[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
స్వరకర్త నౌషాద్ అలీ:
‘చలే ఆజ్ హమ్ జహాఁ సే హుయీ జిందగీ పరాయీ
తుమ్హే మిల్ గయా ఠికానా, హమే మౌత్ భీ నా ఆయీ’
హృదయాలను తాకేలా సినీ గీతాలలో ఇంత కరుణరసాన్ని, విషాదాన్ని ఎవరు నింపగలరు, నౌషాద్ తప్ప! ‘ఉడన్ ఖఠోలా’ సినిమాలోని ఈ పాట – అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. సర్వకర్తగా తనను తానే అధిగమించారు నౌషాద్. ముఖ్యంగా, పాటలోని ‘కిస్ కామ్ కీ యే దునియా జో జిందగీ సే ఖేలే రే’ అనే వాక్యం వద్ద స్వరావరోహణం మార్చినప్పుడు నౌషాద్ ప్రతిభ మరింత వెల్లడవుతుంది. ‘అన్‍మోల్ ఘడీ’ సినిమా పాటలకి స్వరాలందించారు నౌషాద్. అన్ని పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని ‘క్యా మిల్ గయా భగవాన్ తుమ్హే దిల్ కో దుఖాకే’, లేదా ‘ఆ జా మేరీ బర్‍బాద్ మొహబ్బత్ కె సహారే’ అనే పాటలు మనల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్తాయి, నగర జీవనపు హోరులోనూ మన చెవులను తాకుతాయి.
ఇక రొమాంటిక్ మెలోడీ అయిన ‘తు గంగా కీ మౌజ్ మే జమునా కా ధారా’ అనే పాట వచ్చింది. ‘బైజు బావ్రా’ చిత్రంలోని ఈ పాట.. అదే సినిమాలోని ‘ఓ దునియా కే రఖ్ వాలే , సున్ దర్ద్ భరే మేరే నాలే’ పాటతో సమానంగా – సంప్రదాయ రాగాలను దేశీరాగాలతో మేళవించే నౌషద్ అద్భుత నైపుణ్యాన్ని సినీ సంగీత విమర్శకులు సైతం మెచ్చుకునేలా చేసింది. నిజానికి వెంటాడే ఈ సంగీతమే ‘బైజు బావ్రా’ చిత్రం సూపర్ హిట్ అవడానికి కారణమని విమర్శకులు సైతం అంగీకరిస్తారు.
దిలీప్ కుమార్ హీరోగా, నదీరా కొత్త హీరోయిన్‍గా తీసిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆన్’కు బాణీలందించారు నౌషాద్. ‘దిల్ మే చుపాకే ప్యార్ కా తుఫాన్ లే చలే’ లేదా ‘ముహబ్బత్ ఛూమే జిన్ కే హాత్’ వంటి పాటల కోసం సినీప్రేమికులు ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూశారు.
40వ దశకం నుండి 60వ దశకం మధ్యకాలం వరకు హిందీ చలనచిత్ర సంగీత రంగాన్ని శాసించిన అతికొద్ది మంది గొప్ప వ్యక్తులలో నౌషాద్ ఒకరు. సి రామచంద్ర, ఖయ్యామ్, శంకర్ జైకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ – ఆయన సమకాలీనులు. నౌషాద్ లక్నో నుండి బొంబాయికి చిన్నతనంలోనే వచ్చారు. పరిశ్రమలో నిలదొక్కుకుని పాటలకు స్వరాలందించారు. శాస్త్రీయ సంగీతంపై గట్టి పట్టు ఉండడం వల్ల, వివిధ దేశీ సంగీత శైలులపై, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలోని సంగీత రీతుల పట్ల విస్తృతమైన జ్ఞానం కలిగి ఉన్నందు వల్ల, నౌషాద్ సంగీతం ప్రత్యేకంగా సృష్టించబడిన బ్యాక్‍గ్రౌండ్ ఆర్కెస్ట్రేషన్‌తో సంలీనమై, గొప్ప వైవిధ్యంతో ఇతరులకి భిన్నంగా వినిపించింది. అందాజ్, బాబుల్, దిల్లగి, దులారీ, దీదార్, మొఘల్-ఎ-ఆజం (లతా మంగేష్కర్ పాడిన ‘మొహబ్బత్ కీ ఝూటీ కహానీ పే రోయే’, ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ అజరామరాలు), మదర్ ఇండియా, గంగా జమున, రామ్ ఔర్ శ్యామ్, అద్మీ, పాకీజా వంటి సినిమాలు విజయవంతం కావడంలో నౌషాద్ సంగీతం పాత్ర ఎంతో ఉంది.
