మహతి-54

8
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అభిమన్యు ఉంటే తన సమస్యకి చక్కని పరిష్కారం సూచించేవాడని అనుకుంటుంది మహతి. మహిళామండలి ఎన్నికలని చూశాకా రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది తనకి. సంఘంలోని ఏ వృత్తిని/ఉద్యోగాన్ని చూసినా అందులో ఏదో ఒక లోపం కనబడుతుంది. అసలు తను ఏం కావాలో తేల్చుకోలేకపోతుంది మహతి. ముందు కాలేజీలో చేరమని, డిగ్రీ అయ్యే లోపు ఏం చెయ్యాలో నిర్ణయించుకోవచ్చని డా. శ్రీధర్ అంటారు. శ్యామల ఏదో చెప్పబోతుండగా ఇంట్లో ఫోన్ మ్రోగుతుంది. ఫోన్ చేసింది గౌతమ్ గారు. మహతి ఫోన్ ఎత్తగానే ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఆపై ఒక్కొక్కరిగా పేరు పెట్టి అందరి కుశలం అడుగుతారు. తాతయ్యకి ఫోన్ ఇవ్వు అని రెండు నిముషాలు పాటు ఆయనతో మాట్లాడుతారు. ఆ తర్వాత ఫోన్ డా. శ్రీధర్ గారినీ, శ్యామల గారినీ పలకరించి మళ్ళీ మహీ చేతుల్లోకి వస్తుంది. చాలా రోజులయింది మాట్లాడి అని చేశాను, హాయిగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారయన. అల ఉత్తరం రాస్తుంది. ఓ కవితతో మొదలుపెడుతుంది ఉత్తరాన్ని. తాను హైదరాబాద్ వచ్చేశాననీ, ఓసారి వీలు చూసుకుని హైదరాబాద్ రమ్మని రాస్తుంది. తప్పకుండా హైదరాబాద్ వెళ్ళి, తన సమస్యని అలతో చర్చించాలనుకుంటుంది మహతి. ఉన్నట్టుంది త్రిపురగారి జ్వరం వస్తుంది. ఊర్లో అందరికీ జ్వరాలొస్తాయి. డా. శ్రీధర్, డా. శ్యామల తెగ బిజీగా ఉంటారు. త్రిపురకి టైఫాయిడ్ అని తేలి, తాను శ్యామల బిడ్డని చూడగలనో లేదో అని మహితో అని బాధపడతారు. తనకు సేవలు చేసినందుకు మహికి కృతజ్ఞతలు చెప్తారు. త్రిపురని జ్వరం తగ్గే వరకూ తమ ఇంట్లోనే ఉంచితే మంచిది కదా అని అంటారు తాతయ్య. మొదట్లో వద్దన్నా, చివరికి త్రిపుర ఒప్పుకుంటారు. ఓ రోజు కొన్ని రోజులు ఉండేలా అర్జెంటుగా ఇంటికి రమ్మని మహతికి గౌతమ్ ఫోన్ చేస్తారు. తాతయ్యని త్రిపురగారికీ డాక్టర్లిద్దరికీ అప్పగించి మహీ బయలుదేరుతుండగా – మహీ చెల్నెల్నీ తమ్మడ్నీ తీసుకుని అహ్యల్య అక్కడికి వస్తుంది. తాను మహీని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాలనీ, గౌతమ్ కూడా వస్తున్నారనీ తండ్రికి చెప్పి, పిల్లల్నిద్దరినీ ఆయనకి అప్పగించి మహతితో పాటు విజయవాడ చేరుతుంది అహల్య. ముందు తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్ బయల్దేరుతారు. మహతిని ఇంట్లో ఉండమంటారు. సరేనంటుంది. ఓ రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు – కనీసం మూడు రోజులకి సరిపడా బట్టలు సర్దుకుని హైదరాబాద్ బయల్దేరమనీ, వచ్చే ముందు పోన్ చెయ్యమని! తాను హైదరాబాద్ వస్తున్న సంగతి అలకి ఫోన్‌లో చెప్పి, ఆ రాత్రి బస్ ఎక్కి నిద్రపోతుంది మహీ. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-1

