ఫస్ట్ లవ్-20

0
2

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కవిత, తన చెల్లెలింటికి వెళుతూ, వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, తర్వాత తిను అని హసంతికి చెప్పి వెళ్ళిపోతుంది. హసంతి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. ఆమె మనసంతా ఎంతో వేదనతో నిండిపోయింది. కార్తీక్, గౌతమ్‍ల జ్ఞాపకాలు వేధిస్తుండగా, చిరాకు ఎక్కువై – అలమారలోని అన్ని సామాన్లను విసిరేస్తుంది. ఈలోపు ధృతి వాళ్ళింటికి వస్తుంది. మెయిన్ డోర్ తీసే ఉండడంతో ఆంటీ అని పిలుస్తూ లోపలికి వచ్చేస్తుంది. కింద ఎవరూ కనబడకపోయేసరికి, ఆశ్చర్యపోతూ, పైకి వచ్చి హసంతి గది తలుపు కొడుతుంది. ఎంత కొట్టినా తలుపు తీయకపోయేసరికి, హసంతి లోపల ఏం చేస్తోందోనని మరింత బలంగా తలుపుని నెడుతుంది ధృతి. సరిగ్గా అప్పుడే హసంతి ఉరి వేసుకోడానికి ఉచ్చు తగిలించుకుంటూ ఉంటుంది. అది చూస్తూనే ధృతి కోపంతో, ముందు హసంతిని దిగమంటూ అరిచి, ఆమె దిగగానే, చెంపమీద లాగి కొడుతుంది. ఏంటీ పిచ్చి పని, ఎందుకిదంతా అని అడుగుతుంది. కాసేపు ఏడ్చాకా, తనకీ, కార్తీక్‍కి, గౌతమ్‍కి మధ్య జరిగిన అన్ని విషయాలూ చెప్తుంది హసంతి. వాళ్ళిద్దరి మధ్య ఇమడలేకే, చచ్చిపోవాలనుకున్ననని అంటుంది. నువ్వు చెప్పేవన్నీ వాస్తవాలే, కానీ ఎప్పుడూ మనం అనుకున్నదే జరిగితే, అది జీవితం కాదు, అలా జరగాలని రూలు కూడా ఎక్కడా లేదంటుంది ధృతి. అక్కడ తన ఇంట్లో అమ్మ ఫోటో ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూంటాడు గౌతమ్. అంతలో అక్కడికి వచ్చిన రఘురాం కొడుకుని ఎందుకు బాధపడుతున్నావని అడుగుతాడు. హసంతితో ఏవైనా మనస్పర్ధలొచ్చాయా, ఏం జరిగిందో చెప్పమని, లేదా కనీసం ఫ్రెండ్స్‌తో అయినా షేర్ చేసుకోమని చెప్తాడు. కార్తీక్ కొలీగ్ సురేష్ ఫోన్ చేసి, కార్తీక్‍కి అమెరికా వెళ్ళే అవకాశం మళ్ళీ వచ్చిందని చెప్తాడు. ఈసారైనా వెళ్ళమని అంటాడు. మర్నాడు ధృతి వచ్చి హసంతిని  కాస్త మార్పు కోసం దగ్గరలోని గుడికి తీసుకువెళ్తుంది. రోడ్డు మీద మోపెడ్‌పై వస్తున్న రఘురాంకి హఠాత్తుగా అలసటగా అనిపించి, ఓ పక్కకి ఆపి పెద్దగా మూలుగుతుంటే అటు వెళ్తున్న కార్తీక్ బైక్ ఆపి, ఆయన దగ్గరకి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. ఎదురుగా ఉన్న ఓ షాప్ లోంచి వాటర్ బాటిల్ కొనుక్కొచి రఘురాం చేత  నీళ్ళు తాగిస్తాడు. కాస్త స్తిమితపడ్డ రఘురాంని, ఇంటి దగ్గర దించనా అని కార్తీక్ అడిగితే, వద్దు వెళ్ళగలనని చెప్పి వెళ్ళిపోతాడు రఘురాం. గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ తన వల్ల తమ కుటుంబాలలో సమస్యలు రాకుండా చూడమని ప్రార్థిస్తుంది హసంతి. పూజారి గారిచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక, టాప్ దగ్గర చేతులు కడుక్కుని వెళ్ళిపోతారు ధృతీ, హసంతి. కాసేపటికి ఆ గుడిలో వెయ్యి ప్రదాక్షిణాలు పూర్తి చేసిన గౌతమ్ పూజారి దగ్గరకు వచ్చి ఆయనిచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకుని చెయ్యి కడుక్కోడానికి టాప్ దగ్గరకు రాగానే అక్కడో ఒక లేడీస్ వాచ్ దొరుకుతుంది. ఇది అచ్చం నేను హసంతికి ఇచ్చిన వాచ్ లాగే ఉందని అనుకుంటాడు. ఇంతలో సుధాకర్ వచ్చి వెళ్దామా అని అడిగితే, వాచ్ అక్కడ పెట్టేసి వస్తానని అంటాడు గౌతమ్.  అది ఎవరిదైతే వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు, జేబులో పెట్టుకుని బండెక్కు అంటాడు సుధాకర్. సరేనని బైక్ వెనకాల కూర్చుంటాడు గౌతమ్. ఇక చదవండి.]

