పెంచుకోండి

0
4

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘పెంచుకోండి’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఫో[/dropcap]ను మోగుతున్నా పట్టించుకోకుండా, తన పనిలో తాను మునిగిపోయి మరీ పని చేసుకుంటున్నాడు మధు. మరలా ఫోన్ మోగడంతో, విసుగ్గా ఫోన్ వంక చూసాడు. ఒక్కసారే తుళ్ళిపడ్డాడు. భయంతో గుటకలు మింగుతూ, ‘అమ్మో లలిత, ఈసారి ఫోన్ ఎత్తకపోతే నన్ను ఎత్తి ఏట్లో పడేస్తుంది.లిఫ్ట్ చేయాలి’ అనుకుని ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని

“ఆఁ.. లలితా చెప్పు, ఏమిటి సంగతి” అడిగాడు.

“ఏడ్చినట్టుంది మీ వరస, రామాయణం అంతా విని, ఆంజనేయుడు సంజీవినిని ఎందుకు తీసుకువచ్చాడు అని అడిగినట్టుంది. ఆఫీసుకి వెళ్ళే ముందు కూడా విషయం వివరంగా చెప్పాను కదా!” బుస, బుసలాడింది.

ఆమె అడిగినదానికి బిక్కమొహంతో తిక్క చూపులు చూస్తూ “అదా గుర్తుంది. ఎందుకైనా మంచింది, మరోసారి గుర్తుచేయవూ” అంటూ విషయం గుర్తురాక బుర్ర గోక్కున్నాడు.

“ఏడ్చినట్టుంది, భారతం అంతా విని, భీముడు కీచకుడ్ని ఎందుకు చంపాడు అని అడిగినట్టుంది. మీరు నిజంగానే ఆఫీసు పని టెన్షన్‌లో మర్చిపోయారా లేక అలా నాటకం ఆడుతున్నారా!. ఎందుకంటే, అన్ని విషయాలూ పొల్లు పోకుండా చక్కగా గుర్తుపెట్టుకుంటారు. కానీ నావీ, మా వాళ్ళ దగ్గరకి రాగానే మాత్రం మర్చిపోతారు, మీకు ఏవీ గుర్తుండవు. అంతేనా” అరిచింది.

ఆ అరుపుకి అళ్ళిపోయి, “ఇదిగో, ఊరికే బండల్లాంటి అభాండాలు నామీదేయకు. నేనేం కావాలని మర్చిపోతానా ఏవిటి! ఏదో ఈరోజు ఆఫీసు పనిపడుతూ మిగతావి మర్చిపోయాను. అయినా లీలగా గుర్తుంది, ఈరోజు మీ నాన్న పుట్టినరోజు కదా” అడిగాడు కాస్త సందేహంగా.

“ఇవాళ పుట్టినరోజు మా నాన్నని కాదు, మా తమ్ముడిది. మర్చిపోయారా? మిమ్మల్ని గిఫ్ట్ తెమ్మని కూడా చెప్పాను కదా! అది మీ పనిలో పడి ఎక్కడ మర్చిపోతారేమోనని, ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. నేను ఇలా ఫోన్ చేయడం మంచిదే అయింది” అని క్షణం నెత్తి బాదుకుని “ఇదిగోండి, నేను మన ఇంట్లో లేను, ఇంటికి తాళం పెట్టి మా పుట్టింటికి వచ్చేసాను. కాబట్టి నేరుగా మీరు కూడా మా పుట్టింటికి వచ్చేసేయండి. ఇక్కడే బర్త్‌డే సెలబ్రేషన్స్, అవీ ఉన్నాయి. రాత్రి డిన్నర్ కూడా ఇక్కడే మర్చిపోకండి. అన్నట్టు గిఫ్టు ఏది పడితే అది కొనొద్దు. నేను ఒకటి చెప్తాను శ్రద్ధగా వినండి. అదేంటంటే, ఈమధ్య మా తమ్ముడు పెంచుకున్న కుక్క ఎక్కడికో తప్పిపోయి వెళ్ళిపోయిందట. అప్పటినుంచి అన్నం మానేసి రోజురోజుకీ బరువు తగ్గిపోతున్నాడట. కాబట్టి దగ్గరలోని పెట్ షాప్‌కి వెళ్లి, ఏదైనా ఒక మంచి బ్రీడ్ కుక్కపిల్లని తెండి. వాడికి జర్మన్ షెఫర్డ్ అంటే ఇష్టమట, అలాగే దొరికితే ఎక్కడైనా డాల్మిషన్ గానీ, లేదంటే లాబ్రడార్ అయినా పర్వాలేదు, కొనుక్కు తీసుకురండి, ఖర్చు గురించి చచ్చు ఆలోచనలు చేసి వెనకాడకండి” నొక్కి మరీ చెప్పిందామె.

“సరే సరే కుక్క”, అని నాలుక కరుచుకుని “అదే, అదే, కుక్కపిల్లని కొని నేరుగా మీ అమ్మ వాళ్ళింటికి తీసుకొని వస్తానులే”. చెప్పి ఫోన్ పెట్టేసాడు మధు.