[ఇప్పటిదాకా మహతి 13 భాగాలు, అల 20 భాగాలు, తరువాత మహి 20 భాగాలు ప్రచురించబడ్డాయి. అంటే 53 వారాల నుంచీ ‘మహతి’ సీరియల్‌గా ప్రచురించబడుతోంది. అందుకు నా ప్రియాతి ప్రియమైన ‘సంచిక’ పత్రికకూ, ప్రియాతి ప్రియమైన నా శ్రేయోభిలాషి శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికీ, వారం ముందే ఫోన్ ద్వారానో మెసేజ్ ద్వారాలో నన్ను alert చేసే సోమ శంకర్ గారికీ.. ప్రతి వారం తగు స్పందనలతో నాకు అనంతమైన స్పూర్తినీ ఉత్సాహాన్నీ ఇచ్చే పాఠక మిత్ర దేవతలకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణ ఇలాంగే కొనసాగాలని మనః పూర్వకంగా వేడుకుంటూ.. మీ భువనచంద్ర]

కొంచెంగా అల 20వ భాగంలో వెడితే:

[dropcap]మ[/dropcap]హతి హైద్రాబాద్‌కి వచ్చి అలని కలిసింది. కారణం మహతి తండ్రిగారి అంటే గౌతమ్ గారి మేనమామ కూతురు ‘ఇందిర’ అస్వస్థతతో హాస్పటల్లో చేరడం, ఫాలాక్ష అక్కగారు కల్యాణి మహి తల్లిదండ్రులకి భోజనం తీసుకెళ్ళి తినిపించడం, అల హాస్పటల్‌కి వెళ్ళి మహతి తల్లిదండ్రుల్ని ఇందిరగార్నీ పలకరించి రావడం. మహతి డైరెక్టర్ సత్యమోహన్, సదాశివరావు etc. అందర్నీ కలిసి ‘అల’ కోసం తయారు చేస్తున్న కథ కూడా విని, ‘నా అభిప్రాయం తరవాత చెబుతాను’ అనడం మీకు గుర్తుండే ఉంటుంది.

ప్రస్తుతం:

వినోద్ కపూర్ ఫోన్ చేసి రెండు మూడు రోజుల్లో ఘాటింగ్ స్టార్ట్ అవుతుందని అలకి చెబుతాడు.

మహీ హాస్పటల్‍లో తల్లిదండ్రులతో, ఇందిరతో ఉన్నది – తల్లిదండ్రుల మధ్య ఏదో తెలియని తెర.

హరగోపాల్ అలని చిన్నబుచ్చాలని భంగపడతాడు. అతని విషయం అక్కడే ఆగింది.

అభిమన్యు సంగతి ఎవరికీ తెలీదు. తాతయ్య, పిల్లలు, డాక్టర్లు, త్రిపురగారు SAFE at కర్రావూరి ఉప్పలపాడు.

ఇక చదవండి

అల:

తలనెప్పి అని పడుకున్న మహి నాతో పాటు వచ్చి తీయబోయే సినిమా కథ విన్నది. అభిప్రాయం ఆలోచించి చెబుతానంది.

“ఈ పూటకి నీ ప్లాట్‌కి పోదామే.. కళ్ళు మూసుకుని కాసేపు పడుకోవాలని ఉంది” అన్నది మహతి నిస్సత్తువగా.

“సరే” అని కారుని ప్లాట్కి తీసికెళ్ళామని డ్రైవర్‌తో చెప్పాను. అడగాలని ఎంతో అనిపించినా, కళ్ళు మూసుకుని నిస్సత్తువగా సీట్‌కి జారబడ్డ మహతిని ఏమీ అడగలేకపోయాను.

పది నిముషాల్లో ప్లాట్‌కి చేరాం. బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది మహతి. కూరలేమన్నా వున్నాయోమోనని చూశా. బంగాళదుంపలు, టమోటాలు, బెండకాయలు ఉన్నై. ముందు రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను.

కాఫీ ఆఫీస్ లోనే తాగాం కనక కాఫీ ప్రయత్నాలు చెయ్యలేదు. కనకం సాయంత్రం ఎవరన్నో చూడాలని వెళ్ళింది. అరగంట తరవాత మహతి లేచింది. అప్పటికి నేను టమేటా బెండకాయ కూర, బంగాళదుంపలు వేపుడు చేసి చాలు పెట్టాను.

“ఇప్పుడు చెప్పవే.. ఏమయిందీ?” అన్నాను.

