దాతా పీర్-11

0
3

[సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ హృషీకేశ్ సులభ్ హిందీలో రచించిన ‘దాతా పీర్’ అనే నవలని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు ‘భారత్ భాషా భూషణ్’ డా. పుట్టపర్తి నాగపద్మిని.]

[సమదూ ఫకీర్‍ను కలిసొచ్చాకా, రసీదన్ మారిపోతుందింది. పిల్లలతో మాట్లాడకుండా, మౌనంగా తన పనులు తాను చేసుకుంటూ వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. పిల్లలు ముగ్గురు ఆ మార్పు గుర్తిస్తారు కానీ ఏం జరిగిందో వాళ్లకి అర్థం కాదు. సాబిర్ అడిగితే, ఓ రోజు మధ్యాహ్నం ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయిందనీ, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, వచ్చినప్పటినుంచి ఇదే ధోరణి అని అమీనా చెబుతుంది. ఓ రోజు రసీదన్, చున్నీని పిలిచి నీతో మాట్లాడాలి, నేను చెప్పేది ప్రశాంతంగా విను అని అంటుంది. చున్నీ దురుసుగా సమాధానం చెప్తే, పొగరు తగ్గించుకో బిడ్డా అంటూ నెమ్మదిగా మాట్లాడి చున్నీకి నచ్చజెప్తుది. ఆమె కోరుకున్నట్టే బబ్లూతో పెళ్ళి జరిపిస్తాననీ, కానీ చాటుమాటు వ్యవహారాలన్నీ మానుకోవాలని చెప్తుంది. తల్లి మాటల్లో నిజాయితీ కనబడి, చున్నీ కూడా సరేనంటుంది. ఓ సాయంత్రం పూట ఫజ్లూ గదిలోకి వెళ్తుంది రసీదన్. అక్కడ సాబిర్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దర్నీ కూర్చోమని చెప్పి చున్నీకి బబ్లూతో పెళ్ళి చేయదలచినట్టు చెప్తుంది. తన నిర్ణయానికి కారణాలు కూడా చెప్తుది. ఫజ్లూ కూడా సరేనంటాడు. మీ ఇద్దరు మీ ప్రవర్తనతో నన్ను బాధపెడుతున్నారంటుంది రసీదన్. ఆమె ఆ గదిలోంచి బయటకు వచ్చేశాకా, ఇద్దరూ సత్తర్ మియ్యా గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి గోదాం తీసేయమని కమిటీ వాళ్ళు సత్తర్ మియ్యాను హెచ్చరించారనీ, తీసేయకపోతే పోలీసు కేసు పెడతామని చెప్పారని అంటాడు సాబిర్. గోదాం తీసేస్తే నీకు కష్టమేమో అని ఫజ్లూ అంటే, తాను సత్తర్ మియ్యా దగ్గర మానేసి, కొత్త వ్యాపారం