[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవద్గీత మహత్యం’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత, గీతా మహత్యం అధ్యాయం 4వ శ్లోకం
శ్లో:
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిఃస్రుతా
భగవద్గీత జగద్గురువైన శ్రీకృష్ణభగవానుని చేత బోధింపబడినందున దానిని నిత్యం శ్రద్ధగా పఠించేవారికి ఇతర వేద, ఉపనిషత్తులు, శాస్త్రాలను పఠించాల్సిన అవసరం లేదు. అన్ని నదులూ సముద్రంలో ఇమిడినట్లు, సర్వశాస్త్ర సారం ఒక్క భగవద్గీతలోనే ఇమిడి వుంది. శాశ్వతానందం, ఆత్మ సాక్షాత్కారం, సర్వ విధములైన పాపాలను దహింప చేసుకుని, ముక్తి దిశగా ప్రయాణం చేయాలనుకునే సాధకులు, ముముక్షువులు కేవలం శ్రద్దా విశ్వాసాలతో సదా భగవద్గీతను పారాయణం చేస్తూ, అందులోని అంశాలను ఆకళింపు చేసుకొని నిత్య జీవితంలో ఆచరిస్తే చాలని శాస్త్రం భరోసా ఇస్తోంది. నిత్యం అశాంతి, ఆందోళన మనశ్శాంతి కరువై, అనేక కష్ట నష్టాలకు, దుఃఖాలకు లోనయ్యే మానవులకు భగవద్గీత పారాయణ ఒక చక్కని మార్గం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మనం ఏ పని చేసినా పూర్ణమైన నమ్మికతో చేయాలని భగవద్గీత వివరిస్తుంది. ‘సంశయాత్మా వినశ్యతి’. సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ధి సాధించలేరు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవారే, ఏదైనా సాధించగలరు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి అని చెబుతుంది. అదే విధంగా జీవించడానికి అవసరమైన కర్తవ్య బోధ చేస్తుంది.
భగవద్గీత మహత్యాన్ని శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఈ విధంగా బోధించినట్లు ‘పద్మపురాణం’లో వుంది.
“నేనే భగవద్గీత రూపంలో ప్రత్యక్షమయ్యాను. మొదటి ఐదు అధ్యాయాలు నా ఐదు తలలు, తరువాతి పది అధ్యాయాలు నా పది చేతులు మరియు పదహారవ అధ్యాయం నా కడుపు అని అర్థం చేసుకోండి. చివరి రెండు అధ్యాయాలు నా కమల పాదాలు. ఈ విధంగా మీరు భగవద్గీత యొక్క అతీంద్రియ దేవతను అర్థం చేసుకోవాలి. ఈ భగవద్గీత సమస్త పాపాలను నాశనం చేసేది. మరియు ప్రతిరోజు ఒక అధ్యాయం లేదా ఒక శ్లోకం, ఒక అర్ధ శ్లోకం లేదా కనీసం పావు శ్లోకం పఠించే తెలివైన వ్యక్తి ఎంతో ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి చేసుకుంటాడనదంలో ఎలాంటి సందేహం లేదు.
క్రీ.పూ 3102లో అంటే దాదాపు 5100 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడని శాస్త్రకారులు మరియు చరిత్రకారులు నిర్ణయించారు. ఈ తేదీ సుమారుగా మోషేకు 1700 సంవత్సరాలకు ముందు, బుద్ధునికి 2500 సంవత్సరాలకు ముందు, జీసస్‌కు 3000 సంవత్సరాలకు ముందు మరియు ప్రవక్త మహమ్మద్‌కు 3800 సంవత్సరాలకు పూర్వం ఉంటుంది. భగవద్గీత క్రైస్తవం లేదా బౌద్ధమతం లేదా ఇస్లాం మతం లేదా మరే ఇతర మతాల ప్రభావంతో లేదు, ఎందుకంటే ఈ మతాలు భగవద్గీత కాలంలో లేవు. అప్పుడు వున్న ఒకే మతం, మానవ మతం.
మహర్షి వేదవ్యాసుడు భగవద్గీతను 18 అధ్యాయాలుగా విభజించారు. ఇందులో ప్రతి అధ్యాయం/యోగం పరమ సత్యం యొక్క సాక్షాత్కారాన్ని పొందే మార్గాన్ని వెల్లడిస్తుంది.
గీతా మహత్యం గురించి మరొక అద్భుతమైన శ్లోకం ‘పద్మపురాణం’లో వుంది.
శ్లో:
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై
అంటే ఎచట భగవద్గీత పుస్తకం ఉండునో, ఎచట గీతా పారాయణం ఉండునో , అచట ప్రయాగ తీర్థాలు ఉండును, అచట సమస్త తీర్థాలు ఉండును అని అర్థం.