[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తాము ఎన్.సి.సి. క్యాంపుకు బయల్దేరక ముందరి కాలేజీ సంఘటనలను తలచుకుంటూంటారు ముగ్గురు మిత్రులు సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు, శ్రీనివాస్‌లు. వాళ్ళ ఆధ్వర్యంలో క్లాసు రూమ్‍లో తెగ అల్లరి జరుగుతుంది. అప్పటికి లెక్చరర్ రాకపోవడం, ఆడపిల్లలు అప్పుడే వస్తుండడం చూసిన వాళ్ళ అల్లరి ఇంకా పెరుగుతుంది. వనజ, ఆమె మిత్రులు తమ స్థానాలలో కూర్చుని, వెంటనే అదిరిపడి లేస్తారు. బెంచీలపై ఉన్న గ్రీజంతా వాళ్ల దుస్తులకంటుకుంటుంది. ఆడపిల్లలంతా వీళ్ళ ముగ్గురినీ తిట్టిపోస్తారు. వనజ వాళ్ళని బెదిరించి, ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది. కాసేపయ్యాకా, తెలుగు లెక్చరర్ రామాచారి గారితో పాటు క్లాసులోకి వస్తుంది. రామాచారి ఆయన మానాన ఆయన పాఠం చెప్పుకుపోతుంటే, మిత్రత్రయం వనజ గురించి మాట్లాడుకుంటారు. మాటలు శ్రుతి మించి – ఆమెకి తెలియకుండా, అందరి ముందు వనజని ముద్దుపెట్టుకుంటా అని ఛాలెంజ్ చేస్తాడు ఆంజనేయులు. ముగ్గురూ పందెం కట్టుకుంటారు. రోజులు గడుస్తుంటాయి. ఏ ప్రయత్నమూ చేయకుండా విలాసంగా తిరుగుతుంటాడు ఆంజనేయులు. కాలేజీలో ఓ ఫంక్షన్ జరుగుతున్న సమయంలో అబ్బాయిలు కూర్చునే కుర్చీల్లో పేడ పోయించి, ప్రతీకారం తీర్చుకుంటారు అమ్మాయిలు. సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ ఇతర అబ్బాయిలు అవమానంతో తల తిప్పుకుని బయటికి నడుస్తారు. ఆంజనేయులు కనబడడు వాళ్ళకి. వేదిక మీద ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. అమ్మాయిలు రకరకాల వేషధారణతో రాంప్ వాక్ చేసి వచ్చి వరుసలో నిలబడతారు. తర్వాత వనజ అందంగా నడుచుకుని రాగా, ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగుతుంది. తర్వాత మరో అమ్మాయి కశ్మీరీ వేషంలో వచ్చినా పెద్దగా స్పందన రాదు. ఆ అమ్మాయి వచ్చి వనజని మెచ్చుకుని, నీ అందం వల్లే, నన్నెవరూ పట్టించుకోలేదు అంటుంది. నువ్వూ అందంగానే ఉన్నావుగా అంటుంది వనజ. నేనే మొగాడినయితే మొనగాడిలా నిన్నెత్తికెళ్లిపోయేదాన్నంటూ, వనజ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందా అమ్మాయి. అందరూ చప్పట్లు కొడతారు. వనజ సిగ్గుపడి వెళ్ళిపోతుంది. మరో కార్యక్రమం మొదలవుతుంది. మిత్రులిద్దరూ ఆంజనేయులు కోసం వెతుకుతుంటే, ఇందాక కశ్మీరీ యువతి వేషం వేసిన అమ్మాయి వచ్చి వాళ్ళని పలకరిస్తుంది. దీపాల వెలుగులో ఆ అమ్మాయి కేసి చూసి విస్తుపోతారు వాళ్ళు. ఆ పిల్ల – ఆంజనేయులు. పందెం ప్రకారం బార్‍కి వెళ్ళి పార్టీ చేసుకుంటారు. ఆ మర్నాడు ఎన్.సి.సి. క్యాంపుకు బయలుదేరుతారు. – ఇక చదవండి.]
