కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి ప్రత్యేక ఇంటర్వ్యూ

2
3

[‘తల్లివేరు’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం నెల్లుట్ల రమాదేవి గారూ.

నెల్లుట్ల రమాదేవి: నమస్కారం.

~

ప్రశ్న 1. మీరు రాసి, అపురూప పబ్లిషర్స్ వారు ప్రచురించిన 18 కథల సంపుటికి శీర్షికగా ఆరవ కథ తల్లివేరుపేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: ఈ పద్దెనిమిది కథల్లో అన్ని రకాల విషయ ప్రాధాన్యత ఉన్న కథలు ఉన్నప్పటికీ తల్లి ప్రేమనూ, బాధ్యతనూ, త్యాగాన్నీ తెలియజేసే కథలు ఎక్కువగా ఉన్నాయి. ఒక చెట్టు ఎంత పొడవుగా, విశాలంగా, బలంగా ఎదిగినా.. ఆ ఎదుగుదలంతా భూమి లోపలి పొరల్లోకి చీల్చుకుని వెళ్లి విస్తరించి చెట్టుకు నీటినీ, జవనూ అందించే తల్లివేరు వల్లనే! అయితే.. ఆకులకూ, పూవులకూ, కాయలకూ ఉన్నంత గ్లామర్, గుర్తింపూ వేర్లకు ఉండదు. అవి బయటకు ఎప్పుడూ కనపడవు కూడా. మనుషులూ అంతే. ఒక వ్యక్తి ఎదగాలంటే వారి జీవితంలో తల్లి పాత్ర ప్రధానమైనది. నిశ్శబ్దంగా తెర వెనుక ఉండి ఆనందిస్తూ ఉంటుంది తప్ప ప్రచారాన్ని కోరుకోదు. అందుకే ఆ పేరు పెట్టడం జరిగింది.

ప్రశ్న 2. “సమాజం పట్ల బాధ్యత ఉన్న రచయిత్రి నుండి వచ్చిన కథలు ఇవి. అందుకే కథలన్నీ చాలా సహజంగా, ఆధునిక పాఠకులకు అవసరమైన కొత్త విషయాలను అందించే విధంగా ఉన్నాయి” అన్నారు డా. ముదిగంటి సుజాతారెడ్డి గారు తమ ముందుమాటలో. కొత్త విషయాలనేవి ఆధునిక పాఠకులకే కాదు, పాత పాఠకులకీ అవసరమే కదా. మీరేమంటారు? ఈ సందర్భంగా మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?

జ: నా పట్ల ఎంతో ఆదరంతో ముందుమాట రాసిన గురుతుల్యులు డా. ముదిగంటి సుజాతారెడ్డి గారికి ధన్యవాదాలు. కొత్త విషయాలు కొత్త పాఠకులకే కాదు, పాతవారికి కూడా అవసరమే. నిజానికి పాఠకులు ఎప్పుడూ పాతబడరు. ఒకసారి సాహిత్యాన్ని చదవడం అలవాటయినవారు ఎంతో అనివార్యమయితే తప్ప చదవడం ఆపేయడం అరుదు. వారు కొత్తవి కూడా చదువుతారు. అయితే, పాతవాళ్లలో చాలామంది ప్రింట్‌లో ఉండే సాహిత్యాన్ని చదవడాన్ని ఇష్టపడతారు. కొత్త తరం పాఠకులు అంతగా పెరగడం లేదనేది అందరూ అంగీకరించే సత్యం. సోషల్ మీడియాలోనూ, అంతర్జాల పత్రికల్లోనూ వచ్చే రచనలను ఈ తరం వారు చదువుతారు. ప్రింట్ పత్రికలు 90 శాతం కనుమరుగయిన ఈ పరిస్థితుల్లో కొద్దిమంది అప్పటివారు కూడా ఈ మాధ్యమాల ద్వారా చదవడం అలవాటు చేసుకున్నారు. అయితే, మంచి రచనలు చేయడం ఎంత బాధ్యతో, తమ రచనలను ఏ మాధ్యమం ద్వారానయినా పాఠకులకు చేర్చడం కూడా రచయితల బాధ్యత అయిందిప్పుడు. ఆ క్రమంలో కొత్త విషయాలు చెప్పడం, కొత్త రకంగా చెప్పడం రెండూ అవసరమే.. కొత్త, పాత పాఠకులిద్దరి కోసం కూడా!

