[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఊర్మిళకి సంబంధాలు చూస్తుంటాడు ఆనంద్. ఆ క్రమంలో ఒకతన్ని తన ఇంటికి పిలిపిస్తాడు. అతన్ని చూసిన ఊర్మిళ మంచివాడిలానే ఉన్నాడని అనుకుంటుంది. ఆ వచ్చినతను తనకు మేనరికం ఉందనీ, ఫ్యామిలీ గొడవల వల్ల పెద్దవాళ్ళ అంగీకారం దొరకటం లేదనీ, అందువల్లా తాను డిసైడ్ చేసుకోలేకపోతున్నాననీ, మిమ్మల్ని కలిసి చెప్పడం మర్యాద అని వచ్చానని ఆనంద్‍తో అంటాడు. అతను వెళ్ళిపోయాకా, ఆనంద్, ఊర్మిళతో – నీకు మరికొన్ని సంబంధాలు చూస్తాను అంటే, వద్దని గట్టిగా చెబుతుంది. తనకి పెళ్ళి ఇష్టం లేదని అంటుంది. ఎలాంటి వాళ్ళు కావాలో చెప్పు అని అంటే, ఎలాంటి వాళ్ళూ వద్దని అంటుంది. పోనీ నన్ను చేసుకుంటావా అని ఆనంద్ కోపంగా అంటే చేసుకుంటాను అంటుంది. వారిద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం! తాను లైఫ్‍లో డిటాచ్డ్‌గా ఉండదలచానని అంటుంది ఊర్మిళ. మరి నన్నెలా చేసుకుంటానన్నావన్ ఆనంద్ అడిగితే, మిమ్మల్ని చూసుకునేవారెవరూ లేరని చేసుకుంటానన్నాను అని చెప్తుంది. ఆనంద్ ఆజ్ఞాపనలోని ఉద్దేశం అర్థం చేసుకుంటుంది. ఆమెను ఆమె గది వద్ద దింపేసి వెళ్ళిపోతాడు ఆనంద్. ఓ రోజు టీ పాకెట్స్ ఉన్న సంచీని భుజాన తగిలించుకు బయటకి వచ్చి కొద్ది దూరం నడవగానే ఆనంద్ కారు అక్కడ ఆగి ఉండడం చూస్తుంది. కారులో ఆనంద్ స్టీరింగ్ సీట్‍లో వెనక్కి వాలి పడుకుని ఉండడం చూసి, గట్టిగా పిలుస్తూ లేపుతుంది. రాత్రి నుంచి అక్కడే ఉన్నట్టు మాటల్లో చెప్తాడు. ఆనంద్ ఇంటికి చేరాకా, అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తే, కళ్ళు ఉబ్బి ఉంటాయి. ఎంతో వేదనతో ఉండి కూడా తనతో పంచుకోవడం లేదని బాధపడుతుంది ఊర్మిళ. వెంటనే ఫ్రిజ్ నుంచి చల్లటి నీళ్ళు, వార్డ్‌రోబ్ నుంచి ఒక కర్చీఫ్ తెచ్చిచ్చి ముఖం తుడుచుకోమంటుంది. కిచెన్ లోకి వెళ్ళి టీ చేసి ఇస్తుంది. కాసేపయ్యాకా, రాత్రి తాను ఊర్మిళ దగ్గరకు ఎందుకు బయల్దేరాడో వివరిస్తాడు. అతనికి జ్వరం ఉందని గ్రహించి క్రోసిన్ ఇచ్చి, నుదురు మీద ఇమామి మెంతో ప్లస్‌తో సున్నితంగా రుద్దుతుంది. కొద్దిసేపయ్యాకా, ఆనంద్ లేచాకా, వేడిగా చారు అన్నం కల్పి, చెంచా ఇచ్చి తినమంటుంది. తనని కూడా తినమంటే, తింటుంది. కాసేపయ్యాకా, లేచి కారు కీస్ తీసుకుంటాడు ఆనంద్. జ్వరం పూర్తిగా తగ్గినట్టు తెలియనిదే ఎలా వెళ్ళటం అంటుంది. నేను ఫోన్ చేస్తాగా అంటాడు. తనకి ఇక సంబంధాలు చూడకండని అభ్యర్థిస్తుంది. ఏమీ మాట్లాడకుండా వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు ఆనంద్. – ఇక చదవండి.]