అధ్యాయం-3
[dropcap]వే[/dropcap]కువ వెన్ను తట్టటం తోనే విశ్వకన్నియ కళ్ళ కలువ రెప్పలు విప్పార్చుకుంటాయి. ప్రభాత కాంతిని స్వాగతిస్తూ తమస్సుకు వీడ్కోలు చెబుతూన్న యోగిలా వేగు చుక్క ప్రకాశిస్తుంది. ప్రకృతి పులకించి రాత్రంతా సమకూర్చుకున్న గాఢానుభూతుల్ని నెమరువేసుకుంటూ తన ఒడిలో విశ్రమిస్తున్న సకల జీవకోటినీ తట్టి లేపుతుంది. ఆదిత్యుడి వెండి వెలుగు లోకానికి నవశక్తి ప్రసాదిస్తూ సాక్షాత్కరిస్తుంది. ప్రపంచం మత్తుగా జోగుతున్న సమయంలోనే విశ్రాంతికి విశ్రాంతినిస్తూ పక్షుల కిలకిలా రావాలు భావానురాగాలకు సంధి చేస్తూ పల్లెను మేల్కొలుపుతాయి.
అది జగత్తును సందర్శింపచేసే జాగృతం.
పూలచెట్లు తమ ఎదపై పడిన స్వాతి ముత్యాల్లాంటి నీహారికలతో సరాగాలాడుతున్నాయి. దేశమాతలయిన పల్లెల్లో, పల్లెమాతలయిన గోవుల కాళీ గిట్టల ధూళి మేలి ముసుగు లాగా ఉండి ప్రకృతి ముగ్ధ మనోహరంగా ఉంది. ఖాళీ కడవల్ని చంకనెత్తుకుని పల్లె పడుచులు వూరికి దూరంగా ఉన్న చెరువుకు బయలుదేరుతున్నారు. ఊరి బయటవరకు కనిపిస్తున్న రామాలయం ధ్వజస్తంభం ఊరికి చిరునామాలా ఉంది. గుడీ, బడీ ఆ పల్లెకి అలంకారంగా ఉన్నాయి.
రాయుడు పాలెం. జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఎవరికీ పట్టనట్టు విసిరేసినట్టుండే పల్లె. దగ్గరున్న పట్నం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు ఎక్కాలంటే మెయిన్ రోడ్డుకి మూడు కిలోమీటర్లు నడచి వెళ్ళాలి.
జిల్లా కార్యాలయాల్లోనూ, రాజకీయ పార్టీలన్నింటితోను సత్సంబంధాలు నెరపుతూ తన పల్లె వేపు ఎవరూ చూడకుండా, తన అధికారానికి అహంకారానికి ఎదురు లేకుండా చూసుకుంటున్నాడు.
రాయుడు ఆ ఊరి మోతుబరి. తాతలిచ్చిన ఆస్తుల కంటే తన తెలివితేటలతో సంపాదించిందే ఎక్కువ. రాయుడు ఆ పల్లెకి రాజు. తరతరాలుగా వచ్చిన.. కాదు.. తీసుకున్న హక్కు.
అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది. అది ఎప్పుడూ తెరచి ఉండదు. అందులో ల్యాండ్‌లైన్ ఫోన్ ఉంది. అది ఎప్పుడూ పనిచేయదు. కాక మరో ఫోన్ రాయుడి ఇంట్లోనే ఉంది. అమెరికా నుంచి కొడుకు పంపిన మొబైల్ ఫోన్ అతని దగ్గర ఉన్నా, దాని మీద పెద్ద ఆసక్తి లేదు అతనికి. తన కనుసన్నలలో నడిచే పల్లె ప్రజల మ్రొక్కులు, మ్రొక్కుబడులు ఇచ్చే కిక్ ఫోన్ ఇవ్వదు. అందుకే ఊర్లోకి ఫోన్ సిగ్నల్స్ కోసం ప్రయత్నం చెయ్యలేదు. చెయ్యనివ్వలేదు.
ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. డాక్టర్ నెలకి రెండు మూడు రోజులు ఉంటాడు. గవర్నమెంట్ ఇచ్చే మందులన్నీ ఎక్కడికో వెళ్తుంటాయి. రాయుడికి పర్సనల్ డాక్టర్‌గా వ్యవహరిస్తాడు.
