జైత్రయాత్ర-6

2
3

[శ్రీ కస్తూరి రాజశేఖర్, కస్తూరి వేణుగోపాల్ రచించిన ‘జైత్రయాత్ర’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పాపయ్య శెట్టి ఇంట్లో అతని కూతురు శోభకు సంగీతం నేర్పించడానికి ప్రయత్నిస్తుంటాడు పంచనాథం. నమామి అని శోభ చేత చెప్పించటానికి నానా అవస్థలు పడతాడు. ఇంతలో శోభ తల్లి ధనలక్ష్మి పంచనాథం కోసం పలహారం తెస్తుంది. నమామి అనమని మళ్ళీ అడిగితే, పలహారం వంక చూస్తూ తినాలి అంటుంది. ఆమెకి సంగీతం నేర్పించలేక, పాపయ్య శెట్టికి ఎదురుచెప్పలేక తల పట్టుకుంటాడు పంచనాథం. చేతులు కడుక్కుని వద్దామని బయటికి వెళ్ళిన పంచనాథం లోపలికి వచ్చేసరికి ఉప్మా ప్లేటు ఖాళీగా ఉంటుంది, శోభ మంచి నీళ్ళు తాగుతూంటుంది. ఏమీ అనలేక మౌనంగా బయటకు వెళ్ళిపోతాడు పంచనాథం. మాస్టారి కోసం మంచినీళ్ళు తెచ్చిన శోభ తల్లి జరిగినది అర్థమై కూతురిని కేకలేస్తుంది. ఆ అరుపులకు పాపయ్య శెట్టి లోపలికి వచ్చి కూతురిపై అరుస్తున్నందుకు భార్యను తిడతాడు. ఓ బిందె ఇచ్చి మంచి నీళ్ళు తెమ్మని పంపుతుంది ధనలక్ష్మి. ఊర్లో షికారుకొచ్చిన మిత్రత్రయం చెరువు దగ్గరకొస్తారు. అప్పుడే అక్కడికి నీళ్ళ కోసం వచ్చిన శోభను చూసిన సుబ్బు తెలివైన పిల్ల అని అనాలోచితంగా అంటాడు. బిందెలో నీళ్ళు నింపుకుని, తనకు సాయం చేసి బిందెను అందిమ్మని సుబ్బును అడుగుతుంది. నా వల్ల కాదంటాడు సుబ్బు. నేను బిందెని ఎత్తుతా అంటూ ఆంజనేయులు ముందుకు వస్తుంటే, వద్దంటుంది శోభ. దగ్గరకెళ్ళిన సుబ్బు ఆమెను చూసి మైమరిచిపోతూ, బిందెను కింద పడేస్తాడు. మిత్రులిద్దరూ వచ్చి బిందెను కడిగి, నీళ్ళు నింపి శోభకి అందిస్తారు. ఆమె సుబ్బును జాలిగా చూస్తూ వెళ్ళిపోతుంది. రాయుడు తన ఇంటి వరండాలో కూర్చుని మంగలి కోసం ఎదురు చూస్తుంటాడు. ఆలస్యమైందని, పిలుచుకు రమ్మని పాలేరుని పంపిస్తాడు. అతనికి దారిలోనే మంగలి కొడుకు వెంకన్న ఎదురవుతాడు. నాన్న ఊర్లో లేడని, అందుకే తాను వెళ్తున్నానని చెప్తాడు. ఇంటికెళ్ళి రాయుడికి దండం పెట్టి నిలబడతాడు. రాయుడు గడ్డం చేయించుకోడానికి సిద్ధమై అరుగు మీద కూర్చుంటాడు. భయంగా గడ్డం చేస్తాడు వెంకన్న. చివరికి వచ్చాక, చేయి వణికి రాయుడి గడ్డం తెగుతుంది. రక్తం కారేసరికి కోపం పట్టలేక వెంకన్నని కాలితో గట్టిగా తన్ని లోపలికి వెళ్ళిపోతాడు. రాయుడు ఏదో పనిమీద శీనయ్యని పాపయ్య శెట్టి ఇంటికి పంపిస్తాడు. గుమ్మంలో ఎదురైన శోభను చూసి ఆమెతో హాస్యాలాడతాడు శీనయ్య. పాపయ్య శెట్టి బయటకు రాగానే, రాయుడుగారు వెంటనే మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు అని చెప్తాడు. గుడికి వెళ్తున్నానని గట్టిగా అరిచి చెప్పి, శోభ బయటకు నడుస్తుంది. కొంచెం దూరం వెళ్ళిపోయిన శీనయ్య ఆ మాటలు విని తానూ గుడికి బయల్దేరుతాడు. శోభ వెనకాలే ప్రదక్షిణాలు చేస్తూంటే, గోడ తగిలి పూల సజ్జలోని కొబ్బరికాయ కిందపడుతుంది. ఇద్దరూ ఒకేసారి వంగి దాన్ని తీయబోతే, తలలు ఢీకొంటాయి. తలలు కొట్టుకుంటే ఏదో అవుతుందని మా అమ్మ అంది అని శోభ అంటే, పెళ్ళవుతుంది, మనిద్దరికీ పెళ్ళవుతుంది అంటాడు శీనయ్య. నీకిదివరకే పెళ్ళయ్యిందిగా, అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇంటికెళ్ళాక అమ్మతో చెప్తాను అంటుంది శోభ. ఆ పని మాత్రం చెయ్యొద్దంటూ అక్కడ్నించి జారుకుంటాడు శీనయ్య. – ఇక చదవండి.]

