రాంభాయమ్మ – రుబ్బురోలు

0
3

[శ్రీ ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి రచించిన ‘రాంభాయమ్మ – రుబ్బురోలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]గాం[/dropcap]ధీబొమ్మల సెంటర్లో కొబ్బరిబొండాలు తాగుతున్నారు గుర్నాధం, విశ్వనాధం. వారి ముందునుండి ఒక స్కూటీ వెళ్ళింది. అది చూసిన గుర్నాధం కొబ్బరిబోండాం కింద పడేసి “ఒరేయ విస్సీ పద పద” అన్నాడు.

కొబ్బరిబోండాం కాలిమీద పడడంతో, బాత్రూంలో బల్లిని చూసి “కెవ్వు” మని అరిచిన పడుచుపిల్లలా, “అబ్బా” అని మూలిగాడు విశ్వనాధం. వెంటనే అతని చేతిలోని కొబ్బరిబోండాం తనే కింద పడేసి, మిత్రుడిని స్కూటర్ దగ్గరకు లాక్కుపోయాడు గుర్నాధం.

“ఏమైందిరా నీకు?” అన్నాడు విశ్వనాధం ఒంగుని కాలిని రాసుకుంటూ.

“నాకేం కాలేదు. నీకే పెళ్లి అయ్యే శుభ ఘడియ వచ్చేసింది” అన్నాడు గుర్నాధం స్కూటర్ స్టార్ట్ చేసి. వెంటనే గజంబద్దలా నిటారుగా నిలబడి “నిజంగానా!” అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా విశ్వనాధం.

“నీ హావభావాలు తర్వాత. ముందు బండి ఎక్కు. ఆలస్యం అయితే, ఆ అతిలోక సుందరి మాయమయిపోతుంది” అన్నాడు గుర్నాధం. వెంటనే ఎగిరి స్కూటర్ ఎక్కాడు విశ్వనాధం. ‘ఇస్రో’ వారు ప్రయోగించే రాకెట్ స్పీడ్‌లో స్కూటర్ పరిగెత్తించాడు గుర్నాధం. మూడు నిముషాలలో మినర్వా టాకీసు ముందుగా వెడుతున్న స్కూటీని సమీపించాడు గుర్నాధం. స్కూటీ మీద వెనక కూర్చున్న యువతి ఫోన్ చూసుకుంటోంది. యువకుడు నెమ్మదిగా స్కూటీ నడుపుతున్నాడు.

గుర్నాధం చెప్పినట్టు ఆ యువతి చాలా అందంగా బంగారు రంగులో మెరిసిపోతోంది. అయితే ఆ యువతి, అతని వెనుక కూర్చోకుండా, ‘రివర్సు’లో రోడ్డ్డు వైపు తిరిగి కూర్చుని ఉంది. ఆ దృశ్యం చూడటానికి వింతగా ఉంది.

ఈ మధ్యనే చూసిన ‘రాధాగోపాలం’ సినిమా గుర్తుకువచ్చింది.

“ఇదేమిటిరా గుర్రూ, విడ్డూరంగా ఉంది” అన్నాడు విశ్వనాధం, ఆ యువతి అందాన్ని మైమరిచి చూస్తూ.

“విడ్డూరం కాదురా బడుద్ధాయ్, నీ రొట్టె విరిగి ‘తేనె పాకం’ గిన్నెలో పడిందిరా” అన్నాడు గుర్నాధం, స్కూటర్ నెమ్మదిగా వారి వెనకే నడిపిస్తూ. మిత్రుడి మాటకి రాజమండ్రి గోదావరిలో పున్నమి నాడు పడవలో తిరిగినంత ఆనందం కలిగింది విశ్వనాధానికి.

“నిజమా?” మిత్రుడి భుజం నొక్కుతూ అడిగాడు విశ్వనాధం.

“అవును. వాళ్ళు ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చాయి. అందుకే స్కూటర్ మీద అలా ‘రివర్సు’లో కూర్చున్నారు. వాళ్ళు ఆగగానే నువ్వు, తోటరాముడిలా ఆ సుందరి ముందు వాలిపోయి నీ ప్రేమ వ్యక్తీకరించు. పని జరుగుతుంది. పెళ్లి మండపంలో డోలూ సన్నాయి మోగుతాయి” అన్నాడు గుర్నాధం. ఎందుకంటే మిత్రుడిని ఒక ఇంటివాడిని చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు గుర్నాధం. రెండు నిముషాలు గడిచేసరికి సూపర్ బజార్ ముందు ఆగింది స్కూటీ. యువతీ, యువకులు ఇద్దరూ స్కూటీ దిగి సూపర్‌బజార్ లోకి వెళ్ళారు. వాళ్లకి కొద్దిదూరంలోనే స్కూటర్ ఆపాడు గుర్నాధం. ఇద్దరూ కిందకి దిగారు.

