అమృత్ రసగుల్లా హౌజ్..

2
4

[శ్రీ వేణు మరీదు రచించిన ‘అమృత్ రసగుల్లా హౌజ్..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“తుమ్ అప్‌నా రంజోఘం
అప్‌నీ పరేషానీ ముఝే దేదో..”

కమ్మటి ఆర్ద్రతతో చుట్టూ ప్రవహిస్తుంది జగ్‌జీత్ కౌర్ స్వరం పాత మ్యూజిక్ సిస్టం నుండి. ఖాళీగా కూర్చొని కాళ్ళూపుకుంటూ ఆ సాహిర్ పాటలోని మాధుర్యాన్ని గుండెలోకి, నోటిలోని మిఠాయి తీపిని గొంతులోకి జుర్రుకుంటున్నాడు అమృతరావు. ఏం చేస్తాడు పాపం! అతని ‘ఏడుకొండలు మిఠాయి దుకాణం’లో అమ్మే ఆ జాంగ్రీలు, జిలేబీలు, బూందీలడ్లు, పంచదార చిలకలు ఇంకెవడిక్కావాలి? పట్టణం నిండా కార్పొరేట్ స్థాయిలో బేకరీలు, స్వీట్ షాపులు గల్లీగల్లీలో వెలసాయి. పిల్లలు, యువకులు కేక్‌లు, పాస్తాలు, ప్యాస్ట్రీలు, షేక్స్ అండ్ స్యాన్‌విచ్ లకు అలవాటు పడ్డారు. కనీసం పాతతరం పెద్దవాళ్ళూ అమృతరావు మిఠాయి దుకాణం వైపు చూడటం లేదు. వాళ్ళల్లో తొంభై శాతం మందికీ వొంటిలో ఆ మొదనష్టపు ‘తీపి జబ్బే’! యింకెందుకు అదనపు మాధుర్యం?

అమృతరావు పాత స్వీటుకొట్టుకి పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి నుండి అతని వద్ద దొరికే బ్రెడ్డు కొనటానికి వచ్చే రోగులే ఆ షాపుకి మిగిలిన కస్టమర్లు. ఇంకా నలుగురైదుగురు ముసలి రిక్షా కార్మికులు. మూడు జిలేబీలు ఇరవై రూపాయిలైతే అతని చేతిలో పది రూపాయిలు ఉంచి జాలి కళ్ళు పెట్టి చప్పరిస్తారు ఆ రిక్షావాలాలు. ఆ చప్పరింపు వాళ్ళకోసం కాదు. తమ ఇళ్ళ దగ్గర తమకోసం ఎదురుచూస్తూ తాతల చేతులు వెతుక్కునే చిట్టి మనవరాళ్ళకోసం. ఇక అమృతరావు దుకాణానికి విశిష్ట సందర్శకులు ఎవరంటే విరిగిన జిలేబీ ముక్కలు, మైసూర్ పాక్ దుల్లు కోసం సాయంకాలానికి దుకాణం ముందు చేతులు చాపే ఓ బిచ్చగత్తె, ఓ పిచ్చివాడు!

‘బురా క్యా హై అగర్.. ఏ దుఃఖ్ ఏ హైరానీ ముఝే దేదో..’ పాట యొక్క తియ్యటి ఊట అమృతరావు నోటిలో మిఠాయి ముక్కను యింకా తీపి చేస్తుంది. ఈ హిందీ క్లాసిక్ పాటల పిచ్చి తనకు తాత దగ్గర్నుండి వచ్చింది. తాత ఏడుకొండలు పెట్టిన మిఠాయి కొట్టది. ఆయన తన పాత జిట్రేగు గల్లాపెట్టె పక్కనే ఖయ్యూం, రఫీ, కిషోర్, మన్నాడే, ఆషాను, లతా మంగేష్కర్ లను ప్రతిష్ఠించుకున్నాడు – కలకత్తా గ్రామ్ ఫోన్ రికార్డింగ్స్‌లో.

‘ఎంత గొప్పగా నడిచేది తమ మిఠాయి దుకాణం..’ అని అనుకుంటూ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు అమృతరావు. ‘తాత స్వీట్స్ తయారు చేస్తుంటే అటుగా వీస్తున్న చిరుగాలి సైతం చుట్టూ గుమ్మెత్తిపోతున్న చక్కెర, నేతిపాకపు గుభాళింపును ఒక్కసారి గుండెలనిండా పీల్చుకోటానికే అక్కడ నిలిచిపోయిందా అన్నట్లు అన్పించేది! తాత దొడ్డమనిషి. ఆయన ‘మనసు రుచి’ ఆయన చేతి మిఠాయిలకు అబ్బేది అని అనుకునేవారు అందరూ. దుకాణం మూసేంత వరకూ కిక్కిరిసి ఉండేది. బడా సేఠ్ లనుండి సామాన్యుల వరకూ ప్రతి పండుగకూ, పేరంటాలకీ పెళ్ళిళ్లకూ తమ షాపులో స్వీట్లే కొనుక్కెళ్లేవారు. విందు భోజనాల విస్తర్లపై తాతగారి నేతి మిఠాయిలు నింగి చుక్కల్లా మిలమిలా మెరుస్తుండేవి. అందరి ఇంటిలో, ఒంటిలో తమ షాపులో తయారైన మిఠాయిల మాధుర్యం చేరి ఉండేది ఆ రోజుల్లో. తాత పోయిన తర్వాత జహంగీరు మొఘలు సామ్రాజ్యపు పతనానికి పునాది వేసినట్టే అమృతరావు తండ్రి నిర్లక్ష్యం, చేతగానితనంతో స్వీట్ షాపును దివాళా తీయించాడు. యిక మనవడి శకం అంటే తన కాలం వచ్చేసరికి గల్లా దగ్గర కూర్చొని ఈగలు తోలుకోవడం ముఖ్య లావాదేవీ అయింది. షాపులో ఈ వారం చేసిపెట్టిన ఐదేఐదు కిలోల మిఠాయిలో ఐతే పావుకిలో కూడా అమ్ముడుపోలేదు. అందుకే కాబోలు తనే బోర్ కొట్టి చేసేదేంలేక అప్పుడో ముక్క అప్పుడో ముక్క నములుతున్నాడు – విషాద గీతాలు వింటూ! ఇట్లా అయితే యిక రాను రాను ఇల్లు గడవటం కూడా కష్టమై, వైభవం గతించిన నలభైయేళ్లనాటి ‘ఏడుకొండలు మిఠాయి దుకాణం’ను బందుపెట్టడమేనా?’ అన్న ఆలోచన ముసురుకొంది అమృతరావుకి. తాత బతికున్నప్పుడే తనను బెదిరించైనా చదివించాడు కాబట్టి డిగ్రీ పట్టా ఒకటి చేతిలో ఉంది. హైదరాబాదు వెళ్ళి ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చూసుకుంటే మంచిదని అనుకుంటున్నాడు. వ్యాకులమైన అతని మదికి నండూరి మాటలు గుర్తుకొచ్చాయి.

