పరుగు

0
3

[శ్రీమతి దాసరి శివకుమారి రచించిన ‘పరుగు’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]“ఇ[/dropcap]వ్వాల్టికి గింజల పాకింగ్‍లు చేయటం ఆపేద్దాం. పిండీ, రవ్వల పాకింగ్‌లు కూడా పూర్తయ్యాయి కదా” అని సుమతి తన దగ్గర పనిచేసేవాళ్లతో అంటుండగానే ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే అక్క. పనివాళ్లను పంపించేసి తీరిగ్గా తనే అక్కకు ఫోన్ చేసింది.

“పని మీదున్నావా సుమతీ! చిరుధాన్యాల పంపిణీలోకి దిగిన తర్వాత తీరిక లేకుండా అయిపోయినట్లున్నావు. నీ పిల్లలిద్దర్నీ ఇంట్లో రాత్రి పూట నువ్వే చదివించగలుగు తున్నావా? నాలాగ నువ్వెక్కడికీ, ఏ కోచింగులకూ పంపవు. మీ భార్యాభర్తలిద్దరూ పిల్లల్ని ఆటపాటలుండే స్కూళ్లలోనే చదివించాలంటారు. వాళ్ళిప్పుడు 8, 9 తరగతులే చదువుతున్నా తర్వాత ఇంటర్ కొచ్చాక ఆ సిలబస్ అందుకోలేరు. మీరుండేది చిన్న టౌను. అక్కడ మీ ఆయన ప్రాక్టీసూ, పిల్లల చదువులూ. పోనీ నా దగ్గరకు హైదరాబాద్ పంపి చదివిద్దామనే అనుకోరు. మీదంతా చాదస్తం అనిపిస్తుంది నాకు”, అన్నది రమ్య తన ధోరణిలో.

“ఈ ఊరు, స్కూలూ, అన్నీ బాగున్నాయి. పిల్లలకు ఎన్.సి.ఇ.ఆర్.టి వారి సిలబస్సే చెప్తున్నారు. టీచర్లందరూ బాగా అనుభవమున్నవారు, పెద్ద చదువులు చదివిన వారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ సిలబస్ పిల్లలకు కాస్త హెచ్చు స్థాయి లోనే వున్నట్లు లెక్క. వీళ్ళు చేసే లెక్కలు, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లు, వీళ్లకిచ్చిన మెటీరియల్, వాళ్లు చేసే హోమ్ వర్క్‌తో సహా అంతా నేను క్షుణ్ణం గానే చూస్తున్నాను. స్కూల్లోనే నా కొడుకు గిటార్, డ్రాయింగ్ బాగా నేర్చుకుంటున్నాడు. నా కూతురు నాట్యంతో పాటు, బొమ్మలు చేయటం కూడా నేర్చుకుంటున్నది. ఇలా ఎవరి కిష్టం వచ్చినది వాళ్లు నేర్చుకునే అవకాశమున్నది. ‘ఓజోన్ డే’ తో సహా అన్ని సందర్భాలలోనూ నుంచి కార్యక్రమాలు జరుపుతారు. వ్యాయామం, యోగా రకరకాల ఆటలు, యన్.సి.సి. కూడా వున్నాయి. నేర్చుకునే వారికి నేర్చుకున్నంత, ఇంతకంటే ఇంకేం కావాలక్కా? నువ్వు చెప్పే పెద్ద స్కూళ్లలో ఇవేవీ వుండవు. సబ్జెక్టు చెప్పటం, బట్టీ పట్టించటం, పరీక్షలు వ్రాయించటం మాత్రమే వుంటాయి. పిల్లల మెదళ్లకు కాస్త విశ్రాంతి, మనసుకు కాస్త ఉల్లాసం అనేవి వుండాలి. ఇంతకీ నీ కొడుకూ, కూతురు ఎలా చదువుతున్నారు? వాళ్లకు ఆ కోచింగులు ఈ కోచింగులు అంటూ వాళ్లను మరీ విసిగించి హైరానా పెట్టకక్కా.”.

