[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[1882వ సంవత్సరంలో ఆంగ్లేయులు ‘మద్రాస్ ఫారెస్టు యాక్ట్’ను అమల్లోకి తేవడం వల్ల అరణ్యవాసుల స్వేచ్ఛా సంచారానికి అంతరాయాలు, ఆంక్షలు ఏర్పడ్డాయి. కోయలు, భిల్లులు వారి సహజ వనజీవిత విధానానికి దూరమై ఇబ్బందులు ఎదుర్కుంటారు. 1921 నాటికి సహాయనిరాకరణోద్యమం వైపు ఆకర్షితులయిన అల్లూరి సీతారామరాజుకు గాంధీ గారి అహింసామార్గం నచ్చదు. 1921 జూలైలో చిట్టగాంగుకు వెళ్ళి అక్కడ జరిగిన బెంగాల్ విప్లవకారుల రహస్య సమావేశంలో పాల్కొంటారు. అక్కడ్నించి తిరిగొచ్చాకా, 1922 జనవరి నుంచి ‘రంప’ ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. గిరిజనులకు ప్రియతమ నాయకుడవుతారు. ఓ సాయంత్రం అద్వైత్, రాఘవ గోదావరి ఒడ్డుకు వ్యాహ్యాళికి వస్తారు. సెలవయిపోయింది వెళ్ళాలని రాఘవ అంటే, జాగ్రత్తగా మసులుకో అని ఎప్పుడూ చెప్పే జాగ్రత్తలు చెప్తాడు అద్వైత్.ఇంతలో అక్కడ సుమతి, పాండురంగ కనిపిస్తారు వారికి. వారివురు ప్రేమించుకుంటున్నామని, ఇంట్లో పెద్దలని ఒప్పించి, తమ వివాహం జరిపించమని అడుగుతారు. సరేనంటారు అద్వైత్, రాఘవ. నలుగురూ ఇళ్ళకి వెడుతుందగా, ఇండియా తన అమ్మమ్మతో వారికి ఎదురవుతుంది. వారిని అమ్మమ్మకి పరిచయం చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటే, ఇండియా చూపులు అద్వైత్ మీదే నిలవటం చూసిన అమ్మమ్మ, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. అవునంటుంది, అయినా మా పెళ్ళి జరగదులే అంటుంది. ఎందుకు అని అమ్మమ్మ అడిగితే, మతాలు వేరు ఆచారాలు వేరు. నా వల్ల అద్వైత్ ఇబ్బంది పడకూడదు అని అంటుంది. అద్వైత్‍ని లండన్ తీసుకువెళ్ళి అక్కడి తమ స్కూల్స్‌లో డాన్స్ పాఠాలు చెప్పించే విషయం నరసింహశాస్త్రిగారిని అడగమని అమ్మమ్మకి గుర్తు చేస్తుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 25:
[dropcap]మ[/dropcap]రుదినం సాయంత్రం డాన్స్ క్లాస్‍కు వచ్చిన ఇండియాతో ఆండ్రియా ఆమె తల్లి మేరీ.. నరసింహశాస్త్రి గారిని చూచేదానికి వచ్చారు. వారు తమ శిష్యుల శిష్యురాండ్రతో చేయించే నాట్యాన్ని ఆ తల్లీ కూతుళ్ళు తిలకించారు.
ఆ ప్రదర్శనానంతరం.. పిల్లలు గురువుగారి వద్ద శలవు తీసికొని వెళ్ళిపోయారు.
ఆండ్రియా మేరీ నరసింహశాస్త్రిగారిని సమీపించారు.
“సార్.. యు హ్యా గివన్ ఎక్సలెంట్ ట్రయినింగ్ టు మై గ్రాండ్ డాటర్. థ్యాంక్స్ ఎలాట్ సర్..” ఎంతో వినయంగా ఆనందంగా చెప్పింది ఆరుపదుల మేరీ.
“మేడమ్!.. యువర్ గ్రాండ్ డాటర్ ఇండియా యీజ్ వెరీ వెరి ఇంటిలిజెంట్ అండ్ హ్యూమరస్ గర్ల్.. యు షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హర్” చిరునవ్వుతో చెప్పాడు నరసింహశాస్త్రిగారు.
“గురూజీ!.. మా అమ్మమ్మగారు మీతో మాట్లాడాలని వచ్చారు” తెలుగులోనే చెప్పింది ఇండియా.
“విషయం ఏమిటమ్మా!..” అడిగారు శాస్త్రిగారు.
ఇండియా తన తల్లి అమ్మమ్మల ముఖంలోకి చూచింది. ఆ చూపుల అర్థం.. వచ్చిన విషయాన్ని గురించి చెప్పమని.
ఇంతలో సావిత్రి ట్రేలో నాలుగు కాఫీ గ్లాసులతో వారు కూర్చొని వున్న వరండాలోకి వచ్చింది. ఆమె వెనకాల వసుంధర కూడా వచ్చింది. సావిత్రి నలుగురికీ కాఫీ అందించింది. కాఫీ తాగి గ్లాసులు క్రింద వుంచబోయిన వారి చేతుల నుంచి సావిత్రి అందుకొంది.
