[dropcap]మౌం[/dropcap]టెనీరింగ్… పర్వతారోహణ… కొందరికి హాబీ! కొందరికి సాహసకృత్యం! మరికొందరికి జీవిత లక్ష్యం!!
చిన్నా పెద్ద కొండలను శిఖరాలను అధిరోహించి, మరింత పెద్ద పర్వతాలకు తమను తాము సిద్ధం చేసుకునేవారిలో చాలామంది గమ్యం “ఎవరెస్ట్” అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్ని పర్వతాలను అధిరోహించినా, ఎవరెస్టు శిఖరాన్ని చేరితే కలిగే తృప్తిని వర్ణించలేం.
శారీరకంగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారికే… ఎవరెస్టుని అధిరోహించడం అత్యంత ప్రయాసలతో కూడినదవుతుంది. అలాంటిది శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కునే ఓ మహిళ… ఊపిరితిత్తుల పరిమాణం కుంచించుకుపోవడం వల్ల తనకిష్టమైన భరతనాట్యాన్ని వదులుకుని డెస్క్ జాబ్‌కి పరిమితమైపోయిన ఈ యువతి… పర్వతమాత పిలుపునందుకుని… అనేక శారీరక మానసిక ఇబ్బందులను అధిగమించి ఎవరెస్టును అధిరోహించడం మాటలు కాదు…
రెండు వందల మీటర్ల దూరంలో తన తుదిగమ్యం కనబడుతుంటే… ఆ స్థితిలో శిఖరం వైపు కాకుండా పర్వతం దిగువకి నడిచారంటే బలమైన కారణం ఉండాలి… ఆ కారణం వల్లే అత్యంత సమీపానికి వచ్చినా తన చిరకాలపు వాంఛని విడిచిపెట్టి… మరో రకంగా విజయం సాధించారు నీలిమ పూదోట. ఆ విజయంలో ఒక భాగం “ఫ్రం ఎవరెస్ట్ విత్ లవ్” అనే ఆంగ్ల రచన.
***
మార్పును సాధించగలిగే శక్తి మన చేతుల్లోనే ఉందని, అందుకు నీలిమే నిదర్శమని అంటారు శేఖర్ బాబు బాచినేపల్లి ఈ పుస్తకానికి రాసిన సందేశంలో. ఎవరెస్టును అధిరోహించాలనే తన సంకల్పం కోసం నీలిమ తనను తాను మార్చుకున్న వైనం అందరికీ ప్రేరణనిస్తుంది.
ఈ పుస్తకంలో పర్వతాలపైకి తన ప్రయాణాల గురించి నీలిమ పాఠకులకి సూటిగా వివరిస్తారు. మౌంటనీరింగ్ అంటే ఆటలు కాదని అంటూనే, ఓ పర్వతారోహకురాలికి అది మరింత కఠినమైనదని వివరిస్తారీ పుస్తకంలో. తాను ఎవరెస్టును అధిరోహించే ప్రయత్నంలో 21 మార్చి 2016 నుంచి 22 మే 2016 వరకూ జరిగిన ఆయా ఘటనలను తన తల్లిదండ్రులకి… ముఖ్యంగా వాళ్ళ అమ్మగారికి వివరిస్తున్నట్టుగా దాదాపు రోజూ రాసుకున్న నోట్స్ నుంచి – ఎవరెస్ట్ నుంచి తిరిగి వచ్చాక పుస్తకరూపం కల్పించారు. ఈ పుస్తకం తమలోకి తాము చూసుకుని ప్రేరణ పొందేందుకు ఉపయోగపడుతుందని రచయిత్రి భావించారు.
ఈ పుస్తకంలో భావోద్వేగాలన్నీ ఉన్నాయి. మీకు ‘విశ్వాసం’ కావాలంటే ఇందులో దొరుకుతుంది. నిరాశానిస్పృహలూ ఉంటాయి. మీకు ఉత్కంఠభరితమైన కథనం ఇష్టమైతే, ఈ పుస్తకంలో అదే వుంది. మీ జీవితంలోని పర్వతాలను ఎదుర్కోడానికి మీరు శ్రమిస్తుంటే, ఈ పుస్తకం మీకు ధైర్యాన్నిస్తుందని రచయిత్రి అంటారు.