అధ్యాయం 20
[dropcap]మ[/dropcap]రునాడు లేస్తూనే అనుకుంది ‘ఆయన జ్వరం ఎలా ఉందో’ అని. ఫోన్ చేస్తా అన్నారు. ఒకసారి తన చేతిలో ఫోన్ వంక చూసుకుంది రబ్బర్ బ్యాండ్‌తో రెండు భాగాలు కలిపినట్టుగా ఉంది. ఫోన్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటుందో తెలియదు. తానలా అనుకుంటుండగానే మరునాడు గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు మహేష్.
సార్ ఇచ్చారంటూ ఒక కవర్ ఇచ్చాడు.
తీసుకొని చూసింది.
కొత్త ఫోను.. తనకది ఇప్పుడు చాలా అవసరం.
ఆయన నిన్న తన ఫోన్ పరిస్థితి చూసినట్టు ఉన్నారు.
మహేష్ వంక చూసింది చిరునవ్వుతో!
మహేష్ ఒక అడుగు ముందుకు వేసి మెల్లిగా చెప్పాడు. “సార్ కార్ లోనే ఉన్నారు” అని.
“ఓ అవునా!” అంది తను.
“సార్‌కి పథ్యం వంట చేసి ఇమ్మన్నారు” అన్నాడు.
తనకు చాలా సంతోషం వేసింది. అప్పటికే మొదలు పెట్టిన వంటను గబగబా పూర్తి చేసి, ఉన్న క్యారియర్ లో సర్ది, కవర్లో చిన్న చీటీ రాసి పెట్టింది – ‘దయచేసి నాకు ఇంకేమి ఇవ్వొద్దు’, అని..
బహుశా ఆయన అది చూసి నవ్వుకుని ఉంటారు. తిక్క వేషాలకు, ఆత్మాభిమానానికి తక్కువేమీ లేదని.
అమ్మణ్ణి ఫోన్ చూస్తూ, జోక్ చేసింది – “నాకు విజయ్ ఎప్పుడు దొరుకుతాడో!” అని.
“ఈ విజయ్ గోల ఏంటే బాబు!” అంది తను.
“అనంత్‌కు కేర్‌టేకర్. రోజా పాలిట రాక్షసుడు” అంది.
“రోజా ఎవరు!”
“నాకైతే నువ్వే రోజా!”
“పాపం సర్ రాక్షసుడు కాదే!”
“అలా అనకే! విజయ్”
“అలా ఉంటేనే మజా!”
“సరేలే! నువ్వు, నీ నవలల గోల!” అంటూ కంపెనీ బ్యాగు సర్దుకుంది.
“మరి ఫోన్ పార్టీ” అంది అమ్మణ్ణి..
“విజయ్‌ను అడుగు!” అంది తాను నవ్వుతూ!
తన ఫోన్‌లో ఇంత బ్యాలెన్స్ ఎలా ఉంది.
బ్యాలెన్స్ కూడా వేయించారన్న మాట.
అవమానంతో ముఖం కందింది.
ఎవరైనా మన పేదరికాన్ని గమనిస్తే మనకెలా ఉంటుంది.
ఆయన ఇలా చేయవలసింది కాదు. ఇప్పుడు తాను ఆయనకు ఫోన్ చేయాలా? వద్దా? ఫోన్ కొనిస్తే థాంక్స్ కూడా చెప్పనందుకు, మర్యాద లేదు అనుకుంటారేమో!
ఒక విధంగా అది కూడా తనని అవమానించడమే! కానీ ఇంటి దాకా పంపిన ప్రేమకు, శ్రద్ధకు సంతోషపడింది. అయినా అలా కూడా ఎలా సంతోషించింది. ఆయన తన కేమవుతారని. ‘నాకు ఫోన్ వద్దండి, నా ఫోన్ రిపేర్ అవుతుంది’ అనీ తను చెప్పాల్సింది కదా! తన ఆత్మాభిమానం తీవ్రంగా దెబ్బతీయబడింది.
