[‘విభజిత’ అనే కథాసంపుటిని వెలువరించిన విజయ భండారు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం విజయ భండారు గారూ.
విజయ భండారు: నమస్కారం.
~
ప్రశ్న 1. పుస్తక శీర్షికగా నాల్గవ కథ ‘విభజిత’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: నా మొదటి కథా సంకలనం ‘గణిక’. ఆ కథా సంపుటిలో వున్న అన్ని కథలు కూడా ‘విభజిత’ కథా సంపుటిలో వలె స్త్రీవాద దృక్పథంతోనే రాయబడిన కథలే. అందులో వున్న కథలన్నింటిలో ముఖమైన ఒక కథ ‘గణిక’. ఆ కథలోని ఓ స్త్రీ పాత్ర చుట్టు కథ రాయబడింది. కానీ ఆమె ఆ పేరుతో కథలో ఎక్కడా ఉచ్చరించబడదు. కారణం ఆ పాత్ర యొక్క స్వరూపం ఆ పేరుకు తగ్గట్టుగా తీర్చిదిద్దడం జరిగింది. అదే విధంగా ఈ విభజిత కథా సంపుటిలో కూడా ఒక కథ పాత్ర అనేక ఆమెల స్వరూపాలను ఒకే వ్యక్తి పోషిస్తుంది. అందువలన ఆ కథకు ఆ పేరు పెట్టడం జరిగింది. నేను నా పుస్తకం ముందు మాటలో చెప్పిన విధంగా స్త్రీలు పుట్టుక నుండి అనేక రూపాలుగా ఏ విధంగా విభజించబడి సమాజంలో మన్నిక పొందుతారో తెలియచేప్పడమే నా ఈ కథ యొక్క ప్రత్యేకత. స్త్రీలు సమాజంలోనే కాదు కుటుంబంలో కూడా అనేక రూపాంతరాలు చెందుతారని చెప్పడమే నా కథల ఉద్దేశ్యంగా నేను భావిస్తాను.
ప్రశ్న 2. ఈ కథలు చదువుతుంటే తన కార్యాచరణకు వాహికగా విజయ ‘రచన’ను ఎంచుకుందేమోననిపిస్తుందని అన్నారు ప్రతిమగారు తమ ముందుమాటలో. మీరేమంటారు? ఈ సందర్భంగా మీ రచనా ప్రస్థానం గురించి వివరిస్తారా?
జ: ప్రతిమగారు సీనియర్ కథా రచయిత మాత్రమే కాదు నాకు మంచి మిత్రురాలు కూడా. నేను మహిళా హక్కుల కార్యకర్తగా క్షేత్ర పర్యటనలు చేస్తాను. అదే విధంగా అనేక ప్రాంతాల నుండి కుటుంబ హింసతో బాధపడే మహిళలు మా దగ్గరకు రావడం జరుగుతుంది. అలా వచ్చిన మహిళా బాధితులు అనేకమందికి ఒక కౌన్సిలర్‌గా PoW సంధ్య గారితో కలిసి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వారి సమస్యల పరిష్కార దిశగా మేము అనేక సూచనలు, సలహాలు ఇవ్వడం వలన అంతకు ముందున్న అభద్రతాభావం గృహహింస బాధితులు తొలగించుకోగలుగుతారు. వారిని వాళ్ళ కాళ్లపై ఆత్మగౌరవంతో నిలబడే దిశగా వారికి మేం ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతో చాలామంది మహిళలు తమ సమస్యలను దైర్యంతో పరిష్కరించుకునే దిశగా వారిని అప్రమత్తం చేయడానికి మా వంతు సహకారం అందిస్తాం. ఇది గత పదిహేను సంవత్సరాలుగా జరుతున్న విషయమే. అందువలన నా కార్యాచారణ నా మిత్రబృందానికి తెలిసిన విషయమే. నా రోజువారి కార్యాచరణ, బాధితుల పక్షం వహించి నేను నా ఇతర మహిళా హక్కుల సంఘ కార్యకర్తలతో కలిసి చేసే పోరాటాలతో పాటు, స్త్రీల అస్తిత్వాల పట్ల నాకున్న అపరిమిత వ్యక్తిగత ఉత్సాహం వలన, ఒక రచయితగా కథలు రాయడం జరిగింది. అందువల్ల నా కథలన్నీ వాస్తవానికి దగ్గరగా వుండి, చదివిన ప్రతివారికి ఈ కథ ఏదో నాకు తెలిసిన వారిదే అన్న భావన కలిగే అవకాశం వుంది. నా కథలు అందుకే ఎక్కువమంది పాఠకుల మనసులో నిలిచిపోయాయి. నిజానికి నా రెండు కథా సంపుటులను మీరు గమనించినట్లయితే, నేను ఎంచుకున్న కథా వస్తువులు అన్ని కూడా నా చుట్టూ వున్న స్త్రీల గమనాగమనాలను గమనిస్తూనే రాయడం జరిగింది. మరికొన్ని కథలు ప్రత్యక్ష క్షేత్ర పర్యటనల ద్వారా వచ్చిన అనుభవాలకు అనుగుణంగా రాసిన పాత్రలు అని చెప్పగలను.