“ఇందరగారి వ్యవహారం ఓ సమస్యలా మారింది. ఆవిడ జబ్బు తగ్గే స్థితిలో లేదు. ఆవిడ మా నాన్నగారి మేనత్త కూతురు. మా నాన్నకొన్ని పరిస్థితుల్లో వాళ్ళింట్లోనే పెరగాల్సి వచ్చింది. అప్పుడు నాన్నగారి మేనమామ మేనత్తా ఇందిరా కూడా చాలా అవమానకరంగా ప్రవర్తించేవారట. నాన్నగారికి అదృష్టవశాత్తూ మంచి ఉద్యోగం వచ్చింది. అప్పడు మేనమామ మేనత్త ఇందిరని పెళ్ళి చేసుకోమని నాన్నని బలవంతపెట్టారట. నాన్న స్పష్టంగా చేసుకోనని అన్నారట. అప్పుడు ఆయన అంటే మా నాన్న మేనమామ కుటుంబరావు మా నాన్నని బయటికి పొమ్మన్నారట. నిజానికి వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తి చాలావరకూ మా తాతయ్యదిట. నాన్న బయటకి వచ్చారు. మా అమ్మని చూడగానే ఓకే చెప్పి పెళ్ళి చేసుకున్నారు. ఇదీ సమస్య పూర్వభాగం” అన్నది మహతి.

“మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి?” కుతుహలంగా అడిగాను.

“గత ఎనిమిది నెలలుగా ఇందిరగారు మా నాన్నగారితో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మా నాన్నగారు తిరస్కరించినందు వల్ల తను బ్రహ్మచారిణిగా మిగిలిపోయిందనీ, చావుబ్రతుకుల్లో వున్నందున ఇప్పుడైనా ఆదరించాలనీ” ఆగింది మహీ.

అసలు నాకేం మాట్లాడాలో తోచలేదు. ఇలాగూ జరుగుతుందా? “మొదట మీ నాన్నగారిని ఇల్-ట్రీట్ చేసింది వాళ్లే కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతోంది?” కోపంగా అన్నాను. మహతి నవ్వింది.

“అప్పుడు తనకి తల్లిదండ్రులున్నారు. ఏమైనా మానాన్న ఒప్పుకు తీరుతారనే ధీమా. మా నాన్న పెళ్ళి చేసుకోగానే ఆవిడ కలల సౌధం సగం కూలిపోయింది. మా అమ్మని పరోక్షంగా చూశాక ఆవిడ కోపం మిన్నంటింది. చూశావు గదా, ఇందిరగారు చాలా అందగత్తె. అటువంటిదాన్ని వదలి సామాన్యంగా వున్న మా అమ్మని పెళ్ళి చేసుకోవడం ఇందిరగారి అహంభావానికి చెంపపెట్టు అయింది. ఇంకా బిగుసుకుపోయింది. తల్లిదండ్రులు పోవడానికి ముందు, వాళ్ళని చాలా టార్చర్ పెట్టిందట – బావని వెళ్ళగొట్టి నా బతుకుని బుగ్గి పాలు చేశారని” వివరించింది మహతి.

నిజం చెబితే ఇందిర సౌందర్యం సామాన్యమైనది కాదు. నేటి ఓ హీరోయిన్ అయినా ఇందిర గోటికి సాటి రాదు. కట్టిపడేసే అందం ఆమెది.

ఇప్పటి సంగతైతే అలసి పోయిన అందం. ఇప్పుడు ఆమె మొహంలో ఆహంభావామూ లేదు, దైన్యమూ లేదు. నేను చూసినంత వరకూ ఓ నిర్వికారం ఉంది ఆమె ముఖంలో.

“మీ అమ్మగారూ ఏమంటారూ?” అడిగాను. నేనడిగింది ఫూలిష్ క్వశ్చన్ అని నాకు తెలుసు.

“ఈ ప్రశ్నకి ఆన్సర్ నా దగ్గర లేదు అలా. గత ఎనిమిది నెలలలుగా మా అమ్మ వ్యగ్రతతో ఉండటం గమనించాను. అంతే. ఇందిరగారి విషయంలో మా అమ్మకి నాన్నకి మధ్యన జరిగిన సంభాషణలు నాకు తెలీవు. ఏం జరిగిందీ అని నేను అడగటం కూడా భావ్యం కాదు. కానీ, పరిస్థితులు ఇంకా కంట్రోల్ తప్పిపోలేదని మాత్రం చెప్పగలను” నీరసంగా నవ్వి అన్నది మహతి.

