[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
గోరింట పూసింది:
[dropcap]ఓ[/dropcap] రోజున అక్క ఎంతో ఉత్సాహంతో అమ్మతో కబుర్లు చెబుతున్నది. వారి మాటల మధ్యలో అట్లు, పిండి వంటలు, గోరింటాకు , ఉయ్యాల వంటి పదాలు దొర్లుతున్నాయి. ఆ మాటలు వింటుంటే నాలో ఉత్సాహం పొంగింది. అమ్మాయిలు చాలా సరదాగా చేసుకునే పండుగేదో వచ్చేస్తున్నదని అర్థమైంది. నేనూ వారి పక్క చేరాను.
అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. ప్రేమగా తల నిమిరింది. మరోపక్క అక్క కూడా నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని నా చిట్టి అరచేతుల వైపు తదేక దృష్టితో చూస్తుంటే –
‘అర్థమైంది లేవే, తమ్ముడికీ గోరింటాకు పెడతానులే’ అంది అమ్మ.
‘చూడమ్మా వీడి చేతులు ఎంత సుకుమారంగా ఉన్నాయో. లేత గులాబీ రేకుల్లా ఉన్నాయి కదూ..’ అక్క మురిసిపోయింది.
అక్క ఇలా అంటుంటే, అమ్మ మధ్యలో కట్ చేస్తూ..
‘చాల్లే సంబడం.. దిష్టి తగులుతుంది’ అంటూ నా బుగ్గన ముద్దు పెట్టుకుంది.
అక్కేమో రుబ్బిన గోరింటాకున్న గిన్నె తీసుకు వచ్చి అమ్మకి ఇచ్చింది. అమ్మ నా అరచేతిలో పదిపైసలంత చుక్క దిద్దింది. పదిపైసలకు ఆ రోజుల్లో చాలా విలువ ఉండేది. పది పైసలకి దోసెడు మిఠాయి వచ్చేది తెలుసా? ఆ పది పైసలు సంపాదించడానికి (అంటే నాన్న దగ్గర నుంచి రాబట్టడానికని అర్థమన్న మాట) చాలా కష్టపడేవాళ్లం. ఇలాంటి జ్ఞాపకాలు చెప్పడానికి మరోసారి మీ ముందుకు వచ్చాను.
ఫ్యాన్ కింద ఉద్యోగం:
1960 దశకం.. అప్పట్లో మేము గుంటూరులోని బ్రాడీపేటలో 9వ లైన్‌లో అద్దెకు ఉండేవాళ్లం. నేనేమో ఆ పక్కనే దగ్గర్లో ఉన్న మాజేటి గురవయ్య హైస్కూల్ (ఎంజీహెచ్) ఆరో తరగతి చదువుతున్నాను. మా అక్కేమో బండ్లమూడి హనుమాయమ్మ హైస్కూల్‌లో చదువుకునేది. మా అన్న హిందూ కాలేజీలో చదువుకుంటున్న రోజులవి.
చిన్నప్పుడు చాలా సుకుమారంగా ఉండేవాడిని. అలా అని ఇప్పుడు దృఢమైన శరీరంతో లేననుకోండి. ఇప్పటికి నా అరచేతులు లేత గులాబీ రేకుల్లానే ఉంటాయి. మా నాన్నగారు ఎవరితోనో అంటుండేవారు, ‘మా రెండో వాడు వీడు. అమ్మాయిల్లా మహా సుకుమారుడులేండి’ అంటూ నవ్వేసేవారు. ఆయన నవ్వడం చాలా అరుదు. కానీ నవ్వితే చాలా అందంగా ఉంటారు. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా నాకు బోలెడు కోపం వచ్చేది. ఇంకో సారి నాన్న ఎవరితోనో మాట్లాడుతూ, ‘వీడు ఎండల్లో పనిచేయలేడు. ఏ ఫ్యాను క్రింద ఉద్యోగమో కావాల్సిందే’ అన్నారు. ఇలాంటి ‘అవమానాలు’ అప్పుడప్పుడు ఎదురవడానికి నా సుకుమార శరీరమే కదా. లాభం లేదు. బలం పుంజుకోవాల్సిందే. చేతులకు బోలెడు కండ పట్టాలి. ఒక్క కొట్టు కొడితే ఇంటి వెనుక వేప చెట్టు పడిపోవాలి. అంతే.. ఇలా అనుకునేవాడ్ని. కానీ ఒకటి నిజం అయింది. నాన్నగారు అన్నట్టుగానే నా సర్వీస్ అంతా ఫ్యాన్ క్రిందనో, ఏసీ రూముల్లోనూ సాగిపోయింది. ఇప్పుడనిపిస్తోంది. నాన్న మాటలు దీవెనలేనని.
పంచ కట్టు:
నాన్నగారు దాదాపుగా ఆరడుగుల ఎత్తు ఉండేవారు. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన్ని పంచ కట్టులోనే చూశాను. నడుస్తుంటే తెలుగుదనం ఉట్టి పడుతుండేది. అమ్మ కూడా అంతే. గుండ్రటి ముఖం. కళకళలాడుతూ ఉండేది.