అధ్యాయం-7

[dropcap]తె[/dropcap]ల్లవారకముందే విజిల్ వినిపిస్తుంది.

అప్పటికే లేచిన క్యాడెట్స్ అందరూ పరుగు పరుగున బడిలోనే వున్న గ్రౌండ్‌లో చేరారు.

“ఫాల్ ఇన్.. ఫాల్ ఇన్” యాక్టివ్‍గా అరుస్తున్నాడు వెంకట్రావు. సెక్షన్స్‌గా విడిపోయి ఐదు వరసల్లో నిలబడ్డారు కుర్రాళ్లంతా.

“ఈ త్రిమూర్తులెక్కడికెళ్ళారు? మురళీ.. ఏరీ ఈ బడుద్దాయిలు? ఇంకా ముసుగు లోంచీ బయటపడలేదా?” అడిగాడు వెంకట్రావు విసుగ్గా.

“శ్రీనివాస్, ఆంజనేయులు గన్లు క్లీన్ చేస్తున్నారు సార్”

“మరి సుబ్బిగాడు?”

“పిండి రుబ్బుతున్నాడు సార్”

“వ్వాట్?”

“అవును సార్.. ఇవ్వాళ ఆదివారం కదా..  మీరు చెప్పారట కదా స్పెషల్ టిఫిన్ చేస్తున్నారు. ఈ రోజు వంట పనంతా సుబ్రమణ్యమే చూస్తున్నాడు”

“ఏంటీ.. సుబ్బిగాడికి వంట బాధ్యతా? మనకీ పూట బ్రేక్‌ఫాస్ట్ లేదన్న మాట” వాపోయాడొకడు.

“అదేం?” అడిగాడు ప్రక్కవాడు.

“అది మనుషులు తినేట్టుగా ఉంటుందా అని?”

“చ్చ.. చ్చ.. అదేంకాదు.. రుచులు తెలిసినవాడు షడ్రుచులు వడ్డించగలడు. వాడు అద్భుతంగా వంట చేస్తాడులే”

“అదీ ప్రమాదమే.. అంత అద్భుతంగా చేసింతర్వాత మనకు మిగుల్చుతాడంటావా?”

“లేదు లేరా! పాపం ఈ మధ్య వాడు బాగా చిక్కిపోయాడు.. తిండితోపాటు కండ కూడా తగ్గిపోయింది”

“అవును మరి.. ‘తిండి కలిగితే కండ కలదోయ్’ అన్నాడు మన బసవరాజు అప్పారావు గారు”

“నీ మొహం.. అది అన్నది గురజాడ అప్పారావు గారు”

అందరూ గొల్లున నవ్వారు.

