గాల్లో తేలినట్టుంది..!!

7
3

[శ్రీ తోట సాంబశివరావు గారు రచించిన ‘గాల్లో తేలినట్టుంది..!!’ అనే హాస్య కథని అందిస్తున్నాము.]

[dropcap]“ఏ[/dropcap]మోయ్ కాంతం! తెల్లారి గంటన్నరైంది. కాఫీ ఇచ్చేదేమైనా ఉందా? ఇంకా ఆ పూజలు పునస్కారాల తోనే కాలయాపన చేస్తావా?..”

ఒకింత కోపంగా అరుస్తూ సోఫాలో కూర్చుని దినపత్రికను తిరగేస్తున్నాడు బ్రహ్మానందం.

“ఆ! ఐదు నిమిషాలాగండి.. కాఫీ తెస్తున్నాను!” వంటగదిలోంచి పెద్దగా చెప్పింది కాంతం.

కాంతం అందించిన కాఫీ కప్పును అందుకుంటూ.. “ఏంటి ఈ రోజు పూజా విశేషాలు?” అడిగాడు బ్రహ్మానందం.

“ఈ రోజు అమ్మవారికి పూజచేసి, ఉపవాసం ఉండి, ఇంటి కొచ్చిన ఓ అతిథికి సపర్యలు చేసి, అతిథ్యం ఇస్తే., కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుందండి!” తలారబెట్టుకుంటూ సంతోషంగా చెప్పింది కాంతం.

“అయితే.. నువ్వేం కోరుకున్నావ్ కాంతం?” ఆసక్తిగా అడిగాడు బ్రహ్మానందం.

“మీకు వెంటనే పదోన్నతి లభించాలని మనసారా కోరుకున్నానండి!” ఆనందంతో చెప్పింది కాంతం.

తన భార్యామణి కోరుకున్న కోర్కెను విన్న తరువాత “ఎట్టెట్టా!! పూజ చేసేది నువ్వు – కడుపు మాడ్చుకుని ఉపవాసం ఉండేది నువ్వు – వాడెవడో గొట్టంగాడు అతిథిగా వస్తే, వాడికి సపర్యలు చేసి, మృష్టాన్న భోజనాన్ని వండి వడ్డించేది నువ్వు – కడుపారా మెక్కి ‘బ్రేవ్’మని తేపేది వాడు – తీరా ఫలితంగా, పదోన్నతి లభించేది నాకా!! హు! ఏడ్చినట్టే ఉంది నీ లాజిక్కు!” వ్యంగ్యంగా వెటకారంగా అన్నాడు బ్రహ్మానందం.

“అలా తీసి పారేయకండి మరి! అమ్మవారి పూజను అవహేళన చేయకండలా! అమ్మవారికి కోపం వస్తుంది!’’ బుంగమూతి పెట్టుకుని చెప్పింది కాంతం.

“అయినా.. ఇలాంటి చెత్త ఆలోచన నీకెలా వచ్చింది కాంతం?”

“ఆ విషయం, మొన్ననే గురువు గారు టీవీలో చెప్పారండి!”

“అవునా! అయితే ఆ గురువు గారెవరో, నీలాంటి వారందరికీ, చెవుల్లో పెద్ద పూలే పెట్టాడన్నమాట!” వెకిలిగా నవ్వుతూ అన్నాడు బ్రహ్మనందం.

“పూజలంటే మీకెప్పుడూ వేళాకోళమే! మిమ్మల్నెవరూ మార్చలేరు!” అంటూ ఖాళీ కప్పును తీసుకుని వంటగది వైపు విసురుగా వెళ్ళింది కాంతం.

దినపత్రికను పూర్తిగా చదివి బయటికెళ్లేందుకు తయారవడానికి లేచాడు బ్రహ్మానందం. అప్పుడే, వంట గదినుండి బయటికొచ్చిన కాంతం, వీధి గుమ్మం దగ్గర కెళ్ళి, అటూ ఇటూ చూస్తూ నిల్చుంది.

“ఏంటి కాంతం? ఎవరి కోసం ఆ ఎదురు చూపులు?” కుతూహలంగా అడిగాడు బ్రహ్మానందం.

“ఎవరైనా అతిథి వస్తారేమోనని ఎదురు చూస్తున్నానండి!”

“అహా!! చూడు చూడు! ఎవడో ఒక బడుద్దాయి రాకపోడు!” అంటూ లోపలి కెళ్ళాడు బ్రహ్మానందం.

ఎంతకీ ఎవరూ రాకపోయేసరికి నిరాశతో లోపలికొచ్చింది కాంతం.