నీళ్ల కోసం కిలోమీటర్ నడిచి చెరువులో తెచ్చుకోవాలి. మంచినీళ్లు రాయుడి పొలం బావి లోంచీ ఇస్తాడు.. కానీ బిందెకి 10 రూపాయలు వసూలు చేస్తాడు. జిల్లా స్థాయి అధికారులు బావి తవ్వాలని సూచించినా రాయుడు పెడచెవిన పెట్టాడు.
ప్రొద్దెక్కింది. వేసవిలో పిల్లలకు సెలవు ఉంది గానీ ఆ బడికి మాత్రం సెలవు లేదు.
రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన కష్టార్జితాన్ని చతుర్ముఖ పారాయణంలో రాయుడికి ధారపోస్తున్నారు ఆశ్రితజనం. ఆకలి కడుపుల్ని ఆశల్తో నింపుకుని కడుపు నిండిన రాయుడికి కంపెనీ ఇస్తున్నారు.
ఇంతలో దూరంగా ఏదో వాహనం వస్తున్నట్లు ‘హారన్’ వినిపించింది. ఊళ్ళో పిల్లలందరూ అటుకేసి పరిగెత్తారు. ఆ బస్సు తమవైపు రావటం చూసి పేక ముక్కల్లోంచీ తలలు తిప్పి చూసారు రాయుడి బృందం. బస్సు ఆ బడి దగ్గర ఆగింది.
అంతే! వాళ్ళ బుర్రల్లో ఏవో అనుమానాలు, ఆశ్చర్యాలు, భయాలు, అర్థంలేని ఆలోచనలు.
రాయుడు మాత్రం గోల్డ్ ఫ్లేక్ సిగరెట్టుని స్టైల్గా తాగుతూ, విలాసంగా పొగ వదులుతూ పరిశీలనగా చూసాడు.
బస్సు లోంచీ ఖాఖీ దుస్తుల్లో ఎవరో దిగటం చూసి జనం భయపడ్డారు.
“అన్నలేమో”
“పోలీసులేమో”
“అసలు ఇంత పొద్దునే ఎందుకొచ్చినట్లు”
“ఎవరికోసం వచ్చినట్లు”
ఎందుకైనా మంచిదని పేకముక్కల్ని కలిపేసి టవల్‌లో చుట్టేసి వెనక ఉన్న క్లాస్రూమ్ లోకి గిరాటేసాడు రాయుడి గుమాస్తా శీనయ్య. మిగిలిన వాళ్లలో ఇద్దరు మెల్లిగా జారుకుంటున్నారు.
“అమ్మో.. మిలట్రీ వాళ్ళు” ఎవరో అరిచారు. “ఆగండెహె” విసుగ్గా అరిచాడు రాయుడు.
నిబ్బరంగా నిలబడి వచ్చే వ్యక్తిని చూడసాగాడు.
వెంకట్రావు ఎన్. సి. సి. కమాండర్ యూనిఫామ్లో వచ్చి రాయుడు దగ్గర ఆగాడు.
“నమస్తే” అని తనని పరిచయం చేసుకున్నాడు.
“నమస్కారం.. ఏమిటి విషయం?”
ఆ సరికి అనుచరులంతా మెల్లిగా రాయుడు వెనక జేరటం మొదలైంది. ఆసక్తిగా చూస్తున్నారు.
“ఈ ఊరి ప్రెసిడెంట్ ఎవరో చెబుతారా?”
వెనగ్గా ఉన్న శీనయ్య కాలు ఎగరేసుకుంటూ ముందుకొచ్చాడు. రాయుడు అతనివంక చూసి మందహాసం చేసాడు. శీనయ్య అందుకున్నాడు.
“ఎవరండీ మీరు? ఈయన రాయుడు గారు. ఈ వూరికి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అన్ని మినిస్టర్లూ ఈయనే. ఊరి పేరే ఈయనది”
“ఒహ్హ్.. వెరీ గుడ్.. మేము జిల్లా ప్రభుత్వ కళాశాల నుంచి వచ్చాం. ఈ వేసవి సెలవల్లో మా ఎన్. సి. సి. టీం మీ పల్లెలో శ్రమదానం చేసేందుకు జిల్లా అధికారులు నిర్ణయించారు. మీకు ఈ వివరాలన్నీ లెటర్ ద్వారా 10 రోజుల క్రితమే పంపారు. మీకు ఫోన్ కూడా ట్రై చేశారట.. కానీ కలవలేదు.”