సావిత్రిని క్షణంసేపు చూచి.. “మై వైఫ్ సావిత్రి…” మేరీ ముఖంలోకి చూస్తూ చెప్పాడు నరసింహశాస్త్రి. “ఓ.. టూ బ్యూటిఫుల్.. కాఫీ.. ఎక్స్‌లెంట్.” నవ్వుతూ చెప్పింది మేరీ.
సావిత్రి మేరీని చూచి నమస్కరించింది నవ్వుతూ.
మేరీ ప్రతినమస్కారం చేసింది.
“సార్!.. మై మదర్ విల్ బీ హియర్ ఫర్ వన్ మంత్. దెన్ షి విల్ గో బ్యాక్. యిన్ లండన్ షి యీజ్ రన్నింగ్ ట్వల్వ్ స్కూల్స్. దేర్ ఇన్ స్కూల్స్.. షి వాంట్ టు యింట్రడ్యూస్ డాన్స్ క్లాసెస్..” ఆండ్రియా పూర్తి చేయక మునుపే.. “సార్!.. యు ప్లీజ్ సెండ్ యువర్ సన్ అద్వైత్ విత్ మి. ఫర్ మై స్కూల్స్ హి విల్ బీ ద డాన్స్ మాస్టర్. అకామిడేషన్.. గుడ్ శ్యాలరీ.. కన్వేయన్స్, అల్ విల్ బీ ప్రొవైడెడ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ యిన్ ఆల్ రెస్పెక్ట్స్. డోంట్ వర్రీ” తాను వచ్చిన విషయాన్ని వివరంగా చెప్పింది మేరీ.
నరసింహశాస్త్రి సావిత్రి ముఖంలోకి చూచాడు క్షణంసేపు. మేరీ చెప్పిన విషయం లెవన్ వరకూ చదివిన సావిత్రికి అర్థం అయింది. ముఖం విలవిల పోయింది.
ఆంగ్లభాష అర్థం కాని.. వసుంధర వారిని వింతగా చూస్తూ కూర్చుంది. కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా జరిగిపోయాయి. ఇండియా సావిత్రి ప్రక్కకు చేరింది. తన తలను వంచి ఆమె చెవి దగ్గర చేర్చి.. “చిన్న గురువుగారూ!.. సీతా ఎక్కడ?..” మెల్లగా అడిగింది.
“వారు ఇంకా స్కూలు నుంచి రాలేదు. ఏదో మీటింగ్ అట. ఆలస్యంగా వస్తారు” సావిత్రి కూడా ఇండియా లాగే మెల్లగా చెప్పింది. ఖాళీ కాఫీ గ్లాసులను తీసికొని ఇంట్లోకి వెళ్ళింది సావిత్రి.
ఇండియా ఆమెను అనుసరించింది. గ్లాసులను ట్రేని వంట యింట్లో వుంచి వెను తిరిగింది సావిత్రి.
నవ్వుతూ తలుపు దగ్గిర ఇండియా నిలబడి వుంది. అమాయకమైన ఆమె ముఖాన్ని.. అందులో కనుపించే చిరునవ్వును చూచిన ఎవరికైనా మనస్సుకు ఆనందం కలుగుతుంది. సావిత్రి పరిస్థితీ అదే. తనూ నవ్వుతూ ఇండియాను సమీపించింది.
ఇంతవరకూ ఇండియా.. కొంతకాలం మొదట్లో సావిత్రిని.. మేడం, అని.. తాను తెలుగు బాగా నేర్చుకొన్న తర్వాత.. ‘అమ్మా’ అని పిలిచేది.
యీనాడు సావిత్రిని అత్తయ్యా అని పిలవాలనిపించింది. ఇండియాకు.
తన్నే పరీక్షగా చూస్తున్న ఇండియాను చూచి సావిత్రి.. “ఏం వింతగా చూస్తున్నావ్, ఇది పాత ముఖమే!..” నవ్వుతూ అంది సావిత్రి.
“నేను..” ఆగిపోయింది ఇండియా.
“చెప్పు. ఏమన్నా కావాలా!..”
“వుహూ!.. ఏమీ ఒద్దు.. కానీ..” చెప్పడం ఆపేసింది.
“నా ముందు నీకు ఎందుకు భయం!.. ఏం చెప్పదలచుకొన్నావో నిర్భయంగా చెప్పు..” అంది సావిత్రి.
“మీరు తప్పుగా అనుకోరుగా!..”
“నీ గురించి ఏనాడూ అనుకోను..”
“మరి..”
“ఆపావేం, చెప్పు..”
“మిమ్మల్ని..”
“నన్ను!..” ఆశ్చర్యంగా ఇండియా ముఖంలోకి చూచింది సావిత్రి
“సీతలా!..”
“సీతలా!..”
“అత్తయ్యా అని పిలవచ్చా!..” వేగంగా అనేసింది ఇండియా. సావిత్రి ఆశ్చర్యంతో ఇండియా ముఖంలోని చూచింది. ఇండియా తప్పుగా మాట్లాడానా.. అనే భయంతో తల దించుకొంది.
సావిత్రి ఆమెకు మరీ దగ్గరగా జరిగి ఆమె చుబుకాన్ని పట్టుకొని తలను పైకెత్తి..
