తిమిర సంహరణాలైన ఉషా కిరణాలు ఎక్కడ?

10
11

[08 జూన్ 2024న మృతి చెందిన రామోజీరావు గారికి నివాళి అర్పిస్తున్నారు కోవెల సంతోష్ కుమార్.]

అక్షర శిల్పి రామోజీ రావుకు నివాళి

[dropcap]అ[/dropcap]ర్ధ శతాబ్దం పాటు తెలుగు పాత్రికేయ ప్రపంచానికి ఉషాకిరణాలు పంచిన అక్షర వెలుగుల రేడు అస్తమించాడు. తిమిర సంహరణాలుగా అలుపెరుగని పోరాటం చేసిన అక్షర కిరణాల ప్రసారం ఆగిపోయింది. తెలుగు పాత్రికేయ ప్రపంచాన్ని ఒక్కసారిగా గాడాంధకారం కమ్ముకున్నది. పాత్రికేయ ప్రపంచానికి ఆదివటంగా వెలుగొందిన రామోజీరావు ఉషోదయ వేళ విషాదం నింపుతూ వెళ్లిపోయారు. ఆయనకు సూర్యుడంటే అమితమైన ఇష్టం. ఉషోదయం అంటే ఎంతో ప్రేమ. అందుకేనేమో ఉషోదయ వేళ సూర్యుడి ఉషాకిరణాలు ప్రసరిస్తుండగానే ఆ కిరణాలలోనే విలీనమైపోయారు.

ఈనాడు 1974లో పుట్టింది. ఈ నెల పదవ తేదీకి 50 ఏండ్లు పూర్తి కావస్తున్నది. స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి సరిగ్గా మూడు రోజుల ముందు దాని వ్యవస్థాపకుడు రామోజీరావు అస్తమించడం నిజంగా నాలాంటి పాత్రికేయుడికి తీరని లోటు అనే చెప్పాలి. ఎందుకంటే తెలుగు పాత్రికేయ చరిత్రను రెండుగా విభజించినట్టయింతే ఈనాడుకు ముందు, ఈనాడు తరువాత అని చెప్పుకోవాల్సిందే.. ఈనాడుకు ముందు స్వాతంత్ర్యోద్యమ కాలంలో, స్వాతంత్ర్యానంతర కాలంలో అనేక పత్రికలు తమదైన పద్ధతిలో వార్తలను అందించేవి. ఒక సంప్రదాయ పద్ధతిలో.. ఒక సంప్రదాయ ధోరణిలో పత్రికల్లో వార్తలు కానీ, వార్తా కథనాలు కానీ సాగేవి. కానీ, పత్రికలకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొని వచ్చిన వ్యక్తి రామోజీరావు మాత్రమే. తెలుగు పత్రికారంగంలో అప్పటి వరకూ చూడని హంగులను కల్పించారు. గ్లామర్‌ను తీసుకొని వచ్చారు. భాషను సరళీకృతం చేశారు. పదాలను, పదబంధాలకు విస్తృత ప్రయోగావకాశం ఇచ్చారు. ప్రత్యేకంగా వార్తా శీర్షిక ప్రాధాన్యాన్ని గుర్తించి సూక్ష్మంగా, సూటిగా, స్పష్టంగా, అన్నింటికీ మించి ఆకర్షణీయంగా ఉండేలా శీర్షికలను తీర్చిదిద్దడానికి అనేక ప్రయోగాలు, ప్రయత్నాలు చేశారు. శీర్షిక చదవగానే వార్తలోకి వెళ్లాలని పాఠకుడికి తప్పనిసరిగా అనిపించేలా తీర్చిదిద్దారు. పత్రికలో నాణ్యమైన, నికార్సయిన వార్తలు ఎంత ముఖ్యమో వేగంగా పాఠకుడికి చేరడమూ అంతే ముఖ్యం. ఒకనాడు మద్రాసు కేంద్రంగా అచ్చయ్యే పత్రికలు రెండు రోజులకొకసారి కానీ, గ్రాండ్ ట్రంక్ రైలులో వస్తే అదే మహాభాగ్యమనుకొనే పరిస్థితి. రామోజీరావు ఆ పరిస్థితిని సమూలంగా మార్చేశారు. ఉషోదయానికి ముందే పాఠకుల లోగిళ్లలో ఈనాడు కనిపించేలా వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించారు. నిద్ర లేవటంతోనే ఈనాడు కండ్ల ముందు కనిపించేలా పత్రికను అందుబాటులోకి తెచ్చారు. ఒక దశకు చేరుకొనేసరికి ఈనాడు లేకుండా తెల్లవారదనే పరిస్థితిని తీసుకొని వచ్చారు.