శీనయ్య నవ్వుతూ, “భలే వారండీ.. ఫోన్ ఎప్పుడూ పని చెయ్యదండీ. ఇంకా పోస్ట్ అంటారా.. ఎప్పుడో పోస్ట్ మాస్టర్ గారు పదిహేను రోజులకొకసారి ఇలా వచ్చి అలా వెళ్తారండి. అప్పుడు ఆ ఉత్తరాలన్నీ బట్వాడా అయితాయండి.”
వెంకట్రావు కనుబొమ్మలెగరేసాడు అర్ధమయినట్లుగా..
రాయుడు కల్పించుకుంటూ, “వెంకట్రావు గారూ, చాల మంచి విషయం చెప్పారు. ప్రజాసేవకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది” అని అక్కడే ఉన్న ఇంటి పాలేరు కేసి చూసి “ఒరేయ్ భైరవా! సాయంత్రం పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేయి. ఈ కుర్రాళ్ళకి బళ్ళో వసతి ఏర్పాటు చేయండి. ఈ రోజు మధ్యాహ్నం మన ఇంటి నుంచి భోజనం పంపించండి” అని పనులు పురమాయించి, వెంకట్రావుతో కలసి బస్సు దగ్గరికి నడిచాడు రాయుడు.
తమ ప్రయత్నానికి రాయుడు వెంటనే ప్రోత్సాహం ఇవ్వటంతో వెంకట్రావు ప్రశాంతంగా నిట్టూర్చాడు. ఈలోపు బస్సు లోని వాళ్లంతా క్రిందకు దిగారు.
తన ముందుకొచ్చిన సుబ్బిగాడ్ని పలకరించాడు రాయుడు – “నీ పేరేంటి బాబూ?” అని.
“వీర వెంకట సదాశివ పరబ్రహ్మ గంగాధర సుందర సుబ్రహ్మణ్యం. చదువుతున్నది బికాం. – బి సెక్షన్, ఈశ్వర చంద్ర తారక సత్యనారాయణ ప్రభుత్వ కళాశాల. వయసు 22 ఏళ్ళు. ఎత్తు ఐదు అడుగుల నాలుగు అంగుళాలు. బరువు 110 కిలోలు. బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్!” ఆయాసపడుతూ ఆగిపోయాడు. అసిస్టెంట్ కమాండర్ మంచి నీళ్ల బాటిల్ ఇవ్వబోయాడు.
“ముందు రాయుడిగారికివ్వు” అన్నాడు వెంకట్రావు, సుబ్రహ్మణ్యం వంక అవాక్కయి చూస్తున్న రాయుడిని చూపిస్తూ.
ఒక్క గుక్కలో బాటిల్ అంతా తాగేసి స్తిమిత పడ్డాడు రాయుడు.
“నీ పేరు?” భయంగా చూస్తూ ఇంకొకడిని అడిగాడు.
“ఏ లు” అన్నాడు క్లుప్తంగా.
“ఆఁ..” అర్థం కానట్టు అడిగాడు రాయుడు.
“ఏ లు సార్”
“అంటే.. సుత్తి వేలు లాగానా?”
“కాదు. ఆంజనేయులు.. సింఫుల్‌గా ఏ లు.”
“ఇతని పేరు..” అంటూ వెంకట్రావు చెప్పబోతుండగా –
“దేనికోసం పదే పదే దేవులాడతావ్? శ్రీనివాసరావు.. శ్రీనివాసరావు” అన్నాడు తన ధోరణిలో..
“ఓహో.. నీ పేరు శ్రీనివాసరావన్నమాట” అన్నాడు రాయుడు.
“మా వాళ్లంతా అంతేనండీ.. అతివృష్టి.. అనావృష్టి..” అన్నాడు వెంకట్రావు. పరిచయాలు ముగిసాయి.
