[కొన్నేళ్ళ క్రితం దర్శించిన కోణార్క్ ఆలయాన్ని, అక్కడి శిల్ప సౌందర్యాన్ని గుర్తుచేసుకుంటూ, అలనాటి ఆ మధుర స్మృతులను పాఠకులతో పంచుకుంటున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ఇవి 2008 నాటి విశేషాలు!
~
హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు ఎయిర్ డక్కన్, ఇండిగో వారి విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇండిగో వాళ్ళు కూడా కేవలం నెలక్రితం నుంచే నడుపుతున్నారట. అంతకు ముందు ఎయిర్ డక్కన్ ఒక్కటే ఉండేదట. 2008 జనవరి 14వ తేదీ సాయంత్రం 5.30కు మేం నలుగురం ‘ఇండిగో’ విమానంలో బయలుదేరాం. భువనేశ్వర్‌కు గంటన్నర ప్రయాణం. 7.00లకు భువనేశ్వర్ లోని ‘బిజు పట్నాయక్ ఎయిర్ పోర్టు’ లో దిగాం. బిజు పట్నాయక్ ఒరిస్సా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి. అక్కడ ‘ట్రైటెండ్ హిల్టన్’ అనే హోటల్‌లో గది తీసుకున్నాం. హోటల్ లోని గోడలు కోణార్క్, పూరీ దేవాలయ శిల్పాలు పోటోలతో ఇంటీరియర్ డిజైన్ చేయబడి ఉన్నాయి. కారిడార్‌లో సూర్యుని ఏడుగుర్రాల రథాన్ని పెట్టారు. ఈ హోటల్ పక్కనే ‘మే ఫెయిర్ లాగూన్’ అనే రిసార్ట్స్ ఉన్నాయి. ఎదురుగా ఉన్న ‘స్వస్తిప్లాజా’ హోటల్లోనే మావారి కాన్ఫరెన్స్ జరిగేది. ఆ కారణంగానే మేం భువనేశ్వర్ వచ్చాం.
ఒరిస్సా రాష్ట్రం చరిత్రలో ‘కళింగ, ఉత్కళ, కొంగడ, ఓడ్రదేశ్’ అనే పేర్లతో పిలవబడింది. ఒరిస్సా రాస్త్ర విస్తీర్ణం 1,55,707 చదరపు కిలోమీటర్లు. ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని లింగరాజు దేవాలయం, పూరీలోని జగన్నాథుని ఆలయం, కోణార్క్ లోని సూర్యమందిరం ఈ మూడు కలసి త్రిభుజాకారంలో ఉంటాయి. అందుకే దీనిని ‘గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఒరిస్సా’ అంటారు. ఒరిస్సా రాష్ట్రం పిపిలి వర్కు, సిల్వర్ ఫిలిగ్రీవర్కు వంటి చాలా హస్తకళలకు ప్రసిద్ది. ఇక్కడ తయారయ్యే ‘సంబల్‌పురి’ చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన చీరలు.
మొదటి రోజంతా భువనేశ్వర్ లోని లింగరాజు మందిరం! రాజారాణి మందిరం, ఉత్కళ విశ్వవిద్యాలయం, ధవళి స్తూపం, ఖండగిరి, ఉదయగిరి గుహలు అన్నీ తిరిగి చూశాం. ఎక్కడ చూసిన అధ్బుత శిల్ప సంపదే. ఎక్కడ రాతిశిల్పాలు చూస్తున్న అనుభూతి ఉండదు మనకు. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క విషయం వివరిస్తున్నట్లుగా, అవి మనతో మాట్లాడుతున్నట్లుగా, సజీవ చిత్రాలుగా కనిపిస్తాయి. ఈ ఉరినిండా దేవాలయాలే, అందుకే భువనేశ్వర్‌ను ‘టెంపుల్ సిటీ’ అంటారట. గుడి, గోపురం, ప్రాకారం ‘ఎక్కడ చూసిన దేవతా మూర్తులు, లతలు, పూవులు అన్నీ చెక్కడాలే. ఎంతసేపు చూసిన తనివి తీరదు. ఇక్కడ ఏ గుడి లోపలికి కెమెరాలూ, మొబైల్ ఫోన్లు అనుమతించడం లేదు.