“నీ ముఖమేం కాదు? వాళ్ల భవిష్యత్తు కోసం గాదూ, నేను తాపత్రయ పడేదీ? మీ బావగారితో పాటు, నేను కూడా కెనడా వెళ్ళి కాపురమంటూ పెడితే పిల్లలకింత మంచి చదువులు ఉండవు. పైగా అక్కడ, ఖర్చులెక్కువ. ఆస్తులు పోగేసుకోవటానికి పెద్దగా డబ్బు మిగలదు. పిల్లల స్కూలు బస్ వచ్చే టైమయ్యింది. వాళ్లను బస్సు దింపుకుని అట్నుంచటే ట్యూషన్ సెంటరుకు తీసుకు వెడతాను. వాళ్లకు స్నాక్స్ కార్లోనే తినిపిస్తాను. మరలా తొమ్మిదింటికి వెళ్లి ఇంటికి తీసుకొస్తాను. వుంటా” అంటూ ఫోన్ పెట్టింది.

పాపం అక్క పిల్లలు. అక్క తన ఆరాటంతో వాళ్లను ఎంతో ఒత్తిడి పెడుతున్నది. అటు బావగారు ఒంటరిగా కెనడాలో ఉంటూ ఇబ్బంది పడుతున్నారని బాధపడింది సుమతి.

***

“ఏయ్ కన్నా! చిన్నీ! లేవండిక. 5.30 అయిపోయింది, రెండు బాత్‌రూముల్లో గీజర్లు వేసి పుంచాను. చెరొక బాత్‌రూమ్ కెళ్ళి మీ పనులన్నీ పూర్తి చేసుకుని రండి. మీరు వచ్చే సరికి నేను పాలు కాచి వుంచుతాను. పాలలో ‘కార్న్ ఫ్లేక్స్’ వేసేదా? వట్టిగా ‘పెడియాప్యూర్’ కలుపుకుని తాగుతారా?” అంటూ రమ్య రోజు లాగే పిల్లల్ని నిద్రలేపటానికి తొందరపడసాగింది.

“ప్లీజ్ అమ్మా! బాగా నిద్ర వస్తుంది. ఇంకాసేపు పడుకుంటాం” ఇద్దరూ అదే మాట అంటూ, దుప్పట్లు ముసుగు పెట్టారు.

“ఇంకాసేపు పడుకుంటే బస్సు మీ కోసం ఆగుతుందా? ఆ బస్సు అసలే మన ఇంటి వైపు నుంచి పిల్లల్ని ఎక్కించుకుంటూ వెళ్తుంది. అందుకనే మీరు పెందలాడే బయల్దేరాల్సి వస్తున్నది. పిచ్చి వేషాలు వేయకుండా లేవండి” అంటూ వాళ్ళు కప్పుకున్న దుప్పట్లు లాగి పడేసింది.

పిల్లలు నిద్ర కళ్ల తోనే తూలుకుంటూ చెరో బాత్ రూ‍మ్ కెళ్లారు. ఈలోగా రమ్య వాళ్ల యూనిఫామ్ బట్టలు, టై, అన్నీ తీసి వుంచింది. చెప్పుల స్టాండుతో వున్న బూట్ల దులిపి, వాటిల్లో సాక్సు వుంచి రెడీగా పెట్టింది.

“రేయ్ కన్నా! చిన్నీ! ఇద్దరికీ చెప్తున్నాను. స్కూల్ మెస్‌లో వాళ్లు పెట్టే టిఫిన్, మధ్యాహ్న భోజనం, అన్నీ శుభ్రంగా తినండి. సాయింత్రం వచ్చేటప్పుడు ఏదైనా ఫ్రూట్ ఇస్తే అదీ వదలకుండా తినేయండి. లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. జాగ్రత్తగానే పెడతారులే.”

“వాట్లు పెట్టే టిఫిను పెద్ద రుచిగా వుండదు. కూరల్లో కారాలు, మసాలాలు మరీ ఘాటుగా వుంటున్నాయి. రోజూ కొంత పారేస్తున్నాం. మరి తమ్ముడు ఎలా తినగలుగుతున్నాడో?” అన్నది చిన్ని.

“ఇంటి నుంచి తీసుకువెళతే చల్లారి పోతుంది. అక్కడయితే వేడి వేడిగా తినొచ్చని చెప్తావు” అన్నాడు కన్నా బుంగమూతి పెట్టి, షర్టు టక్ చేసుకుంటూ.

