[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]
[dropcap]సుం[/dropcap]దరం టిప్‌టాప్‌గా తయారయ్యాడు. చాక్‌లెట్ కలర్ పాంటు మీద వెండి తెరలా మెరిసే తెల్లని షర్ట్ తొడిగాడు. ఎక్కడి నుండో ఓ వెస్ట్‌కోట్ తెచ్చి తగిలించుకున్నాడు.
“అన్యాయం” అన్నాను.
“అంతే! కష్టపడి క్రింది నుండి పైకొచ్చిన వాడెవ్వడూ లోకానికి నచ్చడు. ఈర్ష్య మనిషిని బాధించినట్టు మరి ఏ రోగమూ బాధించదు”
“నాకెందుకోయ్ ఈర్ష్య?”
“మరి ఏది అన్యాయం అంటావు?”
“ఇలాంటి దుస్తులలో మిర్చీ బజ్జీలు అమ్మటం కరెక్ట్ కాదంటాను”
“ఓహో! ఓ బండి తోసుకుంటూ అరుచుకుంటూ వెళితే నువ్వు ఏదో పేపరు చదువుతూ నన్ను ఆపుతావు. ఓ రెండు కొనుక్కుని చిల్లర డబ్బులు నా మీద కొడితే ఎంతో సంతృప్తిగా ఉంటుంది అవునా?”
“అబ్బా వదిలెయ్‌రా. ఏంటి ఇంతకీ ప్రోగ్రామ్?”
“మేనేజ్‍మెంట్ ఇన్‍స్టిట్యూట్‌లో ఉపన్యాసానికి వెళుతున్నాను”
తెరిచిన నా నోరు అలానే ఉండిపోయింది. సుందరం ఈల పాట ఏదో పాడుకుంటూ రెండు మూడు దువ్వెనలతో దువ్వుకుంటూ క్రాఫ్ సరి చేసుకుంటున్నాడు.
దగ్గరగా వెళ్ళి మెల్లగా భుజం తట్టాను.
“యస్?” అన్నాడు.
“ఎవరికో చెప్పబోయి నీకు చెప్పారేమో ఆలోచించు. అక్కడికెళ్ళాక ఇబ్బంది పడగలవు”
నన్ను అమితాబ్ బచ్చన్‌లా ఓ చూపు చూశాడు.
“అమితాబ్‌ని కూడా నీ గొంతు రేడియోకి సరిపోదని చెప్పి పంపించేశారట. కంఠం బలహీనంగా ఉందన్నారట. ఏమైంది తరువాత? ఆయన గొంతు దేశం బలహీనత అయి కూర్చుంది. దటీజ్ బజ్జీ… మిర్చీ బజ్జీ!”
హుషారుగా ఓ ఫైల్ సర్దుకున్నాడు. తలుపు దాకా వెళ్ళాడు. హీరోలా నా వైపు వెనక్కి చూశాడు. తలుపుదాకా వెళ్ళందే తెలుగు హీరో, హీరోయిన్‌కి ఏదో తొందరగా గుర్తురాదు!
“ఆలోచించుకో…” అన్నాడు. “… నన్ను యాక్షన్‌లో చూడాలంటే పెట్టి పుట్టాలి. కమాన్”
ఎందుకైనా మంచిది అని అనుసరించాను.
***
ఎంతో విశాలంగా ఉన్న క్లాస్‌రూమ్ పూర్తిగా నిండిపోయి ఉంది. నన్ను ముందు వరుసలో కూర్చోపెట్టారు. స్టేజ్ మీద సుందరం కూర్చున్నాదు.
నిజానికి సుందరం చదువుకోలేదని చెప్పటం తప్పు. చాలామంది లాగా ఉన్నత విద్య చదివాడు. ఆ మాటకొస్తే మానేజ్‌మెంట్ కూడా చదివాడు. న్యాయం పట్టి పిండితే ఓ నిరుద్యోగిగా, పట్టభద్రునిగా చెప్పుకుంటే ఇలా ఈ స్టేజ్ ఎక్కేవాడా? మిర్చీలో ఏదో మర్మం ఉంది.