‘యెలుతురంతా మేసి
యేరు నెమరేసింది
…….
కలవరపు నా బతుకు
కలత నిదరయ్యింది’

“సార్..” మృదువుగా పిలిచాడు మెట్ల మీద నుంచొని ఉన్న ఒక కొత్త వ్యక్తి. నల్ల లాల్చీ, తెల్ల పైజమాలో ‘కాలా’ సినిమాలో రజనీకాంత్‌లా బక్కగా పొడుగ్గా ఉన్నాడు.

 “ఏం గావాలి బాబూ.. మిఠాయివ్వనా.. తాజాదే!” దొరికాడో కస్టమర్ అనుకుని సంబరపడ్డాడు అమృతరావు.

“పనికావాలి సార్!” అభ్యర్ధనగా అడిగాడు ఆ కొత్త మనిషి.

“ఓనర్‌ని.. నాకే పని లేదు! నీకేం ఇవ్వనయ్యా..?”

“లేటెస్ట్ కేక్‌లు, స్వీట్లు అన్నీ బాగా చేస్తా సార్.. రసగుల్లా యింకా బాగా..”

అతని వాలకం చూస్తుంటే ఎందుకో అతనికి పనివ్వాలని అన్పించింది అమృత రావుకి.

“సరే. రేపటి నుండి రా.. ముందో వారం చూద్దాం.”

“ఐతే ఓ షరతండి!”

“ఆహా! కాబోయే బాస్‌కి కాబోయే ఉద్యోగి షరతు పెట్టడం. చెప్పు మహాశయా!”

“దుకాణాన్ని కొంచెం మార్చాలి.. మోడ్రన్‌గా కన్పించాలి.”

“భలే చెప్పావ్.. డబ్బులెక్కడివి?”

“మీ మెడలో ఆ చైన్ లేదనుకోండి!”

“మా అత్త మొత్తుకుంటదేమో.. సర్లే.. నిన్ను నమ్మి..?”

“నా రసగుల్లాని నమ్మండి!”

“సరే.. నీ పేరు?”

“మకరందు”

***

అనుకున్న మంచి అనుకున్నట్లే అయింది. అమృతరావుగారి ఏడుకొండలు మిఠాయి దుకాణం ఇప్పుడు ‘అమృత్ రసగుల్లా హౌజ్’ గా పేరు మార్చుకోవటమే గాకుండా లాభాల తీరూ మార్చుకుంది. అమృతరావు తన పాత దుకాణానికి నవీన హంగులు దిద్దిన తర్వాత గ్రాండ్ ‘పునః ప్రారంభోత్సవం’ అంటూ ఒకటి జరిపి వచ్చిన వాళ్ళందరికీ రసగుల్లాలు ఉచితంగా పంచాడు. తిన్నవాళ్లు క్షణాల్లోనే వాటి రుచికి ఫిదా అయ్యారు. ‘అమృతరావూ.. అబ్బో ఏం రుచి. అదిరిందయ్యా నీ రసగుల్లా!’ అంటూ ఉత్త పొగడ్తలే కాకుండా తలా ఓ కిలో కొనుక్కెళ్లారు కూడా. అతి స్వల్పవ్యవధిలోనే అతని షాపులో దొరికే రసగుల్లా కీర్తి అమితమైన తీయదనంతో ఊరూవాడల్లో అంతటా వ్యాపించింది. యేడాది తిరిగేలోపే అతడు ఆ రోజు అమ్ముకున్న ఒక్క బంగారు గొలుసుకు బదులుగా రెండుపేటల బారు గొలుసు, ఎనిమిది వేళ్ళకు ఎనిమిది ఉంగరాలు చేయించుకున్నాడు. భార్యాబిడ్డలకూ బోలెడు బంగారం.. యింకా కొత్త ఇంటి సింగారం! ఇటు జోరుగా మిఠాయిల వ్యాపారం – అటు హుషారుగా సంసారం. మొత్తం మీద అనతికాలంలో అతని పని ‘అదిరిందయ్యా చంద్రం’ అన్నట్లే సాగింది.

అమృతరావు అంత ఉన్నతికి కారకుడైన మకరందు మాత్రం పదిహేనువేల జీతం దగ్గరే ఆగిపోయాడు. ఆ జీతం కూడా ఏ ఒక్క నెలలోనూ తను తీసుకోలేదు. అదంతా చాలాకాలం నుండి అమృతరావు దగ్గరే ఒక ‘డిపాజిట్’ లా ఉండిపోయింది. ఎప్పుడన్నా సినిమాకో, సిగరెట్లకో కొంచెం మాత్రమే డబ్బులు తీసుకుంటాడే తప్ప యింకేం ఆశించడు.

ఒకరోజు అసలు మకరందు అంత అమోఘంగా రసగుల్లాని ఎలా తయారుచేస్తున్నాడో ఆ ఫార్ములా ఏంటో పట్టేయాలని ఉత్సాహపడ్డాడు అమృతరావు. లోపల ఇతర స్వీట్లు, కారా చేసే వంట మేస్త్రీలను, వర్కర్లను అజమాయిషీ చేసేవాడిలా నటిస్తూ మకరందు పన్నీరు ఉండల్ని ఎలా చేస్తున్నాడు? పాకం ఎలా పడుతున్నాడు? ..అతని రసగుల్లాలో అంత మాధుర్యాన్ని అంత కమ్మగా నింపడానికి యింకా ఏమైనా సుగంధాల్ని, పొడులను కలుపుతున్నాడా? – అని చాటుగా, నిశితంగా గమనించాడు. అదే పద్ధతిలో ఒక్క రవ్వంతైనా  రెసిపీ తప్పకుండా తమ ఇంటిదగ్గర రసగుల్లాని తయారుచేసి ఇంట్లో వాళ్ళకు ‘శ్యాంపిల్’ గా రుచి చూడమని యిచ్చాడు అమృతరావు.

