జీవన రమణీయం-19

1
2

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]”ఇం[/dropcap]కా తెలవారదేమీ… ఈ చీకటి విడిపోదేమీ?” అన్నట్టు మర్నాడు స్కూల్ టైం అవడం కోసం గడియారం చూశాను. ఇదంతా లలితా, సుశీలతో పంచుకోవాలి కదా మరీ!

పొద్దుటే లేచి స్నానం వంటా చేసేసి, పిల్లల్ని లేపి తయ్యారు చేసి, టిఫిన్ పెట్టి, డబ్బాలు కట్టి, ఆటో ఎక్కించి, ఇంకా స్కూల్ టైం కాకుండానే అమ్మమ్మతో “అమ్మమ్మా నేను స్కూలికి వెళ్తున్నాను” అని చెప్పి పరిగెత్తాను.

గట్టిగా నడిస్తే స్కూల్ మూడు నిమిషాల దూరం. దారిలో భారతి ఎదురుపడి “పిల్లలకి ఫీజు కట్టడానికి వెళ్ళాను. కలిసారా యండమూరీ?” అంటే… “తర్వాత మాట్లాడ్తాను… అర్జెంటు పని వుంది” అని నడిచాను.

ఆమె దగ్గరికి నేను ఉత్సాహంగా యండమూరి గారి నుండి పిలుపొచ్చిందని చెప్పడానికి వెళ్తే… ఎలా మాట్లాడిందో మరచిపోలేను! ఆ ఆనందం పంచుకుంటే మళ్ళీ పుల్ల విరుపు మాట అంటే తట్టుకోలేనని వడి వడిగా స్కూల్‌కి వెళ్ళాను.

లలిత ఆలస్యంగా, ప్రేయర్ అవుతుండగా వచ్చింది. కోపంతో కొట్టాలనిపించింది. ప్రేయర్ అవగానే నా క్లాస్‌రూమ్‍లోకి పరిగెత్తుకొచ్చి, “కలిసావా? ఏం అన్నారు?” అంది.

“లలితను ఎందుకు తీసుకురాలేదూ అన్నారు” అనగానే బుగ్గలు సొట్టలు పడేట్లు నవ్వింది.

“చాలా  బాగా మాట్లాడారు లలితా” అన్నాను.

“అయితే ట్రీట్ ఇవ్వాలి… మిగతాది ఇంటర్వెల్‍లో…” అని పరిగెత్తి క్లాసుకెళ్ళి పోయింది.

ఇంటర్వెల్‌లో లలితా సుశీలాకి స్వరూప రాణి ఇంటికి వెళ్ళడం నుండీ పూస గుచ్చినట్తు చెప్పుకొచ్చాను. మధ్య మధ్యలో “అయ్యో… వెళ్ళారా ఇంతకీ… చూడగానే నువ్వు ఏం మాట్లాడావు?” లాంటి ప్రశ్నలు వేస్తూనే వుంది సుశీల. నేను లీడర్ అక్కడ వదిలి వచ్చానని తెలిసాకా, సుశీల పట్టుపట్టింది.

“రమణీ… ‘తృప్తి’ చతరకి ఇస్తానన్నావ్… పద ఇచ్చొద్దాం. ఈ సాయంత్రం పర్మిషన్ తీసుకుని బడి వదిలే ఓ గంట ముందు వెళ్ళొద్దాం” అంది.

ఆ జోష్‌లో “సరే” అనేసుకున్నాం.

మా లలితా సుశీలా ఇద్దరూ కూడా అద్భుతంగా వంట చేస్తారు. మా లలిత పచ్చి టమాటాలు ఉల్లికారం పెట్టి కూర చేస్తే ఎంత బావుండేదో! సుశీల అన్ని వెజిటబుల్స్ వేసి మజ్జిగ పులుసు పెట్టేది. ఓసారి మా అమ్మమ్మ చేసిన కొత్తిమీర కారం నేనిస్తే ఎంత మెచ్చుకున్నారో… ఇప్పటికీ చెప్తారు.

మా స్కూల్లో టీచర్లు కల్పనా, బీనా, మణీ కూడా “మీ రైటర్ గురూ కలిసారా?” అని అడిగి విషయం తెలుసుకుని ఆనందపడ్డారు.

