[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘బ్రహ్మ భూత స్థితి’ అనే రచనని అందిస్తున్నాము.]
శ్లో:
ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్।
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్॥
(భగవద్గీత 6 వ అధ్యాయం, 27 వ శ్లోకం)
[dropcap]మ[/dropcap]నస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ, కావేషాలు, మానసిక ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు, మరియు జీవితంలో జరిగే ఘటనలన్నింటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది అన్నది పై శ్లోకం భావం.
మన ఆలోచనలు, మనస్సు, మాటలు మరియు క్రియలు అన్నీ భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడు, మనం పరమ సత్యమైన భగవంతుని పరిపూర్ణమైన దశను పొందగలము. ఆ దశను బ్రహ్మ భూత దశ అంటారని, ప్రతీ మానవుడు ఆ స్థితిని చేరుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని శాస్త్రం బోధిస్తోంది.
అలా అతీతంగా స్థితమై ఉన్నవాడు ఒక్కసారిగా పరమ బ్రహ్మాన్ని గ్రహించి పూర్తిగా ఆనందిస్తాడు. అతను ఎప్పుడూ ఏదయినా విలపించడు లేదా ఏదైనా కావాలని కోరుకోడు. అతను ప్రతి జీవి పట్ల సమానమైన వైఖరిని కలిగి ఉంటాడు. ఆ స్థితిలో అతను నా పట్ల స్వచ్ఛమైన భక్తిని పొందుతాడు అని భగవానుడు మానవాళికి భగవద్గీత ద్వారా చాలా స్పష్టంగా దిశా నిర్దేశం చేసాడు.
మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం అంటే వెనక్కి తీసుకొని చేసి, భగవంతుని యందే స్థితం చేయటానికి అభ్యాసం చేయటాన్ని సాధించిన యోగికి ఆవేశ-ఉద్వేగాలు శాంతిస్తాయి మరియు మనస్సు పరమ శాంతిని పొందుతుంది అని పతంజలి యోగశాస్త్రం కూడా చెబుతోంది.
వేదాలు మానవునికి రెండు రకాల వృత్తిని నిర్దేశించాయి. మొదటిది ప్రవృత్తి-మార్గం లేదా ఇంద్రియ ఆనంద మార్గం మరియు రెండవది నివృత్తి-మార్గం లేదా త్యజించే మార్గం అని పిలుస్తారు. ఆనందించే మార్గం హీనమైనది మరియు సర్వోన్నతమైన కారణం కోసం త్యాగం చేసే మార్గం ఉన్నతమైనది, మానవళికి సదా అనుసరణీయమైనది.
బ్రహ్మ-భూత దశ అంటే న శోచతి న కాక్షతి. సాధకునికి ఎటువంటి భౌతికమైన కోరికలు వుండవు. సుఖ దుఖాలు, కష్ట నష్టాల వంటి ద్వంద్వాలలో కూడా సర్వం వాసుదేవమయం అంటూ నిశ్చలంగా వుంటాడు. సదా ప్రసాద భావంతో జీవిస్తాడు.
మన అంతర్గత అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు, అది, మన మనస్సు నియంత్రించబడుతుండటానికి మరియు మన అంతఃకరణ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నదనుకోవటానికి ఒక నిదర్శనం.