లలిత ఫోన్‌లో మాట్లాడిన మాటలు విన్న ఆమె తల్లి, “అమ్మాయ్, నీకు కాని మతి, గితి ఏమైనా పోయిందా! అల్లుడు గారికి అలాంటి పనులు అప్పజెప్తావా? ఆయన సంగతి నీకు తెలుసు కదా? ఆయనని ఒక పని చేయమంటే ఇంకో పని చేస్తారు. అలాంటిది,అన్నీ తెలిసి అల్లుడుగారిని తీసుకు రమ్మంటావా. అసలే ఆయన ఆలోచన తీరు వేరు, ఆయనకు అనిపించిందే చేస్తారు. కనుక దయచేసి ఇలాంటి పనులు ఆయనకు అప్పచెప్పకపోవడం మంచిది. కనుక మరలా ఫోన్ చేసి వద్దని చెప్పేయ్, అంతగా కాదంటే, తమ్ముడికి నువ్వు, నేను వెళ్లి ఏదైనా పెట్ షాప్‌లో ఒక మంచి కుక్క పిల్లని కొని తీసుకుని వచ్చేద్దాం. నాకు తెలిసిన పెట్ షాప్ కూడా ఒకటి దగ్గరలోనే ఉంది” చెప్పిందామె ఉత్సాహంగా.

“లేదమ్మా, ఆయన మాత్రం కుక్కని తయారు చేస్తారా? ఏమిటి! కొని తీసుకురావాల్సిందే కదా, కాబట్టి నువ్వేం బెంగపడకు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తారు, నువ్వు ఇక ఆ విషయాన్ని వదిలేసేయ్. ధీమాగా ఉండు, పుట్టినరోజు పనులు చేయి, అసలే తమ్ముడు ఆఫీసు నుండి వచ్చే టైం అయింది” చెప్పింది లలిత.

ఆమె అలా అంటుండుగానే వాళ్ళ తమ్ముడు వచ్చి వాళ్ళ సంభాషణ విని “యాహూ, బావగారు నాకోసం పప్పీని తీసుకొస్తున్నారా, వెరీ హ్యాపీ అక్క,నా మనసు తెలుసుకున్నావ్” అన్నాడు చాలా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ.

“అవున్రా, ఈ అక్కంటే ఏమనుకుంటున్నావ్. చిన్నప్పటి నుంచి నిన్ను ఎరిగిన దాన్ని, నీ మనసు తెలిసిన దాన్ని, ఆ మాత్రం నీకు ఏం కావాలో కనుక్కోలేనా” అంది గొప్పగా.

ఆ హాల్లోనే సెల్‌ఫోన్ చూస్తున్న లలిత తండ్రి, “ఎందుకమ్మా అల్లుడు గారికి అంత ఖర్చుతో కూడుకున్న పని పెట్టావ్. ఆయన ఏమనుకుంటారు చెప్పు” అన్నాడాయన.

“ఏవీ అనుకోరు, బావమరిదికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తున్నానని సంతోషపడతారు” చెప్పింది నవ్వుతూ.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తీసి చూడగానే అందరూ ఒక్కసారే షాక్ అయిపోయారు. కుక్క అదో రకంగా ఉంది, లలిత కొంతసేపటికి తేరుకుని “ఏమిటండీ ఇది!” అడిగింది నెత్తి కొట్టుకుంటూ.

“నువ్వు అడిగిన పిల్లకుక్క” అన్నాడు, దాన్ని ఇంకాస్త పైకి ఎత్తుకుంటూ.

“నేను తెమ్మంది బ్రీడ్ పప్పీని, ఇదేమిటి ఊర కుక్కలా ఉంది, ఎక్కడినుంచి పట్టుకొచ్చారు” అడిగింది అసహ్యంగా దానివంక చూస్తూ.

“ఇదా? ఒక వీధిలో అటు,ఇటు తిరుగుతూ, పాపం బిక్కు బిక్కుమని చూస్తుంటే, జాలేసి తీసుకొచ్చాను. నువ్వన్నట్టు, ఆ పెట్ షాపుల్లో మనం కొనకపోయినా, ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ కుక్కలు కొని వాళ్ళ కొంపలకు పట్టుకు పోతారు. కానీ ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకోరు. అందుకనే మనసుకి బాధనిపించి దీన్ని ఇంటికి తీసుకొచ్చాను. దీనిని కూడా చక్కగా పెంచితే, వాటికంటే అందంగా తయారవుతుంది. విశ్వాసం కూడా వాటికంటే రెట్టింపు చూపుతుంది”, అని ఆ కుక్క పిల్లని తీసుకెళ్లి, తన బావమరిది చేతిలో పెట్టాడు. అతను కూడా కుక్కపిల్ల వంక మధు వంక మార్చి మార్చి చూసాడు..

లలిత కసిగా, కోపంగా చూస్తున్నా పట్టించుకోకుండా, “మై డియర్ బావమరిది, నేను ఒకటే చెప్తాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, పెట్స్ని కొనకూడదు, పెంచుకోవాలి” అని నవ్వేసి, “దీనికి మంచి పేరు ఆలోచించండి” అన్నాడు సోఫాలో కూర్చుని వెనగ్గా జారబడుతూ.

చెబితే విన్నావా అన్నట్టు చూసింది తల్లి, లలిత వంక. కానీ లలిత తండ్రి మాత్రం, అల్లుడి వంక మెచ్చుకోలుగా చూసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here