[శ్రీ మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు రాసిన ‘అమ్మ లేని నాన్న’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]దయం ఏడు గంటలయింది.
ఇంకా కొడుకు కోడలు ఎవరూ లేవలేదు. ఉదయం ఐదు గంటలకే కాఫీ తాగడం అలవాటు ఉన్న రామయ్య గారికి ఇంకా కడుపులో కాఫీ పడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇదే సొంత ఊర్లో అయితే ఈపాటికి రెండోసారి కాఫీ కూడా అయిపోయి ఉండేది. ఆ ఒక్క లోటు జీవితాన్ని ఎంత మార్చేసింది. ఆ లోటు ఏమిటి ఇంతకీ. ఇంకేముంది ఆ వయసులో హఠాత్తుగా భార్య సీతమ్మ గారు చనిపోవడంతో పెట్టే బేడా సర్దుకుని ఇల్లుకు తాళం వేసి ఈ నగరం చేరిపోయాడు కొడుకు దగ్గరికి.
రామయ్య గారి కొడుకు కోడలు ఇద్దరు కూడా ఉద్యోగస్థులే. ఉదయం 9 గంటలకే ఇద్దరు ఆఫీసుకి పరిగెత్తాలి. ఈలోగానే కోడలు కాఫీ టిఫిన్ వంట పూర్తి చేసి బాక్సులు పట్టుకుని రామయ్య గారికి టేబుల్ మీద అన్ని సర్దిపెట్టి ఆఫీసులకు వెళ్ళిపోతారు. రామయ్య గారి కొడుకు ఒక అపార్ట్‌మెంట్‌లో ఐదవ అంతస్తులో కాపురం ఉంటున్నాడు. కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత రామయ్య గారు మటుకు ఏం చేస్తాడు, ఇంట్లో ఏమి తోచట్లేదు. ఎంతసేపని టీవీ చూస్తాడు. ఇక్కడ ఎవరూ తెలియదు. ఏం కాలక్షేపం అవుతుంది పాపం. అయినా తప్పని పరిస్థితి. ఏం చేయలేని కుటుంబ పరిస్థితులు ఇలా ఉంది రామయ్య గారి వృద్ధాప్య జీవితం.
“మావయ్య గారు, గుడ్ మార్నింగ్” అంటూ కాఫీ కప్పు అందించింది కోడలు సరిత. అప్పుడే గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. సీతమ్మ గారు బతికుంటే ఈపాటికి టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేసేది. ఇప్పుడు ఇక్కడ మొదటిసారి కాఫీ తాగుతున్నాను. రెండోసారి కాఫీ ఇచ్చే దిక్కే ఉండదు అనుకుంటూ కాఫీ కప్పు నోట్లో పెట్టుకోగానే పంచదార పానకంలా ఉంది. ఆయనకు అసలే షుగర్. చేసేది ఏమీ లేక అలాగే తాగేసి కప్పు కింద పెట్టేసాడు. పానకంలా తాగడం వాళ్ళకి అలవాటు కాబోలు అనుకున్నాడు రామయ్య గారు.
కాలం ఎవరి గురించి ఆగదు. గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ఇంకేముంది కొడుకు కోడలు – తలుపు వేసుకోండి అంటూ చెప్పి ఆఫీసుకి వెళ్లిపోయారు. వీధి తలుపులు వేసి డైరెక్ట్‌గా బాత్రూంలోకి వెళ్లిపోయి స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు రామయ్య గారు. అక్కడ టిఫిన్ కంచంల్లో పెట్టి పైన మూతపెట్టి ఉంది. ఏం టిఫిన్ అబ్బ అనుకుని మూత తీసి చూసేసరికి ఇంకేముంది తొందరగా అయిపోయే టిఫిన్ బ్రెడ్ ముక్కలు ఫ్రూట్ జాము అక్కడ పెట్టి ఉన్నాయి. ఈ కాలం పిల్లలు రెండు చేతుల సంపాదిస్తున్న కడుపునిండా సొంతంగా చేసుకొని తినే అదృష్టం లేదు. పాపం వాళ్లకు సమయం సరిపోవడం లేదు. వాళ్లకు ఆకలేస్తే క్యాంటీన్ మీద పడి తినేస్తున్నారు. ఓపిక ఉన్న లేకపోయినా రోజుకో వెరైటీ రుచికరంగా చేసి పెట్టేవారు సీతమ్మ గారు. అవన్నీ గుర్తుకొచ్చి రామయ్య గారి కళ్ళలో నీళ్ళు తిరిగేయి.