రమ్య వాళ్ల మాటలేం పట్టించుకోకుండా “ఐడి కార్డులు మెళ్ళో వేసుకున్నారా? ఇలా ఈ కుర్చీల్లో కూర్చుని పాలు తాగండి. కన్నా! నువ్వు పాలు తాగుతూ ఉండు. నేను నీ షూ వేసి, లేసులు ముడివేస్తాను. చిన్నీ! నువ్వూ నీ పాలు తాగుతూ వుండు. నేను తల దువ్వి రబ్బరుబాండులు పెడతాను” అంటూ తాను హడావిడి పడుతూ వాళ్లను హాడావిడి పెట్టి ఆరున్నర కల్లా స్కూల్ బస్సు ఆగే చోటికి తీసుకొచ్చింది.

***

సాయింత్రం ఆరు కావస్తుండగా మళ్లీ కారు తీసింది రమ్య. కారులో స్నాక్స్  ఉంచిన బాక్సులు, పెట్టానా లేదా అని మరోసారి చూసుకుని పిల్లల స్కూల్ బస్సు ఆగే చోటికి వెళ్లి పిల్లల్ని కారెక్కించుకున్నది.

“గబగబా స్నాక్స్ తింటూ వుండండి. మంచినీళ్ల సీసా కూడా పక్కనే వుంచాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లెక్కలు ఏ సబ్జెక్టులో అనుమానమొచ్చినా సరే ట్యూషన్ సార్‍ని అడిగి డౌట్సు, చెప్పించుకోండి.”

“ముందు హామ్ వర్క్ పూర్తి చేయమంటారు. ఆ తర్వాత ఏదో కొంత సబ్జెక్టు చెప్తారు. మేం రాత్రిళ్ళు ఇంట్లో వుండి కూడా చదువుకోగలం అమ్మా, మా మాట నువ్వు వినిపించుకోవటం లేదు, డాడీ చెప్పినా వినడం లేదు” అన్నారు ఇద్దరూ ఒకే అభిప్రాయంతో.

“నన్ను అమ్మా అని పిలవటం, తనను నాన్నా అని పిలవటం మీ డాడీకి ఇష్టం. నేనే కష్టపడి డాడీ అనటం అలవాటు చేసాను. మీ డాడీ అన్నీ అలాగే చెప్తారు. ఇక్కడి చదువుల సంగతి డాడీకి సరిగా తెలియదులే. ఇప్పుడు మీరు 8, 9 తరగతుల్లో అశ్రద్ధ చేస్తే రేపు టెంత్ లోనూ, ఇంటర్లోనూ మీరే ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఎమ్‌సెట్ రాసినా, జెఇఇ మెయిన్స్ చేసినా సరిగా జవాబులు రాయలేరు. కేవలం ‘డిస్‌క్రిప్టివ్’ విధానంలోనే, మీ స్కూల్లో చదువుంటుంది. ఎక్కవగా ‘ఆబ్జెక్టివ్’ పద్ధతులు మీకు ఇప్పట్నుంచే కోచింగ్ ఇస్తారని, అప్లికేషన్ పద్ధతి వివరంగా చెప్తారని కదా, వెలు ఖర్చు పెట్టి ట్యూషన్ సెంటర్‍లో చేర్చింది. ఈ రోజు నేను వచ్చి ట్యూషన్ సార్‍తో వివరంగా మాట్లాడతాను” అంది రమ్య.

***

“మేం మీరు అనుకుంటున్నట్లు గానే ఇంటర్, ఎమ్‌సెట్‌కూ అన్ని విధాలా పనికొచ్చేటట్లే పిల్లల్ని తయారు చేస్తున్నాం. మీరేం వర్రీ అవక్కర్లేదు. కావాలంటే మేం పెట్టే పరీక్ష పేపర్లు వివరంగా చూడండి” అని రమ్యను సమాధానపరచి పంపారు ట్యూషన్ సార్.

మర్నాడు స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్‌కు రమ్య వెళ్లింది. పిల్లల క్లాసులకి వచ్చే ఉపాధ్యాయులను కలిసి మాట్లాడింది. “మీరు ఎక్కువగా ‘డిస్‌క్రిప్టివ్’ విధానంలోనే అన్ని సబ్జెక్టులూ చెప్తున్నారు. పిల్లలు పై క్లాసులకు వెడితే  ‘ఆబ్జెక్టివ్’ విధానాన్నిఎలా ఫాలో కాగలుగుతారు? అప్లికేషన్ గురించి కూడా వాళ్లకు సరిగా ఏమీ తెలియిటం లేదు. ఎలాగండీ? మా పిల్లలు ఇబ్బంది పడతారేమో?” అన్నది రమ్య.