ఈ పుస్తకంలో ఎవరెస్ట్ జర్నల్ అనే విభాగంలో మూడు ఉపవిభాగాలు (1) ప్రీ-ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ (ఎవరెస్ట్‌కి ముందరి సాహసయాత్ర) (2) ఎవరెస్ట్ డైరీస్ (3) పోస్ట్ ఎవరెస్ట్ (ఎవరెస్ట్ అనంతరం) ఉన్నాయి. వీటి తర్వాత ముగింపు, పదకోశం ఉన్నాయి.
***
2015 ఏప్రిల్ నెలలో ఎవరెస్ట్ ఎక్కాలనే సంకల్పంతో నేపాల్ చేరారు నీలిమ. అక్కడ నామ్‌చేలో షెర్పా గైడ్ నారాయణ్ లామా ఆమెతో ఇలా అన్నారు: “మీ విధిని పర్వతదేవుళ్ళు నిర్ణయిస్తారు. తమపై ఎవరు కాలు మోపాలో, ఎవరు ఎంత వరకు అధిరోహించాలో, ఎవరు గమ్యానికి చేరాలో, ఎవరు వెనక్కి మళ్ళాలో… మృతదేహాలుగా ఎవరు అక్కడ పడి ఉండాలో… వాళ్ళు నిర్ణయిస్తారు“. ఈ సంభాషణ జరిగింది 21 ఏప్రిల్ 2015 నాడు. 28 ఏప్రిల్ 2015 నాడు అతని మాటలు నిజమనిపించాయి రచయిత్రికి. ఎందుకంటే నేపాల్‌లో పెనుభూకంపం వచ్చిందా రోజు. వేలాదిమంది బలైన రోజు. తనూ, తన మిత్రులు సజీవంగా బయటపడడం అద్భుతమేనని నీలిమ భావించారు.
ఆ ఘటనలో తాను బ్రతికి బయటపడడం ఓ అదృష్టమనీ, తాను ఎవరెస్ట్ అధిరోహించాలి కనుక సజీవంగా ఉన్నానని భావించారు. అన్ని సన్నాహాలు చేసుకుని మరుసటి సంవత్సరం తిరిగి వచ్చారు. ఆ సంవత్సర కాలంలో తనని తాను మార్చుకున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
22 మార్చి 2016 నాడు ఖట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రంలో దిగాకా చూస్తే నేపాల్‌లో భూకంపం సంభవించి దాదాపు ఏడాది గడిచినప్పటికీ, పరిసరాలలో ఇంకా ఆ విషాదపు ఛాయలు నెలకొనే ఉన్నాయనీ కాని ప్రజల్లో మాత్రం నూతనోత్సాహం ఉందని, ఎప్పటిలానే ఆదరంగా ఆహ్వానించారని చెబుతారు.
24 మార్చి 2016 నాడు పశుపతినాథ్ దేవాలయానికి వెళ్ళినప్పుడు గత ఏడాది జరిగిన ఘటన గుర్తొస్తుంది. 2015లో ఆలయంలో ఓ పూజారి పంచముఖి రుద్రాక్షని ప్రసాదంగా ఇచ్చి, ఎవరెస్ట్‌పై భారీ ప్రమాదం జరుగుతుందనీ, ఆ రుద్రాక్షని సదా వెంట ఉంచుకోమని ఆయన నీలిమకి చెప్పారట. ఆయన మాటలని తేలికగా తీసుకుని, ఆ రుద్రాక్షని తన డ్రెస్ లోపలి జేబులో వేసుకున్నారట. భూకంపం సంభవించడం, నీలిమ, ఆమె మిత్రబృందం కష్టం మీద బయటపడి స్వదేశానికి రావడం జరిగాక, ఇంట్లో బట్టల దుమ్ము దులుపుతుంటే ఆ రుద్రాక్ష జారిపడిందట! దైవ మహిమో, విధి సంకల్పమో… మళ్ళీ నేపాల్‌కి తీసుకువచ్చిందనుకుంటూ స్వామి వారి దర్శనం చేసుకుని హోటల్ రూమ్‌కి వచ్చేస్తారు నీలిమ.