“అబ్బే లాభం లేదండీ.. మీ రసగుల్లాల కంటే నేను మింగే హోమియోపతి గోలీలే నయం!” తేల్చేసింది భార్య.

“నాన్నా.. మకరందు అంకుల్ చేతి స్వీటు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌లా ఉంటే మీది ఓపెనింగ్స్ కూడా లేని ఫ్లాప్ మూవీలా ఉంది” గాలి తీసేసాడు చిన్నకొడుకు.

అమృతరావు చిన్నబుచ్చుకుని యింకెప్పుడూ తాను ఆ రసగుల్లాని వండటానికి ప్రయత్నం చేయనని చాటుగా వెళ్ళి లెంపలేసుకున్నాడు. ఐతే అంత రుచిగా ఆ రసగుల్లా అతని చేతిలో ఎలా తయారవుతుందో, ఆ మర్మమేమిటో తనకు చెప్పమని ఎన్నోసార్లు మకరందును ప్రాధేయపడినా తన దగ్గర ఏ పాకశాస్త్ర రహస్యం లేదని, మిగతా వంటమేస్త్రుల్లాగానే మామూలు పద్ధతిలోనే వాటిని చేస్తున్నానని చిరునవ్వుతో కొట్టిపడేసేవాడు.

‘అన్ని తోటల్లో నిండుగా విప్పారిన పూల మకరందాలలోని తీపిదనం ఈ ‘మకరందు’ చేతుల్లోకి వచ్చి చేరుకుంద’ని పొయెటిక్‌గా అనుకునేవారు అందరూ! సార్థక నామధేయం!

రోజురోజుకీ అమృతరావు స్వీటుషాపులో బేరం మహా జోరందుకుంది. వాళ్ళ రసగుల్లాకి పెద్ద బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అది జి.ఐ. మార్క్ గుర్తింపుకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నంతగా ప్రాచుర్యం పొందింది. ఆ ప్రాంతంలో ప్రతి శుభాశుభకార్యానికీ జరిగే విందుల్లో ఆ తీపి పదార్థాన్ని వడ్డించడం గొప్ప ‘స్టేటస్ సింబల్’గా మారిపోయింది. దాంతో ఆ పట్టణం, పరిసర ప్రాంతాల్లోని పెద్ద పెద్ద స్వీట్ షాపులు, బేకరీలకు బేరం తగ్గి వాటి యజమానులకు ‘అమృత్ రసగుల్లా హౌజ్’ మీద అసూయ పెరిగింది. వాళ్ళల్లో చాలామంది ఆ రసగుల్లా ఫార్ములా చెప్పమని అమృతరావుతో బేరసారాలు సాగించారు. చాలాసార్లు రహస్యంగా మకరందుని కలిసి ఆ షాపులో మానేసి తమ షాపుల్లో చేరితే నాలుగింతలు జీతం ఎక్కువిస్తామని ఆశ చూపారు. కొందరైతే బెదిరించారు కూడా. కానీ అమృతరావు, మకరందుల మధ్య ఈమధ్య స్నేహం బాగా పెరిగి ఆ ఇద్దరూ ‘షోలే’ లో ‘వీరు, జై’ ల మాదిరిగా జాన్ జిగిరీ దోస్తులయ్యారు. వాళ్ళనెవరూ విడదీయలేరని తెలిసినా పోటీ వ్యాపారస్థులు మాత్రం అమృతరావు మిఠాయిల వ్యాపారానికి గుండెకాయలాంటి మకరందుని తప్పించాలని కుటిల ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు.

ఒకరోజు స్వీట్సు తయారీ అంతా ముగించుకుని వాటిని ట్రేలల్లో సర్దించి ఫస్ట్ షో సినిమాకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన మకరందు ఎంతకూ రాకపోవడంతో అమృతరావు రాత్రి పదకొండు గంటలవరకూ చూసి, షాపు కట్టేసి షాపుకి వెనుక అతను ఉండే గదికి తాళం వేయకుండా తలుపు దగ్గరకేసి ఇంటికెళ్ళిపోయాడు.

మరుసటి రోజు పూర్తిగా తెలవారకుండానే చీకటిపొరలను చీల్చుకుంటూ, మంచు తెరలను చించుకుంటూ ఒక దుర్వార్త. షాపులో పనిచేసే జాన్ అనే అబ్బాయి పెద్దగా అరుస్తూ తమ యజమాని అమృతరావు ఇంటి ముందుకొచ్చి “ఓనర్ గారూ.. ఓనరమ్మగారూ.. లేవండి.. లేవండమ్మా లేవండి ఘోరం.. ఘోరం జరిగిపోయింది. రాత్రిపూట మన మకరందయ్యను ధియేట్రకాడ ఎవరో కత్తుల్తో పొడిసి మురిక్కాలవలో పడేసిపోయారంట.. లేండయ్యా లెగండి..’ అంటూ చెడ్డ కబురు అందించాడు.

చెట్టుకొమ్మపై మాగన్నుగా నిద్రపోతున్న పిట్ట తలకు విసురుగా వచ్చిన ఉండేలురాయి దెబ్బ తగిలితే ఎలా దిమ్మెరపోయి పడిపోతుందో అంతలా నిశ్చేష్టుడయాడు అమృతరావు. సెకన్లలోనే తమాయించుకుని కళ్ళు నలుపుకుంటూ పైకిలేచి లుంగీలోనే ఉన్నఫళంగా బయలుదేరి జాన్‌ని ఎక్కించుకొని తన ఎన్ఫీల్డ్ బండిని ఫార్ములావన్ మోటార్ రేసింగ్ పోటీలో పాల్గొంటున్నవాడిలా తీవ్ర వేగంతో పెరిగెత్తించాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాజువాల్టీ రూంలో కొన ఊపిరితో ఉన్న మకరందుని దగ్గర్లో బాగా పేరున్న ఒక ట్రామాకేర్ క్లినిక్ లోకి తరలించి ప్రత్యేక చికిత్సలు చేయించసాగాడు. రోజుకి పట్టుమని పదికిలోల మిఠాయి కూడా అమ్ముడుపోని తన వ్యాపారాన్ని తన చేతి ‘రసగుల్లా’తో బ్రాండ్ ఇమేజ్‌కు తీసుకెళ్ళిన మకరందును బతికించుకోలేకపోతే తాను మనిషినే కాదనుకున్నాడు అమృతరావు. అందుకే షాపు భార్యకు అప్పజెప్పి నెల రోజుల పాటు హాస్పిటల్ గుమ్మాన్ని వదలకుండా ఎంతయితే అంత వెనకాడకుండా ఖర్చుపెడుతూ తన క్రింది పనివాడైనా అతనిని తన రక్త బంధువులా భావించి సపర్యలు చేసాడు. తన షాపునుండి అతణ్ణి తొలగించడానికే ఎవరో నీచులైన పోటీ వ్యాపారులే అతనిపై దాడిచేయించి ఉంటారని అర్ధమై పోలీస్ కేసు కూడా పెట్టాడు.

