ఇదిగో నవలోకం..

0
11

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘ఇదిగో నవలోకం..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మం[/dropcap]డుటెండలు కాసిన వేసవిలో
హఠాత్తుగా మేఘాలు కమ్మింది ఆకాశం
పచ్చని పచ్చికపై టప టపా రాలాయి
తెల్లని మంచు వడగళ్ళు
చిన్నారి పొన్నారి పిల్లలు
ఏరుకుని తింటూ ఒకరిమీద ఒకరు
విసురుకుంటూ ఆడుకున్నారు
పట్టలేని ఆనందంతో

వీరు ఎదిగే రేపటి తరం
నాకు కొంత ఆనందం
మరోవైపు బాధ
రేపు వీరి భవిత ఏమిటి?

పెద్దవాళ్ళు బోధించని పాఠాలు
ప్రకృతి ఐనా నేర్పుతోంది ఈ రకంగా
గ్రామాల్లోనే కనిపించే దృశ్యాలు
నగరంలో కనబడవు ఇప్పటి రోజుల్లో
నాగరికత సుఖాలు సదుపాయాలూ
అందిస్తోంది డబ్బు సంపాదన

అవును అన్నీకొనుక్కుంటున్నాం డబ్బుతో
అన్ని అందుబాటులోకి వచ్చాయి
అవి ఎలా వేటినుంచి తయారు అవుతాయో తెలియదు
మొక్క నుంచా ప్రయోగశాలలోని గాజు బీకర్లో నుంచా?

అన్ని కళ్ళ ముందే వున్నాయి
కానీ ఏమి చేస్తారో తెలియదు వాటితో ఇప్పటి తరానికి
ఆకలేస్తే పొయ్యి వెలిగించక్కరలేదు
అమ్మ ప్రేమతో గోరుముద్దలు తినిపించే రోజులు గతం
అన్లైన్ ఆర్డరుతో నిముషాల్లో
ఇంటి ముందు ఫుడ్డు రెడీ
అది మొన్నటిదో వారం క్రితానిదో

రేపు మీటింగ్ బాసుతో ఆన్లైన్లో
సూట్ బూటూ టై వచ్చేస్తాయి ఉదయమే
తల్లి బిడ్డను మోయక్కరలేదు కడుపులో
ఇన్‌క్యుబేటర్‍లో తయారు అవుతుంది
పని చేయక్కరలేదు
రోబోలు వచ్చేసాయి
రోగాలు ఎక్కువయ్యాయి
డాక్టర్లు మన మీదనే ప్రయోగాలు చేస్తున్నారు
అడిగేవారెవరు లేరని
తలెత్తి చూడలేని ఎత్తులో ఆసుపత్రి భవంతుల్లో
తండ్రి తాతా మనవడు వైద్యులు
అందులో అడుగుపెట్టేక
ఇల్లు ఒళ్ళు సంపాదన గుల్ల అయ్యేక
ఇంటికి వస్తావు

కార్పొరేట్ రంగాలలో వచ్చిన మార్పు
ఎలక్ట్రానిక్ యుగం తీరుతెన్నులు
కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరిచాయి
అందుకోమని ఆశపెడుతున్నాయి

పల్లెలు రాజకీయాలకు నెలవులు
నగరాలు అధికారానికి అందలాలుగా మారాయి
ఆకర్షణ రంగుల ప్రపంచంలో
అమాయకులు సమిధలు
మందు మాదకద్రవ్యాలు
నాగరికత జీవనోపాధిపేరుతో
అమ్మాయిలు అబ్బాయిల విశృంఖల కార్యకలాపాలు
కోల్పోతున్న విలువలు
కట్టుబాటు ఎరుగని జీవితాలు
మాయా జలతారు వలలు
దేశం కోసం అమ్మానాన్నల కోసం
అనే మాట ఎరుగరు
అనుబంధానికి అర్థం తెలియదు
కలుషితమైన పాలతో పెరిగే వారికి
స్వచ్ఛత అనురాగం ఆత్మీయత ఉండదు
ఎవరి తప్పు ఇది?
నేటి లోకం తీరు
మారుతున్న ప్రపంచానికి ఉదాహరణ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here