[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
~
చిత్రం: స్వాతికిరణం
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం : కే.వీ.మహదేవన్
గాత్రం : వాణీజయరాం, ఎస్పీ. బాలసుబ్రమణ్యం.
~
మనం గత కొద్ది వారాలుగా సిరివెన్నెల గారి పాటల్లోని లక్షణాలను, భావ కవిత్వపు లక్షణాలతో సమన్వయం చేసి చర్చిస్తున్నాం. ఈసారి, సిరివెన్నెల గీతాల్లోని భక్తి తత్వాన్ని గురించి విశ్లేషించుకుందాం. భక్తిలో రూపాన్ని ఆరాధించడం ఒక మార్గమయితే, భగవత్ తత్వాన్ని అవగాహన చేసుకోవడం మరొక మార్గం. శ్రీ కృష్ణభగవానుడు భగవద్గీతలో ‘ఆర్తులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, అర్ధార్థులు’,అనే నాలుగు రకాల భక్తులు, ఏ రూపాన తనను సేవిస్తారో, ఆ రూపంలోనే పరిపూర్ణ ఫలాన్ని ఇస్తానని చెప్పాడు.
ఈ కోవలో నేను సిరివెన్నెల జిజ్ఞాసవుగా, జ్ఞానిగా.. భగవంతుని మార్గంలో నడిచారని భావిస్తాను. అటు కుటుంబ నేపథ్యం వలన, ఇటు సహజమైన దైవభక్తి వలన, మరోవైపు, సద్గురు శ్రీ శివానందమూర్తిగారి శిష్యులుగానూ, ఆయన ఆత్మజ్ఞానిగా ఎదిగారనడంలో ఎటువంటి సందేహం లేదు.
భారతీయతను, సంస్కృతీ – సంప్రదాయాలను, పురాణేతిహాసాలను, భారతీయ సంస్కృతికి సంబంధించిన దేవతారాధనను, సంపూర్ణంగా పాటించే సిరివెన్నెల గారి కలం నుండి ఎన్నో భక్తి సుమాలు జాలువారాయి.
సినీ రంగ ప్రవేశానికి ముందు శివుడు, దుర్గమ్మ, శ్రీకృష్ణుడు, గణపతి, అయ్యప్ప, సాయిబాబా వంటి అనేక దేవతమూర్తులపై ‘భరణి’ కలం పేరుతో, సీతారామశాస్త్రి గారు వ్రాసిన పాటలు ప్రజల మనసుల్ని ఎంతగానో సమ్మోహన పరచాయి. శివ దర్పణమ్ వంటి శైవ గీతాలు, ఆయన రచనల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి.
‘మళ్లీ ఒకసారి మళ్లీ ఒకసారి, నన్నూదవా మాధవా, పిల్లంగ్రోవై రసాలూరి నా ఊపిరి ఉప్పొంగేలా ఉయ్యాలూపవా’ అంటూ.. దేహం.. జీవం.. భావం, కృష్ణుడిలో లీనమైపోవాలని ప్రార్థిస్తూ.. ఈ పుడమిపై నీ నీడలా నిలవాలి ఈ నరుడి రూపం.. అనే ముగింపు వాక్యం గల ఈ మధురమైన ఆ పాటను సుమధురమైన బాలు గారి గళంలో విని ఎందరో తన్మయులైపోయారు. పరిపూర్ణమైన ఆత్మ నివేదన ఈ పాటలో మనకు కనిపిస్తుంది.
ఇక సినీ రంగ ప్రవేశం తర్వాత, వివిధ చిత్రాలలో సందర్భానుసారం భక్తి గీతాలు వ్రాయవలసిన అవకాశం లభించినప్పుడు, ఆ పాటల ద్వారా తన భక్తి తత్పరతను ఆయన మనకు పంచారు, భక్తిని పెంచారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం( ఇందులో ఒక్క పాటను కూడా చిత్ర నేపథ్యంతో సమన్వయం చేయకుండా, యథాతథంగా వాటిని స్వీకరించి, ఆ భావాన్ని ఆస్వాదించగలరు!).