మేము కోణార్క్, పూరీ దేవాలయాలు చూడాలనుకున్నాం. ఉదయం ట్రైడెంట్ హిల్టన్ లోనే టిఫిన్ చేసి కారులో కోణార్క్ బయలుదేరాం. జగతిని మేలుకొలిపి వెలుగునిచ్చే సూర్య భగవానుని దేవాలయం ఎలా ఉంటుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఆలోచనలే మనస్సులనిండా మాకందరికీ. కోణార్క్ చేరేసరికి మద్యాహ్నం పన్నెండు గంటలయింది. మేము వెళ్ళిన రోజు ‘సాంబదశమి’ ఆట. ఆ కారణంగా ఆరోజు దేవలయంలోనికి ఉచితప్రవేశమని చెప్పారు. అందుకని టికెట్ లేకుండానే అందరం లోపలకు ప్రవేశించాం. అక్కడ చాలా మండి మార్గదర్శకులు (గైడ్లు) “మేమొస్తాం. మేమొస్తాం” అంటూ పోటీ పడుతున్నారు. ఒక మార్గదర్శిని మాట్లాడుకొని లోపలకు వెళ్ళీ వెళ్ళగానే ఎదురుగా ఎత్తుగా ఒక మండపం కనిపించింది. ఇది నాట్యమండపమట. ఈ మండపం మొత్తం ఒకే రాయిని తొలిచి నిర్మించారట. దీనికి ముందు రెండువైపులా రెండు సింహాల ప్రతిమలు ఏనుగులను తొక్కిపెడుతున్నట్లుగా, ఆ ఏనుగుల తొండంలో మనిషి చిక్కుకుపోయినట్లుగా ఉన్నది. దీనికి గైడ్ ఏదో కథ చెప్పాడు. కానీ మాకు సరిగా అర్థం కాలేదు. ఈ మండపం వెనగ్గా అసలైన సూర్యదేవాలయం ఉన్నది. ఎంత అద్భుతం! కళ్ళు మిరుమిట్లు గొలిపే శిల్ప చాతుర్యం, దీని చూసి తీరవలసిందే కానీ మాటల్లో వర్ణించడానికి వీలులేదు. ఎక్కడా ఒక్క అంగుళం మేర కూడా రాయి ఖాళీగా కన్పించలేదు. మన పూర్వపు రాజులకు కలల మీద ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ. 12 సంవత్సరాల ఉత్కళ రాజ్య ఆదాయాన్ని ఈ దేవాలయం కోసం ఖర్చు పెట్టారంటే శిల్ప కళల మీద ఆనాటి రాజులకున్న అభిరుచి ఎంతో తెలిసిపోతున్నది. ఈ ఆలయం లోని కొంతభాగం మాత్రమే చూసేందుకు అనువుగా ఉన్నది. మిగతా భాగమంతా బాగుచేయటం ఉన్నది. ఆలయాన్ని పోర్చుగీసు వాళ్ళు ద్వంసం చేసి మూలవిగ్రహాన్ని ఎత్తుకుపోయారట. అసలు నిర్మించిన ఆలయం ఎత్తుకన్న ఇప్పుడు సగం ఎత్తు మాత్రమే ఉన్నదట. ఎన్నో వందల యేళ్ళ నటి మన భారతీయ శిల్ప సంపదను నాశనం చేసినందుకు బాధ, కోపం అక్కడున్న వాళ్లందరి మొహాల్లోనూ కనిపించింది.
ఇక్కడ దేవాలయం సూర్యరథం వలె నిర్మింపబడింది. ఈ రథానికి 24 రథ చక్రాలు, ఏడు గుర్రాలు ఉన్నాయి. భానుడు ఏడు గుర్రాల రథంపై స్వారీ చేస్తూ తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాడని మన పెద్దవాళ్ళు చెపుతారు. అదే ఇక్కడ కనిపిస్తుంది. తెల్లని సూర్యకాంతిలో ఇంద్రధనస్సు లోని ఏడు రంగులుంటాయని న్యూటన్ కనుక్కున్న సూత్రం ఇక్కడ భానుడు, ఏడు గుర్రాల రథంతో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ గుడి అందంగా నిర్మింపబడిందట. ఇక్కడున్న 24 రథచక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయట. ఒక్కొక్క చక్రంలో ఎనిమిది ముళ్ళు ఉన్నాయి. ఎనిమిది ముళ్ళు ఎనిమిది గంటల సమయమట. అలా చక్రం దగ్గర నిలబడి దానిమీద చెయ్యి వేసి ఆ నీడను బట్టి అప్పటి సమయాన్ని లెక్కగట్టి చెప్పాడు గైడు. ఆశ్చర్యం మన వాచిలోని టైముతో సరిగ్గా సరిపోయింది.
ఈ దేవాలయంలో సూర్యభగవానుడు మూడు రకాలుగా దర్శనమిస్తాడు. దేవాలయానికి దక్షిణం వైపు ఉండేమూర్తి ‘ఉదయించే సూర్యుడు’. ఈయనను ‘మిత్ర’ అని పిలుస్తారు. ఈ విగ్రహం 8 అడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉంటుంది. అలాగే పశ్చిమాన ఉన్న మూర్తి ‘మధ్యాహ్న సూర్యుడు’. ఈ మూర్తిని ‘పున్నన్’ అంటారు. ఇంకా ఉత్తరాన ఉన్న ‘హరితస్వ’ అనే పేరుగల మూర్తి ‘అస్తమించే సూర్యుడు.’
కోణార్క్ సూర్యదేవాలయాన్ని ‘నరసింగదేవుడు’ అనే ఉత్కళరాజు 13వ శతాబ్దంలో నిర్మించాడు. 1200 మంది శిల్పులు నిర్విరామంగా చెక్కితే ఈ దేవాలయం పూర్తికావటానికి 12 సంవత్సరాల కాలం పట్టిందట. ఈ దేవాలయం యొక్క అధ్బుత సౌందర్యాన్ని కంచిన విశ్వకవి, గీతాంజలి కర్త రవీంద్రుడు ఇలా అన్నారట. “ఇక్కడ రాళ్ళు మాట్లాడే బాష ముందు మానవ భాష ఓడిపోయింది”. ఎంత అద్భుతంగా చెప్పారు.
నిజం! ఈ శిల్పా సౌందర్యం చూడవలసిందే కానీ చెప్పటానికి మాటలు చాలవు. అక్కడ నుంచి కాళ్ళు ముందుకు కదలటం లేదు. కానీ తప్పదు. మేం మరలా పూరీ వెళ్ళాలి. ఊరినిండా పిపిలి వర్కుతో ఉన్న గోడ పరదాలు, చేతి సంచులు, కోణార్క్ రథ చక్రాల రకరకాల మూల పదార్థాలతోనూ చేయబడి అందంగా కనువిందు చేస్తున్నాయి. మేం కూడా కొయ్యతో చేసిన ఒక కోణార్క్ చక్రాన్ని కొనుక్కొని, మనస్సు నిండా ఆ శిల్ప సౌందర్యాన్ని నింపుకొని పూరికి పయనమయ్యాం.