***

మధ్యాహ్నం భోజనాల అనంతరం.. “ఆఁ కాంతం! మా స్నేహితుడి కొడుకు పెళ్ళికి విజయవాడ వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పటికి నడిరాత్రి దాటవచ్చు. నువ్వు జాగ్రత్తగా తలుపు లేసుకుని పెందలాడే పడుకో! అంతేగాని, అసలు వస్తాడో లేదో తెలియని అతిథి కోసం, వీధి గుమ్మంలో నిల్చుని చూస్తుంటే, దారిన పోయే దానయ్యలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది! అది కాస్తా అనర్థానికి దారి తీయవచ్చు! జాగ్రత్త!!..”

“అలాగేనండి! మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి!” అంటూ భర్తను బయటి గుమ్మం దాకా సాగనంపింది కాంతం.

‘ఇంతవరకూ ఒక్క అతిథి కూడా రాలేదు! అతిథి రాకపోతే నా పూజ ఫలించదు కదా! అలాగైతే.. నా కోరిక తీరదు కదా!’ మనసులోనే బాధపడుతూ, మాటి మాటికీ, బయటి గుమ్మం వైపు ఆశగా చూస్తుంది కాంతం.

సాయంత్రం ఆరు గంటలైంది. కాని అతిథి జాడలేదు. ఇక ఆశలు వదులుకున్న కాంతం, బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న కొడుకుతో ఫోన్లో మాట్లాడుతుండగా.. బయటి నుండి

“ఒరేయ్! బ్రహ్మానందం! ఇంట్లో ఉన్నావా?” పిలుపు వినిపించింది.

ఎవరో అతిథి వచ్చి ఉంటారనే తలంపుతో, కాంతం ఆశలు చిగురించాయి. తరువాత మాట్లాడతానని, కొడుకుతో చెప్పి, గుమ్మం దగ్గరికెళ్ళి చూసింది కాంతం.

“ఏమ్మా! ఆ గొట్టంగాడు ఉన్నాడా?” అంటూ రమ్మనకుండానే లోపలికి చొచ్చుకుని వచ్చి సోఫాలో దర్జాగా కూర్చున్నాడు ఆ అపరిచితుడు.

కాంతం సంతోషానికి అవధులు లేవు.

‘మొత్తానికి అనుకోని అతిథి వచ్చినట్లే!’ అనుకుంటూ మనసులోనే అమ్మవారికి నమస్కరించింది.

“అమ్మా! నా పేరు పద్మనాభం, బ్రహ్మానందం, నేను చిన్ననాటి స్నేహితులం.. ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం! వీడ్ని చూసి చాలా సంవత్సరాలయిందనుకో! వీడి చిరునామా తెలుసుకోడానికి ఇన్ని రోజులు పట్టింది.. ఏడి వీడు? ఇంతవరకు కనిపించలేదు! ఇంట్లో లేడా ఏంటి?’’ అడిగాడు పద్మనాభం.

“ఆయన విజయవాడ వెళ్ళారండి! రాత్రికి తిరిగొస్తారు.”

“సరేలేమ్మా! అన్నట్లు.. బహుదూర ప్రయాణం చేశానేమో.. ఒళ్ళంతా హూనం అయిపోయిందనుకో! వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే గాని, కాస్తంత ఉపశమనం లభిస్తుంది.. ఈలోపు నువ్వు భోజనం తయారు చేస్తే, కడుపు నిండా భోంచేసి, కంటి నిండా నిద్రపోతాను! అన్నట్లు, నాకు నెయ్యి లేకపోతే ముద్ద దిగదు.. మరో విషయం.. గేదె నెయ్యి నా వంటికి పడదు.. ఆవు నెయ్యే కావాలి.. మరి నా గది చూపిస్తే స్నానం చేసి వస్తాను!” అంటూ కాంతం చూపించిన గది లోకి నడిచాడు పద్మనాభం.

***

భోజనానంతరం..

“అమ్మా! వంటలు చాలా బాగా చేశావమ్మా! ఇంత రుచికరమైన భోజనం ఈ మధ్య కాలంతో నేను తినలేదంటే నమ్ము!” మెచ్చుకోలుగా చెప్పాడు పద్మనాభం.

“నా వంటలు మీకు నచ్చాయి.. మీరు తృప్తిగా భోంచేశారు! నా కంతే చాలు!” వినయంగా చెప్పింది కాంతం.

