శ్రీవర తృతీయ రాజతరంగిణి-8

1
4

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

భాస్వాన్ రాజా సదాచారో బుధః సధిషణో మహాన్।
అధాద్ విశ్వగ్రహాఖ్యాతిమాసన్నస్య గ్రహోచితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 26)

చక్కటి పదాల వాడకంతో జైనులాబిదీన్ గుణగణాలను ప్రస్ఫుటం చేస్తున్నాడు శ్రీవరుడు. భాస్వాన్ అంటే సూర్యుడిలా, రాజా అంటే చంద్రుడిలా, విజ్ఞానవంతుడిలా, సదాచారాలను పాటించేవాడు. యుక్తిపూర్ణుడు. బృహస్పతిలా సకలజ్ఞాన సంపన్నుడు, పండితుడు. అంటే సూర్యుడిలా కాంతిమంతుడు, చంద్రుడిలా చల్లనివాడు, తెలివైనవాడు, విజ్ఞానవంతుడు, సదాచార సంపన్నుడు అయిన జైనులాభదీనుడు అన్ని గ్రహాల లక్షణాలు, శక్తులు కలవాడు. గ్రహాలన్నీ అతడికి అనుకూలంగా ఉన్నాయి.

యం సంప్రాయ గుణాః సర్వేప్యలభన్నధికాం శ్రియమ్।
రాత్రౌ కుముదబృందాని చింతామణిమివోడుపమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 27)

అన్ని కోర్కెలు తీర్చేటటువంటి మణి లాంటి వాడు రాజు. ఎలాగయితే తామరపూలు రాత్రి పూట వెన్నెల స్పర్శతో మరింత శోభాయమానమౌతాయో అలాగే అందరి కోరికలు తీర్చే మణిలా రాజు కీర్తి, గుణాలు అన్నీ మరింత శోభాయామానమయ్యాయి.

షట్ దర్శనక్రియా యస్య వృత్తం సమన్వర జ్జయన్।
సుమనో రచితాహ్ల్యాదా ఋతువో నందనం యథా॥
(శ్రీవర రాజతరంగిణి, 28)

ఇంద్రుడి నందన వనంలో ఆరు ఋతువులలో పూచే పూలు అందరి హృదయాలను ఆనందమయం చేసినట్టు, షట్ దర్శనాలు పండితులను మెప్పించేట్టు రాజును ఆనందపరచాయి. అంటే షట్ దర్శనాల అధ్యయనం రాజుకు అత్యంత ఆనందకరమైన విషయం అన్నమాట. షట్ దర్శనాలను ఆరు ఋతువులతో పోల్చాడు శ్రీవరుడు. ఆరు దర్శనాలు దేనికవే ప్రత్యేకం. ఎలాగయితే ఆరు ఋతువుల లక్షణాలు దేనికవే ప్రత్యేకం, వాటివల్ల కలిగే ఆనందం, అందం దేనికవే ప్రత్యేకమో,  అలాగే షడ్దర్శనాల అధ్యయనం వల్ల కలిగే ఆనందం కూడా దేనికదే ప్రత్యేకం. ఒక దర్శనాధ్యయనం వల్ల కలిగే విజ్ఞానం ప్రత్యేకం. దాని వల్ల కలిగే జ్ఞానానందాలు ప్రత్యేకం. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరు దర్శనాలను అధ్యయనం చేస్తూ జైనులాబిదీన్ అవి అందించే విజ్ఞానానికీ, వాటి వల్ల దర్శనమయ్యే విజ్ఞాన సౌందర్యానికి ఎంతో ఆనందిస్తున్నాడన్న మాట. ఈ శ్లోకం ద్వారా శ్రీవరుడు జైనులాబిదీన్ షడ్దర్శనాలను ఆసక్తితో, భక్తితో, అధ్యయనం చేశాడని చెప్తున్నాడు. షడ్దర్శనాల అధ్యయనం వల్ల వ్యక్తి అంతర్దృష్టి మరింత సూక్ష్మమవుతుంది. అతని బాష్యదృష్టి తేజోవంతమవుతుంది. సమాజం పట్ల, వ్యక్తి పట్ల అవగాహన పెరుగుతుంది. ఆలోచన లోతు పెరుగుతుంది. జైనులాబిదీన్ పరమత సహనం పాటించటానికి, సాటి మనిషిని మనిషిగా గౌరవించటానికీ, ఆలోచన విశాలమై ఒక లౌకిక దృక్పథం ఏర్పడి, సంకుచితత్వం నశించటానికి భారతీయ తత్వ అధ్యయనం తోడ్పడిందని శ్రీవరుడు సూచిస్తున్నాడు.

షడ్దర్శనాల జ్ఞానాన్ని నందన వనంలో ఆరు ఋతువులలో పూచే అందమైన పూలతో పోల్చటం ఒక అందమైన చమత్కారం. ఇంద్రుడి నందనవనం సామాన్యులకు చేరువ కాదు. దైవాంశ కలవారే నందనవనాన్ని దర్శించగలుగుతారు. షడ్దర్శనాల అధ్యయనం ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం వ్యక్తిని దైవసమానుడిని చేస్తుంది. ఇంద్రుడు ఒక రకంగా అభివృద్ధి చెందిన మేధకు ప్రతీక. అతడి దగ్గర ఉన్న అందమైన ఉద్యానవనం నందన వనం. అంటే, షడ్దర్శనాల పఠనం వల్ల మేధ పరిణతి చెంది అందమైన ఉద్యానవనం స్థాయికి ఎదుగుతుందన్న మాట. అలాంటి షడ్దర్శనాల పఠనానందాన్ని జైనులాబిదీన్ అనుభవిస్తున్నాడు. పరిణత మేధ అతనిది.

త్రివర్గ ప్రోజ్జ్వలం దృష్ట్వా యస్మింస్తద్రసికా ఇవ।
అవసన్ శక్తయస్తిస్త్రః సమమేమమతా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, 29)

త్రివర్గాలు అంటే ధర్మం, అర్థం, కామం. మూడు శక్తులు- ప్రభుత్వం, మంత్రం, ఉత్సాహం మూడు  శక్తులు. ఈ ఆరు శక్తులు అంటే త్రివర్గాలు, మూడు శక్తులు జైనులాబిదీన్‍లో ప్రేమికలు కలసి ఉన్నట్టు ఉన్నాయన్నమాట. ‘రసిక’ అంటే  ప్రేమిక అని అర్థం. అతి గొప్పగా చెప్పాడు. ఈ మూడు శక్తులు త్రివర్గాలను చూసి అతనిలో సహజీవం చేస్తున్నాయన్నమాట.

భూపైర్థైః పూరయత్యర్థిసాయే పార్థోపమేన్వహమ్।
ఆహ్వానార్థమివైతస్య యశః సర్వదిశోగమత్॥
(శ్రీవర రాజతరంగిణి, 30)

పార్థుడిలా రాజు యాచకులకు సంపూర్ణంగా వారు సంతృప్తి పొందే రీతిలో దానాలు చేసేవాడు. నలుమూలల నుంచి యాచకులను కశ్మీరుకు ఆహ్వానించేందుకే అతని కీర్తి నలుదిశలా వ్యాపించట్టనిపిస్తుంది.

గమ్మత్తయిన శ్లోకం ఇది.

మహాభారతంలో మనకు పార్థుడు అనగానే అర్జునుడు గుర్తుకువస్తాడు. ‘అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ’ అంటూ అర్జునుడి పేర్లు వల్లె వేస్తాం. కానీ అర్జునుడు దానధర్మాలకు  ఎలాంటి పేరు పొందలేదు. అసలు పాండవులెవరూ దాన ధర్మాలకు పెద్దగా పేరు పొందలేదు. దానధర్మాలనగానే మనకు కర్ణుడు గుర్తుకు వస్తాడు. కానీ ఇక్కడ శ్లోకంలో పార్థుడిలా సంపూర్ణంగా దానం చేసే వాడంటున్నాడు. దీనికి వెనుక ఓ మర్మం ఉంది.

‘పార్థ’ అంటే ‘పృథ పుత్రుడు’ అని అర్థం. కుంతి మరో పేరు పృథ. పార్థ అంటే కుంతీపుత్రుడు అని అర్థం. కుంతీపుత్రుడు అర్జునుడొక్కడే కాదు. ధర్మరాజూ, భీముడూ కుంతీపుత్రులే. వాళ్ళే కాదు, కర్ణుడూ కుంతీపుత్రుడే! కాబట్టి, ఇక్కడ శ్రీవరుడు కర్ణుడిని ‘పార్థ’ అని సంబోధిస్తూ, దానధర్మాలలో జైనులాబిదీన్ కర్ణుడిలాంటి వాడని పొగుడుతున్నాడు.