ఖట్మండు నుంచి లుక్లాకి విమానంలో వస్తూ నాటి పెను భూకంపం సృష్టించిన వినాశనాన్ని గుర్తుచేసుకుంటారు. అలాగే ఎవరెస్టుని అధిరోహించాలని నిర్ణయించుకున్నప్పుడు తనని వెక్కిరించినవారిని, నిరాశపరిచినవారిని తలచుకుంటారు. తొమ్మిది నెలలపాటు అనారోగ్యంతో మంచాన పడి ఉండడం నుంచి మనోబలం పొందడానికి, ఎవరెస్టును అధిరోహించడానికి అవసరమైన శారీరక దృఢత్వం పొందడం కోసం శాఖాహారం నుంచి మాంసాహారానికి మారడానికి, తననొక బరువుగా భావించిన వారిని – వాళ్ళ అభిప్రాయం తప్పు అని నిరూపించడానికి ఆమె ఎవరెస్టునే ప్రేరణగా తీసుకున్నారు. ఎవరెస్టుని నేపాలీయులు పిలుచుకునే ‘సాగరమాత’ అనే పిలిచి, ఆ పర్వతంలోనే తన స్ఫూర్తిదాతని చూసుకున్నారు.
సన్నాహాలలో భాగంగా ‘మేరా’ శిఖరాన్ని అధిరోహించేముందు ఈ యాత్రలో తనకి తోడుగా ఉండబోతున్న షెర్పాలు – చెంబీ దాయి, మింగ్మా దాయి లను కలుస్తారు. “పర్వతాలు మిమ్మల్ని వినమ్రులుగా చేస్తాయి. మీలో అహంకారాన్ని తొలగిస్తాయి. మీ గత విజయాల గొప్పదనాన్ని తీసేసి, మళ్ళీ కొత్తగా ప్రారంభించమంటాయి. మీ అహాన్ని సంతృప్తిపరుచుకోడానికి కాకుండా, మీ కృతజ్ఞతలు తెలుపుకోడానికి అధిరోహించాలి, అప్పుడే వాటి ప్రేమ మీకు అనంతంగా… షరతులు లేకుండా లభిస్తుంది” అంటారు నీలిమ మేరా శిఖరాన్ని అధిరోహించేముందు.
30 మార్చి 2016 నాడు టాంగ్‌నాంగ్ వద్ద తమ యాత్ర నిర్వాహకుడైన లక్పా షెర్పాని కలుస్తారు నీలిమ. అన్నాళ్ళు అతనితో ఫోన్, ఈమెయిల్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరిపారు. ముఖాముఖి కలుసుకోడం అదే మొదటిసారి. అడ్వెంచర్ 14 పీక్స్ నేపాల్ పై లిమిటెడ్ అనే సంస్థకి లక్పా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. అంతేకాదు, అతను చెంబీ దాయి కొడుకు కూడా. తండ్రీ కొడుకులు చాలా కాలం తర్వాత ఈ రోజు కలుసుకుంటారు.
మేరా శిఖరం అధిరోహించి, ఖట్మండు తిరిగొచ్చాక, నగరంలో ఎంత కాలుష్యం ఉందో తెలుస్తుంది అంటారు, పర్వతాల స్వచ్ఛతని తలచుకుని.
ఎవరెస్టుని ఉత్తరం వైపు నుంచి ఎక్కేందుకు నీలిమ, ఆమె బృందం లాసా చేరుతారు. 13 ఏప్రిల్ 2016 నాడు రాత్రి హోటల్‌లో భోంచేస్తుండగా భూమి కంపించి, బల్లలు కదిలిపోతాయి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. తర్వాత తెలుస్తుంది, ఇండియా- మయన్మార్ సరిహద్దులలో భారీ భూకంపం సంభవించిందని. కానీ ఈ బృందం మాత్రం ప్రశాంతంగానే ఉంటారు. ఎందుకంటే అక్కడ తాము చేయగలిగింది ఏమీ లేదు గనుక.
20 ఏప్రిల్ 2016 నాడు ఎవరెస్ట్ యాత్రకి ముందుగా ఆచారం ప్రకారం జరిపే పూజలో పాల్గొంటారు నీలిమ. లామా ఆమెను ఆశీర్వదిస్తారు. ఆరోజు విపరీతంగా మంచు కురిసింది.