అమ్మవారి పాటలు/దేవీ స్తోత్రాలు
ముందుగా విశ్లేషణ కోసం ఈ పాటను తీసుకుందాం!
పల్లవి:
శివానీ.. భవానీ.. శర్వాణీ.. గిరినందిని, శివరంజని, భవభంజని జననీ
శతవిధాల శ్రుతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ..॥శివానీ॥
చరణం:
శృంగారం తరంగించు సౌందర్యలహరివని
శాంతం మూర్తీభవించు శివానందలహరివని
కరుణ జినుగు సిరినగవుల కనకధార నీవని
నీ దరహాసమే దాసుల దరిజేర్చేదారి అని..
॥శతవిధాల॥
చరణం:
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి అభయపాణి నీవని
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ..అతులితమౌ..లీల జూపినావని..
॥గిరినందిని శివరంజని భవభంజని జననీ..॥
|| శతవిధాల||
భారతీ పీఠం వారు సరస్వతీదేవి మీద కొన్ని కీర్తనలను అనంతరామశర్మకి అప్పగించి, ఆ బాధ్యతను గంగాధరానికి కూడా పంచుతారు. గంగాధరాన్ని తనతో వుండమన్న శర్మ గంగాధరం ఎన్ని కీర్తనలు చేసినా అసూయతో నచ్చలేదంటుంటాడు. గంగాధరం చివరి ప్రయత్నంగా ఈ గీతాన్ని స్వరపరచి గురువుకి వినిపించే సందర్భానికి సిరివెన్నెల ఈ కీర్తనను రాశారు. దీనిలో దేవికి గల వివిధ పర్యాయపదాలను, లయబద్ధంగా పలికించారు సిరివెన్నెల.
శివుని మనసును రంజింప చేసే పార్వతీ మాత, అన్ని క్లేశాలను దూరం చేయగల శక్తివంతురాలని ఈ పాటలో కొనియాడుతారు సిరివెన్నెల. సౌందర్యం మూర్తిభవించిన సౌందర్యలహరి అని, శాంతం మూర్తిభవించిన శివానందలహరి అని, నిరతము కరుణను కురిపించే కనకధారా అని అమ్మవారిని వర్ణిస్తూ.. అవసరమైతే రౌద్రాన్ని కురిపించే శక్తి అనీ, భీషణమైన భద్రకాళి రూపమనీ, భయానకమైన అగ్నికీలల వంటి తేజముతో, భక్తులను భయోత్పాతం నుండి బయటపడవేసి, దుష్టశక్తుల సంహారంతో భయాన్ని పోగొట్టే అభయదాత, అని ఆదిశక్తిని వేనోళ్ల కానియాడారు సిరివెన్నెల.
~
స్వాతికిరణం చిత్రంలోనే.. ఆలోచనామృతము సాహిత్యము.. సహితహిత సత్యము.. అన్న సారాంశంతో వాగ్దేవిపై సిరివెన్నెల కలం ఒలికించిన.. సాహిత్యమృతం.
పల్లవి:
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే,
సత్యార్ధ చంద్రికే, మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే..
చరణం:
ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకము సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాంపాహి మకరంద మందాకినీ! మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ!
~
శృతిలయలు చిత్రం కోసం, తన గానమే నీరాజనంగా, తన ప్రాణమే నివేదనగా, తన గళ పీఠమే రత్న సింహాసనంగా.. బ్రహ్మాణికి అర్పించుకున్న సిరివెన్నెల.
~
శ్రీ శారదాంబా నమోస్తుతే.. శ్రీ శారదాంబా నమోస్తుతే.. సంగీత సాహిత్య మూలాకృతే.. శ్రీ శారదాంబా నమోస్తుతే.. సంగీత సాహిత్య మూలాకృతే.. శ్రీ శారదాంబా నమోస్తుతే..