“అమ్మా ఇండియా!.. చూడు, నీవు నన్ను ఎలా పిలవాలనుకొంటే అలా పిలు. నేను ఆనందంగా పలుకుతాను. కారణం.. నీ మనస్తత్వం నీవు చేసే మంచి పనులు.. నీ తెలివితేటలు.. నాకు ఎంతగానో నచ్చాయి. నా నీవు.. సీతా నా దృష్టిలో నాకు
రెండు కళ్ళు లాంటివారు” ఆనందంగా చెప్పింది సావిత్రి.
“ధన్యవాదాలు అత్తయ్యా!..” సంతోషంతో ఇండియా ఆమె భుజంపై వాలి పోయింది.
ఆండ్రియా మేరీ నరసింహశాస్త్రి.. తమ అభ్యర్థనకు ఏం జవాబు చెబుతాడోనని ఆత్రుతతో చూస్తున్నారు. అంతవరకూ వారి అర్థంకాని మాటలను విన్న వసుంధర.. ముగ్గురి ముఖాల్లోకి చూచింది. నరసింహశాస్త్రిగారి మౌనాన్ని.. వారి ముఖాల్లోని ఆత్రుతను చూచి..
“ఒరేయ్!.. తమ్ముడూ!.. వాళ్ళు నీతో ఏ విషయాన్ని గురించి మాట్లాడారురా!..” అడిగింది వసుంధర. “తర్వాత.. నీకు విపులంగా చెబుతానక్కా!..” వసుంధర ముఖంలోకి చూచి చెప్పాడు. దృష్టిని ఆండ్రియా మేరీల వైపు మళ్ళించి..
“మేడం!.. ప్లీజ్ గివ్ మి సమ్ టైమ్. నా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాను” ఇంగ్లీష్ చెప్పాడు.
“ఓకే సార్!.. నో ప్రాబ్లమ్.. బట్ దట్ షుడ్ బీ పాజిటివ్!..” చిరునవ్వుతో చెప్పింది మేరీ.
‘సరే’ అన్నట్లు తల ఆడించాడు నరసింహశాస్త్రి.
“సార్!.. అద్వైత్ యీజ్ వెరీ గుడ్ బాయ్. హి విల్ గెట్ సక్సస్ వేరెవర్ హి గో” చెప్పింది ఆండ్రియా నవ్వుతూ.
సావిత్రి.. ఇండియా వరండాలోకి వచ్చాడు.
ఆండ్రియా.. మేరీ కుర్చీల్లోంచి లేచారు.
“సార్!.. వుయ్ విల్ టేక్ లీవ్…” అంది మేరీ.
“ఓకే మేడం!..” చెప్పాడు నరసింహశాస్త్రి.
ఇండియా తల్లిని సమీపించింది. “వాట్ హి సెడ్ మమ్మీ!..” మెల్లగా అడిగింది.
“టుమారో!..” అంది క్లుప్తంగా ఆండ్రియా.
ఇండియాకు విషయం అర్థం అయింది.
ముగ్గురూ మెట్లు దిగారు. నరసింహశాస్త్రి వారిని అనుసరించాడు.
వీధి గేటును తెరచుకొని ముందు అద్వైత్.. వెనకాల సీత లోనికి వచ్చారు.
ఆండ్రియాకు.. మేరీకి విష్ చేశాడు అద్వైత్. వారిరువురినీ ఆశ్చర్యంతో.. చూచింది సీత. ‘వీరు ఎందుకు వచ్చారో…’ అనుకొంది.
సీతను చూస్తూ అద్వైత్.. “సీతా!.. వారు ఇండియా అమ్మమ్మగారు!..” చెప్పాడు.
సీత తల ఆడించి మేరీ ముఖంలోకి చూచి యాంత్రికంగా నవ్వింది.
‘ఒరేయ్!.. బావా.. వారి పరిచయం నాకు అవసరమా!..’ అనుకొంది.
“సీతా!.. ఎలా వున్నావ్!..” మామూలుగా అడిగింది ఇండియా.
“రోజూ చూస్తూనే వున్నావుగా!.. నీవే చెప్పాలి నాలో నీకు ఏదైనా మార్పు కనిపిస్తే!..” వెటకారంగా అంది సీత.
ఆమె భాషణ అద్వైత్‌కు నచ్చలేదు. కళ్ళు కాస్త పెద్దవిగా చేసి సీత ముఖంలోకి చూచాడు. సీత వేగంగా యింటివైపుకు నడిచింది.
‘యీ మూర్ఖుడు నా మనస్సును అర్థం చేసుకోకుండా కళ్ళతోనే నన్ను బెదిరించి చంపాలని చూస్తాడు’ గొణుక్కుంటూ మెట్లెక్కి కుర్చీలో వసుంధరకు ఎదురుగా కూర్చుంది.
సీత వాలకాన్ని చూచిన సావిత్రి..
“ఏమ్మా!.. బాగా అలసటగా వుందా!.. వెళ్ళి స్నానం చెయ్యి. భోంచేసి పడుకొని విశ్రాంతి తీసుకొందువుగాని” అభిమానంతో అంది సావిత్రి.