మా అమ్మ మంచి పాఠకురాలు అవడం వల్ల నాకు పుస్తకాలు చదవడం చిన్నప్పటినుంచే అలవడింది. అలా కొన్ని అమ్మ చెప్పగా కథలు రాసాను. నా మొదటి రచన నేను తొమ్మిదో తరగతిలో ఉండగా రాసిన ‘మంచి స్నేహం’ అనే నాటిక. ఆ తరువాత సుమారు ఆరువందలకు పైగా కార్టూన్లు గీసాను. నా పదహారవ ఏట అంటే 1978లో మొదటి కథ (బాలల కథ- బుజ్జాయిలో), మొదటి కార్టూన్ (స్వాతి మాస పత్రిక) లో ప్రచురింపబడ్డాయి. తరువాత కొంత కాలానికి కవిత్వంలో అడుగుపెట్టాను. తీరిక లేని బ్యాంకు ఉద్యోగంలోనూ అప్పుడప్పుడూ రాస్తూ వచ్చాను. దాదాపు అన్ని పత్రికల్లో, కొన్ని వెబ్ మాగజైన్లలో నా రచనలు వచ్చాయి. ‘మనసు భాష’ కవిత సంపుటి, ‘రమణీయం’ కార్టూన్లు, ‘మనసు మనసుకూ మధ్య’ కథా సంపుటి 2011 లోనూ, ‘చినుకులు’ నానీల సంపుటి, ‘తల్లివేరు’ కథా సంపుటి 2021 లోనూ, మాడభూషి రంగాచార్య ట్రస్ట్ కోసం డి. కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్ 2024 లోనూ పుస్తకాలుగా వచ్చాయి. నమస్తే తెలంగాణలో ఆదివారం ‘రమాయణం’ ఫీచర్ రాస్తున్నాను. అది, మరొక కవితా సంకలనం త్వరలో పుస్తక రూపంలో రాబోతున్నాయి. నా అరవై ఏళ్ల జీవితంలో ఒక్క నాలుగేళ్ళు తప్ప మిగతా అంతా పల్లెటూరులోనే ఉన్నాను కనుక గ్రామీణ జీవితాల్ని, ముఖ్యంగా ఆ స్త్రీల విజయ గాథల్ని కథలుగా రాయడం నాకిష్టం..

ప్రశ్న 3. “ఆమె రాసిన కథల్లో.. ఆర్ద్రత నిండినవీ, ఆలోజింపజేసేవీ, చైతన్యపరిచేవీ, ఉత్తేజపరిచేవి, స్ఫూర్తిదాయకమైనవీ, ఫక్కున నవ్వించేవి వుంటాయి! ఏకబిగిన చదివించే ఆమె అందమైన శైలి నాకు ఇష్టం!” – అని డా. అమృతలత గారు వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయంలో కథకి వస్తువు, శిల్పం, శైలిలో ఏది ముఖ్యం? వివరించండి.