గమనిస్తే ‘పార్థ’ అని కర్ణుడిని సూచిస్తూ, జైనులాబిదీన్‍ను కర్ణుడితో పోల్చటం వెనుక ఓ చమత్కారం ఉంది. “దానంలో వాడు కర్ణుడి లాంటి వాడురా” అంటాం. సమస్య లేదు. ‘పార్థుడి’ లాంటి వాడనటం ఆలోచింపచేస్తుంది. కర్ణుడు పాండవులలో ఒకడయినా దుష్టులయిన కౌరవులలో చేరాడు. వారిలో ఒకడయ్యాడు. కానీ మంచివాడు. జైనులాబిదీన్ కూడా అంతే. ఇస్లామీయుడైనా వారిలో తప్పబుట్టాడు, కౌరవుల నడుమ కర్ణుడిలా! ‘కర్ణుడు’ అంటే వచ్చే ‘దుష్ట’ భావనను రాకుండా చేసేందుకు ‘పార్థ’ అని వాడేడు. అర్జునుడితో పోల్చాడనుకుంటారు, అంతగా తెలియనివారు. తెలిసున్నవారు శ్రీవరుడి భావం అర్థం చేసుకుంటారు. ఎంత గొప్పగా చెప్పాడో అనుకుంటారు. ఇస్లామీయులలో ఒకడయినా వారికి భిన్నమైనవాడు జైనులాబిదీన్ అని అర్థం చేసుకుంటారు.

శిల్పినో విశ్వకర్మాణాం గోరక్షం యోగినాం గణాః।
అవతీర్ణ రసజ్ఞ యం నాగార్జునమివావిదన్॥
(శ్రీవర రాజతరంగిణి, 31)

శిల్పులు ఆయనను విశ్వకర్మ అనుకుంటారు. యోగులు గోరక్ష(నాథ్) అనుకుంటారు. రసాయన శాస్త్రవేత్తలు నాగార్జునుడు అనుకుంటారు.

ఎంతో అర్థవంతమైన శ్లోకం ఇది.

అక్షరాలలో ‘అ’ అక్షరాన్ని, అన్నిటిలో ‘ఉన్నతుడి’ని అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు అలాంటి శ్లోకం ఇది.

ఆయా రంగాలలో అత్యున్నతుడిగా, అత్యుత్తముడిగా భావించే వారితో జైనులాబిదీన్‍కు పోలిక తెచ్చి, ఆయా రంగాలలో ఉత్తముడు జైనులాబిదీన్ అని పరోక్షంగా చెప్తున్నాడు శ్రీవరుడు.

సృజనాత్మక వ్యక్తులంతా ఆయనను ‘విశ్వకర్మ’ అనుకుంటారు. భారతీయ సాంప్రదాయంలో   విశ్వకర్మ సృజన కౌశలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనేక అద్భుతమైన నిర్మాణాలను ఆయన పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయంలో సృజనాత్మక వృత్తి కళాకారులంతా విశ్వకర్మను ప్రధాన దైవంలా భావిస్తారు.

యోగి గణాలు ఆయనను గోరక్షనాథుడిగా భావించటం ప్రాధాన్యం వహిస్తుంది. గోరక్షనాథ్‍నే గోరఖ్‍నాథ్ అంటారు. ‘గోరక్షణ’ ప్రధానోద్దేశ్యం. హఠయోగి. హఠయోగం గురించి ‘గోరక్ష సంహిత’ అనే గ్రంథం రచించాడు. ఆదినాథ్, మత్స్యేంద్ర నాథ్, ఆనంద్ భైరవ్, మీననాథ్, విరూపాక్షనాథ్ వంటి వారు యోగ ద్వారా జీవన్ముక్తులయ్యారు. వీరందరిలోకీ గోరఖ్‌నాథ్ అత్యంత ప్రాచుర్యం పొందాడు. ఈయన ప్రచారం చేసిన యోగి సంప్రదాయంలో పలు శాఖలున్నాయి. వాటిలో కాన్‍ఫట యోగులు ప్రసిద్ధి పొందినవారు. ఆ కాలంలో గోరఖ్‍నాథ్ ప్రభావం దేశమంతా ఎంతగా విస్తరించిందంటే, కశ్మీరులోనూ అభినవగుప్తుడితో సహా పలువురు ‘నాథ్’ సంప్రదాయాలను విశ్లేషిస్తూ రచనలు చేశారు. కశ్మీరులో గోరఖ్‌నాథ్ పై పలు రచనలున్నాయి. జైనులాబిదీన్ స్వయంగా హఠయోగంపై అత్యంత ఆసక్తి ప్రదర్శించాడు. నేర్చుకున్నాడు. శ్రీవరుడికి ఇది తెలుసు. అందుకని యోగులు జైనులాబిదీన్‍ను ‘గోరఖ్‌నాథ్’ అనుకుంటారు అని పోల్చాడు.

