[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
కడప గడపలో ముచ్చటగా మూడోసారి:
[dropcap]నా [/dropcap]ముప్ఫయి ఏళ్ళ ఆకాశావాణి సర్వీసులో సింహభాగం కడపలో గడిపాను. మొదటి అడుగు 1975 ఆగస్టు 16న. 1978 నవంబరు వరకూ పని చేసి విజయవాడ బదిలీపై వెళ్ళాను. మళ్ళీ 1980 జూన్ నుంచి 1982 అక్టోబరు వరకు వుండి ప్రమోషన్ మీద అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా హైదరాబాద్ వెళ్ళాను. మూడో దఫా 1993 ఏప్రిల్ నుంచి 1995 మార్చి వరకు రెండేళ్ళు స్టేషన్ డైరక్టరుగా వ్యవహరించాను. అనంతపురం మూడేళ్ళతో కలిపితే రాయలసీమలో ఎక్కువ భాగం గడిపాను. తర్వాత ఢిల్లీలో పదేళ్ళు రెండు దఫాలుగా గడిపాను.
మాది నెల్లూరు. రాయలసీమవాసులకు సన్నిహిత ప్రదేశం. కడప కేంద్ర పరిధిలో దిగ్దంతులైన కవి పండితుల సాన్నిహిత్యం నాకు లభించింది. డా. పుట్టపర్తి నారాయణాచార్య దంపతులు, గడియారం వెంకట శేషశాస్త్రి, సి.వి. సుబ్బన్న శతావధాని, యస్. రాజన్న కవి, యల్లంరాజు శ్రీనివాసరావు, నరాల రామరెడ్డి, బెళ్ళూరి శ్రీనివాసమూర్తి, కల్లూరి అహోబలరావు, షడ్దర్శనం సోమ సుందర శర్మ, కుంటిమద్ది శేషశర్మ, శంకరంబాడి సుందరాచారి, మధురాంతకం రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, కె. సభా, ఆచంట జానకీరామ్, ఆచార్య బి.ఎన్.రెడ్డి, గంటి కృష్ణవేణమ్మ, జానమద్ది – వంటి ప్రముఖుల ఇంటర్వ్యూలు, ప్రసంగాలూ, కవితలు రికార్డు చేశాను.
రాజకీయనాయకులలో అగ్రశేణిలో నిలిచిన నీలం సంజీవరెడ్డి, కడప కోటిరెడ్డి, నాయకంటి శంకరరెడ్డి, పెండేకంటి వెంకట సుబ్బయ్య, దామోదం మునుస్వామి, పి. రాజగోపాలనాయుడు, మాడభూషి అనంతశయనం అయ్యంగారు, పి.బసిరెడ్డి, యన్. దాసు, యన్. అమరనాథరెడ్డి, రాచకొండ నరసింహారెడ్డి, పి. పార్థసారథి, బి. రత్న సభాపతి వంటి వారి ఇంటర్వ్యూలు ప్రసారం చేశాను.
ఈ తరం వారికి ఆ పేర్లు తెలియవు. రాయలసీమ రత్నాలు వీరు. వారిని గూర్చి నేను ‘జీవనరేఖలు’ ప్రసారం చేసి, రెండు సంపుటాలు వెలువరించాను. ఒక రోజు నేను నా ఆఫీసు గదిలో కూర్చుని వుండగా ఒక పెద్దమనిషి వచ్చారు.
“అనంత పద్మనాభరావు ఎక్కడున్నాడండీ?” అని తీవ్ర స్వరంలో అడిగారు. రాయలసీమ యాస గదా! నాకు కొంచెం దడ పుట్టింది తిడతారేమోనని.
కూచీమని కాఫీ తెప్పించి ఇచ్చాను.
“పది నిముషాల్లో పద్మనాభరావు వస్తారు. కూర్చోండి” అన్నాను.
“ఆయన వారంలో ఏడెనిమిది మందిని ఇంటర్వ్యూ చేస్తారు. ఒక కవి, ఒక జిల్లా అధికారి, ఒక డాక్టరు, ఒక సామాన్య రైతు, మంత్రి, రాజకీయ నాయకుడు, కవి, రచయిత. ఇంతమందిని ప్రశ్నలు విభిన్నంగా వేస్తాడు. మహానుభావుణ్ణి చూద్దామని వచ్చాను” అన్నారు.
నేను ముసిముసి నవ్వులు నవ్వాను.
“నవ్వులాటకు కాదండీ! సీరియస్‍గా చెబుతున్నాను” అన్నారు.
“నేనే పద్మనాభరావుని” అన్నాను.
“భలేవారండీ! మీరు….” అంటూ ఆగిపోయారు.
కొద్ది క్షణాలలో నా గొంతు పోల్చుకుని, ‘ఇంత చిన్న వయసువారని అనుకోలేదు స్వామీ!’ అంటూ దండం పెట్టారు.