నాన్నగారి పంచకట్టు నా మదిలో గట్టి ముద్రే వేసింది. ఎంత అంటే, ఇప్పటికీ ఉగాది వస్తే పంచ కట్టుకోవాలనిపించేటంత. ఆంధ్రప్రభలో నేను పనిజేసే రోజుల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగేవి. ఈ వేడుకల సంగతి మొదలుపెడితే అంతం ఉండదు. కాబట్టి మరోసారి ఆ విశేషాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొత్తానికి ఉగాది అనగానే ఆ రోజు పంచకట్టుని అచ్చమైన తెలుగు వాడిలా తిరగడం నాకో సరదా. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు అన్నట్లు తెలుగు వాడు, పంచ కట్టుటలోన ప్రపంచాన మొనగాడే.
పంచ కట్టుకుని హుందాగా తిరిగిన వారిలో, నేను చూసిన వారిలో నాన్న గారి తర్వాత అక్కినేని నాగేశ్వర రావు (వారు యునిసెఫ్ అవార్డ్ ని అందజేశారు), డాక్టర్ సి.నారాయణ రెడ్డి (వీరిని హైదరాబాద్‌లో కలిసి ఇంటర్వ్యూ కూడా చేశాను) ఇంకా నందిగామ హైస్కూల్‌లో తెలుగు మాష్టారు గరికపాటి వేంకటేశ్వర రావు గారు. మా మామగారు మన్నవ గిరిధర రావుగారు. వీరు కొంత కాలం ఎమ్మెల్సీగా కూడా చేశారు. వీరి గురించి మరో సందర్బంలో కొన్ని ముచ్చట్లు చెబుతాను.
ఇంకా ఉన్నారేమో ఇప్పటి కిప్పుడు గుర్తుకు రావడం లేదులేండి. వీరంతా ప్రభావితం చేయబట్టే అప్పుడప్పుడు నాలోని ‘తెలుగోడు’ పంచకట్టులో బయట పడుతుంటాడు. మోజు తీర్చుకుంటాడు. అదీ సంగతి. సరే, అమ్మ సంగతి చెబుతున్నాను కదా, అటు వెళదామా..
అమ్మ – కనక దుర్గమ్మ:
నాన్నగారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఈవోగా ఉన్న రోజుల్లో మాకు కొండ (ఇంద్రకీలాద్రి) పైనే ఉన్న క్వార్టర్స్‌లో ఒక పోర్షన్ ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు వరుసుగా మూడో నాలుగో పోర్షన్స్ ఉండేవి. ఈవోకి ఒక పోర్షన్, ప్రధాన పూజారికి మరొకటి, ముఖ్య గుమాస్తాకు ఇంకోటి ఇలా ప్రతి నిత్యం కొండపైకి ఎక్కి అలసి పోకుండా, అక్కడే ఉండి విధులు సక్రమంగా నిర్వహించడం కోసం ఇలాంటి ఏర్పాటు చేసి ఉంటారు. ఆ రోజుల్లో (60వ దశకం తొలినాళ్లలో) బెజవాడ దుర్గమ్మని చూడాలంటే మెట్లదారే. మా నాన్నగారు ఈవోగా ఉన్నప్పుడే ఘాట్ రోడ్ ప్రస్తావన వచ్చిందట.
అప్పుడు మేమున్న ఇల్లు ఇప్పుడు లేదేమో. కనక దుర్గమ్మ గుడి నుంచి మల్లికార్జున స్వామి గుడికి మెట్ల మీదగా క్రిందకి దిగుతూ మళ్ళీ పైకి ఎక్కే మెట్లు వచ్చినప్పుడు ఆ మధ్యన ఎడమ వైపున ఉండేవి ఈ పోర్షన్స్. ఆ రోజుల్లో నేనింకా స్కూల్లో జాయిన్ అవలేదు. ఐదేళ్లు దాటినా బలహీనంగా ఉండటం వల్లనో, లేదా రోజూ కొండ దిగి స్కూల్‌కి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కలేననో స్కూల్‌లో చేర్చలేదు. దీంతో పూజారి పిల్లలతోనూ, బంట్రోతు పిల్లలతోనూ దోస్త్ కట్టి తెగ ఆడుకునే వాడ్ని. అలా ఆడుకునేటప్పుడే సిమెంట్‌తో చేసిన ఏనుగులు బొమ్మల మీదకు ఎక్కేవాళ్లం. బృందావనంలో శ్రీకృష్ణుడు, గోపికల చుట్టూ గిరగిరా తిరిగే వాళ్లం. అంతలో పైకి మెట్లెక్కి అమ్మవారి గుడిలోకి వెళ్ళి దుర్గమ్మను చాలా దగ్గరగా ఇంకా చెప్పాలంటే అమ్మని చేతులతో తాకి మరీ తుర్రుమనేవాళ్లం. ఆ గుడి అంతా మాదే అన్నట్లు తిరిగే వాళ్లం. అలా దుర్గమ్మని చూసిన కళ్లతో ఇంటికి వచ్చి అమ్మని చూడగానే అమ్మ కూడా ఆ దుర్గమ్మ తల్లిలా కనిపించేది. ఇద్దరిదీ గుండ్రటి ముఖం. పెద్ద కుంకుమ బొట్టు. ఇద్దరి మోములో చిరునవ్వుల దరహాసం. ఆ లేత వయసులో అమ్మే అక్కడా ఇక్కడా ఉంటుందని అనుకునే వాడ్ని. అలా ఇద్దరమ్మల దయని ఆ రోజుల్లోనే సంపాదించానన్న మాట. ఈ రోజున ఇలా వ్రాయగలుగుతున్నానంటే ఇద్దరమ్మల దయే.
