మహాభారత కథలు-59: నారదమహర్షితో పాండురాజు

0
4

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ధర్మరాజుకి పాండురాజు చెప్పిన మాటలు:

[dropcap]మ[/dropcap]యసభలో ఇతర రాజులతో కలిసి ఉన్న పాండురాజు రాజసూయయాగం చెయ్యడం వల్ల హరిశ్చంద్రుడు దేవేంద్ర సభకి వెళ్లడానికి అర్హత పొందాడని తెలుసుకున్నాడు. నారదుడు భూలోకానికి వెడుతున్నాడని తెలిసి పాండురాజు “నారదమహర్షీ! రాజసూయయాగం చేసిన రాజులందరూ హరిశ్చంద్రుడిలా దేవేంద్రుడి దగ్గర తమ కోరికలు తీర్చుకుంటూ దేవతల పూజలు అందుకుంటూ ఉంటారు.

మీరు మానవలోకానికి వెళ్లినప్పుడు నా కుమారుడు ధర్మరాజుతో నేను మయసభలో ఉన్న సంగతి చెప్పండి. రాజసూయ యాగం చేసిన పుణ్యాత్ములైన రాజులు ఇంద్రసభలో ఉన్నారని కూడా చెప్పండి. గొప్ప కీర్తి కలిగిన ధర్మరాజుని కూడా రాజసూయ యాగం చెయ్యమని తగిన విధంగా చెప్పి ఒప్పించండి లేదా నెమ్మదిగా ఆజ్ఞాపించండి.

నా కుమారులు అయిదుగురూ గొప్ప పరాక్రమవంతులు. దేవతల వరాల వల్ల పుట్టినవాళ్లు కనుక గొప్ప పుణ్యాత్ములు. నా పెద్ద కుమారుడు ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్ల భుజబలం వల్ల శత్రువుల్ని జయించి చక్రవర్తిగా రాజసూయయాగం చెయ్యగలడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తే నాతో సహా నా తండ్రి, తాతలు కూడా ఇంద్రలోకాన్ని పొందుతాము” అని చెప్పాడు.

పాండురాజు చెప్పిన విషయాన్ని నీకు చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. కనుక, ధర్మరాజా! గొప్ప సంపన్నుడివి, ధర్మపరుడివి అయిన నువ్వు ధర్మమార్గంలో రాజసూయ యాగం చేసి నీ పితృదేవతలందరినీ దేవతలతో పూజలందుకునేట్లు, దేవేంద్రసభలో ఉండేట్లు చెయ్యి.

దిగ్విజయం వల్ల పొందిన ధనంతో బ్రాహ్మణులకి తృప్తి కలిగేలా దానాలు చెయ్యి. నాలుగు వర్ణాలవాళ్లని, నాలుగు ఆశ్రమాలవాళ్లని రక్షించు. నీ సామ్రాజ్యం అందరితో గౌరవించబడే విధంగా ఉండేలా చూసుకో.

రాజసూయ యాగం ప్రారంభించడానికి అనేక విఘ్నాలు ఎదురవుతాయి. దాన్ని జరగకుండా చూడాలని బ్రహ్మరాక్షసులు ఎదురు చూస్తూ ఉంటారు. యజ్ఞం విఘ్నాలు లేకుండా పూర్తయితే రాబోయే కాలంలో ప్రజలు నాశనమయ్యే విధంగా ప్రళయంలా ఒక మహాయుద్ధం జరుగుతుంది” అని చెప్పి నారదమహర్షి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ధర్మరాజు నిర్ణయము

నారదమహర్షి రాజసూయయాగం చెయ్యమని చెప్పి వెళ్లిపోయాక ధర్మరాజు తన తమ్ముళ్ల వైపు, ధౌమ్యుడు, వ్యాసుడు, స్నేహితులు, బంధువులు, మంత్రుల వైపు చూస్తూ “తండ్రి కోరికని తీర్చడం కొడుకుల పని. కొడుకుగా పుట్టినందుకు తండ్రి కోరికని తీర్చడం ధర్మం కదా!

కాని, నారదమహర్షి పరలోకంలో ఉన్నవాళ్లకి రాజసూయయాగం చెయ్యడం వల్ల మేలు కలుగుతుందని, ముందు ముందు మహాభయంకరమైన యుద్ధం జరుగుతుందని చెప్పాడు.

పితృదేవతలకోసం రాజసూయయాగం చెయ్యాలని ఉంది. కాని, ఆ యాగం చెయ్యడం వల్ల ప్రజలు నాశనమవుతారన్న భయం కలుగుతోంది. ఏం చెయ్యలో తోచట్లేదు” అన్నాడు.