[dropcap]మో[/dropcap]పెడ్ మీద ధృతి, హసంతి వస్తున్నారు. కొంత దూరం రాగానే.. కార్తీక్ సడన్‌గా వాళ్ళకి అడ్డొచ్చి నిలబడ్డాడు. మోపెడ్ ఆపి కంగారుగా కార్తీక్‌ని చూశారు ఇద్దరూ.

“కార్తీక్ ప్లీజ్! హసంతిని డిస్ట్రబ్ చేయకు. వెళ్ళిపో!” అంది ధృతి.

“ధృతీ! నువ్వు కల్పించుకోకు. నేను హసంతితో మాట్లాడాలి. బండి దిగు హసంతీ!” అన్నాడు.

హసంతి బండి దిగింది.

“హసంతీ! నీతో ఒక విషయం మాట్లాడాలి.”

“ఏంటి కార్తీక్! ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? దయచేసి నన్ను వదిలేయ్! నా జీవితంలోకి రాకు. ఎంగేజ్మెంట్ అయిన పెళ్లి చెడిపోవడానికి కారణం మాత్రం నువ్వు కాకూడదు. ఎందుకంటే నా మనసులో నీకు ప్రత్యేక స్థానం ఉంది. దానిని చెరిపేసేలా చేసుకోకు. ప్లీజ్” అంది హసంతి చేతులు జోడించి.

“ఏంటి! ఎప్పుడు కనపడ్డా ఈ మూడు మాటలకే ఫిక్స్ అయ్యావా? నిన్ను వదిలేయాలా? వదిలేయమని చాలా ఈజీగా చెప్తున్నావే! నీ నోటి నుంచి వచ్చిన మాటల్లో ఉన్న నిజాయితీ, నీ కళ్ళలో కనిపించడం లేదు. నువ్వు ఎవరికోసం ఇలా రెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎక్కడున్నా బాగుండాలనీ, గౌతమ్‌ని నిన్నూ కలిపి.. నేను త్యాగిలా అబద్ధపు బ్రతుకు బ్రతకలేను హసంతీ!

మరిచిపోవడం, మారిపోవడం ఆడవాళ్లకు తెలిసినంతగా తెలిసినంతగా.. సిన్సియర్‌గా ప్రేమించే నాలాంటి మగాళ్ళకి తెలియదు. అందుకే మళ్ళీ మళ్ళీ నీకోసం, నీ వెంట పడుతున్నా!” అన్నాడు.

“అయ్యో! ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కావడం లేదు కార్తీక్. నిన్ను ప్రేమించడం అంత నేరమా? అందుకోసమేనా ఇలా టార్చర్ పెడుతున్నావు?”

“ఏంటి టార్చరా?! నువ్వు నాకు తెలియకుండా నన్ను లవ్ చేసింది నా తప్పా? చెప్పు. నేను మృదులతో లవ్‌లో ఉన్నానని నీకు నువ్వే ఊహించుకున్నది నా తప్పా! తర్వాత నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని తెలిసి, నిన్ను వెతుక్కుంటూ రావటమే నేను చేసిన నేరమా! ఈ మధ్యలో గౌతమ్ నీ జీవితంలోకి రావటంలో నా ప్రమేయం ఉందా!

చెప్పు.. ఇవేగా మన ముగ్గురి మధ్య జరుగుతున్న నువ్వు అనుకుంటున్న.. సో కాల్డ్ టార్చర్. దీనికి నువ్వు గాని, నేను గాని, గౌతమ్ గాని కారణం కాదు. అంతా విధి. ఇది నువ్వు ముందు అర్థం చేసుకో” అన్నాడు.