జ: నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ నా అభివృద్ధిని కాంక్షించే అమృతలత గారికి సర్వదా కృతజ్ఞురాలిని. కథకు ఏనాడైనా వస్తువే ముఖ్యం. మన భోజనంలో అన్నం, రొట్టె ఎలాగో వస్తువు అలాగన్నమాట. కూరలూ, పప్పూ, చారూ లాంటి ఆధరువులు శిల్పం, శైలీ వంటివి. కథావస్తువే శిల్పాన్ని ఎంచుకుంటుంది. అంటే రచయిత ఎంచుకునేలా చేస్తుంది. ప్రేమ, హాస్య, శృంగార, అపరాధ పరిశోధన, వాస్తవిక, బాలల సాహిత్యానికి ఒక్కో దానికీ ఒక శిల్పం ఉంటుంది. ఇక శైలి.. ఆయా రచయితకే ప్రత్యేకమైన రచనా విధానం. పేరు చూడకుండానే ఈ రచన ఫలానా వాళ్ళది అని పాఠకుడు గుర్తిస్తే ఆ రచయిత శైలి అంత బలమైన ముద్ర కలిగిఉన్నట్టు అర్థం చేసుకోవాలి. నాకు అర్థమయినంతవరకూ మనలో ప్రతి ఒక్కరం వస్తువు అనుకుంటే మన వస్త్రధారణనూ, తయారయ్యే విధానాన్నీ శిల్పం అనీ, మన మాటతీరు, హావభావాలు, దేహభాష మొత్తాన్నీ శైలి అనీ చెప్పొచ్చు.

ప్రశ్న 4. అవసరంకథలో లోన్ రికవరీ కోసం వెళ్ళే మేనేజర్ – కస్టమర్లందరూ మా చుట్టాలూ, ఫ్రెండ్సే కదా అంటుంది. ఈ కథ కల్పితమా లేక ఓ బ్యాంకు మేనేజర్‌గా మీ ఉద్యోగ బాధ్యతలో భాగంగా కోడలి పాత్రగా చిత్రించిన వ్యక్తిని కలిసాకా అల్లిన కథా?

జ: ఈ కథ ముమ్మాటికీ నిజమే. కనీసం సంఘటనలు కూడా కల్పితం కావు. పేర్లు మాత్రమే మార్చాను. వాళ్లకు ఇటీవలే మరో కష్టం కూడా వచ్చిపడింది.

ప్రశ్న 5. ఎంత చేరువో అంత దూరమూకథలో “మీ ఆడవాళ్ళందరూ శ్రీకృష్ణుణ్ని ఆరాధిస్తారు. భర్త మాత్రం శ్రీరాముడిలా ఉండాలనుకుంటారు. ఎందుకని?” అని అరవింద్ అడిగితే, నీలిమ జవాబు చెప్తుంది. తనకి అర్థం కాలేదంటాడు అరవింద్. నీలిమ చెప్పిన జవాబు చదువుతుంటే పైపైన స్ఫురించే అర్థం కన్నా, ఆమె ఆ జవాబు లోని అంతరార్థం చాలా లోతైనదని అనిపిస్తుంది. దాన్ని వివరిస్తారా?

జ: కృష్ణుడు మురళీగానంతో అందరినీ ఆకట్టుకుంటాడు, చిలిపి చేష్టలతో కవ్విస్తాడు, ప్రేమిస్తాడు, అలరిస్తాడు, సమక్షంలో సంతోషం కలిగిస్తాడు. అందుకే స్త్రీలకు కృష్ణుడు ఇష్టుడు. రాముడు రాజారాముడు. ఆయనకు ప్రజలే ముఖ్యం. అయినా బహుభార్యాత్వం మామూలయిన ఆ కాలంలో, ఆనాటి క్షత్రియ కుటుంబాల్లో ఏకపత్నీవ్రతుడుగా ఉన్నందున రాముడికి ఆ ప్రత్యేకత. భర్తగా రాముడి లాంటి వారిని స్త్రీలు కోరుకుంటారు. ఆరాధన వేరు, జీవితం పంచుకోవడం వేరు. ఏ స్త్రీ తన భర్తను ఇతర స్త్రీతో దాంపత్య జీవితం పంచుకోవడాన్ని ఇష్టపడదు. అదే మాట నీలిమ చెప్పింది.

