శ్రీవర తృతీయ రాజతరంగిణి-11

3
3

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

స సింధు హిందువాడాది దేశాన్ జిత్వా బాహిః స్థితాన్।
ప్రతస్థే భట్టదేశం స జేతుం సఫటకో నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, 51)

[dropcap]సిం[/dropcap]ధు, హిందువాడా వంటి  దేశాలను గెలుచుకున్న తరువాత భట్టదేశాన్ని గెలిచేందుకు రాజు సైన్యంతో  బయలుదేరాడు.

శ్రీవరుడు తన రాజతరంగిణిలో జైనులాబిదీన్ జీవితాన్ని క్రమ పద్ధతిలో రాయలేదు. అంతకు ముందు జోనరాజు జైనులాబిదీన్ గురించి నుంచి కొంత రాశాడు కాబట్టి ఆయన రాసినదాన్ని వదిలి మిగతా జీవితం రాశానని చెప్పుకున్నా, జోనరాజు రాసినదాన్ని కూడా ప్రస్తావించాడు శ్రీవరుడు తన రాజతరంగిణిలో. అంటే జోనరాజు మరణం తరువాత సంభవించిన సంఘటలను మాత్రమే  శ్రీవరుడు ప్రస్తావించాడనుకోవటం పొరపాటు అన్నమాట.

చరిత్ర రచయితలు ఎంతో అభిమానించే chronological order ను తన రాజతరంగిణి రచనలో శ్రీవరుడు పాటించలేదు. రాజ్యానికి వచ్చిన కొత్తల్లో జైనులాబిదీన్ రాజ్యాన్ని సుస్థిరం చేసేందుకు కశ్మీరేతర ప్రాంతాలపై దాడి చేసి గెలుచుకున్నాడు. ఒకసారి తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్న తరువాత జైనులాబిదీన్ యుద్ధాలు చేయలేదు. జోనరాజు మరణించే నాటికి జైనులాబిదీన్ వయసు ఇంచుమించు 57 దగ్గరలో ఉంటుంది. అంత ఎక్కువ వయసులో జైనులాబిదీన్ యుద్ధాలు చేయడం ఆ కాలం నాటి పరిస్థితులతో పోలిస్తే అంత సబబుగా అనిపించదు. అదీగాక, జోనరాజు రాజతరంగిణి రచన కాలం నాటికే జైనులాబిదీన్ సింధునది పరిసర ప్రాంతాలను గెలుచుకున్నాడని జోనరాజు రాశాడు. ఒకసారి గెలిచిన రాజ్యాలను మళ్ళీ గెలవటం కుదరని పని. కాబట్టి, శ్రీవరుడు అంతకు ముందే జైనులాబిదీన్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తున్నాడనుకోవచ్చు.

‘హిందూవాట’ అన్న ప్రాంతం ‘సోపోర్’ నుంచి 16 నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవరుడు ఈ ప్రాంతం గురించి ప్రస్తావిస్తున్నాడని పలువురు చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆ కాలంలో ‘వాట’ అంటే ‘విహరం’ లేక ‘మఠం’. బహుశా ప్రాచీన కాలంలో అక్కడ విహారం ఉండేదో, లేక ఏదైన మఠం ఉండేదో. అందుకని ‘హిందూవాట’ అని ఉంటారు. ‘భట్టదేశం’ అంటే ఒకప్పటి తిబ్బత్తు, ఇప్పటి టిబెట్. ఈ దేశాన్ని కూడా జైనులాబిదీన్ ఓడించాడన్న మాట.

వనమధ్యే ప్రవిశ్యై వ నరం కంకాళ పంజరమ్।
భిత్తిస్థ దీపమాత్రే తే పశ్చన్తి స్మ సకౌతుకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 52)

జైనులాబిదీన్ సేన అడవులలో ప్రవేశించినప్పుడు, అడవి మధ్యలో నరుడి కంకాళ పంజరాన్ని చూశారు. గోడ పై ఉన్న దీపం వెలుతురులో కనబడుతున్న మానవ అస్థి పంజరాన్ని వారు కుతూహలంగా చూశారు.