***
కడపలో నేను డైరక్టరుగా పని చేసిన రెండు సంవత్సరాలలో ఇద్దరు కలెక్టర్లు మారారు. 1993లో పి. సుబ్రహ్మణ్యం కలెక్టరు. ఆయన, నేనూ చాలా సభల్లో పాల్గొని ప్రసంగించాం. వయోజన శాఖ వారు ప్రచురించే అక్షర రశ్మి పత్రికా సంపాదకవర్గంలో నన్ను సభ్యులుగా వేశారు.
సుబ్రహ్మణ్యం 1994లో ఉన్నత విద్య కోసం బర్మింగ్‌హామ్ వెళ్ళారు. వారికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో పెద్ద వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. నేనొక అతిథిని. నా ప్రసంగంలో నేనిలా అన్నాను:
“సుబ్రహ్మణ్యం గారిదీ, నాదీ నెల్లూరు జిల్లానే. వారు బర్మింగ్‌హాం వెళ్ళడం సంతోషదాయకం. వీరికి ముందు కలెక్టర్లు కొందరు బర్నింగ్ హ్యాండ్స్‌తో వెళ్ళారు. వీరు బర్మింగ్‌హాం వెళ్ళడం సంతోషం.”
సభలో చప్పట్లు. సుబ్రహ్మణ్యం బర్మింగ్‌హాం నుంచి నాకు ఒక ఉత్తరం వ్రాసారు. అందులో నా వ్యాక్యాలు ప్రస్తావించారు. ఆయన రెండో దఫా కూడా కడప కలెక్టరుగా వచ్చారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి వద్ద కార్యదర్శిగా చేరారు. ఇడుపులపాయ హెలికాప్టర్ ప్రమాదం ఆయన దుర్మరణానికి దారి తీసింది. ఆయన సౌహృదమూర్తి. అధికారదర్పం ఎన్నడూ చూపలేదు.
సుబ్రహ్మణ్యం తర్వాత కె.వి.రమణాచారి కలెక్టరుగా వచ్చారు. వారితో నాకు పూర్వపరిచయం లేదు. ఒక రోజు మా ఆఫీసుకు ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి బంగళాకి ఎవరో ప్రముఖుడు వస్తే కలవడానికి వెళ్ళాను.
నేను మేడ మెట్లు దిగుతుండగా నాకెదురుగా డీవోలు, బంట్రోతు ముందు నడవగా ఓ గంభీరమూర్తి ఎదురుపడ్డారు. ఆయనే రమణాచారి. “నమస్కారం సార్! నేను పద్మనాభరావును, స్టేషన్ డైరక్టర్‌ని” అని పరిచయం చేసుకున్నాను. ఆయన జలద గంభీర స్వరంలో – “డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు గారు. భలే. నేను మిద్దె మీద బస చేస్తున్న ల్యాండ్ రెవెన్యూ కమీషనర్ ఆనందరావు గారిని కలిసి వస్తాను. లౌంజ్‌లో కూచోండి. మాట్లాడుకుందాం!” అన్నారు.
తనతో కార్లో కలెక్టరు బంగళాకు సాదరంగా తీసుకెళ్ళారు. 1994 నుండి ఈ నాటికి మా పరిచయ రజతోత్సవం. అది సుమధుర భరితం. ఎంతో ఆదరాభిమానాల సమాహారం. అనేక సభలలో నేను, వారు జిల్లా అంతా పాల్గొన్నాం. అప్పటి పోలీసు సూపరింటెండెంట్ ఆర్.పి. ఠాకూరు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ డైరక్టర్ జనరల్.
రమణాచారి, నేను ప్రొద్దుటూరులో ఒక సభలో పాల్గొనాలి. ఆయన సతీసమేతంగా మా ఇంటికి వచ్చారు ఓ సాయంకాలం. నేను వ్రాసిన పుస్తకాలు అప్పటికి నలభై దాకా వారి ముందు పెట్టి తెరచి చూపాను.
పది నిమిషాలు ఏకాగ్రంగా చూశారు పుస్తకాలు.
“మీరు చుప్ కా రుస్తుం” అని అబినందించారు.
నేరెళ్ళ వేణుమాధవ్ ఒక రోజు స్టూడియో రికార్డింగుకు ఆకాశవాణికి వచ్చారు. వారిని కలెక్టరు రమణాచారి సాదరంగా తమ కారులో తీసుకొచ్చారు. సాయంకాలం నాలుగు గంటల సమయం. కలెక్టరు పి.ఏ. పరుగుపరుగున వచ్చి ఆయన చేతికి మొబైల్ ఫోను అందించారు.
“ఈ సాయంకాలమే మీరు రిలీవ్ అయి హైదరాబాద్‌కు రండి!” అని బదిలీ ఆర్డరు తెలియజేశారు. ఆయన చిరునవ్వుతో స్వీకరించారు.