ప్రశ్న 6. తల్లివేరుకథ కరోనా కాలంలో బడుగు/బలహీన వర్గాల వారు ఎదుర్కున్న సమస్యలూ, వాళ్ళల్లో కొందరు ఆ పరిస్థితులకి ఎదురీది ఉపాధి కల్పించుకున్న వైనం చెబుతూనే, ఓ తల్లి తీసుకున్న కఠినమైన నిర్ణయం వెనుక కొడుకుపై ఆపేక్షని వ్యక్తం చేసింది. అయితే వృద్ధురాలైన ఆ తల్లి తనకంటూ కొంత డబ్బు ఉండాలనుకోవడం – కరోనా కాలానికే కాదు, నేటి పరిస్థితులలోనూ అవసరమే అనిపిస్తుంది. వృద్ధాప్యంలోనూ ఆర్థిక భరోసా కీలకమనే విషయం తల్లిదండ్రులకు తెలిసినా; ఉన్నదంతా పిల్లలకి పంచేస్తే, తదుపరి కాలంలో కష్టమవుతుందన్న గ్రహింపు ఉన్నా, తాము జీవించి ఉండగానే ఆస్తులు పంచేయడం వెనుక గత్యంతరం లేకపోవడమే మనం చూస్తున్నాం, వింటున్నాం. ఆస్తులు పంచేస్తే పిల్లలు తమని చూసుకుంటారనే నమ్మకం ప్రస్తుత సమాజంలో బలంగా ఉందంటారా?

జ: ఏ కాలంలోనైనా ఆస్తులు పంచినంత మాత్రాన పిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చూస్తారనే విషయం నిర్ధారణగా చెప్పలేము. అది ఆయా వ్యక్తుల మనస్తత్వాలను బట్టి ఉంటుంది. జీవిత భాగస్వాములపైన ఎక్కువగా, చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులపైన కొంతవరకూ ఆధారపడి ఉంటుంది. వెనకటి రోజుల్లో అన్నీ ఉమ్మడి కుటుంబాలే.. ఎక్కువగా వ్యవసాయ కుటుంబాలే ఉన్నప్పుడు ఉన్న భూమి లోనే తండ్రీ, కొడుకులు పని చేసేవారు. తరతరాలుగా వస్తున్న కులవృత్తి అందరూ చేసేవారు. ఊరిని దాటి బయటికి వెళ్లి బ్రతకడం సాధారణంగా ఉండేది కాదు. బయటి పెత్తనం ఇంటి పెద్దదీ, ఇంట్లో పెత్తనం ఆయన భార్యదీ కనుక.. ఆస్తిపాస్తులు వాళ్ళ చేతుల్లో ఉండేవి కనుక.. వాళ్ళను కొడుకులూ, కోడళ్ళూ గౌరవంతో చూసేవారు, చేతకాని రోజుల్లో సేవ చేసేవారు.

ఒక విధంగా చెప్పాలంటే భారతీయ కుటుంబ వ్యవస్థలో పిల్లలు తల్లిదండ్రుల పెట్టుబడి అన్నమాట. పెద్దవాళ్లకు ఓపిక ఉన్నన్నాళ్లూ వాళ్ళ పిల్లల్నీ, పిల్లల పిల్లల్నీ కూడా సాకేవారు, బాగోగులు చూసేవారు. పెద్దవాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ సంతానం వారిని చూసుకునేవారు. అలా చేయని పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా మందలించేవారు. ఎప్పుడైతే చదువుల ప్రాధాన్యత పెరిగి, నగరీకరణ జరిగి, పారీశ్రామికీకరణ ఎక్కువై, ఉద్యోగావకాశాల కోసం పట్టణాలకు వలసలు పెరిగాయో.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతూ వచ్చింది. అలా విడిగా ఉన్న చిన్న కుటుంబాల సభ్యులు స్వేచ్చలోని ఆనందాన్ని పొంది, ఇక ఎంత మాత్రమూ ఉమ్మడి కుటుంబ అధికారాన్ని భరించలేక పోయారు. తాము స్వయంగా సంపాదించి కూడబెట్టుకున్నాక ఉమ్మడి ఆస్తి అంత విలువైనదిగా కూడా వారిలో కొందరికి అనిపించలేదు. మరోపక్క ఊరిలో ఉన్న ఆస్తి వారికి వంశానుగతంగా లభించేది కూడా! అది కుటుంబంలోని ఇతర సభ్యులకు.. ముఖ్యంగా తోటికోడళ్లకు కినుక తెప్పించింది. ‘వీళ్ళు ఏ సేవా చేయకుండానే ఆస్తి ఎగరేసుకుపోతున్నారు, మేము మాత్రం చాకిరీ చేస్తూ ఇక్కడే పడి ఉన్నాం’ అనే భావన కల్గింది. విదేశీ చదువులు, ఉద్యోగాలు, వలసలు పెరిగాక ఈ దేశంలో ఉండేవాళ్ళకు, ఎన్నారై సంతానానికి కూడా ఇదే వైరుధ్యం ఏర్పడింది. విదేశాల్లో స్థిరపడిన కొడుకులు కొందరు తల్లిదండ్రుల అనారోగ్య సందర్భాల్లో ‘మేమైతే రాలేము, కానీ డబ్బులు పంపుతాము’ అని చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో వేరే రాష్ట్రాల్లో ఉన్నవారూ అదే నిస్సహాయ స్థితిని వెలిబుచ్చుతున్నారు.