“చూడండి మేడమ్! వీళ్లు చదివేది 8, 9 తరగతులు మాత్రమే. ఎవరికైనా ముందు బేసిక్స్ తెలియాలి. అలా బేసిక్స్ తెలుసుకునేటట్లు మంచి ఫౌండేషన్ పడితేనే పిల్లలకు సబ్జెక్టు తెలుస్తుంది. మాది కరెక్ట్ పద్ధతే. మీరు సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు. మా విధానంలో నేర్పితేనే, పిల్లలు దేనికైనా ఆన్సరు చేయగలుగుతారు. మీరింకా మీ పిల్లలకు అదనపు ట్యూషన్ పెట్టించుకున్నారట. మా దగ్గర చదివే పిల్లలకు అలాంటిదే అక్కర్లేదు. వాళ్లంతట వాళ్ళే మేమిచ్చిన హోమ్ వర్క్‌ను ఇంటి దగ్గరే చేయగలుగుతారు. రేపు పదో క్లాసు, ఇంటర్ అన్నీ బాగానే చదవగలుగుతారు. ఈ సిటీలో మా స్కూలును మించిన స్కూలూ, ఇక్కడి చదువును మించిన చదువూ సిటీ మొత్తంలో మీకెక్కడా, కనిపించదు. మీరు వేరే ఆలోచనలేం పెట్టుకోకండి” అంటూ చెప్పి పంపారు.

***

ఓ రోజు తొమ్మిదో తరగతి చదివే చిన్నీకి స్కూల్లోనే రెండు సార్లు వాంతులయ్యాయి. నీరసంగా వేలాడబడిపోయింది. స్కూలు వాళ్లు వెంటనే రమ్యకు ఫోన్ చేశారు. రమ్య వెళ్లి కూతుర్ని తీసుకొచ్చింది. కారులో కూర్చుని కూడా పొట్ట పట్టుకుని కడుపులో నొప్పి అంటూ విలవిల లాడిపోతోంది చిన్నీ. అపెండిసైటిస్ కాదు గదా అని భయపడుతూ చిన్నీని దగ్గరలో వున్న హాస్పిటల్‍కు తీసుకెళ్లింది. స్కానింగ్ చేసి, అపెండిసైటిస్ అని చెప్పి, వెంటనే ఆపరేషను చేయాలన్నారు. అలాగే చేశారు. తనకు తోడుగా రమ్య తన అమ్మానాన్నల్ని పిలిపించుకున్నది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా చిన్నీకి కడుపులో నొప్పి వస్తూనే వున్నది. వాంతులు కూడా అవుతోనే వున్నాయి. ఆహారం కేవలం ద్రవ పదార్థాలే ఇవ్వాల్సి వస్తున్నది. హాస్పిటల్‌కు తీసుకెళ్తే మరల స్కానింగ్ చేసారు. మరొకసారి పొట్ట ఓపెన్ చేసి చూడాలన్నారు.

సుమతి భర్త కూడా డాక్టరే కాబట్టి సుమతి, వాళ్లయినా వెంటనే బయల్దేరారు.

“మా అక్క కంతా ఆరాటం. బావగారేమో, కెనాడా లోని గ్రేట్ టోరంటోలో, ఐటి కంపెనీ నడుపుతున్నారు. ఖాళీ సమయాల్లో అక్కడి తెలుగు పిల్లల కోసం, తెలుగు భాష వికాసం కోసం నడిపే ‘మన బడి’ టోరంటో శాఖ కెళ్లి తనకు తోచిన సాయం అందించి వస్తున్నారు. ఇక్కడ అక్కమో ఇలా వెంపర్లాడుతుంది. బావగారు చెప్పి చెప్పి విసిగిపోయారు. ‘రమ్య మూర్ఖత్వం ఎప్పటికి వదులుతుందో’ అంటారు. కూతురికి ఇలా వుందని తెలిసి కూడా బావగారు వెంటనే రాలేకపోయారు. ఎంత బాధపడుతున్నారో?” అన్నది సుమతి దారిలో.

“పోనీలే సుమతీ! ఎవరి అభిప్రాయాలు వారివి” అన్నాడు ఆమె భర్త.

హైదరాబాద్ వెళ్లగానే చిన్నీ స్కానింగ్ రిపోర్డులన్నీ చూశారు. సుమతి భర్త ఆ స్కానింగ్ రిపోర్టులను తీసుకుని తనకు తెలిసిన గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్‌కు వెళ్ళి అక్కడి సర్జన్‌తో మాట్లాడారు.