నాన్నంటే భయం:
నాన్నగారు నా జీవితంలో ఎన్నో విషయంలో ప్రభావితం చేసినప్పటికీ వారంటే నాకు భయమే. ఆయన చెప్పింది వినడమే తప్ప మా సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు చెప్పింది చాలా తక్కువే.
మాకేం అవసరమొచ్చినా నాన్నకు చెప్పాలంటే భయం. అమ్మ దగ్గరకో, బామ్మ దగ్గరకో వెళ్ళి చెప్పేవాళ్లం. అప్పుడేమో అమ్మో, బామ్మో నెమ్మదిగా వీలు చూసుకుని నాన్న దగ్గరకు వెళ్ళి విషయం ఆయన చెవిలో వేసేవారు. ఈ తంతు పక్కగదిలో గుమ్మం చాటున నిలబడి బోలెడు టెన్షన్‌తో చూస్తుండే వాళ్లం.
అదేమీ చిత్రమో, నాన్నగారు అమ్మ చెప్పిన మాటలు వింటారు. కానీ వెంటనే నిర్ణయం చెప్పరు. ఆయనేమో గుళ్లమీద పెద్ద ఆఫీసరాయె, గుడి నౌకర్లు, పూజారులు, గుమాస్తాలు ఇంకా బోలెడు మంది ఇంటికి వచ్చి పోతుంటారు. వాళ్లతో మాటలు. వాటి మధ్యలో కీలక నిర్ణయాలు.. అనేక ఆలోచనలు.
మా గురించి అమ్మ ఏదో చెబుతుండగానే మధ్యలో ఇలాంటి ‘పానకంలో పుడకలు’ వస్తుండేవి. దీంతో అసలు విషయం నాన్న చెవులకు సోకిందా? లేదా? అన్నది పెద్ద కొశ్చన్ మార్క్.
అమ్మకి చెప్పిన మా డిమాండ్ తీరుతుందా లేదా అన్నది పెద్ద సస్పెన్స్. తెల్లవారి లేచిన దగ్గర నుంచి బిజీ బిజీగా ఉండే నాన్నగారికి మా గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుందిలే అని అనుకునే వాళ్లం. కానీ చిత్రం. మా డిమాండ్ త్వరగానే తీరేది. అందుకే ఎప్పుడూ ఎక్కడా ఏ లోటూ రాలేదు.
జామ చెట్టు – రెండు కోతులు:
ఆ రోజుల్లో నాకు స్వీట్స్ తినడం బాగా ఇష్టం. అసలు స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారులేండి. మేముండే ఇంటికి పక్కన నా ఫ్రెండ్ మహదేవన్ ఉండేవాడు. వాడి పేరు ఎలా వచ్చిందీ? వాడు ఏ ప్రాంతం వాడు? అన్న ఆలోచనలు నాకప్పట్లో రాలేదు. తెలుగు బాగా మాట్లాడేవారు ఇంట్లో. వాడూ నేను ఒకే స్కూల్‌లో రెండేళ్లు చదువుకున్నాము. మా రెండు ఇళ్ల మధ్య ప్రహరీ గోడ ఉండేది. వాళ్లింటి వైపు బాగా పెరిగిన జామ చెట్టు మా ఇంటి ఆవరణవైపుకి వాలి ఉండేది. చెట్టు కొమ్మల సాయంతో గోడ ఎక్కి వాడిని పిలిచేవాడ్ని. నా పిలుపు కోసమే ఎదురు చూస్తున్నానన్నట్లుగా ఛంగున లోపలి నుంచి వచ్చేసి చెట్టు ఎక్కి గోడ మీదకు చేరేవాడు. అలా గోడమీదనే జామకాయలు, పండ్లు తింటూ చాలా సేపు కబుర్లు చెప్పుకునే వాళ్లం. దోరకాయలు తినడానికి మాకు పోటీగా వచ్చేవి ఉడతలు. మొదట్లో మమ్మల్ని చూసి భయపడి నక్కి నక్కి వెళ్లేవి. కానీ రెండు మూడు రోజులు గడిచే సరికి వాటికీ మాకూ దోస్తీ కుదిరింది. మమ్మల్ని ఆనుకుని పోవడమే కాదు, ఒక్కోసారి మా చేతుల్లో ఉన్న దోరగా పండిన జామ పండ్లను లాక్కునేవి.
