ఎంత చేరువో అంత దూరము-18

2
3

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తనకు ఆనంద్, మాలతిల పరిచయం ఎలా జరిగిందో జ్ఞాపకం చేసుకుంటుంది ఊర్మిళ. ఓసారి ఆనంద్ సూపర్‍ మార్కెట్‍కి వచ్చినప్పుడు – త్వరలో అక్కడ తనను జాబ్ నుంచీ తీసేస్తున్నారని చెబుతుంది ఊర్మిళ. తన ఫ్రెండ్ భార్య సుమిత్ర నిర్వహించే ఓ బేబీ కేర్ సెంటర్‌లో జాబ్ ఇప్పిస్తాడు ఆనంద్. ఫస్ట్‌కు సాలరీ తీసుకుని, ఆనంద్ ఇంటికి ఫోన్ చేస్తే, మాలతి ఎత్తి, ఈ నెంబరు నీకెలా తెలుసంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఓ ఏడాది గడుస్తుంది. ఆనంద్ చిన్నారి జాహ్నవిని తీసుకుని బేబీ కేర్ సెంటర్‌కి వస్తాడు. మాలతి అప్పుడు గర్భవతి, పూర్తి బెడ్ రెస్ట్ అవసరం. అందువల్ల పాపని ఈ సెంటర్‍లో ఉంచుతాడు ఆనంద్. పాప కోసం ఆనంద్ అక్కడికి రోజూ వెళ్ళేవాడు. కొన్నాళ్ళకి మాలతికి ఈ సంగతి తెలిసి, ఇక్కడి నుండి బేబీని మార్చేయమని, లేదా సుమిత్రకి చెప్పి ఊర్మిళనే మార్పించమని గొడవ చేస్తుంది. సుమిత్రకి విదేశాలకి వెళ్ళే అవకాశం వచ్చి, బేబీ కేర్ సెంటర్ మూసేయ్యడంతో, ఇంకో ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది ఊర్మిళకి. అప్పటికే తన కంపెనీలో మేనేజర్ స్థాయికి ఎదిగిన ఆనంద్, తన ఆఫీసులోనే ఊర్మిళకి ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆనంద్‍, మాలతిలకు రెండోసారి పుట్టిన బిడ్డ దక్కలేదు. ఈ సమయంలో మాలతికి తన విషయం తెలిస్తే, మనశ్శాంతి ఉండదని అనుకుని, ఆనంద్‍కి చెప్పకుండా మరో ఉద్యోగం కోసం వెతుకులాట మొదలెడుతుంది ఊర్మిళ. ఓరోజు మాలతి ఫోన్ చేసి, ఊర్మిళను బాగా అవమానిస్తుంది. ఏదో ప్రకటన చూసి మరో ఆఫీసులో చేరితే, అక్కడి పై ఉద్యోగి తనని పెళ్ళి చేసుకోమని వేధిస్తాడు. కాదన్నందుకు, అక్రమ కేసు పెట్టి పోలీస్ స్టేషన్‍కు పంపుతాడు. ఇంతలో వేరే పని మీద పోలీస్ స్టేషన్‍కు వచ్చిన ఆనంద్, ఇన్‍స్పెక్టర్‍తో మాట్లాడి, ఊర్మిళను ఆమె ఇంటి దగ్గర దింపబోతే, అంత రాత్రి వేళ వెడితే, ఓనరమ్మ అరుస్తుందని అనడంతో ఊర్మిళను తన ఇంటికి తీసుకెళ్తాడు ఆనంద్. – ఇక చదవండి.]

అధ్యాయం 18

[dropcap]ఆ[/dropcap] రాత్రి కార్లో కలిసి వచ్చిన తమిద్దరినీ చూసి, మాలతి గారు పెదవి విప్పలేదు. “హమ్మయ్య!” అనుకుంది. ఆనంద్ గారు జరిగింది అంతా సవివరంగా చెప్పారు.

ఆమె అంతా విన్నది.