“సుందరం గారి గురించి చెప్పేముందు కొన్ని విషయాలు ప్రస్తావించవలసి ఉంది…” పెద్దమనిషి చెబుతున్నాడు. “… ఈ ప్రపంచం యావత్తూ ఒక స్టేజ్ అని షేక్‌స్పియర్ చెప్పాడు. మేనేజ్‌మెంట్ అనే సబ్జెక్ట్ డ్రక్కర్ పుస్తకంలోనో లేక ఏదో గొప్ప విద్యాసంస్థలోనో ఉన్నదనుకోవడం పొరపాటు. అది ఏ రంగంలో చూసినా ఉంది. ఈ రోజు మిర్చీ బజ్జీ అనే ఓ సామాన్యమైన వంటకాన్ని చెయిన్ కాటరింగ్ సంస్థగా మార్చి ఆ బజ్జీని పుర్తిగా సంస్థాగతం చేసి అనితర సాధ్యమైన మేనేజ్‌మెంట్ ప్రతిభను వాడి రేపో మాపో ఈ ‘మిర్చీ’ కంపెనీని మార్కెట్‍లో లిస్టింగ్ చేయబోతున్న ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. మనం సిద్ధాంతాలను పుస్తకంలో చదువుతాం. ఆయన ప్రజల మధ్య వాటిని అభ్యసించాడు. కేవలం మిర్చీయే కాదు, నడి బజారులో ఏ వస్తువైనా సరే సుందరానికి కరతలామలకం…” అంటూ అతని వైపు చూశాడు. సుందరం తలవంచుకుని సిగ్గు నటిస్తూ చిరునవ్వు నవ్వాడు.
“నేను అతని టైం వృథా చేయను. ప్లీజ్ వెల్‌కమ్ ద మిర్చీ మెగాస్టార్, సుందరం!”
సుందరం రెండు చేతులూ జేబుల్లో పెట్టుకుని ఓ ప్రొఫెసర్ అడుగులు వేసినట్లు కదిలాడు. అక్కడున్న ఓ కుర్రాడి చేత మైక్ సెట్ చేయించుకున్నాడు. ముందు ఉన్న పొజీషన్‍లోకే మరల అది వచ్చింది. అతడి వైపు సరదాగా ఓ చిరునవ్వు పారేశాడు. క్లాసంతా సింహావలోకనం చేశాడు. ఇద్దరు అమ్మాయిలు కొద్దిగా వెటకారంగా చూసినా పట్టించుకోడని నాకు తెలుసు. అమ్మాయిలు తన వైపు ఒకలాగా చూస్తున్నా మనం అసలు వాళ్ళ వైపు చూడకోడదనేది ప్రతి తెలివిగల మగాడి సిద్ధాంతం!
“పార్థసారథిగారు ఏదో చెప్పారు…!” అన్నాడు. “… కాకపోతే పెద్దగా అర్థం కాలేదు…”
ఎందుకో చప్పట్లు మ్రోగాయి. సుందరం చిన్నగా నవ్వాడు.
“మిర్చీలో ఏదో ఉందీ, ఏదో ఉందీ అనుకుంటూ పూర్తి బజ్జీ అంతా తినేస్తాం… మేనేజ్‌మెంట్ కూడా అంతే… చివరకు ఏమీ ఉండదు. కాకపోతే డిగ్రీ చేతికొస్తుంది. అక్కడ మిర్చీ ముచిక అవతల పారేస్తాం, ఇక్కడ సర్టిఫికెట్ ఇంట్లో పారేస్తాం! కానీ అదే మిర్చీ మరొకరు, ఓ అమ్మాయి మనలను ఓరచూపు చూస్తూ తింటుంటే ఎందుకో మరో మిర్చీ కొరుక్కుని తినాలనిపిస్తుంది. దటీజ్ మేనేజ్‌మెంట్!”