“సావధాన్” గర్జించాడు వెంకట్రావు.

రణగొణ ధ్వని ఆగిపోయింది. పిన్ డ్రాప్ సైలెన్స్. “విశ్రామ్”

“సావధాన్”

“విశ్రామ్”

సావధాన్”

“బైఠో.. సావధాన్”

అందరూ కూర్చున్నారు. వెంకట్రావు ముందుకొచ్చి నిలబడ్డాడు. “శ్రద్ధగా వినండి. మన శ్రమదానం మొదలబెట్టబోతున్నాం. నేను ఊరి పెద్దల సహకారం కోసం ప్రయత్నిస్తున్నాను. పని చేయటం ముఖ్యం కాదు. చేసే పనిని సామరస్యంతో, డిసిప్లిన్‌తో చేయగలగాలి. మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకున్న పని అనుకున్న విధంగా అనుకున్న టైంకి చేసి మన ట్రూప్‌కి, కాలేజీకి మంచి పేరు తేవాలి. ఎన్.సి.సి. ప్రాముఖ్యం ఏమిటో అందరికీ తెలియాలి.” అని ముగించాడు.

“ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి.. కొట్టండి..” వెనుకనుంచీ ఓ స్త్రీ గొంతు వినిపించింది.

చప్పట్లతో గ్రౌండ్ మార్మ్రోగిపోయింది. వెంకట్రావు ఆశ్చర్యంగా వెనక్కు చూసాడు.

“మీరా?”

“మీరానూ కాదు.. సక్కుబాయినీ కాదు.. విద్యను” నవ్వింది.

“ఎప్పుడొచ్చారు?”

“ఎన్.సి.సి. ప్రాముఖ్యం తెలియాలి అన్నప్పుడు”

“అంతేగదండీ.. మనిషి శాశ్వతం కాదు.. మంచిపని శాశ్వతం. సరే గానీ, ఏమిటిలా వచ్చారు?” అడుగుతూ క్యాడెట్స్‌కు దూరంగా నడిచారు.

“ఏం లేదు. ట్యూషన్ నించి వస్తున్నాను.. మీ సేనా వాహిని చేసే కవాతులు చూద్దామని ఇలా వూరికే వచ్చాను”

“వూరికేనా.. డబ్బులకి కాదన్నమాట” నవ్వాడు వెంకట్రావు.

“ఏం.. అలాంటి సహాయం కావాలా ఏమైనా?”

“అవును.. ఇదిగో..” అంటూ జేబులోంచీ ఓ పుస్తకం తీసి ఇచ్చి “తీసుకోండి.. ఎన్.సి.సి. డే సందర్భంగా విరాళాలు వసూలు చేయండి. ఆ డబ్బు మీ గ్రామాభివృద్ధికి వినియోగిద్దాం. దానికి కావలసిన పెర్మిషన్ నేను తీసుకుంటాను జిల్లా స్థాయి ఎన్.సి.సి. అధికారుల నుండి.”

పుస్తకం వంక చూస్తోంది విద్య. “ఇందులో బలవంతం ఏమీ లేదు. మీకు వీలైన టైములో చేయగలిగినంత సేవే సుమా!” అన్నాడు.

“తప్పకుండా.. మీరు ‘అంత’ దూరం నుంచీ వచ్చి మా కోసం ఇంత మంచి పనులు చేస్తుంటే మేము ఈ మాత్రం సహకారం ఇవ్వలేమా?.. వస్తాను” అని పుస్తకం తీసుకుని వెళ్ళిపోయింది.

వెంకట్రావు తిరిగి పెరేడ్ వద్దకొచ్చేసరికి అది ఎన్.సి.సి. క్లాసేనా అన్న అనుమానం వచ్చింది.

అక్కడ –

‘ఠపీ’ మని ఓ చిన్న గులకరాయి వచ్చి తగిలి గుర్నాధం అనే కుర్రాడి గూబ గుయ్యిమంది మళ్ళీ.. అప్పటికాడి ఏ నాలుగో సారో, ఐదో సారో.. చెవి వాచీ ‘బోదచేవి’ అయ్యింది. రాళ్లు విసురుతున్నదెవరో అర్థం కావటం లేదు.

