నా రుబాయీలు-11

0
4

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
ఒక గేయమే బాధనంతా తెలుపలేదు
ఏ అశ్రువూ భారమంతా మోయలేదు
ముళ్ళను గెలిచి గులాబీని చేరిన వ్రేళ్ళు
పూమాలల్ల దారమంతా ఓపలేదు

2.
కాలం కాటేసినా తేరుకున్న నేను
బ్రతుకు వరమని క్షణాలు ఏరుకున్న నేను
నీ కేళికై ప్రాసాదము నిర్మించాను
నువు కాదంటే చావు కోరుకున్న నేను

3.
టెక్నాలజి కాలంలో అమెరికా ఎంత దూరం
మనిషి సంకల్పిస్తే ఏదైనా ఎంత దూరం
అన్నం పెట్టి లోకాన్ని పరిచయం చేసిన అమ్మకు
సొమ్మువెంట ఉరికేటి బిడ్డ మాట ఎంత దూరం

4.
ప్రతి చూపుకు సమాధానమవుతూ ఉంటావు
అన్ని పనులకు మోకాలడ్డుతూ ఉంటావు
మరుపెరగని మస్తిష్కమే పెనుశాపం నాకు
నవ్వి నా ఉనికిని వెక్కిరిస్తూ ఉంటావు

5.
వెళ్ళిన కన్నీటితో నువూ వెళ్ళావు అనుకున్నా
గతించిన కాలంతో నువూ ఉంటావు అనుకున్నా
నమ్మిన నేరానికి మనసును పోగొట్టుకున్నాను
చేతులు జోడించాక నను వదిలావు అనుకున్నా

6.
పై వాడి దగ్గర ప్రతిదానికి పద్దు ఉంటుంది
బాధపడు సమయానికి కూడా హద్దు ఉంటుంది
గతాన్ని మార్గదర్శకంగ బావించి సాగగా
ప్రతిపోరున గెలుపుతో నీకో ముద్దు ఉంటుంది

7.
కదలని మల్లె తుమ్మెదచే పులకించింది చూడు
అడుగేయలేని మహిని మబ్బు తడిమింది చూడు
నీకు రెక్కలిచ్చి నింగిని దాటించిన నాకు
నీ వియోగం నా చితిని నిర్మించింది చూడు

8.
కాలానికే ఈ వసంతం శిశిరం ప్రేమకు కాదు
గ్రీష్మంలో హత్తుకునే చెలియకు వెట్ట అడ్డు కాదు
శరత్నిశిలో మిథునంతో పోటీ ఇందుడు చెలరేగ
కోడికూతతో వచ్చే ఏ వెలుగూ ఉదయము కాదు

9.
దూరంతో మనగలిగేటి అంటువ్యాధేదీ లేదు
ఆత్మీయస్పర్శకు కరగని కాఠిన్యమేదీ లేదు
ఓర చూపుతో ఓ సారి ఎదగిల్లితె చిలుకలకొలికి
పురుషుడు విముక్తుడగుటకు ఇలలో మందేదీ లేదు

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here