కథా నాటిక రచనా పోటీలు విజేతలకు పురస్కార ప్రదాన సభ – నివేదిక

0
13

[కొలకలూరు (తెనాలి) నాటక పరిషత్ – తెలుగు కళాసమితి, విశాఖపట్నం – కథానాటిక రచనా పోటీలు – విజేతలు పురస్కార సభ నివేదికని అందిస్తున్నాము.]

19 మే 2024 న, తెలుగు కళాసమితి విశాఖ వారు నిర్వహించిన కథానాటిక రచన (కథను నాటికగా మంచి రాయడం) పోటీలలో బహుమతి పొందిన రచయితలకు, తెనాలి దగ్గర కొలకలూరులో, పురస్కార ప్రదాన సభ జరిగింది. మూడు రోజులపాటు జరిగిన ‘కొలంకపురి నాటక కళాపరిషత్’ వారి వార్షికోత్సవ సభలో, ఈ కార్యక్రమాన్ని జరిపారు.

ఈ పోటీలో పాణ్యం దత్తశర్మ నాటిక ‘యత్రనార్యస్తు పూజ్యంతే’కు తృతీయ బహుమతి, పదివేల రూపాయల నగదు పురస్కారం, జ్ఞాపికతో రచయితకు ఆత్మీయ సత్కారం లభించాయి. ఇదే పేర, జాగృతి వారపత్రిక దీపావళి వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీకి రాసిన కథకు 2022 లో తృతీయ బహుమతి లభించింది. దీనిని 45 నిమిషాల నాటికగా రచయిత మలచారు. కథకు బహుమతిని, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి చేతుల మీదుగా అందుకొన్నారు రచయిత.

పోటీకి న్యాయనిర్ణేతగా, ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు శ్రీ చలసాని కృష్ణప్రసాద్ గారు వ్యవహరించారు. సమాజ సమస్యలను ప్రతిబింబించే ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ వంటి నాటకాలు, ప్రజలను చైతన్యపరుస్తాయని ఆయన అన్నారు. నాటక రచయితలు, నాటక ప్రదర్శన యోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. శ్రీ వై. ఎస్. కె. ఎన్. స్వామి గారు ఈ పోటీని పర్యవేక్షించారు.

సభకు డా॥ కందిమళ్ల సాంబశివరావు గారు అధ్యక్షత వహించారు. ‘నాటకాంతం హి సాహిత్యం’ అని ఆయన చెబుతూ, తెలుగు నాటక రంగం రచనల కొరతతో సతమతమవుతుందనీ, నాటక రంగం ‘performing art’ కాబట్టి, సందేశం వెంటనే పుజలకు చేరుతుందన్నారు.

ప్రముఖ సినీ, నాటకరచయిత బుర్రా సాయిమాధవ్ గారు విశిష్ట అతిధిగా సభకు విచ్చేసి, బహుమతి పొందిన రచయితలను అభినందించారు. ప్రముఖ రంగస్థల నటులు, రచయితలు. శ్రీ బలరామమూర్తి. శ్రీ భాస్కరచంద్ర గారలు హైదరాబాదు నుండి హాజరైనారు. ఆ రోజు హోటల్ బృందావన్ (తెనాలి) జరిగిన సాహిత్యగోష్టిలో, శ్రీ చలసాని కృష్ణప్రసాద్ గారు, శ్రీ భాస్కరచంద్ర గారు, శ్రీ పాణ్యం దత్తశర్మ గారు. డా॥ జెట్టి యల్లమంద గారు, శ్రీ రాజేంద్ర ప్రసాద్ బాబు (బాపట్ల) గారు పాల్గొన్నారు.

ప్రతీకాత్మకంగా దర్శకుడు స్టేజి మీద దృశ్యాన్ని ఎలా ఆవిష్కరించగలడో కృష్ణపసాద్ గారు వివరించారు. జార్జ్ బెర్నార్డ్ షా గారి Problem Plays గురించి ముగింపులలో ఆయన ఏ మాత్రం రాజీ పడేవారు కాదని, పాణ్యం దత్తశర్మ అన్నారు. నాటక లక్షణాలను శ్రీ జెట్టి యల్లమంద ఉటంకిస్తూ, వాచ్యంగా, సూచ్యంగా, ఇతివృత్తాన్ని ఆవిష్కరించాలని అన్నారు. శ్రీ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ, భగవంతుని తర్వాత సృష్టికర్త కవి, రచయితలేనన్నారు. స్టేజి మీద పరిహరించవలసిన దృశ్యాలను ఉటంకించారు.

వెటరన్ రంగస్థల నటులు, దర్శకులు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కార గ్రహీత శ్రీమాన్ నూతలపాటి సాంబయ్య మాస్టారు గారికి గోపరాజు శివరామసుబ్రహ్మణ్య శర్మ గారి జీవన సాఫల్య పురస్కారాన్ని, వారి కుమారుడు గోపరాజు విజయ్ ప్రదానం చేశారు. సభకు వందలాది మంది నాటకాభిమానులు హాజరై చివరివరకు కార్యక్రమాన్ని వీక్షించారు. చివరగా శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు వారిచే ‘కౌసల్యా సుప్రజారామ’ అన్న నాటక ప్రదర్శింపబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here