చివరిసారి దొంగలు దొరికిపోయారు. ఎప్పుడొచ్చారో శ్రీనివాస్, ఆంజనేయులు గన్‌లు క్లీన్ చేసి వచ్చి ఓ మూల కూర్చుని చిలిపి చేష్టలు చేస్తున్నారు. ఇంతలో వెంకట్రావు అక్కడికి జేరాడు.

రణగొణ ధ్వని ఆగిపోయింది. గుర్నాధం వెళ్లి కసిగా వెంకట్రావుకి కంప్లైంట్ చేసాడు. వెంకట్రావు చిరచిర లాడుతూ శ్రీనివాస్‍ని, ఆంజనేయుల్నీ సీరియస్‍గా చూసాడు. వాళ్లిద్దరూ ఎటో చూడసాగారు – ఏదో పనున్నట్టు.

“ఒరేయ్.. మీరు ఇక్కడ కూడా మీ కోతి చేష్టలు మానలేదన్నమాట. గ్రౌండ్ మొత్తం రౌండ్స్ వేయండి. గన్ భుజాన వేసికొని.”

ఇంకాసేపుంటే ‘బియ్యం మూట’ని కూడా నెత్తిన పెట్టుకుని పరిగెత్తమంటాడని అదే పరుగు తీశారు.. అదే పోక!

క్యాడెట్స్ అంతా మార్చింగ్ లతో ఒళ్ళు హూనం చేసికొని స్నానాలు ముగించి వంట గది కేసి వచ్చారు.

అక్కడ అప్పటికే సుష్టుగా భోంచేసి హాయిగా గుర్రుపెట్టి నిద్ర పోతున్నారు ‘మిత్రత్రయం’.

***

రాయుడి ఇల్లు.

వాకిట్లో పడక కుర్చీ వేసుకుని, ప్రకృతి సౌందర్యాన్నీ తిలకిస్తున్నాడు రాయుడు. చుట్టూ పక్షుల కిలకిలా రావాలు ఆ ఇంటికి ప్రకృతి సౌందర్యాన్ని ప్రభాత సంగీతాన్నీ హారతిస్తున్నాయి. ఓ పక్కగా భైరవుడు పశువులకు మేత వేస్తున్నాడు.

దూరంగా చెరువు గట్టుమీదుగా కట్టెమోపులతో పల్లెపడుచులు చింతలతోపుల్లోంచీ వస్తున్నారు.

శీనయ్య ఓ ప్రక్కగా కూర్చుని దస్తావేజులు ఓ వరుసలో పెడుతున్నాడు. అవన్నీ ఊరి జనాల ఆస్తులు. ఆవరణలో ఒక ప్రక్కగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను తుడుస్తున్నాడు మరో పాలేరు.

ఇంతలో గేట్ తెరుచుకుని లోపలికొచ్చాడు వెంకట్రావు.

రాయుడిని చూసి విష్ చేసాడు. రాయుడు కూడా లేచి సాదరంగా ఆహ్వానించాడు. వెంకట్రావు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

పాలేరు చేసే పని ఆపి, నీళ్ల తొట్టిలో చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాడు.

“గ్రామ ప్రక్షాళనతో పాటు మా ఇంటిని కూడా పావనం చేయటానికొచ్చారన్నమాట” అన్నాడు రాయుడు కోరగా నవ్వుతూ నర్మగర్భంగా.

“అబ్బే.. అదేం లేదండీ.. ఊరికే మిమ్మల్ని ఓ సారి కలసిపోదామని.. గ్రామ పెద్దలు కదా..” అన్నాడు వెంకట్రావు.

“ఈ పెద్ద, చిన్న, బీద, ధనిక.. ఇవన్నీ స్వార్థపరులు కల్పించుకున్నది. నా కలాంటి వేవీ లేవు.”

ఇంతలో పాలేరు వచ్చి చేతిలోని ట్రే – స్టూలు మీద ఉంచి వెళ్లి తన పనిలో మునిగిపోయాడు.