మరునాడు పొద్దున్నే తను గదికి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత ఆనంద్ గారు ఆఫీస్‌కు వెళ్ళిపోయారుట. ఒక ముక్కా మాట్లాడని మాలతి గారు పెట్టేబేడా సర్దుకుని జాహ్నవితో పుట్టింటికి వెళ్ళిపోయారు. సాయంత్రం వచ్చేసరికి ఆనంద్ గారికి తాళం దర్శనం ఇచ్చింది. ఉరుము లేకుండానే పిడుగు పడింది.

కొన్నాళ్ళకు పెద్దవాళ్ళు మాలతి గారి తరుపున గొడవకు వచ్చారట. భద్రం గారు, భూషణం గారు.. ఇతరులు..

ఆనంద్ గారు జరిగింది వాళ్ళతో చెప్పి, బయటకు వెళ్ళిపోయారు. కానీ మాలతి గారు నమ్మలేదు. నమ్మలేక పోవడానికి తన అందాన్ని మించిన కారణం ఏమీ లేదట.

అనుమానం నిరాధారమైనప్పుడు, నమ్మకానికి ఆధారం ఎక్కడ ఉంటుంది.

ఇన్నేళ్ళుగా ఆనంద్ గారికి తను కనిపించలేదనడం నిజం కానే కాదు అట.

ఆవిణ్ణి అమాయకురాలిని చేసి మోసగించారు అని బలమైన నమ్మకం ఏర్పరుచుకున్నారు..

జరిగినవేవీ తనకు తెలియవు. తన బతుకు పోరు తనది.

ఆనంద్ గారి పుణ్యమా అని పి.ఎస్. నుండి బయట పడింది..

ఆ భయం, ఆ అవమానం ఇంకా మనసును తొలుస్తూంటే -మరో ఉపద్రవం గండర గండడి రూపంలో పొంచి ఉందని ఊహించలేదు.

ఎప్పుడు చూసాడో వర్క్ ప్లేస్ నుండి వస్తూంటే..

రోజూ ఫాలో అయ్యేవాడు. బుర్ర మీసాలతో, అడ్డ పంచెతో సినిమా విలన్‌లా ఉన్న వాడి కన్ను తన మీద పడడం తన దురదృష్టం కాక మరేమిటి? (చోటా) రాజకీయ నాయకుల అండ ఉన్న వాడిని ఎదిరించేందుకు భయపడేవారు, వీధిలో ఉన్నవారు. రద్దీ లేని ఆ చిన్న ఇరుకు సందుల్లో నుండి తాను బస్ దిగి వస్తూంటే, వాడు వెంబడిస్తూ వచ్చేవాడు.

భయంతో గుండెలు అరచేతిలో పెట్టుకొని తన గదికి వచ్చి పడేది.

అండ లేని ఒంటరి ఆడపిల్లకు అందం తోడైతే జీవితం ఎంత నరక ప్రాయమో, తన జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం.

ఆ గండర గండడు ఒక రోజు బాగా త్రాగి వచ్చి, అసభ్య పదజాలంతో, తన గది తలుపు నెట్టడం ప్రారంభించాడు. పై ప్రాణాలు పైనే పోతుంటే, ఆ డొక్కు తలుపు ఊడకుండా అలాగ అడ్డం కూర్చొని ఉండిపోయింది. వాడు వాగీ, వాగీ ఎప్పటికో వెళ్ళిపోయాడు. కాంపౌండ్‌లో అన్ని ఫ్యామిలీస్ ఉన్నా, ఒక్కరూ ధైర్యం చేయలేదు.

మరునాడు పొద్దున్నే ఓనరమ్మ పిలిచింది. “మీరు రూమ్ ఖాళీ చేసి వెళ్ళండి. నాకు ఆడపిల్ల ఉంది. వాడి దృష్టి నీ వల్ల మా పిల్ల మీదకూ మళ్ళవచ్చు.” అంది.

తాను ప్రాధేయపడుతూంటే, “నువ్వు ఈ నెల వాటర్, కరెంట్ ఏమీ ఇవ్వక్కర్లేదు. కావాలంటే ఇవి ఉంచు!” అంటూ ఐదొందల నోట్ చేతిలో పెట్టబోయింది.