ఆడపిల్లల చదువులు పెరిగి, ఆస్తి హక్కులు వచ్చాక కొంతవరకు ప్రేమతోనో, బాధ్యతతోనో, ఆస్తి కోసమో అమ్మాయిలు తమ తల్లిదండ్రుల్ని చూస్తున్నారు. కానీ, వాళ్ళలో ఎక్కువ శాతం వారు అత్తమామల్ని శత్రువులుగానే చూస్తున్నారు. మగవాళ్ళు ‘ఏదేమైనా సరే, మా అమ్మానాన్నల్ని మనం చూసుకోవాల్సిందే’ అనే నిర్ణయం భార్యలతో చెప్పి అమలుపర్చలేక తెలివిగా ‘మా ఆవిడకు చేతకాదు, మాకు కుదరదు. అయినా అదేదో మీరూ, మీరూ.. ఆడవాళ్లు చూసుకోండి, మధ్యలో నన్ను లాగొద్దు’ అనే పలాయనవాదం చేస్తూ మళ్ళీ ఆడవాళ్ళ మీదే నింద వేస్తున్నారు. కొందరు కూతుళ్లు కూడా అంతే! ‘మిమ్మల్ని చూసుకోవడం నాకిష్టమే గానీ, మీ అల్లుడు గారికి ఇబ్బంది అవుతుంది’ అని తప్పుకుంటారు.

ఇంతో అంతో ఆస్తి , డబ్బు ఉన్నవాళ్ళ విషయమే ఇలా ఉంటే.. అవేవీ లేనివాళ్లు, ముందే అన్నీ ఇచ్చేసిన వాళ్ళు, ఇళ్లల్లోంచి వెళ్లగొట్టబడిన వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. తల్లిదండ్రుల, పిల్లల బాధ్యతల పట్ల సమాజం ప్రభావం, మందలింపు, పెద్దరికం పూర్తిగా పోయిన కాలం ఇది. ఆస్తి ప్రసక్తే లేక తల్లిదండ్రుల్ని బాగా చూసుకునే సంతానం కూడా ఎందరో ఉన్నారు. అయితే.. వారి సంఖ్య తగ్గుతున్నది. సమాజంలోని వ్యక్తుల్లో స్వార్థం పెరగడమే ఇందుకు కారణం. వృద్ధాప్యంలో ఎవరైనా డబ్బు తీసుకుని సేవ చేయడానికైనా, ఆరోగ్య అవసరాలకైనా కొంత దాచుకోవడం ఇప్పుడు ఎవరికైనా అవసరమే. పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడంలో ఆస్తి పాత్ర స్వల్పం.

