[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఇందిరానగరులో లాండ్రీ డ్రైక్లీనింగు షాపులో షెల్ఫులు చేయడానికి, ఇస్త్రీ టేబుల్ చెయ్యడానికి ఆర్డరు వస్తుంది. ఆ పనికి రాఘవేంద్ర అనే కుర్రాడితో పాటు వీరని పంపుతాడు గౌసుమియ. మునుపు రాఘవేంద్ర అటువంటి పని చేసి ఉండడంతో, వీరకి కూడా నేర్పించమని చెప్తాడు గౌసు. సరేనంటాడు రాఘవేంద్ర. ఇద్దరూ కలిసి లాండ్రీ డ్రైక్లీనింగు షాపులో ఐదు రోజులు పని చేస్తారు. ఈలోపు శెడ్డు లోనే ఇస్త్రీ టేబులు మద్ది చెక్కతో చేసిస్తాడు గౌసుమియ. తన మంచితనంతో కాశింబీ మనసు గెలుస్తాడు వీర. ఒకసారి ఆమెకు జ్వరమొస్తే, ఆమెకి తేలికగా అరిగేలా వంట చేసి తినిపించి, విశ్రాంతినిస్తాడు వీర. వీర చేసిన వంటకాలను తిని గౌసుమియ కూడా మెచ్చుకుంటాడు. కొద్ది రోజుల తరువాత మెయిన్ రోడ్డులో కొత్తగా కిన్నెర బార్ అండ్ రెస్టారెంట్ పెడుతుంటారు. దాని ఓనరు దినకర రెడ్డి. ఆయన గౌసుమియని పిలిపించి, తమ బార్ అండ్ రెస్టారెంట్‌కి సంబంధించిన ఉడ్ వర్క్ అంతా అప్పజెప్తాడు. రెండు నెలలు తన పని మీదే ఉండాలనీ, నాణ్యత ముఖ్యమనీ, డబ్బులకి ఆలోచించాల్సిన పని లేదని, టేబుళ్ళు రోజ్‍వుడ్‍తో చేయాలని చెప్తాడు. రోజ్‍వుడ్డంటే చాలా ఖరీదనీ, ఇక్కడ దొరకదని తిరుపతి నుంచి తెచ్చుకోవాలని అంటాడు గౌసుమియ. ఎంత ఖర్చయినా పర్వాలేదు, మంచిది చూసి తెప్పించమని చెప్తాడు దినకర రెడ్డి. సరేనంటాడు గౌసుమియ. ఇలాంటి పెద్ద పెద్ద ఆర్డర్లు తరచూ రావని, కష్టపడి పనిచేద్దామని అంటాడు. ఈ పని మొదలయితే, సంక్రాంతి వరకూ తీరిక దొరకదని చెప్పి, వీరని ఊరెళ్ళి అమ్మానాన్నలని చూసి రమ్మని చెప్తాడు. వీరకి మూడొందల రూపాయలిస్తాడు. ఆ రోజు సాయంత్రం డజను కమలాపళ్లు, పావుకిలో మైసూరుపాకు కొని తన సంచిలో పెట్టుకుంటాడు వీర. మర్నాడు పొద్దున్నే బస్సెక్కి కోడుమూరులో దిగుతాడు. అక్కడ ప్లేట్ పూరీ తిని, అమ్మానాన్నలకు రెండు ప్లేట్లు పార్శిల్ కట్టించుకుంటాడు వీర. ఇంటికి చేరి, కాళ్ళూచేతులు కడుక్కుని వచ్చి, తాను తెచ్చిన పళ్ళూ, మిఠాయిలూ, టిఫిన్ అమ్మకి ఇస్తాడు. ముందు వాళ్ళిద్దరినీ పూరీలు తినమంటాడు. నాన్నకి రెండు వందల రూపాయలిస్తాడు. ఈ మధ్య పెద్దగా పనులు రావడం లేదనీ, ఏవో చిన్నా చితక పనులతో పొద్దుపుచ్చుతున్నామని చెప్తాడు రామబ్రహ్మం. ఒక్క సంవత్సరం ఓపిక పడితే, తాను షెడ్డు పెట్టుకుంటాననీ, అప్పుడు మిమ్మల్ని ఆదోనికి తీసుకువెళ్తానని అమ్మానాన్నలకి చెప్తాడు వీర. మర్సటి రోజు రాత్రికి ఆదోని చేరుకుంటాడు. ఇక చదవండి.]