“ఇది విధి వల్లనో.., లేకపోతే నా వాల్లనో!?.. ఇప్పుడు నేనేమీ చేయలేను. గౌతమ్‌ని కాదని, నీ వెంట వచ్చేయలేను. దయచేసి అర్ధం చేసుకో” అంది చేతులు జోడించి.

“కార్తీక్! ఏ విషయమైనా తర్వాత మాట్లాడుకుందాం. నడిరోడ్డు మీద అందరూ చూస్తున్నారు. గొడవ పెట్టకుండా వెళ్ళిపో! ప్లీజ్!” ధృతి కోపంగా అంది.

రోడ్డు మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వీళ్లను చూసి ఆగి “ఏంటమ్మా! ఏమైనా ప్రాబ్లమా? గొడవ చేస్తున్నాడా!” అనేసరికి ముగ్గురూ నిర్ఘాంత పోయారు.

“ఏం లేదు. మీరు వెళ్ళండి అన్నా!” అంది ధృతి వాళ్ళతో.

“మిమ్మల్ని చూస్తే అలా కనిపించడం లేదే.”

“మేం ఫ్రెండ్స్. ఇక్కడ ఏం గొడవ జరగడం లేదు. దయచేసి వెళ్ళండి బ్రో” అని కార్తీక్ గట్టిగా అరిచేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు.

“ఇప్పుడు సంతోషమా!” అని ఎదురుగా నిలబడ్డ కార్తీక్‌ని పక్కకు నెట్టి, ఎడ్రబడ్డ కళ్ళతో హసంతి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

“హసంతీ! ఆగవే బైక్ మీద వెళ్దాం. ఉండు. వస్తున్నా!” అని మోపెడ్ మీద కూర్చుని,

“ఛా! ఏంటి కార్తీక్.. ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్నావు” అని చిరాగ్గా చూసుకుంటూ వెళ్ళింది ధృతి.

***

గౌతమ్, సుధాకర్ ఇంటికి వచ్చారు. గౌతమ్ జేబులో ఉన్న రిస్ట్ వాచ్ తీసి, కబోర్డ్‌లో పెట్టాడు.

“రేయ్! సుధాకర్.. ఈ ఒక్కరోజు బైక్ మీద ఎటైనా లాంగ్ టూర్ వెళదామా? రిలీఫ్‌గా ఉంటుంది” అన్నాడు గౌతమ్.

“ఒరేయ్! వచ్చే వారంలో నీ పెళ్లి రా! ఎన్ని పనులుంటాయి?. ఇప్పుడు టైం ఎంతో విలువైనది రా నీకు. ఈ సమయంలో మీ డాడీని వదిలి టూర్ వెళ్తావా?” అన్నాడు.

“ఏమోరా! మనసేమీ బాగాలేదు. అనుకున్నదొకటి అవుతున్నది ఒకటి. ఏవేవో జరుగుతున్నాయి. ఏది మంచో, ఏది చెడో అర్థం కావటం లేదు. ఇది నిజమో! ఏది అబద్ధమో తెలియటం లేదు! ఆశించిన జీవితం సరైన దారిలో వెళ్ళటం లేదని స్పష్టంగా తెలుస్తోంది.”

“ఒరేయ్! అన్నీ సక్రమంగానే జరుగుతాయి. అనవసరంగా నువ్వే ఎక్కువ ఆలోచిస్తూ.. హసంతిని కన్ఫ్యూజ్ చెయ్యకు రా!”

“నీకు అలానే ఉంటుంది రా!. పడుకుంటే నిద్ర పట్టడం లేదు రా!”

“ఎందుకురా ఏం జరిగిందని నీకు నిద్ర పట్టటం లేదు. నువ్వే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు! సొల్యూషన్ లేనప్పుడే సమస్య మొదలవుతుంది. సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది రా!. మనమే పరిష్కారం వెతుక్కోవాలి”

“నువ్వెనైనా చెప్పరా ఏదో అపశృతి వినిపిస్తోంది.”

అంతలో సుధాకర్ ఫోన్ రింగ్ అయింది.

“ఆఁ.. అలానే.. సార్! ఓ.కే, ఓ.కే..” అన్నాడు.

“మేనేజర్ కాల్ చేస్తున్నాడు. ఆఫీసులో కొత్త ప్రాజెక్టు తీసుకున్నారు. అదో అడిషనల్ వర్క్. సరే! వెళ్తాను. ఏదైనా ఉంటే కాల్ చెయ్యి” అని వెళ్ళాడు సుధాకర్.

***

కార్తీక్ ఫ్రెండ్ సురేష్‌కి ఫోన్ చేశాడు.