చూసుకోవాలనుకుంటున్నట్లు చెప్తాడు సాబిర్. చున్నీ బబ్లూకు ఫోన్ చేసి, అమ్మ తమ పెళ్ళికి అంగీకరించినట్లు, రహస్యంగా కలుసుకోవటాలు ఆపేయమన్నట్టు చెప్తుంది. బబ్లూ విసుక్కునా, ఏం చేయలేక సరేనంటాడు. అయితే మటన్ మీద మోజు వదుల్చుకోలేక, స్నేహితులతో హోటల్‍కి వెళ్ళి, మటన్ ఆర్డర్ చేసి, మొబైల్ నుంచి మద్యం ఆర్డర్ చేస్తాడు. రెండూ తీసుకుని రాజేంద్రనగర్ వంతెన కిందకి చేరుతారు. కాసేపట్లో విందు ప్రారంభమవుతుందునగా పోలీసులొచ్చి వాళ్ళందరిని తీసుకెళ్ళి స్టేషన్‍లో పెడతారు. ఈ వార్త తెలిసిన సత్తర్ మియ్యా కుటిలంగా నవ్వుతూ రసీదన్‍కి తెలిసేలా ప్రకటిస్తాడు. ఈలోపు బబ్లూ తండ్రి కల్లూ మియ్యా పోలీస్ స్టేషన్‍లో ఇన్‍స్పెక్టర్‌ను బ్రతిమాలుకుని, బేరమాడుకుని, 25 వేలకి ఒప్పందం కుదుర్చుకుంటాడు. డబ్బు తెచ్చేందుకు ఇంటికి వస్తుంటే స్టేషన్ ముందు రసీదన్, చున్నీ కనబడతారు. వాళ్లని చూసి ఆశ్చర్యపోతాడు కల్లూ మియ్య. మీరేంటి ఇక్కడ అని అంటే బబ్లూ కోసం అంటుంది చున్నీ. బబ్లూ చున్నీల ప్రేమాయణం గురించి కల్లూ మియ్యా వినా, నమ్మలేదు. ఇప్పుడు వీళ్ళని ఇక్కడ చూసి నమ్మాల్సి వస్తుంది. వయసులో ఉన్న ఆడపిల్లతో పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చోవద్దని రసీదన్‍కి చెప్పి అక్కడ్నించి కదుల్తాడు కల్లూ మియ్యా. అయిష్టంగానే తల్లితో పాటు ఇంటి వైపు నడుస్తుంది చున్నీ. కల్లూ మియ్యా ఇంటికి వెళ్ళి చూస్తే ఇరవై వేలే ఉంటాయి. ఆ డబ్బు తీసుకువెళ్ళి ఇన్‍స్పెక్టర్‍కి ఇచ్చి, మిగతా ఐదు వేలకి షాపు నుంచి అప్పుడప్పుడూ మటన్ తెచ్చిస్తానని చెప్పి ఒప్పిస్తాడు. బబ్లూని ఇంటికి తీసుకువెళ్ళి, వాడి వ్యవహారమంతా భార్యకి చెప్పి, ఇద్దర్నీ తిడతాడు. భర్త బయటకి వెళ్ళాకా, ఎవర్రా ఆ అమ్మాయి అని తల్లి అడిగితే, బబ్లూ వివరాలు చెప్తాడు. కాసేపటికి చున్నీకి ఫోన్ చేసి, నువ్వసలు పోలీస్ స్టేషన్‍కి ఎందుకొచ్చావని తిడతాడు. చున్నీకి చిరాకేసి అతన్ని తిడుతుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-9 – ఒకటవ భాగం