నౌషాద్ గురించిన ఆసక్తికరమైన కథనం ఒకటుంది. ఒక రోజు, ఓ అపరిచితురాలు, బొద్దుగా ఉన్న మహిళ ఆయన ఇంటికి వచ్చింది. సినిమాల్లో పాటలు పాడాలనే ఆశయంతో ఆమె ఓ గ్రామం నుండి బొంబాయి వచ్చిందట. తన కోసం ఒక పాటను రూపొందించమని అభ్యర్థించింది. నౌషాద్ ఆమెను కొన్ని పాటల్లోని కొన్ని లైన్లు పాడమని అడిగారట. ఎందుకో ఆయనకి ఆమె గొంతు నచ్చింది. ఆ తర్వాత ఓ మిత్రుడు రాసిన పాటను తీసుకుని దానికి బాణీ కట్టారు. ఆ పాట రికార్డ్ విడుదలైనప్పుడు అది శ్రోతలని ఆశ్చర్యానికి గురి చేసింది. అబ్బురపరిచింది. ఆ అందమైన పాట ‘అఫ్సానా లిఖ్ రహీ హూఁ దిల్-ఏ బేకరార్ కా, ఆంఖోఁ మే రంగ్ భర్ కే తేరా ఇంతేజార్ కా’ అంటూ సాగుతుంది. గాయని ఉమాదేవి. అయితే ఆ తర్వాత ఆమె మరెవరో కాదని, హాస్య నటి టున్ టున్ అని తెలుసుకుని భారతదేశ ప్రజలు ఆశ్చర్యపోయారు.
60వ దశకం మధ్య నుండి నౌషాద్‌కి పెద్దగా సినిమాలు రాలేదు. ఏది ఏమైనప్పటికీ, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం, 1972లో ‘పాకీజా’ చిత్రంలో సంగీత దర్శకుడు ఉస్తాద్ గులాం మహమ్మద్ అసంపూర్తిగా మిగిల్చిన పనిని పూర్తి చేయడానికి తిరిగి వచ్చారు నౌషాద్. తాను నిజమైన మాస్ట్రో అనే వాస్తవాన్ని మళ్లీ ధృవీకరించారు. ‘ఇన్హీ లోగోంనే లే లియా దుపట్టా మేరా’ లేదా ‘చల్తే చల్తే యుహీఁ కోయి మిల్‌గయా థా’ వంటి కాలాతీతమైన పాటలను ఎవరు మర్చిపోగలరు?
నౌషాద్ పాటలు భారతదేశంలో ప్రజాదరణ పొందడమే కాకుండా, మానవ నిర్మిత సరిహద్దులన్నింటినీ దాటి, పొరుగు దేశాలలోను, దూర దేశాలలోనూ కూడా రసజ్ఞులైన ప్రేక్షకులను చేరుకున్నాయి.
భారతీయ సినీరంగానికి చేసిన సేవలకు గాను నౌషాద్ అలీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. నౌషాద్ సంగీతం అందించిన చివరి చిత్రం అక్బర్ ఖాన్ తీసిన ‘తాజ్ మహల్: యాన్ ఎటర్నల్ లవ్ స్టోరీ’ (2005). నౌషాద్ 5 మే 2006 న ముంబైలో మరణించారు.
నటి స్వరణ్ లత:
స్వరణ్ లత పాకిస్తాన్ నటి. బ్రిటీష్ ఇండియాలో చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి, తరువాతి కాలంలో పాకిస్తాన్‍కి వెళ్ళిపోయారు. భావోద్వేగ, విషాద పాత్రలతోనూ తన నటనతోను, కదిలించే సంభాషణల ఉచ్చారణ తోనూ చలనచిత్ర పరిశ్రమలో తన ఉనికిని చాటుకున్నారు. ఆమె బాలీవుడ్ లోనూ, పాకిస్తానీ సినిమాలలోనూ పనిచేశారు.