“ఒరేయ్ విస్సీ, ఆ సుందరిని చూసావుగా. కాళ్ళకి మెట్టెలు లేవు. అంటే ఇంకా పెళ్లి కాలేదన్న మాట. నువ్వు ధైర్యంగా లోపలకి వెళ్లి ఆ అమ్మాయికి నీ బయోడేటా చెప్పి, ప్రపోజ్ చెయ్యి. నేను కొంచెం దూరంగా ఉండి చూస్తాను. వెళ్లి, కన్యాలాభంతో తిరిగిరా” అన్నాడు గుర్నాధం. మిత్రుడి మాటలు వినగానే గాంధీబొమ్మల సెంటర్లో ఏనుగు మీద ఊరేగినంత సంతోషం కలిగింది విశ్వనాధంకి. తన కంటే ఆర్నెల్లు పెద్ద అయిన గుర్నాధానికి దణ్ణం పెట్టి, జేబులోంచి దువ్వెన తీసి క్రాఫ్ దువ్వుకుని లోపలకి వెళ్ళాడు.

స్కూటీ సుందరి, ఒక ట్రాలీ తోసుకుంటూ తనకి కావాల్సిన సరుకులు తీసుకుని అందులో వేసుకుంటూ ముందుకు నడుస్తోంది. ఆమెని దగ్గరగా చూసిన విశ్వనాధం ఆమె అందానికి మరోసారి ‘ఫిదా’ అయిపోయాడు. ఆమె ఇంకో మలుపు తిరిగి రాక్ లోంచి కందిపప్పు పేకెట్ తీస్తోంది. అక్కడ ఎవరూ లేరు. ఇదే మంచి తరుణమని, పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ లోంచి ఒక ప్లాస్టిక్ గులాబీ తీసుకుని ఆమె ముందు నిలబడి “ఎక్స్యూజ్ మీ మేడం” అన్నాడు విశ్వనాధం. సుందరి ఇటు తిరిగి ‘ఏమిటి’ అన్నట్టు చూసింది.

“నా పేరు ఎం.ఎస్. విశ్వనాధం. ఓ మల్టీ నేషనల్ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నా పేకేజీ అరవై లక్షలు..” సాధ్యమైనంత మృదువుగా చెబుతున్న అతని మాటలకి అడ్డుతగిలి “ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు?” అని అడిగింది సుందరి.

“మీకు పెళ్లి కాలేదని తెలిసింది. మిమ్మల్ని నేను చాలా ఇష్టపడుతున్నాను. దయచేసి నా ప్రేమని అంగీకరించండి” అని మోకాలుమీద కూర్చుని ప్లాస్టిక్ రోజా పువ్వు ఆమె ముందు ఉంచాడు విశ్వనాధం. అతన్ని అలా చూడగానే సుందరికి నవ్వు వచ్చింది. తన ‘బూరె’ నేతి గిన్నెలో పడుతోందని ఆనందించాడు విశ్వనాధం. కానీ క్షణంలో వెయ్యోవంతులో ఆమె “ప్రకాష్ ఓ సారి ఇలా రా” అని గట్టిగా పిలిచింది. కౌంటర్ దగ్గర కూర్చుని వాట్స్ అప్ చూస్తున్న యువకుడు నెమ్మదిగా నడుస్తూ ఆమె దగ్గరకి వచ్చి, విశ్వనాదాన్ని ‘ఆ పొజిషన్‌లో’ చూసి ఆశ్చర్యపోయాడు.

“చూడు ప్రకాష్. నాకు పెళ్లి కాలేదని తెలిసిందట. నాకు ప్రపోజ్ చేస్తున్నాడు” అంది చిన్నగా నవ్వుతూ. ప్రకాష్ కూడా నవ్వాడు. “చూడు మిస్టర్, ఆమెకి పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు?” అని అడిగాడు ప్రకాష్.

“నా సిక్స్త్ సెన్స్ సార్. మేడం కాళ్ళకి మెట్టెలు లేవు. పైగా ఆమె మీకు రివర్సులో కూర్చున్నారు. అంటే మీ ఇద్దరికీ ప్రేమలో భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. అందుకే ఆలస్యం చేయకుండా మేడం ముందు వాలిపోయాను. మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేయండి. నాకు అమలాపురంలో పది ఎకరాల పొలం, అయిదు ఎకరాల కొబ్బరితోట ఉంది. మా నాన్నకి నేను ఒక్కడినే కొడుకుని. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. నా పేకేజీ అరవై లక్షలు. ప్లీజ్ హెల్ప్ మీ సార్” అన్నాడు విశ్వనాధం, ప్రకాష్ కేసి తిరిగి.

“ఇదిగో నిన్ను అలా చూడలేకపోతున్నాను. లేచి సరిగా నిలబడు” అన్నాడు ప్రకాష్. వెంటనే విశ్వనాధం లేచి నిలబడ్డాడు. “సార్..” అన్నాడు దీనంగా ప్రకాష్ కేసి తిరిగి.