ఆచార్య నాగార్జునుడు శూన్య వాదానికి, మాధ్యమిక బౌద్ధ దర్శనానికి సుప్రసిద్ధుడు. నాగార్జునుడు వైద్యంపై, రసాయన విద్యపై, తంత్రపై రాసిన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. సిద్ధుల పరంపరలో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన నాగార్జునుడు మరొకరు ఉన్నారు. పాదలిప్త సూరి శిష్యుడీయన. పదార్థాలను బంగారంలా మార్చాలని తీవ్రంగా ప్రయత్నించి సఫలుడయ్యాడు. శ్రీవరుడు ప్రస్తావిస్తున్నది ఈ నాగార్జునుడిని గురించి. ఈయన రసాయనవాదులలో ఉత్తముడు. మామూలు వస్తువులను బంగారంగా మార్చేవాడు. జైనులాబిదీన్ కూడా అంతే. సామాన్యులను ఉత్తములుగా మారుస్తాడు. అందుకని జైనులాబిదీన్‌ను రసాయన శాస్త్రవేత్త నాగార్జునుడితో పోల్చాడు శ్రీవరుడు.

తస్యాగ్రే యోగ్యతాదశి యై శిల్పకవికౌశలత్।
తథా ప్రసాదమ్ కరోత్ తత్పరాస్తే యయాభవన్॥
(శ్రీవర రాజతరంగిణి, 32)

జైనులాబిదీన్ ముందు కళాప్రదర్శన ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించిన వారు వారి యోగ్యతలను బట్టి రాజు అనుగ్రహాన్ని పొందారు. తద్వారా మరింత ఉత్సాహంతో తమ తమ కళల సాధనలో నిమగ్నులయ్యారు.

కావ్యశాస్త్ర శృతైర్గీత నృత్య తంత్రీ చమత్కృతైః।
అజీవమనయత్ కాలం కార్యానుద్విగ్నమానసః॥
(శ్రీవర రాజతరంగిణి, 33)

కావ్యాలు వింటూ, పాటలు వింటూ, నృత్య సంగీతాలను అనుభవిస్తూ, ఎలాంటి ఉద్విగ్నతలు లేకుండా కళలను ఆస్వాదిస్తూ తన జీవితాన్ని గడిపాడు జైనులాబిదీన్.

జైనులాబిదీన్ సంగీత సాహిత్య పిపాసను, వాటి పట్ల అనురక్తిని ఈ శ్లోకంలో ప్రదర్శించాడు శ్రీవరుడు. సంగీతం వినేటప్పుడు, నృత్యాన్ని దర్శించేప్పుడు, కావ్య పఠన సమయంలో ఆయన ఇతర రాచకార్యక్రమాలను విస్మరించి, ఉద్విగ్నరహితంగా ఆనందంగా కాలం గడిపేవాడు. జీవితమంతా ఇలా ఆనందంగా గడిపేడని చెప్తున్నాడు శ్రీవరుడు.

శ్రీవరుడు రచించిన ఈ శ్లోకాలు చదువుతుంటే, శ్రీవరుడికి, జైనులాబిదీన్ పట్ల ఉన్న అపారమైన ప్రేమ, గౌరవాభిమానాలు తెలుస్తాయి. శ్రీవరుడు రాజతరంగిణి రచనను జైనులాబిదీన్ మరణం తరువాత స్వచ్ఛందంగా రచించాడని స్పష్టమవుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here