స్వరణ్ లత రావల్పిండిలోని సియాల్ ఖత్రి సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె ఢిల్లీలో సీనియర్ కేంబ్రిడ్జ్ డిప్లొమా చేసి, తరువాత లక్నోలోని అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్‌లో చేరారు. 1940ల ప్రారంభంలో, ఆమె కుటుంబం బొంబాయికి మారింది. ఆమె 1942 నుండి 1948 వరకు బ్రిటిష్ ఇండియాలో మొత్తం 22 సినిమాల్లో నటించారు.
స్వరణ్ లత నటించిన అత్యంత విజయవంతమైన చిత్రం ‘రతన్’. ఎం. సాదిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అబ్దుల్ రషీద్ కర్దార్ నిర్మించారు. స్వరణ్ లత, కరణ్ దేవాన్, అమీర్ బానో ప్రధాన పాత్రలలో నటించారు. ఇది 1944లో అత్యంత విజయవంతమైన చిత్రం. భారతీయ చిత్రాలలో సంగీతానికి అగ్రస్థానం అందించినవారిలో ఒకరిగా ఈ చిత్రం నౌషాద్‌కు పేరు తెచ్చింది, ఆపై ప్రతి చిత్రానికి రూ. 25,000 పారితోషికం పొందేలా చేసింది.
అప్పటి ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత అయిన నజీర్ అహ్మద్‌ను వివాహం చేసుకున్న తరువాత సువర్ణ్ లత ఇస్లాం మతంలోకి మారారు. ఆమె తన పేరును సయీదా బానోగా మార్చుకున్నారు. స్వరణ్-నజీర్ జంట చాలా సృజనాత్మక జంట, 1947లో భారతదేశ విభజనకు ముందు, తర్వాత అనేక సినిమాలలో కలిసి నటించారు.
స్వరణ్ లత రంగస్థల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె మొదటి చిత్రం 1942లో విడుదలైన ‘ఆవాజ్’. 1947లో భారతదేశ విభజన సమయంలో స్వరణ్, నజీర్ పాకిస్తాన్‍కు వలస వెళ్లారు. వారు బొంబాయిలో తమకు ఉన్నవన్నీ వదిలి పాకిస్థాన్‌లోని లాహోర్‌కు మారారు. ఈ జోడి జీవితాన్ని మళ్ళీ మొదటి నుండి ప్రారంభించారు, ప్రారంభ పాకిస్తానీ చిత్ర పరిశ్రమ మార్గదర్శకులలో ఒకరిగా పరిగణించబడ్డారు.
స్వరణ్ లత – పాకిస్తాన్ మొట్టమొదటి రజతోత్సవ చిత్రం ఫేరే (1949)లో ప్రధాన నటి. ఈ చిత్రం పంజాబీ చిత్రం. అయితే ఉర్దూ సాహిత్యకారుల నివాసమైన లక్నోలో చదువుకోడం వల్ల ఆమెకు ఉర్దూ భాషపై మంచి పట్టు ఉంది. ఈ చిత్రం కోసం, ఆమె పంజాబీ భాషలో మాట్లాడేందుకు బాబా ఆలం సియాపోష్ అనే పంజాబీ కవి ద్వారా శిక్షణ పొందారు, ఈయన ఈ సినిమా పాటల రచయితలలో ఒకరు.
ప్రధాన నటిగా, ‘లారే’ (1950), ‘నౌకర్’ (1955), ‘హీర్’ (1955) ఆమె ప్రసిద్ధ చిత్రాలు. సహాయ నటిగా, ‘సవాల్’ (1966) ఆమె ప్రసిద్ధ చిత్రం. 1960 నుండి, ఆమె ప్రధాన పాత్రలలో నటించడం తగ్గించుకున్నారు, సహాయక పాత్రల వైపు మళ్ళారు. 1971లో పూర్తిగా నటన నుంచి విరమించుకున్నారు.
స్వరణ్ తన జీవితకాలంలో భారతదేశంలో పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ వంటి గొప్ప నటులతోనూ; పాకిస్తాన్‌లో సంతోష్ కుమార్, దర్పణ్, ఇనాయత్ హుస్సేన్ భట్టి, హబీబ్ వంటి ప్రసిద్ధ నటులతోనూ కలిసి పనిచేశారు.
స్వరణ్ లత 8 ఫిబ్రవరి 2008న లాహోర్‌లో 83 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమెకు నలుగురు పిల్లలు (ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు) ఉన్నారు.
‘రతన్’ సినిమాలోని ఈ పాటలో ఆమెను చూడవచ్చు: