మహాభారత కథలు-60: జరాసంధుడి వృత్తాంతము

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

జరాసంధుడి పరాక్రమము:

[dropcap]ధ[/dropcap]ర్మరాజు చెప్పినది విని శ్రీకృష్ణుడు “ధర్మరాజా! మంచి గుణాలు, గొప్ప పరాక్రమము, శత్రువుల్ని ఎదిరించగల తమ్ముళ్లు కలిగిన నువ్వు రాజసూయయాగం చెయ్యడానికి సమర్థుడివి.  పూర్వం జమదగ్ని కుమారుడు పరశురాముడు భూమి మీద క్షత్రియులే లేకుండా చేశాడు. ఐల, ఇక్ష్వాకు వంశాలు మాత్రమే ఈ భూమి మీద మిగిలాయి.

అప్పటి నుంచి అసలయిన రాజ వంశాలు ఆ రెండే. తక్కిన రాజవంశాలన్నీ కల్పితాలే. రాజకిరీటాలు ధరించడానికి వాటికి యోగ్యత లేదు. అసలైన రెండు రాజవంశాలు క్రమంగా నూటొక్క వంశాలుగా విస్తరించాయి.

అంతేకాకుండా, యయాతి, భోజ వంశాల వల్ల పధ్నాలుగు వంశాలు ఏర్పడ్డాయి. జరాసంధుడు ఈ రాజులందర్నీ జయించాడు. అతడు చెప్పలేనంత సామర్థ్యం కలవాడు.  చేది దేశం యొక్క రాజు శిశుపాలుడు అమితమైన గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించేంత గొప్ప బలం కలవాడు. జరాసంధుడికి  సేనాధిపతిగా ఉంటూ అతణ్ని భక్తితో సేవిస్తూ ఉంటాడు.

హంస డిభకులు చాలా బలవంతులు. మాయా యుద్ధంలో ఆరితేరిన వీరులు, అజేయులు. ఒకళ్లకి ఒకళ్లు మంచి స్నేహితులు, జరాసంధుడికి ఆప్తులు.  కౌశికుడు, చిత్రసేనుడు అనే పేర్లతో హంస డిభకులు ఇద్దరూ పెద్ద సైన్యంతో జరాసంధుడికి కుడి ఎడమ భుజాలుగా ఉంటారు.

పడమటి దేశానికి ప్రభువు భగదత్తుడు. అతడు వరుణుడితో సమానుడు. మీ తండ్రి పాండురాజుకి స్నేహితుడు. నువ్వంటే మనస్సులో భక్తి ఉన్నవాడు. జరాసంధుడంటే ఉన్న భయం వల్ల మాటల్లోను చేతల్లోను అతణ్నే అనుసరిస్తుంటాడు.

చేది రాజుల్లో పురుషోత్తముడు; అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజుల్లో పౌండ్రక వాసుదేవుడు నా పేర్లు పెట్టుకుని జరాసంధుణ్ని సేవిస్తున్నాడు. తూర్పు దక్షిణ దేశాల రాజులు-పురుజితుడు, కరూశ, కలభ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులు అతణ్నే కొలుస్తున్నారు.

ఉత్తర దిక్కున ఉండే పద్ధెనిమిది రాజవంశాలవాళ్లు, ఉత్తర పాంచాల, శూరసేన, పుష్కర, పుళింద, కళింగ, కుంతి, మత్స్యదేశాల రాజులు అందరు భయంతో జరాసంధుణ్ని, తమ దేశాల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

బలవంతుడు, బంధువులకి అపకారం చేసినవాడు, అహంకారి అయిన కంసుణ్ని నేనే వధించాను. కంసుడి భార్య తన కూతురు అవడం, ఆమె ప్రేరేపించడం వల్ల పరమదుర్మార్గుడైన జరాసంధుడు నా మీద ఉన్న పగతో నాకు అనేక విధాలుగా అపకారం చేశాడు.

ధర్మరాజా! హంస డిభకులు, మగధరాజైన జరాసంధుడు ముగ్గురూ తమ భుజ బల పరాక్రమాలతో ముల్లోకాల్ని జయించగలరు. ఆయుధాలతో చావులేని హంస డిభకులతో కలిసి జరాసంధుడు మధుర మీద దండెత్తాడు. మేము యదు, వృష్ణి, బోజాంధకుల్లో గొప్ప వీరులైన పద్ధెనిమిదివేల మంది రథికులతో అతణ్ని ఎదిరించి ఎంత యుద్ధం చేసినా విజయం దక్కలేదు. అప్పుడు ఒక ఉపాయం ఆలోచించాము.

హంసుడు యుద్ధంలో మరణించాడని డిభకుడికి చెప్పాము. ఆ మాటలు నమ్మి డిభకుడు ఎంతో బాధపడ్డాడు. తనకు చాలా ఇష్టమైన హంసుడు లేకపోతే తను మాత్రం ఎందుకు బతకాలని అనుకుని నీళ్లల్లో మునిగి ప్రాణాలు వదిలాడు. స్నేహితుడు తన కోసం చచ్చిపోయాడని విని హంసుడు అక్కడికక్కడే మరణించాడు.

హంస డిభకులు మరణించాక జరాసంధుడు తిరిగి మగధకి వెళ్లిపోయాడు. అతడితో  శత్రుత్వం పెరుగుతూనే ఉండడం వల్ల మేము కూడా మధురానగరాన్ని వదిలిపెట్టి రైవతక పర్వతం మీద  గట్టి కోట కట్టుకుని నీ అండలో సుఖంగా ఉంటున్నాము.

ధర్మరాజా! దుర్మార్గుడైన జరాసంధుడు లోకంలో ఉన్న రాజులందరినీ పట్టి బంధించి రోజుకి ఒక్కడు వంతున తన బలం ప్రదర్శిస్తూ కసాయివాడిలా చంపి భయంకరమైన భైరవపూజ చేస్తున్నాడు. దుర్మార్గుడైన జరాసంధుణ్ని సంహరిస్తే నీ సామ్రాజ్యం బాగా స్థిరపడుతుంది. నువ్వు అనుకున్నట్టు రాజసూయం చెయ్యడం కూడా సాధ్యపడుతుంది.

ధర్మరాజా! పూర్వం భగీరథుడు ప్రజల్ని రక్షించడం వల్ల, యౌవనాశ్వుడు విజయాలు సాధించడం వల్ల, భరతుడు గొప్ప భుజబలం వల్ల, కార్తవీర్యుడు తపోబలం వల్ల, మరుత్తుడు బుద్ధిబలం వల్ల మొత్తం సామ్రాజ్యాన్ని పొందారు. నీలో కూడా ఆ సుగుణాలన్నీ ఉన్నాయి.

రాజసూయం చెయ్యడం నీకేమీ కష్టం కాదు. జరాసంధుడు ఎంత బలవంతుడైనా, గర్వంతో ఉన్నా అతడు చెడుమార్గంలో నడవడం వల్ల అతడి గొప్పతనం తప్పకుండా పతనం అవుతుంది. వివేకం లేనివాళ్ల సంపద స్థిరంగా ఉండదని తెలుసుకదా!” అని చెప్పాడు.

ధర్మరాజుకి ఉత్సాహం కలిగించిన భీమార్జునులు

జరాసంధుణ్ని గురించి శ్రీకృష్ణుడు చెప్పినది విని భీముడు ధర్మరాజుతో “లోకంలో ఏ ప్రయత్నమూ చెయ్యని వాడికి సంపదలు ఉండవు. ప్రయత్నం చేసే స్వభావం ఉంటే బలం లేనివాడయినా సరే ప్రయత్నం చెయ్యని బలం కలవాళ్లని జయించగలడు.

బలవంతుడితో శత్రుత్వం పెట్టుకున్నా, యుద్ధం చేసి ఓడిపోయినా, గెలిచినా అతడికి పౌరుషం ఉన్నట్టే. బలహీనుడితో యుద్ధం చేసి అతణ్ని ఓడించడం పరాక్రమం అనిపించుకోదు.

శ్రీకృష్ణుడి దయ, అర్జునుడి సహకారం, నీ అనుగ్రహం నాకు ఉంటే  దుర్మార్గుడైన జరాసంధుణ్ని యుద్ధంలో సంహరిస్తాను. మేము ముగ్గురం అహవనీయ, దక్షిణ, గార్హ్యపత్యాలు అనే మూడు అగ్నుల్లా జ్వలించి జరాసంధుడనే బలిపశువుని శత్రువులు అనే ఆహుతులతో నువ్వు చెయ్యబోయే రాజసూయ మహాయజ్ఞం అనే పనిని నిర్వహిస్తాము” అన్నాడు.

భీమసేనుడు తన పరాక్రమానికి తగినట్టు చెప్పిన మాటలు విని అర్జునుడు “ధర్మరాజా! రాజులందరిని జయించి అందువల్ల పొందిన అపారమైన సంపదలతో రాజసూయ యాగాన్ని పూర్తిచెయ్యి. నువ్వు అలా చెయ్యకపోతే నా భుజబల పరాక్రమానికి తగినట్టు నా దగ్గర ఉన్న గాండీవము, దివ్యబాణాలు, దివ్యరథం, అందమైన ఈ మయసభకి అర్థమే ఉండదు.

పరాక్రమవంతుడికి ఉన్న రూపము, గుణము సంపదలు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తాయి. పరాక్రమం లేనివాడికి అవి ఉన్నా లేనట్టే. రాజసూయ యాగం పేరుతో జరాసంధుణ్ని చంపి అతడి దగ్గర బందీలుగా ఉన్న రాజులందర్నీ చెరనుంచి విడిపించడం కంటే ఎక్కువ కీర్తి, ధర్మం ఇంకేముంటాయి” అన్నాడు.

భీముడు అర్జునుడు చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుడు సంతోషంతో “ధర్మరాజా! పరాక్రమాన్ని ధర్మపద్ధతిలోను, శాస్త్రప్రకారంగాను ప్రదర్శించాలి. బుద్ధిబలము, ప్రయత్నము ఉంటే సాధించలేనిది లేదు.  నేను, భీమార్జునులు ముగ్గురం కలిసి జరాసంధుణ్ని సమూలంగా నాశనం చేస్తాము.

రహస్య స్థానానికి మార్గం తెలియాలే కాని ఆ స్థానానికి చేరుకోవడం పెద్ద కష్టం కాదు. అక్కడ ఏకాంతంగా ఉండే స్వభావం కలిగిన అతణ్ని చంపడం కూడా కష్టం కాదు” అన్నాడు.

ధర్మరాజు “శ్రీకృష్ణా! యుద్ధంలో నిన్ను ఎదిరించి అగ్నిలో పడ్డ మిడతలా జరాసంధుడు మాడిపోకుండా ఉంటాడా!” అన్నాడు సంతోషంగా.

జరాసంధుడి పుట్టుక

ధర్మరాజుకి జరాసంధుడి గురించి తెలుసుకోవాలని అనిపించింది. శ్రీకృష్ణా! అసలు ఆ జరాసంధుడికి అంత క్రూరమైన స్వభావం, అంత గొప్ప భుజపరాక్రమం ఎలా వచ్చాయో, అతడి పుట్టుక గురించి వివరిస్తావా?” అని అడిగాడు.

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “మగధరాజు బృహద్రథుడు మహాసమర్థుడు. ధర్మ ప్రవర్తనతో మూడు అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని వెళ్లి శత్రురాజుల్ని ఓడించాడు. కాశీరాజైన కూర్మి కూతుళ్లని కవలల్ని పెళ్లి చేసుకున్నాడు. సంతానం కోసం దేవతల్ని, బ్రాహ్మణుల్ని, మహర్షుల్ని పూజించాడు. శాస్త్రాన్ని అనుసరించి పుత్రకామేష్టి, అనేక పుణ్యకార్యాలు చేశాడు. అయినా అతడికి సంతానం కలగలేదు. సంతానం లేనప్పుడు సంపదలెందుకు అనుకుని నిరాశతో భార్యలిద్దర్నీ తీసుకుని అడవికి వెళ్లాడు.

అక్కడ గొప్ప నిష్ఠతో, ముక్తి పొందాలన్న కోరికతో, మండుతున్న అగ్నిలా గొప్ప తేజస్సుతో ఒక లేతమామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్న ధన్యుడు, పుణ్యాత్ముడు, గౌతముడు అయిన చండకౌశిక మహర్షిని చూశాడు. చండకౌశికుడు పుణ్యాత్ముడు, ప్రతనుడు, నిష్కాముడు, మునిశ్రేష్ఠుడు. ఆయన్ని బృహద్రథమహారాజు నియమనిష్ఠలతోను, భక్తితోను సేవించాడు.

రాజు సేవలకి సంతోషపడిన మహర్షి రాజుకి  ఏం కావాలో అడగమన్నాడు. బృహద్రథమహారాజు వినయంగా తలవంచి “మహనుభావా! నాకు అంతులేని సుఖాలు, సంపదలు ఉన్నాయి కాని, సంతానం లేదు. విరక్తితో తపస్సు చెయ్యాలని వచ్చాను. నాకు సంతానం కలిగేట్లు అనుగ్రహించు” అని అడిగాడు.

చండకౌశిక మహర్షి కొంచెంసేపు కళ్లు మూసుకుని ధ్యానిస్తూ కూర్చున్నాడు. అంతలో ఆ చెట్టు మీద నుంచి ఒక మామిడి పండు మహర్షి తొడ మీద దానంతట అదే రాలిపడింది.  మహర్షి ఆ పండుని తీసుకుని మంత్రించి బృహద్రథమహారాజుకి ఇచ్చి దాని వల్ల అతడికి ఒక కొడుకు పుడతాడని చెప్పాడు.

బృహద్రథుడు సంతోషంగా ఆ పండుని తీసుకుని వెళ్లి తన భార్యలకి సమానంగా పంచి ఇచ్చాడు. పండు తిని రాజు భార్యలు ఇద్దరూ గర్భవతులయ్యారు. పది నెలలు గడిచాక ఒక రోజు రాత్రి ఆ ఇద్దరికి ఒక కన్ను, ఒక చెవి, ఒక చెయ్యి, ఒక కాలు ఉన్న మానవశరీరం సగభాగం ముక్కలుగా ఇద్దరికీ జన్మించాయి. ఆ సగం ముక్కల్ని చూసి రాణులు ఇద్దరూ భయపడ్డారు. ముక్కలుగా పుట్టిన బాలుణ్ని రాజుకి చూపించడానికి సిగ్గుపడ్డారు.

పనివాళ్లని పిలిచి ఎవరికీ తెలియకుండా ఆ ముక్కల్ని బయట పారేయమని చెప్పి పంపించారు. పనివాళ్లు ఆ రెండు ముక్కల్ని తీసుకుని రాజభవనం వెలుపలి వాకిలికి దగ్గర్లో రెండు దారులు కలిసే చోట ఒకవైపు వేసి వచ్చారు.

అక్కడ తిరిగే ‘జర’ అనే రాక్షసి ఆ ముక్కల్ని చూసి ఎవరో బలి ఇచ్చి ఉంటారని అనుకుని ఆ రెండు ముక్కల్ని గట్టిగా పట్టుకుంది. ఒకదానితో ఒకటి అతుక్కుని రెండు ముక్కలూ కలిసి ఒక బాలుడిగా మారాయి.

వజ్రంలా కఠినంగా ఉన్న ఆ బాలుణ్ని ఎత్తుకోడానికి చాలా బరువుగా అనిపించాడు. అంతలోనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అంత గట్టిగా ఏడుస్తున్న అతణ్ని ఎత్తుకుని వెళ్లడం జరకి సాధ్యపడలేదు.

ఏడుపు విని అంతఃపురంలో ఉన్న స్త్రీలు అందరూ పరుగెత్తుకుని వచ్చారు. ఏడుస్తున్న పిల్లవాణ్ని ఆనందంగా ఎత్తుకున్నారు. ఈ హడావిడికి మహారాజు బృహద్రథుడు కూడా బయటికి వచ్చాడు.

గొప్ప తేజస్సుతో రాగిరంగులో ఎర్రగా ఉన్న పిడికిలిని ముఖం మీద పెట్టుకుని గట్టిగా ఏడుస్తున్న తన కుమారుణ్ని చూసి ఆనందపడ్డాడు. రాక్షసికి తను అనుకున్నట్టుగా రూపాన్ని మార్చే గుణం ఉంటుంది కనుక రాజుని చూడగానే అందమైన స్త్రీగా రూపం మార్చుకుంది.

బృహద్రథ మహారాజుతో  “రాజా!నేను జర అనే పేరుగల రాక్షసిని.  ఈ నగరానికి ఉన్న నాలుగు మార్గాల కూడలి నా నివాసం. నేను ఎప్పుడూ నీకు ఇష్టమైనదాన్ని చెయ్యాలని అనుకుంటాను. ఈనాటికి నాకు అవకాశం దొరికింది. నీ భార్యలకి పుట్టిన రెండు మానవదేహపు ముక్కల్ని తెచ్చి నీ పనికత్తెలు ఈ కూడలిలో పారేసి వెళ్లారు.

నేను ఆ ముక్కల్ని కలిపి పట్టుకోగానే వజ్రంలా గట్టిగా ఉన్న దేహంతో ఈ బాలుడు తయారయ్యాడు. ఎత్తుకోడానికి కూడా సాధ్యంకానంత బరువుతో ఉన్న ఇతణ్ని నీ కొడుకుగా స్వీకరించు” అని చెప్పింది.

బృహద్రథుడు “పూర్వం చండకౌశిక మహర్షిని పూజిస్తే, ఆయన నాకు ఈ కొడుకుని ఇచ్చాడు. నువ్వు రాక్షసివి కాదు, నా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పుణ్యదేవతవి” అని బృహద్రథుడు జరని పూజించాడు. కొడుకుని ప్రేమగా ఎత్తుకుని భార్యలిద్దరికీ ఇచ్చాడు.

జరచేత ఒకటిగా కలపబడ్డాడు కనుక ‘జరాసంధుడు’ అని పేరు పెట్టాడు. నగరాన్ని అలంకరించి ఆ రాక్షసికి పండుగ జరిపించాడు. అప్పటి నుంచి ఆ రాక్షసికి పండుగ జరిపిస్తూనే ఉన్నాడు. పెరుగుతున్న జరాసంధుడు మాత్రం ప్రజలకి నష్టం కలిగించే పనులే చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here