[dropcap]గౌ[/dropcap]సుమియ ఇశారించుకుంటే తిరుపతి కంటె గిద్దలూరు నల్లమల అడవిలో రోజువుడ్డు అగ్గవకు దొరకతాదనీ, పారెస్టోల్లకు, చెక్‌పోస్టులోల్లకు తినిపిచ్చికుంటా దాన్ని ఏస్కరావడమే కష్టమని చెప్పినారు. దినకర రెడ్డి తన బందువొకాయన నంద్యాలలో రైల్వే కాంట్రాక్టరనీ, ఆయనకు లారీ కూడా ఉండాదనీ, ముందు నీవు బోయి వుడ్డు మాట్లాడేకుంటే తాను ఆ యప్పకు పోన్ చేస్తాననీ, దగ్గరుండి సరుకు లోడు చేయించి చెక్‌పోస్టులు దాటిస్తాడనీ చెప్పినాడు. అంతగా కావల్నంటే గిద్దలూరు ఎమ్మెల్యేకు గుడ్క చెబుదామనీ అన్నాడు.
చెక్క ఆదోని జేరనీకె పది రోజులు పట్టింది. డబ్బులు నీల్ల మాదిరి ఖర్చుపెట్టినాడు దినకర రెడ్డి. ఆ యప్పకు డబ్బంటే లెక్కలేదు. ‘ఉన్నమారాజు!’ అనుకున్నాడు గౌసుమియ. టింబరు డిపోలో రోజువుడ్డు చెక్కను కావలసిన విదంగా కోయించి పెట్టుకున్నాడు.
‘కిన్నెర బార్ అండ్ రెస్టారెంట్’ లో కార్పెంటర్ల పని ప్రారంబమైనాది. ఒక యగ్నం మాదిరి చేసినారు. రాత్రిల్లు గుడ్క పని చేసినారు. దినకర్ రెడ్డి వాండ్లకు ఏది గావల్లంటె అది ఛనాల మీద సమకూర్చిపెట్టినాడు. అనుకున్న దానికంటె ముందే పని పూర్తి చేసినాడు గౌసుమియ. డిసెంబరు చివరికల్లా అంతా తయారయింది. లైటింగు పని గూడ ఐపోయింది.
బోగి పండగ నాడు ప్రారంబోత్సవము జరిగినాది. శానామంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్దోండ్లందరినీ బిల్సినాడు దినకర రెడ్డి. శానా బమ్మాండంగా జరిగినాది. పని చేసిన మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లందరికీ కొత్తగుడ్డలు పెట్టి, వాండ్ల కియ్యల్సిన మజూరీలు, కూలీలు గాకుండా, బారీగా ఇనాము లిచ్చినాడు.
రెస్టారెంటు మధ్యలో ఆరడుగుల రోజ్‌వుడ్డు విగ్రహాన్ని తయారుచేసినాడు వీర. ఆడమనిసి బొమ్మ. నల్లని చెక్కతో చేసినందుకు నిగనిగా మెరుస్తోంది. సక్కగా చీర కట్టుకొని శేతిలో ఒక కలశము పట్టుకుని నిలబడినట్టు, చెక్కను శేపు చేసి, నగిశీలు చెక్కినాడు. ఆ యమ్మ చీర కుచ్చెళ్లు గూడ చెక్కలో మడతలు మడతలుగా వచ్చినాయి. కలశము మాత్రము ఇత్తడిది. వచ్చి నాండ్లందరి కండ్లు ఈ బొమ్మ మీదనే.
ఫంక్షను కొచ్చిన ఆదోని ఎమ్మెల్యే రత్నరాజప్ప దీన్ని చెక్కింది ఎవరని దినకర రెడ్డిని అడిగినాడు. వీరను బిలిసి సూపించినాడు రెడ్డి. “నాకు ఈ పనిలో శానా సాయము చేసింది నా నేస్తుడు దస్తగిరి, నాదేముంది సారు, నాకు పని నేర్పించిన మా శిన్నాయన గౌసుమియ నాకు తండ్రితో సమానం” అని వీర ఎమ్మెల్లేతో చెప్పినాడు.