[dropcap]స[/dropcap]త్తార్ మియ్యా గోదామును కాపాడుకోలేకపోయాడు. వీధి వీధంతా కమిటీపై ఒత్తిడి తెచ్చిందట, చర్మాలను నిలువచేసే గోదాము ఇక్కడ ఉండేందుకు వీల్లేదని! గోరీలగడ్డ కమిటీ వాళ్ళు కూడా సత్తార్ మియ్యానెలాగైనా వదిలించుకోవాలనే చూస్తున్నారు. ఇప్పుడింక అక్కడి వాళ్ళ నిరాకరణ కూడా ఒక ఆయుధంగా చేసుకుని అతని మీద కమిటీ ఒత్తిడి తెచ్చింది, ఖాళీ చేయమని! గోదాం తీసివేయటానికి సత్తార్ మియ్యా ఒప్పుకున్నాడు, కానీ ఆ స్థలానికి మాత్రం సత్తార్ మియ్యా నుండి ముక్తి లభించలేదు. ప్రస్తుతానికి, గోదాము తీసివేయాలని మాత్రమే నిర్ణయమైంది, కానీ ఆ స్థలం మాత్రం సత్తార్ మియ్యా అధీనంలోనే ఉంటుంది.

ఈ పూర్తి సన్నివేశంలో రసీదన్, ఫజ్లూ, సాబిర్ – ముగ్గురూ మౌనంగానే ఉన్నారు. అందులో పాత్ర వహించటానికి వీళ్ళకంత అధికారమూ లేదు. రసీదన్ మీద సత్తార్ మియ్యాకు ఆ నమ్మకం లేదు కానీ, సాబిర్, ఫజ్లూ కూడ ఇలా బంధం తెంచుకుని వెళ్ళిపోతారని అనుకోనైనా లేదు. ఐనా వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్ద తేడా ఉండదు కానీ కనీసం తోడు నిలబడితే బాగుండేది. వీళ్ళిద్దరి వ్యవహారంతో దెబ్బ తిన్న పాములాగా బుసకొడుతూ ఉన్నాడు సత్తార్ మియ్యా. మనసులో నిర్ణయించుకున్నాడు, ఇప్పటికి మాత్రం ఊరికే ఉండాలి కానీ అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొట్టితీరాలని! కాలం మనది కానప్పుడు మనసును అదుపులో ఉంచుకోవాలని అతనికి తెలుసు. శత్రువుల అన్ని లోపాలనూ ఒక్కసారి బైటికి తీయకూడదు. వీళ్ళకంత బలం లేదు కానీ, కబ్రిస్తాన్ కమిటీ వాళ్ళు, వీళ్ళను అడ్డంగా పెట్టుకుని ఆ స్థలాన్ని ఖాళీ చెయ్యమని కూడా ఒత్తిడి చేయవచ్చు. సత్తార్ మియ్యా కమిటీ అధ్యక్షుణ్ణి చాలా కష్టం మీద ఒప్పించాడు. ‘ముసలి నా కొడుకు, పెద్ద ముదురుగాడు. గప్‌చిప్‌గా పెద్ద మొత్తం మింగి గానీ తలాడించలేదు..’ ధుమ ధుమలాడుతూ, సత్తార్ మియ్యా, అప్నీ పసంద్ హోటల్‌లో చికెన్ బిరియానీ తింటూ అనుకుంటున్నాడు. అప్పుడప్పుడూ బిరియానీ ప్యాక్ చేయించుకుని ఫజ్లూ గదిలో అతనితో పాటే తింటాడాయన. సాబిర్ ఎటూ ఉంటాడక్కడ!! ఇప్పుడది గుర్తుకు వచ్చినా వాళ్ళిద్దరి తోడు కావాలనిపించక బిరియానీ తినేశాడు తానొక్కడే!!

తరువాత హోటల్ నుండీ బయలుదేరి, సత్తార్ మియ్యా సాబిర్‌ను వెదుకుతూ ఫజ్లూ గదికి వెళ్ళాడు. అక్కడ సాబిర్ ఉన్నాడు. సాబిర్‌ను ‘పద వెళ్దాం’ అన్నాడు మియ్యా. సబ్జీ బాగ్ వెళ్ళాలి తను! అక్కడ గోదాము పెట్టుకోవడానికి ముందే ఎవరితోనో మాట్లాడాడాయన. సాబిర్ అతని వెంట ఇప్పుడు రాననేశాడు, తల తిరుగు తోందని చెప్పి.

‘నాకు తెలుసు, నువ్విలా చేస్తావని! నువ్విలాంటివాడివని తెలిసే నిన్ను చేరదీశాను నాయనా!! ఈ రోజు నాకు అవసరమొచ్చినప్పుడు తల తిప్పేసుకుంటున్నావ్. అన్నీ అర్థమౌతూనే ఉన్నాయి నాకు! ఒరే ఫజ్లూ!! నువ్విలా చేస్తావని అనుకోనేలేదు నేను!’ పళ్ళు నూరుతూ అన్నాడు సత్తార్ మియ్యా.

‘మేము నీకేమన్యాయం చేశాం? మమ్మల్ని దేనిలోనూ ఇరికించకు.’ ఫజ్లూ ఎదురుతిరిగాడు.

‘హు.. ఇంతైనా నోట్లో సీసం పోసుకుని కూర్చున్నట్టు కూర్చున్నారు మీరిద్దరూ! ఒక్క మాటైనా నా తరఫున మాట్లాడారా? నాకూ అంతా అర్థమౌతూంది. గోదాము ఇక్కడినుంచీ వెళ్తోంది, నేను కాదు. మీ గుండెలమీదే కూర్చుని ఉంటారా నా కొడకల్లారా!!! సమయం రానీ, అప్పుడు చెబుతా యీ సత్తార్ మియ్యా సత్తా ఏంటో!!’ ఫజ్లూతో అని, కాళ్ళు నేలకేసి కొడుతూ వెళ్ళిపోయాడు సత్తార్ మియ్యా.