మా రెండో పెద్దమ్మ కొడుకు గౌతరాజు హనుమంతు అన్నయ్య వల్లే నాకు యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలు తెలిసాయి. ఋషి, చెంగల్వ పూదండ, పర్ణశాల వాడు నాకు మొదటగా తెచ్చిచ్చిన నవలలు! ఆ తరువాత నేను ఆయన నవలలకి అడిక్ట్ అయ్యాను. అలాగే పడమటి సంధ్యారాగం, స్రవంతీ, మందాకినీ కూడా వాడి వల్లే చదివాను! మల్లాది గారి దగ్గర నుండి వాడికోసారి ఉత్తరానికి రిప్లై వస్తే తెగ చూపించుకు తిరిగాడు, చదవడం మాత్రం కష్టం అయ్యింది.

ఇప్పుడు మల్లాది గారు మా కుటుంబంలో ఒకరిగా, వారి సతీమణి పద్మజ నా ఆప్త నేస్తం కాబట్టి ఆ విషయాలు చెప్పుకుని నవ్వుకుంటాము.

ఇది జరిగిన మూడు రోజులకి మా ఆయనకి ఆఫీసుకి యండమూరి ఫోన్ చేశారు. “లీడర్ చదివాను… నా కళ్ళమ్మట నీళ్ళు కారిపోయాయి… మన తెలుగువాళ్ళల్లో ఇలాంటి సూరంపూడి శ్రీహరిరావు గారి లాంటి దేశభక్తులున్నారా? అని…  నేను పుస్తకం వేయిస్తాను… మీ ఆవిడ్ని ఓసారి రమ్మనండి” అని.

మా ఆయన స్వీట్ ప్యాకెట్ కొనుక్కొచ్చి మరీ ఆ విషయం నాతో చెప్పారు. మా ఇద్దరి కన్నా అమ్మమ్మ చాలా ఎక్కువగా సంతోషపడింది!

అనుకున్నట్టుగా శనివారం సాయంత్రం చతుర ఆఫీసుకి సుశీలా, లలితా, నేను ఒకేలాంటి చీరలు కట్టుకుని వెళ్ళాం. అక్కడ నాగరత్న అనే అమ్మాయి వుందప్పుడు.

“ఎడిటర్ చలసాని ప్రసాదరావు గారిని కలవాలి” అని చెప్పాం. ఆ అమ్మాయి “కూర్చోండి” అని స్క్రిప్ట్ చూసి చిన్నగా నవ్వింది. ఎందుకంటే అది పేజీకి రెండు వైపులా రాసి వుంది, రూల్స్ పేపర్‌లో.

“మొదటిసారా?” అని అడిగింది.

“మా రమణివి ఆల్‌రెడీ కథలు పబ్లిష్ అయ్యాయి” అంది లలిత ఆతృతగా.

ఆ అమ్మాయి ప్రసాదరావు గారికి చెప్తానని లోపలికి వెళ్ళింది. కాసేపటికి ఆయన గదిలోకి పిలిచారు. ఆయన కంఠనాళాలు దెబ్బతిన్నాయిట (కృష్ణశాస్త్రి గారిలా) అన్నీ రాసి చూపిస్తారు.

“మీ ముగ్గురిలో రచయిత్రి ఎవరు?” అని అడిగారు.

“నేనే” అన్నాను.

ఆయన పేపర్ మీద “సోమర్‌సెట్ మామ్‌వి ఏవైనా చదివారా? స్పార్టకస్ చదివారా?” అని అడిగారు.

నేను తెల్లమొహం వేశాను.

“రాయాలంటే బాగా చదవాలి” అన్నారు.

మేం తలలూపాం. ఆయన ఓ గురువులా చాలా సంగతులు చెప్పారు. మా అదృష్టం అప్పట్లో అలాంటి ఎడిటర్స్ వుండేవారు!

ఓ గంట మాట్లాడి టీ తాగించి, “నేను చదివి ఏ సంగతీ తెలియబరుస్తాను, వెళ్ళండి” అన్నారు. మాకు పెద్దాయన బాగా నచ్చేశారు. గాల్లో తేలిపోతూ వచ్చేసాం.

రెండో శనివారం లలితా, నేనూ వీరేంద్రనాథ్ గారి దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాం.