ప్రశ్న 3. ‘విజయ కథలు పెద్ద ప్లాట్‌ఫాం కలిగి ఉంటాయి, విజయ కథల్లో కనిపించే మరో వర్ణన పాత్రల పూర్వపరాలు చెప్పడం’ – అని తమ ముందుమాటలో నిధి గారు వ్యాఖ్యానించారు. ఈ గమనింపు ఈ సంపుటిలోని కథలకే పరిమితమా? లేక మీ పద్ధతిని మీ రచనా శైలిగా పరిగణించవచ్చా? వివరించండి.
జ: నిధి నా చిన్ననాటి మిత్రుడు. మా ఇద్దరి సాహిత్య ప్రస్థానం అటు ఇటుగా ఒకేసారి జరిగింది. నా మొదటి కవితా సంపుటి 1984లో వచ్చిన ‘దీపిక’ నుండి ఈనాటి వరకు మా స్నేహం సాహిత్యంతో పాటుగా కుటుంబాలతో కూడా పెనవేసుకుని నిలబడి వుంది. ‘నిధి’మంచి కవి మాత్రమే కాదు వ్యాసకర్త. అంతకుమించి గొప్ప విశ్లేషకుడు. అందువల్ల నేను ఏది రాసినా నా శ్రోత, విశ్లేషకుడు అతనే. నా సాహిత్య అవగాహన లోపాలను సరిచేసే మంచి మిత్రుడు. సలహాదారుడు. నిజంగానే అతను అన్నట్లుగా నా కొన్ని కథల్లో పాత్రల పూర్వాపర పరిచయం తప్పకుండా ఉంటుంది. అందుకు కారణం బహుశా! నేనూ దగ్గరగా చూసిన స్త్రీలు, వారి సమస్యలు, కష్టాలు, నష్టాలు వారి మనోభావ దొంతర రూపాలు అతి సమీపంగా పరిచయం కలగడం వల్ల కావచ్చు.
నిధి అన్నట్లుగా ఇప్పటివరకు నేను ఏభైకి పైగా కథలు రాసాను. రాసిన ప్రతి కథలో ఆ పాత్ర యొక్క స్వరూప స్వభావాలు ఎంతవరకు చెప్పవచ్చో అంతవరకు మాత్రమే చెబుతూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను. కొన్ని కథలకు అంత వివరణ ఇవ్వాల్సిన అవసరం వుండదు. ఒక్కోసారి ఆయా పాత్రల స్వరూపాలను బట్టి పాత్రల పూర్వపరాలను బేస్ చేసుకుని శైలి మారుతు వుంటుంది. కథా శైలి అనేది పాత్రల ఔచిత్యాన్ని బట్టి కూడా కథ నడత సాగుతుంది. అంతేకాని వ్యక్తిగతంగా కథలు ఇలాగే రాయాలన్న ముందు ఆలోచన నాకసలు ఉండదు. ఇప్పటివరకు రాసిన నా కథలన్నీ నా పాత్రలే నా కలాన్ని పట్టుకుని రాయిస్తాయి. అందులో నా గొప్పతనం కాని, ఇలానే రాయాలన్న ఒంటెద్దు పోకడ గానీ నాకు లేదని భావిస్తాను.