ముందుగా చెప్పుకున్నట్టు తెలుగు భాషకు కొత్త సొబగులు అద్దేందుకు ఈనాడు ద్వారా తెలుగు వారిని ప్రోత్సహించింది ఈనాడే. ఈనాడు భాష అత్యంత సరళ సుందరంగా ఉండేందుకు ఆయన ఎంతో తాపత్రయపడ్డారు. అందుకోసం ఎంతో శ్రమ పడ్డారు. అదే సమయంలో ఏనాడూ ఒక్క తప్పునైనా సహించేవారు కాదు. బూదరాజు రాధాకృష్ణ నేతృత్వంలో పత్రికా నిఘంటువును రూపొందింపజేశారు. తెలుగు భాష అన్నా, తెలుగు నుడికారం అన్నా ఆయనకు ఎంతో ప్రీతి. అందుకోసమే.. అందమైన తెలుగు నుడి తన పత్రికలో ప్రతిఫలింపజేసేందుకు కృషి చేశారు. ఈనాడు జర్నలిజం స్కూలు ఏర్పాటు చేసిన తరువాత ఆయన తొలుత దృష్టి సారించింది తెలుగు భాష ఔన్నత్యం, శబ్దజాలం తన పత్రికలో పనిచేసే పాత్రికేయులకు దండిగా ఉండాలన్న ప్రధాన లక్ష్యంతో ప్రఖ్యాత భాషా పండితులు బూదరాజు రాధాకృష్ణ, అద్భుతమైన కథా రచయిత పోరంకి దక్షిణామూర్తి, గొప్ప రాజకీయ విశ్లేషకుడు, రచయిత.. పండితుడు తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తిని ఏరికోరి ఎంచుకొని వారితో కనీసం పదిహేను బ్యాచులు నడిపించి చాలామంది పాత్రికేయులను తయారుచేశారు. ఈ పాత్రికేయులు ఎలా తయారయ్యారంటే.. తాము ఒక్క తప్పు చేస్తే.. ఆ రోజంతా ఆ తప్పును తలచుకొని విలవిల్లాడుతారు. అంతగా పాత్రికేయులను తీర్చిదిద్దారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సిలబసే రూపొందించారు. ఆ సిలబస్‌ను ఒక్కసారి చదివితే, ఆకళింపు చేసుకుంటే.. ఎలాంటి వార్తా రచనైనా హాయిగా చేసేయవచ్చు. తెలుగు భాష, అనువాదం, రాజకీయ విశ్లేషణలు ప్రధాన సిలబస్‌గా పాత్రికేయుల సృష్టి ఈనాడులో జరిగింది. ఈనాడు సంస్థలో జన్మించిన జర్నలిస్టులు ఎలాంటి క్లిష్టమైన కథనాన్నైనా తేలిగ్గా రాసేయవచ్చన్న కీర్తి గడించారనడంలో సందేహం లేదు. ఈరోజు తెలుగు మీడియాలో అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు.. చిన్న పత్రికలు కావచ్చు, చానళ్లు కావచ్చు, అనేక విభాగాల్లో ఈనాడు నుంచి ఉత్పత్తి అయిన పాత్రికేయులు అనేక స్థాయిల్లో, అనేక స్తరాల్లో పనిచేస్తున్నారు. ఈనాడు జర్నలిజం స్కూలు అనేది ఏ విశ్వవిద్యాలయానికి కూడా తీసిపోని విధంగా తీర్చిదిద్దారనడంలో సందేహం లేదు.