“మరల పొట్ట ఓపెన్ చేయాల్సిందే. కేవలం అపెండిక్స్ ప్రాబ్లమే కాదు. జీర్ణాశయ ఇబ్బంది కూడా వున్నది. చిన్న ప్రేగు దగ్గర రంధ్రం కూడా పడింది. మరొక ఆపరేషను తప్పనిసరి అవుతుంది” అన్నారు.

ఆపరేషను చేశారు. “కేవలం ద్రవ పదార్థాలే కొన్నాళ్ల పాటు ఇవ్వండి. పండ్లరసాలు తప్పితే పండ్లు కూడా కొన్నాళ్ల పాటు తినమని ఇవ్వకండి. అన్నం కూడా మెత్తగా ఉడికించి జావలాగా చేయాలి. తేలిగ్గా అరిగే కూరగాయలే వండి గుజ్జుగా చేసి ఆ అన్నం జావలో కలపండి. ముఖ్యంగా పిల్లకు విశ్రాంతి కావాలి. ఆటలంటూ కూడా ఎగరనివ్వకండి. మనసును ఉల్లాసంగా వుంచటానికి ప్రయత్నించండి. ఎంతో ఒత్తిడి పడితే తప్ప జీర్ణాశయ సమస్యలు ఈ వయసులో ఇంతగా రావు. ఓ నెల రోజులపాటు ఇలా చేసి చూడండి. మందులు వ్రాసి ఇస్తాను. అవి వాడండి. ఓ నెల తర్వాత మరలా వచ్చి చూపించుకోవాలి.” అని చెప్పి పంపారు.

రమ్య భర్త వీలు చేసుకుని కెనడా నుండి వచ్చాడు. కూతురి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు. చిన్నీకి ఆ మాటా ఈ మాటా చెప్తూ తనే పళ్లరసాలూ, అన్నపు జావ లాంటివి తాగించసాగాడు. మధ్య మధ్యలో కెనడా లోని ‘మన బడి’ కొచ్చే తెలుగు పిల్లల సంగతులు చెప్తూ చిన్నీని ఉల్లాసంగా వుంచటానికి చూస్తున్నాడు.

“నాన్నా! నువ్వు ఇక్కడే వుండిపోవచ్చుగా..” అన్నారు చిన్నీ కన్నాలిద్దరూ ఆశగా.

“ఆలోచిస్తానమ్మా, నేనిక్కడకు రావటమో, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లటమో, ఏది వీలవుతుందో, ఏదైతే మనందరకూ బాగుంటుందో, మనందరం కలిసి నిర్ణయించుకుందాం” అని మాటిచ్చాడు పిల్లలకు.

“కన్నా! నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్‍కి వెళ్ళొద్దు. ఉదయాన్నే 6.30కి స్కూల్ బస్ ఎక్కోద్దు. ఇంట్లో టిఫిన్ చేసి, అమ్మ ఇచ్చిన భోజనాన్నే తీసుకెళ్లి స్కూల్లో తిను. డ్ర్రైవర్‍ని మాట్లాడాను. రోజూ నిన్ను స్కూలుకి తీసుకెళ్లి, సాయంకాలం ఇంటికి తీసుకొస్తాడు. రేపట్నుంచీ అలా చేద్దువుగా, సరేనా?” అన్నాడు కన్నాతో వాళ్ల నాన్న.

“థాంక్యూ నాన్నా! థాంక్యూ. నేనింట్లో ఎంత బాగా చదువుకుంటానో మీరే చూద్దురు గాని” అన్నాడు కన్నా, వాళ్ల నాన్న మెడను గట్టిగా పట్టుకుని సంతోషంగా ముందుకు ఊపుతా.

చిన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. హాస్పిటల్‌కు వాళ్ల నాన్నే తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. రెండు నెలల పాటు నాన్న ఇక్కడే వుంటాడంటే పిల్లలకు రోజూ పండగలాగే వున్నది.

చిన్నీకి ఆపరేషన్ జరిగి నెలా 15 రోజులయింది. ఒకసారి మరలా చూపిద్దామని హాస్పటల్‍కి వెళ్లారు.