దూరంగా బడిలో శీనయ్య ఆధ్వర్యంలో క్లాస్ రూమ్ లను పడక గదులుగా, వంట గదిగా, మీటింగ్ హాల్‌గా మారుస్తున్నారు పనివాళ్ళు. పంచాయతీ సెక్రటరీ బళ్ళో కావలసిన బకెట్‌లు, బిందెలు, వంట సామాను, లాంతర్లు, దుప్పట్లు, దిళ్లు, చాపలు, జంపఖానాలు ఏర్పాటు చేసాడు.
క్యాడెట్స్ అందరూ తమ లగేజీలు తీసుకుని వసతి గృహంగా మారిన బడి కేసి కదిలారు.
***
సంధ్యా సమయం. ఆకాశంలో పక్షులు గూటికి చేరుతుంటే రాయుడి పాలెం ప్రజలు పంచాయితీ ఆఫీస్ వైపు కదిలారు.
సమావేశం మొదలైంది. వెంకట్రావు, రాయుడులు కుర్చీల్లో కూర్చున్నారు. ఎదురుగా వార్డు మెంబర్లు బెంచీలమీద కూర్చున్నారు. శీనయ్య అందరికీ మంచి నీళ్లు ప్లాస్టిక్ గ్లాసుల్లో సగానికి సప్లై చేస్తున్నాడు. బయట నిలబడ్డ ప్రజలకి కూడా చిన్న చిన్న గ్లాసులతో నీళ్లు ఇస్తున్నారు పంచాయతీ సెక్రటరీ. మీటింగ్ వార్డ్ మెంబర్లకే అయినా అందరూ వచ్చింది ఆ గుక్కెడు నీటికోసం. పైపెచ్చు కాలక్షేపం. అందరూ ఏదేదో కబుర్లాడుకుంటున్నారు.
రాయడు గొంతు సవరించునుకున్నాడు. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అతని దమ్ము ఏమిటో వెంకట్రావుకి అర్ధమైంది. రాయుడికి కూడా ఈమధ్య ఉపన్యాసం ఇచ్చే అవకాశం రాలేదు. అందుకే గుండెల నిండుగా గాలి పీల్చి మొదలెట్టాడు.
“నా పల్లె ప్రజలారా! మన వూరికి ఈ రోజు పండగ రోజు. ఎందుకంటే మన గ్రామానికి శ్రమదానం చేసేందుకు వీళ్ళందరూ పట్నం నుంచి వచ్చారు. మన ఊరి యువకులు కూడా వారితో కలసి శ్రమదానం చేసి సహకరించాలని మనవి చేస్తున్నాను” అని క్లుప్తంగా మాట్లాడి కూర్చున్నాడు.
రాయుడి అనుచరుడు, ఆంతరంగికుడు, రెండో వార్డు మెంబర్, వూళ్ళో ఏకైక వ్యాపారి అయిన పాపయ్య శెట్టి లేచి, “పట్నం బాబు లందరూ ఇట్టా మన వారి బాగు కోసం రావటం మన అదృష్టం. మనమందరం వాళ్లకి సహకారం చేయాలి. ఈ దేశంలో ఎన్నో ఊళ్ళు మనలాగానే అధ్వాన్నంగా ఉన్నా గానీ ఈళ్ళు మన వూరికే ఎందుకొచ్చారూ?” అందర్నీ చూసాడు. ఎవరూ మాట్లాడలేదు. అది వాళ్లకి అలవాటే. పాపయ్య శెట్టి కొనసాగించాడు –
“ఎందుకంటే, మన రాయుడు గారిని ముఖమంత్రి గారు పిలిచారు గురుతుందా? అప్పుడు హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు మన ఊరి గురించి గట్టిగా చెప్పారన్నమాట.. రాయుడి గారి పెజాసేవ తెలిసిన పెబుత్వం ఎంటనే ఈళ్ళని ఇక్కడికి తోలిందన్నమాట. ఈ ఇసయం మీకెవ్వరికీ తెలీదు కదా.. ఎందుకంటే, రాయుడు గారు కబుర్లతో కాలం గడిపే మడిసి కాదు. గాంధీ గారిలాగానే నిరాడంబరమైన మడిసి. ఈ ఇసయం మీ అందరికీ తెలుసు. ఇంకా నేను కూసుంటా” అంటూ ముగించాడు.
