ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -10

0
3

[box type=’note’ fontsize=’16’] హాస్యమూ, సస్పెన్స్ మేళవించి పొత్తూరి విజయలక్ష్మి అందిస్తున్న డిటెక్టివ్ రచన ‘ఏమవుతుందో? ఎటుపోతుందో? ఏమో!!’ పదవ భాగం. [/box]

[dropcap]కా[/dropcap]రు ఆగిపోయింది. అందులో చిక్కుకున్న వినాష్ కాస్త తేరుకుని తనని తాను చూసుకున్నాడు. బెల్ట్ ఉండటం వల్ల కాళ్ళూ చేతులు బాగానే వున్నాయి.

కాకపోతే చెంప దెబ్బలు తినటం వల్ల మొహం వాచిపోయింది. గుండ్రంగా తయారయింది.

నెమ్మదిగా బెల్ట్ విప్పుకుని అప్పుడు ఏం చెయ్యాలో పుస్తకం తీసి వెతికాడు.

‘అటువంటి సమయంలో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుని మీద భారం వేసి కూచో. ఎవరైనా బయటి నుండి నిన్ను బయటికి తియ్యాలి’ అని ఉంది. వినాష్‌కి ఏడుపు వచ్చింది.

‘ఈ అడవిలో ఎవరొస్తారు? ఒకవేళ వచ్చినా మామూలుగా తలుపు తీసి తనని బయటకు తియ్యటానికి ఇది మామూలు కారు కాదాయెనూ. ఆటోమేటిక్ వ్యవహారం. ఇందులో వున్నది యజమాని కాదు. దొంగ అని అపోహ పడి మరీ కఠినంగా ఉంది. ఇక మరణమే శరణ్యం’ అనుకుంటూ వుండగా ఫోన్ మోగింది. తండ్రి.

“నాన్నగారూ” అంటూ ఏడిచాడు.

“వద్దురా నాయనా అంటే వినవు. ఇంతకూ ఎక్కడున్నావ్ నువ్వు?”  అన్నాడు శాంత కుమార్.

“ఏమోనండీ. ఓ అడవిలో వున్నాను. కారులో ఇరుక్కున్నాను కాబట్టి ఇంతకంటే వివరాలు నేనేం చెప్పలేను. మీరే కనుక్కోవాలి నేనెక్కడ ఉన్నానో”  అన్నాడు నిస్సహాయంగా.

శాంత కుమార్ తన ప్రయత్నాలు ప్రారంభించాడు.

పోలీసుల సహాయం అడిగాడు. “అదెంత పని? సెల్‌ఫోన్ ఎక్కడ నుంచి వాడుతున్నాడో తెలిస్తే కనిపెట్టటం కష్టం కాదు” అన్నారు.

వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టారు గానీ అక్కడ వినాష్ ఫోన్‌లో చార్జి అయిపోయింది.

“ఇప్పుడు కనిపెట్టటం కాస్త కష్టం. అయినా ట్రై చేస్తాం” అన్నారు.

రెండు రోజుల గడిచాయి. వినాష్ కొన ప్రాణాలతో వున్నాడు.

అప్పుడు జరిగింది ఓ అద్భుతం.

ఓ అడవిజాతి వారు ఆ అడవిలో నివసిస్తూ వుంటారు. వారికి ఒక ఆచారం వుంది.

వర్షాకాలం ఆరంభంలో వివాహం కాని పిల్లలు అందరూ అడవిలో దాక్కుంటారు.

యువకులు వారిని వెతికి వారిని ఆలింగనం చేసుకుంటే ఇక వారు దంపతులు అయినట్లే.

ఆ ఏడాది కూడా ఆడపిల్లలు అందరూ తలో వైపూ వెళ్లారు.

ఆ తెగ నాయకుడి కుమార్తె జంబూక ఓ వైపు వెళ్లింది.

దూరంగా ఒక వింత ఆకారం కనిపిస్తే అటు వెళ్ళింది. ఏనుగు చచ్చి పడి వుంది అనుకుంది. కానీ అది ఏనుగు కాదు. లోపల ఇంకో ఆకారం.

రాయి తీసుకుని అతికష్టం మీద అద్దం బద్దలు కొట్టి ఆ మనిషిని బయటకు లాగింది.

కొన ప్రాణాలతో వున్న వినాష్ తనకు సాయం చేసిన ఆ వ్యక్తిని  అప్రయత్నంగా కావలించుకున్నాడు.

మరుక్షణం  ‘ఆ హ్హహ్హయో ఆ హహ్హయో’ అని దిక్కులు అదిరి పోయేలా కేకలు పెట్టింది జంబూక.

తనకు వివాహం అయితే అలా కేకలు పెట్టటం వాళ్ళ ఆచారం…

(తరువాత కధ మళ్ళీ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here