“మన ఆదోనిలో ఇలాంటి పనిమంతులున్నారంటే అది మాకందరికి గర్వకారనము. వీరు ముగ్గురు నా కాడికి ఒకసారి రాండి. మీతో మాట్లాడాల్సిన పని ఉంది” అని చెప్పినాడు రత్నరాజప్ప.
మొత్తం వుడ్ వర్కు లక్షా ఇరవైవేలు అయినాది, కార్పెంటర్ల మజూరీ పోను. వీండ్లకు మొదట ఇచ్చిన పదివేలు గాక ఇంకో ఇరవైవేలు ఇచ్చినాడు దినకర రెడ్డి. “సాలకపోతే చెప్పండి” అన్నాడు పైగా. ఆ యప్ప ఉదారానికి వీండ్లకు శానా ఇదని పిచ్చినాది.
వీరబ్రెమ్మానికి నాలుగు వేలు ఇచ్చినాడు గౌసుమియ. దస్తగిరికి మూడు, రాఘవేంద్రకు రెండు, మిగతా ఇద్దరికీ పదైదు నూర్లిచ్చినాడు ఒక్కకరికి. బోల్టులు, శీలలు, రివిటులు, ఇట్లాంటివి రెండువేలకు పైగానే అయినాయి. ఎగస్ట్ర రోజువుడ్డు తుంటలన్నీ వీండ్లనే తీసుకుపొమ్మనాడు రెడ్డి. పర్నిచర్‌లో జాయింట్లకు అవిట్ని ఏస్తే శానా సోకుగా ఉంటాది. అదిగాక మూడువేలు బెట్టి కొత్తది చిత్రిక బట్టే మిశను కొన్నారు ఈ పని కోసరమే. అది సరే శెడ్డుకు ఎప్పటికీ పనికొస్తాది. అన్నీ బోను, పదివేలకు పైగా మిగిలినది గౌసుమియకు. ఈ రెండు నెలలూ అందరికీ టిపన్లు బోజనాలు, టీలు అన్నీ దినకర్ రెడ్డి బరించినాడు.
“చేతికి ఎముక లేనోడు మా రెడ్డి” అని వర్కర్లు అందరూ మెచ్చుకున్నారా యప్పను. కొన్ని రోజుల్లోనే ‘కిన్నెర’కు శానా పేరు వచ్చినాది. జనముతో కిటకిట లాడసాగినాది.
నాల్గు రోజులుండి, దస్తగిరిని, వీరను తీసుకోని ఎమ్మెల్యే కాడికి బోయినాడు గౌసుమియ. ఆ యప్ప బిల్డింగు సినిమాల్లో జూపిచ్చే దాని మాదిరుండాది. గేటు కాడ గుర్కా నిలబెట్టేసినాడు. లోపలికి పోను జేసి, పలానా వాండ్లంట, తమరు రమ్మన్నారంట అని చెబితే ఎమ్మెల్లే వాండ్లను లోపలికి పంపియ్యమన్నాడు.
రత్నరాజప్పకు ఆదోనిలో పెద్ద రిపైండాయిల్ ఫ్యాక్టరీ ఉన్నాది. కర్నూలులో ఉన్న ‘రవిప్రకాష్’ ఓటలు, లాడ్జి ఆయనవే. ఇవి గాక ఆయనకు సిమెంటు డీలరుషిప్పున్నాది పాణ్యం సిమెంటు కంపెనీది. గుంతకల్లులో ట్రాక్టర్లు అమ్మే శోరూము గూడ్క ఉండాది. ఆ యప్ప తొందరలోనే మినిస్టరు అయితాడని అనుకుంటుంటారు.
లోపలికి బోయినారు ముగ్గురు. వరండాలోన పెద్ద కుక్కను కట్టేసి ఉండారు. దాన్ని జూసి వీండ్లకు బయమైనాది. అది వీండ్లను జూసి మొరిగినాది. ఎవరో వచ్చి గదిమితే గమ్మునుండాది.