ప్రశ్న 4. ఈ సంపుటి లోని కథలన్నీ ఉమెన్ ఓరియంటెడ్ కథలే. అన్ని వర్గాల లోని మహిళలు ఎదుర్కుంటున్న భౌతిక, మానసిక సమస్యలతో అల్లిన కథలే. ఇది సంపుటిలోని కథలకి ఏకసూత్రత అయినప్పటికీ, మొత్తం మీద ఒకే రకమైన/ఒకే భావజాలానికి చెందిన కథలు అని పాఠకులు భావించకుండా ఉండేందుకు ఈ కథలలో ఎటువంటి వైవిధ్యాన్ని ప్రదర్శించారు?
జ: విభజిత కథా సంపుటి లోని కథలన్నీ స్త్రీవాద దృక్పథంతో వచ్చినవే. రెండు దశాబ్దాల స్త్రీవాదాలనంతరం, దళిత అస్తిత్వ వాదం ఊపందుకుంది. దళిత స్త్రీలు సవర్ణ స్త్రీల కన్నా ఎక్కువగా అణచివేయబడతారు. సామాజిక (కుల) అణచివేతతో పాటు దళిత పురుషుల పితృస్వామిక అణచివేతను కూడా దళిత స్త్రీలు అదనంగా మోయవలసిరావడం, దానిని వ్యతిరేకిస్తూ దళిత స్త్రీలు దళిత స్త్రీవాదాన్ని గట్టిగా వినిపించడం జరుగుతోంది. దానిని సహానుభూతి చెందిన చాలామంది స్త్రీవాద రచయితలు వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని వారి తరపున తమ గొంతుకలను సవరించుకుని కథలు రాయడం ప్రస్తుతం జరుగుతున్నది. అలా అన్ని వర్గాల స్త్రీల సమస్యలను ముందుకు తెచ్చే ప్రయత్నంలోనే నా కథలు రాయబడినవి. కాకపోతే నా కథలన్నీ (అన్ని వర్గాల) స్త్రీల చుట్టే ఉండడం వలన ఏక సూత్రతగా కనబడినప్పటికీ ప్రతి కథా ఒక్కో వైవిధ్యతను సంతరించుకుని ‘విభజిత’గా మీముందు వున్నది. నా కథలు ఆసాంతం చదివిన పాఠకులు ఆ విషయాలు చెబితే బాగుంది.
ప్రశ్న 5. ‘జుమ్రీ’ కథ ద్వారా బంజారా కుటుంబాలలో మగపిల్లలనే కనాలన్న ఒత్తిడి ఎలా ఉంటుందో పాఠకులకు తెలుస్తుంది. అయితే ఆ ఒత్తిడికి గర్భవతి అయిన భార్య మాత్రమే కాకుండా ఆమె భర్త కూడా భయపడడం మాత్రం సాధారణ పాఠకులకు తెలిసే అవకాశం లేదని అనిపిస్తుంది. అలాగే బహుశా టీనేజ్ కూడా దాటని వివేక్ అనే కుర్రాడు జుమ్రీని వేధించటం, భయపెట్టడం, అసహ్యంగా మాట్లాడడం వంటివి ధనమదం వల్ల, అహంకారం వల్ల మాత్రమే కాకుండా తరతరాలుగా కొన్ని కుటుంబాలలో కొనసాగుతున్న ఆధిపత్య వైఖరిని ఆ చిన్నవయసులోనే ఆ అబ్బాయి ప్రదర్శించడం – సమాజంలోని ఓ పెడ ధోరణికి ప్రతీకగా భావించాలా?