ప్రధాన పత్రికలో సాహిత్యానికి చోటు ఉండదని రామోజీరావు దృఢంగా నమ్మారు. సాహిత్యానికి పాఠకులు ప్రధాన పత్రికలకు ఉండరనేది ఆయన విశ్వాసం. అయితే ఏదో విధంగా తెలుగు సాహిత్యానికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే విపుల, చతుర పత్రికలను ప్రారంభించారు. ఒకటి కథా ప్రక్రియకు, మరొకటి నవలా ప్రక్రియకు ప్రాధాన్యమిస్తూ అనేక సంవత్సరాల పాటు తెలుగు సాహిత్య సేవ చేశాయి. ఇటీవలి కాలంలోనే వాటిని ఆర్థిక కారణాల వల్ల మూసివేయడం దురదృష్టం. అయితే అదే సమయంలో రామోజీ రావుకు తెలుకు భాషాభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. తెలుగు వెలుగు పేరుతో మరో పత్రికను ప్రారంభించి తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషకు ఒక సమగ్రమైన నిఘంటువు లేదన్న అసంతృప్తి ఆయన్ను చాలా కాలం వేధించింది. తెలుగుకు ఒక బృహత్తర నిఘంటు నిర్మాణం కోసం ఒక కమిటీని నియమించి తద్వారా నిఘంటు నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఏ కారణం వల్లనైతేనేమి.. ఆ ప్రాజెక్టు అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆయన వారసులు దీన్ని పూర్తి చేస్తే రామోజీరావు ఆత్మ నిండు హృదయంతో సంతోషిస్తుంది.

ఈనాడు ద్వారా తెలుగు పాత్రికేయ ప్రపంచంలో వచ్చిన మరో విప్లవం టాబ్లయిడ్.. అప్పటివరకు ప్రధాన స్రవంతి పత్రికల ద్వారా స్థానిక వార్తలకు ఇచ్చే ప్రాధాన్యం చాలా తక్కువగా ఉండేది.  తెలుగునాట తొలి పత్రిక అయిన హితబోధిని ఎప్పుడో 1913లో పుల్ నాలుగు అంశాలపై (వ్యవసాయము, వైద్యం, పారిశ్రామిక, సంఘసంస్కరణ) లపై పుల్ అవుట్‌లు వేసే సంప్రదాయం ప్రారంభించింది. కానీ ఆ తరువాత దానిని ఎవరూ కొనసాగించలేదు. ఈనాడు ఈ పుల్ అవుట్ సంప్రదాయానికి ఆధునికత సంతరించేలా చేసి పూర్తిస్థాయి ఎనిమిది పేజీలతో మొత్తంగా ఏ జిల్లాకు ఆ జిల్లా వారిగా పూర్తిగా స్థానికతకే ప్రాధాన్యం ఇస్తూ టాబ్లాయిడ్ లను ప్రారంభించింది. దీనితో లోకల్ వార్తలకు కూడా పత్రికల్లో సముచిత స్థానం లభించినట్టయింది. ఈ పద్ధతి ప్రకటనదారులకూ సౌకర్యంగా మారింది. జిల్లాలవారీగా ప్రకటనలు ఇచ్చుకోవడం సులభతరమైంది. తెలుగు పత్రికా ప్రపంచంలో ఇది నిస్సందేహంగా విప్లవాత్మకమైన పరిణామమనే చెప్పాలి. ఇటీవల కరోనా అనంతర కాలంలో వచ్చిన తీవ్రమైన నష్టాల వల్ల టాబ్లాయిడ్ లను తీసివేసి.. ప్రధాన పత్రికలోనే రెండు పేజీలను స్థానిక వార్తలకు కేటాయించేలా తమ వ్యవస్థలో మార్పులు తెచ్చారు రామోజీరావు. ఆయన ఆలోచన అందరికీ అనుసరణీయమైంది.