లోపల ఆలు ఇంద్రభవనమే. ఎమ్మెల్లేగారు సోపాలో కూర్చొని ఉన్నారు. ‘కూసోండని’ చెబితే వీండ్లు ఆ యప్ప ముందల కూచోనీకె జంకుతాండారు.
“మీకు కాదప్పా, మీలోని విద్యకు మర్యాద ఇయ్యాల గదా! ‘కిన్నెర’లో మీ పనితనం చూసి నాకు శానా అబ్బురమనిపించినాది” అని బలవంతంగా కూచోబెట్టినాడు. టీ లు తెప్పించినాడు.
“శానా ముక్యమైన పని మింద మిమ్మల్ని రమ్మన్నాను. మా బందువొకాయన ‘దుబాయి’లో పని చేస్తాడు. ఇంజనీరు. శానా పెద్ద పదవిలా ఉండాడు. వాండ్ల యజమాని షేకు ఒకాయన శానా దనవంతుడు. దుబాయి షేకులంటే మీకు తెలుసు కదా!” అన్నాడు .
వీండ్లకు ఇవేవీ తెలియదు. అయోమయంగా సూస్తన్నారు ఆ యప్ప దిక్కు.
“అసలు దుబాయి పేరన్నా విన్నారా?” – వీండ్లు నోరు మెదపల్యా.
“ఓరి అమాయకుల్లారా! శేతిలో ఇంత విద్దె పెట్టుకొని బాయిలో కప్పల్లాగా ఆదోనిలో తనకలాడుతున్నారా!” అని ఆశ్చర్యపోయినాడు ఆ యప్ప. “‘దుబాయి’ అనేది ఒక దేశము రా. ఆడ అందరూ మీ సాయిబులే. మనకు నీళ్ల బాయిలున్నట్లు వాండ్లకు పెట్రోలు బాయిలుంటాయి. బంగారు మంచాలు గుడ చేయించుకుంటారంట.”
“బంగారు మంచాలా?” అని నోరెళ్ల బెట్టినారు ముగ్గురూ.
“మన దేశము నుంచి నాలుగు గంటలు విమానంలో ప్రయానముంటాది దుబాయికి” అన్నాడు ఎమ్మెల్యే. ఈ దుబాయి పురానమంతా ఎందుకు చెబుతున్నాడో అర్థం గాల్యా వీండ్లకు.
“మా బందువని చెప్పినానే, పెద్ద యింజనీరని! వాండ్ల యజమాని పెద్ద షేకు దుబాయిలో పెద్దది ఓటలు కట్టిస్తాన్నాడంట. సెవెన్, ఫైవ్ స్టార్ ఓటలంటారు దాన్ని. కోట్ల రూపాయలు కర్చుబెడతాన్నారంట. దాంట్లో పని చెయ్యనికి ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు శానామంది కావాలంట.”
“గౌసుమియా! నీవు పెద్దోనివై పోయినావు. నీవు పోలేవు గాని, ఈ యిద్దరు పిల్లోండ్లను దుబాయికి పంపిద్దాము. వాండ్లవీ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలంట. మొత్తం మూడేండ్లు కంట్రాక్టు రాయిచ్చుకుంటారు. ఉండనీకె మంచి క్వాటర్లు అంటే యిండ్లు ఇస్తారు. మన దేశంలో దొరికే కూలికి పదింతలుంటాది దుబాయిలో. మన కూరగాయలు, బియ్యం, బ్యాడలు అన్నీ దొరుకుతాయంట. మన తిండి మనం వండుకోవచ్చు. మా ఇంజనీరు చెప్పిందేమంటే మూడేండ్లు కష్టపడితే ఒక్కొక్కరు ఏడెనిమిది లక్షలు కండ్ల జూడోచ్చునని. కావాలంటే కంట్రాక్టు పొడిగించుకోని ఇంకా పని చేసుకొని సంపాయిచ్చుకోవచ్చు. సాలనుకుంటే వచ్చేసి ఆ డబ్బులతో ఈడ సెటిలవ్వచ్చు. మీరు సరేనంటే పాసుపోర్టు, వీసా ఇట్లాంటివి వాండ్లే జూసుకుంటారు.”