జ: విభజిత సంపుటిలో వున్న ప్రతి కథా ఒక్కో వైవిధ్యాన్ని కలిగి ఉందని పాఠకుడు భావించినపుడు, జుమ్రీ కథ నిజంగానే చాలా వైవిధ్యమైనదే. బంజారా వర్గంలో వున్న కొందరు పురుషుల ఔన్నత్యాన్ని కూడా పాఠకులు ఈ కథలో కొత్త కోణంలో తెలుసుకోగలుగుతారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భాగస్వామ్యమైన పెట్టుబడిదారీ వ్యవస్థలో అన్ని వర్గాలవారు భాగస్వాములే అయినప్పుడు మార్పు దిశగా కొందరు పురుషులు ముందుకు నడవడం సహజం. అందుకు విద్య దోహద పడుతుందన్నది సంస్కారవాదులు, మేధావులు ఎప్పటినుంచో చెబుతున్న విషయమే. కాబట్టి జ్ఞానం అనేది ఏ ఒక్క వర్గానికో చెందింది కాదు. ఆధునిక సమాజంలో అన్ని వర్గాల ప్రజలు దానిని ఇప్పుడు అందిపుచ్చుకుంటున్నారు. ఆ సందర్భంలో తమను తాము అన్ని వర్గాల ప్రజలు సంస్కరించుకోవడం అనేది ఉంటుంది. ఈ కథలో జుమ్రీ తండ్రి అదే చేసాడు. ఆ పాత్ర నేను కల్పించి రాసిది కాదు. నా కళ్ళ ముందు అనేక సంఘటనలు, కొంతమంది పురుషుల అవగాహన వుంది. పాత చింతకాయ ఆలోచనలు, మూఢ నమ్మకాలు, విశ్వాసాలు గల కుటుంబ పెద్దల భావజాలాన్ని వ్యతిరేకిస్తూ మొదటితరం, రెండవతరం మార్పును ఆహ్వానిస్తున్నప్పుడు మనం ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడమే ఆధునిక కథ. ఆ స్పృహతోనే నేను ఈ కథ రాయడం జరిగింది. ఇక వివేక్ పాత్ర సంస్కారం లేని వాతావరణంలో పెరిగిన మగపిల్లలు అహంభావ, అనారోగ్యకర, హింసాత్మక కుసంస్కారాలను ప్రదర్శించడం జరగడం మనం గమనిస్తాం. అందుకు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక మానసికంగా, లైంగిక, అత్యాచార సంఘటనలు ఎన్నైనా పేర్కొనవచ్చు. ఈ ఆధిపత్య ధోరణి చాలా కుటుంబాలలో మనం చూస్తూనే వున్నాం.
ప్రశ్న 6. ‘విభజిత’ కథకి ఆ పేరు పెట్టడంలోని ఔచిత్యమేమిటి? జానకి పాత్ర జీవితం శకలాలుగా మారి ఒక్కో శకలం ఒక్కో దశలోని వ్యథనీ, వేదననీ వెల్లడించడం వల్ల ఆమె జీవితం విభజితమైందని ఆ పేరు పెట్టారా? లేక మరో ఆలోచన ఏదైన ఉన్నదా?