“సారీ మహీ.. ప్రశ్న మీద ప్రశ్నలేసి విసిగిస్తున్నానే. కానీ మధ్యాహ్నం అసలు తిన్నావో లేదో కూడా అడగలేదు. వంట చేసేశాను. నీ అంత బాగా కాదనుకో. తినగలవని మాత్రం హామీ ఇవ్వగలను. సారీ నేస్తం, పద.. ఇద్దరం కాస్త ఎంగిలిపడదాం. తినేసి రాత్రంతా హాయిగా రెస్ట్ తీసుకో. మళ్ళీ రేపటి కార్యక్రమం ఎలాగూ ఉందిగా” అన్నాను. నిజంగా నాకు బాధ అనిపించింది. ఎంత నీరసం రాకపోతే మహతి అలా పడుకునిపోతుందీ!

భోజనం చేశాం. పెద్దగా మాటలు జరగలేదు. చిత్రమేమంటే, మౌనానికి మించిన గొప్ప భాష సృష్టిలో లేదు. నోరు మాట్లాడలేకపోవచ్చు. కానీ ఆలోచనల ప్రవాహం ఇంకిపోదుగా!

గౌతమ్ గారి పరిస్థితి నిజంగా ఘోరమే. ఎందుకంటే ఆయన మొదటి నుంచీ కుటుంబం అనే వ్యవస్థ నించి వెళ్ళగొట్టబడ్డాడు. మంచి కోరాల్సిన మేనమామ ఆస్తి దోచుకుని చులకన చేశాడు. అదృష్టవశాత్తూ అహల్య గారి లాంటి భార్యకి భర్త; నరేన్, సురేన్, మహతి, కల్యాణి లాంటి పిల్లలకి తండ్రి అయ్యారు. మధ్యలో తుఫానులా ఇందిర.

ఈ తుఫాను ఎటు మళ్ళుతుందీ? ఎప్పుడు ఆగుతుందీ? నాకే పరిష్కారం దరిదాపుల్లో కనిపించలేదు. నాకంటే మానసికంగా ఎంతో పరిణిత కలిగిన మహతే ఏమీ చేయలేక మౌనసాక్షిగా నిలుచుంటే నేనేమి చేయ్యగలను? పోనీ, కల్యాణి గారికి సమస్యని చెబితే? ఆవిడైతే చాలా సులువుగా పరిష్కరించగలదని నాకు అనిపించింది.

అయినా నేను మహతి అనుమతో, తన పేరెంట్స్ అనుమతో లేకుండా యూ సమస్యని కల్యాణి గారికి చెప్పకూడదు గదా. నవ్వొచ్చింది. మన సృష్టించుకునే సమస్యలు కొన్నైతే, కాలం సృష్టించే సమస్యలు కొన్ని. ఇందిరగారికి కూడా 50 సంవత్సరాలు వయసు దాటివుండాలి.

“అవునూ ఆదరించాలని అన్నదని అన్నావుగదా. ఆదరించడం అంటే, మీ దగ్గర పెట్టుకుని మీతో పాటు సమానంగా చూడాలనా?” సడన్‌గా మాహతిని అడిగాను. అది నిద్రపోలేదని తెలుస్తూనే ఉంది.

“ఆ ఒక్క మాటకే అనేక అర్థాలున్నాయి. ఎలా ఆదరించాలో ఆవిడే వివరించాలి. ఇంకోటి ఏమంటే ఆదరించకపోతే? ఈ ప్రశ్నకి మామూలు సమాధానామూ ఉండొచ్చు. భయంకరమైన బెదిరింపు వుండొచ్చు. అలా, లోకం ఆడదాన్ని నమ్మనంతగా మగవాళ్ళని నమ్మరు. ఆడది ఏ ఆరోపణ చేసినా, లోకం ఆ మగవాన్ని నిగ్గదీసి అడగడమే కాదు, అవమానాల పాలు జేస్తుంది. ఒకప్పుడు స్త్రీలు భయపడిన దానికంటే ఇప్పుడు పురుషులు ఎక్కువ భయపడుతున్నారు.

కారణం మళ్ళీ స్త్రీలే! న్యాయం అనేదాన్ని పక్కన పెడితే, జరగాల్సిన డామేజ్ ముందే జరిగిపోతుందిగా!” నా వంకే సూటిగా చూస్తూ అన్నది మహీ.

నిజమే! కొందరు మహిళామణులు వాళ్ళకి వాళ్ళే న్యాయాధీశులుగా భావించుకుని పబ్లిక్ తీర్పులు ఇస్తున్నారు. అసలు సమస్య కంటే, వాళ్ళు చేస్తున్న ధూమ్.. ధామ్‌లు ఎక్కువై సమస్యని మరింత గందరగోళంగా మారుస్తున్నాయి. మానవ జీవితాలు మనీ ట్రాన్సాక్షన్ల లాగా మారిపోతున్నాయి. జమా ఖర్చులు, లాభనష్టాలకు తోడు అహంభావాలు అహంకారాలు జోడయ్యాయి.