ఇప్పటికిప్పుడు తానెక్కడికి వెళ్ళాలి. నాలుగు గోడల్లోనే రక్షణ లేని సమాజంలో!

రోడ్డు మీదకు గెంటి వేస్తే తనకు దిక్కెవరు? అప్పుడు అమ్మణ్ణి తనకు అండగా నిలిచింది.

“అక్కా! ఒక సంగీతం టీచర్ ఉన్నారు. కట్నం ఇచ్చుకోలేని కారణంగా ఆవిడకు పెళ్ళి కాలేదు. అయినా లోకం కోసం తాళి, మెట్టె పెట్టుకుంది. ఇంత జరిగాక ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వాడు మళ్ళీ ఎప్పుడు తాగి వచ్చి గొడవ చేస్తాడో!” అంది.

“మరి, ఉద్యోగం..”

తన ఆందోళన తనది.

“అక్కడే ఏదయినా చూసుకుందాం.”

“అయ్యో! నీ జాబ్ ఎందుకు వదులుకోవడం.”

“మరి ఆవిడ ఇంట్లో కొన్నాళ్ళు మనకు వసతి దొరకాలంటి నేను లేకుండా ఆవిడ ఏమంటారో!” అంది.

తలాడించింది తాను.

అలా తన జీవిత ప్రసహనంలో భయాందోళనల పరుగు లెన్నో!

అయినా తాను వాటి నుండి నేర్చుకున్నదేమి లేదు. తన పిరికితనం, భయం వదల్లేదు.

పైగా జీవితంపై విరక్తి, మనుషుల అజ్ఞానంపై జాలి కలుగుతూంది.

ఈ విశాల ప్రపంచంలో చుక్కాని లేని నావలా తన బ్రతుకు సాగుతూంది.

ఆ రోజు తాను అమ్మణ్ణితో కలిసి ఓనరమ్మ కూతురు వెళుతూంటే బ్రహ్మకుమారీస్ క్లాస్‌కు వెళ్ళింది..

అక్కడి వాతావరణం తనకు చాలా నచ్చింది.

ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా, ఓ తెల్లని వెన్నెల లోకం వెలిసినట్టు ఉంది. అలసిన మనసుకు చల్లదనం ఇస్తూంది.

బ్రతుకు పోరాటం నుండి విముక్తి ద్వారాలు తెరుచుకున్నట్టు..

తాను అప్పటికే చాలా అలిసి పోయింది. అందుకేనేమో, అటు ఆకర్షణ ఆయస్కాంతంలా లాగుతుంది తనను.

కుమారీస్ బోధనలు తనకు చాలా నచ్చాయి. తనకూ వాళ్ళల్లో చేరిపోవాలని ఉంది.

ఒకసారి వాళ్ళలా డ్రెస్ వేసుకోవాలనిపించి, తెల్ల చీర, తెల్ల బ్లౌజ్ వేసుకుంది.

అప్పుడు రోడ్‌పై వెళుతున్న తన ప్రక్కన కారు వచ్చి ఆగింది.

ఆ.. నం.. ద్.. గారు. ఆయన్ని చూసి సంభ్రమం — సంతోషం అక్క చెల్లెళ్లయి వచ్చాయి తనలో..

“ఏమిటీ అవతారం! కారెక్కు!” అన్నారు.

మరొకరయితే తన రియాక్షన్ ఎలా ఉండేదో కానీ, ఆనంద్ గారు కదా! అందుకే కారు ఎక్కి కూర్చుంది.

ఆయనలో ఎన్నడూ చూడని అలసట. అశాంతిగా ఉన్నారు.

“అవేమిటి” అన్నారు, తన చేతిలో ఉన్న టీ పాకెట్స్ చూస్తూ.

“డోర్ టు డోర్ వేసే జాబ్!” అంది తాను.

“అందుకు ఈ అవతారంలో తిరగాలా!” అన్నారు.