చరణం 1:
నాద సాధనే ఆరాధనం.. రాగాలాపనే ఆవాహనం నాద సాధనే ఆరాధనం.. రాగాలాపనే ఆవాహనం గళపీఠమే రత్న సింహాసనం.. గళపీఠమే రత్న సింహాసనం, సరిగమల స్వరసలిల సంప్రోక్షణం..
శ్రీ శారదాంబా నమోస్తుతే..
~
శ్యామ్ సింగరాయ్.. చిత్రంలోని ఒక దేవీ కీర్తన..
పల్లవి:
ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి
కమలాలయ శ్రీదేవీ కురిపించవే కరుణాంబురాశి
చరణం:
దీంతాన ధీం ధీం తాన జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో
నామశతమ్ముల నతులతో.. నాపైన నీ చూపు ఆపేలా..
శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే
నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలనీ నాలో ఆవేదనే నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ..
~
శుభమస్తు చిత్రంలో.. సరస్వతీ దేవికి స్వరార్చన.
వారిజ భవురాణి వాణి, వారిజ భవురాణి వాణి వర వీణాంచిత మృదుపాణి వర వీణాంచిత మృదుపాణి హంసవాహన అంబుజనయన హంసవాహన అంబుజనయన అందుకొనుము ఈ గీతాంజలిని వారిజ భవురాణి వాణి ॥2॥
~
అల్లరి మొగుడు చిత్రంలో… శారదా మాతకు స్వరార్చన..
నా పాట పంచామృతం నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం…
గళము కొలను కాగా, ప్రతి పాట పద్మమేగా పదము వెల్లివిరిసి రాదా విదిసతి పాదాపీఠి కాగా శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం గగనము వెలువగ గమకగతులు సాగా పశువుల శిశువుల ఫణుల శిరసులూగా.. ఆ.. ఆ.. నా పాట పంచామృతం..
~
మామగారు చిత్రంలో దుర్గమ్మ పాట..
దండాలు పెట్టేము దుర్గమ్మా గండాలు దాటించు మాయమ్మా ||2||
దిక్కంటు మొక్కేము దుర్గమ్మా దయచూసి దీవించి మాయమ్మా కదిలొచ్చి మా కీడు కరిగించమ్మా కనకదుర్గమ్మ కనిపించి కాపాడమ్మా॥దండాలు పెట్టేము॥
కోరస్ : ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తి ఓం.. ||4|| దుర్గమ్మ మాయమ్మ కాళమ్మ మాయమ్మ తల్లో తల్లీ ॥2॥
~
మాయాబజార్ చిత్రం కోసం పరమశక్తిపై సిరివెన్నెల రచించిన ప్రార్థనా గీతం.
పల్లవి:
జై శక్తి ఓంశక్తి జైమహాశక్తి శ్రీశక్తి క్లీంశక్తి జైపరాశక్తి శిచ్ఛక్తి సద్భక్తి బ్రహ్మాండ శక్తి సృష్టిస్థితులగతికి ఆధారశక్తి ఓ ఆదిశక్తి అద్వైతశక్తి నాలోన కొలువుండి నడిపించు శక్తి జై శక్తి ఓంశక్తి జైమహాశక్తి శ్రీం శక్తి క్లీంశక్తి జైపరాశక్తి
చరణం:
సర్వమంత్రాధార శబ్దస్వరూపిణి నిత్యసత్యమ్ములను పలికించవే సర్వయంత్రాధార ప్రజ్ఞస్వరూపిణి సత్వసంపదలెల్ల కలిగించవే సర్వతంత్రాధార శక్తిస్వరూపిణి చైతన్యమూర్తిగా నడిపించవే సర్వలోకాధార మాతృస్వరూపిణి సకలజనులకు మేలు చేయించవే
పరమశివునికి సిరివెన్నెల సాహితీ స్వరాభిషేకం..