“మన చేతిలో ఏదీ లేదని తెలిసి కూడా, మనసు ఆలోచించడం మానదు.” మెల్లగా అని అవతలికి తిరిగి పడుకుంది మహతి.

చీకటి పడటం ఎంత సహజమో తెల్లవారడమూ అంతే సహజం. రెండు సహజ ప్రక్రియల మధ్య శతసహస్ర తేడాలున్నై. రాత్రి భయాన్ని జోకొట్టి నిద్ర పుచ్చుతుంది. కలల్లో తేలించి కొద్దో గొప్పో ఆనందాన్నిస్తుంది.

పగటి పొద్దు పొడవంగానే మళ్ళీ బతుకు భయం చుట్టుముడుతుంది. తాత్కాలికంగా సెలవు తీసుకున్న నిన్నటి సమస్యలు జుట్టు విరబోసుకుని మన ముందు కొచ్చి వికటాట్టహాసం చేస్తాయి. మెదడు మళ్లీ తన పని మొదలెడుతుంది, పరిష్కారాలు వెతకడానికి.

ఇద్దరం కాఫీ కప్పులు పట్టుకుని కూర్చున్నాం.

“నువ్వు నార్త్‌కి ఎప్పుడు వెళ్ళాలి?” అడిగింది మహి.

“వినోద్‌కి ఫోన్ చేసి మరో రెండు రోజుల తరువాత వస్తానని చెప్పాను. మరి మరో మూడున్నర రోజుల తరవాత వెళ్ళాలి. వెళ్ళకపోతే వాళ్ళకి చాలా నష్టం జరుతుంది” అన్నాను.

“తప్పనిసరిగా వెళ్ళు. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలో నాకే అర్థం కావడం లేదు” అన్నది మహీ.

“నేను వెళ్ళినా నువ్వు ప్లాట్ లోనే ఉండొచ్చు. కారు డ్రైవరు ఉంటారుగా. కనకం కూడా ఇక్కడే ఉంటుంది. దానికి కూడా మాటలో బాగానే ప్రవేశం ఉంది. ఫోన్ ఉండనే ఉంది.” మహీ భుజం మీద చెయ్యి వేసి అన్నాను.

ఈ సిచ్యుయేషన్‌లో తనని వదిలి వెళ్ళడం నిజంగా నాకు న్యాయం అనిపించలేదు. కానీ, నేను ఉన్నా ఏదో కొంచెం మాట్లాడతూ మనసుని డైవర్ట్ చేయడం తప్ప సమస్యని పరిష్కరించలేనుగా.

“చూస్తాను. అవసరం అయితే ఇక్కడే ఉంటాను. నిజం చెబితే ఇప్పుడు ఇందిరగారి ఇల్లు కూడా మా నాన్నగారి డబ్బుతో కొన్నదే. ఈ విషయం ఇందిరగారే చెప్పారు” అన్నది మహీ.

“అంత అన్యాయం జరగుతున్నా, మీ నాన్నగారు ఎలా వూరుకున్నారూ?” సీరియస్‌గా అడిగాను.

చిన్నగా నవ్వింది మహీ. “అలా, కొన్ని కొన్ని భావనాలు గుండెలోనే ఇంకిపోతాయి. అవి ఎంత చేదైనదైనా తలపుకి వచ్చినప్పుడు మధురంగానే ఉంటాయి.

అటువంటివి ఏదైనా ఉన్నప్పుడే మనం జనాల్ని క్షమిస్తాం. అటువంటి భావనలు లేనప్పుడు మనసు ఎందుకు క్షమిస్తుందీ? నేనూ స్పష్టంగా చెప్పలేను కానీ, ఆ వయసులో పైకి అహంభావంగా కనిపించినా, ఇందిరగారు మా నాన్నని లోతుగానే ప్రేమించి ఉండొచ్చు. అలాగే మా నాన్నగారికీ ఓ సాఫ్ట్ కార్నర్ ఉండి ఉండొచ్చు. ఆ విషయాలు చెప్పాలంటే, ఇందిరగారే చెప్పాలి. ఏ విషయమైనా తనలోనే ఉంచుకునే స్వభావం మా నాన్నది. ఆయన ఎవర్నీ విమర్శించడమో కనీసం మందలించడం కూడా నేను చూడలేదు. ఆందుకే, విషయం తెలియాలంటే ఇందిరగారే చెప్పాలి” అన్నది మహీ.