మాటి మాటికీ అవతారం, అవతారం అంటుంటే తనకు మాత్రం బాధెయ్యదూ!

కారు ఇల్లు సమీపించింది. ఆమె లేనట్టున్నారు.

డోర్ తీసి సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నారు.

క్రాఫ్ చెదిరిపోయి ఉంది. ముఖంలో ఎన్నడూ చూడని అలసట.

“నువ్వెళ్ళాక ఈ ఐదేళ్ళ కాలంలో ఏమి జరిగిందో నీకు తెలుసా!” అన్నారు.

“ఏమి జరిగింది” అంది తాను.

“నీ వల్ల, కేవలం నీ వల్లే నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది” అన్నారు.

తను నివ్వెరపోయి, “ఏమిటీ!” అంది. నిజంగా ఆయనేం అంటున్నారో తనకు పూర్తిగా అర్థం కాలేదు.

“పి.ఎస్. నుండి నువ్వు ఆ రాత్రి వెంబడి బడి వచ్చావు కదా!”

అర్థం కానట్టు చూసింది తను.

ఆ మాటకు మనసు కలుక్కుమన్నా, ఆయన ముఖంలో ఆ నిర్వేదం – తనని ఎక్కువ ఆలోచించనివ్వలేదు.

ఆయనే మళ్ళీ అన్నారు.

“ఆ రోజు తర్వాత పుట్టింటికి వెళ్ళి మాలతి మళ్ళీ రాలేదు.”

తనకు కాస్త కాస్త అర్థం అవుతూంది, ఆయన చెప్పేది.

బిత్తర చూపులు సారించింది. చిత్తరువులా నిలబడి పోయింది.

“నీ వల్ల.. నీ వల్ల.. నా భార్యకు, బిడ్డకు దూరమయ్యాను!”

స్తంభించిన తనలో మెల్లగా చలనం వచ్చింది. ఏడుపు మొదలు పెట్టింది, “అయ్యో!” అంటూ.

ఆయనకిలా జరిగిందని తను బాధ పడుతూంటే, “నీ వల్లే!” అన్న మాట గుండెల్లో గుచ్చుతూంది.

తాను చాలా సేపు ఏడ్చాక అడిగింది, “అసలేమి జరిగింది?” అంది.

“నీ వల్లే! కేవలం నీ వల్లే!” అన్నారు కోపంతో, బాధతో మళ్ళీ.

“దయచేసి అలా అనకండి. నేను మీ జీవితాల్లో నుండి తప్పుకున్నాను, కదా!”

దానికి ఆయన సమాధానం –

“నిన్ను వేధించే వాళ్ళను చెప్పుతో కొట్టే ధైర్యం నీకుంటే, నా భార్యకు అనుమానాలు అని తెలిసీ నీకు నా దగ్గర జాబిచ్చే అవసరం వచ్చేది కాదు.”

అది తన నేరమా! ఆశ్చర్యంగా వింది ఆయన మాటలను.

“ఇంటి ఓనర్‌ను రాత్రి ఆలస్యంగా వచ్చినందుకు కన్విన్స్ చేయగలిగిన లౌక్యమే నీకుంటే..”

ఆయన నిముషం ఆగి అన్నారు.

“నిన్ను అర్ధరాత్రి ఇంటికి తీసుకుని వచ్చే అవసరం ఉండేది కాదు.”

తనది తప్పో, కాదో తనకు తెలియకున్నా, దోషిలా తల వంచుకుంది.

“నీ వల్లే మాలతి అనుమానం బలపడింది.”

“………….”

“నీ వల్లే నా భార్యాబిడ్డకు దూరమయ్యాను.”

కళ్లెత్తి చూసింది.

ఆవేదన అసహనంగా మారి జ్వలిస్తున్నారాయన.

తన తప్పును తానే సరిదిద్దుకోవాలి.

“ఆమె కాళ్ళ మీద పడమన్నా పడతాను” అంది తను.