నిజం.
అలాగే చేసేవి.
అయినా మాకు కోపం వచ్చేది కాదు. దానికి బదులు ప్రేమ పుట్టేది. వాటిని ప్రేమగా చూసేవాళ్లం. అవీ మా కళ్లల్లో కళ్లు పెట్టి చూసేవి. మేము కాస్తంత బిజీగా ఉండి చెట్టు ఎక్కకపోతే పాపం ఉడతలు దిగులు పెట్టుకునేవని మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ అంటుండేది. నిజానికి మేము బిజీగా ఉండటమంటే అర్థమేమంటే, పరీక్షలు దగ్గర పడుతున్నాయనే. రెండిళ్లలోని పెద్దోళ్లు – చాల్లే ఆటలు చదువుకోండంటూ కసురుకోవడం వల్ల వచ్చిన బిజీ అన్న మాట. అదేమిటోగానీ చదువుకోమన్నారంటే చాలు మా ఇద్దరికీ కోపం వచ్చేసేది. వాడు కూడా నాలాగానే సుకుమారుడే. పైగా నాకంటే తెల్లగా ఉండేవాడు. వీడిప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ వాడూ నేనూ జామ చెట్టు పక్కన గోడ మీద కూర్చుని చేసిన సమాలోచనలు, కబుర్లు ఇప్పటికీ ఓ మధుర జ్ఞాపకం. అలాంటప్పుడు మా అన్నో, అక్కో అటుగా వచ్చి ‘చెట్టు మీద రెండు కోతులు చేరాయమ్మా’ అంటూ ఎగతాళిగా అమ్మకు ఫిర్యాదు చేసేవారు. అయినా అమ్మ ఏమీ అనేది కాదు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ల అమ్మ కూడానూ. అమ్మలంతే కదా మరి.
మిఠాయి బండి:
ఈ ఫ్రెండ్ గాడికీ నాకు మిఠాయిలంటే చాలా ఇష్టం. మా వీధిలోకి సాయంత్రం అయ్యేసరికి మిఠాయిలున్న తోపుడు బండి వచ్చేది. అంటే మొబైల్ స్వీట్స్ షాప్ అన్నమాట. ఆ బండికి ఓ గంట వ్రేలాడదీసేవారు. దానికి తాడు కట్టి లాగుతుంటే గంట మ్రోగుతుండేది. వీధి మొదట్లో బండివాడు ఉంటే గంట శబ్దంతో ఈ మూలన ఉన్న మాకు తెలిసిపోయేది. ఫ్రెండ్ గాడి అమ్మానాన్న చాలా మంచివారు. రోజూ మిఠాయిలు కొనుక్కోవడానికి వాడికో పది పైసలు ఇచ్చేటంత మంచి వారన్నమాట. ఆ పది పైసలు తీసుకుని వాడు ఠీవిగా బండి వాడి దగ్గరకు వెళ్ళి తనకు నచ్చిన మిఠాయిని కొనుక్కోవడం చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది. అలా ఓసారి ఏడుస్తుంటే మా అక్క విషయం కనుక్కుని అమ్మకి చెప్పింది. అమ్మేమో నాన్న చెవిన వేశారు. అది జరిగి వారం గడిచినా నా చేతిలో పది పైసల నాణెం పడలేదు. నాకేమో టెన్షన్.
అరచేతిలో పది పైసలు:
ఇంతలో పుట్టిన రోజు దగ్గరకి వచ్చేస్తున్నది. ఆ రోజుల్లో పుట్టిన రోజంటే ఇప్పట్లోలాగా పిల్లల చేత కేక్‌లు కట్ చేయించడాలూ, బెలూన్లు వ్రేలాడదీయడాలు, ఫంక్షన్ హాల్స్ బుక్ చేయడాలూ బోలెడంత మంది అతిథులు రావడాలూ, వారేమో బహుమతులు ఇవ్వడాలు వంటివి చాలా మంది ఇళ్లలో ఉండేవి కావు. ఆ టైమ్‌కి డబ్బులుంటే కొత్త బట్టలు వచ్చేవి. ఒక్కోసారి చాక్‌లెట్స్‌తో సరిపుచ్చేవారు.. పుట్టిన రోజున పొద్దున్నే నేను లేవగానే అమ్మ కాసేపు హడావిడి చేసేది. తలంటి స్నానం చేయించేది. ఉంటే కొత్త బట్టలు, లేకుంటే ఇస్త్రీ పెట్టిన బట్టలు. మా ఇంట్లో ఇస్త్రీ అంటే చెంబు ఇస్త్రీనే. బయటకు వెళ్ళి పిల్లల బట్టలు ఇస్త్రీ చేయించడం అరుదైన విషయం. నాన్నగారి పంచె, చొక్కాల వంటివి మాత్రం ఇస్త్రీ పెట్టి వచ్చేవి. ఇత్తడి చెంబులో కణకణమండే బొగ్గులు వేసి చెంబు వేడెక్కగానే ఇస్త్రీ పెట్టడాన్ని ఆ రోజుల్లో చెంబిస్త్రీ అనేవారు. కొన్ని సినిమాల్లో కూడా ఈ చెంబిస్త్రీ మీద సీన్లు ఉండేవి.