ఇక్కడ లలిత కుటుంబం గురించి కొంత చెప్పాలి. దశిక శేషాచలం గారని వాళ్ళ నాన్నగారు చాలా స్ట్రిక్ట్, వాళ్ళ అన్నయ్యలు ఇంకా స్ట్రిక్ట్… మా చిన్నతనంలో ‘యండమూరి’ నవలలు కూడా నిషిద్ధం మాకు!

వదిలిపెట్టలేక, ఏవో పాట్లు పడి టెక్స్ట్ బుక్స్ మధ్యలో పెట్టుకుని చదివేసేవాళ్ళం! ఇలా తను నాతో రావడం వాళ్ళకి ఇష్టం వుండడని (అత్తగారింట్లో ప్రాబ్లెమ్ లేదు) చెప్పకుండా, కష్టపడి పదింటికల్లా ఎక్స్‌కర్షన్‌కి వెళ్తున్నంత సరదాగా, దారి పొడుగుతూ లలిత ఆయనని ఏమేం అడగాలనుకుంటుందో రిహార్సల్స్ చేసుకుంటూ (ఇప్పుడు ఇక తన వంతు అన్న మాట) బయలుదేరాం.

మేం ఎక్కడి కెళ్ళాలన్నా నేరేడ్‌మెట్ నుండి సికింద్రాబాద్‌కి వెళ్ళి అక్కడి నుండి బస్సులు మారాలి. ఎక్కడికైనా భర్త లేకుండా వెళ్ళాలంటే బస్సులోనే వెళ్ళాలి. ఆటోలు ఎప్పుడైనా దగ్గర చోట్లకి మాత్రమే!

లలిత ఎప్పుడైనా “కుంపటి వెలిగిస్తా… మొక్కజొన్న పొత్తులు కాల్చుకుందాం రండి” అంటే పొలోమని పోయేవాళ్ళం. లేదా నేనూ లలితా సిటీ సెంట్రల్ లైబ్రరీకో, సాహిత్య సభకో.. సుశీలకి అంత వీలుండేది కాదు! పూర్తిగా అత్తా, భర్తా చాటు ఇల్లాలు. పెద్ద సంసారం. వచ్చేవాళ్ళూ, పోయేవాళ్ళూ ఎక్కువ. పైగా టెన్త్ క్లాస్ క్లాస్‌టీచరూ!

చెప్పొచ్చేది… మా జీవితాలల్లోని ఈ చిన్న చిన్న సంతోషాలే పెద్దగా అనిపించేవి. ఎప్పుడూ ఉత్సాహంగా వుంచేవి మమ్మల్ని! ఏ ఆనందమైనా చటుక్కున పంచుకోవాలి, అంతే! అందుకు మేం కష్టపడి నడిచి ఒకరింటికి ఒకరు వెళ్ళేవాళ్ళం… ఇలా టప్పున సెల్ బయటకి తీసి ఫోన్ చెయ్యడం కాదు!

అలా గాల్లో తేలుతూ కపాడియా లేన్‌లో గెస్ట్ హౌస్‌కి వెళ్ళేసరికీ ఆయన కంగారుగా ఎక్కడికో బయలుదేరుతున్నారు. బయట ఇనోవా లాంటి వెహికల్ వుంది. పద్మిని అనుకుంట ఓ చిన్న అమ్మాయి వుంది.

నన్ను చూడగానే గుర్తు పట్టి, “మీ తాతగారి కథ ‘లీడర్’ చాలా గొప్పగా వుంది మేడం!…” అంది.

నేను షాక్… అప్పుడే ఎప్పుడు చదివిందీ? అని. ఆయన స్టూడెంట్స్‌కి అది చెప్పి వుంటారని తర్వాత తట్టింది.

లలిత ఆయనతో మాట్లాడలేకపోయానే అని నిరాశగా చూసింది. ఆయన ఆమె మొహం చూసి, “సరే… ఏదో చారిత్రాత్మక ప్లేస్ చూపిస్తానని ఈ అమ్మాయి సరదా పడ్తుంటే బయలుదేరాను… మీరూ రండి… దార్లో మాట్లాడుకుని వచ్చేడప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోదురుగాని!” అన్నారు.