“ఆఁ! ఇక నేను పడుకుంటానమ్మా! నిద్ర ముంచుకొస్తుంది.. ఆఁ! చెల్లెమ్మా! వాడొచ్చేటప్పటికి ఏ టైమవుతుందో ఏమో! నన్ను మాత్రం నిద్ర లేపొద్దని చెప్పమ్మా! రేపు పొద్దున్నే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పమ్మా!” అంటూ గదిలోకి వెళ్ళాడు పద్మనాభం.

***

అర్ధరాత్రి దాటింతరువాత వచ్చాడు బ్రహ్మానందం. తలుపు తీస్తూనే “ఏవండి! ఈరోజు మనింటికి మీ చిన్ననాటి స్నేహితుడు పద్మనాభం గారు అతిథిగా వచ్చారు!” తన పూజ సంపూర్ణమయిందన్న సంతోషంతో, కళ్ళు పెద్దవి చేసి చెప్పింది కాంతం.

“పద్మనాభమా!! గుర్తుకు రావడం లేదే! ఎక్కడా వాడు? పద చూద్దాం!”

“వద్దండి! పాపం బాగా అలసిపోయారట! రేపు ఉదయాన్నే మాట్లాడుకుందామని చెప్పి పడుకున్నారు!”

“సరే! రేపు ఉదయమే చూద్దాంలే!” తమ గదిలోకి వెళ్ళారు బ్రహ్మానందం, కాంతం.

***

ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని హాల్లోని సోఫాలో కూర్చుని దినపత్రికను తిరగేస్తున్నాడు పద్మనాభం. అప్పుడే, పెద్దగా ఆవులిస్తూ, ఒళ్ళు విరుచుకుంటూ హాల్లోకి వచ్చాడు బ్రహ్మానందం.. ఉలిక్కిపడి చూశాడు పద్మనాభం.

“ఏయ్! ఎవరయ్యా నువ్వు? దొంగా.. దొంగా.. ఓ చెల్లెమ్మా.. దొంగా.. దొంగా!!” భయంతో కేకలు పెట్టాడు పద్మనాభం.

పరుగు పరుగున వచ్చిన కాంతం “అయ్యో! దొంగ కాదన్నయ్యా! ఈయనే మా ఆయన!!” నవ్వుతూ చెప్పింది.

“ఆయనా!! అంటే, ఈయనేనా బ్రహ్మానందం!! అలా అనిపించడం లేదే!! ఉహూ! ఈయన నా స్నేహితుడు బ్రహ్మానందం కాదు!” అంటూ బ్రహ్మానందాన్ని అనుమానాస్పదంగా, ఎగాదిగా చూస్తున్నాడు పద్మనాభం.

“నేను కూడా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే! మీ పేరున్న వారెవరూ నా స్నేహితుల్లో లేరు. ఎక్కడో తేడా కొట్టింది!” ముక్కున వేలేసుకుని పైకి చూస్తూ ఆలోచించసాగాడు బ్రహ్మానందం.

“అసలు మీరు మా ఇంటికెలా వచ్చారు పద్మనాభం గారూ!”

“వీధి చివరనున్న కిళ్ళీ కొట్టు దగ్గర.. బ్రహ్మానందం గారిల్లెక్కడ.. అని అడిగాను.. మీ ఇంటిని చూపించారు, సరాసరి ఇక్కడి కొచ్చాను!” అమాయకంగా చెప్పాడు పద్మనాభం.

“ఓహో!! ఇప్పుడు అర్థమైంది నాకు.. మొత్తం అర్థమైంది! చూడండి పద్మనాభం గారు! మీరు కలవాలనుకుంది కోట బ్రహ్మానందం గారిని, అవునా?”

అవునన్నట్లు తలను పైకి కిందికి ఊపాడు పద్మనాభం.

“కాని, నా పేరు పేట బ్రహ్మానందం! మీరు వెళ్ళాలనుకున్న కోట బ్రహ్మానందం గారి ఇల్లు మా ఇంటికి ఎదురుగా ఉంది!” నింపాదిగా చెప్పాడు బ్రహ్మానందం.

“అవునా! పెద్ద పొరపాటే జరిగింది బ్రహ్మనందం గారు!” అంటూ చిన్నబుచ్చుకున్నాడు పద్మనాభం.

“పరవాలేదు లెండి! అంతా మంచే జరిగింది. మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అన్నయ్యగారూ!” చెప్పింది కాంతం పూజ పరిపూర్ణమైందనే తృప్తితో.

“బావగారూ! పొరపాటయి పోయింది! నన్ను క్షమించండి!!” సిగ్గుతో తల దించుకున్నాడు పద్మనాభం.