చప్పట్లు మారుమ్రోగాయి. ఎవడో ఈల కూడా వేశాడు.
“మీ అందరికీ ఎన్నో సిద్ధాంతాలు క్లాసుల్లో చెబుతారు. దీని ప్రకారం ఇది, దాని ప్రకారం అది. అదీ కరక్టే, ఇదీ కరక్టే అని ఎన్నో చెబుతారు….”
ఓ కుర్రాడు లేచి నిలబడ్డాడు.
“సార్, మీ ఆత్మవిశ్వాసాన్నీ, ఆత్మబలాన్నీ దెబ్బతీసిన సంఘటన ఏదైనా ఉందా? మీరు అందులోంచి ఎలా బయటకు వచ్చారు?”
“మంచి ప్రశ్న…” సుందరం చెప్పాడు. “… నిజానికి అందరూ మన కాలు లాగాలనే చూస్తూ ఉంటారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడినప్పుడు మనం వాళ్ళని వదిలేసి మనకెందుకని ఇంటికి పోయి బాధపడిపోతూ ఉంటాం. మిర్చీ బజ్జీ వ్యాపారంలో నేను ఎదుర్కొన్న ఒక పరిస్థితి గురించి మీకు చెబుతాను. నిజానికి నాకు ఆ ధైర్యం మిర్చీయే ఇచ్చిందని చెప్పాలి”
***
రైలు అలా మధ్య తరగతి బ్రతుకులా ఆగుతూ సాగుతూ, ఆగి మరల సాగుతోంది. ఆగుతుందని చెప్పలేము, ఆగిపోతుందని చెప్పలేము. పూర్తిగా సాగిపోతుందనీ చెప్పలేము. కాలేజీలో చదువుకుంటున్న రోజులవి. కిటికీ దగ్గర అటూ ఇటూ వయసు మీద పడుతున్న భార్యాభర్తలు కూర్చున్నారు. నా ఎదురుగా ఒక ప్రొఫెసరులా కనబడుతున్న వ్యక్తి ఉన్నాడు. బోగీలోని సీట్ల క్రింద ఉన్న చెత్త తుడుస్తూ ఓ కుర్రాడు కొద్దిసేపు ఆగి అడుక్కుంటున్నాడు. ఓ రూపాయి వాడి చేతిలో పెట్టాను. కిటికీ దగ్గర కూర్చున్న పెద్దావిడ వెంటనే చెప్పింది – “చూడండీ, ఈ కాలం కుర్రాళ్ళకి అసలు ఆలోచన లేదు. ఏదైనా చేసేడప్పుడు ఎందుకు అని ఆలోచించరు. ఏం లాభం చదువుకుని?”
ఎదురుగా ఉన్న విధేయుడు ‘కరెక్ట్’ అని అన్నాడు. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. టీ కాన్ పట్టుకుని ఓ కుర్రాడొచ్చాడు. నన్ను రెండు మూడు సార్లు అడిగినా నేను తీసుకోలేదు. అతను వెళ్ళిపోయాడు.
“చూశారా?…” ఆవిడ మళ్ళీ తగులుకుంది. “… మళ్ళీ ఇలా ఉంటారీ కుర్రాళ్ళు. టీ త్రాగాలనుంది, అయినా నేనేమైనా అంటానేమోనని త్రాగలేదు.”
‘కరెక్ట్’
‘ఇదొక సిండ్రోమ్’
నా ఎదురుగా ఉన్నాయన పేపరు దించి నన్ను చూశాడు. నేనేమీ మాట్లాడలేదు.
రైలు ఆగింది.
“ఏ ఊరండీ?” నా ఎదురుగా ఉన్నాయన అడిగాదు.
“కమలాపురం” అన్నాను.
“అయితే కడప దాటి పోయిందా?” ఆవిడ అడిగింది.
