలవంచక తప్పలేదు!
“ఒకనాడు నీకు నేనే అండ
గుండె కరిగి కన్నీరై జారటానికి,
మనసు తేలికగా మారటానికి.. ఔనా?”
“ఊ..”
“గతంలో నా ద్వారానే కదా అన్యాయాలను,
అక్రమాలను ఎదిరించావు?
ప్రకృతి గానాన్ని ఎలుగెత్తి పాడావు!
శిల్ప సౌందర్యాన్ని, చిత్రకళామహిమను పొగిడావూ..”
“ఔను నేస్తం” నూతిలోంచి వచ్చింది నా స్వరం.
“లెక్కలు, నియమాలు నేర్చావు, ఆ పద్యసఖి మోజులో పడ్డావు,
టక్కున నాతో చెలిమి మానేసావు!”
“కానీ నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం సుమా!
నన్ను సేదదీర్చే జలపాతానివి నీవు!”
“మరి చూడవు, పలకరించవు..
ఎందరితో సహవాసం చేసినా,
నా వద్దకూ నీవు రావాలి, తప్పదు!”
“అలాగే తప్పకుండా నా కవితా!
గుండె లోతులలో దాగిన భావుకతా!”
“పూర్తి పేరుతో పిలువవూ..
నా పేరు వచన కవిత!”