ఓ నిమిషం నమ్మలేకపోయాం… నమ్మాకా ఏం చెయ్యాలో ఏం చెయ్యాలో తోచలేదు. “ప్లీజ్ మేమ్… రండి” ఆ అమ్మాయి బ్రతిమాలింది. మా జెనరేషన్‌కి పది రకాల ఆలోచనలుండేవి… ముందు ఇంట్లో వాళ్ల గురించి, తర్వాత పుట్టింటి వాళ్ళ గురించీ, ఇంకా తర్వాత మా స్నేహితుల గురించీ, ఇంతమంది గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్ళం! అలా అని ఏ సుశీలకో, మా ఆయనకో టక్కున ఫోన్ చేసి “ఇలా అంటున్నారు… వెళ్ళమంటారా?” అని అడిగే అవకాశం లేదు. ఆయన ఫోన్ వాడుకుంటాము అని అడిగే చనువు లేదు. మగవాళ్ళతో మాట్లాడడమే కొత్త! బంధువులూ, స్కూల్లో సారు తప్ప… చివరికి ఇద్దరం ఒకరి మొహం ఒకళ్ళం చూసుకుని వెళ్దాం అని నిర్ణయించుకున్నాం.

“రండి… వ్యాన్ ఎక్కండి” అన్నారాయన.

బెరుకుగా ఎక్కాము. ఆ అమ్మాయి సరదాగా మాట్లాడుతుంటే ఎలా మాట్లాడగలదిలా? అనుకున్నాం. వేణుగోపాల్ అని ఎమెస్కో విజయకుమార్ గారి మేనల్లుడు కూడా వున్నాడు. జయంతి అనే అమ్మాయి కూడా లాస్ట్ మినట్‌లో జాయిన్ అయినట్టు గుర్తు.

అప్పుడు ఎన్.టి.రామారావు గారు, లక్ష్మీ పార్వతిని పెళ్ళి చేసుకున్న కొత్త! గండిపేట గెస్ట్‌హౌస్‌లో ఏదో మీటింగ్ జరుగుతోంది… మా ఇద్దరికీ అక్కడ దిగిపోయి, ఎన్.టి.ఆర్ గారిని చూడాలని ఎంతో అనిపించింది. ఇప్పుడు లక్ష్మీ పార్వతినీ నేను ‘వదినా’ అని పిలుస్తా. తరచూ కలుస్తూ వుంటా, నేనంటే చాలా ప్రేమ. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తే ఇప్పటికీ ఆయన పక్కన బారు జడతో తలొంచుకుని నిలబడ్డ ‘ఆ రోజు’లా సిగ్గుపడ్తుంది!

లలిత ఎన్.టి.ఆర్.గారికి ఎంత ఫ్యాన్ అంటే… ఆయన పదవి పోయినప్పుడు, తిరిగి పదవిలోకొస్తే లక్ష గుంజీలు తీస్తానని వినాయకుడికి మొక్కుకుని, ఆయన పదవిలోకొచ్చాకా, వంద వంద చొప్పున ‘లక్ష’ పూర్తి చేసిన ఘనత తనది! చాలా ఏళ్ళు పట్టింది. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు… ఆర్.ఎస్.ఎస్. కూడా ఫ్యామిలీలో వుండడంతో చాలా పట్టుదల.

ఆ ట్రిప్‌లో వీరేంద్రనాథ్ గారు సరదాగా మాట్లాడి మా బెరుకు పోగొట్టినా, ఆయన చాలా రిజర్వ్‌డే!

మాతో చాలా మామూలుగా ఆయన “మీ లీడర్ పుస్తకం పబ్లిషింగ్‌ కిస్తున్నాను… డిసెంబరు 31న ఆవిష్కరణ” అన్నారు.

ఇద్దరం షాక్ అయిపోయాం. నా మొదటి పుస్తకం ఇంత ఈజీగా పబ్లిష్ అయిపోతోందా?

“అభినందన భవాని గారని, ఆవిడ ఫోన్ చేస్తారు. మాట్లాడండి… వాళ్ళ సంస్థే చేస్తోంది…” అన్నారు.

“నేనేం చెయ్యాలి?” అడిగాను.

“మంచి పట్టు చీర కట్టుకుని రావాలి” అన్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here