ఈ రోజు సాబిర్, ఫజ్లూల ఆట కట్టించటానికి తగిన తీరికలేదాయనకు! ఈ వారం పీర్ ముహానీ నుండీ సరుకు తరలిస్తానని మాటిచ్చాడు. కాబట్టి ఎలాగైనా గోదాము కోసం స్థలం వెదకాలి. సరుకు తరలించే ఏర్పాట్లు చేయాలి. సాబిర్‌తో కూడా సంబంధం తెంచేసుకోవాలనీ, సాయంత్రం మళ్ళీ ఇక్కడికొచ్చి, పైసా పైసా వసూలు చేసుకోవాలనీ అనుకున్నాడు సత్తార్ మియ్యా. అడ్వాన్స్ చాలానే తీసుకున్నాడు వెధవ! డబ్బంతా తిరిగి ఇచ్చేసి, అప్పుడు పని మానుకోమనాలి. డబ్బుంటే, మనిషి విలువ తెలీదు. సాబిర్‌కు కళ్ళు నెత్తికెక్కాయి. దేనికీ పనికిరాడు కానీ పొగరు మాత్రం ఎక్కువే! ఈ గండం గడిచిన తరువాత, సాబిర్ మియ్యా కు బుద్ధి చెప్పాలి.’

సత్తార్ మియ్యా అటూ ఇటూ తెగ తిరుగుతున్నాడు. గోదాము కోసం స్థలం దొరికింది కానీ, అందులో చర్మాలుంచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అంతా చేసుకునేందుకు ఒక వారం పడుతుంది. ఈ గోదాములో సరుకేమీ లేదు కానీ వేరే సామానుంది. కబ్రిస్తాన్ వాళ్ళూ గోదాములో ఏవేవో చెత్తా చెదారమూ చేర్చారు, దాన్నీ తీసేసి, శుభ్రం చేసుకుని, ఉండేందుకు వీలుగా చేసుకోవాలి. ఇక మీదట ఇక్కడే ఉండి, రసీదన్‌ను ఎదురుదెబ్బ తీయాలని అనుకున్నాడు సత్తార్ మియ్యా. సరిగ్గా ఇదే సమయానికి సాబిర్ చెయ్యి వదిలేశాడు. అందుకే ఇప్పుడు దిక్కు తోచటం లేదాయనకు! డబ్బులు వసూలు చేసేందుకు కూడా వేరేవాళ్ళను చూసుకోవాలిక!! ఈ రోజుల్లో నమ్మకమైన మనిషి దొరకటం కష్టం! ఏమాట కామాటే చెప్పుకోవాలి! సాబిర్ యీ విషయంలో నమ్మకస్థుడే! డబ్బు విషయంలో ఎలాంటి లోపమూ ఉండదు. గట్టిగా నిట్టూర్చాడు సత్తార్ మియ్యా,’ఇంక ఆలోచించకూడదు. అమీనా విషయంలో సాబిర్ దూరమైపోతున్నాదు. వాడికి తెలుసు, నేను కూడా అమీనా కోసం చొంగ కారుస్తున్నానని! ఎన్ని తిట్లు తిట్టాలో తిట్టేశా.. ఇంక వాడి భుజమ్మీద నిమిరి, దారిలో పెట్టుకోవాలంతే!!’

***

ఫజ్లూ, సాబిర్ లతో సత్తార్ మియ్యా మాటా మాటా అనుకుంటూ ఉన్నప్పుడు రసీదన్, కబ్రిస్తాన్ గేట్ దగ్గర నిలుచుని వాళ్ళ మాటలు విన్నది. ఫజ్లూ గదిలోకి సత్తార్ మియ్యా వెళ్ళాడని తెలియగానే, మెల్లిగా వచ్చేసిందక్కడికి! సత్తార్ మియ్యా బైటికి వస్తున్నాడని పసిగట్టి చాటుకు వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళి అక్కడ జరిగిన దంతా అమీనాకూ, చున్నీకీ చెప్పేసింది. బలం తక్కువైనా ధైర్యం వదలకూడదు. ‘నాదగ్గరికొచ్చి మాట్లాడలేడు. నేనైతే దీటుగా చెబుతా జవాబు!’ అంది.