~
ఆది భిక్షువు.. కురిపించిన జ్ఞాన భిక్షతో.. అవతరించిన తొలి పాట..
ఆది బిక్షువు వాడిని ఏది కోరేదీ.. బూడిదిచ్చే వాడినేది అడిగేది.. అంటూ ఆ కైలాసనాధునిపై, నిందాస్తుతిగా మొదలుపెట్టి ఆయనపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు సిరివెన్నెల.
అందెల రవమిది పదములదా.. అంబరమంటిన హృదయముగా.. (స్వర్ణకమలం)పాటలో, పరమేశ్వరిని ప్రకృతితో పోలుస్తూ శివ పంచాక్షరిని అద్భుతంగా మనసు పులకించేలా పలికించారు..
“నయన తేజమే న కారమై, మనో నిశ్చయం మ కారమై, శ్వాస చలనమే శి కారమై, వాంచితార్థమే వ కారమై, యోచన సకలము ర కారమై.. ఓం నమశ్శివాయః” అనే పంచాక్షరీ మంత్రంతో తాను పరమేశ్వరానుగ్రహం పొంది, మనకు కూడా అందించారు.
~
స్వర్ణకమలం చిత్రంలోనే..
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా.. యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా నటనాంజలితో బ్రతుకును తరించనీవా.. అనే పాటను రచించి ప్రేక్షకులను రసగంగలో తేలించారు.
~
ఆనతినియరా హరా.. సమ్మతినీయరా సన్నుతి చేయగా,.. అని, స్వాతికిరణం చిత్రంలో..
ఆ నీలకంఠుని ప్రార్థిస్తూ.. ఏ వంకా లేని నా వంక నీ దయా వీక్షణాన్ని ఒకసారి సారించమని, తన్మయత్నంతో ప్రార్థిస్తూ..
రక్షాధ్వరశిక్షాదీక్షాదక్ష.. విరూపాక్ష..
నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్ష చేయక..
పరీక్షసేయక.. రక్షరక్షయను ప్రార్థన వినరా..
అద్భుతమైన వృత్తానుప్రాసలో తన గీతాన్ని స్వరబద్ధం చేశారు సిరివెన్నెల.
~
సంకీర్తన.. చిత్రం కోసం,
ఓంకార వాక్యం.. ఉరగ పుంగవ భూషితాంగం.. అంటూ శివ స్తుతి చేశారు.
~
“భంభం భోలే శంఖం మోగెలే” అనే పాట కాశీ మహత్యాన్ని, ఆ విశ్వేశ్వరనిపై తన భక్తి పారవశ్యాన్ని కురిపిస్తూ, ఇంద్ర చిత్రం కోసం సిరివెన్నెల ఒక గీతాన్ని వ్రాశారు. చిత్రంలో కథానాయకుడు ‘గైడ్’ పాత్రలో కాశీ గురించి వర్ణించే సందర్భం కోసం వ్రాసిన రసగుళిక లాంటి ఈ పాట, లయ ప్రధానమైన మణిశర్మ సుస్వర సంగీత లహరితో ఎంతో ప్రజాదరణ పొందింది.
ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే
మన్నుకాదు మహాదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచేది ఈ నగరమే
చరితలకు అందనిదీ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా ఆ ఓం కారమే
గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే
తరలి రండి తెలుసుకోండి కాశీ మహిమ..
..అనే శివతత్త్వమే ఈ పాటంతా మనకు ప్రకటమవుతుంది.
కన్నయ్య పై అన్నయ్య పాటలు..
సిరివెన్నెల చిత్రంలో చందమామ రావే, జాబిల్లి రావే.. అనే పాటలు.. సీతారామశాస్త్రి గారు కళ్ళకు కట్టినట్టుగా వివరించిన బృందావన ఘనత.
మునిజనమానసమొహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం మునిజన రాధామాధవ గాధల రంజిల్లు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం..