అదన్న మాట నూటికి నూరుపాళ్ళూ కరెక్ట్ అని నాకు అనిపించింది. క్షమించాలంటే ప్రేమో, అనురాగమో, అభిమానమో ఏదో ఒకటి ఉండాలి. ఫోన్ మోగింది. చూస్తే కల్యాణిగారు.

“చెప్పమ్మా” అన్నాను.

“మహీ వుందా?” అన్నారు. “ఇదిగో ఇస్తున్నా” అని మహీకి ఫోన్ ఇచ్చి నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను.

మహీని ప్రత్యేకంగా అడిగిందంటే, ఏదో ప్రత్యేకంగా మాట్లాడడానికే అని నాకు అనిపించింది. అందుకే దూరంగా వచ్చా.

సామాన్యంగా మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఇతరులు కావాలని మరీ అక్కడే తచ్చాడుతుంటారు. వాళ్ళని దూరంగా వెళ్ళమని చెప్పలేము, వెళ్ళే అవకాశం మనకి లేకా ఎంత బాధకీ చికాకుకీ గురవుతామో నాకు స్పష్టంగా తెలుసు. చాలా మంది చెవులు విప్పార్చుకుని మరీ మనం మాట్లాడేతున్నది వినడమేగాక “ఎవరూ ఆ మాట్లాడేది” అని నిస్సిగ్గుగా మధ్యలో ఆపి మరీ అడుగుతారు.

ఎదుటి వారు ఫోన్ మాట్లాడేటప్పుడు దూరంగా ఉండాలన్న ‘జ్ఞానం’ యీ జన్మలో చాలా చాలా చాలా మందికి కలగదు. ఇంకొందరైతే అప్పుడే ప్రశ్నలు మీద ప్రశ్నలు గుప్పించి పిచ్చెక్కిస్తారు. అటు ఫోన్ మాట్లాడాలా ఇటు యీ మూర్ఖులకి జవాబు చెప్పాలో తెలియక తల విచ్చిపోతుంది.

ఇటు వంటి చిన్న చిన్న విషయాలు ఎవరికి వారు తెలుసుకోవాలసిందే. ఆ చిన్న ప్రపంచంలో నుంచి ఇక్కడకు వచ్చాకే నాకూ తెలుస్తున్నాయి.

ఎవరింటికి వెళ్ళనా ముందు ఫోన్ చేసి, వాళ్ళ వీలుని బట్టే వెళ్ళడం, ఒక వేళ చుట్టాలింటికి వెళ్ళాల్సి వచ్చినా భోజనం చేస్తామనో చెయ్యమనో స్పష్టంగా చెప్పడం ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి.

అర్థాంతరంగా దిగిపోతే వాళ్ళ పైకి నవ్వుతూ మనని ఆహ్వానించినా, లోపల వాళ్ళు పనులు చెడగొట్టినందుకు ఎంత తిట్టుకుంటారో. అయినా, అప్పుటికప్పుడు భోజనాలు ఏర్పాటు చేయడం ఎంత కష్టం!

ఇవి క్లాసుల్లో చెప్పాల్సిన పాఠాలు కావు. కానీ చిన్నప్పటి నుంచీ పిల్లలకి చెబితే చాలా మంచిదని నేను అనుకుంటాను. నేను టిఫిన్ రెడీ చేసేసరికి అరగంట అయింది.

“కల్యాణిగారు ఇక్కడికి వస్తానన్నారు అలా. టిఫిన్ తను తీసుకు వస్తానన్నారు” అన్నది మహీ.

“టిఫిన్ చేసేశాగా” అన్నాను.

“ఏం చేశావ్” ఆశ్చర్యంగా అడిగింది.

“పూరీలు; బంగాళదుంప + టమోటా + ఉల్లిపాయ+ పచ్చిమిర్చి కలిపి కూర” అన్నాను.

“ఓహ్.. సూపర్.. ఓ పని చేద్దాం. కల్యాణిగారిదీ నీదీ కలిపి మనం పంచుకుని తినేద్దాం. ఆ తరవాత నువ్వు రెస్టు తీసుకో. నేనూ కల్యాణిగారూ హాస్పటల్‌కి వెళ్ళి వస్తాం” టవల్ తీసుకుని బాత్ రూమ్ లోకే వెడుతూ అన్నది మహీ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here