ఒకరోజు అర్ధరాత్రి డ్యూటీ నర్స్ వచ్చి వెయిటింగ్ హాల్లో నిద్రజోగుతున్న అమృతరావుని లేపి మకరందు అతడిని అర్జెంటుగా చూడాలనుకుంటున్నాడని అతణ్ణి ఆదుర్దాగా ఐ.సీ.యూ లోకి తీసుకెళ్ళింది.

మూసుకుపోతున్న కళ్ళతో దగ్గరకొచ్చి కూర్చోమని సైగచేస్తున్నాడు మకరందు. అమృతరావు అక్కడే ఉన్న ఒక కుషన్ స్టూలుని అతని బెడ్ కు బాగా దగ్గరగా లాక్కోని కూచున్నాడు.

“అమృతయ్యా..”

“చెప్పు మకరందయ్యా..”

వాళ్ళిద్దరూ చాలా కాలంనుండీ అలా ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉన్నారు.

“నేను బతుకుతానంటావా?”

“తప్పకుండా. నా కోసమైనా..”

“నీకోసం కాకపోతే యింక నాకెవ్వరున్నారు అమృతయ్యా..”

రెండు చిన్న తెల్ల ద్రాక్షపళ్ళంత వున్న కన్నీటి చుక్కలు అతని కణతల మీదుగా తెల్లటి పరుపులోకి జారి యింకిపోయాయి .

“మకరందయ్యా.. ఎన్నిసార్లడిగినా దాటేస్తావు. ఇంతకూ అసలు నువ్వు ఎవరు? ఎక్కడినుండి వచ్చావు? అంత అమోఘమైన రుచి నీ చేతి రసగుల్లాకు ఎలా వస్తుంది? నువ్వు లేనప్పుడు నీ బట్టలు, బ్యాగు చాలాసార్లు వెతికాను! కనీసం నీ ఆధార్ కార్డులాంటివి కూడా దొరకలేదు. ఫోన్ కూడా వాడవు. ప్లీజ్.. ఇప్పుడైనా చెప్పు. అసలెవ్వరు నువ్వు? నాకోసమే నా కష్టాలు తీర్చడానికి వచ్చిన దైవదూతవా ఏంటి? కొన్ని మన చేతుల్లో ఉండవు కదా. నీకు రేపేదన్నా ఇంకోటి జరగరానిది..” ముగించలేకపోయాడు అమృతరావు.

“నాకు ఏది జరిగినా ఎవరూ రారు. రాకుండా నేనే అలా చేసుకున్నానేమో! ఎందుకంటే ఎవ్వరికీ నా వల్ల రవ్వంతైనా బాధ కలగకూడదు. తల్లైనా, బిడ్డైనా ఇప్పుడు ఎవరి జీవితం వారిదే. అమృతయ్యా.. నన్ను నువ్వు నీక్రింద పనివాడిలా కాకుండా నీ అన్నలా చూసుకుంటూ వస్తున్నావు. నా అంతిమ సంస్కారాలు కూడా నువ్వే చూడాలి! నేను పోతే నా తలకొరివి పెట్టే సమయంలోనైనా నా గురించి నీ హృదయంలో ఏ సందేహం ఉండకూడదు. అందుకే నా గురించి ఇప్పుడే మొత్తం చెప్తానయ్యా. నా అసలు పేరు మకరందు కాదు.. కర్ణన్! తెలుగు నేలపై పూర్వమెప్పుడో బతుకుతెరువుకై అడుగుపెట్టిన తమిళవాళ్ళము. ‘మకరందు’- నాకు మిఠాయిలు తయారుచేయడం నేర్పిన గురువుగారు పెట్టిన పేరు. నా అడ్రస్ చెప్పనుగానీ.. చిత్తూరు- రాణీపేట రహదారి పక్కనే ఒక పల్లె దగ్గర్లో నా తల్లి ఒక చిన్న పాకలో కాఫీ హోటల్ నడిపేది. ఐదోయేడు నిండినదాకా నా తల్లి చనుబాలు తాగుతూనే ఉన్నానంట.. మా పాక హోటలు ముందు ఏ అర్ధరాత్రో, తెల్లవారు ఝామునో ఏదైనా లారీనో, జీపునో ఆగితే నా నోటితో బలంగా కరిచిపట్టుకున్న తన స్తన్యాన్ని నా నుండి విదిలించుకుని పక్కనే వున్న తడికల గదిలోకి వెళ్ళిపోయేది అమ్మ. ఓ గంట తర్వాత వచ్చి నన్ను దగ్గరకు తీసుకునేది. ఇలా ప్రతిరాత్రీ రెండు మూడు సార్లన్నా జరుగుతున్నట్లు నాకు లీలామాత్రంగా గుర్తు. పగలు మాత్రం ఒక పూటంతా నన్ను పక్కనేసుకుని మొద్దునిద్ర పోయేది. ఆ పసిప్రాయంలోనే నాకు ఆ చేదు మింగటం అలవాటైనట్లుంది! చేదు.. కటిక చేదు.. నల్లటి చేదు.. హాలాహలపు చేదది. జీవితపు పాలకడలిని మథించినపుడు కొందరికి అమృతం, కొందరికి కామధేనువు, మరికొందరికి కల్పవృక్షమో, లక్ష్మీ దేవినో దొరకుతుంది.. నాకు మాత్రం ‘గరళం’ ప్రసాదమైంది.

యిక నా తండ్రి ఏమీ చేసేవాడు కాదు. క్షయవ్యాధి పీడితుడు. మా పాక హోటల్ వెనుక జామచెట్టుకింద నులకమంచంపై పడుకొని నిత్యం దగ్గుతూ పచ్చటి తెమడ ఊస్తూ ఉండేవాడు. ‘పీనుగుకి తక్కువ.. జీవుడికి ఎక్కువ’ అన్నట్లుండేది అతడి స్థితి.