జ: స్త్రీలు పుట్టుక నుండి మరణం వరకు కుటుంబ సభ్యుల సంరక్షణలో వుండాలని శాసించింది ఒక భావజాలం. నాగరికంగా ఎంతో ఎదిగామని చెప్పుకుంటున్న ఈ ఆధునిక సమాజంలో స్త్రీలలో కొంత మార్పు జరిగినప్పటికి, పూర్తిగా వారు వ్యక్తిగత స్వేచ్ఛ,స్వాతంత్రాలను అనుభవిస్తున్నారని అనుకోలేం. ఇప్పటికి అనేక కుటుంబాలలో స్త్రీలు వివిధ రూపాలలో అణచివేయబడుతూ వేధించబడుతున్నారు. ఏ స్త్రీ కూడా నేను కుటుంబ పరంగానో లేదా సమాజ పరంగానో ఎప్పుడు వేధించబడలేదని, లేక అణచివేయ బడలేదని సామాన్యంగా చెప్పలేదు, నూటికో కోటికో ఒక్కరు తప్ప. అలాంటి ఎంతోమంది జానకిలను, వారి గాథలను నేను ప్రత్యక్షంగాను, కొందరిని పరోక్షంగాను ఎరుగుదును. ఆ విధంగా స్త్రీలు సమాజంలో ఎన్ని రకాలుగా విభజించబడుతారో చూసి, రాయబడిన కథనే ఈ విభజిత. తమకు తెలియకుండానే స్త్రీలు కుటుంబ వ్యవస్థలో ఎలా కుంచించుకుపోతారో తెలియజేసే కథలు గతంలో అనేకం వచ్చివున్నాయి. కానీ విభజితలో జానకి సమాజంలో ఎన్నిరకాలుగా విభజించబడినా, మొక్కువోని ధైర్యంతో ఆమె తనను తాను గెలిపించుకుంది. అందుకే ఆ కథకు ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ కథా సంపుటికి అంతకన్నా ఔచిత్యం వున్న పాత్ర నాకు కనబడలేదు కాబట్టే ఆ పేరు పెట్టడం జరిగింది.
ప్రశ్న 7. ‘ఇడుపు కాయితాలు’ కథ భర్త వేధింపులకు, అత్తమామల దాష్టీకాలకు విరుగుడు విడాకులే అని చెబుతుంది. కానీ విడిపోయాకా కొత్త జీవితం ప్రారంభించడానికి, అందులో నెగ్గుకురావడానికి ఆత్మవిశ్వాసంతో పాటు సన్నిహితుల ఆసరా కూడా చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో అటువంటి పరిస్థితులున్నాయని భావిస్తున్నారా? లేనట్టయితే, అటువంటి పరిస్థితులు కల్పించడం ఎలా?
జ: ఇడుపు కాయితాలు కథ కూడా విభిన్న తరగతుల, విభిన్న వ్యక్తిత్వాల, విభిన్న కుటుంబ వాతావరణాల నడుమ ఒకే విధమైన సమస్య లేదా సంఘటన సంభవించినప్పుడు ఆయా వర్గాల స్త్రీలు తమ జీవితాలపై నిర్ణయాధికారాన్ని ఏ విధంగా కలిగివున్నారో చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతేగాని స్త్రీలకు విడాకులు ఒక్కటే పరిష్కారం అని అన్నట్లుగా ఏ పాత్ర ఎక్కడా చెప్పదు.
ఇకపోతే సమాజంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు స్త్రీలకు ఎదురైనప్పుడు పెద్దల లేదా స్నేహితుల ఆసరా అందులో ముఖ్యంగా కుంటుంబంలోని తల్లిదండ్రుల, సహోదరి, సహోదరుల ఆసరా ఎంతో అవసరం ఉంటుంది. ఒక్కోసారి ఆయా సన్నిహితుల లేదా స్నేహితుల సహకారం లభించ్చనప్పుడు తప్పకుండా అనుభవం గల ఒక కౌన్సిలర్ అవసరం ఎంతైనా వుంటుంది.
ఏ స్త్రీ తాను ఒంటరిగా ఉండాలని, లేదా కుటుంబం నుండి విడిపోవాలని ఎన్నటికీ కోరుకోదు. తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే కుటుంబం నుండి బయటకు వస్తుంది. అలాంటి వారిని సహృదయంతో సమాజం అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతో వుంది. ప్రస్తుత సమాజపరిణామ క్రమంలో చాలమంది స్త్రీలు విడాకులు తీసుకున్నాక పునః వివాహాలు కూడా చేసుకుని తమ గత జీవితాన్ని మరచిపోయి పిల్లా పాపలతో సంతోషంగా, ప్రశాంతంగా జీవించడం నేడు మనం చూస్తున్నాం.