“నాగుపాము తోక తొక్కుతాననే తెలివి నీకే ఉంది” అన్నారు. “అయినా కాళ్ళ మీద పడడానికి ఎక్కడికి వెళతావు? మైసూర్‌కా!”

“ఆమె ఇక్కడ లేరా!” ఆశ్చర్యపోయింది తను.

“నా నీడ పడనంత దూరంగా వెళ్ళిపోయింది.” ఆయన బాధను నిగ్రహించుకుంటున్నారు అని అర్థం అయ్యింది.

“మరేమి చేయగలను? మీరంతా బాగుండాలి.”

“పెళ్ళి చేసుకో! నీకు పెళ్ళైందంటే నా భార్య మళ్ళీ నా దగ్గరికి వస్తుంది.”

“నాకు పెళ్ళంటే ఇష్టం లేదు.”

“ఏం, సన్యాసం తీసుకుంటావా!” వ్యంగ్యంగా అన్నారు.

“అదే ఇష్టం నాకు. అందుకే ఈ తెల్ల చీర..”

“దయ చేసి ఆపుతావా! నీ తెల్ల చీర గోల..”

“తెల్ల చీర గోల కాదు. శాంతి సంకేతం..” ధైర్యం చేసి అంది.

“ఆపు, ఆ మాట!” విసుగ్గా చూసారు.

“నాకు నా బిడ్డ కావాలి. భార్య కావాలి. నేనో మంచి అబ్బాయిని చూసాను..”

కాస్సేపు ఆగారు.

“రేపు అతనితో మాట్లాడి చెప్తాను” అన్నారు.

మౌనం వహించింది తను. ఏమి మాట్లాడినా ఆయన వినే స్థితిలో లేరు.

తాను వెనుతిరిగి వచ్చేస్తూంటే

“ఆగు” అంటూ కారు కీస్ తీసుకున్నారు.

ఆయన మాటల్లో ఏ మాత్రం మృదుత్వం లేదు. కఠినంగా, కోపంగా ఉన్నాయి మాటలు.

ఆయన బాధ తన కర్థమవుతూంది. కానీ ఏమి చేయగలదు. మనసు పెళ్ళికి అంగీకరించట్లేదు.

కారు పట్టని తన గది సందుకు అంత దూరంలో కారు ఆపారు.. తాను దిగి రూమ్‌కు నడిచి వచ్చింది.

ఆ మర్నాడు మరో షాక్ ఇచ్చారు.

తాను గది బయట ఓపెన్ ఏరియాలో అమ్మణ్ణితో మాట్లాడుతూంది.

చాప పరుచుకుని మాట్లాడుకుంటున్నారు ఇద్దరూ..

అమ్మణ్ణికి తెలుగు నవలల పిచ్చి ఎక్కువ.

చేతిలో ‘మీనా’ నవల ఉంది.

“అక్కా! పళ్ళున్న చెట్టుకే రాళ్ళు తగలడం అనే మాట ఎందుకు వాడతారు” అంది.

అలా అప్పుడప్పుడు అమ్మణ్ణి తనను మహాజ్ఞాని చేసేది.

“ఇక్కడ పళ్ళు అంటే కష్టాలు అని అర్థం. కష్టాల్లో ఉన్న వాళ్ళ పైనే లోకం మరిన్ని రాళ్ళు వేస్తుందన్న మాట.”

పర్లే! నవలలు చదవకున్నా తనకూ నాలెడ్జి ఉందని తాను అనుకునే లోపే మరో ప్రశ్న సంధించింది అమ్మణ్ణి.

“అక్కా! పెళ్ళి చేసుకుంటే కష్టాలెక్కువా! కాకపోతేనా!” అమ్మణ్ణికి ఏదో సమాధానం చెప్పి తన పెద్దరికం నిలుపుకోవాలి అని ఆలోచించేంతలో అమ్మణ్ణియే ఆన్సర్ చేసింది.

“అదిగో! ఎదురుగ్గా బిల్డింగ్‌లో కాంపౌండ్ గోడ దాటి కనిపిస్తూన్న అశోక వృక్షం చూడు, అక్కా! ఎంత ఠీవిగా ఉందో!.. అదే మన ఇంటి ముందు మందారం చెట్టు చూడు! బరువుతో వంగి పోయి లేదూ!” అంది.