ఏ నిర్ణయం తీసుకోలేక ఊగిసలాడుతున్న మనస్సుతో ఉన్న ధర్మరాజుతో ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులు “ధర్మరాజా! ఆలస్యం చెయ్యకుండా రాజసూయ యాగం ప్రారంభించు. దాని వల్ల ప్రజల పాపాలు పోతాయి.

లోకంలో ఉన్న రాజులందరూ నీ పరక్రమానికి లొంగిపోయేవాళ్లే ఉన్నారు. ఇటువంటి సమయంలోనే సంపదలన్నీ పొందవచ్చు. మానవప్రయత్నంలో నీతో సరితూగ కలిగినవాళ్లు లేనే లేరు” అన్నారు.

వాళ్ల మాటలు విని ధర్మరాజు తమ్ముళ్ల అంగీకారం కూడా అడిగాడు. తమ్ముళ్లు నలుగురు అంగీకరించడం వల్ల రాజసూయయాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ యాగాన్ని విఘ్నాలు లేకుండా పూర్తి చెయ్యడానికి సమర్థుడు శ్రీకృష్ణుడే అని, ఇతరులు ఎవ్వరివల్ల కాదని అనుకున్నాడు.

ఎందుకంటే శ్రీమహావిష్ణువే శ్రీకృష్ణుడు. ఆద్యంతరహితుడు, ఆదిపురుషుడు, పురుషోత్తముడు అయిన శ్రీమహావిష్ణువు. ఆయనకి పుట్టుక లేకపోయినా లోకానికి మేలు చెయ్యాలని వసుదేవుడికి కొడుకుగా మానవ లోకంలో పుట్టాడు. అందువల్ల శ్రీకృష్ణుడే ఈ యాగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సమర్థుడని అనుకుని సేవకుల్ని పిలిపించాడు.

వచ్చిన సేవకులతో “వాయువేగం కలిగిన గుర్రాల్ని కట్టిన రథాన్ని తీసుకుని వెళ్లి భూభారాన్ని భరిస్తున్నవాడు, మధుసూదనుడయిన శ్రీకృష్ణుణ్ని తీసుకుని రండి” అని చెప్పి పంపించి శ్రీకృష్ణుడి రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.

ఇంద్రప్రస్థపురానికి వచ్చిన శ్రీకృష్ణుడు

ధర్మరాజు సేవకులతో పంపించిన సందేశాన్ని విని శ్రీకృష్ణుడు వెంటనే బయలుదేరి ఎక్కడా ఆగకుండా ఇంద్రప్రస్థ పురానికి వచ్చేశాడు. పుణ్యపురుడు శ్రీకృష్ణుడు వస్తూనే కుంతి, ధర్మరాజులకి నమస్కారం చేశాడు. బుద్ధిమంతుడైన భీమసేనుణ్ని కౌగలించుకున్నాడు. భక్తి భావంతో చూస్తూ తలవంచుకుని నిలబడిన అర్జునుణ్ని, నకుల సహదేవుల్ని పైకెత్తి దించాడు.

కురువంశానికి గొప్పవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ని ఎత్తైన ఆసనం మీద కూర్చోబెట్టాడు. అంతులేని ఆనందంతో గురువుని పూజించినట్టు అన్ని ఉపచార పద్ధతుల్లోను పూజించాడు.

ఎప్పుడూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండే పరమాత్మని యోగక్షేమాలు అడిగాడు. శ్రీకృష్ణుణ్ని ఆనందంతో చూస్తూ “పద్మనాభా! నువ్వు అందరితో పూజింపతగిన వాడివి. అన్ని లోకాల్లోను శాశ్వతంగా ఉండేవాడివి. భక్తులకు వశమవుతావు. రాజనీతి, ఉపాయాలు తెలిసినవాడివి. ఏ లోకంలోను నీకు తెలియని విశేషాలు ఉండవు.

అయినా నా కోరికని నీకు తెలియచేసుకుంటున్నాను. “శ్రీకృష్ణా! నారదమహర్షి వచ్చి అందరూ వింటూ ఉండగా రాజసూయయాగం చేస్తే పితృదేవతలకి ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుందని, ఆ యాగం చెయ్యమని నా తండ్రి పాండురాజు చెప్పాడని చెప్పాడు.

నారదమహర్షి నా తండ్రి మీద ఉన్న ప్రేమతో చెప్పాడో.. నా శక్తి సామర్థ్యాల మీద ఉన్ననమ్మకంతో చెప్పాడో తెలియదు. వీళ్లందరూ బాగా ఆలోచించి ఆ యాగం చెయ్యడానికి నన్ను ప్రేరేపించారు. అందుకు నేను అంగీకరించి నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here