“హలో! సురేష్! నేను కార్తీక్‌ని మాట్లాడుతున్నాను. నిన్న యూ.ఎస్. ప్రాజెక్ట్ అని చెప్పావే, నేను వెళ్లాలనుకుంటున్నాను రా!”

“వెరీ గుడ్! రా! నువ్వు వెళ్ళాలనుకుంటే.. రేపటి నుంచి ఆఫీస్‌కి రావాలి. టీంమేట్స్‌ని నువ్వే ట్రైన్ చేయాలి.”

“రేపటి నుంచి తప్పకుండా ఆఫీస్‌కి వస్తాను రా”

“సరే! ఆఫీసులో చెప్తాను. రేపటి నుంచి జాయిన్ అవ్వు.”

“అలాగే” అన్నాడు కార్తీక్.

***

ధృతి వచ్చి సోఫాలో కూర్చుంది. లాప్‌టాప్ చూస్తున్న హసంతి పక్కన కూర్చుంది. ఇద్దరి మధ్య మౌనం. ఐదు నిమిషాలయ్యాక… “అలిగింది చాల్లే.. సరే ఏం చెయ్యాలనుకుంటున్నావు?” అని మొదలు పెట్టింది ధృతి.

“ఏ విషయం గురించి అడుగుతున్నావు?”

“గౌతమ్‌కి, నీకు పెళ్లి డేట్ దగ్గర పడుతోంది. ఇప్పుడు నువ్వు సైలెంట్‌గా ఉండటం బాగుందా! దీనికి నువ్వే ఒక ముగింపు ఇవ్వాలి హసంతీ!”

“నన్నేం చేయమంటావే?”

“నువ్వు ఇలాగే మౌనంగా ఉండటం వల్ల మీ ముగ్గురికి మంచిది కాదు. నీ వలన వాళ్ళిద్దరి జీవితాలే కాకుండా, నీ జీవితం కూడా పాడవుతుంది.”

“నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. నావల్ల వాళ్ళిద్దరికీ ఎలాంటి సమస్య రాకూడదు.”

“అది ఎలా సాధ్యం? వాళ్ళిద్దరికీ సెంటర్ పాయింట్ నువ్వు. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా విడమర్చి చెప్పొచ్చు కదా!”

“వాళ్లకి నేనేం చెప్పాలి చెప్పు? వాళ్ళిద్దరూ నన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. దానికి నన్నేం చేయమంటావు?”

“కనీసం వాళ్లలో నీకు ఎవరు నచ్చారో చెప్పొచ్చు కదా!”

“ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో నేను ఎవరిని ఎంచుకోవాలో ఎవరిని వదులుకోవాలో ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. వాళ్ళిద్దరిలో ఎవరికి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.”

“ఒక్క విషయం అడుగుతాను కరెక్ట్ గా చెప్పు.. నిజంగా వీళ్ళిద్దరిలో నీకు ఎవరు ఇష్టమో చెప్పు.”

“…….”

తలొంచుకున్న హసంతి కళ్ళలో నీళ్లు.

“నిన్నే హసంతీ! చెప్పు. ఇప్పుడు నీ మౌనం మంచిది కాదు. ఆ తర్వాత నీ ఇష్టం.”

అక్కడినుంచి హసంతి తన గదికి వెళ్ళిపోయింది.

హసంతి ప్రవర్తనకి ధృతి అవాక్కయింది.

***

రోడ్డు పక్కన టీ స్టాల్ దగ్గర నిలబడి సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు కార్తీక్.

అంతలో అక్కడికి మోపెడ్ మీద రఘుపతి వచ్చాడు. అతన్ని చూసి, కార్తీక్ గుర్తుపట్టి చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేశాడు.

“సార్! బాగున్నారా? మీకు ఇప్పుడు ఒంట్లో బాగుందా!”

“బాగున్నాను బాబూ! నువ్వేంటి ఎక్కడున్నావు?” అన్నాడు.

“పక్కన ఆఫీస్‌లో పనుండి వచ్చాను.”

“బాబూ! నీ పేరు ఆ రోజు చెప్పావు గాని మర్చిపోయాను”

“కార్తీక్.”

“రా! టీ తాగుదాం” అన్నాడు రఘురాం.

“పర్వాలేదు సార్! ఆఫీస్‌లో పని ఉంది”

అప్పటికే ఇద్దరికీ టీ చెప్పాడు రఘురాం.

‘ఈ పెద్దాయన ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు? నాకు నాన్న ఉంటే..’ అనుకుంటుండగా “బాబూ! టీ తీసుకో” అని ఇచ్చాడు రఘురాం.

“ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏమైనా ప్రాబ్లమా?” చనువుగా అడిగాడు రఘురాం.

“అదీ.. అదేం లేదు సార్!”

“లేదు, నిన్ను చూస్తేనే రెస్ట్‌లెస్‌గా ఉన్నావని తెలుస్తోంది. ఇంట్లో ఏదైనా సమస్యా!”

“ఏం లేదు! సార్.”

“మరయితే.. ప్రేమ సమస్యా!”

“సార్! మీకు ఇదంతా ఎలా తెలిసింది? మీరు సైకియాట్రిస్టా?”

“కాదు బాబూ! నీ వయసులో లవ్ కాకుండా వేరే ఏం సమస్యలు ఉంటాయి చెప్పు.”

“అవును సార్! జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను. కష్టం అనిపించిన ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ దొరికింది. కానీ ఈ లవ్‌కి మాత్రం సొల్యూషన్ లేదేమో!” అన్నాడు.

“అయితే సుఖాంతం. లేదంటే విషాదం. సాఫీగా ఏ ప్రేమ కధా ముందుకెళ్ళదు కదా!”

రఘురాం నవ్వాడు.

“సారీ! నా సమస్యతో మిమ్మల్ని..”

“అయ్యో! ఇందులో ఏముంది? నాది కూడా లవ్ మ్యారేజే. నువ్వు చెప్పినవన్నీ నేనూ దాటి వచ్చాను. ఇప్పుడు ఏర్పడే అవరోధాలన్నీ సమస్యల్లాగే కనిపిస్తాయి. కానీ ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయో తెలుసా!”

“ఏం జ్ఞాపకాలో, ఏం మధురాలో సార్! నేను ఇష్టపడే అమ్మాయి నన్ను లవ్ చేస్తోందో లేదో తెలియటం లేదు. ఇంకొన్ని రోజుల్లో తనకి పెళ్లి కాబోతోంది. ఈ వెంటాడే జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నాను” అన్నాడు.

“ఆ అమ్మాయి ఇష్టపడే.. మరో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోందా!”

“తెలియదు సార్!”

“బాబూ! ప్రేమంటేనే ఇష్టం, కష్టం రెండూ ఉంటాయి. ఈ రెండూ ప్రేమ నాణానికి బొమ్మ, బొరుసుల్లాంటివి. ఇష్టపడుతుంటే కష్టపడాలి. కష్టం ఎదురైనప్పుడు దానిని ఇష్టంగా ఎదుర్కోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు ప్రేమించే అమ్మాయినే పెళ్లి చేసుకుంటావని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచిస్తావని, నిన్ను చూస్తేనే తెలుస్తోంది. ఆల్ ది బెస్ట్. ఇది నా నెంబర్. ఏదైనా సమస్య ఉంటే, నా హెల్ప్ అవసరమైతే, నాకు ఫోన్ చెయ్యి. కానీ నీ పెళ్లికి మాత్రం నన్ను ఖచ్చితంగా పిలవాలి.” అని నెంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు రఘురాం.

రెండు నిమిషాల్లో రఘురాం చెప్పిన మాటలు  తనలో తెలియని ఉత్సాహం నింపినట్టు ఫీలయ్యాడు కార్తీక్‌.

***

“హసంతీ! హసంతీ! వాషింగ్ మెషిన్‌లో బట్టలేస్తున్నాను. నీవి ఏమైనా ఉంటే తీసుకురా!” అని కింద నుంచి పిలిచింది కవిత.

రెండుసార్లు పిలిచినా సమాధానం రాకపోయేసరికి, తనే పైకి వెళ్ళింది కవిత.

గదిలో ఎక్కడా హసంతి కనిపించలేదు.

‘ఎక్కడికెళ్ళిఉంటుందబ్బా!’ అనుకుని ఫోన్ చేసింది.

స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది.

కిందికొచ్చి మళ్ళీ కాల్ చేసింది. రిప్లై లేదు.

ధృతికి కాల్ చేసింది.

“అవునా! నా దగ్గరికి రాలేదాంటీ!”

తర్వాత స్వప్నకి చేసింది.

“దాంతో మాట్లాడి చాలా రోజులైంది ఆంటీ! కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇవ్వడం లేదు. ఏమైనా ప్రాబ్లమా?”

“అదేం లేదు. నీ దగ్గరకు వస్తే నాకు కాల్ చెయ్యి.”

మరో నెంబర్‌కి కాల్ చేసింది కవిత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here