“నేను ఈ విషయంలో నీకు ఏం చేయలేను” అన్నాడు పెదవి విరిచి ప్రకాష్. సుందరి నవ్వుతోంది.

“ఎందుకని సార్?” ఇందాకటి కన్నా దీనంగా అడిగాడు విశ్వనాధం.

“ఎందుకంటే.. ఆవిడ నా భార్య కనుక” అన్నాడు ప్రకాష్ చిరాగ్గా. అతని మాటలకి, చేతిలోని పీచు మిఠాయి పక్క కుర్రాడు లాగేసుకుంటే బిక్క చచ్చిపోయిన పిల్లాడిలా తల్లడిల్లిపోయాడు విశ్వనాధం. ఈసారి సుందరి కేసి చూసాడు దీనంగా.

“చూడండి విశ్వనాధం గారు నాకు పెళ్లి అయింది. ఈయనే నా భర్త. కాళ్ళకి మెట్టెలు ఎందుకు పెట్టుకోలేదంటే, కాలి వేళ్ళు దురదగా ఉండి. ఇంక స్కూటీ మీద రివర్సులో ఎందుకు కూర్చున్నానంటే, ఈ ప్రభుద్దుడి టీ షర్టు చెమట కంపు కొడుతోంది. అందుకని అలా కూర్చున్నాను. ఇవన్నీ మీకు చెప్పాల్సిన పని నాకు లేదు. మీ చెంప ‘చెళ్ళు’ మనిపించి వెళ్లిపోవచ్చు. కానీ మీ అమాయకమైన మొహం చూసి ఇదంతా చెప్పాను. ఇలా ఎవరి వెంటా పడకండి. అందరూ నాలా సాఫ్ట్‌గా ఉండరు. హార్డ్‌వేర్ అమ్మాయిలు ఉంటారు. మ్యారేజ్ బ్యూరో వాళ్ళని పట్టుకుని ఏదైనా సంబంధం చూసుకోండి. బెస్ట్ అఫ్ లక్” అని ప్రకాష్‌తో కలిసి కౌంటర్ దగ్గరకు వెళ్ళింది సుందరి.

ప్లాస్టిక్ రోజా పువ్వు ఫ్లవర్ వాజ్ లో పెట్టి, తలవంచుకుని బయటకు వచ్చాడు విశ్వనాధం. ప్రకాష్, సుందరి దగ్గరకు రాగానే ‘ఇదేదో గొడవ జరిగే ప్రమాదం’ ఉందని గబ గబా స్కూటర్ దగ్గరకి వచ్చి నిలబడ్డాడు గుర్నాధం. ఇద్దరూ కలిసి విశ్వనాధం ఉంటున్న డాబా ఇంటికి వచ్చారు. జరిగినది తెలుసుకుని మిత్రుడిని ఓదార్చాడు గుర్నాధం.

“మిత్రమా, ఒకసారి ఓడిపోయామని దిగులు పడకూడదు. ఇంగ్లీష్ వాడు ఏమన్నాడు? ట్రై అండ్ ట్రై అన్నాడు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది” అన్నాడు గుర్నాధం, ఫ్రిజ్ లోంచి కేడ్బారీ పెద్ద చాక్ లేట్ తీసుకుని పర పరా నముల్తూ. అది పూర్తికాగానే, దమ్స్ అప్ తీసుకుని తాగి ‘బ్రేవ్’ మని తేన్చి ‘వస్తానురా విస్సీ’ అని వెళ్ళిపోయాడు.

***

రాత్రి విశ్వనాధం బామ్మ ఫోన్ చేసింది ‘ఎలా ఉన్నావురా విశ్వం’ అని. బామ్మ గొంతు వినగానే ‘ఘోల్లు’ మన్నాడు విశ్వనాధం. కంగారుగా “ఏమైంది నాన్నా, వంట్లో బాగుందలేదా?” అడిగిడి బామ్మ.

“నేను బాగానే ఉన్నాను బామ్మా. నాకే పెళ్లి యోగం లేదని భయంగా ఉంది. మ్యారేజ్ బ్యూరో లిస్టు లో ఏ అమ్మాయికి ఫోన్ చేసినా, విడిగా కాపురం ఉండాలని, విల్లా ఉండాలని, కారు ఖచ్చితంగా ఉండాలని ‘గొంతెమ్మ’ కోరికలు కోరుతున్నారు. ఏం చేయాలో తోచడంలేదు” అన్నాడు విశ్వనాధం. రెండు నిముషాలు ఆలోచించింది బామ్మ. తను రంగంలోకి దిగితే కానీ సమస్య పరిష్కారం కాదని నిర్ణయించుకుంది.

“విశ్వం, నువ్వు బెంగ పెట్టుకోకు. రేపు ఉదయానికి నీ దగ్గర ఉంటాను” అని ఫోన్ కట్ చేసింది బామ్మ. ‘బామ్మా..’ అంటూ ఏదో చెప్పబోయాడు విశ్వనాధం. కానీ అప్పటికే ఫోన్ కట్ అయ్యింది.

మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకి విశ్వనాధం ఇంటి బెల్లు మోగింది. తలుపు తీసేసరికి ఎదురుగా బామ్మ.

ఆశ్చర్యపోయాడు విశ్వనాధం. “ఎలా వచ్చావ్?” అడిగాడు. “అమలాపురం నుండి వచ్చే ఆఖరి బస్సులో వచ్చాను” అంది బామ్మ. “రిజర్వేషన్ ఎలా దొరికింది?” ఆసక్తిగా అడిగాడు.

“నాకు రిజర్వేషన్ ఎందుకురా, డ్రైవర్ వెనకాల సీట్‌లో కూర్చుని వచ్చేసాను” అంది బామ్మ, సామానులు లోపల పెడుతూ. అవును. బామ్మ ఘటికురాలు. సంక్రాంతికి ఒక సారి రిజర్వేషన్ దొరక్కపోతే, బస్సు స్టాండ్‌కి వచ్చి డ్రైవర్‌తో దెబ్బలాడి, అతని వెనకాల ఉండే పొడవాటి సీట్‌లో తనని ఎక్కించి పంపించింది. పాపం రెండవ డ్రైవర్ బోనేట్ మీద కూర్చున్నాడు. బయటకు వెళ్లి పాలు, పెరుగు, కూరలు తెచ్చాడు విశ్వనాధం. బామ్మ పేరు రాంభాయమ్మ. ఆవిడకి ఒక్కడే కొడుకు శంకరరావు. విశ్వనాధం ఎనిమిదవ ఏట పొలం నుంచి వస్తూ పాము కరిచి చనిపోయాడు శంకరరావు. భర్త మీద బెంగతో ఏడాది తిరిగేసరికి పార్వతమ్మ కూడా తనువు చాలించింది. అప్పటినుండీ విశ్వనాధంకి తల్లీ, తండ్రీ తానే అయి, పెంచి పెద్దచేసింది రాంభాయమ్మ.

అమలాపురంలో భూపయ్య అగ్రహారంలో ఏ చిన్న తగాదా వచ్చినా, రాంభాయమ్మ గారే ‘తీర్పు’ ఇవ్వాలి. ఆమె మాట అందరికీ శిరోధార్యం. మంచి మాటకారి, లౌక్యం తెలిసిన మనిషి. అందుకే మగదక్షత లేక పోయినా సొంత వ్యవసాయం చేసి ఆస్తిని రెండింతలు చేసింది.

విశ్వనాధం ఆఫీస్‌కి వెళ్ళాకా తడి బట్టలు ఆరేయ్యడానికి డాబామీదకి వెళ్ళిన రాంభాయమ్మకి, పక్కింటి వారి బాదం చెట్టుకింద కనిపించిన ‘శాల్తీ’ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. బుజ్జిముండ ఎంత బాగుందో అని ముచ్చటపడింది. కిందకు వచ్చి వంట ముగించి, పక్కింటి వారి ఇంటికి వెళ్ళింది. తలుపు తీసిన వసుంధర ‘ఎవరండీ’ అని అడిగింది.

“నేను పక్కింట్లో వుండే విశ్వనాధం బామ్మని. మాది అమలాపురం.. లోపలకు రావచ్చా?” అని అడిగింది.

“అయ్యో లోపలకు రండి” అని ఆహ్వానించింది వసుంధర.

“మీ వారు ఏం చేస్తారు? పిల్లలు ఎంతమంది?” అడిగింది రాంభాయమ్మ సోఫాలో కూర్చుంటూ. ఆవిడ చొరవకి ఆశ్చర్యపోయినా, తర్వాత చిన్నగా నవ్వుకుంది వసుంధర.

“మావారు ఎ.జి. ఆఫీస్లో ఆడిటర్. మాకు ఒక్కత్తే అమ్మాయి. ఎం.ఏ. పాస్ అయ్యింది. జాబుకి ట్రై చేస్తోంది” అంది వసుంధర.

“నేను డైరెక్ట్‌గా విషయంలోకి వస్తాను. నాకు మిక్సీలో పచ్చళ్ళు ఇష్టం ఉండదు. మీ బాదం చెట్టుకింద రుబ్బురోలు చూసాను. మీరు వాడటం లేదని గ్రహించాను. నేను ఇక్కడ ఉన్న నాలుగు రోజులూ ఆ రుబ్బురోలు వాడుకోవచ్చా?” అడిగింది రాంభాయమ్మ.