వెంకట్రావు అవాక్కయ్యాడు. స్వచ్ఛందంగా తాము తలపెట్టిన కార్యక్రమానికి రాజకీయ రంగులు ఎలా అద్దుతున్నారో చూస్తూ ఉండిపోయాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఊరి జనమంతా తనేం చెబుతాడో అన్నట్లుగా చూస్తూండేసరికి.. తప్పదన్నట్లు లేచాడు.
“రాయుడు పాలెం ప్రజలందరికీ నమస్కారం.” చప్పట్లు మార్మ్రోగినయి. దీంట్లో చప్పట్లు కొట్టేంత విషయం ఏముందో అర్థం కాలేదు.
“‘గ్రామాభ్యదయం’ కార్యక్రమంలో భాగంగా ఈ వూర్లో మా శ్రమదానంతో వసతులు కల్పించాలన్న ఆశయంతో వచ్చాం. అడుగు పెట్టగానే రాయుడు గారి స్వాగతం మాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. మా ఆశయానికి బలం వచ్చింది. ముందుగా ఊరి పరిస్థితిని సమీక్షించి, ఖర్చు అంచనాలు వేసి, మేము చేయగల శ్రమదానంతో ఒక కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ప్రణాళిక లాగ తయారుచేసుకుందాం.” అని కూర్చున్నాడు.
బయట జనాల్లోంచీ ఎవరో – “మా వూరికి నీళ్లు లేవు. ఓ బావి తవ్వించండి.”
“ఎవడ్రా వాడు.. అయినా బావెందుకేహె? దేవుడిలాంటి రాయుడు గారు ఆయన బావిలో నీళ్లు మనకే గదా ఇస్తున్నారు.” అన్నాడు శీనయ్య.
“ఆ బాబు అడిగాడు గదాని నోటికొచ్చినట్టు వాగమాకండి” హెచ్చరించాడు పాపయ్య శెట్టి. జనాల్లో గుసగుసలు మొదలైనాయి. రాయుడు వెంకట్రావుని చూస్తూ, “వీళ్ళని సలహాలడిగేకన్నా మనం మనం కూర్చొని రేపు ఈ విషయాన్ని వివరంగా ఆలోచిద్దాం” అన్నాడు.
“వాళ్ళ సమస్యల్ని చెప్పనివ్వండి.. మనకంటే కూడా అనుభవించేవాళ్లకే ఎక్కువ ఆలోచన ఉంటుంది కదా?” అన్నాడు వెంకట్రావు.
“అ, ఆ లు రాని వాళ్లకి ఆలోచన్లేమిటండీ.. నోటికొచ్చింది కూస్తారు..” అంటూ కుర్చీలోంచి లేచాడు రాయుడు. వెంకట్రావు కూడా లేవక తప్పలేదు. మీటింగ్ అయిందని పంచాయతీ సెక్రటరీ ప్రకటించాడు. జనం ఇంటిముఖం పట్టారు.
చీకట్లు లోకాన్ని కప్పేస్తున్నాయి.
***
“మీరు ముగ్గురూ వెళ్లి నీళ్లు తీసుకు రండి. ఇంక వంట మొదలేడదాం” అన్నాడు వెంకట్రావు మిత్రత్రయంతో. మిగిలిన క్యాడెట్స్ అందరూ తలా ఒక పని చేస్తున్నారు.
“అమ్మో అంత దూరమా.. అదీ చీకట్లో..” అన్నాడు సుబ్రహ్మణ్యం.
“లాంతరు తీసుకెళ్లండి.. పంచాయతీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారుగా” అన్నాడు వెంకట్రావు.
ఇక తప్పదన్నట్లు ముగ్గురూ మూడు బిందెలు తీసుకుని బయల్దేరారు. బస్సులో వెళ్దామంటే సన్నటి కాలిబాట. పొలాల మధ్యగా వెళ్ళాలి. బద్దకంతో దిగులు చుట్టుముట్టింది.
మసక చీకట్లో నడుస్తూ చెరువు దగ్గరికి చేరుకున్నారు.
“ఒరేయ్ అంజి.. మన వెంకట్రావు సారు కావాలనే మనల్ని ఇలా హింసిస్తున్నాడు. కాలేజీలో మనల్ని ఏవీ చెయ్యలేక, ఇలా కసి తీర్చుకున్నాడురా” వాపోయాడు సుబ్రహ్మణ్యం.