‘నిన్నసలు పట్టించుకోడు. అరుస్తావ్, తరువాత తల కొట్టుకుని ఊరికే ఉండిపోతావు. నాతో పెట్టుకోమను, వాడి నాటకాలన్నీ తెలుసు నాకు!’ కళ్ళు వంకర చేసి అమీనా వైపోసారి చూసింది చున్నీ, మళ్ళీ కళ్ళు తిప్పేసింది, అమీనా ఏమైనా అంటుందేమో చూద్దామని!

అమీనా ఊరికే ఉంది. చున్నీ ఎలా ఉడికిస్తుందో తెలుసామెకు! అందుకే తన పని తాను చేసుకుంటూ ఉందంతే! చున్నీ వైపు చూడలేదు, అమ్మ మాటలకు జవాబూ ఇవ్వలేదు. అన్నీ వింటూ చెవిటి దానిలా, అన్నీ తెలిసీ ఏమీ తెలియని దానిలా! ఈ లోపల, అమ్మ ఇచ్చిన ధైర్యంతో చున్నీ ఆకాశంలో విహరిస్తూందని అమీనాకు తెలుసు. ఎవరంటే భయమో, చున్నీ పగ్గాలెవరి చేతుల్లో ఇన్ని రోజులూ ఉన్నాయో, వాళ్ళే అండగా ఉంటే,వాళ్ళే పగ్గాలు వదులు చేసేస్తే ఇంక ఆకాశంలో ఎగరదూ? తుఫాన్ వస్తే అప్పుడు తెలుస్తుంది చున్నీ రాణీగారికి! అమీనాకైతే సాబిర్ గురించి మాత్రమే చింత. సత్తార్ మియ్యా ఏదైనా చేస్తే, అప్పుడు తను కూడా మౌనంగా ఉండదు. పీర్ ముహానీ జనం కూడా సాబిర్‌ను ఆదుకోలేనంత దుర్మార్గులు కాదు. సాబిర్ కూడా ఇక్కడే పుట్టి పెరిగాడు. అతని స్వభావమేమిటో అందరికీ తెలుసు. మందు అలవాటు తప్ప మరే దురలవాటూ లేదు కూడా!! మందు తాగి వీధిలో ఎప్పుడూ ఎవరితోనూ కొట్లాడలేదు, గొడవా చెయ్యలేదు. సాబిర్ పని గురించి ఎటువంటి చింతా లేదామెకు! అంతా సరిచేసుకుని తన జీవితాన్ని నడుపుకోగల నైపుణ్యం సాబిర్‌కు ఉంది. సత్తార్ మియ్యాతో యీ సంబంధం ఉండకపోయి ఉంటే యీ తాగుడు అలవాటు కూడా దగ్గరికి వచ్చేది కాదు. సత్తార్ మియ్యాతో సంబంధం ఇప్పటికైనా తెగిపోతే మంచిది. అమీనా మనసులోనే అల్లాను ప్రార్థించింది, ‘దయ పెట్టు దేవుడా! ఈ దొంగవెధవ నుండీ తప్పించు సాబిర్ ను!’ అని!

ఫజ్లూ ముంగిటిలోకి వచ్చాడు.

అక్కడికతను వచ్చేది తక్కువే.

తన గదిలోనే ఉంటాడెప్పుడూ! రసీదన్ లేదా అమీనా -ఎవరో ఒకరు భోజనం కూడా తెచ్చిపెడతారక్కడికే! ఇద్దరక్కచెల్లెళ్ళూ దెబ్బలాడుకుని ఆకాశమూ, భూమీ ఒకటి చేస్తున్నప్పుడో, రసీదన్‌కు ఆరోగ్యం బాగా లేనప్పుడో మాత్రమే వస్తాడిలా! రసీదన్ ముంగిట్లో కూర్చుని ఉంది. వీపుమీద ఎండ పడుతూ ఉందామెకు! ఫజ్లూ ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు, ‘సత్తార్ మియ్యా వచ్చాడు. సాబిర్‌ను బెదిరించి వెళ్ళాడు. ఆయన వెనక నిలబడలేదని నన్నూ కోప్పడ్డాడు. నువ్వే యీ వీధిలో వాళ్ళను గోదాము ఖాళీ చేయించేందుకు పురికొల్పావని అనుకుంటున్నాడు.’