నేను కొంచెం పెరిగాక నా తల్లి దగ్గర్లో ఉన్న బడిలో చేర్చించింది. నన్ను చూసి పెద్ద క్లాసుల్లో ఉన్న పోకిరి పిల్లవాళ్ళు  కొంతమంది ‘అరేయ్.. వీడి అమ్మేగదరా ఆమె.. లారీవోళ్ల దగ్గర పండిద్ది!’ అని నా ముందే నాకు వినపడేటట్లే మాట్లాడుకునేవారు.. అమృతయ్యా.. ఎంత చేదుని మింగానో కదా ఆ క్షణాల్లో నేను.. ఎంతెంతో చేదు అది. ఆ చేదు నా రక్తం నిండా.. గుండెనిండా.. ప్రతి అవయవంలోని ప్రతి అణువులో నిండిపోయి నిలిచిపోయి ఉంటుంది!”

“అయ్యో.. ఇంత శోకాన్ని ఎలా దాచుకోగలిగావు మకరందూ?” అంటూ ప్రేమగా అతని చేతుల్ని ఓదార్పుగా తాకాడు అమృతరావు.

“అమృతయ్యా.. నా తల్లి వయసు క్షయమవుతున్న కొద్దీ నా తండ్రి ‘క్షయ’ నయమవ్వసాగింది.. తన ‘నిశాచర ఆర్జన’తో నా తల్లి అతడిని తరచూ మద్రాసు తీసుకెళ్లి మల్టీ డ్రగ్ థెరపీ యిప్పించింది. పుష్టిగా మేపింది. త్వరగానే తిప్పుకున్నాడు. ఈకలు పీకేసిన కాకి పిల్లలా ఉన్నవాడల్లా బొత్త బలిసిన గిన్నెకోడిలా బలిసాడు. అలా కుదుటపడగానే నా తండ్రి మహాశయుడేం చేసాడో తెలుసా? అప్పటి వరకూ పనికిమాలిన మొగుడిగా చెలామణి అయిన అతడు తనలో మరో కొత్త ‘మొగాడి’ని నిద్రలేపాడు! ఆ మగాడు ఓ వసంతోత్సవ వేళ పూర్ణకాముడై ఇంకొకామెను తెచ్చుకున్నాడు. మెళ్లో దండలతో ఇంటిముందు ప్రత్యక్షమైన తన పతిని, సవతిని చూసిన నాతల్లి ఒంటిపై గ్రామదేవతలందరూ పూనకాలు ఆడారు. చీపురుకట్టనే శూలంగా తిప్పుతూ వాళ్ళిద్దర్ని పొలిమేరల వరకూ తరిమింది. ‘వొళ్లమ్ముకున్న సొమ్ముతో నిన్ను బతికించాను.. యిదరా నా బట్టా నువ్వు చేసేది’ అంటూ తెల్లవార్లూ శోకాలు పెట్టింది. అప్పుడెంత చేదు మింగానో నాకే తెలుసు అమృతయ్యా..” అని చెప్పుకుపోతున్న మకరందు పెదవులమీదుగా ఎన్ని మాటలు బయటకు వస్తున్నాయో అంతకు సమానమైన కన్నీటిధారలు అతని రెండు కణతల మీదుగా జాలువారుతున్నాయి.

“ఐతే నా తల్లేమీ తక్కువ తినలేదు. తన మొగుడు ఒక కుక్క అన్నది. మరి ఆ కుక్క కాటుకి చెప్పుదెబ్బ కొట్టాలి కాబట్టి తనూ అదే దారిలో నడిచింది. నెల తిరక్కుండానే, నెలక్రితమే భార్యపోయిన లారీ డ్రైవర్ వెంకటేశంను యింట్లోకి తెచ్చుకుంది. తన పాక హోటల్‌కు యజమానిని కూడా చేసింది. మళ్ళీ అప్పుడు పుట్టెడు చేదు మింగాను. ఆ చేదు మామూలు చేదు గాదు. మనుషుల మస్తిష్కాలకు కాసిన ముష్టికాయల చేదు. హృదయాల జిల్లేడుచెట్లకు పూసిన విషపుష్పాల చేదు.. నాగలోకంలో లక్షల కోట్ల భుజంగాల కోరలకు అంటివున్న విషపు చేదు.. శివయ్య కంఠంలో కాలకూటపు కేంద్రబిందువై భయపెట్టే చేదుకన్నా ఇంకెంతో చేదైన చేదు.. ప్రేమ రాహిత్యపు చేదు! అంతటి చేదు మింగుతూ కూడా నేను దేనిపట్ల, ఎవరి పట్ల ద్వేషాన్ని, కక్షను పెంచుకోలేదు అమృతయ్యా! నాకు వయసు పెరిగి ఎదిగిన కొద్దీ నా తల్లికి, ఆమె ప్రియుడు వెంకటేశంకు నేను ‘అడ్డుగా’ ఉన్నానని అనిపించి వాళ్ళనుంచి దూరంగా జరిగాను. ఒక అర్ధరాత్రి వేళ ఒక లోడ్ లారీ పైకెక్కి పడుకున్నాను. మూడు రోజుల ప్రయాణం తర్వాత నేను దిగిన చోటు బెంగాల్‌లో దక్షిణేశ్వర్ అని తెలిసింది. అక్కడ ఒక స్వీట్ షాపులో పనికి కుదిరాను. అక్కడ కూడా ఎన్నెన్నో కష్టాలు, కఠిన పరీక్షలు ఎదుర్కొన్నాను. ఎన్నో క్లిష్ట ఘడియల్లో ఎంతెంతో చేదుని మింగాను. అక్కడ ఒక మంచి వంటమేస్త్రి నాకు గురువుగా లభించాడు. అతని దీవెనలతో రకరకాల మిఠాయిలు రుచిగా శుచిగా చేయడం నేర్చుకున్నాను. అదే సమయంలో ప్రైవేటుగా చదివి డిగ్రీ కూడా పూర్తి చేసాను. వచ్చిన జీతాన్ని కొంత దాచుకొని ఓ పుష్కర కాలానికి నా ‘తల్లి తండ్రి’ అని కేవలం పేరుకు మాత్రమే చెప్పుకోటానికి మిగిలివున్న ఆ యిద్దరూ ఎలా ఉన్నారో చూద్దామని ఎంతో ఆశగా వెళ్ళాను. నా బాల్యంలో ఉన్న గతుకుల సింగిల్ రోడ్ ఫోర్ లైన్ హైవేగా బారుగా, సింగారంగా పెరిగిపోయింది – నా నిండు యవ్వనపు దేహంలా! రోడ్డు పక్కన మా పాకహోటల్ అదృశ్యమైంది. చుట్టు పక్కల వాకబు చేస్తే తెలిసింది. నా తండ్రి క్షయవ్యాధి మళ్లీ తిరగబెట్టిందని, ఆ ఉంచుకున్నామె అతడిని వదిలేసిపోయిందని, తల్లి దగ్గరుండాల్సిన వెంకటేశం పైలోకాలకు పోయాడని. అంతేగాక తన తల్లి ఘోరమైన సుఖవ్యాధులకు గురై దిక్కులేక విలపిస్తుందని, తల్లీ, తండ్రీ యిద్దరూ మిషనరీవాళ్ల వృద్ధాశ్రమంలో ఉన్నారని తెలిసింది. ఇదంతా వింటూ తల నేలకు వాల్చేసి ఎంతో చేదుని లక్షల గుటకలుగా మింగాను అమృతయ్యా. వెంటనే వెళ్లి ఆ యిద్దర్నీ విజయవాడ తీసుకెళ్ళి మెరుగైన వైద్యం చేయిస్తూ వాళ్ళ ఆలనాపాలనా చూసుకున్నాను. అమ్మానాన్నలు బతికుండీ వాళ్ళ స్వేచ్చా సుఖాల కోసం నన్ను అనాథలా చేసినా, వాళ్ళను ఏనాడూ ఒక్కమాట కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళు నాకేమివ్వకున్నా ఈ ప్రాణం యిచ్చారుగా! అది చాలు. కానీ వాళ్లిద్దరు మాత్రం అంత అనారోగ్యంలోనూ చీటికి మాటికీ కొట్లాడుకునేవారు.”