కళ్ళరెప్పలు పైకెత్తి సావిత్రి ముఖంలోకి చూచి.. ‘నా గోడు నాది నీ గోడు నీది..’ అనుకొని.. “అలాగే అత్తయ్యా!..” చెప్పి లేచి లోనికి పోయింది.
నరసింహశాస్త్రి గారికి నమస్కారించి ఆ ముగ్గురూ కారు ఎక్కారు.
ఇండియా నడపగా కారు ముందుకు వెళ్ళింది.
తండ్రీ కొడుకులు వరండాలోకి వచ్చారు.
వీధి గేటును తెరచుకొని రెడ్డిరామిరెడ్డిగారూ!.. వారి బావమరది శేషారెడ్డిగారు లోనికి వచ్చారు. శాస్త్రిగారు వారిని సాదరంగా ఆహ్వానించారు.
ఆ ఇరువురూ కుర్చీల్లో కూర్చున్నారు.
“శాస్త్రిగారూ!.. సర్వేశ్వరుని దయ వలన యజ్ఞాన్ని జయప్రదంగా ముగించాము. వరుణుడు కరుణించాడు. భూమాత చల్లబడింది. చెరువులు నిండాయి. వ్యవసాయదారులు దున్నకాలను ప్రారంభించారు. మనం లోగడ అనుకున్న ప్రకారం పై సోమవారం మన కాశీ ప్రయాణం. రిజర్వేషన్ అయిపోయింది. యీ విషయాన్ని తమరికి తెలియజేయాలని వచ్చాను” చిరునవ్వుతో చెప్పాడు రామిరెడ్డి.
“అలాగా!..”
“అవును..”
“అక్కా!.. విన్నావా!.. నీ చిరకాల జీవిత ఆశయం మన రామిరెడ్డిగారి మూలంగా నెరవేరబోతూవుంది” చిరునవ్వుతో చెప్పాడు నరసింహశాస్త్రి.
“నాయనా!.. రామిరెడ్డి!.. నాకు చాలా సంతోషం. నీ మూలంగా ఆ కాశీ విశ్వేశ్వరుని జగన్మాతనూ దర్శించబోతున్నాను. నీవు నీ కుటుంబం పరివారం పదికాలాల పాటు చల్లగా వర్ధిల్లుతారయ్యా!..” ఆనందంగా చెప్పింది వసుంధర.
సింహద్వారం ప్రక్కన నిలబడి వున్న సావిత్రి ముఖంలోకి చూచాడు నరసింహశాస్త్రి. వారు చూపులోని ఆంతర్యాన్ని గ్రహించిన సావిత్రి వంట ఇంట్లోకి పోబోయింది.
ఆమె చేయబోయే చర్యను గురించి ఎరిగివున్న రామిరెడ్డి.. “అమ్మా!.. యిప్పుడే యిద్దరం యింట్లో కాఫీ తాగి బయలుదేరాం. మరోసారి తప్పక తాగుతాం” చిరునవ్వుతో చెప్పాడు రెడ్డిగారు.
వారి మాటలను విన్న సావిత్రి వెను తిరిగి భర్త ముఖంలోకి చూచింది. ‘సరే’ అన్నట్లు శాస్త్రిగారు తల ఆడించారు. రామిరెడ్డి.. శేషారెడ్డి శాస్త్రిగారికి నమస్కరించి వరండా మెట్లు దిగారు. వారికి రాఘవ.. సుమతీ తల్లి శాంతి.. తండ్రి శంకరశాస్త్రి ఎదురైనారు. ఆ దంపతుల ఆకస్మిక రాకకు శాస్త్రిగారు.. సావిత్రి ఆశ్చర్యపోయారు.
ముందుకు వెళుతున్న రామిరెడ్డిని శేషారెడ్డిని చూచి రాఘవ “మామా!.. మీరిరువురూ కొంచెంసేపు కూర్చోండి. మీరు మా శ్రేయోభిలాషులు. నేను ఒక ముఖ్య విషయాన్ని చెప్పబోతున్నాను” అన్నాడు.
గ్రామ పట్టణ ప్రాంతాల్లోని పెద్దలను కొన్ని కుటుంబాల వారసులు కులభేధం లేక సగౌరవంగా ఏదో వరసలతో పిలవడం మన హైందవ సాంప్రదాయాల్లో ఒకటి.
“రాఘవా!.. అలాగా!.. సరే కూర్చుంటాను” నవ్వుతూ రామిరెడ్డి కుర్చీలో కూర్చున్నారు. శేషారెడ్డిగారూ అదే పని చేశాడు.
తన తోటే వచ్చిన సుమతి తండ్రి శంకరశాస్త్రిగారి వైపు చూచి “మామయ్యా!.. మీరూ కూర్చోండి.”, శాంతి వైపు చూచి.. “అత్తయ్యా!.. మీరు లోనికి వెళ్ళి మా సావిత్రి అత్తయ్యతో మాట్లాడండి” అన్నాడు రాఘవ. శాంతి లోనికి వెళ్ళి సావిత్రిని సమీపించింది.