ఈ ఆఖరి దశలో భార్యాభర్త ఇద్దరిలో ఎవరు లేకపోయినా మిగిలిన వాళ్ళకి జీవితం చాలా కష్టం అనుకుంటూ రామయ్య గారు చాలాసేపు ఆలోచనలో పడిపోయాడు. బాల్యమంతా అమ్మ ఒడిలోనే గడిచిపోతుంది. ఏమీ తెలియని అయోమయ దశ ఇది. చాలా ఆనందంగా సరదాగా గడిచిపోతుంది. ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి అనే పేరుతో భార్య అనే బంధం ఏర్పరుస్తారు. అక్కడి నుంచి మన జీవితం అంతా ఆమె చేతుల్లోనే గడిచిపోతుంది. బాల్యంలో మనం అమ్మకు పసిబిడ్డ అయితే పెళ్లయిన తర్వాత భార్య పెద్ద బిడ్డలా చూసుకుంటుంది. అమ్మ కొంతకాలం వరకే మనతో పాటు ఉంటుంది. భార్య మరి కొంతకాలం ఉంటుంది. ఇద్దరూ పుట్టినప్పటినుంచి మనల్ని కంటికి రెప్పలా చూసుకుని ఒక రకంగా పెంచి పెద్ద వాళ్ళని చేస్తారు. ఇప్పుడు ఎవరూ లేకుండా ఎలాగా జీవితం గడపడం? అన్నింటికీ మూడో వ్యక్తి మీద ఆధారపడాలి. ఆ మూడో వ్యక్తికి మనకి ఏమి రక్తసంబంధం ఉండదు. డ్యూటీలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ బాధ్యతగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరిని ఏమీ తప్పు పట్టలేము. పరిస్థితులు అటువంటివి. ఎప్పుడూ ఉన్నచోటికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, అన్ని సమయానికి అభిరుచి మేరకు అమర్చిపెట్టే భార్య లేకపోతే జీవితం ఎంత కష్టమో ఇలా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు రామయ్య గారు. నరకం అంటే ఎక్కడో లేదు. ఈ లోకంలోనే స్వర్గం నరకం ఉన్నాయి అనుకుని అలా మంచం మీద వాలి నిద్రలోకి జారుకున్నాడు. మెలుకువ వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు అయింది.
బాత్రూంకి వెళ్లి మొహం కళ్ళు చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మూతలు తీసి చూసేటప్పటికి మూకుడులో బంగాళదుంప వేపుడు కుక్కర్లో అన్నం, గిన్నెతో చారు, పక్కనే ఆవకాయ, పెరుగు. కంచంలో అన్నం పెట్టుకుని గబగబా నాలుగు ముద్దలు తిని కంచంల్లో చేతులు కడుక్కుని హాల్లో టీవీ ముందు కూర్చున్నాడు. ప్రతిరోజు మడిగట్టుకోబోయే ముందు సీతమ్మ గారు ఇవాళ ఏమి వండమంటారంటూ ఆప్యాయంగా అడిగేవారు. ఏ రోజు కూడా రెండు రకాలు లేకుండా వంట చేసేవారు కాదు. ఏదో ఒక రకం చేయొచ్చు కదా అంటే మీకు ఆకలి ఎలా తీరుతుంది అండీ అంటూ సమాధానం ఇచ్చే భార్యని గుర్తు తెచ్చుకొని టీవీలో ఛానల్ అటు ఇటు తిప్పుతూ యూట్యూబ్ ఛానల్ లోకి వచ్చాడు. ఏ ఛానల్ చూసినా ఏముంది గర్వకారణం ప్రతి ఛానల్ లోనూ ఆ వృద్ధాశ్రమాల వాళ్ళ తోటి ఇంటర్వ్యూలే. వాళ్ల అడ్వర్టైజ్మెంట్‌లే. ఒకపక్క వృద్ధాశ్రమాలు మూసివేయాలని అందరూ గొడవ చేస్తుంటే మరొక పక్క ఈ ఇంటర్వ్యూలు ఏమిటి. చాలా బాధగా భయంగా ఉంది అనుకుని టీవీ కట్టేసి మళ్లీ మంచం మీద పడుకున్నాడు.
కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే మెలకువ వచ్చింది రామయ్య గారికి. పనిమనిషి వచ్చేటప్పుడు చేతిలో ఒక ప్లాస్క్ పట్టుకుని వచ్చింది. అయ్యగారు టీ తాగండి అంటూ ఫ్లాస్క్ లోనుంచి కప్పులోకి పోసి ఇచ్చింది. రోజుకొకసారి వస్తుంది పనిమనిషి అది కూడా సాయంకాలం పూట. అమ్మా డైనింగ్ టేబుల్ మీద ఉదయం నేను తిన్న టిఫిన్ ప్లేట్లు అన్నం తిన్న కంచం ఇంకా మిగిలిన సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి. అవన్నీ తీసుకో అని చెప్పాడు రామయ్య గారు. లేదండి అయ్యగారు అమ్మగారు డైనింగ్ టేబుల్ నన్ను ముట్టుకునివ్వరు. మరి రోజు ఏం చేస్తున్నావ్ అని అడిగాడు రామయ్య గారు. నేను రోజు ఉదయం అమ్మగారు ఉన్నప్పుడే వస్తాను. మీరు వచ్చిన దగ్గరనుంచి సాయంకాలమే రమ్మని అమ్మగారు చెప్పారు అని సమాధానం చెప్పింది పనిమనిషి. ఇంక రామయ్య గారు చేసేదేమీ లేక డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ పనిమనిషికి వేసేసాడు. సామాన్లన్నీ కడిగేసి ఇల్లు తుడిచి అరగంట తర్వాత పని అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పటికి సమయం ఏడు గంటలు అయింది. వీధి తలుపు వేయబోతుంటే కొడుకు కోడలు గుమ్మంల్లోకి అడుగు పెట్టారు. ఈలోగా రామయ్య గారికి కడుపు మండిపోతోంది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక కప్పు టీ తప్ప ఇంకేమీ తినలేదు. నీరసంగా కూడా ఉంది. అక్కడ ఉండేటప్పుడు నిద్ర లేచి లేవగానే తినడానికి ఏదో ఒక చిరుతిండి చేసి అల్మారాలో పెట్టేది సీతమ్మ గారు. రామయ్య గారికి చిరుతిండి అంటే ఇష్టం. ఇక్కడ ఏమున్నాయో రామయ్య గారికి తెలియదు. ఇంతలో కొడుకు కోడలు స్నానం చేసి వచ్చి మావయ్య గారు టిఫిన్ చేద్దాం రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచింది కోడలు. మరి అదేమిటి వంటింట్లో టిఫిన్ చేసిన అలికిడి ఏమీ లేదు. కోడలు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయింది కదా. అంటే బజారు నుండి తీసుకొచ్చారు అన్నమాట అనుకుని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కుని కూర్చున్నారు రామయ్య గారు.
కోడలు బ్యాగ్ లోంచి మూడు పొట్లాలు తీసి ఒక పొట్లం రామయ్య గారికి ఇచ్చింది. ఆ ప్యాకెట్ విప్పగానే మసాలా వాసన గుప్పుమని కొట్టింది. తీరా చూస్తే అది చపాతి కూర. బలవంతంగా అలాగే ముక్కలు తెంచుకొని గట్టిగా నములతూ టిఫిన్ అయిందనిపించారు రామయ్య గారు. కోడలు ఇచ్చిన గ్లాసుడు మజ్జిగ తాగి అందరూ ఎవరు బెడ్ రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు.
ఇలా మూడు నెలలు గడిచేయి. తెల్లవారడం పొద్దుగూకడం తప్ప రామయ్య గారి దినచర్యలో ఏ మార్పు లేదు. ఆ హోటలు టిఫిన్ తినలేక రెండు మూడు సార్లు జ్వరం కూడా వచ్చింది రామయ్య గారికి. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా అని ఆలోచించుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. చేతిలో డబ్బు ఉంది. ఊరిలో ఉండడానికి ఇల్లు ఉంది. అరుగు మీద కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది. మరి తనని చూసుకోవడానికి మనిషిని చూడమని ఊర్లో ఉన్న తమ్ముడికి ఉత్తరం వ్రాసి పనిమనిషి ద్వారా పోస్ట్ చేయించాడు. తమ్ముడు దగ్గర్నుంచి తిరుగు టపాలో సమాధానం వచ్చింది వెంటనే బయలుదేరి రమ్మని. ఇదే విషయం కొడుకుకి చెబితే చూడు “నాన్నా అందరు నన్ను తప్పుగా అనుకుంటారు. నేను నిన్ను చూడట్లేదని నిందలు వేస్తారు. తండ్రిని ఇంట్లోంచి పంపించేసాడని దోషిగా నిలబెడతారు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఎలాగా. మాకు ఇద్దరికీ ఉద్యోగాలు తప్పవు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తే గాని ఇక్కడ గడవదు. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నావు. నాకు అర్థమైంది” అంటూ ఎంత నచ్చచెప్పినా రామయ్య గారు వినిపించుకోలేదు.