“పొరపాటు పడ్డారండీ….” ఈయన అన్నాడు. “… కడప దీని తరువాత స్టేషన్”
“ఓ…”
రైలు కదిలింది. ఈయన ఎటో వెళ్ళొచ్చాడు. వచ్చి కూర్చున్నాడు.
“మీరు చాలా పొరపాటు పడ్డారు మేడమ్. మనం రేణిగుంట వైపు వెళుతున్నాం కదా! సో… కమలాపురం తరువాత కడప వస్తుంది”
“…”
“మీరు చాలా పొరపాటు పడ్డారు”
నాకు నవ్వు ఆగడం లేదు. ఆవిడ కిటికీ వైపు నుంచి ఎందుకో ఇటు తిరిగింది.
“ఏమవుతోందంటే… మనం టువర్డ్స్ రేణిగుంటకదా? సో… కమలాపురం ముందొస్తుంది”
“…”
“మీరు చాలా పొరపాటు పడ్డారు మేడమ్”
ఆమె భర్త ఎందుకైనా మంచిదని కళ్ళు మూసుకున్నాడు. ఆమె సీట్ క్రింద బ్యాగ్ సర్దినట్టు ఏదో అంటూ కదిలించింది.
“ఏమవుతోందంటే… కమలాపురం తరువాత కడప అన్న మాట… అలా…”
ఆమె ఇటు వైపు చూడడం మానేసింది. ముఖారవిందం ఎర్రగా మారింది. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కమలాపురం మీద ఒకటి, కడప మీద ఇంకొకటి సిరీస్‌గా బాంబులు వేసే ఆలోచనలో ఉన్నట్లుంది.
ఈయన నన్ను కదిలించాడు.
“కమలాపురం ముందుంటుంది, ఎలా అంటే…”
నేను రెండు చేతులలో నా మొహం కప్పేసుకున్నాను. ఆయన చేతులు బలవంతంగా తీసేశాడు.
“నేను మీకు మళ్ళీ చెబుతున్నాను. ఎప్పుడైనా సరే, ఏమవుతుందో తెలుసా?”
“సార్, వదిలేద్దాం. కమలాపురం వెళ్ళిపోయింది”
“నో… కమలాపురం వెళ్ళిపోవడం విషయం కాదు. కడప కంటే ముందర వెళ్ళిపోవడం సబ్జెక్ట్”
ఆమె చేతులు కట్టుకుని ఎందుకనో కళ్ళు మూసుకుంది. ఎలా తెలుసుకున్నాడో ఏమో ఆమె భర్త కళ్ళు తెరిచి మరల వెంటనే మూసేసుకున్నాడు.
ఓ కుర్రాడు మిర్చీ బజ్జీలు తెచ్చాడు. ఈయన నాలుగు కొన్నాడు. నలుగురికీ చెరో ఒకటి ఇచ్చాడు. ఏమీ మాట్లాడకుండా ఒకటి తీసుకుంది.
“జీవితం సిద్ధాంతాల మిద నడుస్తుందా? ఇష్టమైతే కొంటాం, ఇష్టమైతే తింటాం. మనం నచ్చితే బండి నడుస్తోందా? లేక నచ్చకపోతే ఆగిపోతుందా? ఇదే లైఫ్ మేనేజ్‌మెంట్!”
ఆమె భర్త ఏదీ మిగల్చకుండా నిశ్శబ్దంగా తినేశాడు. ఒక్కటి ఏం సరిపోతుందన్నట్టు బాధగా చూస్తున్నాడు. రైలు కడప వైపు పరుగులు తీస్తోంది.
జీవితంలో ఏ సందర్భానికైనా అడపా దడపా గుర్తు తెచ్చుకునేందుకు నాకీ సంఘటన మిగిలింది!
***
క్లాసులో కొద్దిసేపు అలజడి చోటు చేసుకుని సర్దు మణిగింది.