విషయం ఏమిటో అర్థం కాని నరసింహశాస్త్రి.. “రాఘవా! ఏమిటిదంతా..” ఆశ్చర్యంతో అడిగాడు.
రాఘవ నవ్వుతూ లోనికి చూస్తూ.. “బావా!.. వరండాలోకి రావయ్యా!.. త్వరగారా!..” బిగ్గరగా పిలిచాడు. నరసింహశాస్త్రి కూర్చున్న కుర్చీ ముందు కూర్చొని వారి చేతులను తన చేతిల్లోకి తీసుకొన్నాడు.
రాఘవ పిలుపు విని అద్వైత్ ముఖ ద్వారాన్ని సమీపించి అక్కడ నిలబడి వున్న తన తల్లిని ఆమె ప్రక్కనే వున్న శాంతిని చూచి తన తల్లి చేతిని తన చేతిలోనికి తీసుకొని
“అమ్మా! నాతో రా!.. పిన్నీ మీరూ రండి” అన్నాడు.
ఆ యిరువురు వనితలు అద్వైత్ వెనకాలే అతని గదిలోకి నడిచారు.
“రాఘవా!.. విషయం ఏమిటో చెప్పు. నేను కొంచెం త్వరగా పనిమీద వెళ్ళాలి బాబు” అన్నాడు రామిరెడ్డి. “అలాగే మామ!..” చెప్పి నరసింహశాస్త్రి ముఖంలోకి చూచాడు. రాఘవ నరసింహశాస్త్రి మోకాళ్ళను జవురుతూ.. “మామయ్యా!.. మీరు మా అందరికీ మార్గదర్శకులు. ప్రస్తుతంలో మన కుటుంబాలకు మీరే పెద్ద.” అన్నాడు
“అవును రాఘవా!.. అది అందరికీ తెలిసిన విషయమేగా!..”
“అవును మామా!.. కానీ యిప్పుడు నేను చెప్పబోయే విషయం మీకెవరికీ తెలీదు మామా. నాకూ మా బావ అద్వైత్‍కు రెండు గంటల క్రిందే తెలిసింది. వీరు.. శంకరం మామయ్యగారు అవసానదశలో వున్న వారి తల్లి కోర్కెను తీర్చే నిమిత్తం పన్నెండేళ్ళ పిల్ల సుమతిని ఆ తల్లి కూతురి కొడుకుకి యిచ్చి వివాహం చేశారు. ఆమెకు పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో ఆ భర్త తీవ్ర జ్వరంతో మరణించాడు. ఇంతవరకూ మీ కందరికీ తెలిసిందే..”
“మరి మాకు తెలవని విషయం ఏమిటో అది చెప్పు రాఘవా!.. త్వరగా వెళ్ళాలి బాబూ!..”
“మామా మరో అయిదు నిముషాలు ఓపిక పట్టండి. బహుశా మా బావ లోన ఆడవారి సభకు అధ్యక్షత వహించినట్టున్నాడు. విషయాన్ని నేనే మీకు చెప్పాలి. మామా!.. నా పిన్ని కొడుకు పాండురంగశర్మ.. నా తమ్ముడు.. తెలుసుగా!..”
అంతవరకూ ఎంతో సహనంతో వింటున్న నరసింహశాస్త్రి.. “రాఘవా!.. ఉపోద్ఘాతాన్ని ఆపి.. విషయం ఏమిటో చెప్పరా!.. రంగడికి ఏమయింది?..” ఆందోళనగా అడిగారు శాస్త్రిగారు.
“మామయ్యా వాడికేం కాలేదు. హాయిగా వున్నాడు. వాడు.. వీరి కుమార్తె సుమతిని వివాహం చేసికోదలచుకొన్నాడు. యథార్థంగా.. వారిరువురూ ఒకరినొకరు యిష్టపడ్డారు. నా తమ్ముడు తీసికొన్న నిర్ణయం నాకు, నా బావకు నచ్చింది. మీరు మా పెద్దలు. నేను బావా కోరుకొన్నట్లుగా మీరు మంచి మనస్సుతో పాండురంగకు సుమతికీ వివాహాన్ని జరిపించాలని పెద్దలైన మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. నా తమ్ముడు.. కందుకూరి వీరేశలింగం పంతులులాంటి వాడని చెప్పలేను. కానీ వారి వలే నా తమ్ముడిలో కూడా సమాజ స్పృహ.. స్త్రీ జాతి మీద గౌరవం అభిమానం.. వున్న మంచి మనస్సు వుందని చెప్పగలను. నా కోర్కెను చిత్తగించి.. ఆ చిన్న వాళ్ళను మన్నించి వారి ఆశయం నెరవేర్చవలసిందిగా మిమ్మల్ని నేను మా బావ అద్వైత్ కోరుకొంటున్నాము” లేచి నిలబడి అందరికీ నమస్కరించాడు రాఘవ.
తల్లికి చెప్పవలసిన మాటలను చెప్పి అద్వైత్.. తన తల్లి.. సుమతి తల్లి శాంతితో ముఖద్వారాన్ని సమీపించాడు. నరసింహశాస్త్రి.. వారి వైపుకు చూచాడు. ఆ తల్లి సావిత్రి తనయుడు అద్వైత్.. సుమతి తల్లి శాంతి.. వారిని చూచి చేతులు జోడించారు.