“అయ్యో దానికేం భాగ్యం. మీరు వాడుకోవచ్చు. మీరు కాఫీ తీసుకుంటారా? మజ్జిగ ఇమ్మంటారా?” వినయంగా అడిగింది వసుంధర. “ఏం వద్దులే అమ్మా. మీ రుబ్బురోలు వాడుకోమన్నావ్, అది చాలు. వస్తాను” అని వచ్చేసింది రామ్భాయమ్మ. మర్నాడు ఉదయం పదిగంటలకు వసుంధర ఇంటికి వచ్చి బాదంచెట్టు కింద ఉన్న రుబ్బురోలుని శుభ్రంగా కడిగి బీరకాయ పచ్చడి చేసింది రాంభాయమ్మ. వెళ్ళేటప్పుడు చిన్న గిన్నెలో కొంచెం పచ్చడి తీసి వసుంధర కిచ్చింది. “ఎలావుందో రుచి చూసి రేపు నాకు చెప్పాలి” అని వెళ్ళిపోయింది.

రాత్రి భోజనాలప్పుడు శేషగిరికి బీరకాయ పచ్చడి వేసింది. అది తిన్న వెంటనే “ఇది నువ్వు చేసినది కాదు. చాలా రుచిగా ఉంది. ఎవరో ఇచ్చి ఉంటారు. ఎవరు?” అడిగాడు శేషగిరి భార్యని.

“పక్కనే ఉన్న డాబాలో ఉంటున్న విశ్వనాధం బామ్మగారు ఇచ్చారు. మన రుబ్బురోలు వాడుకుంటానన్నారు. అలాగే అన్నాను. పచ్చడి చేసుకుని వెళ్తూ, కొంచం పచ్చడి ఇచ్చారు. రుచి చూడమని” అంది వసుంధర.

“అదీ సంగతి. రోటి పచ్చడి అన్నమాట. అందుకే అంత రుచి. ఇంకొంచెం వెయ్యి” అని మళ్ళీ పచ్చడి కలుపుకుని తిన్నాడు శేషగిరి. అతనికి చాలా తృప్తిగా ఉంది. భోజనం అయ్యాకా చేయి కడుక్కుని “నా తరుపున బామ్మ గారికి ‘థాంక్స్’ చెప్పు” అని సావిట్లోకి వెళ్ళాడు టి.వి. చూడటానికి.

మర్నాడు ఉదయం రాంభాయమ్మ వచ్చి వంకాయ పచ్చడి చేసుకుంది. వెళ్తూ కొంచెం పచ్చడి చిన్న గిన్నెలో వేసి వసుంధరకి ఇచ్చింది. ‘నిన్న మీరు ఇచ్చిన బీరకాయ పచ్చడి మా వారికి వేసాను. తిని, చాలా రుచిగా ఉందన్నారు. మీకు థాంక్స్ కూడా చెప్పమన్నారు” అంది వసుంధర. రాంభాయమ్మ చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది.

యథాప్రకారం శేషగిరికి బామ్మ గారు ఇచ్చిన వంకాయ పచ్చడి వెయ్యడం, అతను తిని ఓహో అంటూ బామ్మ గారిని మెచ్చుకోవడం చూసి చిరాకుపడింది వసుంధర. “అంతేలెండి, నేను ఏం చేసినా మీకు నచ్చదు. పొరుగింటి పచ్చడి రుచి అన్నారు అందుకే” అని మూతిముడిచింది. పక్కనే ఉన్న వసుంధర కూతురు ప్రవల్లిక ‘ఏదీ నాకు వెయ్యి పచ్చడి. నేనూ చూస్తాను” అంది. వసుంధర వంకాయ పచ్చడి కూతురికి వేసింది. పచ్చడిలో నెయ్యి వేసి కలుపుకుని తింది ప్రవల్లిక. “అమ్మా, నాన్న అన్నట్టుగా పచ్చడి చాలా బాగుంది అమ్మా. నువ్వు కూడా నేర్చుకోకూడదూ” అంది.

“ఆ.. తండ్రీ, కూతురూ బాగానే తయారు అయ్యారు.’తానా అంటే తందానా’ అని. నాకు కుదరదు. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా. నువ్వు నేర్చుకో ఆ బామ్మ గారి దగ్గర” అంది వసుంధర. తల్లికి కోపం వచ్చిందని గ్రహించింది ప్రవల్లిక. “అలాగే అమ్మా, నేను బామ్మగారి దగ్గర నేర్చుకుని నీకు, నాన్నకు చేసి పెడతాను. సరేనా?” అంది ప్రవల్లిక.

ఆరోజు సాయంత్రం విశ్వనాధంతో వచ్చిన గుర్నాధం, బామ్మ గారు వేసిన అరటికాయ బజ్జీలలో వంకాయ పచ్చడి నలుచుకుని తిని ‘అబ్బో బ్రహ్మాండం’ అని ఇంకో నాలుగు బజ్జీలు వేసుకుని తిన్నాడు.

“ఒరేయ్ గుర్రం, నువ్వు ఇలా వచ్చి మా వాడి దగ్గర బజ్జీలు, చాక్‌లెట్లు తినేసి వెళ్ళడం కాదు. వాడికి మంచి అమ్మాయిని చూసేది ఏమీ లేదా?”అని నిలదీసింది బామ్మగారు.