ప్రశ్న 8. ఈ సంపుటిలోని కథలన్నీ ప్రత్యేకంగా ఈ సంపుటి కోసమే రాసినవా? ఎందుకంటే ఏ కథ చివర గతంలో ఏ పత్రికలోనూ ప్రచురితమైనట్టు సమాచారం లేదు.
జ: కథా సంపుటి లోని కొన్ని కథలు మాత్రం రెండు, మూడు స్త్రీవాద పత్రికలలో అచ్చు అయ్యాయి. సమయాభావం, కొంత అలసత్వం వలన వాటిని ఇతర పత్రికలకు పంపడం జరగలేదు. అందుకు కొన్ని కథలు క్రింది వాటిని ప్రచురించలేక పోయాను. అందులకు భూమిక, మాతృక మరియు మహిళా మార్గం సంపాదక వర్గానికి శన్నార్థులు చెబుతున్నాను. సంపుటి లోని మిగిలిన కథలు కేవలం నేను అప్పుడప్పుడు రాసిపెట్టుకున్న కథలను ఏరి కథా సంపుటిలో వేసుకోవడం జరిగింది.
ప్రశ్న 9. ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?
జ: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి కథ కూడా మనసు పెట్టి రాసినదే. ప్రతి కథ కూడా పరిశోధన చేసిన తర్వాత రాసినదే. ఒక కథ రాయాలంటే నేను చాలా హోం వర్క్ చేస్తాను. కాబట్టి ప్రతి కథ నాకు ఇష్టమైనదే. ఒక్కోసారి కథ చాలా తక్కువ సమయంలో రాయగలుగుతాను. ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు అయినా అది ముగింపు లేని కావ్యంలో నా కాగితాల అలమరలో ముడుచుకుని కూర్చుంటుంది.
ఒక అంశంపై కథ రాయాలని నేను ఎప్పుడైన అనుకుంటే క్లుప్తంగా ముందుగా ఆ అంశాన్ని ఒక పేపర్‌పై పెట్టుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు ఆ కథను రాస్తాను. ఆ సమయంలో అనుకోకుండానే మరో వస్తువు ఏదో వచ్చి నన్ను పలుకరిస్తే ఆ దిశగా నా కాలం కదులుతుంది. పాత కథ వెనక్కు వెళ్లి కొత్త వస్తువు కథారూపం దాల్చుతుంది. అలా ప్రతి కథ సంధి కాలం వీడి, పురిటి నొప్పులు భరించి కథగా వస్తుంది. తల్లికి వున్న బిడ్డల్లో మీకు ఏ బిడ్డ ఎక్కువ ఇష్టం అని ఎవరైనా అడిగితే.. ఆమె నుండి సమాధానం ఏo వస్తుందో ఒక రచయితగా నేను కూడా అంతే. అన్ని నా మానస పుత్రికలే అని సమాధానం చెప్పాల్సిన వుంటుంది. అన్ని ఇష్టంతో రాయడమే రచయితల సహజగుణం.
