[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
దిక్పాలకుల సభల్ని వర్ణించిన నారద మహర్షి:
ఇంద్రసభ వర్ణన
ధర్మరాజు నారద మహర్షి చెప్పిన రాజ్యనీతికి సంబంధించిన ధర్మాలన్నీ శ్రద్ధతో విన్నాడు. తమకి మయుడు నిర్మించి ఇచ్చిన సభని ఆయనకి చూపించాడు. తరువాత “మహర్షీ! మీరు మూడు లోకాల్లో ఉన్న ప్రదేశాల్ని చూశారు. అక్కడి విశేషాలన్నీ తెలుసుకున్నారు. అపూర్వమైన ఈ మయసభ వంటి సభని మూడు లోకాల్లో ఎక్కడైనా చూశారా?” అని అడిగాడు.
మయసభని పూర్తిగా చూసిన నారద మహర్షి ఆశ్చర్యపోయాడు. “ధర్మరాజా! ఈ సభ అపూర్వమైంది. రకరకాల మణులతో నిండిన ఈ సభ మానవులకి అతీతమైంది. మానవలోకంలో ఎక్కడా ఇటువంటి సభని నేను చూడలేదు. ఉన్నట్టు వినలేదు కూడా.
దేవేంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, బ్రహ్మదేవుడు మొదలైనవాళ్ల దివ్య సభల్ని నేను చూశాను. అవి కూడా సంపదల్లోను, అందంలోను ఈ సభతో సరితూగవు” అన్నాడు.
నారద మహర్షి చెప్పినదాన్ని విని ధర్మరాజుకి దిక్పాలకుల సభల గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. వాటి వైభవాన్ని వివరించమని నారద మహర్షిని అడిగాడు.
“ధర్మరాజా! దేవేంద్రుడి సభ రత్నమయం, స్వర్ణమయం, చిత్రవిచిత్రం. ముల్లోకాల్లో ఉన్న అన్ని ఐశ్వర్యాలకి అది నిలయం. వెయ్యి తలలు, రెండువేల నాలుకలు కలిగిన ఆదిశేషుడు కూడ ఆ సభ గురించి పొగడలేడు.
ఇంద్రసభ నూరు ఆమడలు వెడల్పు, నూటయాభై ఆమడలు పొడవు, ఐదు అమడలు ఎత్తు కలిగి ఆకాశంలో ఉంటుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలదు. దానికి ఎండలవల్ల, చలి వల్ల బాధ లేదు. చెట్ల తోపులు ఉన్నాయి. అవి అన్ని కాలాల్లో కూడా పూలతోను, పండ్లతోను నిండి ఉంటాయి. అందులో ఉన్న సరస్సులూ ఎప్పుడూ నిండుగా ఉంటాయి.
దాన్ని దేవేంద్రుడు తన తపోబలంతో నిర్మించుకున్నాడు. అందమైన బంగారు విమానాల్లో వచ్చిన దేవతా ప్రముఖులు; విశాలమైన కాంతి కలిగిన కడగంటి చూపులు అనే పూలతో పూజించే అప్సరసలు సేవిస్తుంటే.. సాటిలేని ఐశ్వర్యంతో, మణులతో తయారు చెయ్యబడిన ఆభరణాల కాంతులతో, చంద్రబింబం లాంటి ముఖంతో, శచీదేవితో కలిసి నూరు యజ్ఞాలు చేసిన ఇంద్రుడు సభలో కూర్చుని ఉంటాడు.
ఆయన కోసం యుద్ధంలో మరణించిన వీర సైనికులు; తమ కులధర్మాల్ని విడవకుండా పాటించిన గృహస్థులు; ప్రపంచంలో గొప్ప కీర్తితో ప్రకాశించిన పుణ్యాత్ములు; ఇతరులకి మేలు చెయ్యడమే దీక్షగా కలిగిన మహాత్ములు; రోగము, ముసలితనము, ఆకలి, దాహము, మరణము, శోకము, భయము, భాధలు లేకుండ అక్కడే ఉండి దేవేంద్రుణ్ని సేవిస్తూ ఉంటారు.