ప్రశ్న 7. ఆశల విత్తనంకథలో “ఎవుసాయం అంటే అంతే, ఎప్పుడూ సాయం కోరుతుంది” అని ఓ పాత్ర అంటుంది. సమాజంలో బాగా ప్రచారంలో ఉన్న – వ్యవసాయంఅనే పేరులోనే సాయం ఉందని, సమాజానికి సాయం చేస్తోందని ఘనంగా చెప్పుకునే మాటలు అర్ధసత్యాలనీ, ఈ వాక్యాలు సూచిస్తున్నాయి. ఈ కథలో వేణు చూపిన మార్గం రైతులందరికీ తెలియాలంటే ఏం చేయాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి?

జ: వ్యవసాయం అంటేనే పూర్తిగా ప్రకృతిపై ఆధారపడే వృత్తి. అతివృష్టి, అనావృష్టి లాంటి బాధలు ఎప్పుడూ ఉంటాయి. ఇవి కాక నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు.. అవి కూడా సకాలంలో దొరక్కపోవడం వంటి సమస్యలు రైతుల్ని పీడిస్తూ ఉంటాయి. పైగా ఏ మాత్రం గ్లామర్ లేని, తక్కువ ఆదాయముండే వ్యవసాయం చేయడానికి యువత.. ముఖ్యంగా చదువుకున్నవాళ్ళు ముందుకు రావడం లేదు. ఇలాగే కొన్నాళ్ళు సాగితే రాబోయే రోజుల్లో పంటలు ఎవరు పండిస్తారు? జనం ఏం తింటారు? అందుకే రైతును కాపాడుకోవడం సమాజానికి చాలా అవసరం.

ఏ వస్తువుకైనా దాన్ని తయారు చేసేవాడే ధరను నిర్ణయిస్తాడు.. ఒక్క రైతు పంటకు దళారీలు, కొనేవాళ్ళు నిర్ణయిస్తారు. అంతేకాదు కూరగాయలు, పళ్ళు లాంటివి రేటు కోసం చూస్తే పాడైపోతాయి. నిలువ చేయడానికి గిడ్డంగులు లేక రోడ్ల పక్కన మార్కెట్లలో పారబోసి కన్నీళ్లతో ఇంటికి తిరిగి వెళ్లే రైతులెందరో! ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి.

ఈ విషయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలానే చేస్తున్నాయి. వ్యవసాయ రుణాలపై చాలా తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. పంట ఋణాలపై మొదటి లక్ష వరకు వడ్డీ ఉండదు, ఆ తరువాత మూడు లక్షల వరకు పావలా వడ్డీయే. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ లాంటి కొత్త నీటి పారుదల పద్ధతులకు, ఎరువులకు, కొన్ని ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. పంటలకు బీమా సౌకర్యం ఉంటుంది.

అయితే, బ్యాంకు అధికారులు గానీ, వ్యవసాయ శాఖ సిబ్బంది గానీ మొక్కుబడిగా పనిచేస్తారే తప్ప రైతులకు అవగాహన కలిగించే కార్యక్రమాలు చేయరు. చాలా మంది రైతులకు వాళ్ళకున్న సౌకర్యాలే తెలియవు. ఎప్పుడో ఎవరో ఋణ మాఫీ చేస్తారని లోన్‌పై వడ్డీ కట్టకుండా, రెన్యూవల్ చేయించుకోకుండా ఎదురుచూస్తుంటారు. తీరా ఋణమాఫీ వచ్చేసరికి అసలు, వడ్డీ.. కొండలా పెరిగిపోతుంది.

అందుకని రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ఇలాంటివన్నీ తెలియజెప్పడం చాలా అవసరం. పల్లెటూర్లలో ఇప్పుడు మహిళలే ఎక్కువగా వ్యవసాయ పనులు చేస్తున్నారు, కూరగాయలు వంటివి పండిస్తున్నారు. మహిళా రైతులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇది చాలా చిత్త శుద్దితో జరగాలి.