పదహారో ఎక్కం అప్పచేప్పమని సడన్‌గా, మాస్టారు అడిగితే బిక్క చచ్చిపోయిన పిల్లాడిలా బామ్మగారి కేసి చూసాడు గుర్నాధం. “చూస్తూనే ఉన్నానండి. ఇంకా టైం రాలేదు” అన్నాడు నసుగుతూ గుర్నాధం. వెంటనే ఎవరో తరుముతున్నట్టు బయటకు వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు బామ్మగారు వచ్చేసరికి ప్రవల్లిక రెడీగా ఉంది రుబ్బురోలు దగ్గర. “నమస్తే బామ్మ గారూ” అంది మొహం నిండా సంతోషం నింపుకుని. అసలే బంగారు రంగులో ఉన్న ప్రవల్లిక మొహం మరింతగా వెలిగిపోయింది నిండుగా నవ్వడంతో. “చల్లగా ఉండు తల్లీ” అన్నారు బామ్మగారు.

“ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నారు?” అడిగింది ప్రవల్లిక. “గోంగూర పచ్చడి” అంది బామ్మగారు రుబ్బురోలు దగ్గర కూర్చుని. ఆమె పక్కనే ప్లాస్టిక్ స్టూల్ వేసుకుని కూర్చుంది ప్రవల్లిక. వేయించిన గోంగూరని రుబ్బురోలులో వేసి బామ్మగారు రుబ్బుతుంటే, ప్రవల్లిక పచ్చడి చేసే విధానాన్ని అడిగి, ఆవిడ చెబుతుంటే ఫోన్‌లో రికార్డు చేసుకుంది. ఒక అరగంటకి బామ్మగారు పచ్చడి తయారు చేయడం పూర్తి అయ్యింది. రుచి ఎలా వుందో చూడమని కొద్దిగా ప్రవల్లిక చేతిలో వేసింది. పచ్చడి నోట్లో వేసుకుని “చాలా బాగుంది బామ్మగారూ” అంది ప్రవల్లిక. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పచ్చడి వేసి ఆమెకిచ్చింది బామ్మగారు. తర్వాత రోలు అంతా నీళ్ళతో శుభ్రంచేసి వెళ్ళిపోయింది బామ్మగారు.

బామ్మగారు ఇచ్చిన గిన్నె తల్లికిచ్చి, తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రవల్లిక. వెంటనే తను నిర్వహిస్తున్న ‘యు ట్యూబ్ చానల్’లో ‘అదరహో గోంగూర పచ్చడి’ అంటూ తన వాయిస్‌తో ప్రోగ్రామ్ అప్లోడ్ చేసింది ప్రవల్లిక. ఒక గంట గడిచేసరికి ఆ ప్రోగ్రాంకి విపరీతమైన లైకులు, కామెంట్లు వచ్చాయి. రాత్రి భోజనాల దగ్గర ప్రవల్లికే, తండ్రికి తానే గోంగూర పచ్చడి వడ్డించింది. పచ్చడి తినగానే “అబ్బా, చిన్నప్పుడు కొత్తపేటలో మా అమ్మ చేసిన పచ్చడి గుర్తుకొచ్చింది. అమ్మా, నువ్వైనా ఆ బామ్మ గారి దగ్గర ఈ పచ్చళ్ళు చేయడం నేర్చుకో తల్లీ” అన్నాడు శేషగిరి.

“రేపట్నుంచి నా పని అదే నాన్నా” అంది నవ్వుతూ ప్రవల్లిక.

“ఎదిగిన పిల్లకి పెళ్లి సంబంధాలు చూడకుండా లొట్టలు వేసుకుంటూ పచ్చడులు తినే మనిషిని మిమ్మల్నే చూస్తున్నాను” అంది రోషంగా వసుంధర.

“నా బంగారుతల్లిని వెతుక్కుంటూ సంబంధాలు వస్తాయి. నేను తిరగక్కరలేదు” అన్నాడు శేషగిరి, కూతురి తలమీద చేయి వేసి నిమురుతూ. తండ్రి మాటలకి గర్వంగా నవ్వింది ప్రవల్లిక.

ఆ మర్నాటినుండీ రోజూ బామ్మగారి దగ్గర కూర్చుని, ఆవిడ చేసే పచ్చళ్ళు తెలుసుకుని వాటిని తన ‘యు ట్యూబ్ చానల్’ లో అప్లోడ్ చేస్తోంది. రోజు రోజుకి ఆమె చానల్‌కి డిమాండ్ పెరిగిపోయింది. రేపు ప్రవల్లిక ఏ పచ్చడి గురించి చెబుతుందా? అని, వీక్షకులు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. పదిరోజులు గడిచాయి. ఒక రోజు బామ్మగారు ప్రవల్లిక వాళ్ళ ఇంటికి రాలేదు. మధ్యాహ్నం అయినా ఆవిడ రాకపోతే, ప్రవల్లికే విశ్వనాధం ఇంటికి వెళ్ళింది.