తలంటి కాగానే అమ్మ వంటింట్లోకి వెళ్ళి పంచదార డబ్బానో, బెల్లం డబ్బానో మూత తెరిచి కాసంత తీసుకొచ్చి నోరు తీపి చేసేది. దేవుడికి దండం పెట్టుకోమనేది. పుట్టిన రోజు వేడుకలంటే పెద్ద ప్లాన్ గట్రా ఉండేవి కావు. మిఠాయి బండి వాడి దగ్గర మైసూర్ పాక్ బిళ్లలో, హల్వానో, లడ్డూలో తీసుకునేది మా అమ్మ. పుట్టిన రోజు పండుగ అలా సింపుల్‌గా జరిగినా అదే మాకప్పుడు చాలా గొప్పన్న మాట. అలాంటిది, రోజూ మిఠాయి కొనడానికి పది పైసలు కావాలన్న నా డిమాండ్ తీరుతుందా?
ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పట్లో మిలియన్, డాలర్ అన్న పదాలు తెలియదనుకోండి.
సాయంత్రమైంది. రోజూ లాగానే మిఠాయి బండి వాడు గంట మ్రోగిస్తూ వీధిలోకి ఎంటరయ్యాడు. పక్కింటి మహాదేవన్ గాడు చేతిలో పది పైసలు పట్టుకుని అప్పటికే ఇంటి గేటు ముందు ఠీవీగా నిలుచున్నాడు. వాడెప్పుడూ అంతే, ‘చూశావా, నేను గ్రేట్ రా’ అన్నట్లు చూసేవాడు. దీన్ని ‘ఇగో’ అంటారట. నాకు తెలియదనుకోండి. కానీ వీడు మాత్రం అంతలో బాగా కలిసిపోయేవాడులేండి. అందుకే మా స్నేహం వయస్సు రెండు సంవత్సరాలే అయినా ఇప్పటికీ గుర్తిండిపోయాడు వాడు.
మరి నా సంగతేమిటి? మిఠాయి బండి వాడు దాదాపుగా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాడు. కొన్ని అద్భుతాలు జరగడానికి క్షణం చాలు. అదే జరిగింది ఇక్కడ. అక్కయ్య ఇంటి లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నా చేయి పుచ్చుకుని వేగంగా మిఠాయి బండి వాడి దగ్గరకు తీసుకెళ్ళి నా చేతిలో పది పైసలు పెట్టింది. నాకు బోలెడు సంతోషమేసింది. వెంటనే మహాదేవన్ గాడికంటే ముందే హల్వా కొన్నాను. నాకు హల్వా అంటే ఇష్టం. ఇప్పటిలా కలాకండ్ వంటి స్వీట్స్ పేర్లు నాకప్పుడు తెలియవు. ఆనందంతో హల్వా తింటూ అక్క చేతిని పట్టుకని అటూ ఇటూ ఆనందంగా ఊగుతూ మధ్యలో మహదేవన్ గాడివైపు విజయగర్వంతో చూస్తూ ఇంట్లోకి వెళ్ళాను.
ఆ తర్వాత తెలిసింది. ప్రతి రోజూ పది పైసలు మిఠాయి కొనుక్కోవడానికి నాన్న శాంక్షన్ చేశారని.
ఈ నాన్నలంతే, బయటపడరుగానీ లోపల బోలెడు ప్రేమ దాచేసుకుంటారు. అదేదో బ్యాంక్ లో డబ్బుల్లా పైకి తీయరు. ఏమిటో..
అట్లతద్ది:
ఆ రోజున అక్క నా చేతిలో పది పైసలు పెట్టడంతో అక్క మీద ప్రేమ బాగా పెరిగిపోయింది. అప్పటి నుంచి అక్క ఏది చెబితే అది చేయాల్సిందే. నో కొశ్చన్ అన్న మాట. ఇప్పుడేమో అట్లతద్ది వచ్చిందాయె, మరేమో నా లేత అరచేతుల్లో గోరింటాకు పెడదామని అమ్మకు అక్క చెప్పడం, అమ్మేమో ‘అలాగేలేవే’ అనడం జరిగిపోయాయి కదా.
