సంచికలో సప్తపదులు 25 – ప్రకటన

0
2

[సంచికలో వచ్చే ఆదివారం నుంచి ఎంపిక చేసిన 25 సప్తపదులు ప్రచురితమవుతాయనే ప్రకటనని అందిస్తున్నారు శ్రీ సుధామ.]

జీవిత సత్యాల ఆవిష్కరణం – సామాజిక బ్రతుకు ఘటనల వ్యాఖ్యానం

[dropcap]స[/dropcap]ప్తపది అంటే మొత్తం ఏడు పదాలతో రూపొందే లఘు కవిత.

వస్తువు ఏదయినా కావచ్చు. అనుభూతీ, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, తాత్విక  అంశం ఏదయినా సప్తపదిగా సంతరించవచ్చు.

కవిత మొత్తం మూడు లైన్లు. మొదటి రెండు లైన్లలో ఒక్కొక్క పదమే వుంటుంది. ఆ రెండు పదాలు కూడా అంత్య ప్రాసతో ఉండాలి.

మూడవ లైన్‌లో ఆ రెండు పదాలను సమన్వయ పరిచే అనుభూతియో, సామాజిక వ్యాఖ్యయో కవితాత్మకంగా అయిదు పదాలలో వుంటూ లఘుకవిత రూపొందాలి.

అంతేకాదు! మూడవ లైన్‌లో అయిదవదైన చివరి పదం మొదటి రెండవ లైన్లలోని పదాల అంత్యప్రాస తోనే తప్పనిసరిగా ముగియాలి.

మొదటి పదంలో ఎన్ని అక్షరాల్ని మనం అంత్యప్రాసకు నిర్ణయించుకుంటామో, దాన్ని బట్టి  సప్తపది లోని తర్వాతి 2 , 7  ప్రాసపదాల అక్షరాలూ అదే గురు లఘువుల క్రమంలో ఉండేలా రాయాలి.

అంత్యప్రాస అంటే కేవలం చివరి అక్షరం ఒక్కటీ సరిపోతే చాలు అనుకోకండి, ఒకపదంలో చివరి రెండు అక్షరాలు, లేక మూడు అక్షరాలు-ప్రాసాక్షరాలు.

సప్తపది లో ఒకసారి వచ్చిన పదం మళ్ళీ రాకూడదు.

ఏదయినా పదం సమాసపదం అయినప్పుడు దానిని రెండుగా విడగొట్టి పదాల సంఖ్యను ఏడుగా సప్తపది లఘు కవితలో సరిపెట్టకూడదు.

అలాగే పొసగని రెండు పదాలను కలిపేసి ఒకే సమాసపదంగా చూపకూడదు.

ఆంగ్లపదాలు పరిహరించడం సబబు.

ప్రాసపదాలు వాడటమే కాదు మొత్తం సప్తపదికి భావసమన్వయం, కవితాత్మకత ప్రధానం. ఇలా కేవలం ఏడు పదాల నిబంధనలను పాటిస్తూ సప్తపదులు రూపొందుతాయి.

సృజింపబడిన స్వల్ప కాలంలోనే మొట్టమొదటగా ప్రముఖ కవి కథకులు శ్రీ విహారి గారు 116 సప్తపదులతో కవితా సంపుటి ప్రచురించారు.

రెండవ గ్రంథంగా డా.రమణ యశస్వి (గుంటూరు) 200 సప్తపదులతో తమ సంపుటి ప్రచురించారు.

శ్రీ విహారిగారి సంపాదకత్వంలో వివిధ కవుల 700 సప్తపదులతో నవీన పేరిట సప్తపదుల సప్తశతి కవితాసంకలనం వెలువడింది.

ప్రస్తుతం సప్తపదులు వాట్సాప్ గ్రూప్‌లో రోజూ వందలాదిమంది రోజుకు రెండు చొప్పున (గురువారం సెలవు రోజు మినహా) సప్తపదులు పోస్ట్ చేస్తున్నారు. వాటిలోనుండి ఎంపికయిన 25 సప్తపదులు ఇకపై సంచిక వెబ్ పత్రిక ప్రతి వారం ప్రచురించగలదని తెలపడానికి సంతోషిస్తున్నాము.

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here