రాత్రికి రాత్రి కలెక్టరు ఆఫీసులో అధికార బృందం వీడ్కోలు సభ 10 గంటల దాకా నిర్వహించారు. ఆ సభలో నేనూ మాట్లాడాను.
జాయింట్ కలెక్టరు ఛార్జి అప్పగించి ఆ రాత్రే కడప వదిలారు.
డైరక్టరుగా నేను పనిచేసిన ఆ రెండేళ్ళు జిల్లా అధికారులందరితోనూ సౌహార్దం లభించింది. ఒకరోజు మా కారు డ్రైవరు యస్.పి. బంగళా టర్నింగ్‌లో ముందు వెళ్తున్న కారుకు అతి సమీపంగా వెళ్ళి కారు డోరు తాకించాడు. వెంటనే కార్లో ముందు కూర్చున్న పోలీసు గార్డు దిగి, మా డ్రైవరు చొక్కా పట్టుకోబోయాడు. కార్లోంచి నేను దిగడం యస్.పి. ఠాకూర్ చూశారు.
ఆయన చిరునవ్వుతో గార్డును వారించారు. అంతటి నిగర్వి. ఆయనతో పాటు అడిషనల్ యస్.పి.గా పని చేసిన సత్యనారాయణ నన్ను అభిమానించేవారు.
బెజవాడ గోపాలరెడ్డికి ఆతిథ్యం:
గోపాలరెడ్డిగారితో నాకు 1970 నుంచి సన్నిహిత పరిచయం. నా అష్టావధానాన్ని నెల్లూరు వేద సంస్కృత కళాశాలలో చూసినప్పటి నుంచి ఆయన నా పాండిత్యం పట్ల అభిమానం చూపారు. వారిని కడప ఆకాశవాణికి రప్పించాలని “ఆ తరం రాయలసీమ నాయకులు” అనే ప్రసంగం చేయమని ఆహ్వానించాం. ఆయన అంగీకరించి రికార్డింగుకు వచ్చారు.
ఆ సాయంకాలం ఒక సాహిత్య సభలో పాల్గొన్నారు. వారితోబాటు కురువాడ సత్యనారాయణ కూడా నెల్లూరు నుంచి వచ్చారు. మా యింటికి ఆ రాత్రి భోజనానికి గోపాలరెడ్డిగారిని ఆహ్వానించాను.
“రేపు ఉదయం నెల్లూరు వెళ్ళేడప్పుడు మీ ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్తానులే పద్మనాభరావ్” అన్నారు భుజం తడుతూ. “కేవలం పది నిముషాలే ఉంటాం” అన్నారు. ఉదయం ఆరు గంటలకే వచ్చారు.
మా ఆవిడ రెడీగా పెనం మీద పెసరట్లు పోసి వుంచింది. ఆప్యాయంగా తిని సంతోషంగా వెళ్ళారు. ఆయనకు నా మీద ఎంత అభిమానమంటే ఆయన ఏ పట్టణానికి వచ్చినా నాకు ఫోన్ చేసి ఆయనతోనే ఆ రెండు రోజులు వుండమనేవారు. “పద్మనాభరావు మా నెల్లూరువాడు” అనేవారు. ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడ – ఎక్కడికి వచ్చినా నేను వారి వెంటనే.
కడప సహోద్యోగులు:
వై. గంగిరెడ్డి అసిస్టెంట్ డైరక్టరుగా బాగా సహకరించారు. ఆదిత్య ప్రసాద్, మల్లేశ్వరరావు, సుబ్బన్న ఇతర అధికారులు. నేను అక్కడ ఒక కొత్త అనౌన్సర్‍ని, మ్యూజిక్ కంపోజర్‍ని రిక్రూట్ చేశాను.
అనౌన్సర్ పోస్టుకు పోటాపోటీలుగా వచ్చారు. పోటీ పరీక్షలో మంజులాదేవి అనౌన్సరుగా సెలెక్ట్ అయి జాయినైంది. ఆమె పేదరాలు. జాయిన్ అయిన రోజు నా రూమ్ లోకి వచ్చి రెండు చేతులెత్తి నమస్కరించి సజల నయనాలతో నా చేతిలో ఒక గిఫ్ట్ పెట్టింది.
అది ఐదు రూపాయల క్యాడ్‌బరీ చాక్లెట్.
నాకెంతో ఆనందం కలిగింది. మృదంగ విద్యాంసునిగా పెరవలి జయ భాస్కర్‍ని, మ్యూజిక్ కంపోజరుగా మోదుమూడి సుధాకర్‍ని సెలెక్టు చేశాము. ఆయన ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తూ సంగీతవేత్తగా మంచి పేరు సంపాదించాడు. రెండేళ్ళు పూర్తికాగానే నేనే అడిగి విజయవాడ ఆకాశవాణికి బదిలీ అయి వెళ్ళాను – 1995 మార్చిలో.
(సశేషం)