‘నేను వింటూనే వున్నానంతా దగ్గర నిల్చుని! నాతో మాట్లాడలేదే ఆ నీచుడు? ముఖం పచ్చడి చేసేసేదాన్ని. మాట్లాడకుండా ఉన్నావని అంటున్నాడే, అసలు నీకేంటి భయం? నోటికి పక్షవాతమొచ్చిందా, అసలు కదల్లేదు? వాడి పీక పిసికేయ వలసిందప్పుడే!! నాకు చెప్పేందుకొచ్చావా? ఇదంతా నా నుదుటి రాత ఆటలే!! బుద్ధి ఎటుపోయేలా చేశాడో ఆ దేవుడు, తప్పు చేసి కూర్చున్నాను!’ రసీదన్‌లో ధైర్యం తగ్గిపోయింది.

‘ఇదిగో, ఇప్పుడింక నీ ఏడుపు మొదలు! ఇదిగో నేనిప్పుడే చెబుతున్నా, యీ రోజు తరువాత సత్తార్ మియ్యా మన ముంగిటిలోకి జొరబడ రాదు, మీ ముగ్గురూ తెలుసుకోండి. నా గదిలోకొస్తే నేను చూసుకుంటా నతగాని సంగతి! రాకపోకలు బంద్! గోదాము లోనుంచీ లోపలికొచ్చే దారుందే, దాన్ని బంద్ చేసేస్తాను, వెదురు గోడలతో! తరువాత కమిటీ వాళ్ళకు చెప్పి, మొత్తం మూయించేద్దాం. అంతే!’ ఫజ్లూ తన నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయాడు.

ముంగిట్లో కూర్చుని ఉన్న రసీదన్ అతని మాటలు మౌనంగా వింటూ ఉంది. అతడు వెళ్ళిపోగానే పెద్దపెట్టున ఏడవటం మొదలెట్టింది. మీ ముగ్గురు.. అనేసరికి, ముందు చున్నీకి పిడుగుపడ్డట్టైంది. కానీ తనను తాను సంభాళించుకుని, యీ విషయంలో తనను కూడా లాగటాన్ని సహించింది. అమీనాకు అర్థమైంది, ఫజ్లూ గురి తనమీదనే అని! సత్తార్ మియ్యా ఇక్కడికి వచ్చి వెళ్తుండటానికి తనే కారణమని అందరికీ అనిపిస్తూనే ఉంది. చున్నీ ఐతే దండోరా వేసేస్తూ ఉంటుందిలాగే!! అమ్మకు కూడా??

ఏడుస్తున్న రసీదన్‌ను చున్నీ సముదాయిస్తున్నది, తన దుపట్టాతో కళ్ళు తుడుస్తూ! అమీనా అక్కడే నిలుచుని ఉంది. ఇదివరకు దీనికి పూర్తిగా విరుద్ధంగా జరిగేది. అమీనా అమ్మను సముదాయిస్తుంటే, చున్నీ దూరంగా ఎక్కడో కూర్చుని ఉండేది, లేదా లేచి బైటికి వెళ్ళిపోయేది. చలికాలపు ఎండ మధ్యాహ్నానికి తగ్గేలా, రసీదన్ ఏడుపుకూడా నెమ్మదిగా తగ్గిపోయింది.

***

రాత్రయింది. సబ్జీ బాగ్ నుండీ వచ్చేటప్పుడు, సత్తార్ మియ్యా జం జం హోటల్ నుండీ కబాబ్, మటన్ కరీ, శకూర్ మియ్యా హోటల్ నుండీ ముగ్గురికోసం ఖమీరీ రోటీ ప్యాక్ చేయించి తీసుకుని రిక్షాలో పీర్ ముహానీకి వచ్చాడు. కబ్రిస్తాన్ గేట్ దగ్గర దిగి ఫజ్లూ గది తలుపులు తట్టాడు. తలుపు తెరుచుకుంది. ఫజ్లూ, సాబిర్ ఇద్దరూ మొబైల్‌లో ఏదో సినిమా చూస్తున్నారు. ఉన్నట్టుంది సత్తార్ మియ్యా రావటంతో ఆశ్చర్యపోయారు.