బామ్మగారు మూలుగుతూ మంచం మీద పడుకుని ఉన్నారు. ప్రవల్లిక దగ్గరకు వెళ్లి చూసింది. ఆవిడ ఒళ్ళు వేడిగా కాలిపోతోంది. జ్వరం వచ్చిందని గ్రహించింది. వెంటనే తమ డాక్టర్‌కి ఫోన్ చేసి మందులు తెలుసుకుని, వీధి చివర ఉన్న మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు తీసుకువచ్చింది. బామ్మగారిని లేపి మొదటి డోసు మందులు వేసింది.

“ఇదేమిటి బామ్మగారు, మీకు ఇంత జ్వరంగా ఉంటే, మీ మనవడు మిమ్మల్ని వదిలేసి ఆఫీస్‌కి ఎలా వెళ్ళారు?” అని అడిగింది. “వాడికి నేనే ఏమీ చెప్పలేదమ్మా” అంది బామ్మగారు. వంటింట్లోకి వెళ్లి కాఫీ చేసి తీసుకువచ్చి బామ్మగారికి ఇచ్చింది. తర్వాత బామ్మగారు పడుకున్నాకా, ఆవిడ ఫోన్ తీసుకుని సావిడిలోకి వెళ్లి విశ్వనాదానికి ఫోన్ చేసింది.

“హలో బామ్మా, ఏమిటి ఫోన్ చేసావు, ఏం తోచడం లేదా?” అని హుషారుగా అడిగాడు విశ్వనాదం.

“హలో, మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఇంట్లో పెద్దావిడ జ్వరంతో బాధపడుతుంటే, పట్టించుకోకుండా ఆఫీస్‌కి వెళ్ళిపోతారా?” గట్టిగా అడిగింది ప్రవల్లిక. “హలో మీరు ఎవరు? మా బామ్మకి ఏమైంది?” ఆదుర్దాగా అడిగాడు విశ్వనాదం. “ఆఁ, నేను పక్కింటి పాపాయమ్మని. మీరు ఆఫీస్ వర్క్ పెందరాళే పూర్తిచేసుకుని ఇంటికి రండి” అని ఫోన్ కట్ చేసింది ప్రవల్లిక. మేనేజర్‌ని పర్మిషన్ అడిగి వెంటనే బయల్దేరి ఇంటికి వచ్చాడు విశ్వనాధం. బామ్మగారు ఉన్న గదిలోకి వెళ్లి ఆమెని చూసి “నీకు పొద్దున్నే జ్వరంగా ఉందని చెబితే ఆఫీస్‌కి వెళ్ళకుండా నీ దగ్గరే ఉండేవాడినిగా” అన్నాడు.

“చిన్నపాటి జ్వరమేగా అని నీకు చెప్పలేదు. మిరియాల కషాయం తాగాను. తగ్గలేదు. పాపం ఈ అమ్మాయి నన్ను కనిపెట్టుకుని ఉంది. మందులు కూడా తెచ్చి వేసింది” అంది రాంభాయమ్మ నీరసంగా.

“బామ్మగారూ, మీరు విశ్రాంతి తీసుకోండి” అని రాంభాయమ్మకి చెప్పి, విశ్వనాధం కేసి తిరిగి “మీతో మాట్లాడాలి సావిట్లోకి రండి” అని సావిట్లోకి నడిచింది ప్రవల్లిక. ఆమె వెనకే కుక్కపిల్లలా నెమ్మదిగా సావిట్లోకి వెళ్ళాడు.

సావిట్లో కుర్చీలో కాలు మీద, కాలు వేసుకుని కూర్చుంది ప్రవల్లిక. తను కూర్చోవాలా? నిలబడి ఉండాలా? అని ఆలోచించుకుంటూ ఉండగానే ప్రవల్లిక మాట్లాడటం మొదలుపెట్టింది.

“మీరు ఏం చదువుకున్నారు?” అడిగింది దర్జాగా ప్రవల్లిక.

“బి.టెక్. చదివి ఆ తర్వాత ఎం.బి.ఏ. చేసానండి” ట్యూషన్ మాస్టారు ముందు నిలబడి పన్నెండో ఎక్కం అప్పచెబుతున్న విద్యార్థిలా వినయంగా చెప్పాడు విశ్వనాధం.

“ఊ.. బాగానే చదువుకున్నారు. కానే ఏం లాభం? జనరల్ నాలెడ్జి బొత్తిగా లేదు. ఇంట్లో వున్న పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలో తెలియదు. పెద్దవాళ్ళు అంటే దేవుడు మనకిచ్చిన అపురూప కానుక..” అంటూ కుటుంబ సభ్యుల మధ్య ఉండవలిసిన అనురాగాలు, ఆప్యాయతలు.. వారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు గురించి పావుగంట క్లాస్ తీసుకుంది ప్రవల్లిక. విశ్వనాధం అలాగే ఆమెకేసి చూస్తున్నాడు, శోభనం గదిలో పెళ్లికోడుకులా ఉలుకూ, పలుకూ లేకుండా. మాట్లాడేటప్పుడు కదులుతున్న ఆమె అందమైన పెదవులు, కోపంగా చూసేటప్పుడు ఎరుపెక్కుతున్న ఆమె కళ్ళు అలా ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు విశ్వనాధం.