“అబ్బెబ్బే! అదేం లేదండి! అయినా, ఇప్పుడేమైందని, ఇప్పుడే మీరు ఎదురెంటి కెళ్లొచ్చు” బయటికి దారి చూపిస్తూ చెప్పాడు బ్రహ్మానందం.

గదిలోకి వెళ్ళి సూట్‌కేసు సర్దుకుని బయటకు వెళ్ళబోతూ, వెనకకు తిరిగి, “ఆఁ! చెల్లెమ్మా! నీ చేతి వంట అద్భుతం తల్లి ! మంచి భోజనం పెట్టావు! వస్తానమ్మా!!” చెప్పాడు పద్మనాభం.

“అన్నయ్యా! మీరు తిరిగి వెళ్లే లోపు మరొకసారి మా యింటికి భోజనానికి రావాలి”

“అలాగే.. చెల్లెమ్మా! తప్పక వస్తాను!” అంటూ వీధి గుమ్మం దాకా వెళ్ళి, మళ్లీ తిరిగివెనక్కి వచ్చి, “ఆఁ! బావగారూ! మీ మంచం పైన పరుపు.. అబ్బ.. ఎంత బాగుందండి!! మాంచి నిద్ర పట్టిందనుకోండి!” తన్మయత్వంతో చెప్పాడు పద్మనాభం.

కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని కట్టడి చేసుకుంటూ, “మహాప్రభో! మీరిక దయ చేయండి! ఇంకొక్క క్షణం మీరిక్కడున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు.. వెళ్ళండి!” అంటూ పద్మనాభాన్ని బయట గుమ్మం దాకా నెట్టుకెళ్ళాడు బ్రహ్మానందం. మారు మాట్లాడకుండా బయటపడ్డాడు పద్మనాభం.

కోపంగా, కాంతం దగ్గరి కొచ్చి, “నీకసలు బుద్ధుందా? ఆఁ! ఎవడో గన్నాయిగాడు, ఇంటికొస్తే, వాడెవడో, ఏంటో, తెలుసుకోకుండా, ఇంట్లోకి రానిచ్చి, అతిథి మర్యాదలు చేస్తావా? ఇంత వయసొచ్చింది.. ఏం లాభం? కాస్తంత ఇంగితజ్ఞానం ఉండక్కర్లా? ఇక ముందు ఇలాంటివి జరక్కుండా చూసుకో! వళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకో! జాగ్రత్త!” రుసరుసలాడుతూ, లోపలికెళ్ళాడు బ్రహ్మానందం.

“మీరేవన్నా అనుకోండి! నన్నేవైనా అనండి! అన్నయ్య గారి పొరపాటో, లేక మీ గ్రహపాటో నాకు తెలియదు కాని, నా పూజ మాత్రం పరిపూర్ణమైంది.. నా కది చాలు!” వంట గది వైపు నడిచింది కాంతం.

***

“ఆంటీ.. ఆంటీ..!” అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది, ఎదురింటి కోట బ్రహ్మానందం గారి చిన్నకూతురు.

“రామ్మా.. రా..! ఏంటిలా వచ్చావ్?” అడిగింది కాంతం అప్యాయంగా.

“మీ ఇంట్లో ఇవ్వాల్సిన, ఈ కవరును, పోస్ట్‌మాన్ పొరపాటున మా ఇంట్లో ఇచ్చాడాంటీ! ఇదిగోండి!” అంటూ కవరిచ్చి తుర్రున వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అప్పుడే హాల్లోకి వచ్చిన బ్రహ్మానందానికి ఆ కవరిచ్చి లోపలికెళ్ళింది కాంతం.

కవరు లోపల వున్న ఉత్తరాన్ని చదివిన బ్రహ్మానందం “కాంతం! ఓ కాంతం!!” అంటూ బిగ్గరగా కేకలు పెట్టాడు.

జరగరానిదేదో జరిగిందేమోనని, హడావిడిగా బయటికి పరుగెత్తి కొచ్చింది కాంతం, భయపడుతూ..

“వాయమ్మో! వాయమ్మో!! ఏమైందండీ.. అంత పెద్దగా అరిచారు!”

“ఏమైందేంటి కాంతం! నీ పూజ ఫలించింది! నీ కోరిక తీరింది..!!” అమితానందంతో, కాంతాన్ని అమాంతం తన చేతులతో పైకెత్తి, గుండ్రంగా తిప్పుతున్నాడు బ్రహ్మానందం.

శుభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here