~
ఆపద్బాంధవుడు చిత్రంలో, శ్రీకృష్ణ లీలలను వివరించే, ఒక పాటను సిరివెన్నెల జానపద రీతిలో వ్రాశారు.
ఔరా అమ్మక చెల్లా, అలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా
అమ్మలాల! పైడి కొమ్మలాల! ఏడి? ఏవయాడె? జాడ లేదియాల కోటి తందనాల – ఆనందలాల
గోవులాల, పిల్లం గోవుల్లాల, గొల్ల భామలాల ఏడ నుందియ్యాల నాటి నందనాల-ఆనందలీల
॥అమ్మలాల॥
ఔరా అమ్మక చెల్లా, ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగాథల్లో ఆనందలాలా బాపురే బ్రహ్మకు చెల్లా – వైనవంత వల్లించ వల్లా? రేపల్లె వాడల్లో – ఆనందలీల! అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ బాలుడా గోపాలుడా లోకాలపాలుడా తెలిసేది ఎలాఎలా చాంగుభళా –
చాంగుభళా, ఆనంద లీల.. వంటి అంత్య ప్రాసల పదాలతో జానపద శైలిలో పాటను నడిపిస్తూనే, చిటికెన వేలితో కొండను ఎత్తే బలమున్నవాడు, భక్తి అనే తులసీదళానికి ఎలా తేలిపోయి తూగాడో.. వివరిస్తారు సిరివెన్నెల.
~
ఘల్లుఘల్లుమను మువ్వసవ్వడుల ముద్దుబాలుడెవరే
వెన్నకొల్లగొను కృష్ణపాదముల ఆనవాలు కనరే
గోకులకృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగతేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే..
గోకులంలో సీత చిత్రంలోని ఈ పాటలో, మాయలు చాలయ్య.. అని విరసాలు, సరసాలు చూపుతూనే..
“తియ్యని మత్తున ముంచిన మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కథ తరములు నిలిచే కదా తలిచిన వారి ఎద తరగని మధుర సుధా”.. అని కృష్ణావతార రహస్యాలని బోధిస్తారు సిరివెన్నెల.
~
ముకుంద చిత్రంలో ఏడే అల్లరి వనమాలి, నన్ను వీడే మనసున దయమాలి.. అని కన్నయ్యను వెతికే గోపెమ్మను మేలుకొమ్మని చెబుతూ ఇలా వ్రాస్తారు..
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదర
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెర
విరిసిన పూమాలగా, వెన్నుని ఎద వాలగా,
తలపును లేపలిగా బాలా.. పరదాలే తీయక, పరుపే దిగనీయక పవళింపా ఇంతగా మేలా..
కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక గడపల్లో కిరణాలు లేలేమన్నా కదలక, కలికి ఈ కునుకేల తెల్లవారవచ్చెనమ్మ..
~
ముకుంద చిత్రంలో కృష్ణయ్య పై మరొక పాట
నందలాల ఎందుకీ వేళ ఇంత కళ, తందనాల తాండవలీల, చాంగుభళా
పున్నమిలో సంద్రములా ఉల్లము ఝల్లున పొంగినదే ఊపిరిలో మౌనమిలా పిల్లనగ్రోవిగ మోగినదే
ఊహల్లో సంబరం ఊరేగే ఉత్సవం ఏదో పిలుపు విందా ఎటో తెలుసుకుందా.. అటే నడపమందా పద ఓ ముకుందా..
హనుమంతునిపై సిరివెన్నెల కురిపించిన భక్తి వెన్నెల..
~
ఊసరవెల్లి చిత్రంలో ఆంజనేయ స్తుతి..
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం ఓ బజరంగబలి దుడుకున్నదిరా నీ అడుగులలో నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో ఓ పవమానసుతా! పెను సాహసముందిగ పిడికిలిలో లే పని చెప్పర దానికి విషమ పరీక్షలలో స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగ రా నివురునొదిలి శివ పాలనేత్రమై ధనుజ దహనమునకై దూసుకురా..