తపస్తప్త్యా చిరం ప్రాప్య యోగ సిద్ధమసౌ నృపః।
ఫణీవ కంచుకం పూర్వం గుహాయామత్వజత తనుమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 53)

ఇత్యాహుజ్ఞానినోజ్యే వా యే బుద్ధవా సత్త్వమూర్జితమ్।
తేషాం ప్రామాణ్య మకరోత్ స రజా చ సవిస్మయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 54)

ధృవం మహానుభావత్వం వినా వ్యవహితం నృపః।
జానీయత్ కథమిత్సాహా విద్వజ్జన ఉదారధీః॥
(శ్రీవర రాజతరంగిణి, 55)

జ్ఞానులు, ఇతర విజ్ఞానవంతులు ఈ రకంగా రాజు గత జన్మలో గొప్ప తపస్వి అని భావించారు. లేకపోతే, ఈ గుహలో తపస్వి అస్థిపంజరం దాగున్నట్టు రాజుకు ఎలా తెలుస్తుందని విస్మయానికి గురయ్యారు. విద్వజ్జనుల ఈ మాటలు రాజు ఆశ్చర్యంతో విన్నాడు. వారి మాటలను విశ్వసించాడు.

సాధారణంగా గొప్పవారిని దైవ సమానులుగా, దైవాంశ సంభూతులుగా ప్రకటించి, నమ్మించటం, పూజించటం ప్రపంచవ్యాప్తంగా అన్ని నాగరికతల్లోనూ ఉంది. కొందరు మరణం తరువాత ‘దైవం’గా గుర్తింపు పొందితే, కొందరు తమ జీవిత కాలంలో దైవాంశ సంభూతుడిగా గుర్తింపు పొందుతారు. ఏది ఏమైనా కొన్ని గొప్ప పనులు చేయగానే, కాస్త ప్రజాదరణ పొందగానే వ్యక్తి తనని తాను ఉన్నతుడిగా భావించుకోవటం మనం గమనిస్తూనే ఉన్నాం. అలా ఓ పదిమంది ఓ వ్యక్తిని ఉన్నతుడిగా, ఉత్తముడిగా, దైవానికి ప్రతిరూపంలా భావించిన మరు క్షణం అతని చుట్టు అద్భుత గాథలు ప్రచారం లోకి రావడం చూస్తున్నాం. ఒకతను ఓ వ్యక్తిని దైవంలా నమ్ముతాడు. అతడు ఎక్కాల్సిన బస్సో, రైలో, విమానమో తప్పిపోతే – ఇలాగైందని తాను దైవంలా భావిస్తున్న వ్యక్తి పేరు తలచుకుని బాధపడతాడు. తరువాత తెలుస్తుంది, తన ప్రయాణం తప్పిపోయిన, బస్సో, రైలో, విమానమో ప్రమాదానికి గురైందని. ‘అహా, నీ లీలలు నేనెరుగనైతి’నని ఆ వ్యక్తిని మరింత గుడ్డిగా నమ్ముతాడు. తన అనుభవం గురించి కధలు రాస్తాడు. వార్తలు రాస్తాడు. ఇలా ఒక వ్యక్తి చుట్టూ పలు గాథలు మొలుస్తాయి.

ఇంతగా వైజ్ఞానికపుటాలోచనలు విస్తరించిన ఈ కాలంలో రోజూ ఇలాంటి బోలెడు కథలూ, గాథలు పుడుతూ ప్రచారంలోకి వస్తుంటే, ఆ కాలంలో తమను రక్షించి, చల్లగా చూసే రాజును దైవ సమానుడిని చేసే గాథ ప్రచారం లోకి రావటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దాన్ని అజ్ఞానంలా భావించి కొట్టిపారేయనవసరం లేదు. మానవ మనస్తత్వంలోని వైచిత్రిని తలచుకుని నవ్వుకోవటం తప్ప చేయగలిగిందీ ఏమీ లేదు.