ఎందుకు తాను ఆయన అధికారానికి లొంగిపోతుంది? తాకి క్రింద పడినా భూదేవియే దిక్కంట. తనకు మరెవరు లేక, ఆయన్ని తన బాస్ అనుకుంటూందా!
తన వాళ్ళందరూ తనని వదిలి వెళ్ళబట్టే గదా, తనకు ఈ పరిస్థితి.
కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.
కొత్త ఫోన్‌తో ఆయనకు ఫోన్ చేసింది..
ఫోన్ బాగుందని కానీ, థాంక్స్ చెప్పడం కానీ చేయలేదు. అలా చెప్పి తనను తగ్గించదల్చుకోలేదు.
అవతలి నుండి ఆయన ఫోన్ తీసారు.
“ఎలా ఉన్నారు సర్!” అంది ధైర్యం చేసి.
ఆయనతో మాట్లాడాలి అంటే ఎప్పుడూ భయమే! ఆయన ఒకసారి సరదాగా మాట్లాడినట్టు అనిపించినా, ఎప్పుడూ ఒక లాంటి గాప్, డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తారు తమ మధ్య.
“ఎలా ఉన్నారు, సర్!” అంటే, “ఎలా ఉండాలి?” అన్నారు.
ఇదేమైనా సమాధానమా?
“అది.. చాలా రోజు లైందని.. కొత్త ఫోన్..”
“ఓ.కే. ఇంకేమైనా చెప్పాలా!”
తన అభిమానం ఎదురు దెబ్బ తగిలి విలవిల లాడిపోయింది.
అధికారం సణుగుతూ అయినా భరించగలదు.
నిరాదరణ తట్టుకోలేదు. ఒక్కసారిగా ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది.
ఆ తర్వాత ఎప్పుడో ఆయన చెపితే తెలిసింది, తానెక్కడ హోప్స్ పెంచుకుంటుందోనని అలా మాట్లాడేవారట.
ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసారు. తనకు తెలీకుండానే తన మనసు మృదంగమై మ్రోగింది. ఎందుకు ఈ బలహీనత తనలో!
ఆయన ఏదో అంటే, టెన్షన్ లోకి వచ్చి తానేదో అంటుంది. ఆలోచన తక్కువ. నన్ను పెళ్ళి చేసుకుంటావా అంటే చేసుకుంటాను అంది, ఆయన మాటలకు కౌంటర్‌గా!
అంత కన్నా ఆలోచన లేదు. ఎప్పుడూ ఆ కోణంలో ఆలోచించ లేదు. నన్నెలా చేసుకుంటావు, అన్నారు. మిమ్మల్ని చూసుకొనే వారు లేరనీ. అంది, అది తన హృదయం నుండి వచ్చిన మాటే కావొచ్చు, ఆలా అన్నందుకు తర్వాత సిగ్గుతో చచ్చిపోయింది. ఈ పిరికితనం, భయం – ఈ బలహీనతలే తన వ్యక్తిత్వాన్ని శాసిస్తూ, తన భవిష్యత్ ను కూడా నిర్దేశింపజేస్తాయేమో!
“చెప్పండి” అంది డల్ గొంతుతో!
“ఏమలా ఉన్నావు?” అన్నారు.
ఎలా ఉండాలి చెప్పండి అంటే బాగోదు అని ఊరుకుంది.
ఆయన ఒక ప్రపోజల్ తెచ్చారు. బి.కామ్. డిగ్రీలో చేరిపోతే, అక్కడే హాస్టల్‌లో ఉండొచ్చన్నారు. అమ్మణ్ణికి కూడా ఆఫర్ ఇచ్చారు.
ఇద్దర్నీ చేరి పొమ్మన్నారు.
అమ్నణ్ణి అంది. “మొన్నే పెదనాన్న ఏదో సంబంధం ఉంది రావాలని చెప్పారు కదే! మా వాళ్ళు నా చదువు సాగనివ్వరు కానీ, నువ్వు చేరిపోవే! నేను కూడా వెళ్ళిపోతే నీకు ఇబ్బందే కదా!” అంది.