‘కళ్ళు చించుకుని ఏమి చూస్తున్నారిద్దరూ? రండి, పట్టుకోండి..’ చేతిలోని పాలిథిన్ సంచీని ముందుకు చాపుతూ అన్నాడు సత్తార్ మియ్యా.

ఫజ్లూ చెయ్యి ముందుకు చాపి సంచీ అందుకున్నాడు. సత్తార్ మియ్యా జేబులోనుంచీ నోట్లు తీస్తూ సాబిర్‌తో అన్నాడు, ‘భూలోటన్ దగ్గరినుంచీ పాకెట్లు తీసుకురా!’

‘నేనెళ్ళను. నేను తాగటం మానేశాను.’ పుల్ల విరిచినట్టు సమాధానమిచ్చాడు సాబిర్.

‘ఎప్పటినుంచీరా భోసడీకే? నీకు బాగా పొగరెక్కింది. నిన్నూ..’ మాటలు మధ్యలోనే ఆపేసి సత్తార్ మియ్యా బైటికెళ్ళి, వచ్చేటప్పుడు తన జేబులో నాలుగు క్వార్టర్ పాకెట్లు తీసుకుని వచ్చాడు. మద్యం నిషేధించిన తరువాత, బాటిల్ పూర్తి దొరకటమే లేదు. ఇప్పుడు క్వార్టర్లదే హవా!!

ఇదివరకటిలాగే కూర్చున్నారు ముగ్గురూ!

ఫజ్లూ గదిలో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. గ్లాసులూ, కుండలో నీళ్ళూ అన్నీ! కబాబ్‌తో మొదలుపెట్టారు. మందు తరువాత మటన్ షోర్బాలో ఖమీరీ రోటీలు అద్దుకుని తిన్నారు. అన్నీ మునుపటిలాగే జరిగిపోతున్నాయి కానీ మాటలే లేవు. మధ్య మధ్య సత్తార్ మియ్యా మాటలు పొడిగించాలని చూసినా ఫజ్లూ, సాబిర్ ఇద్దరూ తుంచేస్తున్నారు. ఇద్దరూ ఆయననుంచీ చూపులు మళ్ళించి, గప్‌చిప్‌గా ఉండమని సైగలు చేసుకుంటూ కళ్ళ భాషలో మాట్లాడుకుంటూ ఉన్నారు. సత్తార్ మియ్యాకు అంతా అర్థమౌతూనే ఉంది.

తినటం తాగటమయ్యాక లేస్తూ సత్తార్ మియ్యా సాబిర్‌తో, ‘సబ్జీ బాగ్‌లో గోదాము మాట్లాడి వచ్చా. కొంచెం పని చేయాల్సి ఉందందులో! రేపటినుంచీ రాజ్ మేస్త్రీ వస్తాడు. మూడు రోజులౌతుంది పని పూర్తయేసరికి! పొద్దున వచ్చెయ్. కలిసి వెళ్దాం. నీవే పని చేయించాలి.’

సాబిర్ మౌనంగా ఉన్నాడు. ఆయనకేసి చూడను కూడా లేదు.

‘మాట్లాడావెందుకు? మూగవాడివైపోయావా రా? జీవితం ఇలాగే నడవదు నాయనా! ఎత్తుపల్లాలుంటాయ్. ముఖం ముడుచుకుని కూర్చుంటే పనులు జరగవు తండ్రీ!’ సత్తార్ మియ్యా గొంతులో మెత్తదనం.

‘నీతో నాకేమీ గొడవ లేదు. ఇప్పుడింక ఎవరినైనా వెదుక్కో!’ సాబిర్ గొంతు మారిపోయింది. మద్యం ప్రభావం వల్ల గొంతు భారీగా కఠినంగానూ ఉంది.

సత్తార్ మియ్యాకు నోట మాట రాలేదు కాసేపు! తరువాతాయన ఫజ్లూతో అన్నాడు, ‘ఫజ్లూ, నువ్వైనా వీడికి నచ్చజెప్పు. ఎటూ కాకుండా పోతాడు వెధవ! ఈ పనికిరాని వాణ్ణి నేనే మొయ్యాలిక.’