ప్రశ్న 10. ఈ సంపుటిలోని ఏ కథ రాయడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: నిజాయితీగా చెప్పాలంటే నేను కథ రాయడానికి ఎక్కువ సమయం తీసుకోను. మెదడును తొలిచేసే వస్తువు నా కన్నుల ముందు తారసపడితే, ఆ అంశం నన్ను వెంటాడి ఒక్క రోజుల్లో కథను రాయిస్తుంది. అలా రాసిన కథలు చాలా వున్నాయి. నేను కవిత్వం రాసిన, కథ రాసినా వాటిని ఒక్కసారి కాదు, అనేకసార్లు ఎడిటింగ్ చేసుకుంటాను. ఎన్నోసార్లు మననం చేసుకుంటూ రాసిన నా కథలు పాఠకులను ఆలోచింప చేయాలని కోరుకుంటాను. ఒక కథల పుస్తకం ప్రచురించాకా అందులోని కథలు పాఠకులు ఎలా స్వీకరిస్తారో అన్న భయం నన్ను ఎప్పుడు భయపెడుతూనే వుంటుంది. అలా రాసిన కథే విభజిత. ఇక పుస్తక టైటిల్‌గా విభజిత పెట్టడానికి కారణం ఆ కథలో చెప్పినట్లుగా స్త్రీలు ఈ పితృస్వామిక సమాజంలో అంచెలంచలుగా సామాజిక, సంస్కృతి పరంగా అనేక మార్పు చెందుతూ కూడా వేనూళ్ళుగా ఈ సమాజంలో పాతుకునిపోయిన పితృస్వామిక భావజాలం ఆమెను కొత్త రూపాలతో వివక్ష, అణచివేతలు చేస్తూ, విభజించబడటాన్ని మనం చూస్తాం. ఆ కోణంలో కథ రాయడానికి నాకు చాలా సమయం పట్టింది. దాదాపుగా ఒక సంవత్సరం పట్టిందని చెప్పవచ్చు. నేను అనుకున్నట్లుగా స్త్రీల స్థితిగతులన్నింటిని ఒక జీవిత కాల కథలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, కథ అనేక మలుపులు తిరుగుతూ ముందు నవలగా రూపాంతరం చెందింది. ఒక నవలకు సరితూగగల ఒక పెద్ద అంశాన్ని ఒక కథలో కుదించడం చాలా కష్టం అయింది. కథ రూపంలోకి తీసుకురావాలని అనేకసార్లు ఆ కథను తిప్పి, తిప్పి చాలాసార్లు రాసాను. అన్ని కథల కన్నా ఆ కథకు ఎక్కువగా శ్రమించాననే నేను చెప్పాల్సి వుంటుంది. చాలా కష్టపడి సాధించిన ఏ విషయమైనా అది మనకు అత్యంత ప్రీతిపాత్యo ఎలా అవుతుందో,ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం.
ఇక ఈ సంపుటిలోని, మరో కొత్త కోణంలో రాసిన కథ ‘హాఫ్ విడో’ కథ. నిజానికి ఒక ప్రముఖ విమర్శకుడితో చాలా విషయాలు చర్చకు వచ్చినప్పుడు, ఈ టైటిల్ గురించి మా మధ్య చర్చలు నడిచాయి. ఆయన జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని కథగా చెప్పి ఆ పాత్ర పట్ల చాలా ప్రేమను, అభిమానాన్ని చూపారు. నా జీవితంలోకి తరచి చూస్తే అలాంటి ‘హాఫ్ విడోస్’ కళ్ళముందు మెదిలారు. అలా రూపాంతరం చెందిన నా దగ్గరి బంధువు కథనే ఈ హాఫ్ విడో కథ. విభజిత కథా సంపుటిలో తప్పకుండ వుండాల్సిన కథ అని కాస్త ఆ కథను త్వరగా రాసిన మాట నిజం. రెండు రోజుల్లో ఆ కథను రాసాను. పుస్తకంలో ఆ కథ వేసుకోవాలన్న తొందరలో ఆ పాత్రకు సరిగ్గా న్యాయం చేయలేక పోయనేమో అని చాలాసార్లు అనుకున్నాను. పుస్తక రూపంలోకి ఆ కథ వచ్చాక కొంత తృప్తీ పడ్డాను. నిజంగానే ఆ పాత్ర ఇప్పటికి సజీవమై వుంది. మొన్నీమధ్య ఆ పాత్రను దగ్గరగా చూడడం తరచుగా జరుగుతున్న సందర్భంలో నేను ఆ పాత్రకు ఇంకా న్యాయం చేయాల్సివుంది. ఆమె మనసు పొరలను ఇంకా విడమరిచి చెబితే బాగుండేదేమో అని అనిపించింది. ఆ పాత్రను ఇంకాస్త పాలిష్ సేసి రాస్తే, ఆ పాత్రకు సరైన న్యాయం కలిగేది.