“శ్రవణ కుమారుడనే పేరును పురాణాల్లో విన్నాగానీ.. ఇప్పుడు నా ఎదురుగా ప్రత్యక్షంగా నీలో చూస్తున్నా మకరందు! పుణ్యం కోసం తల్లిదండ్రులను కావిడిలో మోసిన శ్రవణుడికంటే తల్లిదండ్రుల పాపాలను గుండెలపై మోసిన నువ్వే నా దృష్టిలో గొప్ప! అది సరే మకరందయ్యా .. తల్లిదండ్రుల గురించే చెప్తూ ఉన్నావు. నీకు పెళ్ళి కాలేదా? భార్యా బిడ్డలు లేరా?”

“అదే చెప్పబోతున్నా అమృతయ్యా.. నువ్వన్నట్లే మా కథ తెలిసిన వాళ్ళంతా నన్ను శ్రవణ కుమారుడి కంటే ఉన్నతుడిని అని పొగుడుతూ ఉండే వాళ్ళు.. అది నాకస్సలు యిష్టం ఉండేది కాదు. నన్ను అలా బాగా మెచ్చుకునే వాళ్ళలో వీరమల్లు ఒకడు. అతను పల్లెనుండి పట్టణంగా అప్పుడే ఎదుగుతున్నమా ఊళ్లో ఒక స్వీటు దుకాణం నడిపేవాడు. మిఠాయిలు తయారు చేయటంలో ఉన్న నా నైపుణ్యం, నా మంచితనం గురించి విన్న అతను నన్ను పనిలో పెట్టుకున్నాడు. ఆయన షాపులో ఒకరోజు నేను తయారు చేసే స్వీట్సు రుచి చూసి అవి అమృతగుళికల్లా ఉన్నాయని తెగ మెచ్చుకుంది వీరమల్లు గారాల కూతురు సుచరిత. ఇక రసగుల్లా ఐతే కిలోకి తక్కువ కాకుండా లొట్టలేసుకుంటూ లాగించేసింది. అప్పటినుండీ రోజూ షాపుకొచ్చేది. ముందు తన తియ్యటి మాటలు.. మెల్లగా తన మెత్తటి చేతులు కలిపింది. క్రమంగా పొగడ్తల పొగడపూలనే కాకుండా ప్రేమపన్నీరులు కూడా నాపై చిలకరించింది. తన గారాలపట్టిఐన బిడ్డ మాటను కాదనలేని వీరమల్లు ఏకైక కూతురుని నాకిచ్చి పెళ్ళి చేసి పక్కటౌన్ లోనే నాచేత మరో కొత్త స్వీట్ షాపు పెట్టించాడు. మాకు ఒక బాబు, పాప పుట్టారు. ఈ ఇద్దరు బిడ్డలు నా కుటుంబంలో చేరుతుండగానే నేను ఇద్దరు చంటిబిడ్డల్లా కాపాడుకుంటూ వస్తున్న నా తల్లీ, తండ్రీ మానుండి శాశ్వతంగా నిష్క్రమించారు. యిక నా శ్రీమతి అన్ని విషయాలలో నాకు బాసటగా నిలిచింది. తన చురుకుదనం వల్లనే మా స్వీట్స్ దుకాణం బాగా నడిచింది. మా వ్యాపారం, సంసారం రెంటినీ చక్కగా నడపటానికి ఆమె నాతో సమానంగా శ్రమించేది. తను ఎప్పుడన్నా కౌంటర్ దగ్గర కూర్చుంటే తనే లక్ష్మీదేవియై కాసులరాశులుగా మా గల్లాపెట్టెలో కురిసేదని అన్పించేది నాకు. కానీ తనకూ డబ్బు తీసుకొచ్చే జబ్బుల్లో ఒకటి పట్టుకుంది!”

“ఏమైంది? గర్వం పట్టుకుందా తనకు ? అహం ప్రవేశిస్తే యిక అంతేగా..”