అంతేకాకుండా ధర్మార్థకామాలు, దక్షిణలతో కూడిన యజ్ఞయాగాలు, లక్ష్మీవిలాసాలు, గొప్ప యజ్ఞాల్ని నిర్వహించే మంత్ర సమూహాలు తగిన ఆకారాలతో వచ్చి దేవేంద్రుణ్ని సంతోషంగా పూజించి వెడతారు.
ఇంకా శుక్రుడు, బృహస్పతి, అగ్నిదేవుడు, చంద్రుడు అశ్వినీదేవతలు, విశ్వేదేవతలు, ధాత, మన్మథుడు, హరిశ్చంద్రుడు అనే రాజర్షి దేవేంద్రుడి సభలో ఉంటారు” అని దేవేంద్ర సభని నారద మహర్షి వర్ణించాడు.
యమసభ వర్ణన
యమధర్మరాజు సభ లోకంలో వివేకంతో ధర్మాధర్మాల్ని గురించి తర్కించే సభ. అది గొప్ప కాంతి కలిగి మెరిసే బంగారం మణులరాశులతో విశ్వకర్మ ఎంతో గొప్ప నేర్పుతో నిర్మించాడు.
యమసభ నూరామడల వెడల్పు, పొడవు కలిగి అందంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలని అనుకుంటే అక్కడికి వెళ్లగలదు. సూర్యకాంతితో సమానమైన గొప్ప తేజస్సు కలిగింది. చూడడానికి అందంగా ఉండి అన్ని సుఖాల్ని అందిస్తుంది.
ఆ సభలో అగస్త్యుడు; మతంగుడు మొదలైన సిద్ధమునులు; పితృదేవతలు; యమకింకరులు; రూపుదాల్చిన కాలచక్రం; యాగాలు; దక్షిణ దిక్కులో ఉన్న దేవతలు; ఉగ్రతపస్సులు; కృతవీర్య, జనమేజయ, జనక మొదలైన మహారాజులు; మీ తండ్రి అయిన పాండురాజు మొదలైన ఎంతో మంది రాజర్షులు ఉంటారు. వీళ్లంతా తనను సేవిస్తుండగా యమధర్మరాజు ప్రాణుల పుణ్య పాపాలని గురించి విచారిస్తుంటాడు.
వరుణసభ వర్ణన
వరుణసభ లోకంలో చాలా గొప్పగా చెప్పుకోబడే సభ. తెల్లని కాంతితో మెరిసే మణులతో ఎంతో అందమైంది. వరుణుడు భార్యా సమేతంగా శాశ్వతమైన గొప్పతనంతో ఆ సభలో ఉన్నాడు.
వరుణ సభ యమసభతో సమానమైన వెడల్పు, పొడవు, అందం కలిగి ఉంటుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలదు. కళకళలాడుతూ ఉంటుంది. జలస్తంభవిద్యతో నీళ్లల్లో ఉండి విశ్వకర్మ దాన్ని ఎంతో మనోహరంగా నిర్మించాడు. నాలుగు సముద్రాలూ, కాళిందీ, నర్మదా, గంగా, కావేరీ మొదలైన నదులు; సరస్సులు; చెరువులు; సెలయేళ్లు; దిగుడుబావులు; దిక్కులు; పర్వతాలు; భూమి- దేహాలు ధరించి వచ్చి; మొసళ్లు, తాబేళ్లు, సింహాలు, శరభాలు, మొదలైన భూమి మీద, నీళ్లల్లోను చరించే సమూహాలు ఆ సభలో కొలువుతీరి ఉన్న వరుణదేవుణ్ని అత్యంత భక్తితో సేవిస్తూ ఉంటారు.