~
శ్రీ ఆంజనేయం చిత్రంలో.. హనుమంతునితో తనను పోల్చుకున్న ఓ భక్తుడి పాట..
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాకా బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా..
~
అదే శ్రీ ఆంజనేయం చిత్రంలో.. హనుమంతుడి కార్యదీక్షను ప్రస్తుతిస్తూ, మనకు దిశా నిర్దేశం చేస్తూ.. పలికిన సిరివెన్నెల గళం/కలం..
తికమక మకతిక పరుగులు ఎటుకేసి?
నడవరా నడవరా నలుగురితో కలిసి శ్రీ రామచందురుణ్ణి కోవెల్లో ఖైదుచేసి
రాకాసి రావణున్ని గుండెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కల మనిషీ..
తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి
చరణం:
వెతికే మజిలీ దొరికే దాకా కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా బదులంటూ లేని ప్రశ్నలేదు లోకాన నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ..
~
ముద్దుల ప్రియుడు చిత్రం కోసం ఒక మహాబలి స్తుతి.
పల్లవి:
జైజై మహాకాయ జై జై అమిత శౌర్య జై జై అమరవంద్య జై ఆంజనేయ జై అద్వితీయా జై జై పవనపుత్ర జై వజ్రనిభగాత్ర జై మేరు నగధీర జై సమరశూరా జగదేకవీరా – శ్రీరామచంద్ర చరణాంబుజ విధేయా దుర్వార కార్య ధౌరేయా నీరాజనమ్ములివె వీరాంజనేయా
హే మంగళాకార హే భక్తమందార కపికులాలంకార త్రైలోక సంచార జోతలివె చేకోర అనుచు నిన్నహరహము కొలుచు మా దెస గనుము అభయప్రదాతా భవిష్యత్ విధాతా నీ దివ్య తత్త్వంబు నీ మహా సత్వంబు నీ అనన్యత్వంబు గ్రహించలేక నిను నిరసించనొక్కించు ముష్కరుల మదమణచ రారా
శ్రీరామునిపై భక్తి గీతాలు..
~
గౌరి చిత్రంలో సీతారామ రామ కళ్యాణంపై ఓ గీతం,
పైకి నిందా స్తుతి లాగా కనిపిస్తూ, రామావతార పరమార్ధాన్ని తెలియజేస్తుంది.
పల్లవి:
వరమాలై నీ మెడలోన వాలిన జానకి ప్రేమ మెరుపల్లే నీ మేనంతా అల్లెను మేఘశ్యామా రామా రామా రామా రామా..
చరణం:
ఏనాడో జరిగినా ఎన్నాళ్ళో గడిచినా ఏటేటా కొత్తగా కళ్యాణమా
విల్లును విరిచావనా పిల్లని గెలిచావనా ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమా
కాపురమంతా కారడవిగా జీవితమంతా కష్టాలుగా చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్థం
పరిణయంలో పరమ రహస్యం తెలుసుకుంటే తారక మంత్రం
విన్న కొద్ది వింతలెన్నో తెలుపుతున్నది కళ్ళనిండా కాంతులెన్నో నింపుతున్నది ఊరువాడనల్లుతున్న పందిరే ఇది మన్ను మిన్ను ఏకమైన సందడే ఇది..
~
మావిచిగురు చిత్రంలోని ఓ రామగీతి..
కోదండ రాముడంట కొమ్మలాలా వాడు కౌసల్య కొమరుడంట కొమ్మలాలా ఆజానుబాహుడంట అమ్మలాలా వాడు అరవిందనేత్రుడంట అమ్మలాలా
రమణీలలామకు తగ్గ జోడువాడేనని రహదారులన్ని చెప్పుకోగా విని
కళ్యాణరామయ్యని కన్నులారా చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా
~
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రం కోసం.. ఒక రామగీతి..