ఇక అసలైన ఆరోహణ ప్రారంభమవుతుంది. అడ్వాన్డ్ బేస్ క్యాంప్ (ABC) చేరుకుంటారు. అక్కడ విపరీతమైన మంచు. భరించలేని చల్లదనం. 6400 మీటర్ల ఎత్తులో టెంట్ లోపల -10 డిగ్రీ సెల్సియస్‍ల ఉష్ణోగ్రత. అక్కడ ఆక్సీజన్ 60 శాతమే ఉంటుంది. హృదయ స్పందన రేటు 110. ఆ స్థితిలో ప్రాకృతిక అవసరాలు తీర్చుకోవడం కూడా అతికష్టంగా ఉంటుంది. ఏం తిన్నా కడుపులో ఇమడక వాంతులైపోతుంటాయి, ఇంకో పక్క విరేచనాలు! తాను అత్యంత దుర్భరమైన స్వప్నాన్ని సాకరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, తాను తిరిగి వస్తానని, అమ్మ వెచ్చని ఒడిలో నిద్రిస్తానని వాళ్ళ అమ్మకి రాస్తారు రచయిత్రి.
అక్కడి నుంచి ‘క్యాంప్ 1’కి తాళ్ళు కట్టే పనిని నాలుగు రోజులు గడిచినా చైనా షెర్పాలు మొదలుపెట్టరు. 29 ఏప్రిల్ 2016 నాడు అక్కడ ఆక్సీజన్ స్థాయి 40 శాతానికి పడిపోవడంతో… నీలిమ ఒక రకమైన అపస్మారకస్థితిలోకి వెళ్ళి తనకు తెలియకుండానే టెంట్ తెరిచి గట్టిగట్టిగా కేకలు పెడతారు. అప్పుడు సోనమ్ అనే మరో షెర్పా వచ్చి, పరిస్థితి గ్రహించి ఆమెకు ఆక్సీజన్ మాస్క్ పెట్టాకా, కాసేపటికి కోలుకుంటారామె. అనుభవజ్ఞులైన తన షెర్పాలకి ఈ విషయం ఎందుకు తట్టలేదా అని అనుకుంటారు. మింగ్మా కూడా వింతగా ప్రవర్తిస్తూ, నీలిమని నిరుత్సహాపరుస్తూంటాడు. అతను తనకి విపరీతమైన తలనొప్పి వస్తోందని చెబుతాడు. అవసరమైతే అతనికి కూడా ఆక్సీజన్ సిలండర్ తీసుకుంటాననీ, ఎంత ఖర్చయినా పర్వాలేదని, తన ప్రాణంతో పాటూ, తన షెర్పాల ప్రాణం కూడా తనకి ముఖ్యమని చెబుతారు నీలిమ అతనితో. అయితే ఆ క్లిష్టమైన వాతావరణంలో ఆక్సీజన్ తక్కువగా ఉన్న ఆ చోట అంత ఎక్కువకాలం ఉండడం మంచిది కాదని తిరిగి బేస్ క్యాంప్‌కి (BC) వచ్చేస్తారు.
తమ బృందంలోని ఒకే ఒకరి వద్ద ఉన్న వై-ఫై హాట్‌స్పాట్ పని చేస్తుండంతో దాని సహాయంతో అమ్మానాన్నలతోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ మాట్లాడతారు నీలిమ బేస్ క్యాంప్ నుంచి. ఓ రాత్రి భోజనం అయ్యాకా, లక్పా ఫోన్ చేసి ఎవరెస్ట్ దక్షిణంవైపున బేస్ క్యాంపులో నీలిమ మిత్రుడు నరేష్ క్షేమంగా ఉన్నారని చెప్తాడు. కాసేపు నీలిమతో మాట్లాడాకా, “మా నాన్నతో మాట్లాడచ్చా?” అని అడిగి చెంబీ దాయితో మాట్లాడుతాడు. సంభాషణ పూర్తయ్యాక, చెంబీ దాయి ముఖంలో కనబడ్డ చిరునవ్వు అమూల్యమైనదని అంటారు నీలిమ.