“చదువుకు సహాయం తీసుకుంటే తప్పు లేదే!” అంది.
తనకు కూడా చదువుకోవాలని ఉంది. అమ్మణ్ణి వెళ్ళిపోతుందంటే బెంగగా ఉంది. ఆయన మళ్ళీ ఫోన్ చేసినప్పుడు, ఒప్పుకుంది.
“ఇష్టం గానేనా!” అన్నారు.
“అవును సర్!” అంది.
అలా తన జీవితం చదువు అనే ఓ సురక్షితమైన బాట లోకి, ఉమెన్స్ హాస్టల్ గది లోకి ప్రవేశించింది.
తనను హాస్టల్‌లో జాయిన్ చేసి, చెప్పారు.
“బాగా చదువుకో! తెలివి, ధైర్యం లేకుంటే ప్రతి వాళ్ళు ఆడించేవాళ్ళు అవుతారు. నీ సిల్లీ థింకింగ్ షేర్ చేసుకొని, వెనకాల నవ్వుకునే అవకాశం ఇవ్వకు. మంచి వాళ్ళు అనిపిస్తేనే స్నేహం చెయ్యి. బయటకు ఎవర్ని నమ్మి వెళ్లొద్దు” అన్నారు.
ఆయన మాటలు సీరియస్‌గా వింది.
ఆయన వెళ్ళొస్తానని అనగానే, వెక్కి వెక్కి ఏడ్చింది.
“ఇదేమిటి చిన్నపిల్లలా” అన్నారు. ఆయన గొంతు కూడా ఆర్డ్రమైంది.
వంగి పాదాలకు దండం పెట్టింది.
“ఏయ్! ఇలా చేయవచ్చా!” అన్నారు.
“దిగులేమి లేదు.. ఫోన్‌లు ఉన్నాయి, ఏ అవసరమైనా!” అన్నారు.
తలాడించింది.
“సబ్జెక్ట్‌లో డౌట్స్ ఉంటే ఫోన్ చేయి!”
“అలాగే!”
“ఏమిటా ముఖం. ఎల్.కే.జి. పిల్లను స్కూల్లో దింపినట్టుంది.”
తను బలవంతంగా నవ్వింది.
ఆయన కేమి తెలుసు. ఇదంతా తనకు ఉద్విగ్నంగా ఉందని.
ఆయన వెళ్ళిపోయారు.
అలా తన కాలేజీ కం హాస్టల్ జీవితం ప్రారంభం అయ్యింది.
గదిలో కూర్చుంటే జరిగినది అంతా కళ్ళ ముందు రీల్‌లా తిరిగింది. సిల్లీ థింకింగ్, ఎల్.కె.జి. పిల్ల..
ఉడుకుమోతుతనం వచ్చింది. మళ్ళీ ఛాన్స్ తీసుకున్నారు. ఇట్స్ ఓకె.లే అనుకుంది..!!
కాలేజీ జీవితం బాగుంది. తనకు ఇంత హెల్ప్ చేసిన ఆయన కష్టాలు కూడా తీరాలనీ, మనసారా కోరుకుంది. ఆవిడ వస్తే ఎంత బాగుంటుంది. అందుకు తానేమీ చేయలేక పోయింది. ఆయనకు జ్వరం వస్తే మంచినీళ్లు ఇచ్చేవారు కూడా లేరు.
ఇవన్నీ ఆలోచించ వద్దు.
ఆయన తనకు చేసిన సహాయానికి మంచి మార్కులు చూపించడం తన బాధ్యత..
ఊర్మిళ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, డాక్టర్ వచ్చారు. వెంటే ఆనంద్ ఉన్నాడు.
“ఎలా ఉన్నారమ్మా! పెయిన్స్ ఇబ్బంది తగ్గిందా!” అన్నారు డాక్టర్.
***
వాళ్ళు చెప్పిన రెండు వారాలు కాలేదు. కానీ, ఇంట్లోనే కేర్ తీసుకునేలా డాక్టర్స్‌తో మాట్లాడి, డిశ్చార్జ్ చేయమని కోరాడు.