“చూద్దాం లేదా.. మనకీ రెండ్రోజుల్లో అంత అర్థమవుతుందిగా. అప్పుడు ఆలోచిద్దాం” అన్నాడు శ్రీనివాస్.
ఉన్నట్టుండి గావుకేక పెట్టాడు సుబ్రహ్మణ్యం. శ్రీనివాస్, ఆంజనేయులు అతన్ని చుట్టేసి “ఏమయిందిరా” అన్నారు.
“నా కాలు.. నా కాలు..” అంటూ చిందులు తొక్కుతున్నాడు సుబ్రమణ్యం.
“నీ కాలికేమైంది” అంటూ పరిశీలనగా చూసారు.
సుబ్రహ్మణ్యం కాలికింద పడి ఓ కప్ప పిల్ల ఆత్మహత్య చేసుకుంది.
“పాపం.. కప్పపిల్లని దారుణంగా హత్య చేసావు కదరా?!”
“అయినా, అది ఛస్తే నీవు గావుకేకలు పెడతావేంటిరా? ఏనుగంత శరీరం వుంది ఏం లాభం? ఎలక కున్నంత గుండె ధైర్యం కూడా లేదు. పద పద..” అన్నాడు శ్రీనివాస్.
ముగ్గురూ నీళ్ల బిందెల్ని భుజాన వేసుకుని బయల్దేరారు. తన ఒళ్లే తనకు బరువుగా ఫీల్ అవుతున్నాడు సుబ్రహ్మణ్యం. ఐదడుగుల కొకసారి ఆగసాగాడు. కాస్త దూరం నడవటానికి అరగంట పట్టింది.
“ఇక వీడితో పెట్టుకుంటే తెల్లారేట్టుంది” అన్నాడు ఆంజనేయులు.
“ఒరేయ్ సుబ్బిగా.. ఇలా తే..” అని వాడి బిందెని కూడా చెరొక వైపు పట్టుకుని నడిచారిద్దరూ.
తన ప్లానుకు తానే మురిసిపోతూ, సంతోషంగా నింపాదిగా వాళ్ళ వెనక నడవసాగాడు సుబ్రహ్మణ్యం.
***
టైం ఎనిమిదయ్యింది. అందరికీ ఆకలి దంచేస్తోంది. సుబ్రహ్మణ్యం ఒక్క క్షణం కూడా ఆగలేకపోతున్నాడు. వంటగది లోంచీ వస్తున్నా ఘుమఘుమలు ఆకల్నీ, అసహనాన్నీ పెంచేస్తున్నాయి. వెంకట్రావు దగ్గరికి పోయాడు. ‘ఏమిటన్నట్లు’ చూసాడు వెంకట్రావు.
“సార్.. బాగా ఆకలి వేస్తోంది సార్”
“అయితే.. ఇంకా సమయం పడుతుంది..”
“ఆగలేకపోతున్నాను సార్”
“అయితే మీ అమ్మమ్మ పంపించిన చక్కిలాలు లాంటివేవో వున్నాయిగా.. అవి తిని కాలక్షేపం చెయ్”
“అమ్మో.. అవి తింటే మళ్ళీ అన్నం ఎక్కువ తినలేను సార్..” అని బెంగపడ్డట్టు మొహం పెట్టాడు. వెంకట్రావు సీరియస్‌గా చూసాడు.
“అయినా మా అమ్మమ్మ ముందే చెప్పింది. అందరూ నిద్రపోయింతర్వాత తిను, లేకపోతే దిష్టి కొడుతుందనీ” ముద్దు ముద్దుగా చెప్పాడు.
“అవునా.. అయితే వెళ్లి వంట త్వరగా అయ్యేట్టు సహాయం చెయ్యి” అన్నాడు వెంకట్రావు.
“మళ్ళీ పని చేయాలా? హు..” అంటూ వంటగది వేపు నడిచాడు సుబ్రహ్మణ్యం.
‘ఆకతాయి కుర్రాళ్ళయినా బాగానే కుదురుగా ఉన్నారిక్కడ’ మనసులో అనుకున్నాడు వెంకట్రావు వెళ్తున్న సుబ్రమణ్యాన్ని చూస్తూ..