ఎదురుగా కూర్చొని అంతా వింటున్న శంకరశాస్త్రి కన్నీటితో తల దించుకొన్నాడు. వారిని చూచిన నరసింహశాస్త్రి లేచి వారిని సమీపించి.. తన పై పంచతో వారి కళ్ళనీళ్ళను తుడిచి..
“తమ్ముడూ!.. ఇది మనం బాధపడవలసిన సమయం కాదయ్యా!.. ఆనందించవలసిన సమయం” చిరునవ్వుతో చెప్పాడు శంకరశాస్త్రి లేచి నరసింహశాస్త్రి కౌగలించుకొన్నాడు. “అన్నయ్యా!.. ఎంతో గొప్ప మనసు. మీ శిక్షణలో పెరిగిన అద్వైత్, రాఘవ, పాండురంగలు..” శంకరశాస్త్రి ముగించక ముందే..
“వారు నాకు గర్వకారణం తమ్ముడూ!..” పరమానందంతో చెప్పాడు నరసింహశాస్త్రి,
“అయ్యా!.. కాశీ క్షేత్రయాత్ర ముగించుకొని రాగానే మన పాండురంగ.. సుమతీల వివాహాన్ని నేను నా ఖర్చుతో జరిపిస్తాను. మీరు నాయీ నిర్ణయానికి ఎలాంటి అభ్యంతరమూ చెప్పకూడదు.” అంటూ,
“అల్లుడూ రాఘవా!.. నీ నిర్ణయం అమోఘం..” ఆనందంగా రామిరెడ్డి చెప్పాడు. వారందరికీ శలవు చెప్పి ఆ బావ మరదులు వెళ్లిపోయారు. నరసింహశాస్త్రి.. తన చేతులను చాచి తనయుడు అద్వైత్‌ను, చెల్లెలి కొడుకు రాఘవను తన హృదయానికి హత్తుకొన్నాడు.
అధ్యాయం 26:
ఆ రోజుకు మూడవ రోజున నరసింహశాస్త్రి సావిత్రి.. వసుంధర.. రెడ్డి రామిరెడ్డిగారు.. వారి సతీమణి.. ఆమె సోదరుడు శేషారెడ్డి.. వారి అర్ధాంగి.. రామిరెడ్డిగారి తల్లి కాశీక్షేత్రానికి ప్రయాణం.
ఇంగ్లీష్ సామెత.. మ్యాన్ ప్రపోజ్డ్.. గాడ్ డిస్పోజ్డ్. అది మంచీ కావచ్చు. చెడూ కావచ్చు.
ఆ రాత్రి ఆంధ్రప్రాంతంలో భారీ వర్షాలు ప్రారంభించి.. రెండు రోజుల పాటు రేయింబవళ్ళు తీవ్ర గాలి వాన. తమ ప్రయాణం సజావుగా సాగుతుందా లేదా అనే సందేహం వారందరికీ కలిగింది.
యిక్కడి పరిస్థితి యిలా వుంటే.. వుత్తరాన కాశీ ప్రాంతంలో యింతకంటే విపరీతపు వర్షాలు.. రైలు మార్గ విధ్వంసాలూ జరిగాయి. దూరపు రైళ్ళు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
ఆ కారణంగా వారి మూడవరోజు ప్రయాణం ఆగిపోయింది. రాఘవ భద్రాచలానికి డ్యూటీకి వెళ్ళిపోయాడు. శంకరశాస్త్రిగారు.. రామిరెడ్డిగారిని కలిసి ప్రయాణం ఎటూ ఆగిపోయింది కనుక.. త్వరలో తమ కుమార్తె వివాహం జరిగేలా చూడవలసిందిగా కోరారు.
అన్న మాట మీద నిలిచే మనిషి రెడ్డిగారు, నరసింహశాస్త్రి గారిని కలసికొన్నారు. తాను ముందు చెప్పిన తన నిర్ణయాన్ని వారికి గుర్తు చేసి.. పాండురంగ, సుమతుల వివాహానికి శాస్త్రిగారి చేత ముహూర్తాన్ని నిర్ణయించాడు.
ఆ రాత్రి.. వసుంధర భోజనానంతరం తమ్ముడు నరసింహశాస్త్రి గదికి వెళ్ళింది. వారు ఆ సమయంలో వుదయం చదువగా మిగిలిన దినపత్రికను చదువుతున్నారు.
“ఒరేయ్ నరసింహా!.. నిన్ను నేను ఒకమాట అడగాలనుకొంటున్నాను!..”
“ఏమిచో చెప్పక్కా!.. చేతిలోని పేపర్‌ను ప్రక్కన వుంచి అక్కగారి ముఖంలోకి చూచాడు నరసింహశాస్త్రి.