‘గుహ’లో ఓ అస్థిపంజరం కనిపించింది. అప్పటికే జైనులాబిదీన్ దైవ సమానుడనీ, పూర్వ జన్మలో గొప్ప తపస్వి అనీ ప్రజలలో ఓ భావన కలిగింది. ఆ భావనను బలపరుస్తూ జైనులాబిదీన్ తన సేనను ఓ అస్థిపంజరం ఉన్న గుహలోకి నడిపించాడు. దాంతో, అసలీ గుహలో అస్థిపంజరం ఉన్నట్టు జైనులాబిదీన్‍కు ఎలా తెలుసు? అన్న ప్రశ్న వేసుకున్నారు. జైనులాబిదీన్‍కు ఎలా తెలుసంటే, పూర్వజన్మలో జైనులాబిదీన్ తపస్సు చేసినప్పటి తాపసి తాలూకు అస్థిపంజరం అది. ఆ శరీరం వదిలి ఇప్పుడు రాజు శరీరంలో ప్రవేశించింది ఆయన ఆత్మే అని నమ్మారు. దాన్ని ప్రచారం చేశారు. కొన్నాళ్లకి అందరూ నమ్మటం మొదలుపెట్టారు. అలా జైనులాబిదీన్ పూర్వజన్మలో ఒక యోగి అనీ, ఈ జన్మలో రాజుగా జన్మించాడనీ, జోనరాజు తన రాజతరంగిణిలో రాసిన దాన్ని శ్రీవరుడు స్థిరపరుస్తున్నాడు.

ఇలా ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ప్రవేశించటం అన్న ఆలోచన భారతీయులకే పత్యేకం. ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీతలోని ‘వాసాంసి జీర్ణాని’ అన్న శ్లోకం ప్రస్ఫుటం చేస్తుంది.

ఇస్లామీయులు ‘పునర్జన్మ’ సిద్ధాంతాన్ని నమ్మరు. కానీ జోనరాజు, శ్రీవరుడు జైనులాబిదీన్‍కు ఆపాదించిన గొప్పతనాన్ని కాదనలేదు. అందుకని వారు మరో పద్ధతిని అనుసరించారు. ‘ఐన్-ఎ-అక్బరీ’లో అబుల్ ఫజల్, సుల్తాన్ జైనులాబిదీన్‍ తలచుకుంటే  ఏ శరీరంలో నయినా ప్రవేశించే శక్తి ఉండేది అని రాశాడు.

‘తవాకత్ -ఎ-అక్బారీ’లో కూడా తన శరీరం నుండి ఆత్మను వెడల నడిపి తనకు నచ్చిన మరో శరీరంలో ప్రవేశపెట్టగలిగే శక్తి సుల్తాన్‍కు ఉండేదని రాశారు. సుల్తాన్‍ను ‘యోగి’ అన్నారు. శరీరం నుంచి ఆత్మను వేరు చేసి, మరో శరీరంలో ప్రవేశింపజేసి, మళ్ళీ తన అసలు శరీరంలోకి తీసుకువచ్చి నిలిపే యోగ ప్రక్రియను ‘తవాకత్ -ఎ-అక్బారీ’ రచయిత ‘సిమియ’ అన్నాడు. ‘సిమియ’ అంటే పర్షియన్ భాషలో అద్వితీయం అని అర్థం. అయితే రాను రాను ఈ పదం ‘సమయూ’, ‘ఇత్ఫ్ సీమియా’, ‘సీమియాఅ’, ‘సౌమియా’గా పలు రూపాల్లోకి మారింది.

తరువాత శ్లోకం నుండి శ్రీవరుడు జైనులాబిదీన్ రాజ వర్ణనమ్ ఆరంభిస్తాడు. ‘రాజవర్ణనం’లో జైనులాబిదీన్ సంతానం గురించీ, రాజ్య పాలన గురించీ, సంతానంతో జైనులాబిదీన్ సంబంధ బాంధవ్యాలు, ఘర్షణల గురించీ వివరిస్తాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here