అమ్మో పిల్లలు!

2
3

[బాలబాలికల కోసం ‘అమ్మో పిల్లలు!’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

[dropcap]ఇం[/dropcap]టికి కొత్తవారెవరో వచ్చారు. తాతగారి స్నేహితులనుకుంటా. అందరూ కూర్చుని మాట్లాడుతున్నారు. తాతగారి స్నేహితులైతే తాతగారి గదిలోకి వెళ్తారు. మరి అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఏడేళ్ళ ఆరీకి అంతుబట్టలేదు. నెమ్మదిగా అమ్మ పక్కన చేరాడు.

“అమ్మా, అంతా సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. దేని గురించి. నేను తెలుసుకోవచ్చా?” తన భాష, ఇంగ్లీషులో అడిగాడు. వాడు అమెరికా పౌరుడు మరి.

అమెరికా పిల్లలకి అడిగిన ప్రశ్నలకి వెంటనే సమాధానం వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తారు. అందుకే తల్లి చెప్పింది నెమ్మదిగా ఆవిడ భాష తెలుగులోనే. పిల్లలకి తమ మాతృభాష తెలుగు కూడా ముందునుంచీ అలవాటు చెయ్యాలనుకునే అమ్మ.

“ఈ ఇల్లు అమ్మమ్మ, తాతగార్లది కదా. వాళ్ళ తర్వాత ఈ ఇంట్లో ఎవరుంటారు.”

“తర్వాత అంటే? అమ్మమ్మ, తాత ఎక్కడికెళ్తారు? మన దగ్గరకి వస్తారా?”

“లేదు నాన్నా, బాగా పెద్దవాళ్ళయ్యాక వాళ్ళు చనిపోతారు కదా! అప్పుడిక్కడ ఎవరుంటారు? అందుకే వారి తర్వాత ఈ ఇల్లు నాకూ, మావయ్యకీ వచ్చేటట్లు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. నేనూ, మావయ్యా వాళ్ళ పిల్లలం కదా.”

వాడికేదో కొంచెం అర్థమయింది. ఇంకొంచెం సేపు ఆలోచించాడు. తర్వాత తన క్వశ్చెన్ అడిగాడు అమ్మని. “మరి మీరు కూడా ఓల్డ్ పీపుల్ అయ్యాక చనిపోతారు కదా. అప్పుడు ఈ ఇల్లు ఎవరికిస్తారు?”

“అమ్మమ్మ, తాతగార్ల పిల్లలం మేము గనుక మాకు వస్తుంది. మా తర్వాత మా పిల్లలు మీరే కదా. మీకే వస్తుంది.”

వాడి భవిష్యత్ వాడికే కాదు, ప్రస్తుతం ఎవరికీ తెలియదు. కానీ ఆరీ అనుమానం తీరింది. తమ్ముణ్ణి తీసుకుని తమ రూమ్ లోకి వెళ్ళాడు. వాణ్ణి కూర్చోబెట్టి తను తెలుసుకున్న విషయం చెప్పాడు.

“నీనీ, నాకీ రూమ్, నీకీ పక్క రూమ్. పక్కనే వుంటే ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు. మరి తాతా వాళ్ళ రూమ్ ఎవరికిద్దాం?”

వాడే కొంచెం సేపు ఆలోచించాడు.

“ఆ, వాన్యకి. మావయ్య తర్వాత వాన్యకే వస్తుంది కదా ఆయన ఇల్లు. అందుకని వాన్యకి.”

హాల్లో పెద్దవాళ్ళ పంపకాలు తేలలేదుగానీ, రూమ్‌లో చిన్న పిల్లల పంపకాలు అయిపోయాయి. వింటున్న పెద్దవాళ్ళని వాళ్ళకి తెలిసిన హావభావాలని మించిన తెలియని భావమేదో పలకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here