“అహం అనే జబ్బయితే భరించగలం అమృతయ్యా.. కానీ అంతకంటే దారుణమైంది! ఒక రోజు మధ్యాన్నం వొంట్లో బాగోలేక షాపు వంటమేస్త్రికి అప్పజెప్పి ఇంటికొచ్చాను. పిల్లలు స్కూలుకెళ్ళారు. సుచరిత ఇంటి దగ్గరే ఉంది. ఓరగా వేసివున్న తలుపు తీసుకుని లోపలికి పోయా. లోపల బెడ్ రూమ్‌లో నుండి పెద్దగా నవ్వులు వినిపిస్తే డోర్‌ని చిన్నగా లాగి చూసా.. నగ్నంగా వున్న సుచరిత ఒడిలో ఆమె మేనబావ కూడా నగ్నంగా.. అతడలాగే ఆమె ఒడిలో పడుకుని ఆమె ముఖాన్ని దగ్గరగా లాక్కోని ముద్దాడుతుంటే సుచరిత పులకరింతలు పోతుంది! ఎన్నిటన్నుల చేదుమింగి ఉంటుంది నా ఈ చిన్ని గుండెకాయ ఆ ఘడియలో.. ఐనా నాకు తెలుసు. శపించటానికి నేను గౌతముణ్ణి కాదు. ఆమె అహల్య అసలేకాదు.. ఒక రోజు తన భార్య రేణుక మనసులో ఏదో చిన్న ప్రకోపం కలిగినందుకే ఆమెను కొడుకుచే గొడ్డలితో నరికించగల జమదగ్నినీ కాదు. పురాణం కల్పన – జీవితం సత్యం! అందునా మనం మనుషులం కదా అమృతయ్యా! అనంత ఖగోళంలో ఈ ఒక్క భూగోళం మీద వివేచన చేయగల ఏకైక జీవి మనమే కదయ్యా! నా భార్య మీద ద్వేషం, జుగుప్సవంటివేమీ కలగలేదు నాకు. నిశ్శబ్ధంగా బయటకు అడుగులేసి సంజెవేళ వరకూ పార్కులో ఒక్కడినే కూర్చొని నాలోకి నేను తొంగిచూసుకున్నాను. తల్లిని పలువురితో ‘చూసిన’ నాకు నా భార్యను మరొక్కరితో చూడటం ‘నార్మల్’గా అనిపించిందో ఏమో? లేక.. వ్యాపారంలో పడి ఆమెకు నేను కావలసినంత ప్రేమను, సుఖాన్ని అందించలేకపోయానేమో? లేదంటే మా ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసమేమో? ఎందుకో మరి? మొత్తం మీద సుచరితను తప్పు పట్టకుండా నన్ను నేనే సమాధానపరుచుకుని గమ్మున ఊరుకుండిపోయాను.. ఆ రోజు రాత్రి అన్నం తినకుండా నేను ముద్దలకొద్దీ ‘చేదు’ని మాత్రం మింగుతూనే ఉన్నాను.”

“మరి మీ పిల్లల సంగతి?” అప్పటికే దుఃఖం అలుగులు పారుతుంది అమృతరావు గుండెల్లో కూడా.

“నా పిల్లలు బాగా చదువుకున్నారు. బాబు గొప్ప డాక్టరయ్యి కెనడా వెళ్ళిపోయాడు. అక్కడే ఒక తెల్లమ్మాయిని పెళ్ళి చేసుకుని స్థిరపడిపోయాడు. నన్నూ, సుచరితాను ఆ దేశానికి రమ్మన్నాడు. కానీ నాకు నా పుట్టిన నేలంటే పంచప్రాణాలు. రానంటే రానన్నాను. ఈ నేలపైనే గడ్డిపూవు లాగైనా బతుకుతానుగానీ విదేశంలో ఉండలేనని చెప్పాను. కొడుక్కి కోపమొచ్చింది. తల్లిని తీసుకెళ్ళాడు. వాడిక నా ముఖం చూడనన్నాడు. సుచరిత ఆ మంచుగడ్డల దేశంలో నిమోనియా వచ్చి అక్కడే ఊపిరొదిలింది. ఆఖరి సంస్కారాలన్నీ కొడుకు అక్కడే చేసాడు. నాకు ఒక మెసేజ్ పెట్టారంతే! అటువంటి ఘట్టాల్లో నేను నాలోకి మింగుకున్న చేదంతా నా ప్రతి జీవాణువులో మేటవేసింది. యిక నా కూతురుకి అల్లుడికి మహా డబ్బు జబ్బు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేసి బెంగుళూరులో అడ్డగోలుగా రియల్ వ్యాపారంలో, షేర్లలో పెట్టుబడులు పెట్టారు. కరోనా సంక్షోభంలో మొత్తం పోయింది. అల్లుడుగారు వేధిస్తున్నాడని నా దగ్గరకొచ్చి రోదిస్తుంటే స్వీటుషాపుతో సహా నాకున్నదంతా తెగనమ్మి వాళ్ళకు సహాయం చేసాను. దాంతో చాలాకాలం పనిలేకుండా ఉండిపోయాను. లేతప్రాయంలోనే ఇల్లొదిలి మిఠాయిలు తయారుచేస్తూ ఉండటం, వాటిని యిష్టంగా తినేవారి కళ్ళల్లో సంతుష్టిని, వాళ్ళ ముఖాల్లో సంతోషాన్ని చూడటమే పరమావధిగా బతుకుతూ వస్తున్న నేను ఆ రకరకాల మిఠాయిలను నా చేతులతో తయారు చేయకుండా, పదిమందికీ వాటి రుచిని చూపించకుండా ఒక్కనాడు కూడా ఉండలేనని నాకర్థమయింది. అది నాకు వ్యసనం.. ఒక వరం కూడా! మళ్ళీ స్వీట్లు తయారుచేసి చిన్నచిన్న డబ్బాల్లో, తాటిబుట్టల్లో పెట్టి తిరునాళ్ళల్లో, ఉత్సవ జాతర్లల్లో పెట్టి అమ్మటం మొదలుపెట్టాను అమృతయ్యా.. జనాల జాలి చూపులు ఇబ్బడిముబ్బడిగా నాపై కురిసేవి. ఐనా నాకు నేను తక్కువని ఏనాడూ అనుకోలేదు.”

“మరి నీ కూతురైనా నిన్ను ఆదరించ లేదా?”

“ఒకసారి తన స్నేహితురాలింట్లో వేడుకకు బెంగుళూరు నుండి వచ్చింది నా బిడ్డ. నాకు ముందుగా తెలియదు. అదే రోజు ఊళ్లో తీర్థం నడుస్తుంది. గుడిముందు నేను నేలపై కూర్చుని మిఠాయిలమ్మడం నా కూతురు చూసింది. అది తనకెంతో నామోషీగా ఉందని, తనకు స్నేహితులముందు తల కొట్టేసినట్లయిందని నాతో బాగా తగువులాడింది. నేను మాత్రం మిఠాయిలు చేయడం, అమ్మడం మానలేనని కరాఖండిగా చెప్పేసాను. ఊపిరాగేంత వరకూ లోకపు నోటిని నే తీపిచేస్తూనే ఉండాలని అన్నాను. నవ్వింది. ఎగతాళి చేసింది. వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. నేను ‘కన్నబిడ్డేగా.. తనముందు తగ్గితే యేం?’ అని అనుకుని ఒకరోజు ఫోన్ చేసా.. అల్లుడు గారు ఫోనెత్తారు. “మీ అమ్మాయి ఇంకెప్పుడూ తనకి ఫోన్ చేయొద్దని చెప్పమని చెప్పిందండి!” అని చల్లగా ఆమె మాటగా చెప్పాడు!