3 మే 2016 న తిరిగి ABC చేరుకుంటారు. అక్కడ్నించి పైకి ఎక్కే కొద్దీ పర్వతారోహకులకీ, షెర్పాలకీ మధ్య అంతరం పెరుగుతుండడం గమనిస్తారు. వాళ్ళు వీళ్ళని క్లయింట్స్‌లాగా, వీళ్ళు వాళ్ళని కేవలం డబ్బు తీసుకుని సేవలందించేవాళ్ళుగా పరిగణించడం మరీ ఎక్కువవుతుంది. అందరూ మనుషుల్లా ఉండకుండా, మధ్యలో విభజన రేఖలు గీసుకుంటున్నారని ఆమె అంటారు. అక్కడి నుంచి క్యాంప్ 1 చేరుతారు. మింగ్మా ప్రవర్తన మితిమీరుతూంటుంది. తర్వాత క్యాంప్ 2 కూడా చేరుకుంటారు. ఈ క్రమంలో నార్త్ కోల్ వాల్ ఎక్కడం పూర్తి చేస్తారు నీలిమ. అక్కడ్నించి తిరిగి ABC చేరుకుంటారు. అక్కడ్నించి మళ్ళీ బేస్ క్యాంప్‌కి (BC) వచ్చేస్తారు.
ఈ దశలో వేర్వేరు దేశాల నుండి వచ్చిన పర్వతారోహకుల మధ్య అభిప్రాయభేదాలు, వాదోపవాదాలు నీలిమని చికాకుపెడతాయి. మానసిక ప్రశాంతతని భగ్నం చేస్తాయి.
వాతావరణం అనుకూలించడంతో 15 మే 2016 నాడు బేస్ క్యాంప్ నుంచి అడ్వాన్డ్ బేస్ క్యాంప్‌కి బయలుదేరుతారు. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తారు. దాదాపు 7000 మీటర్లు దాటాక ఒకచోట విశ్రాంతి కోసం ఆగుతారు. మింగ్మా సతాయింపులు మాత్రం ఆగవు. చాలా చిరాకుగా ఉంటాడు, నిరుత్సాహంగా ఉంటాడు. ఏదేదో మాట్లాడుతాడు. “क्या हैं ऊपर? कुंछ भी नहीं! आप जैसे लॊग यहां आते ही नहीं तॊ ये काम करना ही नहीं पडता ” (ఏముంది పైన? ఏమీ లేదు. మీలాంటి వాళ్ళు ఇక్కడికి రాకపోతే, మాకీ పని చేసే అవస్థ తప్పుతుంది) అంటాడు. ఈ మాటలు చాలా దురుసుగా అనిపించినా నీలిమ పట్టించుకోరు.
అతని విపరీత ప్రవర్తనని తట్టుకుంటూ, నార్త్ కోల్ వాల్ అధిరోహించి, క్యాంప్ 1 అక్కడ్నించి క్యాంప్ 2 చేరుతారు. క్యాంప్ 2 వద్ద సుమారు 7700 మీటర్ల ఎత్తులో అత్యంత ఇరుకైన స్థలంలో టెంట్ వేస్తాడు చెంబీ దాయి. మింగ్మా గొడవ భరించలేకపోవడంతో, అతన్ని హెచ్చరించమని చెంబీ దాయికి చెబుతారు. తనే ఊరుకుంటాడని చెంబీ దాయి అంటాడు. క్యాంప్ 3 అక్కడికి 600 మీటర్ల దూరంలో ఉంది. దాని ఎత్తు 8300 మీటర్లు. క్యాంప్ 3 వద్ద టెంట్ వేయడానికి చెంబీ దాయి వీళ్ళిద్దరికన్నా ముందే ఎక్కడం ప్రారంభిస్తాడు. మింగ్మా మాత్రం మాటిమాటికి ఇబ్బంది పెడుతూ, ఒక అనవసరమైన టెక్నిక్ చెప్పి, నీలిమ అతి కష్టం మీద క్యాంప్ 3 చేరేట్టు చేస్తాడు. ఒక చోట నీలిమని తోసేయబోతాడు కూడా.