డాక్టర్స్ అంగీకరించారు.
ఊర్మిళకు ఇంటికి వెళుతుంటే ఏదో లాంటి ఫీలింగ్.
మాలతి గారు కనిపిస్తారు.
ఇబ్బందికర పరిస్థితి.
కొన్ని సన్నివేశాలు జీవితంలో ఎదురవ్వడం, దురదృష్టకరం.
కొందరు మనుషులు తారసపడడం మరింత బాధాకరం.
తప్పదు.
ఇంజక్షన్ ఇవ్వడానికి నర్స్‌ను అరేంజ్ చేసాడు, ఆనంద్.
లేడీ అటెండర్ కావాలని రెడ్ క్రాస్ వాళ్ళకు చెప్తూన్నారని తెలిసి, అన్నమ్మ “నేనుండగా ఎవరో ఎందుకు” అన్నది.
ఊర్మిళ ఇల్లు చేరి, తన బెడ్రూమ్ నాశ్రయించింది.
స్ట్రెచర్ మీద కాలు కదిలించకుండా తెచ్చారు.
మరు రోజే ఆనంద్ ఢిల్లీ, అటునుండి జర్మనీకి వెళుతున్నాడు.
అతని ఫ్రెండ్ కమ్ పార్ట్‌నర్‌ను అక్కడే కలుస్తాడు.
తన బిజీలో తను ఉన్నాడు.
అంత బిజీ లోనూ కొన్ని విషయాలు మర్చిపోలేదు.
ఏ అవసరం వచ్చినా ఇంట్లో ఉంటాయని, రెండు లక్షల క్యాష్ ఇంట్లో ఉంచాడు.
ఆ విషయం జాహ్నవికి, ఊర్మిళకు చెప్పాడు.
జాహ్నవి, “మేము వెళతాము డాడ్!” అంది, బరువెక్కిన కంఠంతో.
ఆమె భుజాల మీద చేయి వేసి దగ్గరికి తీసుకొని, “డబ్బులకు ఇబ్బంది పడవద్దు. ఏది తీసుకోవాలి అన్నా, వేణుకు చెప్పు. గూగుల్ పే చేసి, కావాల్సినవి అరేంజ్ చేస్తాడు. ఏది అవసరం అయినా అతనికి చెప్తే చాలు,” అన్నాడు.
అక్కడే ఉన్న మాలతి వంక, ఓ సెకన్ అలవోకగా చూసి, కదల లేని పరిస్థితుల్లో ఉన్న ఊర్మిళ దగ్గర మరి కాస్సేపు కూర్చొని, వాచ్ చూసుకొని లేచి నిలబడ్డాడు.
ఆ తర్వాత వేణు కారు స్టార్ట్ చేసాడు. పిల్లలు, జాహ్నవి బయటకు బయటకు వచ్చి, కారు కనిపించేంత వరకు చెయ్యి ఊపుతూ నిల్చున్నారు.
జాహ్నవి కళ్ళ వెంబడి నీళ్ళు కారుతూంటే, పిల్లలను తీసుకొని లోపలికి వచ్చి కూర్చుంది.
మళ్ళీ నాన్న వచ్చేసరికి తాము ఇక్కడ ఉండరు. అందుకే ఈ బాధ.
మాలతి అన్నీ గమనిస్తూ ఉండి పోయింది.
ఆనంద్ హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగి కనిపిస్తున్నాడు. తాను జాహ్నవిని ఎలాంటి తండ్రి నుండి దూరం చేసింది. మేలిమి బంగారం లాంటి ఆనంద్‌ను విడిచి, ఏమి సాధించింది. కుటుంబం పట్ల ఇంత బాధ్యత, దక్షత గల జీవన సహచరుణ్ణి దూరం చేసుకొని జీవితం నిస్సారం చేసుకుంది. బ్రతుకుతో వేసారి పోయింది.
ఇప్పుడు ఈ మధ్య వయసులో, తల దాచుకునే తోడు కన్నా మిన్న లేదనిపిస్తోంది.
జాహ్నవి కళ్ళు తుడిచి, అక్కున చేర్చుకుంది మాలతి.
(ఇంకా ఉంది)