ప్రభుత్వ రంగ రేడియో, దూరదర్శన్లు రైతులకు ఉపయుక్తమైన కొన్ని కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి తప్ప ప్రైవేటు రేడియోలు, టీవీ చానళ్ళు ఒక్కటంటే ఒక్కటైనా రైతుల కోసం కార్యక్రమం రూపొందిస్తాయా?! ఒక్క ఈనాడు వారు మాత్రం ఎన్నో ఏళ్ళు ‘అన్నదాత’ పత్రిక నడిపారు. అలా చదువు రాని, చదవలేని రైతుల కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ నడిపే రోజు రావాలి.

ప్రశ్న 8. పేరుకథలోని ఇతివృత్తం చాలా ప్రాక్టికల్. పెళ్ళయ్యాకా, ఆడపిల్లలు ఇంటి పేరు మార్చుకున్న సందర్భంలో – ప్రభుత్వ సర్టిఫికెట్లలలోను, ఆధార్, పాన్ వంటి కార్డులలోనూ పేరు అప్‍డేట్ చేసుకోకపోతే ఎన్ని ఇబ్బందులెదురవుతాయో స్పష్టంగా చెప్పిందీ కథ. ఈ కథలో ఓ అధికారి – బ్యాంకు పరీక్షకి వస్తున్నవారిని పరిశీలిస్తూ – యువతకి ఉద్యోగమన్నా, జీవితమన్నా సీరియస్‍నెస్ లేదు అని వ్యాఖ్యానిస్తుంది. కొందరి స్వభావాలని యువత అందరికీ ఆపాదించలేము కదా?

జ: అవును, ఆపాదించకూడదు! కానీ, ఇది కూడా నేను స్వయంగా చూసాను. ఓ సారి బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్ష ఫిబ్రవరి 14 వేలెంటీన్స్ డే రోజు జరిగినప్పుడు ఆ ప్రవేశ పరీక్షకు వచ్చినవాళ్ళెంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం 28 శాతం. అంటే జీవితానికి ఎంతో అవసరమైన కెరీర్ కంటే, అది కూడా ఓ గంటన్నర పరీక్ష.. దానికన్నా వాలెంటీన్స్ డే రోజు ఎంజాయ్ చేయడం ముఖ్యమయినదా?! ప్రభుత్వరంగ ఉద్యోగాలే లేవని బాధపడుతున్న తరుణంలో రెగ్యులర్‌గా రిక్రూట్ మెంట్ చేసే బ్యాంకు, రైల్వే ఉద్యోగాల పట్ల కూడా కాజువల్‌నెస్ ఉంది. ఇరవై ముప్పై శాతం యువత బాగుంటే మిగతా డెబ్భై ఎనభై శాతం బాగున్నట్లు కాదు కదా!

ప్రశ్న 9. కాలం మారినా..కథ చివర్లో కథ చెప్పే నెరెటర్‍ ఆర్థిక స్వాతంత్ర్యం ఏళ్ళు గడుస్తున్న కొద్దీ అనుభవం వల్ల వస్తుందా? కొందరు స్త్రీలకు ఎప్పటికీ రాదా? లేక కుటుంబంలో అవతలి వాళ్ళను బట్టి కూడా వుంటుందా?’ అని తనని తాను ప్రశ్నించుకుంటుంది.ఆమె మనసుకేదో జవాబు లభించింది. ఆ జవాబేమిటో పాఠకులకి వివరిస్తారా?