21 మే 2016 నాడు శిఖరారోహణ మొదలుపెడతారు. కాని ట్రాఫిక్ జామ్ అవుతుంది. వీళ్ళ కంటే పైన నలుగురు ఉన్నారు. వాళ్ళు చాలా మెల్లగా ఎక్కుతున్నారు. వీళ్ళ క్రింద ఉన్నవాళ్ళు తొందరపడుతున్నారు. పైనుంచి మంచు ముద్దలు వీళ్ళ మొహాల మీద పడుతుంటాయి. వెనక్కి వెళ్ళిపోదామంటూ గొడవ ప్రారంభిస్తాడు మింగ్మా. “तुंम मरॊगी और मुझे भी मरवाऒगी” (నువ్వు చస్తావు, నేను చచ్చేందుకు కారణం అవుతావు) అంటూ తిడతాడు. అతి కష్టం మీద స్టెప్ 1 చేరుతారు, అక్కడా కాసేపు విశ్రాంతి తీసుకుని స్టెప్ 2 కి చేరుతారు. ఇక్కడి నుంచి శిఖరం సుమారు 250 మీటర్ల దూరంలో ఉంటుంది.
మరి కొంచెంపైకి వెళ్ళాకా మింగ్మా ప్రవర్తన పూర్తిగా అదుపు తప్పుతుంది. చెంబీ దాయి అతన్ని సముదాయించడంలో విఫలమవుతాడు. అప్పుడు గ్రహిస్తారు నీలిమ… ఆక్సీజన్ తక్కువై అతనికి చిత్తభ్రమ కలుగుతోందని, ఆ వాతావరణంలో మరింతసేపు ఉంటే అతని ప్రాణాలకే ప్రమాదమని. ఏమీ చేయలేక కాసేపు దిగులు పడతారు. కాని తన లక్ష్యం కన్నా అతని ప్రాణమే ముఖ్యమని క్రిందకి దిగడం మొదలుపెడ్తారు.
మింగ్మా కిందకి పరిగెత్తబోతే, అతన్ని అనుసరిస్తూ చెంబీ దాయి కూడా వెళ్తాడు – నీలిమని జాగ్రత్తగా దిగమని చెప్పి! షెర్పాలు డబ్బుల కోసం ఎవరెస్ట్ మీద సహాయ నిరాకరణ చేస్తారని అంతకు ముందు ఎవరో చెప్పిన మాటలు గుర్తొచ్చి… ఆమె ఆలోచనలు అదుపు తప్పుతాయి. ఏకాగ్రత కోల్పోవడంతో కాలు జారి పక్కకి పడిపోతారు. అడుగున పదివేల అడుగుల లోతున్న లోయ. వెన్నుపట్టెకి వేలాడుతూ నీలిమ… ఆమె దగ్గర ఆక్సీజన్ కూడా ఎక్కువ లేదు. పైకెక్కుదామని ప్రయత్నించే క్రమంలో మరింతగా క్రిందకి జారిపోతున్నారు. ఇక మృత్యువుని ఆహ్వానించడానికి సిద్ధమైపోతారు. ఇంతలో శిఖరారోహణ ముగించుకుని క్రిందకి వస్తున్న పర్వతారోహకుడి షెర్పా ఒకరు నీలిమని గమనించి పది నిమిషాల పాటు కష్టపడి పైకి లాగి రక్షిస్తాడు. అతి కష్టం మీద క్యాంప్ 3 కి చేరుకుని ఒక గంట విశ్రాంతి తీసుకున్నాకా స్పాన్సర్ల కోసం ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు.
వాతావరణం ప్రతికూలంగా మారిపోతుంది. మంచు చరియలు విరిగి పడడం ప్రారంభిస్తాయి. ఇక ఈ ఏడాదికి క్లైంబింగ్ సీజన్ ముగిసినట్టేనని చెంబీ దాయి చెప్తాడు. ABC చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీలిమ కళ్ళలోండి ఏకధారగా నీరు కారుతుంది. ఆమెని ఓదారుస్తూ “कुंछ नहीं हुआ है! जिंदा है ना… बस है! फिर आ जाना. पहाड तो यही रहॆगी.” (ఏం కాలేదమ్మా… నువ్వు బ్రతికి ఉన్నావు. చాలు. మళ్ళీ రా. పర్వతమైతే ఇక్కడే ఉంటుంది) అంటాడు చెంబీ దాయి.