“చూడరా నీ గురించి కోడలు గురించి ఇక్కడ పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందువల్ల పెద్ద వాళ్ళకి ఈ ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కుటుంబాలన్నీ విడిపోయి నగరానికి వచ్చేసి ఎవరితన్న వాళ్ళు బతుకుతున్నారు. కన్న తల్లిదండ్రులు అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉండదు. ఎక్కడో మూర్ఖులు తప్పితే. నేను నిన్ను తప్పు పట్టట్లేదు. ఎవరి పరిస్థితి వాళ్ళది. అక్కడ పరిస్థితులను బట్టి మనం తప్పొప్పులు నిర్ణయించాలి. చూడు నా అవసరాలు చూడడానికి అక్కడ బాబాయ్ మంచి మనిషిని చూసాడు. ఇదివరలో అతను మన పొలంలో పాలేరు కింద పని చేసేవాడు. మనం అంటే భయం భక్తి. పాపం నాకంటే 15 సంవత్సరాల వయసు చిన్నవాడు. ఏ పని చేయలేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. అందుకే అతనికి సహాయం చేసినట్టు ఉంటుందని నా అవసరం తీరినట్టు ఉంటుందని నేను బాబాయ్ ద్వారా అడిగించాను. అంతేకాదు నాకు అతను ఏమి వండి పెట్టక్కర్లేదు. బాబాయ్ గారి ఇంటి దగ్గర నుంచి క్యారేజీ వస్తుంది. ఇలా ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నా గురించి ఏమి దిగులు పడకు. నీకు చూడాలని అనిపించినప్పుడల్లా వచ్చి వెళ్ళు. రోజు నేను ఇక్కడ తోచడం లేదని బాధపడుతూ కూర్చుంటే ఏమి ఉపయోగం అని ఈ నిర్ణయం తీసుకున్నాను
అంతేకాకుండా నేను ఏ వృద్ధాశ్రమంల్లోనూ చేరితే నీకు తలవంపు. అంతేగాని నేను నా ఇంట్లో ఉంటే తప్పేముంది” అంటూ చెప్పకు వచ్చాడు రామయ్య గారు.
రామయ్య గారి కొడుకు చేసేదేమి లేక తండ్రిని సొంత ఊర్లో వదిలేసి అన్ని ఏర్పాట్లు చేసి దిగులుతో ఇంటికి చేరాడు. “ఏవండీ కొడుకు దగ్గర నుండి వచ్చేసారు?” అని ఎవరైనా అడిగితే నగరంలో వాళ్ళు పడుతున్న కష్టాలు ఉద్యోగాలు ఆ ట్రాఫిక్కు వాటి గురించి అరుగు మీద కూర్చుని అడిగిన వాడికి అడగనివాడికి కూడా చెప్పి కాలక్షేపం చేసుకుంటున్నాడు రామయ్య గారు. అలా కొంతకాలం ఉండి రామయ్య గారు మంచం పట్టి కన్నుమూశారు.
‘నాన్న నన్ను దోషిగా నిలబెట్టలేదు ఎవరి ముందు. పరిస్థితులు బాగా అర్థం చేసుకున్నాడు. ఒక రకంగా సర్దుకుని వెళ్ళిపోయాడు. ఉన్న పరిస్థితిని తనకు అవకాశంగా మార్చుకున్నాడు. ఎంత మంచి మనిషి’ అని కొడుకు యథావిధిగా రామయ్య గారి కర్మకాండలు జరిపించాడు. ఊళ్లోని పెద్దలందరూ కూడా “మీ నాన్న మాకు ఆదర్శమూర్తి రా, ముసలితనంలో కూడా స్వతంత్రంగా బతకమని చెప్పకనే చెప్పాడు” అంటూ కొనియాడారు.