జ: స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం కేవలం చదువు వల్ల మాత్రమే రాదు. ఆ చదువు తెచ్చిన ఉద్యోగం లేదా వృత్తి, వ్యాపారాల వల్ల ఎక్కువ శాతం వారికి వస్తుంది. కొందరు కూలీనాలీ చేసుకునే స్త్రీలకు కూడా వారి సంపాదనపై అధికారం ఉంటుంది. మరి కొందరు ఉద్యోగినులు కూడా సంపాదనంతా తెచ్చి భర్త చేతిలో పోయాల్సిందే. తమకు ఇష్టమైన విషయాలపై ఖర్చు చేసే స్వేచ్ఛ ఏమీ ఉండదు. చాలా అరుదుగా కొందరు మగవాళ్ళు తమ సంపాదనంతా భార్య చేతికి ఇస్తారు. అలాంటి సందర్భాల్లో ఆయా గృహిణులకు సంపాదన లేకపోయినా ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటుంది. అయితే స్త్రీలపై అంత నమ్మకం ఉంటేనే పురుషులు వాళ్ళ చేతికి పెత్తనం ఇస్తారు. అలా దొరికిన స్వేచ్ఛను స్త్రీలు దుర్వినియోగం చేసేది తక్కువ. కాబట్టి ఆయా వ్యక్తుల స్వభావాలను బట్టీ, సందర్భాలను బట్టీ ఈ విషయం ఆధారపడి ఉంటుంది తప్ప ఒకటే జవాబు ఉండదు.

ప్రశ్న 10. ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?

జ: ఒక రచయిత్రిగా నాకు బాగా నచ్చితేనే ఏ కథైనా రాయడం జరుగుతుంది. కాకపొతే.. ‘నేల గంధం’, ‘పొద్దుగుంకక ముందే’, ‘ఎంత చేరువో.. అంత దూరమూ’ కథలు వస్తుపరంగా నాకు నచ్చాయి.

ప్రశ్న11. ఈ సంపుటిలోని ఏ కథ రాయడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ‘చెడిపోయిన మనిషి’ కథ రాయడం కొంచెం కష్టమైంది. ఇది తొంబై ఏళ్ల క్రితం నిజంగా జరిగిన కథ. మా అమ్మ చెప్పిన కథ. ఆనాటి భాష, అలవాట్లు, సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుని మరీ రాయాల్సి వచ్చింది. అయితే ఈ కథ చాలా మందికి నచ్చడం నాకు సంతోషాన్ని కలిగించింది.

ఇంకా మెరుగ్గా రాసి ఉంటే బాగుండుననిపించే కథ దాదాపుగా లేదు. ఏ కథనయినా ప్రత్యేకంగా చాలా సార్లు చదివాకే నేను పత్రికలకు పంపుతాను. అయితే పత్రికలు విధించే నిడివి రీత్యా కొన్ని కథలు పదాలను తగ్గించి రాయాల్సి వచ్చింది.

ప్రశ్న12. ‘తల్లివేరు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: ప్రత్యేక అనుభవాలంటూ ఏమీ లేవు. కానీ, ఈ పుస్తకం నన్ను పాఠకులకు బాగా దగ్గర చేసింది. ఇందులోని కథలు కొన్ని సోషల్ మీడియాలో చదివినప్పుడూ, వరంగల్ ఆకాశవాణిలో ప్రసారం అయినప్పుడూ చాలా మంది అభినందించారు. ఎక్కడెక్కడో ఉన్న సామాన్య పాఠకులు సైతం స్పందించడం, ఫోన్ చేసి నాతో మాట్లాడడం నాకు చాలా సంతృప్తిని కలిగించింది. ఇందులోని పద్దెనిమిది కథల్లో తొమ్మిది కథలు వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన పోటీల్లో బహుమతి పొందడమే కాక, ఈ సంపుటికి అరసం వారి ‘ఆచార్య వాసిరెడ్డి భాస్కర రావు స్మారక పురస్కారం’ లభించింది.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు రమాదేవి గారూ.

నెల్లుట్ల రమాదేవి: ధన్యవాదాలు.

***

తల్లివేరు (కథాసంపుటి)
రచన: నెల్లుట్ల రమాదేవి
ప్రచురణ: అపురూప పబ్లిషర్స్,
పేజీలు:197
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడ, హైదరాబాద్. ఫోన్: 9000413413
అచ్చంగా తెలుగు: 85588 99478
అపురూప పబ్లిషర్స్: 9848868068
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/thalliveru
https://books.acchamgatelugu.com/products/talli-veru?sku_id=27366918

 

~

‘తల్లివేరు’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/thalliveru-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here