అంతే కాకుండా వాసుకి, ఐరావతుడు మొదలైన నాగరాజులు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలి, నరకుడు, నముచి, విప్రచిత్తి, కలకంఠుడు, కైటభుడు, ఘటోదరుడు, దశగ్రీవుడు, విశ్వరూపుడు, విరూపాక్షుడు మొదలైన దేవతాప్రముఖులు, రాక్షసుల్లో గొప్పవాళ్లైన వాళ్లు అందరూ వరుణదేవుణ్ని పూజిస్తుంటారు.
కుబేరసభ వర్ణన
కుబేరుడిసభ ఇంద్రసభతో సమానంగా ఉంటుంది. అపారమైన ఐశ్వర్యంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. కుబేరుడు తన దివ్య శక్తితో ఉత్తమ మణులతో అతి రమణీయంగా దాన్ని నిర్మించాడు.
ఆ సభ పొడవు నూరు ఆమడలు, వెడల్పు డబ్భై ఆమడలు. తెల్లటి కాంతితో ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. బంగారు చెట్లతోను, తీగలతోను అలంకరించబడి ఉంటుంది. మెరుపు తీగలతో శరత్కాలమేఘంలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది.
ధర్మరాజా! మందారము, పారిజాతము మొదలైన వృక్షాల అందాలతో ప్రకాశించే నందనవనం నుంచి సువాసనలతో కలిసి గాలి వీస్తుండగా కుబేరుడు ఆ సభలో ఆనందంగా కొలువై ఉంటాడు.
నరులు, కిన్నరలు అనే పేరుగల గంధర్వులు; వరాహకర్ణుడు, గజకర్ణుడు మొదలైన యక్షులు; నలకూబరుడు, ఊర్వశి, తిలోత్తమ మొదలైన అప్సరసలు సేవిస్తూ ఉంటారు. నేను కూడా దేవర్షులతో కలిసి వెళ్లి తరచుగా చూస్తూ ఉంటాను.
దేవతలతో నమస్కరింపబడే పాదాలు, పాములరాజు వాసుకి ఆభరణంగా కలిగి, అన్ని లోకాలకి గురువైన శివుడు కుబేరుడికి స్నేహుతుడై పదునుగా ఉండే అనేక ఆయుధాలు ధరించి భూతసమూహంతో కలిసి ఎప్పుడూ అక్కడే ఉంటాడు.
బ్రహ్మసభ వర్ణన
ధర్మరాజా! పూర్వం నేను కొంతకాలం భూలోకంలో ఉన్నాను. ఆ సమయంలో సూర్యుడు నా దగ్గరకు వచ్చాడు. బ్రహ్మసభని గూర్చి వర్ణించి చెప్పాడు. నాకు కూడా ఆ సభని చూడాలని అనిపించి సూర్యుడితో కలిసి వెళ్లి బ్రహ్మసభని చూశాను.
బ్రహ్మసభ వైభవం గురించి ఇలా ఉంటుంది అని చెప్పడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఆ వైభవం చెప్పడానికి ఊహకి కూడా అందదు. దాని రూపం అంత అద్భుతం.
ఆకాశము అనే స్తంభం దాన్ని మోస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చేకాంతి చంద్ర సూర్య మండలాల్ని ప్రకాశించేలా చేస్తూ సుస్థిరంగా నిలిచి ఉంటుంది.