“నేను గొంతు చించుకుని మీ కోసం మాట్లాడుతుంటే, అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారేమిటి? మాట్లాడరేం?” అడిగింది ప్రవల్లిక. “మీరు చెప్పేది శ్రద్ధగా వింటున్నానండి. ఇకముందు అలా జరగదండి. మీకు థాంక్స్ అండి” అన్నాడు విశ్వనాధం నెమ్మదిగా. బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, అవసరమైతే తనని పిలవమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ప్రవల్లిక. ఇదంతా బయట తలుపు పక్కన నిలబడి చూసాడు గుర్నాధం. ఆమె వెళ్ళగానే లోపలకి వచ్చి “ఇంత అందాల భరిణిని పక్కనే పెట్టుకుని నాకు చెప్పలేదేం? రాయబారం నడిపేవాడినిగా” అన్నాడు గుర్నాధం.

“హూ.. ఆ అమ్మాయి తండ్రికి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫ్రెండ్. రెండు సార్లు వాళ్ళ ఇంటికి వచ్చాడు. నేను ముందడుగు వేస్తే, నా బాడీ షేప్ మారిపోతుందని జాగ్రత్తపడ్డాను” అన్నాడు విశ్వనాధం. ఆరోజు రాత్రి గుర్నాధం, విశ్వనాదానికి తోడుగా అక్కడే ఉన్నాడు. మర్నాడు ఉదయానికి రాంభాయమ్మకి జ్వరం తగ్గింది. వసుంధర వచ్చి చూసి వెళ్ళింది. కాసేపటికి ఫ్లాస్కులో కాఫీ తీసుకుని ప్రవల్లిక వచ్చింది. రాంభాయమ్మ పళ్ళు తోముకుని వచ్చాకా పక్కబట్టలు మార్చి, ఆమెకి కాఫీ ఇచ్చింది. కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే ఆపేక్షగా చూసింది రాంభాయమ్మ.

రెండు రోజులకి రాంభాయమ్మ బాగా తేరుకుంది. విశ్వనాధం ఆఫీస్‌కి వెళ్ళగానే ప్రవల్లిక వచ్చి ఆమె దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడం, రక రకాల పచ్చడులు, కూరలు చేయడం గురించి తెలుసుకునేది. పదిరోజులు గడిచేసరికి ప్రవల్లిక యు ట్యూబ్ చానల్ చాలా ఫేమస్ అయిపోయింది. వారం గడిచింది. మరలా రాంభాయమ్మ ప్రవల్లిక ఇంటికి రావడం మొదలుపెట్టింది. బాదంచెట్టు కింద రుబ్బురోలు దగ్గర ఆమె, ప్రవల్లిక కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపోయింది వసుంధర.

రెండు నెలలు గడిచాయి. రాంభాయమ్మకి, శేషగిరి, వసుంధరల దగ్గర చనువు ఏర్పడింది. ప్రవల్లిక పని మీద బయటకు వెళ్ళినప్పుడు వసుంధరతో అంది “మీ అమ్మాయిని మా విశ్వనాదానికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నాకు ఒక్కగా నొక్క మనవడు. వాడికి ఏ దురలవాటు లేదు. మీరు చూస్తూనే ఉన్నారుగా. నా ఆస్తి అంతా వాడిదే. పది పన్నెండు కోట్లు ఉంటుంది. ప్రవల్లికని అడిగి చెప్పండి” అని.

అమాయకుడైన మనవడికి, గడసరి అయిన ప్రవల్లికే తగినదని రాంభాయమ్మ నిర్ణయించుకుంది. ఆ రాత్రే వసుంధర, శేషగిరి కూతుర్ని విశ్వనాధం గురించి అడగడం, ఆమె పెళ్ళికి అంగీకరించడం జరిగింది. మరుసటి నెలలోనే విశ్వనాధం, ప్రవల్లికల పెళ్లి ఘనంగా జరిగింది. మియాపూర్‌లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకుని అందులో ప్రవల్లికతో కాపురం పెట్టాడు విశ్వనాధం. ప్రవల్లిక ఇంట్లోని ‘రుబ్బురోలు’ కూడా ఆమెతో పాటు ఫ్లాట్ లోకి వచ్చింది. ప్రవల్లిక స్నానానికి వెళ్ళినప్పుడల్లా, తమ పెళ్ళికి సంధానకర్త అయిన, రుబ్బురోలు దగ్గరకు వచ్చి ‘థాంక్స్ మిత్రమా’ అంటాడు విశ్వనాధం ప్రేమగా.

Image Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here