“ఒరేయ్!.. ఇంట్లో పెళ్ళికి ఎదిగిన అద్వైత్ రాఘవ సీతా వున్నారు. సీత కంటే పాండురంగడు ఒక్క సంవత్సరమే పెద్ద. వారి ముగ్గురి వివాహ విషయాన్ని గురించి ఏమి ఆలోచించావు? నీకు సావిత్రి బాగా తెలిసిన విషయమే.. సీత అద్వైత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వుంది. వారిరువురి జాతకాలను చూడమన్నాను. కానీ నీవు ఇంతవరకూ చూడలేదు. పెద్దవాళ్ళకు పెండ్లి చేయకుండా చిన్నవాడైన పాండురంగకు యిప్పుడే పెళ్ళి ఏమిట్రా.. దూరపు వాళ్ళు వింటే విడ్డూరపోరూ!..” తన మనోభావాన్ని వసుంధర నరసింహశాస్త్రికి తెలియజేసింది.
“అక్కా!.. ఎవరి వివాహమైనా.. ఆ దైవ నిర్ణయం ప్రకారంగానే జరుగుతుందని నా అభిప్రాయం. అద్వైత్‍ను ఆ విషయాన్ని గురించి అడిగాను. ‘మరో రెండేళ్ళ తర్వాత నాన్నా’ అని చెప్పాడు. ఇక రాఘవ ‘బావ పెళ్ళి తర్వాతే నా పెళ్ళి అని ఎప్పుడో చెప్పాడు’. కానీ.. వీరిరువురి కన్నా చిన్నవాడైన.. నా చిన్న చెల్లెలు శారద కొడుకు పాండురంగ యిరవై సంవత్సరాల లోపునే పసుపుకుంకుమలకు దూరం అయిన సుమతిని చేసికోవాలని నిర్ణయించుకొన్నాడు. ఆమెకు నిండు నూరేళ్ళు అండగా ఆమె భర్తగా నిలవాలనుకొన్నాడు. వాడి నిర్ణయంలో స్వార్థం కన్నా, నాకు పరమార్థం గోచరించింది అక్కా!.. ఆ కారణంగా నీవు తప్ప యీ యింటి ఇంతర సభ్యులు సుమతి తల్లిదండ్రులు.. రెడ్డిరామిరెడ్డిగారూ కోరిన రీతిగా వారిరువురికీ వివాహం జరిపించాలనే నిర్ణయానికి వచ్చాను. ముహూర్తాన్ని పెట్టాను. యీ రోజు తర్వాత పదిహేడవ రోజున వారిరువురికీ వివాహం జరుగుతుంది. ఆ విషయంలో ఆ పిల్లలిద్దరిదీ కూడా ఏకాభిప్రాయమే!.. అక్కా!.. ఇప్పుడు చెప్పు నీ దృష్టిలో నీయీ తమ్ముడు తప్పు చేశాడా!..” ప్రాధేయపూర్వకంగా వసుంధర ముఖంలోకి చూచాడు నరసింహశాస్త్రి.
శాస్త్రిగారి మాటలు.. వసుంధరకు న్యాయబద్ధంగా తోచాయి.
“అక్కా!.. మరొక మాట.. అద్వైత్ రాఘవ బాగా చదువుకొన్నారు. వారికి పిల్లను యిచ్చేదానికి ఎందరో ముందుకు వస్తారు. కానీ పాండురంగ చేసేది మన వైదిక వృత్తి.. అందరికీ ఆ వృత్తి నచ్చదు. పైగా వాడికి తల్లి తండ్రి చిన్నతనంలోనే దూరమైనారు కదా!.. వాడికి తల్లి తండ్రి అత్తా మామగా వుండేది.. సావిత్రి.. నేనే కదా!.. చిన్నతనాన్నుంచి నా వెంట తిరిగిన వాడు.. వాడూ నాకు బిడ్డలాంటివాడే కదా!..” అనునయంగా చెప్పాడు నరసింహశాస్త్రి.
ఎదుటి మనిషిలో సాటి వారి మీద వ్యతిరేకభావం.. ఆవేశం వున్నా.. వారి ఎదుట వున్న వ్యక్తి శాంతంగా.. సౌమ్యంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తే.. ఆ ఎదుటి వారి మనస్సులోని వికారాలు తొలగిపోయి న్యాయం.. ధర్మం అవగతమవుతుంది. వసుంధరకు .. నరసింహశాస్త్రి మాటలు ఆ స్థితిని కల్పించాయి.
“ఒరేయ్!.. నరసింహా!.. నీవు నా తమ్ముడివని తలచుకొంటే నా మనస్సు పులకిస్తూ వుందిరా!.. యింతవరకూ నాకు తెలిసి నీవు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసికోలేదు. యికపై తీసికోబోవు కూడా!.. నాయనా!.. నా మనస్సుకు యిప్పుడు శాంతిగా వుంది రా!.. నేనడిగిన తీరు నీ మనస్సుకు కష్టాన్ని కలిగించి వుంటే.. యీ నీ అక్కయ్యను మన్నించరా!..” దీనంగా చెప్పింది వసుంధర.