విశ్వకర్తలైన మనువు, అత్రి, మరీచి మొదలైనవాళ్లు; సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర సమూహాలు; దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాధ్యులు, సంతానం కలిగిన యాభైవేలమంది మహామునులు; ఊర్ధ్వరేతస్కులైన ఎనభై ఎనిమిదిమంది మహర్షులు; అశ్వినీదేవతలు; విశ్వేదేవతలు; విశ్వకర్మ; పితృదేవతలు; రూపుదల్చిన ధర్మార్థకామమోక్షాలు; శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు; తపస్సు, శమం, దమం, ధ్రుతి, స్మృతి, మేధ, బుద్ధి, క్షమ, కీర్తి, సంకల్పం, వికల్పం, ప్రణవం, క్షణం, లవం, త్రుటి, కాష్ఠ, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, మాసం, మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రం; చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసలు, బహువిధ భాషలు, సమస్త విద్యలు ఆకారం ధరించి తనను సేవిస్తూ ఉండగా సరస్వతీ సమేతంగా వివిధ జీవరాసుల్నీ సృష్టిస్తూ మహాతపస్వుల తపఃఫలాల్ని నిర్ణయిస్తూ పద్మాసనం మీద బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు” అని దిక్పాలకుల సభల గురించి, బ్రహ్మదేవుడి సభ గురించి ధర్మరాజుకి వర్ణించి చెప్పాడు నారదమహర్షి.
హరిశ్చంద్రుడి గొప్పతనము
ధర్మరాజు అందరి సభల గురించి నారదమహర్షి చెప్పినదాన్ని విని “మహర్షీ! గొప్ప ధర్మాత్ముడైన పాండురాజు మొదలైన రాజులు అందరూ మయసభలో ఉన్నారు. కాని, హరిశ్చంద్ర మహారాజు దేవేంద్ర సభలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉండడానికి ఎంతో గొప్ప చరిత్ర ఉండి ఉండాలి. ఆ గొప్పతనం గురించి వివరించండి” అని అడిగాడు.
నారదమహర్షి ధర్మరాజు సందేహాన్ని తీరుస్తూ హరిశ్చంద్రుడి గొప్పతనం గురించి చెప్తున్నాడు. “ధర్మరాజా! హరిశ్చంద్రుడు త్రిశంకు మహారాజు కుమారుడు. అతడి అన్ని సమయాల్లోను నిజమే చెప్పేవాడు. యజ్ఞం, ధైర్యం, శాస్త్రం, ధర్మం అన్నింటిలోను ఎక్కువ ఆసక్తి కలిగినవాడు. సూర్యవంశానికి ఆభరణం వంటివాడు. అయోధ్యానగరానికి రాజు. విద్యకి ఉండే గొప్పతనాన్ని తెలుసుకున్నవాడు. అన్ని లోకాల్లోను వ్యాపించిన కీర్తి కలవాడు.
సూర్యవంశానికి కీర్తిని గడించి పెట్టిన హరిశ్చంద్ర మహారాజు తన బాహుబలంతో సప్తద్వీపాల్ని జయించాడు. అతడికి ఎక్కడా శత్రువులే లేరు. భూమండలం మీద ఉన్న రాజులు అందరూ అతడి ఆజ్ఞని శిరసా వహించేవాళ్లు. తన రాజ్యంలో వైభవం శాశ్వతంగా ఉండాలని రాజసూయ యాగం చేశాడు.
యజ్ఞం చేయించినవాళ్లకి ఇవ్వాల్సిన దక్షిణ కంటే అయిదు రెట్లు ఎక్కువ ఇచ్చి పూజించాడు. ఉత్తములైన బ్రాహ్మణుల కోరికల్ని భక్తితోను, వినయంతోను నెరవేర్చాడు. అతడు చేసిన దానాలు తీసుకున్న బ్రాహ్మణులు “రాజులందరిలోకి గొప్ప తేజస్సుతోను, కీర్తితోను ప్రకాశిస్తావు!” అని ఆశీర్వదించేవాళ్లు.
బ్రాహ్మణుల ఆశీర్వచన ఫలితం వల్ల రాజసూయయాగం పూర్తి చేసిన హరిశ్చంద్రుడు దేవేంద్రలోకాన్ని పొందాడు. అతడికి ఆ గొప్పతనం రాజసూయయాగం చెయ్యడం వల్లే కలిగిందని అందరూ అనుకున్నారు.