గోరింటాకు పెట్టించుకున్నప్పుడు చాలా చిరాకుగానే ఉంటుంది. దీనికి తోడు జాగ్రత్తలు పాటించాలంటూ షరతులు పెట్టేవారు. ఆ కాసేపు ఆడుకోవడానికి ఎక్కడికీ వెళ్లకూడదు. చెట్లు ఎక్కకూడదు. గోళీలు ఆడకూడదు. మంచాలు ఎక్కి ఆడుకోకూడదు, ఛటక్కున మంచి నీటి గ్లాసు తీసుకోకూడదు. ఎవ్వరినీ ముట్టుకోకూడదు. మన చేతులే అయినా ఒక చేతిని మరో చేతివైపు పోనీయకూడదు.
అమ్మో ఎన్ని షరతులో. అందుకే కాస్త పెద్దయ్యాక ఈ షరతుల గోల భరించ లేక గోరింటాకు పెట్టుకోవడం మానేశాను.
ఆడపిల్లలకైతే అరచేతి అంతా డిజైన్‌లో గోరింటాకు పెట్టేవారు. మధ్యలో పెద్ద చుక్క, చుట్టూ చిన్న చిన్న చుక్కలు ఉండేవి. మధ్యలో చుక్క సూర్యునికి సంకేతమైతే, చుట్టూ ఉన్న చిన్న చుక్కలు గ్రహాలకు సంకేతాలు. అరచేయి ఏమో ఆకాశానికి సింబల్ అన్న మాట. ఆడపిల్లకు దిష్టి (దృష్టి) సోకకుండా జీవితాంతం ఆనందంగా ఉండటానికీ, సూర్యచంద్రాది గ్రహాలు కాపు కాయడానికి ఇలా గోరింటాకు పెట్టుకుంటారని పెద్దయ్యాక ఎక్కడో చదివాను. ఈ వివరణతో గోరింటాకు పట్ల మక్కువ పెరిగింది.
చేతి వేళ్ల కొసలకు గోరింట టోపీలు తొడిగేవారు. ఇంకా రుబ్బిన ఆకు ఎక్కువగా ఉంటే కాళ్లకు పారాణిలా పెట్టేవారు. ఇప్పుడు మెహందీ కోన్స్ గట్రా వచ్చాయనుకోండి. నా చిన్నప్పుడు గోరింటాకు కోసుకు రావాల్సిందే. దాన్ని రుబ్బాల్సిందే. పూర్వం గోరింటాకు చెట్లు ప్రతి ఊర్లో చాలానే ఉండేవి. మా ఊర్లో ఇంటి పెరట్లోనే గోరింటాకు చెట్టు ఉండేది. అది పూలు పూస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్యనే గోరింటాకు చెట్టు పూలతో కళకళలాడుతుంటే ఫోటో తీసి మురిసిపోయాను. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను కూడా. అంత సరదా అన్నమాట. మగపిల్లలకు మాత్రం అరచేతిలో ఒక చుక్క పెట్టేసి పొమ్మనేవారు. బహుశా రుబ్బిన గోరింటాకు వాళ్లకే సరిపోదనుకుని నా బోటి మగపిల్లలకు ఒక చుక్కతో సరిపుచ్చేవారేమో, ఏమో ఆలోచించాల్సిందే ఈ పాయింట్.
ఇప్పటికీ మా ఆవిడ గోరింటాకు పెట్టుకుంటూ ‘మీకూ ఓ చుక్క పెట్టనా’ అన్నట్లు అదోలా చూసినా నేను లొంగను. కానీ, అలాంటప్పుడే ఈ పాత సంఘటనలు గుర్తుకొస్తుంటాయి. అంతే కాదు, పాత సినిమాలోని పాట కూడా గుర్తుకొస్తుంటుంది.
‘గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
ఇంచక్కా పండిన ఎర్రన్నిచుక్క
చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష
కన్నె పేరంటాలికి కలకాలం రక్ష
గోరింట పూచింది కొమ్మా లేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగి వస్తాడు’
గోరు ముద్దలు:
ఆడపిల్లలు ఇష్టపడే వాటిలో గోరింటాకు పెట్టుకోవడం ఒకటైతే రెండోది గోరుముద్దలు తినడం. చక్కటి ఊహలతో ఆశలతో ఆటపాటలతో ఆడపిల్లలు అట్లతద్ది, ఉండ్రాళ్ల తద్దె వంటి పండుగలను చాలా సంతోషంగా చేసుకునే వారు. అట్ల తద్ది (చూ. ఫుట్‌నోట్) నాడు తెల్లవారుఝామునే అమ్మా, అక్క లేచేవారు. ముందు రోజు రాత్రి నుంచీ హడావిడి పడేవారు. తెల్లవారుఝామునే అమ్మ అట్లు వేసేది. వాటిని అక్కకు పెట్టేది. తానూ తినేది. ఈ హడావుడికి మనమూ లేచేవాళ్లం. నాకూ అట్లు పెట్టేవారు. అంతే కాదు, వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి కలిపి ముద్దలు చేసి అక్కకీ, నాకూ అమ్మ తినిపించేది. ఇప్పటికీ ఆ గోరు ముద్దల రుచి మరిచిపోలేదు.