“అక్కా!.. ఏమిటా మాటలు. నేను నిన్ను మన్నించడమా!.. నీవేం తప్పు చేశావక్కా!.. నీలోని సందేహాన్ని గురుంచి అడిగావు. నేను దానికి జవాబు చెప్పాను. మన మధ్యన ఏననాడు నీవు అన్నమాటకు తావు లేదక్కా… బాధపడకు. నేను నీకంటే చిన్నవాణ్ణి కదా!.. నా మీద నీకు.. నీవు నన్ను ఎప్పుడైనా ఏదైనా అడిగే హక్కు వుందక్కా!..” ప్రీతిగా వసుంధర ముఖంలోకి చూస్తూ చెప్పాడు నరసింహశాస్త్రి.
వసుంధర కుర్చీ నుంచి లేచి.. “నరసింహ!.. యిక నే వెళ్ళి పడుకొంటానురా!..” గది నుండి వెళ్ళిపోయింది. అంతవరకూ.. అద్వైత్ రూమ్‍లో వుండి పెండ్లి కబుర్లతో పాండురంగను ఆట పట్టిస్తున్న సావిత్రి.. ఆమె వెనకాలే అద్వైత్.. పాండురంగా బయటికి వచ్చారు. వారికి వసుంధర ఎదురైంది.
“ఏం వదినా!.. యింకా పడుకోలేదా!..” అడిగింది సావిత్రి
“నా తమ్ముడితో మాట్లాడి వస్తున్నానే. యిక వెళ్ళి పడుకొంటా..” తన గదిలోకి పోబోయి వెను తిరిగి.. “రేయ్!.. పాండురంగా!.. యిలారా!..” పిలిచింది వసుంధర.
ఆమె అలా పిలవడానికి కారణం.. సీత వారి కంట పడకుండా అద్వైత్ రూమ్‍లో దూరడాన్ని వసుంధర చూచింది.
పాండురంగ.. “వస్తున్నా పెద్దమ్మా!..” అంటూ ఆమె గదిలో దూరాడు. సావిత్రి తన భర్త గదిలోనికి వెళ్ళింది. అద్వైత్ తన గదిలో ప్రవేశించి తలుపు దగ్గరకు వేసి వెనుతిరిగి చూచాడు.
తన మంచంపైన సీత.. పడుకొని కళ్ళు మూసుకొని వుంది. అద్వైత్ ఆశ్చర్యపోయాడు. సీతనే చూస్తూ మంచాన్ని సమీపించాడు.
వంగి.. “సీతా!..” మెల్లగా పిలిచాడు.
సీత పలకలేదు. నిద్రపోతున్నట్లు నటించింది.
ఎడం చేత్తో తలపై తట్టి.. “సీతా!.. దొంగ నిద్ర యిక చాలు. లేచి నీ గదికి వెళ్ళిపో..”
సీత నవ్వుతూ కళ్ళు తెరచింది. మంచం మీద కూర్చుంది.
“కూర్చో బావా!..” నవ్వుతూ చెప్పింది.
“అవునూ!.. నీవు గదిలోకి ఎప్పుడు వచ్చావు!..” ఆశ్చర్యంతో అడిగాడు అద్వైత్.
“హలో సార్! మనసంటూ ఒకటుంటే.. మార్గాలు అనేకం!..”
సీత అన్న ఆ మాటలు అద్వైత్‍కు నచ్చలేదు. ముఖాన్ని చిట్లించి..
“ముందు మంచం దిగు..”
సీత కొంటెగా అతని ముఖంలోకి కొన్నిక్షణాలు చూచింది కన్ను ఆర్పకుండా.
“సీతా!.. చూచింది చాలు.. మంచం దిగుతావా!..” వ్యంగ్యంగా అన్నాడు అద్వైత్.
“బావా!.. నీకో విషయం తెలుసా!..”
“ఏమిటది?..”
“యీ మంచం మీద సర్వహక్కులూ నాకున్నాయి.” నవ్వుతూ చెప్పింది సీత.
జుగుప్సగా సీత ముఖంలోకి చూచాడు అద్వైత్.
“బావా!.. నీవు అలా చూడకు. నీ ముఖం ఏం బాగా లేదు. ఏదీ ఒకసారి ప్రేమగా చూస్తూ నవ్వు. మంచం దిగుతాను” అందంగా నవ్వింది సీత.
“సీతా!.. నీవు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు!..”
“అవును.. ఆ హక్కు నాదేగా!..”
“అబ్బా!..”
“మా అత్త నీకు చాలా వస పోసిందే!..” కళ్ళు మూసుకుని తల అటూ ఇటూ ఆడించాడు.
అద్వైత్ చేతిని అందుకొని సీత మంచం దిగింది.
ఆమె స్పర్శకు అద్వైత్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. నవ్వుతూ తన్నే చూస్తున్న సీత ముఖంలోకి చూచాడు. “గుడ్.. నా సీత చాలా మంచిది. గుడ్.. ఇక మాట్లాడకుండా నీ గదికి వెళ్ళిపోమ్మా!..” బ్రతిమాలినట్లు చెప్పాడు.
కొన్నిక్షణాలు అతని ముఖంలోకి ఆరాధనాభావంతో చూచింది సీత.. “బావా.!.. నీ యీ సీత తన చర్యల వలన నీకు ఎన్నటికీ ఆనందాన్నే పంచుతుంది బావా!.. గుడ్ నైట్…” సీత గది నుండి వెళ్ళిపోయింది.
(ఇంకా ఉంది)