రామ నామమే ప్రాణముగా ఆ రావణవనమున సీతమ్మ
సీతాస్మరణమే శ్వాసగా సంద్రానికి ఈవల రామయ్య ఇరువురి దూరం కరిగించగ ఆ విరహమే వారధిగా మారెనుగా..
ఇతర దేవతా మూర్తులపై గీతాలు..
~
తనను శోధనకు గురిచేసిన భగవంతుని గురించి శ్రీ వేమన చరిత్ర లోని పాట.
నారాయణ హరి నారాయణ నీ లీల ఏమిరా మా నాయనా ॥నారాయణ॥ కాలమను కీలుతో నడిపించుతున్నావు ||2|| ఈ తోలు బొమ్మలను ఆడించుతున్నావు..
~
దుర్గ చిత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిపై ఒక గీతం.. శివ స్తుతితో పాటుగా..
పల్లవి:
శిష్టులకాచే శివశూలానికి శిలగా మారే మరపుందా క్షుద్రుడు వేస్తే కట్టడిరేఖ రుద్రుడు రాడా రక్షణకాగా దిక్కులు కట్టి వేసిన రేఖ తన మృత్యువుకే పంపినలేఖ
చరణం:
షణ్ముఖుడే ముద్దుమోముకి రక్ష కార్తికేయుడే కంటికిరక్ష గుహుడే! గుహుడే చిన్నారి గుండెకి రక్ష శివకుమారుడే శ్వాసకి రక్ష శక్తిపాణి హస్తాలకు రక్ష నెమలివాహనుడు కాళ్ళకి రక్ష వేలాయుధుడే వెన్నుకి రక్ష సురసేనాపతి వేలికి రక్ష వాసధరుడు ప్రాణాలకు రక్ష శరవణభవుడే శిశివుకి రక్ష
~
తన శ్వాసలోని సరిగమలా, తన నాడుల్లోని నాదంలా మమేకమైపోయిన.. సాయి రాకకు తప్పిస్తున్న ఒక భక్తుడి నిరీక్షణ..99 సాంగ్స్.. కోసం..
~
రావో సాయి నిరీక్షణలో ఎంతసేపిలా నా తపన ఎంతసేపిలా నాలో తపన చెంత చేరుకో
రావో సాయి నిరీక్షణలో ఎంతసేపిలా నా తపన ఎంతసేపిలా నా తపన చెంత చేరుకో సాయి సాయి నా శ్వాసలో సరిగమ సాయి సాయి నా నాడుల్లో నాదమా సాయి సాయి నా ఆలాపన నీ కోసమేగా ఓ షిరిడీ సాయి మనవి విని మన్నించవా..
~
భగీరథ చిత్రంలోని తిరుమలేశుని పాట..
తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతిగొనవయ్యా
శ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా అడుగే పడని పయనాన
అడుగే పడని పయనాన వెలుగై నడిపే నీ కరుణ
ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేసా..ll తిరుమలవాస ll
~
క్రీస్తు చరిత్రను, ఆయన మార్గాన్ని స్తుతించే కొన్ని పాటలు..
దయామయుడు చిత్రం నుండి..
పశులపాకలో పసిడి దీపమై పిడికిళ్ళు తెరిచింది నవశకం పులకించి పలికింది పుడమి స్వాగతం
జగమేలు రారాజు రాక జనజీవితాల వెలుగు రేఖ తెలిపింది ఆకాశవాణి ఇతడే సుమా దైవసుతుడని పరిపూర్ణ తేజం సాధించు ధ్యేయం అవిరామ కృషితో సాగించు ధ్యానం ఎదిరించే సాతాను పరీక్ష శిరసొంచునా ప్రభుని దీక్ష..
భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి ఓ పేతురు ఓ యోహాను ఓ యోకబులారా నా అడుగుల జాడబట్టి నడువగ రారా.