“ఇదేమిటీ?” ఆశ్చర్యపోయాడు వెంకట్రావు.

“కనపడుతూనే ఉందిగా”

“కాసేపు నాకు కనబడటం లేదనుకుని చెప్పండి”

“సరే.. అది ఫారెన్ సిగరెట్ పెట్టె.. ఇది అరిస్టోక్రాట్ విస్కీ.. అదిగో.. అటు..” అంటూ మండువా గది కిటికీ వైపు చూపిస్తూ, “సిగరెట్టులా మండించి, విస్కీలా మత్తు ఇచ్చేది.. ప్రపంచానికి ప్రమాదం – ప్రమోదం కూడా అయిన ప్రమద! ఆమె పేరు శ్రీ ప్రద!”

అటు చూసాడు వెంకట్రావు .

విరిసీ విరియని మొగ్గలాగా పల్లెవాటు చాటున ముడుచుకుపోతున్న ఓ పదహారు సంవత్సరాల బాల.

“ఎందుకివన్నీ” అప్పుడే కోపం వచ్చింది వెంకట్రావుకి.

“కోపగించుకోకండి. పల్లెను దర్శించే ప్రజానాయకులు, ప్రభుత్వాధికారులు కొంతమందికి  మేం పెట్టే నైవేద్యం ఇదంతా.. ఓ సత్కార్యానికి వచ్చిన మీకు మా సత్కారం అనుకోండి. అంతే..” అని కొంచం గంభీరంగా, “అంతే కాదు.. నా దగ్గరకొచ్చినవాళ్లు ఎవరైనా సరే.. కొన్ని నా సూత్రాలు పాటించాలి. నేను చెప్పేది వాళ్ళయినా వినాలి. వాళ్ళు చెప్పేది నేనయినా వినాలి. ఎక్కువగా మొదటిదే జరుగుతూ ఉంటుంది.. ఇక  మీరు చెప్పండి.. నేను వింటాను” వెంకట్రావును నిశితంగా చూస్తూ అన్నాడు రాయుడు.

“మీకు ఒక్క దురలవాటూ లేదని విన్నాను. మరి ఇవన్నీ..?”

“ఓస్.. అదా.. నాకే అలవాట్లూ లేవని, నా దగ్గరికొచ్చేవాళ్లకు కూడా ఉండకూదన్న రూలేమీ లేదుకదా! అతిథి మర్యాదల కోసమే ఇవన్నీ.. తీసుకోండి!” అంటూ ట్రే ముందుకు జరిపాడు రాయుడు.

“నాకూ అలాంటి అలవాట్లు లేవండీ”

వెంకట్రావు సర్దుకు కూర్చుని, “సరే.. ఇహ చెప్పండి. ఏమిటి విశేషాలు? మా ఊరేలా ఉంది? మీకు సదుపాయంగా ఉందా? మీరు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఎప్పటినుచీ? అందుకు నేనేం చేయాలి?”

“మీ గ్రామాభివృద్ధిలో ఏదో ఒక పని చేపట్టి, ఆపై గ్రామస్థులు స్వయంగా గ్రామాన్ని బాగుపరచుకునే స్ఫూర్తి నివ్వాలని నా ఉద్దేశం.”

“చాలా సంతోషం. పేదలకు లోన్లు ఇప్పిస్తున్నారా?.. నా పేరు వ్రాసుకోండి. ఉచితంగా ఇల్లు కట్టిస్తున్నారా?.. నా పేరు వ్రాసుకోండి. మురుక్కాలువలు బాగుచేస్తున్నారా?.. మా వీధి పేరు వ్రాసుకోండి. లైబ్రరీ పెట్టిస్తారా?.. కిరాయి కోసం మా ఇంటిపేరు వ్రాసుకోండి. ..నేను ప్రజల్లో ఒకడిని.. అందుకే నా తపన..”

“మీరు చెప్పినవేవీ కాదండీ..”

“మరి?”