క్రుంగిపోయిన దశలో బేస్‌క్యాంప్‌కి చేరిన నీలిమ ఫోన్‍లో అభినందన సందేశాలు వెల్లువలా వచ్చిపడతాయి. ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో అందరూ ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అదిరోహించినట్లు భావించారు. తర్వాత ఇంటికి చేరాక తాను శిఖరాన్ని అధిరోహించలేదని, కేవలం 8650 మీటర్ల ఎత్తుకు చేరగలిగానని స్పాన్సర్లకు, ప్రభుత్వానికి తెలియజేస్తారు. అయినప్పటికీ ఎవరెస్టు పర్వతంపై అంత ఎత్తుకు చేరడం తక్కువ ఘనత కాదని; ఎక్కలేకపోయిన 200 మీటర్ల కన్నా, ఎక్కిన 8650 మీటర్లే గొప్ప అని స్పాన్సర్లు అనడంతో ఆమెలో నిరుత్సాహం తగ్గుతుంది.
2 జూన్ 2016 నాడు మింగ్మాని ఖాట్మాండుకు తీసుకొచ్చారు. అతనిని పరీక్షించిన వైద్యులు అతని మెదడులోని నరాలలో రక్త ప్రసరణ ఆగిపోయిందని, మూడు నరాలలో రక్తం గడ్డ కట్టుకుపోయిందని తెలుపుతారు. అతను అత్యంత క్లిష్టమైన స్థితిలో ఉన్నాడని చెబుతారు. 11 రోజులు ఐసియులో, 10 రోజులు మరో వార్డులో ఉన్నాకా అతని ప్రమాదం తప్పిందని తెలిపారు వైద్యులు.
***
కాస్త విరామం తీసుకుని, ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తే… పర్వతాల కన్నా మనిషి ప్రాణమే ముఖ్యమని తనకి చెప్పేందుకే ఈ ఘటన జరిగిందని అనుకుంటారు. అంతకన్నా ముఖ్యంగా తన అనుభవాలకు అక్షర రూపం కల్పించి ఎవరెస్ట్ ఎక్కడం గురించి అందరికీ తెలియజెప్పడానికి ఇదో అవకాశమని గ్రహించారు నీలిమ.
శిఖరానికి 500 మీటర్ల దూరంలో ఉన్న బ్రిటీష్ పర్వతారోహకుడు లెస్లీ బిన్స్… పైకి ఎక్కడం మానేసి, ప్రమాదంలో చిక్కుకున్న సునీత హజ్రా అనే భారతీయ పర్వతారోహకురాలిని కాపాడి, తన లక్ష్యాన్ని వదిలేశాడని తెలిసి… తన నిర్ణయం సరైనదేదని తృప్తిచెందుతారు నీలిమ.
మింగ్మా అరోగ్యపరిస్థితి ఎలా ఉందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు నీలిమ. అతని ఆచూకీ ఎవరూ చెప్పలేకపోతారు. యాత్రలో అతని వైఖరిని తెలుసుకుని అతన్ని షెర్పాగా తొలగించిదట ఆ కంపెనీ. చివరికి తొమ్మిది నెలల తర్వాత – అతను డార్జిలింగ్‌లో ఉంటున్నాడని తెలుసుకుని వెళ్ళి కలుస్తారు. అతను పూర్తి ఆరోగ్యంతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడం చూసిన నీలిమ మనసు కుదుటపడుతుంది. తన చర్యలకి అతను క్షమాపణలు కోరుతాడు.
“Summit is down, not up” అని ఓ సహ పర్వతారోహకుడు అన్న మాటలకి అర్థం అప్పుడు తెలుస్తుంది రచయిత్రికి. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత తృప్తి కలుగుతుంది.
యాత్రలో సంకల్పించినట్లుగా, ఇంటికి చేరాక పింకథాన్‍కి మద్దతుగా ఓరోజు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకూ బూట్లు లేకుండా ఉట్టి కాళ్లతో 348 కిలోమీటర్ల పరుగులో పాల్గొన్నారు.
ఇది విలువలు, స్నేహం, ప్రేమ, క్షమల కథ. ఇంగ్లీష్ పుస్తకమైనా, సరళమైన శైలిలో హాయిగా చదివిస్తుంది.
***
From Everest With Love
By Neelima Pudota
Published By:
BSC Publishers and Distributors,
Door No 3-5-121/E/1/16, KD House, Ramkote, Near Shalimar Function Hall
Hyderabad – 500001. Ph:040-23446841. Email:bscpdin@gmail.com
Pages: 242
Price: ₹325/-
For copies online: Amazon, Flipkart
For copies offline, contact Publisher.