“కూలీ నెలనెల ఇస్తారా సారు!” అనడిగినాడు వీర.
“నెలనెలానే. ఎప్పటిదప్పుడు ఇంటికి పంపిచ్చికోవచ్చు.”
గౌసుమియ పిల్లోండ్ల వైపు జూసినాడు. వాండ్లకు ఇదేదో మంచిదే అనిపిస్తాంది. కానీ “మా శిన్నాయన పంపిస్తే పోతాము సారూ” అన్నారు. తన మీద వాండ్లకున్న గౌరవానికి శిన్నాయన శానా సంతోశించినాడు. “దస్తగిరి వాండ్ల నాయనతో నేను మాట్లాడతా. మీ అమ్మా నాయినలను అడుగుతావా?” అని వీరని అడిగినాడు.
“అడిగితే వాండ్లు తప్పకుండ వద్దంటారు శిన్నాయనా. ఒక్కనివే కొడుకువు. కండ్ల ముందర ఉండమంటారు. పోయేది కాయం చేస్కోని ఒకేసారి చెబితే సరి.”
“ఇంకోటి” అన్నాడు ఎమ్మెల్యేగారు. “మీరంతట మీరు బ్రోకర్ల ద్వారా పోతే శానా సమస్యలున్నాయి. నా ద్వారా ఇదంతా జరుగుతుంది గాబట్టి, మా బందువు పెద్ద కంపెనీలో ఉండాడు, ఆయనే పిలిపించుకుంటున్నాడు కాబట్టి మీకు ఏ ఎదారూ ఉండదు. ఆడికి పోవడానికి విమానం చార్జీలు, పాసుపోర్టు, వీసాలు అన్నీ సుమారు ఇరవై వేలయితాయి. నేను మీ గురించి శానా ఇదిగా చెప్పినందు వల్ల అవి గూడా కంపెనీయే బరిస్తాది లెమ్మని మా బందువు చెప్పినాడు.”
గుండెల్లోంచి భారం దింపినట్లయినాది ఇద్దరికీ.
“తప్పకుండా పంపిద్దాము సారు. మా బాగు కోరి మీరింత సాయం చేస్తుంటే, మేము దాన్ని కాదని ఎట్లా అంటాము. ఆ అల్లానే మీ రూపంలో వచ్చి మా మింద దయ జూపిస్తా ఉండాడని అనిపిస్తోంది” అన్నాడు గౌసుమియ.
దస్తగిరి, వీర సారు కాళ్లకు మొక్కినారు. “ధైర్యంగా పోయిరాండి. అక్కడే దయినా సమస్య వచ్చినా నేనున్నా. మీరు శానా పనిమంతులు. మీ లాంటోల్లకు గుర్తింపు త్యావడం ఎమ్మెల్లేగా నా బాధ్యత. నా స్వార్థం కూడ ఉంది లేండి. మా బందువు కంపెనీకి మాంచి నైపున్యం గలిగిన పన్రోండ్లను పంపిస్తున్నాగద!” అన్నాడు రత్నరాజప్ప.
ఒక్క నెల రోజుల్లో అన్ని ఏర్పాట్లూ అయినాయి. వీర ఊరికి బోయి అమ్మకు నాయినకు చెప్పినాడు. వాండ్లు ఏడ్చి మొత్తుకోని వద్దన్నారు గాని మూడేండ్లు కష్టపడితే జీవితాంతము పిల్లోడు సుకపడతాడని ఒప్పకున్నారు. నెలనెలా డబ్బులు పంపిస్తాననీ. అయిగా ఉండమనీ చెప్పినాడు వీర. “కానీ లేరా! మేనుకూ మెదడుకూ పని ల్యాకపోతే ఎట్లా! ఊరికే కూసోని ఏం చేస్తాము? పొద్దు పోనీకైనా యదో ఒక పని పెట్టుకుంటే పానం బాగుంటాది” అని చెప్పినారు. కొడుకును ఇడ్సలేక ఇడ్సలేక కండ్ల నీల్లతో సాగనంపినారు.