“ఇక స్కూలికి వెళ్ళొచ్చు. కాని చదువు విషయంలో మరీ ఒత్తిడి పెట్టకండి. ఆ ఒత్తిడి వలన అనేక శారీరిక, మానసిక సమస్యలు వస్తాయి. ఇప్పటికే అమ్మాయి ఆరోగ్య విషయంలో కొంత  ఇబ్బంది పడింది. రెండుసార్లు ఆపరేషన్స్ చేయాల్సి వచ్చింది. ఇంకా కొన్నాళ్ల పాటు తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలే పెట్టండి. చాలా జాగ్రత్తగా వుండాలి. తనకు ఏదైనా పదార్థం సరిపడక పోతే దాన్ని పెట్టడం మానేయండి” అంటూ కొన్ని సూచనలు చేసి పంపారు.

“రమ్యా! మన పిల్లలు చదివేది 8, 9 తరగతులే. మీ చెల్లెలు సుమతి పిల్లలు కూడా ఇవే క్లాసులు చదువుతున్నారు. వాళ్లు ఎంత నింపాదిగా వున్నారు? మనం మన పిల్లల వయసునూ, వాళ్ళు చదివే చదువునూ దృష్టిలో పెట్టుకోవాలి. తరగతి తర్వాత తరగతి నిదానంగా వాళ్లే చదువుకుంటారు. ఇప్పటికే వాళ్లకు ఎక్కువ సిలబన్ వున్నట్లే. ఇంకా వాళ్లను ఒత్తిడి పెట్టి, నువ్వు హైరానా పడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నో సార్లు నీకు చెప్పాను. ఇప్పటికైనా నువ్వు నీ పద్ధతి మానుకోనంటే నేను కెనడాలో ఐటి కంపెనీ మూసేసుకుని ఇండియా వచ్చేస్తాను. పిల్లల్ని తీసుకుని కెనడా వచ్చేయమని పిల్లలు చిన్న క్లాసుల్లో వున్నప్పుడే నీకు చెప్పాను. ‘అక్కడ కాపురం అంటూ పెట్టుకుంటే మనకు డబ్బు ఎక్కువ మిగలదు. మీరొక్కరికైతే పెద్దగా ఖర్చు కాదు. అక్కడ ఖర్చులెక్కువ’ అంటూ గుడ్డిగా ఆలోచించి నా మాటల్ని పెడచెవిన పెట్టావు. నేను పంపే డబ్బుతో బంగారం బిస్కెట్లు, స్థలాలూ ఇండియాలో కొంటున్నావు. కానీ జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో, ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచించావా? పిల్లల చదువులు అంటూ తాపత్రయ పడుతున్నావు. అక్కడ తెలుగు వాళ్ల పిల్లలు ఎంతమంది పెద్ద చదువులు చదువు కోవటంలేదు? ఎంతమంది తెలుగువాళ్ల పిల్లలు ఇంజనీర్లూ, డాక్టర్లూ, ఇంకా పిహెచ్‍డిలు చేస్తున్నారు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. నాకు నా పిల్లల ఆరోగ్యం ముఖ్యం, ఆ తరువాతే ఏ చదువైనా. అనవసరంగా గొడవలు పెంచుకోవటం ఇష్టం లేక ఇన్నాళ్ళూ ఓపిగ్గా భరించాను, ఇక నాకు సహనం లేదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. లేకపోతే పర్యవసానం ఎలా వుంటుందో నేను చెప్పలేను” అన్నాడు గట్టిగా.

“మన కుటుంబాన్నీ, పిల్లల్నీ ఎంతో ఉన్నత స్థితిలో వుంచాలనే నేను ఆలోచించాను. పిల్లలు మొత్తుకుంటున్నా వాళ్ల గోడు నేను పట్టించుకోలేదు. అమ్మ, నాన్న, సుమతీ అందరూ చెప్పారు – పిల్లల్ని తీసుకుని నన్ను కూడా కెనడా వెళ్లిపొమ్మని. పిల్లలకి ఇంట్లోనే టిఫినూ, భోజనం వాళ్లక్కావలసినట్లు చేసి ఇస్తాను. ట్యూషన్ జోలికిపోను. ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఇలా గడవనివ్వండి. ఆ తర్వాత ఏం చెయ్యాలో మీరే ఆలోచించి నిర్ణయిం చెయ్యండి. నాక్కూడా నా కుటుంబమే ముఖ్యం. ఇప్పటి వరకు నేను పెట్టిన పరుగు చాలు. ఇక పరుగులు ఆపి నిదానంగా నడుస్తాను” అన్నది రమ్య భర్త చేతులు పట్టుకుంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here