తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-4

0
4

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
31.
దాగియున్నదా సత్యము మిథ్య వెన్క; యటుల
దాగిన దానినే సత్యమని నమ్మవలెనా?
దాగిన ఆ రహస్య మదేదో, బ్రహ్మసృష్టి యదెందుకో
దాగియుంచినది సహజత్వమును – మంకుతిమ్మ!

32.
పరబ్రహ్మమే ఈ జగమును రచించెనని యనగ
మరది ఆటయో? కలయో? కలవరింతయో?
వెర్రివాడతడు కాదనియన్న; మరి యా నియమము లేవి
గురి యది ఏదో తెలియరాదు – మంకుతిమ్మ!

33.
నరుల పరీక్షించుటే యాతని యాశయమా?
మరి యట్లయిన నరుని బ్రతుకంతయు సుడిగుండమే యగు
పూరణ మెప్పుడో? ఈ ప్రశ్నల కుత్తర మీయని యాతని
గురువని పిలుచున దెటులనో- మంకుతిమ్మ!

34.
ఆలోచించిన కొలది అనుమానాలనే సృష్టించు నీ సృష్టి
తెలియకున్నది దీని తత్త్వ మదేదో నెంత వెదకినను,
అలమటించుట మేనా! ఇది మన విధి వ్రాత యౌనా!
ఈలాగున అలమటించుటే మన రాత యేమో – మంకుతిమ్మ!

35.
చిరకాలము చింతించి, శ్రమించి
విరించి నిర్మించిన ఈ అద్భుత విశ్వమును
మర్త్యుడొకడు యర్థము చేసికొన్న, ఆ కర్త
ఘనత కది, కుందుగాదె – మంకుతిమ్మ

36.
ఎల్లెడలన్ మోహాడంబరములనే కాన్పింపజేసి
చెల్లని కుమార్గముల నిన్ను తా నడిపింప జేసి
గెలువ లేదు నీవు నే పెట్టిన పరీక్షలోనని, విధి
గేలి చేయ నది సరియే – మంకుతిమ్మ!

37.
తా నెలసి యున్నాడు బ్రహ్మ సృష్టి యంతట, యని యన్న
తన వేషముల మార్చుకొన నేలనో!
తన గురుతు మనకు చూప త్వరపడ డెందుకో!
కనుపింపక దాగియుండుట ఎందుకో – మంకుతిమ్మ!

38.
రంగులు మార్చెడి ఊసరవిల్లియా ఈ బ్రహ్మ!
రంగైన తన పూర్ణ రూపమును చూపడదేలనో
దొంగతన మదేల రంగుల మార్చనేల? కపట
భంగిమ తోడి పని యదేమో – మంకుతిమ్మ!

39.
కల్లను, కల్లయని నీవరసి, నిజంబును అరయునెడ
ఏల ముసుగు కప్పుకొనగ యా పరబ్రహ్మ? తా
నేల తన యునికిని తెలియజేయ గురుతుల నీయడో! నిశి
వేళ రిక్కలు త్రోవ జూపించుపగిది – మంకుతిమ్మ!

40.
పగటి వేళల తానగుపించరాదని తన నియమమైన,
అగుపించనగు గదా రాత్రులందు సూర్యచంద్రలవోలె;
అగుపించునేమో సంజె చీకట్లలో
తగురీతి తటిల్లత వోలె – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here