కావల్సినవన్నీ సర్దుకొని రైల్లో బొంబాయికి బోయి ఆడ్నించి దుబాయి విమానమెక్కినారు దోస్తులిద్దరు. ఎమ్మెల్నే మనిషి ఒకాయప్ప వాండ్లను దగ్గరుండి ఎక్కించి వచ్చినాడు. యాడ బొమ్మిరెడ్డిపల్లె? యాడ దుబాయి! కాలం తల్చుకుంటే ఎంచేపు? దాని దెబ్బకు ఎక్కడో ఉన్నోల్లు ఎక్కడికో బోయినారు.
***
మార్తమ్మ, కంబగిరి రెడ్డి జొన్న చేలో కలుపు తీయనీకె కూలికి బోయినాది. ఆ యాల దావీదుకు యాడా పని దొరకల్యా. ఇంటి కాడే ఉండాడు. ఆ యమ్మ పొద్దున్నే జొన్న రొట్టెలు చేసి నంచుకొనీకె కొరివి కారము చేసినాది. ఇద్దరూ చెరో రెండు తిన్నారు. ఇంకో రెండు సద్దిగట్టుకొని పోయింది. “ఇంకా రెండుంటాయి. పైటాలకు దిను. రేత్రి అన్నం చేస్తా” అని మొగునికి చెప్పిపోయినాది మార్తమ్మ.
దావీదుకు పొద్దుబోల్యా. ‘తూ దీనెమ్మ! మనిసికి సేతి నిండా పని ల్యాకపోతే తిక్కబట్టి నట్టుంటాది’ అనుకున్నాడు. ‘నేశే యెల్లసామి యింటికన్నా పోయొస్తే రేపటికయినా యాదయినా చూస్తాడు’ అనిపించి ఆడికి పోతే ఆ యప్ప లేడు. అయివే మిందున్న ఓటలు కాడికి టీ తాగనీకె బోయినాడని ఆ యప్ప పెండ్లాము, సత్తెమ్మ చెప్పినాది.
ఓటలు తిరిపాలు, రాజమ్మను సంజన్నగౌడు డోనుకు దీసకపోయి తన వైను శాపు ముందల బజ్జీల బండి పెట్టించినంక అందురికీ ఈ అయితే ఓటలే దిక్కయినాది. కుంచెం దూరమనిపించినా, ఆడ టీ లు, టిపన్లు, బోజనం గుడ్క బాగుంటాదని పేరు.
దావీదు పొయేతలికి నేశే యెల్లసామి ఓటలు లోన గూసోని అలసంద వడలు తింటాన్నాడు. ఈ యప్పను జూసి నోరంతా తెరిచి నవ్వుతా, “రా దావీదన్నా వడలు తింటావా?” అనడిగి; “రే, ఛోటూ, అన్నకు రెండు వడలు తెచ్చియ్యి!” అనరిశినాడు. ఒక పొట్టిగాడు ప్లాస్టికు ప్లేటులో కాయితం తుంట పరిసి రెండు వడలు లేసుకొని తెచ్చిచ్చినాడు.
వాని పేరేందో గాని, ఓటలు ఓనరు కాన్నించి వచ్చినోల్ల వరకు అందరూ వాన్ని ఛోటూ అనే పిలుస్తారు. పదేండ్లు గుడ్క ఉండవు వానికి. నిక్కరేసుకోని, దాన్ని కప్పేసేంత అంగి వేసుకుంటాడు. ఆ అంగీ వానిది కాదేమో! వాని కాల్లకు చక్రాలున్నట్లు తిరుగుతుంటాడు.
వాని పేరు రమన.
వడలు తిన్నంక ఇద్దురూ టీలు తాగినారు. నేశె యెల్లసామి ఒక బీడీ ముట్టించుకోని, దావీదుకు గుడ్క ఒకటిచ్చినాడు. “మీ యింటి కాడికే బోయింటి. నీ వీడికొచ్చినావని సత్తెమ్మ చెప్పె” అన్నాడు దావీదు.
“పని లేని మంగలోడు పిల్లి తల గొరిగినాడని, నాకూ ఇయ్యాల పనేమి దొరకక ఈడికొచ్చినా. మా వదినె బాగున్నాదా?” అన్నాడు యెల్లసామి.
(ఇంకా ఉంది)