“ఇక్కడి జనాలందరినీ కలిసాను. ప్రధాన సమస్య తాగునీరు అని తెలిసింది. వాళ్ళు ఎంతో దూరం నుంచీ తెచుకోవాల్సివస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది నీళ్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.”

రాయుడు భుజాలు తడువుకున్నాడు.

“ఏమిటి అలా మౌనంగా ఉన్నారు? నేను చెప్పేది..” ఆర్థోక్తిలో ఆగాడు వెంకట్రావు.

“ఆఁ.. ఏం లేదు.. నేనూ అదే ఆలోచిస్తున్నాను.. ఏం చేయాలి చెప్పండి.. కలికాలం అలా వుంది. ముందు ముందు గాలి పీల్చినా మనిషి చస్తాడేమో అన్నంత కాలుష్యం.. అన్నీ బ్రహ్మం గారు చెప్పినట్లే జరుగుతున్నాయనుకోండి.. అతివృష్టీ, అనావృష్టీ ..” అన్నాడు మాట తప్పిస్తూ .

“మీరు గ్రామస్థులకు నీటి సహాయం చేయొచ్చు కదా?”

“భలేవారే.. చేయొచ్చు గదా ఏంటీ?.. అయ్యగారు అలాంటి సహాయాలెన్నో చేస్తారు.. అయ్యగారికి, చేసిన సహాయాన్ని చెప్పుకోవటం ఇష్టం ఉండదు.” అన్నాడు ప్రక్కనే వున్న శీనయ్య.

“మరి జనం నీళ్ల కోసం అంత దూరం ఎందుకెళుతున్నట్లు?”

“తప్పదు గదండీ.. అప్పులు తెచ్చి దానాలు చేస్తే దానం తీసుకున్నవాడు ‘దరిద్రుడా’ అని పోయాడుట. అప్పులిచ్చినవాళ్లు చెప్పులతో కోట్టేరుట.. అలా వుంది అయ్యగారి పరిస్థితి.”

“ఏమైంది?”

“ఏమీ కాకుండా జాగ్రత్త పడాలనుకున్నారు కాబట్టే, దేవుని దయవల్ల అయ్యగారికి అప్పులవాళ్ళూ లేరు. చెప్పుదెబ్బలూ లేవు.”

“ఇంతకీ ఊరి జనానికి నీళ్ల బాధ..”

“బాధలు మనిషికి కాకపోతే మానుకుంటాయటండీ.. అయినా ఒకరా, ఇద్దరా? మొత్తం ఊరి జనానికి ఫ్రీ గా నీళ్లియ్యటానికి గంగా, గోదార్లు ఆయనగారి పెరట్లోంచీ ఏమన్నా పారుతున్నాయా?” అన్నాడు చిరాగ్గా శీనయ్య.

రాయుడు విలాసంగా వినోదం చూస్తున్నాడు.

“నేననేది నీళ్లు గూడా అమ్ముకుని నిరుపేదల పొట్టగొట్టే పెద్దమనుషుల గురించే” అన్నాడు వెంకట్రావ్.

“ఏమిటండీ ఇందాకట్నుంచీ చూస్తున్నాను.. ఆ పెద్దమనిషిని పట్టుకుని అంతలేసి మాటలంటున్నారు?”

“నేను మీ అయ్యగార్ని ఏం తప్పు పట్టలేదే?.. నీళ్ళమ్ముకునే..”

“మళ్ళీ అదేమాట.. అవునయ్యా.. అమ్ముకున్నారు. అయితే ఏంటంటా? అసలు అడగటానికి నువ్వెవరివి?”

“నేనేం తప్పు మాట అన్నాననీ..?” విస్తుపోతూ అన్నాడు వెంకట్రావు.

“అయ్యగార్ని బట్టలుతికినట్లు ఉతికేస్తున్నావ్. ఏం తెలీనట్లు మాట్లాడతావున్నావ్? అసలు గొర్రె కసాయివాడిని నమ్ముతుందనీ.. ఈ జనానికి ఆ పాపయ్యశెట్టే తగినవాడు. ..అంతంకంత పిండి వసూలు చేస్తే, అప్పులతో పీక్కోలేక చస్తారు. ఏదో మా అయ్యగారు దయతలచి ఒక్కో బిందెకి పది రూపాయలు తీసుకుంటున్నారు.. ఇది ప్రజాసేవ కాదా?” అన్నాడు శీనయ్య.

“మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదు. నా ఉద్దేశం అసలీ అమ్మకాలు అష్టకష్టాలూ లేకుండా ప్రజల సౌకర్యార్థం గ్రామం మధ్యలో ఒక బావి త్రవ్విద్దామని..”

రాయుడు ఉలికిపాటు కప్పిపుచ్చుకున్నాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు.

“మీ ఉద్దేశం..” రెట్టించాడు వెంకట్రావ్.

“చూడండీ..”

“వెంకట్రావు..”

“చూడండి వెంకట్రావుగారూ.. ప్రభుత్వం మీకోసం ఒక బస్సు ఇచ్చింది. ఆయతో గ్రామాభివృద్ధి కోసం మీరు తెగ కష్టపడతారని ప్రొద్దున్నే టిఫిన్లు, కాఫీలూ రెండు పూటలా తిండీ తిప్పలూ చూస్తోంది. మీరు గ్రామానికి చేసే సేవలేమిటో దేవుడెరుగు కానీ మాకు మాత్రం చేటు చేస్తున్నారు..”

“ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం మమ్మల్ని పంపుతోందని మీరే చెబుతున్నారు గదా! మేం ఎవ్వరికీ కీడు చేయటం లేదు. పైగా ఓ మంచి పనికి మీ సలహా సహాయ సహకారాలడుగుతున్నాం. ..”

“చూసిస్తానని చెప్పు తీసుకుని, చెంప పగలగొట్టాట్ట వెనకటికెవడో.. అట్లా వుంది సామీ మీ యవ్వారం! ఈ గ్రామంలో ఉండేదంతా లేనివాళ్లే.. పైగా మూడేళ్ళుగా పంటల్లేవు. నీ అభివృద్ధి కార్యక్రమాలతో నా నీళ్ల వ్యాపారాన్ని దెబ్బకొట్టి, నా నోట్లో మట్టి కొట్టి ఇంకా నన్నే సలహా అడుగుతానంటావా?”

“మీ ఒక్కరి స్వార్థం కోసం పేద పల్లె జనాన్ని దోపిడీ చేస్తారా?” ఆవేశం తొంగిచూసింది వెంకట్రావు ప్రశ్నలో.

“చూడు బాబూ నువ్విలా దోపిడీ, అన్యాయం అని అరవటం విన్నారంటే ఏ గూండా చట్టంతో బొక్కలోకో, ఎన్‌కౌంటర్ పేరుతో తొక్కలోకో తోసేస్తారు ‘మా’ పోలీసులు” అన్నాడు శీనయ్య బెదిరిస్తున్నట్లు.

రాయుడు అతన్ని వారించి –

“చూడండి వెంకట్రావు గారూ! మీరు గ్రామాభివృద్ధి చేయాలని అంతగా ఉత్సాహం ఉంటే మా వూళ్ళో డ్రైనేజీలు బాగు చేయండి. వీధులు ఊడ్చండి. హాయిగా గవర్నమెంటు గ్రాంట్లతో పార్టీలు చేసుకోండి. మీటింగులు పెట్టుకోండి. ఉపన్యాసాలు ఇవ్వండి. కావాలంటే మా శీనయ్య అన్ని ఏర్పాట్లూ చేస్తాడు.. అంతేగానీ – కడుపు మీద కొట్టి కాళ్ళు మ్రొక్కితే, నీళ్లు రాకపోగా నిప్పులు కురిసి వూరు తగలబడిబోతుంది.. తరువాత మీ ఇష్టం..” చాలా శాంతంగా చెప్పదలచుకున్నది చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు రాయుడు.

వెంకట్రావు లేచి దీర్ఘంగా అటువేపే చూస్తూ వెనుదిరిగాడు. అతనీరోజు రాయుడిలో రాజకీయనాయకుడ్ని చూసాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here