‘మధ్యలో నన్నిరికించకు. నాకెటువంటి సంబంధమూ లేదు దీనితో! ఒక మాట చెవులు తెరుచుకుని విను. ఈ రోజు తరువాత, యీ గదిలో కలవటం బంద్. లోపలికి వచ్చి వెళ్ళటమూ బంద్. సాబిర్‌తో నీ గొడవ, సాబిర్ తోనే తేల్చుకో!’ ఫజ్లూ మాటలు వింటుంటే, తన మీద రాళ్ళ వాన కురుస్తున్నట్టే ఉంది సత్తార్ మియ్యాకు!

కాసేపు మాట్లాడలేదు సత్తార్ మియ్యా. తరువాతన్నాడు, ‘ఓహో, నువ్వే ఇతణ్ణి ఆడిస్తున్నావన్నమాట! మంచిది కాదు ఫజ్లూ! ఈ గోదాము ఇక్కణ్ణించీ వెళ్తూంది, నేను కాదు. మీ ఇద్దరినీ..!’

‘బెదిరించవద్దు. పొద్దున ఏమీ మాట్లాడకుండా విన్నాం. కానీ ప్రతిసారీ నువ్వు చెప్పేదిలాగే మూగగా వింటూ ఉంటామనుకోకు.’ సత్తార్ మియ్యా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతూ, ఫజ్లూ తన చేతి కర్ర సాయంతో నిలబడ్డాడు.

సాబిర్, సత్తార్ మియ్యానే చూస్తూ నిలబడ్డాడు. తాను తెచ్చిన తిండి తిని తన మీదే దాడి చేస్తారని సత్తార్ మియ్యా ఊహించనైనా లేదు. మత్తంతా ఒక్కసారి దిగిపోయింది. ఒక్క క్షణం దిగ్భ్రాంతితో నిలబడి పోయాడు. తరువాత, ఒక్క ఉదుటున గది తలుపులు తెరిచి బైట పడ్డాడు. బైట రసీదన్ నిలబడి ఉంది. ఆమెను చూసి హుంకరించి, బైటికెళ్ళిపోయాడు.

సత్తార్ మియ్యా బైటికి వెళ్ళిపోగానే గదిలోకొచ్చి అడిగింది రసీదన్. ‘ఇక్కడేమౌతూంది?’

‘ఏది కావాలో అదే అయింది’ సాబిర్ స్పష్టంగా చెప్పేశాడు, ఇంక తను సత్తార్ మియ్యా దగ్గర పని చెయ్యనని! ‘నేను కూడా చెప్పేశా, ఈ రోజు తరువాత యీ గదిలోకి రాకు, అని!’ ఫజ్లూ అన్నాడు.

కింద పరచిన కంబళ్ళను చూస్తూ రసీదన్ అడిగింది, ‘మరివన్నీ?’

‘తాను తెచ్చిన తిండి తిని తోకూపుతూ ఉంటామనుకున్నాడు సత్తార్ మియ్య. అందుకే అన్నీ తీసుకుని వచ్చాడు. మేమూ అనుకున్నాం ‘ఈ రోజు తిందాం ముందు. తరువాత సమాధానమిద్దామని.’

‘ఇక మీదట, యీ దుర్మార్గుడు తెచ్చిందేమైనా తింటే.. ఉంది మీ పని! వీడిమీద నమ్మకముంచకూడదు. మీ నాన్న..’ మాట్లాడుతూ మాట్లాడుతూ, గొంతు పూడుకుపోయింది రసీదన్‌కు! గుండెలో ఒక జలదరింపు! ఒళ్ళంతా పాకింది. వెనక్కి మళ్ళి గదిలోనుంచీ బైటికి నడిచింది.

రాత్రి చాలా పొద్దు పోయింది.

సత్తార్ మియ్యా బైటికెళ్ళి నడుస్తూ నాలుగో వీధిలోకి తిరిగిపోయాడు.

రసీదన్ దాతా పీర్ మనిహారీ సమాధి దగ్గర బ్రతిమాలుతూ కూర్చుని ఉంది, ‘మా మీద దయుంచు దాతా పీర్! నీ చాకిరీ చేస్తున్నాం. మమ్మల్ని కాపాడు.’

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here