ఏ నవలలో చదివిందో కానీ! తాను అర్థం కానట్టు చూస్తే,

“పెళ్ళవుతే కష్టాలెక్కువ” అంది సందేహం తీరుస్తూ.

“అవునా! నేను అశోకను చూస్తే ఒంటరితనానికి నిలువెత్తు నిదర్శనం అనుకునే దాన్ని. గుబురుగా, విరబూసిన పూలతో మందారం నిండుగా ఉందనే ఫీలింగ్!”

నా మాట ఇంకా పూర్తి కాలేదు.

వెనుక ఎవ్వరిదో అలికిడి..

జేబుల్లో చేతులు పెట్టుకుని, టక్ చేసుకొని..

నిలువెత్తు ఆయన..

ఎప్పుడు వచ్చి నిల్చున్నారో..

కంగారు వేసింది. ఆయన – తన రూమ్‌కు రావడమా!

తత్తర పడుతూ, “ఎప్పుడొచ్చారు మీరు!” అంది.

“నీవు మందార చెట్టుకూ, అశోక చెట్టుకూ పోలికలు చెప్తున్నప్పుడు” అన్నారు.

తన బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. అవమానంతో ముఖం కందింది.

ఇలా తన మాటలు విన్నానని ముఖం మీదే చెప్పాలా! ఏమిటీ మనిషి! అనుకుంది.

కాస్త తల పైకిత్తి పరిసరాలను చూస్తూ, “మాట్లాడాలి..” అన్నారు.

తను అర్థం అయినట్టు, తాళం తీసుకుంటూంటే, ఆయన బయటకు నడిచారు.

“వావ్! విజయ్” అంది అమ్మణ్ణి.

తను ప్రశ్నార్థకంగా చూసింది.

“అదే అక్కా! జీవన తరంగాలులో హీరో. నువ్వు ఇలా కొంగు భుజాలకు చుట్టుకుని ఆ పొడుగు జడతో నడుస్తూంటే రోజా లాగే ఉన్నావు.” అంది.

తానేమి మాట్లాడలేదు.

అమ్మణ్ణి గోల అమ్మణ్ణిది. తన భయం తనది.

“అక్కా! విజయ్ రోజాను చేసుకున్నట్టు మత్తు ఇచ్చి పెళ్ళి చేసుకుంటాడేమో, జాగ్రత్త!” అంది తనతో నడిచి వస్తూ.

“ఈ మనిషితో ఆ భయం లేదులే! పెళ్ళి చేస్తానంటాడన్న భయం తప్పితే!” అంది.

‘ఆ మంచి అబ్బాయితో మెళ్ళో ఏకంగా దండ వేయించడు కదా!’ అనుకుంటూ కారెక్కి కూర్చుంది.

అమ్మణ్ణి చేయి ఊపుతూంది.

వీధి చివరన ఆగిన పొడువాటి కారును చూస్తూ.. ఏ నవలా సీన్ కళ్ళ ముందు కదులుతూందో, మరి.

“మీ ఫ్రెండ్‌ను ఎక్కడైనా దింపాలా!” అన్నారు.

“అవసరం లేదు. దాని ఇల్లు దగ్గర్లోనే!” అంది.

లోలోపల భయంగా ఉంది.

స్టీరింగ్ పట్టుకున్న చేతికి ఉన్న వాచ్‌ను చూసుకుని, “ఐదింటికి రమ్మన్నాను” అనుకున్నారు.

అయిపోయింది – అనుకున్నంతా అవుతోంది.

ఇల్లు వచ్చేసింది.

ఇంటి కీస్ తన చేతికిచ్చి, ఆయన కారు షెల్టర్‌లో పెట్టి వచ్చారు.

తాను కాస్త లోపలికి కూర్చొని ఉంది.

ఆ ఆగంతకుడు చెప్పిన టైం కు వచ్చాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here