కాసేపటికి వంట ఇంట్లోంచి కేకలు వినిపించినయ్. ఏదో వ్రాసుకుంటున్న వెంకట్రావు అదిరిపడి లేచి వడివడిగా కిచెన్ దగ్గరికి వచ్చాడు. శ్రీనివాస్, ఆంజనేయులు మిగిలిన క్యాడెట్లు కూడా హడావుడిగా వచ్చారు.
“ఏమైంది” కంగారుగా అడిగాడు వెంకట్రావు.
“చూడండి సార్.. సుబ్బిగాడు తీరిగ్గా కూర్చుని సాంబారు తాగేస్తున్నాడు..”
“రుచి చూస్తున్నాను సార్.. మీరేగా అన్నారు సాయం చెయ్యమని”
వెంకట్రావు తలపట్టుకుని కూర్చుండిపోయాడు.
ఇంతలో, మిగిలిన వాళ్ళు సప్పర్ రెడీ అని చెప్పి వెళ్లారు. బయట హాలులో రెండు బల్లల మీద వంటకాల గిన్నెలు పెట్టి బఫే తరహాలో అందరికీ పేపర్ ప్లేట్స్ పక్కనే పెట్టారు.
ఆ మాట విన్న సుబ్రహ్మణ్యం పరుగెత్తి మూడు ప్లాట్లు తీసుకుని మూడింటిలో అన్నం, పదార్థాలు వేసుకుని కష్టపడుతూ వాటిని పట్టుకుని ఓ మూలకి వెళ్ళసాగాడు.
దారిలో వెంకట్రావు కలసి “ఏమిటి సుబ్బీ.. మూడు ప్లేట్లు తీసుకెళ్తున్నావ్?” అని అడిగాడు.
“మా ముగ్గురికీ సార్..”
“అబ్బో.. నువ్వు సాయం కూడా చేస్తున్నావా?” నవ్వాడు వెంకట్రావు.
“అదేంటి సార్.. నాకు స్నేహం విలువ తెలుసు సార్.. ఇందాక వాళ్ళు నాకు నీళ్ల బిందె మోశారు. ఇప్పుడు నేను వాళ్ళ అన్నం ప్లేట్ మోస్తున్నాను. ఇందులో అంత గొప్ప విషయం ఏమీ లేదు సార్” మొహమాటపడిపోతూ గబగబా వెళ్ళిపోయాడు.
వెంకట్రావు నవ్వుకుంటూ బఫే టేబుల్ దగ్గరకొచ్చేసరికి శ్రీనివాస్, ఆంజనేయులు ఇద్దరూ ఓ ప్రక్కగా తింటూ కనిపించారు. వాళ్ళ దగ్గరికి వచ్చి, “అదేంటిరా.. మీ కోసం సుబ్బిగాడు రెండు ప్లేట్‌ల నిండా నింపుకుని వెళ్తే మీరు ఇక్కడ తింటున్నారు?”
ఆంజనేయులు, శ్రీనివాస్ నవ్వారు.
“అటు చూడండి సార్”
వెంకట్రావు అయోమయంగా అటు చూసాడు. అప్పటికే మొదటి రౌండ్ పూర్తయి మళ్ళీ మూడు ప్లేట్‌లూ నింపుకుని హడావుడిగా మూలకి వెళ్తున్నాడు సుబ్రహ్మణ్యం.
హతాశుడై వెంకట్రావు టేబుల్ వైపు చూసాడు. ఖాళీ గిన్నెలు తీసేస్తున్నారు సర్వింగ్ టీం..
“ఒరేయ్ నేను ఇంకా తినలేదురా” గావుకేక పెడుతూ వెళ్ళాడు వెంకట్రావు.
“అదేంటి సార్.. ఇప్పుడే సుబ్బిగాడు మీ కోసమని చెప్పి గిన్నెల్లో ఉన్నదంతా ఊడ్చి పెట్టి తీసుకుపోయాడుగా” అన్నారు వాళ్ళు.
నిస్పృహ, నిస్సహాయత, నీరసం, ఆకలి, రోషం, ఆక్రోశం, నిర్వేదం వంటి మల్టిపుల్ ఫీలింగ్స్‌తో అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు వెంకట్రావు.
(సశేషం)