“ఆ రైల్లోని మిర్చీయే నా ఈ కార్పోరేట్ ఎదుగుదలకి స్ఫూర్తి అయి కూర్చుంది. పరిస్థితులను, మనుషులను ఎలా అధిగమించి నడుచుకోవాలో నేర్చుకున్నాను”
సుందరానికి శాలువా కప్పారు. అతని క్లాసు సి.డి.గా వేస్తున్నామన్నారు. క్లాసు బైట కొందరు కొన్ని ప్రత్యేకమైన సందేహాలను అడిగి చక్కగా నివృత్తి చేసుకున్నారు. మరల ఎప్పుడొస్తారని కుర్రాళ్ళు అడిగారు.
లిప్‌స్టిక్ పెదాలకు రాసుకునే బదులు పెదాలను లిప్‌స్టిక్‌కు రాసుకున్న ఓ మేడమ్ దగ్గరగా వచ్చి “వండర్‌ఫుల్ సార్” అని శరీరమంతా కంపింపజేసుకుంది. సుందరం లెక్చర్‌కి చక్కని స్పందన లభించిందని మరోలా చెప్పనవసరం లేదు!
గేటు దాకా వెళ్ళే లోపల ఓ అరడజను కుర్రాళ్ళు, ఇద్దరమ్మాయిలు దగ్గరగా వచ్చారు.
“సార్, ఇది మా మెమెంటో సార్, చిరు కానుక” అంటూ అందించారు. చిరునవ్వుతో స్వీకరించాడు సుందరం. అందరూ సుందరంతో సెల్ఫీలు దిగారు.
ఆ సంస్థ డైరక్టర్ ఓ మాట చెప్పాడు. “డియర్ స్టూడెంట్స్! సార్ ఈ సారి వచ్చే లోపల ఒక మిర్చీ బజ్జీ ఆకారంలో ఓ స్తూపం ఈ ప్రాంగణంలోనే కట్టిద్దాం. సార్ చేత దాన్ని ఆవిష్కరింప జేద్దాం!”
చప్పట్లు మారుమ్రోగాయి.
కారులో కూర్చునే లోపల బొట్టు పెట్టుకొన్న ఓ పొట్టి కుర్రాడు సుందరం కాళ్ళకు దండం పెట్టేసాడు…
***
కారు ఇంటి వైపు పోతోంది. సుందరం ఏకంగా ముఖ్యమంత్రి హెలికాప్టర్‍లో కూర్చున్నట్టు వెస్ట్‌కోట్ సర్దుకుంటున్నాడు.
“అదిరింది సార్… ఇంత రెస్పాన్స్ ఎప్పుడూ లేదు!” డైరక్టర్ అన్నాడు.
ట్యాంక్‍బండ్ మీద కారు ఆపించాడు సుందరం. అక్కడ మిర్చీ బజ్జీ బండి వైపు అందరినీ తీసుకెళ్ళాడు.
“బాగుంది” అన్నాడు డైరక్టరు. చెరో ప్లేట్ మిర్చీ ఇప్పించాడు.
“ఈ రోజు చారిత్రాత్మకం” అన్నాడు. మిర్చీ బండి వాడు ఏమనుకున్నాడో ఏమో, అందరూ తింటుండగా ఓ ఫోటో తీసాడు.
స్టైల్‌గా సుందరం అతనితో సెల్ఫీ దిగాడు.
“జీవితంలో పైకొస్తావు” అన్నాడు. అతను తల గోక్కున్నాడు. “సార్, నాకూ ఓ కాలేజీ ఉండేది. అడ్డమైన ప్రతివాడి చేత క్లాసులు చెప్పించి… ఈ బండి దగ్గరకొచ్చింది బ్రతుకు. ఇంకేం పైకొస్తాను?” అన్నాడు.
డైరక్టర్ తింటున్న మిర్చీ లోని గింజ ముక్కులోకి ఎగిరినట్లుంది. విపరీతంగా దగ్గాడు. బుద్ధ విగ్రహం చూపుడువేలు పైకెత్తి మరీ ఏదో చెబుతోంది.