చింత చెట్టుకు ఊయ్యాల:
మా ఊర్లో ఇంటికి దగ్గర్లోనే చింత చెట్టు చాలా పెద్దది ఉండేది. దాని కొమ్మలు బాగా విశాలంగా వ్యాపించాయి. చింత చిగురు కావాలన్నా, చింతకాయలు కావాలన్నా ఊర్లో జనం ఆ చెట్టు దగ్గరకే వెళ్ళే వారు. ఈ రోజుల్లా ప్రతిదీ కొనుక్కోనక్కర్లేదు. ఊర్లోని చెట్లన్నీ అందరికీ చెందినవనే భావన ఉండేది. ఇంటి పెరట్లో సొరకాయలు, పొట్ల కాయలు, గుమ్మడి కాయలు కాచినా, మల్లె పూలు పూసినా అన్నీ ఇచ్చి పుచ్చుకునేవారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నది పల్లెవాసుల జీవనంలో అంతర్లీనంగా ఉండే ఆనంద సూత్రం.
అట్లతద్ది అనగానే ఊర్లోని అమ్మాయిల కోసం చింత చెట్టుకు ఉయ్యాల కట్టించేవారు. లావుపాటి తాడు (మోకు) తెచ్చి జీతగాళ్లు చింత చెట్టు కొమ్మకు తాడు కొసలు బిగించి ఉయ్యాల సిద్ధం చేసేవారు. ఉయ్యాల మీద కూర్చుని ఊగడానికి వీలుగా గట్టి కట్టెను బిగించేవారు. నాబోటి పిల్లల కోసం పెద్ద ఉయ్యాలకు దగ్గర్లోనే పిల్ల ఉయ్యాలు వెలిసేవి. వాటికైతే కూర్చోవడానికి తొట్టి కట్టేవారు.
ఉయ్యాల ఊగుతుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. రంగురంగుల దుస్తుల్లో ఆడపిల్లలు ఉయ్యాల ఊగడానికి రాగానే ఊర్లోని కుర్రకారుకి హుషారు పుట్టేది. ఛలోక్తులతో, పందాలు కాయడాలతో అట్లతద్దె రోజున రెండు మూడు గంటల పాటు సందడి ఉండేది. ఊర్లో ఉన్న పెళ్లికాని అమ్మాయిలు, కొత్తగా పెళ్లయినవారే కాదు, ముసలమ్మలు కూడా సరదాగా చింత చెట్టు దగ్గర ఊయ్యాల ఊగేవారు.
‘చింత చెట్టు ఉయ్యాల ఊగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్రా’ అంటూ బామ్మ హెచ్చరించేది. నిజమే, ఉయ్యాల చాలా ఎత్తుకి లేచేది. అంతలో లోయలోకి పడిపోతున్నట్లుగా క్రిందకు వచ్చేది. క్రిందకు దిగుతున్నప్పుడు గుండె క్రిందకు జారిపోయినట్లుండేది.
ఉయ్యాల ఊపడం కూడా ఆర్టే. ఉయ్యాల పై నుంచి క్రిందకు దిగగానే దాన్ని నేర్పుగా పట్టుకని వేగంగా తోయాలి. అలా కాకుండా ఊయ్యాల మీద కూర్చున్న వారే దాని వేగం, ఊపుని నియంత్రించడం మరో ఆర్ట్. ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి ఉయ్యాల ఊగుతుంటే ఆశ్చర్యపోయేవాడ్ని. క్రిందకు వంగి పైకి లేవడం అనే కళతో ఉయ్యాలకి ఊపు పెరుగుతుండేది. ఈ విద్య అందరికీ అబ్బదు. ఉయ్యాల తాడు మెలిపడేటట్లు చేసి గుమ్మటంలా తిరగడం భలే బాగుండేది. ఒక్కోసారి కళ్లు తిరుగుతుంటాయి. ఇంకోసారి పడిపోవాల్సి వస్తుంది. అప్పుడు దెబ్బలు తగులుతాయి. ఉయ్యాల కట్టె వేగంగా వచ్చి తలకు తగలనూ వచ్చు. అలాంటి ప్రమాదాలు చాలానే జరిగాయని అమ్మ చెబుతుండేది.