చరణం:
నిర్మలమైనది ప్రేమ పసిపాపల నవ్వుల్లా
కోమలమైనది ప్రేమ వికసించిన పూవ్వుల్లా
ఎల్లలు లేనిది ప్రేమ విహరించే గువ్వల్లా మోహనమైనది ప్రేమ మురిపించే వెన్నెల్లా పసిపాపలా మనసుంచుకో పదిమందితో ప్రేమ పంచుకో
కోరస్:
శోకం తాకని లోకం చూపిన ప్రభువే బాటగా మమతాసమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి ఈ చీకటి తొలగించాలి..
ఆ చిత్రంలోని మరి కొన్ని పాటలు..
శోకం తాకని లోకం చూపిన ప్రభువే బాటగా మమతా సమతల సామ్రాజ్యానికి నడిపే జ్యోతిగా ప్రేమను వెలిగించాలి. ఈ చీకటి తొలగించాలి.
చరణం:
ప్రేమే నిత్యం – ప్రేమే సత్యం ప్రేమే చెరగని సౌందర్యం ప్రేమను మించిన జ్ఞానము లేదు ప్రేమే జీవన సూత్రం ప్రేమే ధనము – ప్రేమే బలము ప్రేమే జీవన మాధుర్యం ప్రేమే మార్గం – ప్రేమే గమ్యం ప్రేమే జన్మకు సాఫల్యం నరలోకములో ప్రభు రాజ్యమునే వెలయించే వరమే ప్రేమ..
వేధించే వ్యాధికి ఔషధమై మృత్యువునే గెలిచిన అమృతమై ఆర్తులకై శాశ్వత శాంతిపథం ఓహోహో వెలసెను పరమపదం పరమపదం పరమపదం. పరమపదం పరమపదం
కరుణామయుని కాంతి కిరణాల తాకిడికి కరిగింది అజ్ఞాన తిమిరం కలుషాత్ములకు కలిగె మితి లేని క్రోధమదమాత్సర్యములతో అసహనం పథకాలు వేసింది పాపం పతనానికి అది ప్రథమ పాదం ముసిరింది దుర్మార్గ ధూమం మసిబారె మానవుని జ్ఞానం
రుధిరధారతో పథము చూపుతూ పయనించె అభిషిక్తుడు కరుణ జ్యోతిగా వెలిగించె తన బ్రతుకును కర్పూరముగా..
~
ఇలాంటి అమృతమయమైన భావాలతో అందరూ హృదయాలలో భక్తి భావనలు మేల్కొల్పారు సిరివెన్నెల.
భగవంతుని రూపమైనా, నామమైనా.. మనలో భక్తిని మేల్కొల్పగలరు. రూప. నామాలతో సంబంధం లేని సర్వాంతర్యామి అయిన భగవత్ శక్తిని, సంపూర్ణంగా అర్థం చేసుకున్న సర్వజ్ఞులు సిరివెన్నెల. ఏ దేవునికి కీర్తించినా.. దాని మూల సారం లేదా ఫలితం.. ఆధ్యాత్మిక ప్రగతి.. లేదా కష్టాల నుండి బయటపడే ధైర్యం/ఓదార్పు పొందడం. ఈ పాటలు వినడం ద్వారా, భావాన్ని గ్రహించడం ద్వారా, మనం భక్తి మార్గంలో నిస్సందేహంగా ప్రగతి సాధించగలం. సిరివెన్నెల రచించిన భక్తి గీతాలు. వివిధ చిత్రాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన భక్తి గేయాలను ఒక చోట చేర్చి మీ ముందు ఉంచడానికి చేసిన ప్రయత్నమిది. ఈ గీతాల పూర్తి రచనలు ‘సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’లో లభ్యమవుతాయి. ఇంత అమూల్యమైన దైవ భక్తి గీతాలు అందించిన సిరివెన్నెల జన్మ ధన్యం.. అమృతాన్ని అందుకున్న, మనం కూడా ధన్యులమే!
Images Source: Internet