“అయ్యో.. అయ్యో.. అందరుండీ అనాథ అయ్యావా మిత్రమా?”

“అనాధ – ఆ మాటకు నేనో సరికొత్త నిర్వచనం అల్లుకున్నాలే అమృతయ్యా.. ‘అనాధ.. అయినవాళ్ళు, నా అన్నవాళ్ళూ లేకున్నా ధరణిపై నిలవగలగటం’ అని! ఎప్పుడో బెంగాల్లో ఉన్నప్పుడు చిన్ననాడు విన్నాను.. కబీరుగారి భజన కీర్తనలో ‘హంస ఒంటరిగానే ఎగిరిపోతుంది – ఈ జగమంతా ఉత్త భ్రాంతి చిత్రమే కదా..’ అని. నేనూ అదే అనుకుంటూ ఇంకో ఘడియలోనో, గంటలోనో ఎగిరిపోతాను. ఐనా ఎవరు లేకున్నా నీ స్నేహం, ఆదరణ నాకు దొరికింది అమృతయ్యా. ఇది చాలు ఇక నాకు.” అంటూ తనను తన రక్త బంధువులా చూసుకుంటూ తన ప్రాణాలు కాపాడటానికి భగీరథ ప్రయత్నం చేస్తున్న తన యజమాని అమృత రావుకి చేతులెత్తి నమస్కరించాడు మకరందు.

తనకు నమస్కరిస్తున్న మకరందు రెండు చల్లటి చేతుల్నీ గట్టిగా పట్టుకుని, గుక్కపట్టి ఏడ్చే చంటిపిల్లాడిలా రోదించాడు అమృతరావు.

“నా ఆస్తి మొత్తం పణంగా పెట్టయినా నిన్ను బతికించుకుంటాను మకరందూ.. మనిషితనం అనే చెట్టుకి ఎప్పుడో ఎక్కడో ఓ చోట అరుదుగా పూసే పువ్వులు నీవంటి వాళ్ళు. నీవంటి మనిషిని కాపాడుకోలేకపోతే సీతమ్మతల్లి అగ్నిప్రవేశమప్పుడు భూమి బద్దలయిందని చెప్పినట్లు భూమాత నిజంగానే మాపై కన్నెర్ర జేస్తుంది” అంటూ అతడిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి ఐసీయూ బయటకి నడిచాడు అమృతరావు.

***

అందరూ కోరుకున్నట్లే, అమృతరావు మొర అన్నిగుళ్ళల్లో రాతిదేవుళ్ళు ఆలకించి కరిగి కటాక్షించినట్లుగా మకరందు కోలుకున్నాడు. కొన్ని నెలల తర్వాత మునుపటిలానే ఉత్సాహంగా అమృతరావు షాపులో మిఠాయిల తయారీ మళ్ళీ మొదలుపెట్టాడు. అతని చేతి రసగుల్లాలు పంచామృతాల రుచిని నింపుకుని, మళ్ళీ విజృంభించిన విపరీత గిరాకీతో దేశం అన్ని మూలలా విస్తరించాయి – జవచచ్చిన నోళ్లకు తీపి పునరుత్థానాలు ప్రసాదిస్తూ.

ఒక రోజు ఉదయం తమ దుకాణం కౌంటర్‌లో విలాసంగా కూర్చొని తనకు ప్రాణప్రదమైన హిందీ సినిమా పాటలు వింటూనే కస్టమర్లకు స్వీట్ బాక్సులు డెలివరీ చేయిస్తున్నాడు అమృతరావు.

ఇంతలో లోపల స్వీట్లు తయారుచేసే పెద్ద గదిలో ఫ్లోర్ శుభ్రంచేస్తున్న రుక్కమ్మ పెద్దపెద్ద అంగలతో గబగబా క్యాష్ కౌంటర్‌లో కొచ్చి దేవరహస్యం చెపుతున్నదానిలా అమృతరావు చెవిదగ్గర నోరు పెట్టి ఏదో చెప్పసాగింది.

“అయ్యా..”

“చెప్పు రుక్కమ్మక్కా..”

“మన మకరందయ్య చేతిలో తయారయ్యే రసగుల్లా అంత మా రుసిగా ఎందుకుంటదో నాకు తెలిసింది బాబూ..”

“ఔనా! నాన్చకుండా అదేంటో తొందరగా చెప్పెయ్..” తెలుసుకోవాలని ఉడికి పోయాడు అమృతరావు.

“అదీ.. అదీ..”

“అబ్బా చెప్పు తల్లీ!”

“మకరందయ్య రసగుల్లా చేసేటప్పుడూ..”

“ఆ.. ఆ.. చేసేటప్పుడు..?”

“అతగాడు.. ఆ విరిగిన పాల ఉండల్ని చక్కగా వొత్తి పాకంలో యేస్తాడు గదా..”

“ఔనౌను.. పాకంలో వేసేటప్పుడు?”

“అతని కళ్ళనుండి ప్రతిసారీ..”

“ఆఁ.. ఆఁ.. ఏ జరుగుతుంది ప్రతిసారీ?”

“రెండు కన్నీటి బొట్లు జారి ఆ పాకంలో పడుతుంటాయి అయ్యా!”

“__________!”

ఒక మహా నది నుండి సన్నటిపాయ ఒకటి విడివడిపోయి ఎన్నెన్నో మైదానాలు, వనదారులు దాటి ఒకచోట పచ్చని గుట్టలపై నుండి సన్నటి పాలజలపాతంలాగా చల్లగా జాలువారుతూ.. ఆ మిఠాయి దుకాణంలో కమ్మటి తియ్యటి సువాసనలు నిండిన గాలితో మధురాతి మధురంగా జతకడుతుంది జగ్‌జీత్ కౌర్ స్వరం –

“తుమ్ అప్‌నా రంజో ఘం
అప్ నీ పరేషానీ ముఝే దేదో..

తుమ్హే ఘమ్ కీ కసమ్
యిస్ దిల్ కీ వీరానీ ముఝే దేదో..”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here