జీవితమే ఊయల:
అసలు ఉయ్యాల మన జీవితానికి సంకేతం. జీవితమే ఓ ఊయల. నేను ఆంద్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ఫొటోగ్రాఫర్ ఒక ఫోటో తీసుకు వచ్చాడు. పత్రిక ఆఫీస్‌లో ఇలాంటి ఫొటోగ్రాఫర్లు ఒకరో ఇద్దరో ఉండేవాళ్లు. వీరితో పాటుగా బయట ఫొటో స్టూడియోలు నడుపుతున్న వారు కూడా అడపాదడపా ఫోటోలు పత్రికల వారికి అందజేస్తుండేవారు. పండగలు రాబోతున్నాయనగానే వీళ్లు ఆ వాతావరణానికి తగ్గ ఫోటోలు తీసి డెస్క్‌కి ఇచ్చేవారు. నేను డెస్క్ దగ్గర పనిచేస్తుండటంతో నా వద్దకు అలాంటి ఫోటోలు వచ్చేవి. వాటిలో మంచివాటిని ఎంచుకుని పండగ రోజు ప్రచురితమయ్యేలా చూసేవాడ్ని. అలాంటప్పుడు అట్లతద్ది పండుగకి ముందు ఒక పోటో వచ్చింది. పెద్ద చెట్టుకు ఊయాల కట్టి ఉంది. దాని క్రింద కట్టెపై ఇద్దరు యువతులు ఎదురెదురుగా నిలబడి ఊగుతున్నారు. దీనికి రైటప్ పెట్టాలి. అప్పుడే రీడర్ బాగా కనెక్ట్ అవుతాడు. ఆ పోటోకి నేను పెట్టిన రైటప్ – జీవితమే ఊయల.
జీవితాన్ని రంగుల రాట్నంతో పోల్చినట్లుగానే ఊయలతో కూడా పోల్చవచ్చన్నమాట. ఊయల క్రిందకీ పైకి ఊగుతుంటుంది. అలాగే జీవితంలోనూ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఈ ఉగిసలాట చివరకు ఎక్కడో ఎప్పుడో ఆగిపోతుంది. జీవితం స్తంభించిపోతుంది. ఆనందం, ఆశయం, ఆవేదన, అంతం వంటి వాటికి సంకేతంలా ఉయ్యాల కనబడుతుంటుంది. అట్లతద్ది పరమార్థం కూడా అదేనేమో. జీవితంలో వచ్చే కష్టసుఖాలకు ఆడపిల్లలను ప్రిపేర్ చేయడం కోసమే ఇలాంటి పండుగలను పెట్టేరేమో మన పూర్వీకులు. ఏమో, ఆలోచించాల్సిందే కదా..
వయసులో ఉన్నప్పుడు ఎగిసిపడే ఉత్సాహం, మధ్య వయసులో ఉండే నెమ్మదితనం, వయసుబడినప్పుడు కలిగే స్తబ్ధత.. వీటన్నింటినీ ఉయ్యాల గుర్తుచేస్తుంటుంది. ఇంతటి భావం ఆ పోటో రైటప్‌లో కనిపించిందేమో మర్నాడు ఒకరిద్దరు మిత్రులు మెచ్చుకున్నారు. ఇలాంటి చిన్న మెచ్చుకోళ్లు మనల్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంటాయి.
ఆంధ్రప్రభ విజయవాడ ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఆనందాలు అనేకం. మధ్యమధ్యలో మనసు కలత చెందే సంఘటనలు కూడా జరిగాయి. ఎన్నో అనుభవాలను ఆంధ్రప్రభ మూటగట్టి ఇచ్చింది. విప్పి చూసినప్పుడల్లా బోలెడు కనబడతాయి.
ఫుట్‌నోట్:
13. అట్లతద్ది:
ఆశ్వయుజ బహుళ తదియనాడు ముఖ్యంగా పెళ్లికాని యువతులు చేసే పండుగే అట్లతద్ది. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. దీనికే మరో పేరే ఉయ్యాల పండుగ. ఇంకో పేరు కూడా ఉందండోయ్.. గోరింటాకు పండుగ.
అట్లతద్ది పేరిట వ్రతం చేస్తుంటారు. వివాహితులేమో సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తుంటే, కన్నెపిల్లలేమో అనుకూలమైన వాడు భర్తగా రావాలని కోరుకుంటూ చేసుకునే వ్రతం అన్నమాట.
“అట్లతద్దె ఆరట్లు/ ముద్దపప్పు మూడట్లు” అంటూ కన్నె పిల్లలు పాడుకుంటూ వాయినాలిస్తుంటారు.
ఆ రోజంతా ఆడపిల్లలదే హవా.
అట్లు ఎందుకు పోస్తారని ఓ సారి అమ్మని అడిగితే ఏదో చెప్పింది. ఇప్పుడు సరిగా గుర్తుకు రావడం లేదు. మొత్తానికి ఈ అట్లకీ నవగ్రహాల్లో కుజ గ్రహానికి సంబంధం ఉన్నట్లు గుర్తు. కుజుడికి అట్లు అంటే బాగా ఇష్టమట. ఇందులో ఆడపిల్లల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయట.
పెద్దయ్యాక పత్రికల్లో పండుగలప్పుడు వ్యాసాలు రాయాల్సి వచ్చినప్పుడు మన పండుగల గురించి లోతుగా ఆలోచించాల్సి వచ్చేది. దీంతో ప్రతి పండుగ వెనుక ఉన్న లాజిక్, శాస్త్రీయ కోణం లీలగా అర్థమయ్యేది.
(మళ్ళీ కలుద్దాం)