ఏ రంగంలోనైనా బాసిజం అనేది భయంకరమైనది. కానీ, ఈనాడులో ఎవరైనా జూనియర్ తప్పు చేస్తే రామోజీరావు అందుకు బాధ్యత అతనికి ఇంచార్జిగా ఉన్న సీనియర్‌దేనని నిర్ద్వంద్వంగా చెప్పేవారున జూనియర్లు తప్పు చేస్తే అందుకు సీనియర్లే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చేది. జూనియర్లు నేర్చుకునే దశలో తప్పులు చేస్తుంటారు.. వాటిని సరిదిద్దాల్సిన పని సీనియర్లదేనని కచ్చితంగా చెప్పేవారు. ఈనాడులో ఒక క్లిష్ట పరిస్థితిలో సమ్మె పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన పత్రికను తీసుకొని రావడానికి జూనియర్లపైనే పూర్తిగా ఆధారపడినారు. రాష్ట్రమంతటా జల్లెడ పట్టి బాగా రాసే జూనియర్లను తీసుకొని వచ్చి ఏకంగా సంపాదకీయాలే రాయించిన ఘనుడు రామోజీరావు.

1995 ఫిబ్రవరి9 తెలుగులో జెమిని టీవీ తొలి తెలుగు ప్రైవేట్ చానల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం చేసుకొని ప్రసారాలు ప్రారంభించి చరిత్ర సృష్టించింది. అదే సంవత్సరం (1995) ఆగస్టు 28న ఈనాడు పత్రిక అధిపతి రామోజీరావు ఈ టీవీ పేరుతో రెండో వినోదాత్మక చానల్‌ను ప్రారంభించారు. అప్పటికి ఇవి రెండూ కూడా పూర్తిస్థాయిలో వినోదాత్మక చానళ్ళే. అటు సన్ నెట్వర్క్‌కు కానీ, ఇటు రామోజీరావు ఈనాడు సంస్థకు (మయూరి) కానీ సినిమా పంపిణి వ్యవస్థలు ఉండటం వాటి ద్వారా పెద్ద సంఖ్యలో సినిమాలు కొనుగోలు చేసుకొని తద్వారా చానళ్లను ప్రారంభించగలిగాయి. అప్పటికి చానళ్ల శ్రీ వార్తా ప్రసారాలు చేయడం అత్యంత దుర్లభమైన వ్యవహారం. టెలివిజన్ ప్రసారాలకు సంబంధించి అవసరమైన స్వదేశీ టాన్స్‌పాండర్ల కొనుగోలుకు కేంద్ర అనుమతి లేదు. ప్రైవేట్ చానళ్లు ఏ కార్యక్రమమైనా ప్రసారం చేయాలంటే విదేశీగడ్డపై నుంచి చేయాల్సిందే. వేర్వేరు దేశాల్లో నెలకొల్పిన ఎర్త్ స్టేషన్ల ద్వారా విదేశీ టాన్స్‌పాండర్లకు డబ్బులు చెల్లించి తమ ప్రసారాలను అప్‌లింక్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇందుకోసం ఆయాదేశాల్లో కార్యాలయాలు అద్దెకు తీసుకొని, తమ సొంత ఖర్చు లతో సాంకేతిక నిపుణులను పంపించి.. అక్కడి నుంచి ప్రసారాలు చేయాల్సి వచ్చేది. సాధారణ వినోద కార్యక్రమాలైతే ముందుగానే తయారుచేసి పంపించడం వల్ల ఇబ్బందులు తలెత్తేవి కావు. ఏవైనా వార్తా ప్రసారాలు చేయాలంటే అది ఆరోజుల్లో దుస్సాధ్యమైన పని. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీరామారావు మరణించిన ఉదంతం. జనవరి 18న ఆయన చనిపోయిన ఘటనను కవర్ చేయడానికి ఈటీవీ, జెమిని టీవీలు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అయినప్పటికీ వార్తలు అత్యంత ఆలస్యంగా ప్రసారమయ్యేవి. ఒక పేద్ద కెమెరాను భుజాన మోసుకొని.. వీహెచ్ఎస్ కానీ, హెచ్ఎ కేసెట్లో దృశ్యాలు రికార్డు చేసుకొని ఆ దృశ్యాలను విమానం ద్వారా ఢిల్లీకి కానీ.. మద్రాసుకు కానీ పంపించి.. అక్కడి నుంచి విదేశ సంచార్ నిగమ్ లిమిటెడ్ (విఎన్ఎన్ఎల్) ద్వారా ఏ విదేశంనుంచి అయితే చానల్ ప్రసారాలు జరుగుతాయో అక్కడికి అప్‌లింక్ చేస్తే కానీ ప్రసారమయ్యేవి కావు. 1997 నాటికి ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. రెగ్యులర్ అంటే 30 నుంచి 40 నిమిషాల తేడాతో వార్తలను ప్రసారం చేసేందుకు వీలు ఏర్పడింది. సరిగ్గా రెండు దశాబ్దాలైంది. అప్పటి నుంచి భారతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో, తెలుగు మీడియాలో వచ్చిన మార్పు లన్నింటికీ ఈ రచయిత సాక్షీభూతుడు. తెలుగులో వినోదాత్మక కార్యక్రమాల విషయంలో మొదట్నుంచీ ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. వార్తా ప్రసారాల విషయంలో మాత్రం తొలినాళ్లలో చాలా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. 1997 మార్చిలో జెమిని, ఈటీవీలు ఇంచుమించుగా ఒకేసారి వార్తల్ని ప్రసారం చేసేవి. రాత్రి 9 గంటలకు ఈ వార్తాప్రసారం ఉండేది. ఈ రెండు 3 చానళ్లు తమ ట్రాన్స్‌మిషన్ కేంద్రాలను మొదట శ్రీలంక రాజధాని కొలంబోలో ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడే చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకుని సాంకేతిక నిపుణులతో పాటు న్యూస్ రీడర్లను కూడా అక్కడికే పంపించి వార్తలు చదివించేవి. అయితే భద్రతాకారణాల దృష్ట్యా అక్కడ నెలరోజులు కూడా వ్యవస్థను నడపలేకపోయారు. అక్కడి నుంచి రెండు చానళ్ల ప్రసారాలు సురక్షితంగా సింగపూర్‌కు తరలిపోయాయి. సింగపూర్‌లో ఒక కార్యాలయంలోనే ఒక అంతస్తులో జెమిని, మరో అంతస్తులో ఈటీవీ తమ కార్యకలాపాలను నిర్వహించేవి. పదిహేను రోజులకోమారు టెక్నీషియన్లను హైదరాబాద్ నుంచి పంపించేవారు. భారత్ నుంచి వచ్చిన ఫీడు ముందుగా డౌన్లోడ్ చేసుకొని.. అలా రికార్డు చేసిన ఫీడ్‌ని రివైండ్ చేసుకొని తిరిగి అప్లోడ్ చేయడం వారి బాధ్యత. వార్తా బులెటిన్ల వరకు మాత్రమే ఈ రకమైన వ్యవస్థ.. మిగతా కార్యక్రమాలన్నింటినీ ముందుగానే రికార్డు చేసుకొని పదిహేను రోజులకు సరిపడా ప్రోగ్రామ్ చార్ట్‌ను ప్రిపేర్ చేసి టెక్నీషియన్ల వెంట క్యాసెట్లను పంపించేవారు. ఇక వార్తా బులెటిన్ల వరకు ఢిల్లీలో, మద్రాస్ (అప్పటికి చెన్నైగా రూపాంతరం చెందలేదు) లో రెండు కార్యాలయాలు ఉండేవి. రిపోర్టర్లు, డెస్క్‌లు అక్కడే ఉండేవి. న్యూస్ బులెటిన్లను రెండు భాగాలుగా కాప్స్యూల్ (రూపొందించడం) చేసేవారు. అందరికీ ఒకేచోట వసతి సౌకర్యం.. అక్కడి