ప్రశ్న11. ‘విభజిత’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ఈ పుస్తక ప్రచురణకు ముందుగా పది నుంచి పన్నెండు కథలు మాత్రమే వుండాలని అనుకున్నాను. పాత ఫైల్స్‌లో కాగితాలు తిరగేస్తుంటే, ఎప్పుడో సగం రాసిపెట్టుకున్న కథలు కనబడ్డాయి. అలా వున్న కథలు కొన్నింటిని ఎన్నుకుని పూర్తిచేసాను. వాటిని ఎడిటింగ్ చేసుకుంటున్న సందర్భంలో వచ్చిన ఆలోచనతో ఈ సంపుటిలో ఆ ఐదు కథలను ప్రచురించడం జరిగింది. ఫలితంగా ఆ కథలు కూడా ఈ సంపుటిలో స్థానం పొందాయి. మొత్తం పదిహేడు కథలు విభజితలో చేరడం గొప్ప అనుభూతి.
ఈ సంపుటి వేస్తున్నప్పుడు కొంత కమ్యూనికేషన్ గ్యాపు వచ్చింది. కానీ అది తాత్కాలికమే.. ఆ తర్వాత వాటిని రెక్టిఫై చేసుకున్న తర్వాత ప్రశాంతంగా పుస్తక ప్రచురణతో పాటు ఆవిష్కరణ సభ కూడా జరిగింది. ఆ సభలో వక్తలు కథలను విశ్లేషణ చేసిన తీరు మరో మధురమైన అనుభూతిని ఇచ్చింది.
ఇక పాఠకుల ఆదరణ అంటారా? గణిక, స్వయంసిద్ధలకు ఇచ్చినంత ప్రమోషన్ కోసం సమయాన్ని, ఏకాగ్రతను విభజితకు ఇవ్వలేకపోయాను. కారణం నా వ్యక్తిగత కారణాలు. ఎక్కువ సమయం నా కుటుంబoలో జరిగిన మూడు వివాహ వేడుకలు. నేను స్వయంగా పాల్గొనవల్సి రావడం వలన నేను ఏ పత్రికలకు రివ్యూల కోసం పుస్తకాలు పంపలేకపోయాను. ఒక్క భూమిక ఫిబ్రవరి 2024 పత్రికలో తప్ప ఎక్కడా రివ్యూలు రాలేదు. అది నా అలసత్వానికి నిదర్శనం అని భావిస్తాను. ఇంకొక విషయం కూడా వుంది. కొన్ని కారణాల వలన నా కథ సంపుటి 2023 డిసెంబరు చివర వారంలో ప్రచురణ అయి వచ్చింది. అందువల్ల పుస్తక ప్రచురణ 2024 సంవత్సరంగా ప్రచురణ చేయడం జరిగింది. దానివలన కొంతమంది మిత్రులు కోరినట్లుగా 2023 సంవత్సరపు అవార్డు పోటీలకు పంపలేకపోయాను. జనవరి 2024లో విభజిత పుస్తక ఆవిష్కరణ అనంతరం నేనా కథల సంపుటి గురించి మర్చిపోలేదు కానీ కాస్త పుస్తక ప్రమోషన్ విషయంలో అలసత్వం వహించాననే చెప్పాలి.. సంచిక ఇంటర్వ్యూ సందర్భంగా నన్ను నా కథలను ప్రోత్సహించిన నా మిత్రులందరికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు విజయ గారూ.
విజయ భండారు: ధన్యవాదాలు. నేను ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా చాలా ఆలస్యం చేసినా, మన్నించి, ఓపికగా ఎదురు చూసి, విభజిత కథా సంపుటిని సంచిక అంతర్జాల పత్రికలో పరిచయం చేసిన సోమ శంకర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.
***
విభజిత (కథా సంపుటి)
రచన: విజయ భండారు
ప్రచురణ: హస్మిత ప్రచురణలు
పేజీలు: 175
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
రచయిత్రి ఫోన్: 8801910908, 9347357402
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/vibhajitha
https://www.flipkart.com/vibhajitha/p/itmaffd9a15c7758
~
‘విభజిత’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/vibhajitha-book-review-kss/