నుంచి ఆఫీసుకి ఉచిత రవాణ ఉండేది. ఉదయం 7గంటలకు ఒక బులెటిన్.. రాత్రి 9గంటలకు మరో బులెటిన్‌ను ప్రసారం చేసేవారు. అనంతర కాలంలో మధ్యాహ్నం మూడు గంటలకు మరో బులెటిన్ వచ్చి చేరింది. ఒక భాగాన్ని ఢిల్లీలో.. మరో భాగాన్ని చెన్నైలో రూపొందించేవారు. జాతీయ, అంతర్జాతీయ వార్తలు, క్రీడా, సాంస్కృతిక వార్తలు ఢిల్లీలో తయారవుతే.. రాష్ట్ర, ప్రాంతీయ వార్తలు మద్రాస్‌లో తయారయ్యేవి. వార్తా బులెటిన్ వాస్తవ ప్రసారానికి 25 నిమిషాలకు ముందు ప్రకటనలతో సహా తయారు చేసిన బులెటిన్ భాగం రికార్డ్ చేసిన క్యాసెట్‌ను తీసుకొని ఆగమేఘాల మీద స్థానిక విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్) కార్యాలయానికి పరుగుల మీద వెళ్లి అక్కడి నుంచి సింగపూర్కి అప్‌లింక్ చేసేవారు. ఆ బులెటిన్‌ను సింగపూర్‌లోని టెక్నీషియన్ రికార్డు చేసుకొని రివైండ్ చేసుకొని తిరిగి ప్లే చేసేవారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా తొలినాళ్లలోని కష్టాలివి. 1999 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ చానళ్లకు సొంతగడ్డపై నుంచి ప్రసారాలు చేసుకొనే వీలు కల్పించడంతో ప్రైవేట్ టీవీ యుగం మొదలైంది. తెలుగు మీడియాకు సంబంధించి హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎర్త్ స్టేషన్ను నిర్మించి ఈటీవీ అక్కడి నుంచి సొంతంగా తన 8 కార్యక్రమాలను ప్రసారం చేయడం ప్రారంభించింది. అప్పటికి ప్రత్యక్ష ప్రసారాల యుగం మొదలు కాలేదు. అయినప్పటికీ అత్యంత వేగంగా వార్తాప్రసారాలను చేసేందుకు ప్రాతికేయులుగా సబ్ ఎడిటర్లు కాలంతో పరుగులు పెట్టారు. 1999 ఆగస్టు 15న అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ఈటీవీ ఉదయం ఏడుగంటల బులెటిన్ కేవలం మూడు నాలుగు నిమిషాల వ్యవధిలో రికార్డు చేసి ప్రసారం చేసి చానల్‌కు లైవ్ టెలికాస్ట్ లుక్ తీసుకువచ్చినప్పటి బృందం నాది. ఆనాటి మా శ్రమ ఎప్పటికీ నాకు గర్వకారణమే. ఎలక్ట్రానిక్ మీడియా తొలితరం జర్నలిస్టులలో ఒకడినైన నాకు ఇది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. సినిమాల్లో అయినా, వ్యాపారాల్లో అయినా, దేశం గర్వించదగ్గ ఫిల్మ్ సిటీ నిర్మాణంలోనైనా ఆయన తాను సంకల్పించింది సంకల్పించినట్టుగా సాధించారు.

ఇంతటి ఈనాడు ఘనంగా స్వర్ణోత్సవాలు జరుపుకునేందుకు సమాయత్తమయిన తరుణంలో రామోజీరావు ఈ లోకాన్ని వీడిపోయారు. అవధులు లేని ఆశయాలు నిండుగా ఉన్న మనీషి ఆయన. రాజకీయ నాయకులకే రాజకీయం నేర్పినవాడు.. తెలుగు పాత్రికేయ లోకంగా విలేఖరుల మేరువును నిర్మించిన నగ ధీరుడు రామోజీరావుకు నా నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here